25 June 2016

ఇక రాత్రంతా

"అమ్మా, నాకు ఏమౌతుందమ్మా?"
అని అడుగుతాడు పిల్లవాడు:
పాపం, వాడికి  జ్వరం -

ఎన్నో పొరలతో ఆకాశం, మబ్బుపట్టి -
రాత్రి గాలి లోపల: గూళ్ళల్లో
పక్షుల సవ్వడేమీ లేదు -

కంపించే పల్చటి కాంతి: ఏవో నీడలు -
ఎక్కడినుంచో తేలివచ్చే ఒక
సన్నని మూలుగు: కోస్తూ -

"అమ్మా, నాకు ఏమౌతుందమ్మా?"
అని అడుగుతాడు పిల్లవాడు
తల్లిని గట్టిగా పుచ్చుకుని -

"కన్నా, నీకేమీ కాలేద"ని చెబుతుంది
తల్లి బిడ్దని హత్తుకుని, కానీ

ఇకా తరువాత, రాత్రంతా ఇద్దరే, గట్టిగా
ఒకరినొకరు పట్టుకుని, తడారే
పెదాలై,  రాత్రి కలవరింతలై -

24 June 2016

నిష్కృతి

చీకట్లో వాన: రహదారంతా చినుకుల
మువ్వలు -
***

నేలంతా తల్లి రొమ్మైతే, తెరవని కళ్ళతో
చేతివేళ్ళతో, లేతెరుపు
పెదిమలతో, చూచుకం వంటి గూటికై
వెదుకులాడుకునే రాత్రి

శిశువులు, ఈ శోకతప్త జనులు: వాళ్ళు -
కూడా నువ్వూ, నేనూ -
***
నాకు తెలుసు: నీ అంతిమ ప్రార్ధన
ఒక సుషుప్తికై అని -
***
దా: చీకట్లో, వాన ఆగిన గాలి వీచే ఈ
హృదయంలో

రాలే చుక్కలను లెక్కించుకుంటూ
నాలో నిద్దురపో!

22 June 2016

కృతజ్ఞత

ఎంతో సన్నటి చేయి తనది: అలా వాలి ఉంది బల్లపై
తన ముఖం పక్కగా -
***
ముసురుకునే చీకటి: తెరచిన కిటికీలలోంచి వీచే
పల్చటి గాలి. గూటిలో పక్షులు
రెక్కలు సర్దుకునే సవ్వడి -

కళ్లపై పెరిగే బరువు, మంచు ఏదో వ్యాపిస్తున్నట్టు -
ఒక్క క్షణమే, భుజాన ఉన్న బ్యాగ్ని
పక్కనుంచి, శిరస్సును వాల్చితే

లిల్లీ పూవుల్లాంటి చేతివేళ్ళు నెమ్మద్దిగా దగ్గరయ్యి
ముఖం నిదుర నావలోకి చేరుకొని
అట్లా, ఎక్కడికో తేలిపోతే 
***
ఎంతో సన్నటి చేయి తనది: అలా వాలి ఉంది, నీ 
ముఖానికి చాలా దగ్గరగా -
***
ఇక, తన చేతి నీడను కూడా పొరపాటున తాకక
ఒక పక్కగా నిలబడి అనుకుంటాడు
అతను - కృతజ్ఞతగా - ఇట్లా

"ఎంతో తేలికగా, ఎంతో బలహీనంగా అగుపించే
ఆ ధృడమైన చేయే లేకపోయి ఉంటే
ఏమై పోయుందును నేనీ పాటికి?"

20 June 2016

చివరకు

రాత్రి. మిగిలిన చిటికెడు
వెన్నెల -
***
మసక నీడలు. పల్చటి గాలి -
చెట్ల కింద
రాలిన ఆకులు పొర్లే, ఒంటరి
శబ్ధం నీలో -
***
తప్పేం లేదు: నీ చేతిని
అందివ్వు
***
ఒకరినొకరు హత్తుకుని
కూర్చోవడమే

ఒక్కొక్కప్పుడు మనకు
మిగిలే శాంతి - 

19 June 2016

మరో ముఖం

నీ అరిపాదాలు పగిలిపోయి ఉన్నాయి: ఆ పగుళ్ళల్లో మట్టి, నల్లటి గీతలయ్యి అరచేతి రేఖలయ్యీ -
***
ఒకప్పుడు, నా శిరస్సును వాటిపై వాల్చితే, అవి తెల్లని మబ్బులు. నడిచే గులాబీ మొగ్గలు. సీతాకోకచిలుకలు ఎగిరే సరస్సులు. ఒకప్పుడు అవి నవ్వే పసిపాపలు. వెన్నెల కురిసే మైదానాలు. తాకితే కందే మెత్తని స్వప్నాలు. వడివడిగా పారే మాటలు - 

