31 March 2016

ముగింపు

వాన వెలసిన రాత్రి: చీకట్లో
దారి పక్కగా నీటిగుంతల్లో చలించే మసక వెన్నెల: ఆకులని
మాట్లాడే గాలి -
బురద: కొమ్మల్లో చినుకుల్లో
రెక్కల చప్పుడు. పచ్చికపై నుంచి వీచే పనస చెట్ల వాసన:
అదృశ్య శరీరం -

ఇక, ఎవరో అతి చిన్నగా 
నిన్ను పిలిచినట్టు, నీ పరిసరాల్లో, నిను తాకీ తాకకుండా
సంచరిస్తున్నట్టు


ఒక జలదరింపు: సన్నగా దిగే 
నొప్పి. తల్లి కట్టి ఇచ్చిన అన్నం డబ్బా నోటి ముందు నుంచి 
ఒలికిపోయినట్టు -
***
ధన్యవాదాలు. వీడ్కోలు -
తిరిగి వెళ్ళిపోతున్నాను ఇంటికి: అది ఎక్కడో, ఉందో లేదో
తెలియనప్పటికీ!

27 March 2016

లేనిది

దీపం ఆర్పినాంక, కాంతికీ చీకటికీ మధ్య క్షణకాలం అట్లా
తటాలున మెరిసి మాయమయ్యే
స్మృతి ఒకటి -
***
ఆకురాలు కాలం. ఇంటి ప్రాంగణమంతా, గాలికి ఎండిన ఆకులు
దొర్లే సవ్వడి. చారలుగా
ఆకాశం, నీడలూ, రాత్రీ -

ఎక్కడో బావురుమంటూ పిల్లలు పెట్టిన పిల్లి. ఆరుగుపై దానికి
పాలు పోసే మట్టి ముంత:
ఎండి పగిలి, ముక్కలయ్యి -

అది, ఆ ముంత - పల్చటి చీకటి పరదాల మధ్య, మోకాళ్ళ
నొప్పులతో కుంటుకుంటూ నడిచే
నీ తల్లి కావొచ్చు. చెట్ల కింద

మొక్కల్లో, తప్పిపోయిన పిల్లికూనకై బావురుమనే ఆరుపు
నీ హృదయం కావొచ్చు. ఈ ఒంటరి
వేసవీ, తపనా కావొచ్చు -
***
చూడు -
దీపం ఆరినాంక, రాత్రి వ్యాపించినాంక - దూరంగా ఎక్కడో చీకట్లో -
పడుతూ లేస్తూ, ఇంటికి దారి
వెదుక్కుంటూ, నడకైనా రాని

కళ్లయినా తెరవని, నీ నుంచి  తప్పిపోయిన
నీ  పిల్లి కూన ఒకటి!

26 March 2016

పిడికెడు

నిజంగా నేను కొంచెం అన్నమే వండుకుందామనుకున్నాను, పిడికెడెంత హృదయాన్ని రాజేసుకుని -
***
లాఠీలతో వాళ్ళు, రాజ్యంతో వాళ్ళు, రాముడితో వాళ్ళు. దేవుళ్ళతో వాళ్ళు, దేశంతో వాళ్ళు. కర్కశ దేశభక్తితో వాళ్ళు . గోవులతో వాళ్ళు, గోమాతలతో వాళ్ళు, భారతమాతలతో వాళ్ళు, గుళ్ళతో వాళ్ళు, గోపురాలతో వాళ్ళు, నదీ తీరాల్లో వాళ్ళు -

హృదయం లేని జీవన విధానం వాళ్ళు, నెత్తురంటకుండా చంపడం తెలిసిన జీవన కళ వాళ్ళు. ఇంద్రధనుస్సులు తెలియని ఏకరంగోన్మాదులు వాళ్ళు. నా ఇంట పొయ్యి పక్కన వాళ్లు. నా తిండితో వాళ్ళు, నా దుస్తులతో వాళ్ళు. నా పిడికెడు స్థలంలో వామనుడి పాదాలతో వాళ్ళు -

