నిజం
చాల కాలం క్రితం, నీ చిన్నిపాదాలు
ఈ భూమిని మెత్తగా తాకాయి
ఇక ఆమె నయనాలలో
పూవుల రంగులు వికసించాయి .
నిజం.
చాలా కాలం క్రితం
ఒక అరుపు , నీ స్వరం నీ పెదాలమధ్యనుంచి
మెత్తగా రెక్కలు విప్పుకుని ఆకాశానికి ఎగిసింది
ఇక ఆమె, ఈ భూమిని తాకిన మొదటి వర్షం
మొదటి తెమ్మరా
తన అస్తిత్వాన్ని నింపడాన్ని విన్నది .
నువ్వు నవ్వావు. నువ్వు ఆటలాడావు. సర్వాన్నీ
సర్వమూ సాధ్యమయ్యే (అతడూ, ఆమె నువ్వూ)
ఒక ఇంద్రజాలపు గోళంగా మార్చివేసావు .
ఇక , కటినమైన ఈ సమయాలు
ఉద్విగ్నమైన గీతాలుగా మారాయి
వాళ్ళా జీవితాలని కమ్ముకున్న అలసట
భరించదగ్గాదిగా మారింది
జీవితం, ఈ జీవితం మరికొంత కాలం
జీవించతగ్గదిగా మిగిలింది .
నిజం
చాలకాలం క్రితం, నీ చిన్నిచిన్ని చేతివేళ్ళు
ఆమె చెంపని మెత్తగా తాకాయి
ఇక ఆమె నయనాలలో
పూవుల రంగులు వికసించాయి .
నిజం
నువ్వు జన్మించావు.
నిజం
మేము మరణించాం.
No comments:
Post a Comment