నేలపై వలయాలు గీసే మౌనాలు. ఎంతో ప్రేమగా ఎదురొచ్చే సాయంత్రాలు. చీకటిలో వెలిగే దీపాలు. గోరింటాకు పండిన రాత్రుళ్ళూ హత్తుకున్న రొమ్ములూ, అన్నం పెట్టిన చేతులూ నుదిటిన భవిష్యత్తుని లిఖించిన తడి వస్త్రాలూ అవి ఒకప్పుడు -
***
ఇకిప్పుడు, ఈ నగరంలో, ఈ రహదారిలో, ఆగిన వాహన రద్ధీలో, సిగ్నల్ వద్ద, తిండికి ఇన్ని రియల్ ఎస్టేట్ కరపత్రాలు పంచుకుంటూ పగిలిన పాదాలతో, కమిలిన కళ్ళతో, ముఖంతో నువ్వు -
***
పగుళ్ల మధ్య మట్టితో, ఆకాశం మబ్బు పట్టింది: లోపలేదో మసకగా మారింది. హోరున గాలి వీచి చెట్లు ఊగి , ధూళి ఎగిసి, ఏదో కురిసేందుకూ, పూర్తిగా తడిచి, విరిగి, వొణికిపోయేందుకూ, ఇంకా కొద్దిసేపే -
***
అందుకే, వర్షం పడక మునుపే, నా వాహనం వైపు నువ్వు రాక మునుపే, నువ్వు చూడక మునుపే చప్పున గేరు మార్చి, కారును తటాలున ముందుకు దూకిచ్చి, చెట్లు విదిల్చిన ఓ నిట్టూర్పుతో పారిపోయి, ఇకా రాత్రికి ఎక్కడో వొణికొణికి కురిస్తే...
***
ఏమీ లేదు: నగరం ఇది. ఏదీ తాకదు. కలవదు. హృదయమొక ఫ్లైఓవర్! అంతే -

16 June 2016

పాపం

ఎంతో కాలం తరువాత ఇలా, హఠాత్తుగా
నా ఎదురుగా నువ్వు -
**
ముఖంపై ముడతలు -
కనుల కింద చారలు. సన్నటి చేతులు. ఎండిన
పెదవులు -

డోక్కుపోయిన పొట్ట -
పగిలిన పెదాలు. నిండైన పూలకొమ్మను దూసి
వొదిలినట్టు

ఈ ఆకాశం కింద, ఎటో
చూస్తూ, ఎక్కడో కోల్పోయి, పుల్లలలాంటిద్దరు
పిల్లలతో నువ్వు -
****
ఏం జరిగిందని నేను అడగను -

ఏం జరిగిందో నువ్వూ చెప్పవు -
ఓ చీకటి నదిలో పూలతెప్పను వొదిలి వేసిన
పాపం ఎవరిదో

ఈ లోకంలో ఎవరికి
తెలియదు?

15 June 2016

ఒక సాయంత్రం

ఏడుస్తోంది అమ్మ, ఏం చెప్పాలో తెలియక -
***
ఎర్రటి ఎండ కాచే కళ్ళతో పిల్లలు, అట్లా
అమ్మ ముందు నిలబడి
అసలు ఏమీ అర్థం కాక -

తన శ్వాసలాంటి గాలి: ఆగీ, ఆగీ మెల్లిగా
ఉగ్గబట్టి వీస్తో: ఇల్లంతా
దుమ్మూ, చీకటీ, నొప్పీ -

ఇక, తల ఒగ్గిన చెట్ల కింద ఓ నీడ మాత్రం
దాహంతో చిట్లిన పెదాలపై
సాగీ, సాగీ, చీకటి అయితే
***
మూడు రోజుల నుంచి కబురు లేదు. ఇంట్లో
గుప్పెడు బియ్యం లేవు -
బిడ్డలు తినేది ఎట్లరాని

ఏడుస్తోంది అమ్మ, పిల్లల చేతులుచ్చుకుని
ఏం చేయాలో తెలియక! 

09 June 2016

రిపోర్ట్

ఏం చేసావు ఇవాళంతా? ఇంతాలస్యమా?
తను అడిగింది -
***
రాత్రి పూలకొమ్మను వంచి, ఇన్ని చుక్కల్ని
తెంపుకుని, తన అరచేతి వెన్నెలను
నుదిటిపైకి ప్రసరింపజేసుకుని, నెమ్మదిగా
అన్నాడు అతను: "నిద్రొస్తుంది. బాగా -

అలసిపోయాను. పడుకుంటాను కాసేపు"
***
ఇక రాత్రంతా, బయట వాన: కురిసీ, ఆగీ
ఆగీ, కురిసీ

తన ఒడిలో ఒదిగి, ఆకలితో నిదురోయిన
చీకటై, ఆకులంచులకు వేలాడే

చినుకులై, వొణికి, ఆగిపోయి!

