28 April 2016

దయ

తూలే పూల మీద
వెన్నెల నిద్ర

చెట్ల ఎదపై వాలిన
గాలి చేయి

నా రాతి శరీరంలో
నీ సువాసన

ష్. మాట్లాడ వద్దు
ఎవరూ -

అలసి ఆకు ఒకటి
చినుకు ఒడిలో

నిదురోతోంది!


26 April 2016

ఆక్షేపణ

నుల్చుండిపోయాను వెలసిన బాల్కనీలో, అట్లా తడిచి:
నిరత్తురడనై మిగిలిపోయి -
***
వర్షం వచ్చి వెళ్లిపోయింది. నేలలో, గాలిలో, రాళ్ళలో
అది వొదిలిన ముద్రలు, నాలో నువ్వు
వొదిలి వెళ్ళిన నీ పెదాల స్పర్శలాగా -

సాయంత్రం అయ్యింది. మరి ఆకాశం మసక మసకగా
మారింది. ఇంకా తిరిగిరాని పక్షులకై
ఎదురుచూసే చెట్లు: కొంచెం నాలాగా -

ఈలోగా, మన పైనింట్లోని పిల్లలు వచ్చారు. ఇంట్లోకి
తొంగి చూసారు: చాక్లెట్లు ఏమైనా నువ్వు
ఎప్పటిలా ఇస్తావేమోననీ, నవ్వుదామనీ -

తెలియదు వాళ్లకి, నువ్వు లేవనీ, బాల్కనీలోని గూడు
తడిచి రాలిపోయిందనీ. నేను కూడా
చిన్నబోయి ఎదురు చూస్తున్నాననీ -
***
నుల్చుండిపోయాను నీ జ్ఞాపకం ముందు, అట్లా తడిచి:
రాత్రిలోకి వొణికొణికిపోయి -
***
ఇక, ఈ పూటకి ఒకటే అడుగుతాను నిన్ను:

ఎవరైనా ఉన్నారేమోనని, తొంగి చూసి, చిన్నబోయి
వెళ్ళిపోయిన హృదయానికి, ఏమని
జవాబు చెప్పడం? 

ఈ సమయం

తూనీగ ఏదో వాలి చీకట్లో ఆకు కదిలినట్టు, ఒక
చిన్న అలజడి -
***
నిండు జాబిలి. రెపరెపలాడే గాలి. నీ చుట్టూతా
ఎవరో మంత్రించి వొదిలిన కాలం -
పూల నవ్వు. నీటి మాట. హృదయాంతాన నీలో
ఎవరు లంగరు వేసి ఆగిన లోకం -
శిశువులు నిద్రలో చిన్నగా కదిలినట్టూ, గుప్పిట్లో
నీ వేలిని బిగించి పట్టుకున్నట్టూ -
***
తూనీగ ఏదో లేచిపోయి ఆకు జలదరించినట్టు
ఒక ప్రియమైన అలజడి -
***
ష్ష్. మాట్లాడకు. అంతా నిశ్శబ్ధం -

ఇది, సీతాకోకచిలుకలు గుంపుగా లోపల వాలి
మంచుతో ముచ్చటించే
మార్మిక సమయం -

ష్ష్. కదపకు నన్ను. గుర్తుకు తెచ్చుకుంటున్నాను
నిన్ను!

25 April 2016

పునర్యానం

1
అతి తేలికగా వాలే రాత్రి సీతాకోకచిలుక: దాని నల్లని
రెక్కలపై మెరిసే తెల్లని చుక్కలు
కొంచెం కొంచెంగా నువ్వు అద్దిన
నీ శరీరపు చిరు పరిమళంతో -
2
అంతే తేలికగా ఊగే లతలు, అలసటతో పూలు. చెట్లు -
గాలిలో నువ్వు వ్రాసిన వాక్యాలేవో
నీ పెదవుల తడితో, నువ్వు ఇంకా
దిద్దని నా శరీరపు వ్యాకరణంతో -
3
అతి తేలికగా లేచే రాత్రి సీతాకోకచిలుక: దాని నల్లని
రెక్కలపై మెరిసే తెల్లని కలలు
చిన్న చిన్నగా మనం అద్దిన
మాటల ముద్రికలతో, స్మృతులతో -
4
అందుకే, ఇక వెళ్ళిపోతాను, వానతప్త హృదయంతో
నీకై, గూటికై, తపనతో, దాహార్తినై
ఒక శరణార్థినై, అక్షరాలు లేని
ప్రేమ అనే ఒక రహస్య లిపితో!

