06 May 2018

|| ఇక్కడ ... ||


1
రెండు ఖాళీ అరచేతులంత చీకటి
ఒక రెక్క తెగి,
కిటికీ అంచుకు వేలాడే సీతాకోకై,
2
ఊచలే ఇప్పటికి మిగిలిన వాస్తవం
బంధీ అయినది
ఏమిటో ఎవరో కూడా తెలియదు,
3
పగిలిన ఓ కుండై ఈ రాత్రి ఆకాశం
అడగకు ఇక
చుక్కలు మరి ఎవరి అశ్రవులని,
4
పెగిలీ పెగలని గాలి గొంతు; వొణికీ
గుక్కపట్టీ, అది 
పాడే పాట లోపలో మృత్యువైతే,
5
ఇదే సత్యం ఇప్పటికీ; నిను  తలచి
తెగి, నేల రాలి 
దేనికిందో చితికి, నుజ్జునుజ్జయి ...

02 May 2018

|| ఉనికి ||


ఎంతో పల్చని ఎండ, మరి ఓ పొరలా;
సవ్వడి చేయని గాలి -
ఆవరణలో తాకీ తాకని నీడలు

త్రవ్విన మట్టికి పైగా చల్లిన నీళ్ళల్లో
తడిచిన రాళ్ళు; మెత్తగా
అమ్మ కళ్ళలాగా మెరుస్తో స్రవిస్తో

నేలపై ఎప్పుడో రాలిపడినో పసుపు
ఆకు; గవ్వలాగా, మరి
ఒక శరీరంలాగా, ముడుతలతో ...
***
ఎంతో పల్చని ఎండ, మరి ఓ పొరలా;
అక్కడే ఒక పిట్ట
అటూ ఇటూ ఎంతో తచ్చాట్లాడి

చివ్వున ఎటో అట్లా ఎగిరేపోయినట్టు
అమ్మకి తప్ప ఇంకెవరికీ 

మరి, ఎందుకో తెలియనే లేదు!

ఇప్పటికైతే….

ఎలా ఉన్నావు అని అడగాలని ఉంది
నిజంగానే,
నా నెత్తురినంతా మాటల్లోకి వొంపి

ఊరకేనీ పక్కన కూర్చోవాలని ఉంది
నిజంగానే,
ఏమీ మాట్లాడకుండానిన్నానుకుని

చిన్న నవ్వుతో నిన్ను వినాలని ఉంది
నిజంగానే,
శరీరం నిండుగా నిన్ను పీల్చుకుని

ఎటో దారి తప్పి పోవాలనే ఉంది నీతో
నిజంగానే,
నన్నేను మరచీమరోసారి బ్రతికీ

హానిజం. మరోమారు మరణించాలనే
ఉంది నీలో,
ఒక మెలకువలోకి పూర్తిగా మేల్కొని ...
***
చూడూఇప్పటికైతే ఇదే మరి సత్యం 

ఎలా ఉన్నావు అని అడగాలని ఉంది
నిజంగానే,
నిన్నోసారి ఎంతో గట్టిగా హత్తుకుని!

|| ఇలాగే ||


పగలంతా ఇలాగే గడిచిపోయింది,
గాలికై ఉగ్గబట్టుకుని
అల్లాడక వేచి చూసే ఆకులాగే,

మంచం మీద అమ్మ ఒక్కత్తే, ఇక 
ఏదో యోచిస్తో; మరి
కేటరాక్ట్ ఆపరేషన్ అయి, ఏమీ

చూడలేక, కళ్ళప్పుడే తెరువలేక;
ఏముంది? తన కళ్ళ
కింద? వానకు తడిచే ఓ తోటా,

లేక, నింగికెగిసే పక్షులా? చెట్లకు
వేళ్ళాడే గూళ్ళా లేక
గోధూళి, మబ్బులై వ్యాపించిన

సాయంత్రాలా? చుక్కలు దీపాలై
వెలిగే రాత్రుళ్ళా లేక,
వెన్నెల ఓ నీటిపొరైన కాలాలా?

ఏముంది ఆ కళ్ళ కింద? అసలు
ఇవేమీ కాక, తల్లి లేని
పసిపాపలు ఉన్నాయా అక్కడ?
***
పగలంతా ఇలాగే గడిచిపోయింది,
గాలికై ఉగ్గబట్టుకుని,
శిలలైన పూలతో, బాల్కనీలోనే

బంధీ అయిన ఓ పూలకుండీతో!