30 December 2012

ఎలా నిదురోగలం?

అర్థరాత్రి నిద్రలోంచి లేచొచ్చి, ఆ మూడడుగుల మల్లెపూవు
నా పక్కగా వచ్చి 'నాన్నా' అంటూ
నన్ను హత్తుకుని పడుకుంది.ఇక

ఆ చీకట్లో ఒక నెగడు రగిలి,  పేరులేని సుగంధమేదో
గాలిలో వీయగా, ఎక్కడో కొమ్మల్లో గూళ్ళల్లో
పక్షులు రెక్కలు సర్దుకుంటున్న చప్పుడు:    
ఒక నెత్తురు  గీతం. ఒక శాంతి కపోతం. చలి చిక్కగా

ధూపమై వీచే ఆ వేళల్లో ఆ గదిలో ఎక్కడ
వేలితో తాకినా వెలిగే ఒక కాంతి సంకేతం    
కొంత అలజడీ, కొంత అబ్బురమూ కొంత
జీవితం పట్ల కృతజ్ఞతా, కొంత
కరుణా బోల్డంత ఇష్టమూనూ-

నిద్దురలో ఏదో కలువరించి, మెల్లిగా కదిలిన ఆ మల్లెపూల కలనీ
తెల్లగులాబీ మొగ్గలవంటి ఆ కళ్ళనీ
ఇలా చూసుకుంటూ, ఇక ఈ రాత్రి
నువ్వైనా నేనైనా ఎలా నిదురోగలం?          

28 December 2012

వెన్నతో చేసిన రొట్టెలు

మేం చేసిన అల్లరికి చికాకొచ్చి, మా అరుపులకి విసుగొచ్చి, కోపంగా అరచి

     ఇక అప్పుడు కలుపుతావు కదా గోధుమ పిండిని చక్కగా నీ అరచేతులతో
     తలుపులోంచి చీకటి చల్లగా ఇంటిలోకి అలలుగా తరలి వచ్చే సమయానా
     మరి అప్పుడు కూర్చుంటాం నేనూ పిల్లలూ ఒద్దికగా బుద్ధిగా నీ ఎదురుగా
     బాసింపట్ట వేసుకుని, బళ్ళో  బెత్తంతో ఉన్న టీచర్ ముందున్న పిల్లల మల్లే
     చేతులు కట్టుకుని నువ్వు చూడనప్పుడల్లా ముసి ముసిగా నవ్వుకుంటూ-

పంట కాలవలేమో నీ అరచేతులు, మెత్తగా పిండిని వొత్తి, నీళ్ళు పోసి
     తిరిగి మళ్ళా కలిపి, ఎంతో ఇష్టంగా ఎంతో ఓపికగా, పూర్తిగా కలిసే దాకా
     అటు తిప్పి ఇటు తిప్పి, ముద్దను చేసి మళ్ళా విడదీసి, తిరిగి మళ్ళా కలుపుతూ
     నుదిటిన వాలిన జుత్తును ముంజేతితో వెనక్కి తోసుకుంటావు కదా, అప్పుడు
     నీ కళ్ళల్లో ఒక ఇంద్రధనుస్సు. నీ చుట్టూతా పచ్చిక మైదానాలపై ఎగిరే తూనీగలు.
     నీ శరీరం పై మెరిసే పసుపు పచ్చని పూవులు. ఇంతకాలం నమ్మలేదు కానీ

ఇప్పుడు నీ చేతుల్లో అలవోకగా కదిలే వెన్న కలిపిన ఆ పిండిని అలా గమనిస్తుంటే
     పార్వతి చేతుల్లో, గంధపు ముద్దతో రూపు దిద్దుకున్న ఆ పిల్లవాడి కధ నిజమే
     అనిపిస్తుంది: అందుకే మరి నీ చేతుల్లోని పిండి కూడా జీవం పోసుకుని, ఇక
     రొట్టేలయ్యీ చీకటి వేళ వెలుగయ్యీ  శ్వాసయ్యీ మేం నీకు చెప్పడం మరచిన

కృతజ్ఞతయ్యీ  ఇలా ప్రతి రాత్రీ మాకు ఇంత ప్రాణాన్నీ జీవధాతువునీ ప్రసాదిస్తాయి.
      అందుకే, తినబోయే ముందు ఇక తొలిసారిగా ప్రార్దిస్తాం నేనూ పిల్లలూ: నిన్ను.
      నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇంతసేపూ అబ్బురంగా చూసిన నీకు
      చివరికి మా దిష్టి కూడా తగలవద్దనీ, పిల్లలకే కాక నాకూ అమ్మవైన
     నిన్ను ఎన్నడూ విసిగించమనీ, నీకు ఎన్నడూ కోపం తెప్పించమనీ.                       

27 December 2012

చోటు

"ఎక్కడికి వెళ్లావు నువ్వు రాత్రంతా?" She asked him.

"I buried my eyes
In the water, in the soil, in the sky
And in the lonely, lonely
Breeze of the night" అతడు చెప్పాడు.

ఇక ఉప్పుతో తడచి ఆమె కనురెప్పలు
అక్కడే నిలిచిపోయాయి.

అక్కడే. మట్టితో నీటితో నింగితో గాలితో నిండి
బళ్ళున పగిలి, తన వక్షోజాలపై
అతని కనులు, నిస్సహాయంగా

రాలిన చోట, ఒక పక్షి గూడైన
చోట శీతాకాలపు రాత్రుళ్ళలో
అనాధాలకి రహదారుల పక్కన నెగడు మంటైన చోట.  

Don't you know that I aint a metaphor?


వొద్దు. వెన్నెల వొద్దు.  పూవులు వొద్దు. లతలు వొద్దు. జాబిలిలు వొద్దు. ఆకాశం వొద్దు. నక్షత్రాలు వొద్దు. పుప్పొడి వొద్దు. లేత గాలులు వొద్దు. తడచిన రాత్రుళ్ళు వొద్దు. గులాబీల దినాలు వొద్దు. హంసలు వొద్దు. హంస నడకలూ వొద్దు. నీలి కనులు వొద్దు. నీలి సముద్రాలు వొద్దు. నిమోన్నతాలు వొద్దు. మేఘాలు వొద్దు. అటువంటి ఒడీ వొద్దు. ఓరిమి వొద్దు. మాతృత్వం ఒక వరం వొద్దు. సహనవతి వొద్దు. సతీ వొద్దు. సావిత్రీ వొద్దు. సీత వొద్దు. ఊర్మిళా వొద్దు.