06 June 2016

మిగిలినది

అరవిచ్చిన మొగ్గల్లాంటి చిన్ని అరచేతులు, ఇక
నీ ముందు: 'ఏమిస్తావు?' అన్నట్లు -
***
ముఖమంతా వెన్నెల -
కళ్ళల్లో మిణుకుమనే చుక్కలు. పెదాలపై నవ్వు
రాత్రి వీచే గాలై -

విశ్వాన్ని దాచుకున్న
చిన్ని హృదయం. పలకా, బలపం అంతటి కాలం -
"ఎందుకు నాన్నా?"

అని, నిన్ను చుట్టుకుని
నీ అశ్రువులని, వేళ్ళ చివర్లతో తుడిపివేసే లోకం:
ఒక ఇంద్రజాలం -
***
వేలాడే గూళ్ళలాంటి చిన్ని చిన్ని అరచేతులు:
నిన్ను తమలోకి పొదుపుకుంటూ -
***
ద్వేషానిదేముంది?
ఎంతయినా వెదజల్లవచ్చు: ఈ లోకాన్ని తిరిగి ఓ
పాపాయిలా

నీ హృదయానికి హత్తుకోవడమే, నీకు ఇప్పుడు
తెలియాల్సి ఉందిక!

05 June 2016

గ్రహింపు

"దా, నాన్నా" అంది బెంగతో పాపాయి చిన్నగా
ఆతనిని తనవైపు లాగుతూ -
***
చూడలేదు అతను అటు
కిటికీలోంచి బయటకు చూస్తూ: ఈదురు గాలీ
మబ్బులూ, వానా -

అరల నిండా చెట్లు, తడచి -
పుస్తకాలలో ఆకులు: నలిగి, మగ్గీ, చితికీ. ప్రజలు
తేమై, రాత్రై, వెలిస్తే
***
"దా, నాన్నా", అంది పాపాయి, నీటి రంగుల్ని
కళ్ళల్లో ఒంపుకుని, తనని
చూడమని-
***
మ్రాగన్ను నిద్రలోంచి అతను దిగ్గున లేచి చూస్తే
ఒక ప్రతిధ్వని: హృదయంలో
కంపిస్తూ, ఖాళీగా ఓ ఊయల!

04 June 2016

నేర్పు

లొంగిపో పూర్తిగా: అడగకు ఏమీ. విను
నింపాదిగా -
***
ఈ రాత్రిని: తడచిన రెక్కల బెంగని -
కొస ప్రాణంతో నిలబడిన గూటిని. గాలికి ఒరిగిన
కొమ్మలని

వాననీటి దారుల్ని, తననీ, ఇంటికి
తిరిగిరాని ఓ పసివాడి తల్లి హృదయాన్నీ: తనలో
తన శరీరంలో

ఏ నీడల మాటునో దాగిన నీలోనో!
***
అడగకు ఏమీ: లొంగిపో పూర్తిగా. విను
నింపాదిగా -
***
రాత్రి గూటిలో జాబిలిని దాచి, మెత్తగా
భూమిని పొదిగే ఈ

వాన పావురాన్ని!

03 June 2016

హృదయం

రాత్రి: చీకటి బల్లపై పూలపాత్ర -
తెరచిన కిటికీలు, కోసే గాలి. వొణికే నీ సన్నటి
చేతివేళ్ళు: ఆకులు -

ఉప్పు: రాలి, దొర్లిపోయే పూలు
కళ్ళు. కురిసే చినుకులు. నీ హృదయ నిశ్శబ్ధం
ఖాళీ గూడంతటి శబ్దం!
***
గమనించు! ఏదైతే నిను
ఇంతకాలం బంధించిందో, అదే నీకు విముక్తినీ
ప్రసాదించవచ్చు!

textuality

my lady
i am sorry
i am not srikanth
he is just a fiction
a text of
a text of
a text
and

a figment
of your imagination
or lack of it.

01 June 2016

తపన

రాత్రి. ఆగిన వాన. చీకట్లో
అప్పుడొకటీ, అప్పుడొకటీ ఒక చినుకు
రాలే చప్పుడు -

మట్టి దారి. రాలిన ఆకులు -
పచ్చి వాసన. మిగిలిన నీటి చారికల్లో
తేలే వెన్నెల -

ఇక మసకగానే హృదయం, ఈ దారీ -
మరి
***
సమయం మించిపోతుంది. ఇంటికి
వెళ్ళిపోవాలి -
దారి ఎటు?