14 February 2019

బహుమతి

సాయంకాలపు నీడలూ, కాంతీ తన ముఖంలో -
కనులేమో నానిన మొగ్గలు. ఒడిలో
వొదిలేసిన చేతులేమో వడలిన కాడలు,

నెమ్మదిగా నడుం వాల్చి, అరచేతిని నుదిటిపై
వాల్చుకుని తను "నానీ, కాస్త
లైటు ఆర్పివేయి" అని లీలగా అంటే, ఇక

బయట, ఉగ్గపట్టుకున్న రాత్రి కరిగింది. ఎంతో
నెమ్మదిగా గాలి వీచి, ధూళి రేగి,
నేలపై ఆకులు దొర్లి, చీకటి సవ్వడి చేసింది,

తన శరీరంపైనుంచి అలలా తెర ఏదో, తాకి
వెళ్ళిపోయింది. అలసట క్రమేణా
వదులవ్వుతూ, ఇక మ్రాగన్నుగా తను ఒక

కలవరింత అయ్యింది. కంపించింది. ఆనక ఇక
ఆకులపై జారే మంచువోలె, తను
నిదుర ఒడ్డున గవ్వై ముడుచుకుపోయింది,

తెల్లని పావురమైపోయింది: నిశ్శబ్ధమయ్యింది

మరి అందుకే శ్రీకాంత్, నువ్వసలు మాట్లాడకు!
ఊహలోనైనా తనని కదపక, అలా
తనని తనతో ఉండనివ్వగలగడమే, నువ్వు

తనకి ఇవ్వగలిగిన ఒక విలువైన బహుమతి!