స్త్రీ అంటే అని మొదలయ్యే వాచకాలూ వొద్దు. పురాణాలూ వొద్దు. పవిత్రత వొద్దు. పాపం వొద్దు. పుణ్యం వొద్దు. ధ్రౌపదీ వొద్దు. శబరీ వొద్దు. వొద్దు. థెరీసా వొద్దు. మాగ్ధలీనా వొద్దు. లైలా వొద్దు. మల మూత్రాదులు లేని అతి సౌందర్యమైన దేవతా స్త్రీలూ వొద్దు. కాళికలు వొద్దు. సరస్వతీ దేవీలూ వొద్దు. వొద్దు. అసలే వొద్దు. నిర్వచనాలు వొద్దు. నీ వచనాలు వొద్దు. సోత్రాలూ వొద్దు. ఆరాధనలూ వొద్దు. అర్పణలూ వొద్దు. ప్రేమా వొద్దు. త్యాగమూ వొద్దు. ఆబలా వొద్దు. సబలా వొద్దు. అమ్మా వొద్దు. చెల్లీ వొద్దు. భార్యా వొద్దు. భక్తీ వొద్దు. బంధమూ వొద్దు. నిర్మాణ వాచకమూ, వాక్యమూ వొద్దు. ఇక 

ఈ ఒక్క పూటకి ఇలా నేను: ఇలా నన్నుగానే ఉంచు. ఇలా నన్నుగానే మాట్లాడు. చితికిన యోనిగానూ, నరికిన వక్షోజాలగానూ, నమిలిన ఊసేసిన పెదాలగానూ, తెగిన పేగులగానూ, వేల మర్మావయవాలు నిరంతరం కుళ్ళ బొడిచే ఒక యుద్ధభూమిగానూ, పురుషాంగమే ఒక దేశమైన, దేశమంటేనే పురుషావయవమైన ఒక కాలంగా స్త్రీ లేని ఒక లోకంగానూ మాత్రమే 

చూడు ఈ ఒక్క పూటకి. పిల్లలు లేని తల్లిగానూ, ఏమీ లేక ఖాళీ అయిన ఊరులానూ, నెత్తురు కమలం విచ్చుకున్న ఒక గుజరాత్ గానూ, హస్తం లేని వస్త్రరహిత రాజకీయంగానూ, నీలం బొమ్మలుగానూ, నీతి లేని రాజకీయ నాయకులగానే, తల్లి స్తన్యం తాకని వారి మాటలుగానే

చూడు ఈ ఒక్క పూటకి నన్ను. అన్నం తిన్న శరీరంగానే, అంగట్లో పెట్టిబడిన అధికారపు శాంతియుతమైన భాషణగానే, నవ రంధ్రాల మల మూత్రాల తోలు తిత్తిగానే  చూడు నన్ను ఈ పూటకి. ఏమీ కాదు. కొంత వణుకు పుట్టి, కొంత భీతి కలిగి, కొంత హృదయం కదిలి కొంత శరీరం జలదరించి, కళ్ళు కొంత కన్నీళ్ళయ్యి, జన్మస్థానం మరణ ప్రస్థానం కొంత అర్థమయ్యి, తాకుతావు నువ్వు నన్ను తొలిసారిగా, ఒక మాట లేని మాటతో:

                    Don't you know that I aint no metaphor?" అని అంది తను నిన్న
                    పాలరాతి పలకల వలే మారిన శరీరంతో, తన చుట్టూ
                    ఒక ఆదిమ సర్పం ఒక ఆదిమ బాణం, ఒక ఆదిమ ప్ర
                    వక్తా భాష్యం నడయాడుతుండగా. 

26 December 2012

Don't you know that I aint a metaphor?

వొద్దు. వెన్నెల వొద్దు.  పూవులు వొద్దు. లతలు వొద్దు. జాబిలిలు వొద్దు. ఆకాశం వొద్దు. నక్షత్రాలు వొద్దు. పుప్పొడి వొద్దు. లేత గాలులు వొద్దు. తడచిన రాత్రుళ్ళు వొద్దు. గులాబీల దినాలు వొద్దు. హంసలు వొద్దు. హంస నడకలూ వొద్దు. నీలి కనులు వొద్దు. నీలి సముద్రాలు వొద్దు. నిమోన్నతాలు వొద్దు. మేఘాలు వొద్దు. అటువంటి ఓడీ వొద్దు. ఓరిమి వొద్దు. మాతృత్వం వంటి వరం వొద్దు. సహనవతి వొద్దు. సతీ వొద్దు. సావిత్రీ వొద్దు. సీత వొద్దు. ఊర్మిళా వొద్దు.

స్త్రీ అంటే అని మొదలయ్యే వాచకాలూ వొద్దు. పురాణాలూ వొద్దు. పవిత్రత వొద్దు. పాపం వొద్దు. పుణ్యం వొద్దు. ధ్రౌపదీ వొద్దు. శబరీ వొద్దు. వొద్దు. థెరీసా వొద్దు. మాగ్ధలీనా వొద్దు. లైలా వొద్దు. మల మూత్రాదులు లేని అతి సౌందర్యమైన దేవతా స్త్రీలూ వొద్దు. కాళికలు వొద్దు. సరస్వతీ దేవీలూ వొద్దు. వొద్దు. అసలే వొద్దు. నిర్వచనాలు వొద్దు. నీ వచనాలు వొద్దు. సోత్రాలూ వొద్దు. ఆరాధనలూ వొద్దు. అర్పణలో వొద్దు. ప్రేమా వొద్దు. త్యాగమూ వొద్దు. ఆబలా వొద్దు. సబలా వొద్దు. అమ్మా వొద్దు. చెల్లీ వొద్దు. భార్యా వొద్దు. భక్తీ వొద్దు. బంధమూ వొద్దు. నిర్మాణ వాచకమూ, వాక్యమూ వొద్దు. ఇక 

ఈ ఒక్క పూటకి ఇలా నేను: ఇలా నన్నుగానే ఉంచు. ఇలా నన్నుగానే మాట్లాడు. చితికిన యోనిగానూ, నరికిన వక్షోజాలగానూ, నమిలిన ఊసేసిన పెదాలగానూ, తెగిన పేగులగానూ, వేల మర్మావయవాలు నిరంతరం కుళ్ళ బొడిచే ఒక యుద్ధభూమిగానూ, పురుషాంగమే ఒక దేశమైన, దేశమంటేనే పురుషావయవమైన ఒక కాలంగా స్త్రీ లేని ఒక లోకంగానూ మాత్రమే 

చూడు ఈ ఒక్క పూటకి. పిల్లలు లేని తల్లిగానూ, ఏమీ లేక ఖాళీ అయిన ఊరులానూ, నెత్తురు కమలం విచ్చుకున్న ఒక గుజరాత్ గానూ, హస్తం లేని వస్త్రరహిత రాజకీయంగానూ, నీలం బొమ్మలుగానూ, నీతి లేని రాజకీయ నాయకులగానే, తల్లి స్తన్యం తాకని వారి మాటలుగానే

చూడు ఈ ఒక్క పూటకి నన్ను. అన్నం పెట్టిన శరీరాన్నే, అంగట్లో పెట్టిన అధికారపు శాంతియుతమైన భాషణగానే, నవ రంధ్రాల మల మూత్రాల తోలు తిత్తిగానే  చూడు నన్ను ఈ పూటకి. ఏమీ కాదు. కొంత వణుకు పుట్టి, కొంత భీతి కలిగి, కొంత హృదయం కదిలి కొంత శరీరం జలదరించి, కళ్ళు కొంత కన్నీళ్ళయ్యి, జన్మస్థానం మరణ ప్రస్థానం కొంత అర్థమయ్యి, తాకుతావు నువ్వు నన్ను తొలిసారిగా, ఒక మాట లేని మాటతో:

                    Don't you know that I aint no metaphor?" అని అంది తను నిన్న
                    పాలరాతి పలకల వలే మారిన శరీరంతో, తన చుట్టూ
                    ఒక ఆదిమ సర్పం ఒక ఆదిమ బాణం, ఒక ఆదిమ ప్ర
                    వక్తా భాష్యం నడయాడుతుండగా. 