24 April 2016

లోపల

1
ఏమీ చేయలేక, పూలకుండీలో
చీకటిని ఒంపాను. అది మిణుకుమనే ఒక చుక్కని
బహుమతిగా ఇచ్చింది -
2
నేలపై నుంచి వేడిమి: గాలి.
శరీరం నేల అయ్యిందో, నేలే శరీరంగా మారిందో మరి
తెలియదు కానీ

లోపల నువ్వు వదిలిన, కమిలిపోయిన
ఖాళీ గాలి -
3
గూటీలో లేని పక్షులు. ఊగే
నిశ్శబ్ధంలో లతలు. రాత్రిలో ఒంటరిగా ఒక వాగు, ఎండి
ఒక ఖాళీ గూడై

అన్నం ముద్దంత హృదయమై, ఒక నీటి
చుక్కకై తపించే గొంతై -
4
ఎవరో ఎక్కడో, ఎందుకో: నీకై -
లేవు వాళ్లకి పదాలు. లేవు వాళ్లకి శబ్ధాలంకారాలు. నువ్వు
సొమ్మిసిల్లినప్పుడు

నిన్ను అల్లుకుని, నిన్ను నాటి, పాదు చేసి
కాపాడే చేతులు తప్ప

ఒక మహా సరళత్వం తప్ప-
5
ఏమీ చేయలేక పుస్తకం తెరిచాను -
ఎగిరిపోయాయాయి అక్షరాలన్నీ ఎక్కడికో సీతాకోకచిలుకలై.
ఇక ఇక్కడ

ఓ ఖాళీ కాగితమై చీకట్లో తెల్లగా
మారి నేను: మరి వింటున్నావా అక్కడ నువ్వు , నీలోకి
కొట్టుకుపోబోయే

ఈ ఖాళీ కాగితాన్ని?

20 April 2016

కొంచెం

పగలంతా, రాత్రికై ఎదురు చూస్తూనే ఉండింది
నీ కోసం ఓ దీపం -
***
ఎవ్వరూ తాకక దానిపై మరకలు. కన్నీటి ఛారికలు -
గాలి వీయక, శ్వాస అందక, చెరశాలైన
గూట్లో, కాంతి జ్ఞాపకంతో, ఉగ్గపట్టుకుని
నీకై తపించే ఒక హృదయమంత దీపం -
***
పగలంతా రాత్రికై, నీ చేతికై, నీ నక్షత్రాల కళ్ళకై
తనని వెలిగించే నీ శ్వాసకై
చినుకులాంటి నీకై, మట్టై

ఎదురు చూస్తూనే ఉండింది గుబులు గుండెతో
ఓ దీపం. మరి దానికి అందివ్వవా
నువ్వు కొంచెం, నీ అంత నమ్మకం?

16 April 2016

నిద్రనీడ

నిద్రలో నువ్వు: మల్లెపూవు ముడుచుకుపోయి ఒక
మొగ్గగా మారినట్టు -
***
సరోవరాలపై ప్రతిఫలించే వెన్నెల నీ చిన్ని ముఖంలో -
ఒడ్డున రావిచెట్ల గాలి. చీకటేమో
అమ్మ ఒడై, ఒక జోలపాటై -

మరి గది ఒక పూలతోటగా మారితే, ఇక ఎక్కడివో
మల్లెపూల వాసన వేసే సీతాకోకలు
నీ కలల్లోంచి తప్పించుకునొచ్చి

నాలో కాంతి రెక్కలతో వాలి, ప్రాణం పోస్తే
***
నిన్ను ఆనుకుని, నీ నిద్రనీడలో సేద తీరి నేను: కన్నా
నీ చేయి నా చేతిలో ఉండగా, ఇక

జీవించడానికి భయమెందుకు నాకు?