నన్ను రాస్తూ వాళ్ళు, రాస్తూ, నాకు చరిత్ర లేకుండా చేస్తూ వాళ్ళు, నన్ను నామరూపరేఖలు లేకుండా చేసే ఒక అఖండ జ్యోతితో వాళ్ళు -

రథంతో వాళ్ళు. రథయాత్రలతో వాళ్ళు. కత్తులతో వాళ్ళు బాణాలతో వాళ్ళు. గుక్కెడు నీళ్ళు అడిగిన గుండెలలోకీ, గర్భాలలోకీ త్రిశూలాలై దిగబడే వాళ్ళు. నెత్తురు పిండాల్ని చీల్చి 'జై, జై' అని నినదించే వాళ్ళు. పగలబడి నవ్వే వాళ్ళు. నా తల్లి బట్టలు విప్పి

నడి రోడ్డులో ఊరేగించే వాళ్ళు. నా స్త్రీలను మానభంగం చేసే వాళ్ళు. కులం లేదనే వాళ్ళు. దేశాన్ని బిట్లు బిట్లుగా విదేశాలకి అమ్ముకునే వాళ్ళు -

అవును వాళ్ళే. నేలలోంచి సారాన్నీ, నీళ్ళలోంచి తడినీ ఆకాశంలోంచి నక్షత్రాలనీ, అడవులలోంచి చెట్లనీ, బిడ్డలనీ ధ్వంసం చేసే వాళ్ళు. వాళ్ళే -

సంస్థాగతమైన ద్వేషమై, విద్యలో పాఠ్యంశాల విషమై, రాజ్యమై మతమై, పిడికెడు అన్నం అందివ్వలేని స్వచ్ఛ భారతమై, రామరాజ్యమై

నా లోంచి నన్నూ, నీలోంచీ నిన్నూ, త్రవ్వుకునీ త్రవ్వుకునీ, అమ్ముకునీ, అమ్ముకునీ, సైనికులు చెరచబడ్డ ఒక అమ్మని చేసి వొదిలివేస్తే
***
ఇక్కడ కూలబడి గుప్పెడెంత అన్నమే వండుకుందామని అనుకున్నాను. మరి ఇంత - పిడికెడెంత, హృదయమైనా ఉందా

ఇనుపబూట్లనూ, లాఠీలనూ నియంత్రించే, ఆటల వినోదాల మధ్య తీరిగ్గా ఈ చోద్యం చూసే రాజ్యాధినేతల వద్ద?

వాచాలత

చాలానే మాట్లాడావు ఇప్పటిదాకా, రాళ్లపై వర్షపు నీళ్ళు
దొర్లించుకుపోయినట్టు
బడబడామని -

ఇక చాలు. ఆపు -
రాత్రిలో, నిద్దురలో నిన్ను వెదుక్కునే రెండు చేతుల ధ్వనినీ
వేసవి చీకట్లో

ఖాళీ గూటిలో ఊగే
ఎండిన గడ్డిపరకల ఉరుములనీ చంద్రుడు లేని చుక్కలనీ
మంచునీ

వినడం, ఎప్పటికి నేర్చుకుంటావు నువ్వు?

23 March 2016

క్షణం

రెపరెపలాడే దీపపు
కాంతి చుట్టూ నీ అరచేతులు అడ్డం పెట్టి, ఎంతో ఆదుర్ధాతో
అట్లా నువ్వు -
***
రాత్రి. తెరచిన తలుపులు.
ఇంటి ప్రాంగణంలోంచి రిఫ్ఫున ఎండిన ఆకులను లోపలకి
విసిరేసే గాలి -

చీకటి. ఎక్కడో చిన్నగా మిణుకు
మిణుకుమంటూ చుక్కలు. చెట్ల కిందుగా రాలే తేమ. ఇక
ఇంట్లో నేలపై