24 December 2012

ఆ నొప్పి or What She has been Asking

(








































                                                                                                                                           )


__ Eyes turn to stones, and
Stomach to a barren land
as this country of mine___

Crucified, I will survive.
Crucified, I will retain a face
Crucified, I will endure.

___But, you who
never questioned
how will you die___?

ఇక
అన్నం తినే  ముందు అరచేతుల్లో నీ ముఖం
నీళ్ళు తాగే ముందు గాజు పాత్రలో నీ శరీరం

ఇక
కళ్ళు నావే, ఆ కన్నీటి తడి నీది
శరీరం నీదే, ఆ నెత్తురులోని
కొంత భయపు మరక నాది

ఇక
గర్భం చిధ్రమయ్యీ, పేగులు తెగిపోయీ
యుగాలుగా నువ్వు 
యుగాలుగా  నిన్ను 
ఇలా 

వొదిలివేస్తూ, ఎలా నిదురించగలను నేను
ఇక ఈ రాత్రికైనా, మరి ఇక ఏ రాతిరి కైనా?

(Mother, Don't forgive them
for they know what they do.)

Eloi Eloi lama sabachthani? 

A Crow on the Facebook

అతుకులుగా విరిగిన గోడ పూచింది
నీడల పూలతో మధ్యాహ్నం ఒక్కటే
గోలగోలగా అరిచే కాకితో-

                                        (You know that I'm on the Facebook)

వరండాలో-కుర్చీలో- చలికి యెద ఎండిన దాహంతో
ఇన్ని రాళ్ళు ఏరుకుంటుందీ కాకి
ఎన్నటికైనా ఒక కుండ
దొరకక పోతుందా అని

                                          (Are you on the Facebook? )

కానీ, మరి అప్పటిదాకా ఎన్నటికి నిండేను అద్దంలోనీ
పాత్ర, తాకలేని తాగలేనీ
శరీరపు మట్టిపాత్ర?మరి

అందుకే, ఇక్కడే కొమ్మల్లో కూర్చుని అరుస్తున్నా కావ్
కావ్ మని రికామీగా. దిక్కూ మొక్కూ లేకుండా మీతో
కానీ

సరేలే, ఇక ఇంతకంటే
ఏం చేయగలం మనం

రాళ్ళు పొదిగిన ఈ
రాత్రుళ్ళ దినాలలో?

                                          (Have you ever been booked by a face?
                                           Have you ever become faceless?)

ఆమెన్.

21 December 2012

నీ బాల్కనీలో, ఒక బాటిల్ తో

ఊరకే ఒక బాటిల్ తో కూర్చుంటావు నువ్వు, నీతో నువ్వు
ఈ చీకటి బాల్కనీ అంతాన

కుండీలో కొమ్మకి పూచిన చుక్కను
రాలిన ఒక చినుకులో, తడుపుతూ

ఇక వేలి చివరన తడిగా పొటమర్చిన నెత్తురు బొట్టును చప్పరించి

ఇలా అనుకుంటావు ఇక నింపాదిగా: 'ఎలా

వచ్చింది ఇది, కన్నుల్లో, కనురెప్పల
అంచుల్లో మొలచిన ఈ కన్నీటి చుక్క

చిక్కగా, ముందుగా, ఈ గదిలోకీ, ఆపై మదిలోకీ, ఆపై ఆఖరి ఊపిరితో
ఈ గాజుపాత్రను తపనగా పట్టుకున్న
ఈ వేళ్ళ అంచులలోకీ ఎలా వచ్చిందీ

కన్నీటి కాంతీ,కరకు శాంతీ
ఊరకే ఒక బాటిల్ గా మారి
మధువు  దీవెనగా మారి, 'నువ్వు' అనే శాపంగా మారి, నీతో నువ్వే

మరి ఒక చీకటి అంతాన నీ బాల్కనీలో
పాత్ర అంచున మెరిసే, కత్తిగాటు వంటి
నీ ప్రతిబింబంతో? 

రాలేను నీ వద్దకి

1
రాలేను నీ వద్దకి
2
నీళ్ళని చీల్చే పాదాలూ, ఎదురీదీ నిర్మలంగా వెళ్ళే కళ్ళూ నీవి
అలా ఎదురు చూడకు
ఓ దీపం అంటిన చీకటి

మెరుస్తోంది ఇక్కడ. నీ వద్దకు రాలేని ఈ గోడలపై, నిలువెత్తు
నీడలై. నేనై. నా
2
ముఖాన్ని దాచలేని నీ వద్ద - గ్రహించు- రాలేను - నీ వద్దకి
4
కానీ శరీరాన్ని వొలిచి, వెలుపలికి మలచి
బల్లపై ఒక కూజావలే, ఒక పూలపాత్ర వలే ఉంచి వినమ్రతగా
తప్పుకోగలను: ఊయలలూపే నీ చేతులు

క్షణకాలం ఆగిన చోట నుంచి-
క్షణకాలం ఊపిరీ తనని తాను
మరచిన ఆ చోట నుంచి. ఒక

గాలి కిటికీలోంచి పాకి, లతల వలే నీ నుదిటిపై శిరోజాలను
చెరిపే ఇద్రజాలం నుంచీ. మరి
అక్కడే నా
5
ఆత్మనీ దాచలేను. కుటీరం, ఆ గది. ఆ పచ్చిబాలింత వాసనా
నా ఆత్మ తొలి పయనాన్ని గుర్తు చేసిన నీ మదీ

ఒక నీరెండా ఒక పసరు తోటా ఒక చల్లని గాలీ
ఇక్కడిది కాని జీవితాన్ని, మృత్యుస్మరణ వలే
దిగంతాల పరిమళంవలే

అద్రుశ్యాకార ధూపం వలే
శరీరం లోంచి శరీరం లోకి
చొచ్చుకుపోయిన రాత్రి, ఆ ధరిత్రీ ఆ వెన్నెల గానాల సౌమిత్రీ
అందుకే, ఇప్పటికీ
6
నా అరచేతుల్లో పాల బరువుతో ఒదిగిన నీ పాలిండ్ల వొత్తిడి-
తల్లిదనం నిండైన ముఖమై
శరీరం నిండిన బరువై, ఒక