విన్నపం

అతి పల్చటి కాంతి: నీటిపొరలోంచి నిన్ను చూసినట్టు
నన్ను చూసుకున్నట్టు -
***
నీళ్ళు చిలుకరించని నేల: ఆకాశం. నీ శరీరం -
వడలిన పూలు, నీ కళ్ళు
వేడి గాలి, నీ పెదాలు -

వాలిపోయిన లతలు: నీ చేతులు. పిల్లలూ -
ఒక ఖాళీ నిశ్శబ్ధం: ఇల్లు.
చిన్నబోయి హృదయం -

నీకై, నీళ్లకై వేచి చూసే ఒక పూలకుండి. నేను -
గింజలకై, ముంత చుట్టూ
తచ్చాట్లాడే పిచ్చుకలూ

ఊగని పరదాలూ, కదిలించని పాత్రలూ, ఒక
ఉలికిపాటూ, వొణుకూ
భయం: ఇవన్నీ నేనే -

నువ్వు లేక, నువ్వు లేవక, అట్లా నిస్త్రాణగా
వేసవై, కమిలిన ఓ మల్లె
మొగ్గవై రాలినప్పుడు -
***
అతి చిక్కటి రాత్రి నా లోపల: ఒక అశ్రువులోంచి
నిన్ను తాకుతున్నట్టు -

మరి
కొంచెం తొందరగా కొలుకోవా, నీ చుట్టూ తిరిగే
ఈ పిచ్చుక పిల్లల కోసం -

14 April 2016

before

నీకో తల్లి ఉండి ఉంటుంది
ఒకసారి తన శరీరాన్ని తాకి, ఆ కనులు చెప్పే వ్యధల వద్దకు
వెళ్లి చూడు -

నీకో భార్య ఉండి ఉంటుంది
ఒకసారి తనలోకి వెళ్లి, తను నీకు చెప్పని పురా గాధలను
విని చూడు -

నీకోక కూతురూ ఉండి
ఉంటుంది. ఒకసారి తన హృదయావరణలోకి వెళ్లి, రాలిపోయే
ఆకులను

శ్వాసించి చూడు. ఇక
నీ లోపల ఒక స్త్రీ నిరంతరం స్రవిస్తూ, సంచరిస్తూ ఉంటుంది -
ఎప్పుడైనా

ఒకసారి, నీ ఆత్మతో
తనని హత్తుకుని, మిళితమయ్యి, గర్భమయ్యి, ఆదిపదం
అయ్యి చూడు -

ఒరే నాయనా, వెర్రిబాగులోడా!
దైవత్వానికి ఆలయ నిషేధమేమిటిరా తండ్రీ. మరి, ఇకనైనా
మాట్లాడేముందు

ఈ సారైనా ఓసారి వాళ్ళందరితో
నీ నోరూ, నిన్నూ శుభ్రపరచుకుని రా ఇక్కడికి. దేవుడు
జన్మించిన

స్థానం గురించీ, ఒక అశృయోని
గురించీ, మా అమ్మ చెప్పిన ఒక మహారహస్యం నీకూ
చెబుతాను -

ఆmen!

సంసారి

1
వెన్నెల్లో నదిపై గుంపుగా ఎగిరే
సీతాకోకచిలుకలు. అవును
అది తన ముఖం -
2
రాత్రి చంద్రిమ. మొగలి పూల
గాలి. ఒక జ్వాల. అవును
అది తన దేహం -
3
గూళ్ళల్లో పిట్టలు. నిద్రనదిలో
పిల్లలు. కలవరింతలలో
వెక్కిళ్ళై నీ పేరు -
4
మెతుకు దీపం వెలిగి, చేతులు
ఎదురుచూపయ్యే వేళ -
కవీ, సంసారీ
5
వెళ్లిన దూరం చాలు. ఇకనైనా
ఇంటి వైపుకి మళ్ళు -

12 April 2016

అంతే

~ అంతే ~

"బావోలేదు. కొద్దిసేపు కూర్చో నాతో", అలసటతో ఒరిగి
అడిగింది తను -
***
సాయంత్రం:
ఎండిపోయి ఆవరణ. పెదాలు పగిలిన ఆకులెన్నో  తనలో
రాలి -