అలసిపోయి, నోరు తెరుచుకుని
అట్లా పడి నిదురించే పిల్లలు. వాళ్ళ పెదాల చివరన ఒక
వెన్నెల నురగ -

ఎక్కడో దూరం నుంచి, వేర్లలోకి
నీళ్ళ ఇంకే సవ్వడి. ఇంటి ముందు చిన్నగా ఊగే వెన్నెల
నీడల్లోకీ, పగుళ్ళలోకీ

లోపలి ఖాళీ పాత్రల్లోకీ, చెవి
జూకాల్లా వెళ్ళాడే గూళ్ళలోకీ, అతి నెమ్మదిగా, మెత్తగా
వ్యాపించే

మంచు. నీ అరచేతుల్లాంటి సమయం:
ఒక నూత్న లోకం -
***
చీకటి సరస్సులో, ఒక దీపంతో
అనిశ్చతంగా తేలియాడే తెప్పలాంటి ఇంటి చుట్టూ, అతని
చుట్టూ

పిల్లల చుట్టూ నీ రెక్కల్ని కమ్మి
ఎంతో ఒరిమిగా, ఎంతో నిబ్బరంగా, అట్లా ఉండే నువ్వు:
జీవించడం

అని దీనినేనా నీవన్నది?

22 March 2016

స్మృతి

కాంతివంతమైన ఉదయం:
రాత్రి కురిసిన మంచుకీ, గాలికీ చిన్నగా ఊగే ఒక
తెల్లని గులాబి -
***
చల్లని దారులు. లేత ఆకులు:
వానజల్లులో రెక్కలు విదుల్చుకుని ఎగిరిపోయే
పక్షులు -


లోపలి మట్టి, చిన్నగా నాని ఇక
హృదయం ఒక విత్తనమై చిట్లి మొలకెత్తినట్టు ఒక
సువాసన -


అవును.
నువ్వన్నది నిజమే. అనుకోకుండా వచ్చే అతిధి
స్ఫురణే ఇది -


ఇతరుని స్వప్నమే
ఇది.
***
తిరిగి రా నువ్వు. చూడు:
ఎంత అందంగా ఉందో ఇక్కడ. కిటికీ అద్దం వెనుక
ఒద్దికగా

నీ స్మృతితో సజీవమయ్యి  
చిన్నగా ఊగే ఒక ఎర్రని గులాబీ పువ్వు, ఐదు
ఆకులు - 

తిరిగి వెళ్ళే దారి

ఒక పూలగుచ్ఛం. 
చిన్నగా నవ్వుతూ, చేయి ఊపుతూ నిన్ను దాటుకుంటూ వెళ్ళే 
స్కూలు డ్రెస్సులో ఒక పాప: సాయంత్రపు 
చిరుగాలి -

మెత్తని కాంతి. మంచు
పొగలు ఎగిసే సరస్సులను జ్ఞప్తికి తెచ్చే ఒక అమ్మాయి నిండైన
ముఖం. చిన్నగా రోడ్డు దాటే వృద్ధురాలి కళ్ళల్లో
రాత్రి దీపం -

చల్లని కొమ్మలు. పక్షులు.
కూలి పని ముగించుకుని, ముఖం కడుక్కుని, తుండు గుడ్డతో 
తుడుచుకుంటూ ఒక మూలగా సేద తీరే 
ఓ తండ్రి -

ఇక అంతటా, నెమ్మదిగా 
మసక చీకట్లలో శబ్ధాలు ఓ దరికి చేరి, మెత్తగా మొలకెత్తుతున్న
మృదువైన నిశ్శబ్దం -
***
అమ్మాయీ
నిన్ను కలిసి ఇంటికి వెళ్ళే 
దారిలో, రెండు కుక్కపిల్లలు ఇసుకలో ఒకదానిపై మరొకటి కలబడి
ఆట్లా

ఆడుకుంటున్నాయి:

అచ్చు నీ పదాల్లా - 

19 March 2016

సరైన సమయం

పడుకున్నారు పిల్లలు, నీ చేతిని గట్టిగా పట్టుకుని -
***
మసక వెన్నెల్లో నానిన గులాబీల తోట. సరస్సులపై అతి
నెమ్మదిగా అలుముకునే మంచు -
రహస్యమేదో చెబుతున్నట్టు గాలి:

చుక్కలు. పక్షుల గూళ్ల చుట్టూ రాత్రి తేమ. ఎక్కడో చిన్నగా
మిణుకుమంటూ ఎవరో వేసుకున్న
నెగడు. అతి లీలగా ఒక జోలపాట -

చూడు చూడు మరి శ్రీకాంత్, ఇక నువ్వు నిదురించడానికి
ఇదే సరైన సమయం!

09 March 2016

ఇల్లు

అన్నం ఉడుకుతోంది నెమ్మదిగా:
వంట గదిలోంచి, ధూపంలా ఇల్లంతా గుమికూడే ఒక సజీవ
సువాసన -
***
తెరచి ఉంచిన కిటికీలు. తలుపులు. రాత్రి గాలికి
అలల మల్లే తెలిపోయే పరదాలు
వేసవి. తడి గుడ్డ చుట్టిన కుండ చుట్టూ ఇసుకలో
నల్లటి ముత్యాల మల్లే  చీమలు -
(గుండు చీమలు)

ఎక్కడి నుంచో, ఎవరో పమిటని దోపుకుంటూ, అట్లా
ఇంటి ముంగిట నీళ్ళు చిలకరిస్తున్న
చప్పుడు. వీధి దీపాల కింద ఆడే పిల్లల అరుపులూ
వారి వెంట పరిగెత్తే కుక్కపిల్లలు -

ఇక, ఇంటిపైన లాలిత్యంగా, నీ తల్లి పాడే జోలపాటలా
వెన్నెల్లో చిన్నగా ఊగుతూ ఉంటాయి
బీర తీగ కిందుగా తెల్లని లిల్లీ పూవులు, చామంతులతో
రాత్రి హృదయ దవన పరిమళంతో -
***
సరిగ్గా అప్పుడే, సరిగ్గా ఇప్పటిలాగే
పిలిచింది నీ తల్లి నిన్ను: అన్నం ఉడికిందనీ, ఆడిన ఆటలు
ఇక చాలించి

త్వరగా ఇంటికి
రమ్మనీ -

మరి ఇన్నాళ్లకయినా
నీ తల్లినీ, నీ ఇంటినీ, నిన్నూ చేరుకోగలిగావా
నువ్వు?

04 March 2016

మార్పు

ఎంతో గరుకుగా, ఎంతో గట్టిగా
కాండాన్ని అదిమి పట్టుకున్న బెరడు: రాత్రంతా కురిసిన మంచు కూడా
ఇసుమంతైనా

మెత్తగా మార్చలేదు
దానిని -
***
పొడుగాటి మధ్యాహ్నాలు. పల్చటి
పసుపు వస్త్రంలాంటి ఎండ. తాకీ తాకని గాలిలో, కాంతిలో చెట్లు
అట్లా స్తంభించి -

లోతుగా దిగే కాలం. వేసవికి రాలే
పసుపుపచ్చ ఆకుల్లో శరీరం: చెట్టు బెరడును రికామీగా గీకుతూ
ఒక నల్లని పిల్లి -

పైన వేపకొమ్మల్లో ఎక్కడో తపిస్తో
దాహంతో అరిచే ఒక కాకి: బహుశా అది నీ హృదయం కావొచ్చు. కావొచ్చు
బహుశా అది నీ లోకం -

ఇక అప్పుడే, వొణుక్కుంటూ గొణుక్కుంటూ
నీ ముందు నుంచి చిన్నగా నడచుకుంటూ వెళ్ళిపోతోంది నీ
ముసలి తల్లి -

అప్పుడు ఆవిడ గొంతు, నీళ్ళు
అడుగంటిన ఒక మట్టికుండ, ఒక మంచినీళ్ళ బావి. చీకట్లో నానే ఓ
శిధిలాలయం -
***
ఎంతో గరుకుగా, ఎంతో గట్టిగా
కాండాన్ని అదిమి పట్టుకున్న బెరడు: ఇన్నేళ్ళుగా కురిసిన వర్షం
అర్రే

ఇసుమంతైనా
మెత్తగా మార్చలేదే
నిన్ను!