దివ్యమైన గుబురు పూలపొద యేదో రెండు చేతుల మధ్య
ఒదిగిపోయినట్టూ, పురివిప్పిన ఓ నెమలి తిరిగి నెమ్మదిగా
ముడుచుకుంటున్నట్టూ, నా

శరీరమంతా ఒక త్రండ్రితనం.
ఎవరివో లేత పసివేళ్ళు బుగ్గలపై పారడిన ఒక గగుర్పాటు
ఏదో ఒక కేంద్రం లోపల చిట్లి
శరీరమంతా కాంతి ద్రవమై నిండిపోతున్న తడబాటు. చీకట్లో

నాది కాని లోకంలో ఎవరో
ఒక దీపాన్ని వెలిగిస్తే కానీ
7
నీ వద్దకి రాలేని నగుబాటు: ఇక అందుకే, నీ రెండు వేళ్ళ మధ్యా
8
నులిమి, అంటించు ఈ ప్రాణపు వొత్తిని ఒక జ్వలనంతో విశ్వపు
శక్తితో: ఇక అప్పుడే, నక్షత్రాలు పూసే వేళ్ళల్లో
గ్రహాలు పేలి రంగులు వెదజల్లితే, వేణువొకటి

తిరిగి ప్రాణ వాయువుని ఊదే కాలాలలో, తిరిగి ఏడూ లోకాలూ
ఏడూ కాలాలూ నిర్మితమయ్యే పునర్యానంలో
వస్తానేమో, ఏమీ లేని ఏమీ కాని కాంతి కణాన్నై
9
మరి తొమ్మిది నెలలు మోసిన నీ వద్దకు
మరి తొమ్మిది జీవితాలు పంచుకున్న నీ
వద్దకూ

తలను వంచిన కృతజ్ఞతా పర్వంతో, తొలి మలి శాంతితో. మరి
అంతిమంగా నీతో. అస్థిత్వపు అంజలితో-           

ఇలాగ.

నిన్ను చదువుదామని అనుకుంటాను. ఎలాగో ఒలాగా. మరి

ఇక్కడా ఏమీ లేదు: మరి కాంతికి ఊరికినే కదులుతాయి
నువ్వు వేలాడదీసిన గాజు పక్షులు పరావర్తనమై గోడలపై
నీడలై.

'నీడలే మిగిలేవి చివరికి' అని నేను అంటాను.
అరచేతుల్లో ఏమీ మిగుల్చుకోని మనిషి అనే మాటలనే
కాగితాలని తూనిగల వలె చుట్టి, మరి నీ కనుల ఇసుక
మైదానాలపై ఎగురవేస్తో, అరచేతుల్లో
ఏమీ మిగుల్చుకోలేని ఓ మనిషి అనే

చిన్ని చిన్ని మాటలనే, నేను గూళ్ళలోంచి తవ్వి పోస్తాను.  

తెలుసు. నేనొక నిస్సహాయుడనని. పదాలనే హత్తుకుని
ఆఖరి నెత్తురు చుక్క వరకూ నీ వద్దకు పారాడే ఒక శర
నార్ధిననీ, మరి ఒక అర్థ/నారీశ్వరుడననీ

నేలనెలవంకను పిచ్చిగా ఇష్టపడే
ఒక మామూలు, వాన చుక్కననీ
అవి ఏ కనులలో నుంచైనా కురిస్తే
తట్టుకోలేని బాలకుడనని, సదా సంచారిననీ ద్రిమ్మరిననీ.

అందుకే
నిన్ను చదువుదామని అనుకుని, రాత్రిని ఒక మంట చేసి
వెలిగిస్తే, శరీరం అంటుకుని కాలుతుంది తెల్లటి పరదాలలో

నిన్నిక
చదవద్దో చదవద్దో అంటో, నీడల్ని ఆర్పే వేకువ కాంతై
వేకువ కాంతిని ఆర్పే పొగ మంచై, చల్లగా చల్లగా ఇక

నుదిటిపై అరచేయంత చల్లని తల్లి దీవెన లాగా, ఇలాగ.              

20 December 2012

బహుశా

ఇలా అంతమౌతుందీ రాత్రి.

చీకటి - ఆకుల వలే- గదిలో రెపరెపలాడితే
ఆకులపై రాలే నీటి శబ్ధాన్ని వింటావు మరి
నువ్వు: శరీరంపై తేలే వెచ్చని కంపనతో-

బహుశా, ఒక వెన్నెల వీచిందేమో బయట
బహుశా, ఒక సీతాకోకచిలుక వాలిందేమో
చల్లటి వెన్నెలపైనా. బహుశా,

తేమ అంటిన రెక్కలపై, తిరిగి రాత్రే పరిమళపు  
పుప్పోడై వెదజల్లబడిందేమో ఇక్కడ. బహుశా

ఇవేమీ కాక, ఒక పూల వనమే నిశ్శబ్ధంగా 
తగలబడిందేమో ఇక్కడ. ఇక్కడే
అంతమయ్యీ కాని ఒక రాత్రి ఒక
'బహుశా'గా మిగిలిన చోట. రా రా

నువ్వొక సారి ఈ శరీరాన్ని ముట్టుకుంటే
ఇక నిశ్చింతగా తగలబడిపోతాను-                 

ఇలా.

ఎర్రటి ముద్ద మందారం విచ్చుకుంది నుదిటిలో-

ఎవరో నింపాదిగా కూర్చుని
బొగ్గులపై శరీరాన్ని కాలుస్తే

తడిపిన తువ్వాలుతో ఒళ్లంతా
తుడుచుకుంటున్నాను ఇలా.

ఎందుకో మరి, పలు కాలాల క్రితం, జబ్బుపడి
వీధి చివరన గోడకి ఆనుకుని
పుండునీ ఆ నెత్తురు చీమునీ

నాక్కుంటూ, వెళ్ళేవాళ్ళ వైపు దిగులు కళ్ళతో
చూసే ఆ నల్లటి వీధి కుక్క
గుర్తుకువస్తుంది ఇప్పుడు.

ఎలా ఉన్నావు? అంటే ఇదిగో ఇలా, మంచాన
ఏవో నావైన గాయాల్ని అలా
నాక్కుంటూ కూర్చున్నాను.

మరి, నీకేమైనా అభ్యంతరమా?