పాలిపోయి
కాంతి. వడలిపోయి శరీరం. నీటి ఊసు లేక కందిపోయిన
గాలి -

ఇక చెట్లన్నీ
తను వ్రాసుకుని ఎవరికీ చూపించని లేఖలు: మసకబారి
చిట్లి -

ఎంతకూ
అంతం కాక, శూన్యమై వ్యాపించిన గగనం, ఆ క్షణంలో
తన

హృదయం:
సన్నటి గాలి మూలుగుతో, చీకటితో, చుక్కలతో, వేసవితో
నాతో -
***
"బావోలేదు. కొద్దిసేపు కూర్చో నాతో", అలసటతో ఇంకి
గొణిగింది తను -
***
నెమ్మదిగా లేచి
తనకో గ్లాసు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి, తనకు ఆనుకుని
కూర్చున్నాం

నేనూ, ఈ పదాలు -
ఇక ఇంతకు మించి ఈ జీవితానికి, అవి గానీ, నేను గానీ
చేయగలిగే

గొప్ప పనులేమీ
లేవు. అంతే!

11 April 2016

ఒక్క క్షణం

ఆకులన్నీ రాలిపోయి
ఒంటరిగా మసక వెన్నెల్లో అట్లా స్థాణువై, బూడిద రంగు
చెట్లు -
***
మట్టిదారిలో నెలవంక ఒకటి -
నీళ్ళ సవ్వడి లేకుండా నిశ్శబ్ధమై, డస్సిపోయి, ఒరిగిన
ఒక శరీరమై -

రాత్రిలో పూలకుండి ఒకటి
పగిలి: శ్వాస కాలేక, అక్కడక్కడే తిరిగి, ఖాళీ పాత్రల్లో
ఒదిగే గాలై, నువ్వై -

అలసిన ముఖం ఒకటి
ప్రకంపించే కాలంతో, ఎండిన సరస్సుల ఎదురుచూపై
మహా సవ్వడై -
***
ఆకులన్నీ రాలిపోయి
ఒంటరిగా మసక వెన్నెల్లో అట్లా స్థాణువై, బూడిద రంగు
చెట్లు -
మరి
***
ఇక ఈ రాత్రి, నీ హృదయానికి మిగిలిన దారి
ఏది?

09 April 2016

నువ్వైనా

దినం అంతా పని చేస్తూనే ఉంది, తను: కొంచెం అయినా
విరామం లేకుండా, అట్లా -
***
ఎంతో దుమ్ము ఇంటి నిండా, వస్తువుల మీదా: అది అట్లా
ఊరికే పోయే రకం కాదు మరి -

అన్నిటినీ దులపాలి, కడగాలి, తుడవాలి: గాలీ వెలుతురూ
మెండుగా వచ్చేట్టు, కిటికీలు బార్లా
తెరవాలి. మరెన్నిటినో రమ్మనాలి -

(అది నేను కూడా కావొచ్చును)

ఏ మూలనో, మంచాల కిందుగా నేలపై పడ్డ నూనె మరకలు
అంత తొందరగా కనిపించవు. లోపలికి
వెళ్ళాలి.ఎంతో ఓపికగా తుడవగలగాలి -

(అది ఈ హృదయం కూడా కావొచ్చును)

ఏళ్ళు పడుతుండవచ్చొక్కోసారి. విసుగూ పుడతుండవచ్చు
ఇంకోసారి. ఒళ్ళంతా పులిసి, నీ నడుమూ
మనస్సూ, చివరికి, నువ్వే విరిగిపోయేంత

నొప్పీ కలుగుతుండవచ్చు, మరియొకసారి -

(కావొచ్చును మరి అది మన 'జీవితం', కావొచ్చును అది
మరి, ఇతరునితో మనం జీవించడం)

అప్పుడు, దేనికీ దుమ్ము అంటని, మరకలు లేని దినాన్ని
చూద్దామన్న, నీ సంకల్పమే అంతటా -
మామిడాకుల తోరణంతో, సువాసనతో
***
దినం అంతా పని చేస్తూనే ఉంది తను: కొంచెం అయినా
విరామం లేకుండా, అట్లా -
***
కొంచెం ఆగి, నడుం వాల్చి, ఇంత విశ్రాంతి తీసుకొమ్మని

ఇప్పటికైనా తనకి, నువ్వు చెప్పరాదూ? ఇప్పటికైనా
నువ్వు కాస్త శుభ్రపడి, బ్రతికి పోరాదూ?