అప్పుడు

అప్పుడు ముద్దు పెట్టుకున్నావు నువ్వు ఆమెను. ఏమీ కాలేదు. 
పెదాలపై ఉమ్మిని తుడుచుకుని
వెళ్లిపోయింది ఆ అమ్మాయి -

ఆ తరువాత ఎప్పటికో వానకి చెట్టు కిందకి చేరితే, నీ చుట్టూతా 
ఒళ్ళు జలదరించే, అల్లనేరేడు 
పండ్ల, మత్తైన వాసన -!

విరిగిన బొమ్మలు

విరిగిన బొమ్మలని అతక బెట్టుకుంటూ కూర్చున్నాడు
అతను -
***
బయట చీకటి. నింగిలో జ్వలిస్తో
చందమామ. దూరంగా ఎక్కడో చిన్నగా గలగలలాడుతూ
రావాకులు -

వేసవి రాత్రి. ఎండిన పచ్చిక.
నోరు ఆర్చుకుపోయి, నీటికై శ్వాసందక ఎగబీల్చె నెర్రెలిచ్చిన
మట్టి వాసన -

ఇక, లోపలేదో గూడు పిగిలి
బొమ్మలు రాలి, విరిగి కళ్ళు రెండూ రెండు పక్షులై పగిలిన
గుడ్ల చుట్టూ

రెక్కలు కొట్టుకుంటూ
ఎగిరితే, అడుగుతుంది తను అతనిని చోద్యంగా, దిగాలుగా
చూస్తో -

"ఎప్పటికి అతికేను ఇవి?"
***
అతికీ, మళ్ళీ ముక్కలుగా
చెల్లాచెదురయిన హృదయాన్ని తన అరచేతుల్లో జాగ్రత్తగా
ఉంచి

విరిగిన వాక్యాలనీ, అర్థాలనీ
అతి జాగ్రత్తగా జోడిస్తూ, అతక బెట్టుకుంటూ మారు మాట్లాడకుండా
అక్కడే

కూర్చుని ఉన్నాడు
అతను -

రాతి పలకలు

నిస్సహాయంగా వాళ్ళ వైపు చూసాడు అతను: లోపల
గ్రెనైట్ పలకలుగా మారిన
వాళ్ళ వైపు-
***
వేసవి రాత్రి. నేలపై పొర్లే ఎండిన పూల సవ్వడి. తీగలకి
వేలాడే గూడు ఇక ఒక వడలిన
నెలవంకై -

దాహం. లోపల, నీళ్ళు అడుగంటి శ్వాసకై కొట్టుకులాడే
బంగారు కాంతులీనే చేపపిల్లలేవో:
చిన్నగా నొప్పి -

సుదూరంగా ఎక్కడో అరణ్యాల మధ్య ఒక జలపాతం
బండలపై నుంచి చినుకులై చిట్లే
మెత్తటి స్మృతి -
***
నిస్సహాయంగా వాళ్ళ వైపు, పాలరాయిలాంటి తన వైపూ
చూసాడు అతను: ఆ రాళ్ల వైపు -
ఇక, ఇంటి వెనుకగా

ఇసుకలో ఉంచిన మట్టికుండ చుట్టూ చుట్టిన తెల్లటి గుడ్డ
తడి ఆరిపోయి, నెమ్మదిగా కుండను ఎప్పుడు
వీడిందో