18 December 2012

ఒక మామూలు సాయంత్రం

చుబుకం కింద చేయి ఆన్చి, నుదిటిపై మరో చేయి ఉంచి, పార్క్ లో
గేటు నుండి తనకు ఉన్న దూరాన్ని
కొలుస్తూ అతను: ఎర్రటి ఎదురెండ-

ఆక్కడే కూర్చోవాలని ఏమీ లేదు. కాకపోతే, తరచూ తన స్పర్శతో
సారవంతమై, చెమ్మగిల్లి తన శరీరంలా మారిన ఆ బెంచీని
తను లేని రోజున వొదిలి, చెట్టు నీడన ఎదురు చూడాలంటే

కొంత కష్టం: అతనికి. అలవాటైన అతని ప్రాణానికీ.ఇంకా వర్తకం కాని
ఆ సంబంధానికీ. అందుకే, ఊరకే, అంత తొందరగా తను
రాదని తెలిసినా, అరగంట ముందే అతను: అక్కడ.ఇంకా

స్కూలు బొమ్మలు కాని పిల్లల ముందర, పిల్లలతో ఒక నీటి బాటిల్తో.
గడ్డి మెరిసే వాళ్ళ ముఖాలతో, అమ్మను చూసే ఆత్రుతతో
నీళ్ళు చిలుకరించిన తరువాత,ఆ కొద్ది సమయం గడిచాక

అతనికీ, స్కూలు దుస్తులను దుమ్ముతో కడిగిన పిల్లలకీ, ఒక గాలి.
మట్టి వాసనా, పూల పొదలు ఊగి, ఆకులు చినుకుల్లా సవ్వడి చేసే
ఇక తనే నెమ్మదిగా, అలసిన ఓ చిరునవ్వుతో
కొంగుతో, ముఖాన చెమటని తుడుచుకుంటో

లోపలి వస్తే, ఉద్యానవనమంతా కిలకిలలతో తన పాదాల చెంత ఆ
పిల్లలతో, ఆ దినాన తొలిసారిగా నిండుగా
గుండెల నిండా తేలికగా ఊపిరి తీసుకున్న
అతనితో: మరి దయగా సూర్యుడు దాగుని, మసక చీకటిని లోకాన

మెత్తగా వెదజల్లే వేళ, తన బొజ్జని గట్టిగా
చుట్టుకుంటూ ఇక అంటారు కదా పిల్లలు
అమ్మా. ఆకలే. ఇక ఇంటికి వెళ్దామే అని

కానీ, పద పద పద మరి ఇక, మరక్కడ మీకైనా నాకైనా ఏం పని?     

17 December 2012

With or without your cloths

దుస్తుల్ని వొలిచి, నెమ్మదిగా మడతపెట్టి, కిటికీలు తెరిచి
     చీకటిని వొంటి నిండా నలుగు వలె పులుముకుని
     ఇక తాపీగా ఒక గాజుపాత్రతో, తేనెవంటి మధువుతో

పదునాలుగు ఏళ్లుగా కలగని
మరి, ఇన్నాళ్ళకి కొనుక్కున్న
వాలుకుర్చీలో, వెదురు వనాల వాసనలని పీలుస్తూ
కడు నింపాదిగా, శాంతిగా ఆ

రాత్రి సెలయేటి, గోరువెచ్చని నీళ్ళల్లో
నగ్నంగా పరిపూర్ణ శాంతి నిశ్శబ్దంలో
అతను:

అందుకే అంటాను నేను చదువరితో
ఇక ఇల్లా:"వచ్చిలా నువ్వు
ఈ పదాలని చదివే బదులు

why don't you go, have a peg for yourself
and go to bed? With or
without your cloths-?" 

వెన్నెల విడిచిన దారి


మీగడ పొరని తొలగించినట్టు, కన్నీటి పొరని మెత్తగా లేపి
    కళ్ళకి ఎవరో కాంతిని ప్రసాదించినట్టూ, మట్టిపొరలపై నుంచి
    వెళ్ళిపోతుందీ వెన్నెల: కొంత మసకగా, కొంత చల్లగా
    కొంత గాలిగా, కొంత నీడలా

గలగలలాడే ఆకుల చప్పుళ్ళలోంచీ, పొదలలో మెదిలే కప్పల
     పాదాల కింద నుంచీ, తేమై చెమ్మగిల్లిన పాత గోడల పగుళ్ళ
     లోంచీ, వంచిన తల ఎత్తితే, ఎదురుగా ఎవరూ కనిపించని
     అనంతమైన అరచేతుల దూరాలలోంచీ

కీచురాళ్ళ దిగంతాల వొంటరి అరుపులలోంచీ, రెపరెపలాడే
     ఊపిరి అంచున కదిలే ప్రమిదె మంట అంచు నుంచీ, అంచున
     దాగి ఉన్న హృదయాలలోంచీ, గుండెలో ఉగ్గపట్టుకున్న
     మాటలోంచీ, ఇక నువ్వు ఏమీ చెప్పలేని మౌనంలోంచీ

ఛాతి స్థానంలో ఒక చితిని ఏర్పరిచి, వెనుదిరిగి, తన శరీరంతో
    శరీరాన్ని అంటించి, వెనుదిరగి చూడకుండా వెళ్ళిపోతుందీ
     వెన్నెల: గుప్పిళ్ళ నిండా ఛితాభస్మాన్ని నింపుకొమ్మనీ
     నీ అస్థికలని నిన్నే ఏరుకొమ్మనీ, ఆనక వి/స్మృతి నదిలో
     కలుపుకొమ్మనీ

పాపం పుణ్యం శోకం శాపం గాయం గేయం దుక్కం దూరం
     ఏమీ అంటకుండా, భూమిని వొలుచుకుంటూ, నిరాకారమై
     నిర్లిప్తంగా వెళ్ళిపోతుందీ నీ నీలాల నీలి వెన్నెల. చూడు
     ఇక ఇక్కడ, కపాల వదనంతో, విరిగిన హృదయంలో

కాంతిరహితమైన చంద్రబింబం వంటి ఒక శూన్యపు కంతితో,
ప్రతిధ్వనించే ఒక రాత్రి ఊళవై మిగిలిపోయేదీ నువ్వే. వెళ్ళు.

- ఒక సమాధి తలుపు తెరుచుకుంటోంది నీకై, తన అద్దంలో-          

16 December 2012

తను చేసినది

"నీకొక మచ్చల సీతాకోకచిలుకని ఇస్తాను
మరి నువ్వు, ఏం చెసుకుంటావ్ దానిని?"
అని, అని  మాత్రమే
అడిగాడతను తనని-

ఒక
సన్నటి నవ్వుతో, అతి లాలిత్యంగా
దాని మెడను విరిచి, దాని రెక్కల్ని
పూర్తిగా చాపి

గోడలపై, పిన్నులతో గుచ్చి
ఓరిమితో, బహు అందంగా
అలంకరించింది తను: అదే
ఆ తెలుపు నలుపూ మచ్చల, పిచ్చి సీతాకోకచిలుకని-

ఇక ఆ రాత్రి, మరి అందుకే
ఒక రంగుల నీడ
ముందు మోకరిల్లి

నిలువెల్లా ఏడ్చింది
ఒక గొంగళిపురుగు- 

12 December 2012

12-12-12

నీ తలను నరుక్కుని, బల్లపై ఉంచుకుని జాగ్రత్తగా పరికిస్తావ్

అందులో నీదైనదేదీ కనపడదు
చేతుల్లోకి తీసుకుని మోగిస్తావ్ 
అందులో నీదైనదేదీ వినపడదు 

ఇక కనురెప్పలను తెరిచి, కనుపాపలను చూస్తావ్.గాలికి   
రాలి గడ్డకట్టుకుపోయిన, పూవుల ప్రతి/బింబాలు మాత్రం 
ఉంటాయి అక్కడ, ఆ సమాధుల వద్ద. మరి 