08 April 2016

విన్నపం

అట్లా ఉండనివ్వు: కొన్నిటిని -
***
రాత్రి: చల్లటి గాలి.
పిండారబోసిన వెన్నెల్లో చిన్నగా కదిలే ఆకులు.
తేమ -

చీకటి: కొంచెం శాంతి.
కొమ్మల్లో, నిద్ర పెదాలపై చిరునవ్వై వెలిగే ఒక
గూడు -

ఇక ఒక రహస్యం: నీ
లోపల ఎవరో నిన్నే పొదిగే ఈ మార్మిక సమయం.
లోకం -

అందుకని
***
అట్లా ఉండనివ్వు: కొన్నిటిని -
***
బయట ఎక్కడో
వెన్నెల ఒలికి తడిచిన పచ్చిక మైదానాలపై నుంచి
గుంపుగా

ఎగిరిపోయే సీతాకోకచిలుకలని!

07 April 2016

తప్పిదం

గింజలకై, నీళ్లకై, అక్కడక్కడే తిరుగుతున్నాయి, నాలుగు
పిచ్చుక పిల్లలు:
ఆవరణలో -
***
వేసవి: స్థంబించిన గాలి. కదలక అట్లా చెట్లు, ఒరిగి -
తపన: దాహంతో నింగికి చేతులు
చాచిన నేల. డస్సిపోయి గూళ్ళు -

పొరలు పొరలుగా దినం: ఎండమావై శరీరం. నువ్వు -
లేనితనం ఒక ముళ్ళ కంచై, నిత్యం
నిన్ను చుట్టుకుని కోసివేస్తూ ఉంటే
***
గింజలకై, నీళ్లకై అక్కడక్కడే తిరుగుతున్నాయి నీతో
నాలుగు పిచ్చుక పిల్లలు
నీలో, తనలో -
***
మరి
నగరమిది. యంత్ర అజగరమిది -
హృదయంలో ఓ మట్టిముంతతో, ఇన్ని నీళ్లతో ఇక్కడ
నీకై ఎవరో ఒకరు

వేచి చూస్తూ ఉంటారన్న
ఒక అందమైన అబద్ధాన్ని నీకు అమ్మి, నిన్నో హింసగా
మార్చింది ఎవరు?

06 April 2016

అట్లా

రాత్రి. పొడి చీకటి -
***
నీకు సమీపంగా, ఎండిన పచ్చిక చేసే సవ్వడి. నీ లోపల
తలలు వాల్చే, గడ్డిపూలు. మోకాళ్లపై
ఒరిగి, ప్రార్ధించే ఒక ఇల్లు -

నిశ్శబ్ధం. పగిలిన ఓ

పిల్లన గ్రోవి దుఃఖం. ఒక చేతికై, మాటకై తండ్లాటలాడే దీపం.
ఇక, హృదయానికి హత్తుకున్న ఒక నిర్జీవ
శరీరమై, ఈ లోకం, కాలం -

ఎదురు చూపు. పగిలిన

పెదాలపై ఒక పేరు. నుదిటిపై జ్వలించే ఒక స్మృతిముద్రిక.
అరచేతుల్లో ముఖంగా మారిన విధి -
ఇక నువ్వు దాచుకున్న

నీ అశ్రువుల రహస్యం, తపనా
***
ఈ రాత్రి. గాజుపెంకుల చీకటి -
చూడు
***
తెరచిన కిటికీలకు ఆవలగా
పెద్దగా నిసిగ్గుగా పాడుకుంటూ, 'నువ్వు' దిగబడ్డ పాదాలతో
నెత్తురు చిప్పిల్లి, బ్రతుకుతో మత్తిల్లి
అట్లా వెళ్లిపోతూ

అతనో, ఆమెనో, ఒక ప్రేమనో!