ఎవరికీ తెలీలేదు

03 March 2016

తెలియడం

రాత్రికి ముందు కాలం:
లోపల, ఎవరో అప్పుడే వీడ్కోలు పలికి వెళ్ళిపోయిన నిశ్శబ్ధం.
ఖాళీతనం -
***
ఇంట్లో నేలపై పొర్లే, గాలికి కొట్టుకు వచ్చిన ఆకులు:పీల గొంతుతో -
ఒక అలజడి. దాహంతో పగిలిపోయిన మట్టి.
రోజూవారీ జీవనంతో పొక్కిపోయిన హృదయం -

బల్లపై వడలిన పూలపాత్ర. మార్చని దుప్పట్లు. బయట, ఇనుప
తీగపై ఆరి, ఒరుసుకుపోయిన దుస్తులు. ఇక
ఎవరో అద్దంలో చూసుకుంటూ నొసట తిలకం

దిద్దుకుంటున్నట్టు, నెమ్మదిగా వ్యాపించే చీకటి. రాళ్లు. ఇసిక -
గాజుభస్మాన్ని నింపాదిగా తాగుతున్నట్టు, ఒక
నొప్పి. తపన. ఒంటరిగా జారగిలబడే చేతులు -

ఇంటికి చేరే దారిలో, ఎవరిదో పాదం తగిలి పగిలి పోయిందీ మట్టికుండ.
ఇక
***
అల్లల్లాడే
పగిలిన పెదాలకు, ఒక్క నీటి చుక్కయినా దొరకక, పిగిలిపోతూ
ఈ రాత్రి

ఎలా గడవబోతుందో, నాకు ఖచ్చితంగా
తెలుసు.

02 March 2016

కొన్ని అంతే

నువ్వొచ్చి తలుపు తట్టగానే, ఆదరా బాదరాగా
లేచొచ్చి తలుపు తీసే నీ ముసలి తల్లి: తన చింపిరి జుత్తొక
సాలెగూడు -
***
వేసవి కాలం. వడలిపోయిన మొక్కలు.
ఇంటి ఆవరణ అంతా రాలిన వేపాకులు: ఒక ముదురు రంగు.
దుమ్ము -

"ఎన్నిసార్లు ఊడ్చినా ఇంతే", ఊడుస్తూ
చేస్తోంది తను పాపం నిస్సహాయంగా నీకో పిర్యాదు: కానీ
ఏం చేస్తాం?

కొన్ని అంతే. ఎప్పటికీ పోవు.
నీడలు నిండిన ఆవరణలోంచి: హృదయ ప్రాంగణంలోంచీ
స్మృతులలోంచీ -
***
ఇక దూరంగా ఎక్కడో నీలో, తనలో
సాయంత్రపు కాంతి ఇంకి, అతి నెమ్మదిగా చీకటి పడుతున్న
చప్పుడు!

01 March 2016

ఉక్క

లోపలంతా ఉక్క: గాలి
దిశ మారినట్టు, ఒక స్థబ్ధత. ఎవరో విసురుగా వెళ్ళిపోయినట్టు
ఉగ్గుపట్టుకుని -

ఏటవాలుగా దిగే ఎండ:
ఒక మహావిహంగమేదో ఇనుపగోళ్ళతో నీవైపు రిఫ్ఫున దూసుకు
వచ్చినట్టు -

దాహం. మరి నువ్వేమో
దోసిలి పట్టి, ఎడారి వలే వ్యాపించిన ఆకాశం ముందు మోకాళ్ళపై
ఒరిగి -

నిస్సహాయురాలు తను.
నెర్రెలిచ్చిన నేలై, ఇంకిపోయే అశ్రువై చేరుతుంది నీ నాలికపైకి
ఉప్పగా -

నిజం ఇది. నిస్సహాయత. ఉక్క.
అయినా ఈ గాలి దిశ మారదు. నింగి వర్షించదు. ఎవరిదో శ్వాస
మంచినీరై

నీ గొంతు తడపదు. నువ్వూ
తడవవు. అది సరే: అసంగతీ, అసందర్భం అయినా, ఇంతకూ
నువ్వెక్కడ?