ఇక నాసికను తాకుతావ్ చివరికి. 
గాలి లేని ధూళి పేరుకున్న తీరం 
ఉంటుంది అక్కడ, ఒడలు చిట్లిన చీకటి గాట్ల ఒంటరితనంతో-
మరి విరిగిన ఒక వేణువూ చివరి నెత్తురు చుక్కలూ అయిన

నీ కుత్తుకలో, నీ గొంతుకలలలో  
ఎవరివో బోలు శబ్ధాలు, ఎవరివో 
అసంఖ్యాక వాచకాలూ.అందులో 
నీదైనదీ, నీ నదీ ప్రవాహ మైనదీ

నీ అరచేతుల్లోకి తీసుకుని తాగగలిగే అమృతమేదీ కనపడదు-  

అందుకని
ఇకప్పుడు, నరుక్కున్న నీ తలను శుభ్రం చేసుకుని ఒక ఖాళీ 
పాత్రగా మార్చి మంచినీళ్ళతో నింపి 
నీ ఆవరణలోనే  పిచ్చుకలకు ఉంచి

మొండెం లేని శరీరంతో కూర్చుంటావ్, 12-12-12నాడు
ఆకుల నీడల మధ్యా, పాదాలని కోసే గాలి కాంతి మధ్యా

మరి అంతిమంగా నీ తల, ఈ 
జీవితంలో దేనికో, ఒక దానికి 

పనికి వచ్చింది కదా అని అనుకుంటూ  
నిన్నానుకుని కూర్చునున్న
ముఖం మాత్రమే కలిగివున్న 
శరీరంలేని ఓ స్త్రీ అశ్రువులని

నీ దోసిళ్ళలో కడు జాగ్రత్తగా
భద్రపరుచుకుంటో, ఏడేడు
కాలాలలో ఏడేడు లోకాలలో ఏరుకుంటో-

11 December 2012

నువ్వూ, నేనూ

బల్లపై పారే సెలయేరూ, ఒక లేత పసుపు ఊరూ ఈ సూర్యరశ్మి. మరి

అందుకే
ఇక ఉదయాన్నే వొదులుతావు
ఒక పాత్రాపుష్పాన్ని ఆ నీటిలో:
ఇక సన్నటి ఆవిరి నా అరచేతిలో-

ఊరికే, దానిని నీ ఊపిరిగా తలుస్తాను, అగరొత్తు పొగలా ఊహిస్తాను

తొలిఎండ సోకి, మెత్తగా కరిగిపోయే
మంచుపొగలో ఎగిరిపోయే ఓ
పిచ్చుకగా నిన్ను తలుస్తాను.

ఈ మిద్దెపై అద్దె ఇంటిలో, ఇంకా నీడలుగా మారని మన సమయాలని

గోడకు కొట్టిన మేకుకు వేలాడే, పగుళ్ళిచ్చిన పాత అద్దంలో అలా కొత్తగా
కదిలే నిండైన నీ రూపంగానే       
నెలలు నిండిన నీ నెమ్మదైన
ఆ కదలికలుగానే చూస్తాను-ఇక

అరచేతిని పొట్టపై ఉంచుకుని, కొద్దిగా నొప్పితో కొద్దిగా సంతోషంతో ఆ
సెలయేటిలో తళతళా మెరుస్తో తేలిపోయే, పల్చటి పగటి పొరల ఒక
శ్వేతగులాబీని చూస్తూ నువ్వు-  
మరో లోకపు రంగులని చూసే
నీ కళ్ళని అందుకునేందుకు ఓ
మహా ప్రయత్నంలో నేనూ.ఇక

పత్తిపువ్వై విచ్చుకుని, ఉమ్మ నీటికాంతితో ఒక జనన మరణ సువాసనతో
మెరుస్తున్న ఆ గదిలో, ఆ క్షణాలలో
- మాట్లాడుకోడానికి- ఇక నీకైనా నీ
నాకైనా ఏముంటాయి?

10 December 2012

పాప పరిహారం

ఒక మాట మంటై, మంత్రమై నిన్ను
వెలిగించేందుకు ఆగి ఉంది చూడు-

అదే, నీకూ నీ వాళ్ళకూ మధ్య
     ఉన్న ఆ సన్నటి దూరమే, వొత్తికీ వెలిగిన
     పుల్లకీ మధ్య, కనుపాపనీ దానిని తడిమే
     కనురెప్పకీ మధ్యా ఉన్న, ఆ దూరమే ఆ
     వెచ్చటి ఉప్పు చెమ్మే, కనులలోంచి జారే
     ఆ నిమ్ము నీరే

ఉంది, నీకూ నాకూ మధ్య, చీకటింట
ఇంకా లేవనెత్తని పాడె వలే,మసక
సాయంత్రాన వానలో ఆరిపోయిన
సగం కాలిన శవం వలే: ఒరే నాయనా

ఎందుకు బ్రతకకూడదురా మనం
ఒక మాటని, శిలువవలె నైనా
ముళ్ళ, శిరస్త్రాణం వలెనే నైనా

ధరించీ, దహించీ, దాహించీ ప్రేమించీ
కన్నుమిన్నులెరుగక మోహించీ ఇక
మృత్యు స్మృతి ముద్రికలై ఇతరునిలో

సర్వ కాలాల పాప పరిహారమై
పునర్యానమై, తల్లి గర్భమై
చెలి స్థన్యమై, అలా మిగిలీ/
                                     పోయీ? 

నీటి కింది దూరాలు

1
"you can never write a poem"   
he said. అందుకని
2
రెండు అరచేతుల్లోకి పొగమంచుని
అందుకుని, ఒక గులాబీని
తయారు చేసాను. దానిపై

రాత్రి కాంతినీ పగటి చీకటినీ ఉంచాను
దానికి నేను,  'నువ్వు'
అనే పేరు పెట్టాను.ఇక
అది మట్టిలోమగ్గిన, చల్లటి 
నీ వేళ్ళవేర్ల వాసన వేసింది-
3
"you can never write the Other"
he said. అందుకని
4
మబ్బులని కిందకి లాగి, నెమ్మదిగా
పాకే గొంగళిపురుగుకి తగిలించాను
పుప్పొడిని, దానిపై చిలుకరించాను

ఇక అది, ఆకాశంలోకి ఎగిరినప్పుడు
దాని రెక్కలపై నక్షత్రాలు మిలమిల
మన్నాయి. దాని పాదాల కింద
మట్టి రెప్పల్లల్లే రెప రెప లాడింది
భూమంత బరువున్నచిన్నిచిన్ని 
అశ్రువులు, దాని కళ్ళలో
మరి బావురుమన్నాయి

ఇక నేను దానిని నేను 'నువ్వు'
అని ఎలా పిలవగలను?
5
"I can never write a poem"
I said. అందుకని
6
గుండెల నిండుగా మట్టి రాసుకుని
చినుకులతో నిండిన హృదయాన్ని
నల్లటి మాగాణి మట్టితో పిసికి పిసికి

అతడొక ప్రమిదెనీ, ఒక పక్షిగూటినీ
తయారు చేసాడు. అతని నెత్తురూ 
అత్తరూ అంటిన గూడూ దివ్వె, ఇక 

తన వాసన వేసాయి. తను
వెలిగించిన వొత్తీ కాంతీ ఒక 
ఆదిమ ఆకలినీ, శాంతినీ అ
శాంతినీ కలిగించాయి.