05 April 2016

చింతించకు

నాకు తెలుసు, బ్రతకడం అంత తేలికైనది ఏమీ కాదనీ
అది నిన్ను వెంటాడే
ఒక గాయం అనీ -
***
నువ్వు ఇంటికి తిరిగి వస్తే వేడి గాలి సుడులు తిరిగే ఖాళీ

గదులు. జీవం లేక వాలిపోయిన మొక్కలు. పూలు.
ఇప్పటికీ ఇక్కడ తెరలు తెరలుగా ప్రతిధ్వనించే
నువ్వు ఇష్టపడ్డ ఒక నవ్వొకటి -

సాయంత్రాన్ని దాటి వ్యాపించే ఊబిలాంటి మసక చీకటి.

ఎక్కడో, గొంతు తెగే బాతుల చప్పుడు. కొమ్మల్లో ఓ
అలజడి. ఆకులు రాలి, పాదాల కింద నలిగే
వాటి సవ్వడి. డొల్ల మాటలు -

తల ఎత్తి చూస్తే, ఇనుప జాలీలోంచి చెమ్మగిల్లిన రాత్రి.
బల్లపై నువ్వు వెలింగించాల్సిన దీపం. తీసి, మడత

పెట్టుకోవాల్సిన దుస్తులు. వండుకోవాల్సిన
పాత్రలు. కుండలో మంచినీళ్లు -
***
నాకు తెలుసు, బ్రతకడం అంత తేలికైనది ఏమీ కాదని
అది, ప్రతి క్షణం మరణించడం, తిరిగి
జనినించడం అనీ -
***
సృజనా, లే.
చింతించకు. నీ చేతిని అందివ్వు. మరేం పర్వాలేదు -
ఊరికే మరొక రోజుకు

అట్లా బ్రతికి ఉండటమే, మనం ఇప్పుడు చేయగలిగే
ఒక అద్భుతం!

గాలి

ఒక్క రాత్రి మాత్రమే
గుర్తుకు ఉంది. పూర్తిగా మరచిపోయాను, నువ్వు ఇక్కడ నాతో
ఉన్నావని -
***
పూలల్లో చేరిన మంచు
నీ కళ్ళల్లో: ఒక మూలగా ఒదిగిన నీ శరీరం, దీపం వెలగని
ఓ ఆలయం -

అరవిచ్చిన అరచేతుల్లో
నీ ముఖం: ఆకులు రాలి, మబ్బు పట్టిన ఆకాశం కింద కదిలే
నీడలేవో -

ఇక, ఖాళీ పాత్రలూ
నీళ్ళు ఒంపని మొక్కలూ, లతలూ నీ చేతులు: అంచులు లేని
నిశ్శబ్ధంలో అట్లా

స్థంబించి. మరి ఇది నిజం -
మరచిపోయాను పూర్తిగా, నువ్వు నాలో ఉన్నావనీ,
సమానంగా

గాయపడుతున్నావనీ, ఇంకా
ఈ రాత్రిని దాటాలనీ!
***
దా. ఒక్కసారి ముట్టుకో - గాలై, నీ శ్వాసతో
వెలుతురై బ్రతికిపోతాను

ఈ పూటకి

రాత్రి బల్లపై, గాజుపాత్రలో వడలిన పూలగుచ్ఛం, ఇంకిపోయే
పరిమళంతో: బహుశా, అది
నీ ముఖం -
***
ఒంటరితనం వ్యాపించిన గదులు. నీళ్ళ వాసన లేని
గాలి. రాలి, పీలికలై రెపరెపలాడే గూడు -
హోరెత్తించే ఒక ఖాళీ శబ్ధం అంతటా:

లేనితనం. తాకే ప్రతి వస్తువులోనూ, నువ్వు ఒకప్పుడు
వాటిని ముట్టుకున్నావన్న జ్ఞాపకం. ఒక
తపన. బావురుమనే మంచం, కళ్లూ -

ఎక్కడి నుంచో లీలగా రోదన. రంపపు సవ్వడి. చివరి
క్షణంలో ఊగిసలాడే దీపపు కాంతి, వొణికే
హృదయంలో: అనాధైన బాహువులు -
***
రాత్రి బల్లపై నుంచి పడి పగిలిపోయి, లోతుగా దిగబడే
పూలగుచ్ఛం: నీ శరీర పరిమళంతో.
చూడు: ఇదేమీ బావోలేదు -

ఇక ఈ రాత్రిని దాటి, అతను బ్రతికి ఉండటం ఎలా?

why?

మంచుకు తడిచీ, గాలికి వొణికే లిల్లీపూలలాంటి కళ్ళు
ఆ చిన్ని అబ్బాయివి -
***
స్కూలు ముందు, అగ్ని వలే రగిలే మధ్యాహ్నపు ఎండలో
ఆ ఇద్దరూ పక్కపక్కనే, ఒకరి చేతిని
మరొకరు పుచ్చుకుని -

దూరం నుంచి ఏమాత్రం తడి లేని గాలి, వాహనాలు
ఉన్మాదంగా తిరిగే రహదారిలో: ఎటో
పడి, మనుషులు కూడా -

ఒక ఎండ మావి: కనుచూపు మేరా ఎక్కడా కనిపించని
మట్టికుండ: పచ్చని చెట్టు. నీడా: దాహం
మాత్రమే మిగిలిన కాలం -

దాటలేని రోడ్లూ, బేరికేడ్లతో హృదయాలూ:ఎక్కడి నుంచో
ఏ ఏ లోకాల నుంచో నెమ్మదిగా తల ఎత్తి
అడుగుతాడు ఆ పిల్లవాడు

"నాన్నా, why doesn't mommy come home?". మరే
లోకాల నుంచో అతి నెమ్మదిగా తల దించి
నీళ్లుబికిన పూల వైపు చూస్తాడు

అతను, అరచేతిలో చెమ్మగా మారిన పిల్లవాడి చేయిలాంటి
మాటతో, మూగగా, ఒక నిస్సహాయతతో
సమయం లేని నగరంతో-
****
మంచుకు తడిచీ, గాలికి వొణికే లిల్లీపూలలాంటి కళ్ళు
ఆ చిన్ని అబ్బాయివి -

అమ్మ ఇంటికి ఎందుకు రావడం లేదో, ఆ అబ్బాయికి
తెలియదు. నాకూ తెలియదు -
మరి మీకో?

last wish

అలసిపోయాను నేను. చాలిక -

కనురెప్పలపై నీడలు. లోపల పిడచ కట్టుకుపోయి
దాహం: పెదాలపై ఎడారి, గొంతులో
నడి వేసవి కత్తి -

నాకు తెలుసు, వడలిపోయాయి నీ పచ్చని చేతులు.
వొణుకుతోంది నీ శరీరం గోడపై ఊగే
ఎండిన లత వలే -

నేలపై దొర్లుతూ చిన్నగా సవ్వడి చేసే కాగితం పూవు
మన గూడు: చిన్నగా వెలిగే దీపపు
కాంతిలో ఒక క్షణమై -

అలసిపోయావు నువ్వు కూడా: చాలిక -

ఊరికే అట్లా ఉండు ఈ రాత్రికి నాతో: పాపవై, అమ్మవై-
ఉదయాన్నే ఇస్తాను నీకు, ప్రాణం
పోసుకున్న ఒక కాగితం

పువ్వునీ, వేసవి కుండ చుట్టూ చుట్టే, 'మనం' అనే
ఒక చల్లని వస్త్రాన్నీ!