దానికి అతను, 'నువ్వు' అనే పేరు
పెట్టేలోగా, ఒక తల్లి వొంటరి స్థన్యం  
ఒక అద్దమై అతని ముందు నిలిచింది

గూటిని గువ్వనూ దివ్వెనూ
గుండెలకు చరచుకుని
అతను రోదిస్తుండగా, ఇక

ఈ తెరపై ఇలాగే రాసాను, 
కొట్టివేతలు లేని పదాలతో-  
7
"You are a poem. And I,
write you like this:" ఎలాంటే
ఎలా అంటే
8
 ఆత్మైన దేహం. దేహమైన దీపం
దీపమైన, ఒక ద్వీపం.
ద్వీపమైన ఒక దాహం.
దాహమైన ఒక జీవం-
జీవమైన ఒక పదం. పదమైన
ఒక దైవం. దైవమైన ఒక
శబ్ధం. శబ్ధమైన ఒక నిశ్శబ్ధం.
ఆమెన్. ఇక రాసుకుంటాం 
9
మనం
పిల్లలమై, పాపలమై పూవులమై 
వెన్నెలమై వానలమై
గోరింట అరచేతులమై
ఇక్కడే ఇక్కడే, కాందిశీకులమై
శరనార్ధులమై తెల్లటి

కాంతి అంచున ఊగిసలాడే
నీడలై, ఆ నల్లటి నుసియై -     

09 December 2012

ఇలాగే

నిప్పులని మింగి అతనూ, మంచుపూలతో తనూ: ఎదురుగా
    లతల వలే, వంకీలు వంకీలుగా ఇద్దరిలోంచీ
    నింగికి అల్లుకుంటున్న ఎడబాటు.అదొక సర్ప
    శ్వాస. అజగరపు కౌగిలి. కనులలోంచి పూలు

దగ్ధమయ్యి, చూపులు చాచినా అడుగు అంటని లోయల దారి-
     ముఖాలు కపాలాల్లా, అరచేతులు కన్నీటి
     బావుల్లా మారే ఒకానొక దగ్గరితనమూనూ.
     మరేమిటంటే, ఎవరో కుత్తుక కింద, మెత్తగా ఒక కత్తి గాటు

పెడితే, చుక్క చుక్కగా నెత్తురు ఉబికి, మాటలు మరకలుగానూ
    దీపపు వెలుతురు చుట్టూ కదిలే నల్లటి వలయం గానూ
    మెసిలే నీడలు గానూ, ఆ గాలిలో, ధూళిలో, చేతివేళ్ళని
    పుచ్చుకున్న చేతివేళ్లు విడిపోలేకా, అలా అని ఉండలేకా

ఇక విడివడి, ఇక తిరిగి ఎప్పటికీ ఆ గుప్పిట్లలో ఇమడలేని దిగులు
    తనంతో, అతను ఆమెగా, ఆమె అతనిగా మారి ఇక
     ఒకరినుంచి మరొకరు శాశ్వతంగా వీడి, వెళ్ళిపోయే
     -చిగురాకులు చినుకులకు చిట్లిపోయే-ఒక అప్రతిహత వానాకాలం.

"వెళ్తాను. వెళ్ళాక ఉత్తరం రాస్తాను. వీలైతే, నేను చచ్చిపోయేలోగా
    ఒక్కసారైనా నిన్ను చూడాలి నానీ. కనీ నువ్వు జాగ్రత్త." అని
    తను వేకువను వీడే మంచుపొగలా కదిలితే, స్థాణువై
    ఇక అతనొక్కడే అక్కడ: ఇక్కడ. ఒక శిలయై మృత్యు
     పరిచయమై, శీతలమై నీటిపై వొదిలివేసిన ప్రమిదెయై-

(ఇక ఆ తరువాత ఎన్నడూ తను రాయలేదు, అతనూ ఒక
     రాతయై తిరిగి రాలేదు: చీకట్లో వెలుగుతోంది ఒక తెల్లని
     దీపం, అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే, తెల్లని వస్త్రం
     కప్పిన - ఎవరో తెలియని- శిరస్సు వద్ద, సమాధుల వద్ద

    స్మృతి పూలతో, దూరమై రోదనై కొనసాగే
    రంపపు కోత సవ్వడై:ఇక నేనేం చెప్పను?
    ఇక నేనేం రాయను?)                             

07 December 2012

పిచ్చుకలు

ఉదయాన్నే, లేత కాంతిలో పచ్చని పొలమై నువ్వుంటావ్

ఇక నువ్వు రాల్చే వడ్ల గింజలకై
ఎగిరొస్తాయి పిచ్చుకలు అప్పుడు

ఇక నీపై, నీకు ఇరువైపులా మరి అలల్లాడే వాటి రెక్కలు

దూరంగా గట్టుపై, బద్ధకంగా
వొళ్ళు విరుచుకునేఆ పొద్దు
తిరుగుడు పూలను చూస్తో

మరి గజ్జెలతో, తలపై మూటతో, నుదుటన ఉదయించే
ఎర్రని సూర్య బింబంతో 
రాత్రి చుక్కల నవ్వుతో

ఎవరికీ చెప్పలేని చీకటి వేళల కథల మసక గుసగుసలతో
పొలం వెంటా, గట్టు వెంటా
నీళ్ళ వెంటా, నీడల వెంటా
సాగుతుంది ఓ అమ్మాయి

ముడిచిన తన కొప్పులో ఎవరినో ఒకరిని దోపుకునేందుకు-

సరిగ్గా అప్పుడే, ఎవరో పరచిన వలలోనో
చిక్కుకున్న నిన్ను చప్పున అందుకుని
రివ్వున లేపుకు పోతాయి

వడ్లగింజలకై, నీ పచ్చని పొలంలో వాలిన ఆనాటి పిచ్చుకలు! 