లంగరు

రాత్రికి
లంగరు వేసిన సాయంత్రం: ముడుచుకునే తెరచాప వలే గాలి.
దూరంగా గులాబీ వాసనతో
మిణుకుమనే ఒక నక్షత్రం -
నువ్వేనా అది?
***
అలలు
అలలుగా చీకటి. శతాబ్ధాల సముద్రపు ఒడ్డున అలసటగా
ఇసుక బాహువుల్లో ఒరిగిన
ఒకే ఒక ఒంటరి బాటసారి -
నీ బాహువులేనా అవి?
***
వేకువన
స్వప్నానంతాన, మత్సకన్యల కన్నీళ్ళతో తటాలున లేచిన
ఒక కవి, ఒక చదువరీ, తేజో
కిరణాలతో ఓ సూర్యజాలరీ -
నీ కన్నీళ్లేనా అవి?
***
ఓ ద్రిమ్మరీ
ఎంత ఆలస్యమైనా వేగిరంగా, నీ దినాన్ని విప్పు. దారి
పటం లేని, సూచిక లేని ఇంటికి
తిరిగి వెళ్ళే స్మృతి సమయమేదో
ఆసన్నమయినది -

01 April 2016

ఓ తింగరి పద్యం

హే పిల్
మై Dianabol
నా కొంచెం నీరూ, నా కొంచెం నిప్పూ
కంగారు పడకు
ఇదొక తింగరి పద్యం
మబ్బు పట్టి
ఆకాశం ఉరిమింగ్స్ ఇక్కడ, నీలా
ఎగిరే గాలితో -
హెల్లోవ్
నిన్నే

హావ్ యు గాట్ 
A
పెగ్ ఆఫ్ విస్కీ or
A
షాట్ ఆఫ్ వోడ్కా? Or at least 
May be
బేబీ
నీ నవ్వు నురగలు చిందే 
A
కప్ ఆఫ్ 
కాఫీ?

No? 
oh no. 
నెవెర్ మైండ్ -
వస్తున్నా నేన్ ఇంటికి, ఒంటికి
వాన రాసుకుని
ఉరుముల్ని పూసుకుని, చలికి
వణికే కుక్కపిల్లనై -
మరి 

మై love
మై testo cypionate
విల్ యూ at least 
గిమ్మీ a హగ్ 
and a
కిస్ finally

విత్ ది సెంట్ 
of the night and a
డ్రాప్ 
of rain?
 

senti

ఎక్కడినుంచో ఎగిరొచ్చి వాలి
నిన్నూ నన్నూ పొదుగుతోందీ రాత్రి: ఇక క్షణికమైన ఈ గూడంతా
ఓ గోరువెచ్చని కాంతి -
***
రెక్కలతో గట్టిగా అదుముకుంటావు
నువ్వు నన్ను, నీ గుండెకు దగ్గరిగా: ఇక ఎక్కడి నుంచో అడవిలో
చెట్ల కిందుగా, రహస్యంగా

రాళ్లను ఒరుసుకుంటూ సాగే
నీళ్ళ సవ్వడి. ఇక అప్పుడు, నెమ్మదిగా నాలోకి వ్యాపిస్తూ ముద్దు
పెట్టుకుంటావు నన్ను

నువ్వు: ఇక ఇక్కడ, మబ్బు పట్టిన
మసక ఆకాశం కింద వీచే, అవిసె చెట్ల హోరు. పూలు. తుంపర -
మూతలు పడే కళ్ల కింద

చల్లటి గాలి. అప్పుడే, చిన్నగా ఏదో 
అంటావు నువ్వు: ఇక, గాలీ తుంపరా, చీకటీ మట్టి వాసనా
కలగలిసిన ఓ జోలపాట

నాలో: ఊగుతోంది శరీరం ఒక
ఊయలై: నేల నుంచి నింగి దాకా, నింగి నుంచి నేల దాకా
చినుకులతో, రంగులతో

పాలపుంతలతో, కోటానుకోట్ల
చుక్కలతో, నీ వంటి ఒక ఒడిలో, ఒక స్మృతిలో, ఒక క్షణంలో
మరపులో, మెరుపులో -
***
ఎక్కడినుంచో ఎగిరొచ్చి వాలి
నిన్నూ నన్నూ వెచ్చగా పొదుగుతోందీ రాత్రి, మనం అనే
కాంతిలో మైమరచి -

ఓ సెనోరిటా, మరి ఇకనైనా
తలుపులు తెరచీ, కర్టెన్లు పక్కకి జరిపీ, కళ్లయినా తెరవని
లేతెరుపు ఆకాశాన్ని

లోపలికి పిలువవా నువ్వు? !