05 December 2012

శూన్యం

కిటికీ అంచున కళ్ళను ఉంచుతాను. నెత్తురంటిన తామర పూవుల్లా
    విచ్చుకున్న కళ్ళను, ఉదయమంతా కరకు కాంతికీ, ఇసుక గాలికీ
     కోసుకుపోయిన కళ్ళనూ, మరి మాడిపోయిన కనురెప్పలనూ

కిటికీ అంచున ఉంచుకుంటాను, చీకటి చెమ్మకీ రాత్రి సుర్మాకీనూ
     ఇంత తడి తాకి, కళ్ళు మొలకెత్తవచ్చుననీ, ఇంత తేమ సోకి
     మాడిన కనురెప్పలు ఆరి, కలత అంటిన కనులలోకి మరి

తల్లి పాల వంటి నిదుర చినుకులు రాలవచ్చుననీ, అర్ధించే దోసిళ్ళ వలే
     కళ్ళను చాపి ఒక్కడినే మనిషంత కిటికీ ముందు, గదంత రాత్రి ముందు
    మరి ఎవరో ఒక వాయిద్యకారుడు మరచిపోయిన, వేణువంతటి నా

శరీరం ముందూ నన్ను నేనే ఉంచుకుంటాను, ఒక్కడినే

అరచేతులలో దాగేందుకు అలసి మోకరిల్లిన శిరస్సు, ఇక బరువుగా
    ధరిత్రి అంత భారంతో ఒక నల్లటి ఒంటరితనంతో, ఒడలు జలదరించే
    అంతం లేని ఒక మహాశూన్యంలోకి రాలిపోయే వేళల్లో, నాకు నేనే

ఒక్కడినే - నాకు నేను లేక - ఈ కిటికీ అంచున తెగిన పాదాలతో.
 
మరి ధూళి నిండిన ఈ చీకటిలో, చేతివేళ్ళతో నను అందుకుని
నెత్తురో, వెన్నలో ఉబికే నీ పెదాలతో
నన్ను ఊదేందుకు వస్తావా నువ్వు?                             

03 December 2012

ఒక సాయంత్రం, ఎలా అంటే

కడు జాగ్రత్తగా దాచుకుంటావు, ఉదయం నుంచీ ఒక పూవుని
     ఒక రహదారి పక్కగా ఈ నగరంలో ఒక ఆశ్చర్యంలా ఎదురుపడిన
    నీకు పేరు కూడా తెలియని ఆ పూవుని. ఉంచుకుంటావు మరి
     దానిని పదిలంగా, చలికి వేసుకున్న కోటు మాటున

నీ హృదయానికి దగ్గరగా, ఆప్తంగా, తనకి ఇద్దామనీ మరెన్నో
చెబుదామనీ, చెప్పుకుందామనీ. అందుకే, ఇక సాయంత్రం

ఆ ఉద్యానవనంలో రాలతాయి తన కనురెప్పలు అశ్రువులతో
అచ్చంగా గాలి లేక వడలి, నీ అరచేయి తాకగానే
కొటులోనే విడివడి రాలిపోయిన పూరేకుల వలే-    

ఎలా చెప్పడం?

పొరలు, పొరలుగా - చెక్కులు చెక్కులుగా
     అంతే నింపాదిగా అంతే ఓపికగా, నుదుటన 
     వాలిన శిరోజాలను వెనక్కి తోసుకుని తిరిగి 
మళ్ళా 
పొరలు, పొరలుగా - చెక్కులు చెక్కులుగా 
     నీ హృదయాన్ని తవ్వుతారు ఎవరో, ఒక పారతో.
     ఇక నీకూ తెలియదు, వారికీ తెలియదు

తవ్విన భూమిలో, ఒక విత్తనమే నాటతారో
ఒక పూల మొక్కనే ఉంచుతారో , లేక 
నిన్నే పూడ్చి మట్టిని కప్పి వెళ్లిపోతారో.

'ఉన్నావా, లేవా? ఇంతకూ ఎలా ఉన్నావు?' అని
మళ్ళా వాళ్ళే అడిగితే
అపుడే ఎలా చెప్పడం? 

ప్రేమ

చీకట్లో ఒక దీపాన్ని వెలిగించుకుని తనూ, తనలో ఒక
     మధుపాత్రని వెలిగించుకుని అతనూ - కూర్చునారు ఇద్దరూ
     రాత్రికీ బల్లకీ అటూ ఇటూ. పుప్పొడి లాంటి గాలీ, గాలి లాంటి

చీకటిలో. మరి తన శరీరంపై ఆకాశంలోని చుక్కలూ, మసక
     వెన్నెలానూ. నువ్వు తరచి చూడగలిగితే గూళ్ళు
     కట్టుకున్న పక్షులూ కనిపిస్తాయి:
     అవే, గూళ్ళు లేని, ఆ పిచ్చుకలు.

ఇక తనకి ఇప్పుడూ పెద్ద ప్రేమా లేదు
అలా అని ద్వేషమూ లేదు. ఇంతకు ముందు తను
నింపాదిగా వెలిగించిందే ఒక దీపాన్నీ

అంతే నిర్లిప్తంగా చూస్తుంది లోకాన్ని. ఇక ఒక రహస్య
     హస్తంచే స్పృశించబడి అడుగుతాడు అతను:
     'ఎందుకు ప్రేమించవు, నువ్వు నన్ను?
      మునుపటిలా ఉండటం లేదు నువ్వు'

కనిపించీ కనిపించని ఒక సన్నటి నవ్వు తన పెదాలపై-
     అదే, కిటికీలోంచి వీచే చల్లటి రాత్రికీ గాలికీ
     కుంచించుకుపోయే సన్నటి నిప్పు నవ్వు
     దిగులు కలిగి దిగులైన ఒక దిగులు నవ్వు.

అందుకే ఇక చివాలున లేచిన తన కదలికలకి, తడబడి
     ఆరిపోతుంది దీపం. ఇక గదిలో అతనొక్కడే, దీపాన్ని
     వొదిలి వెళ్ళిపోయే పొగతో, రాత్రితో
     ఆ రాతి రాత్రిలో దీపారాహిత్యంతో-   

01 December 2012

సలహా

ఎదరువచ్చే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే

అడుగుతావు నువ్వు ఏమిటీ రాత్రి అని ఈ
రాత్రిని దాటడం ఎలా, అని? ఇది మాత్రమే

చెబుతాను నేను నీకు: నీ కన్నీళ్ళలో ప్రతి
బింబించిన వెన్నెల ఇక్కడిది కాదు,ప్రతిగా
ప్రతిబింబించిన దూరం

నీది ఒక్కడిదే కాదు. కళ్ళ కింద ఇసుకా, మరి
బాహువుల్లో ఒక విస్ఫోటనమై
నిన్నూ, నీ మణికట్టునూ ఒక
సర్ప కోర వంటి కత్తి అంచుకు

నెట్టే, ఆ మహా ఒంటరితనమూ నీది కాదు.
ఆగు. లేతఎరుపు గులాబీ రంగులతో నిను

తొలిసారిగా ఉచ్చరించిన ఆ లేత పెదాలనీ
నాన్నా అన్న పిలుపునీ మరవకు. మనం
మళ్ళా మరొకసారి ఎత్తుకుంటాం
            
ఈ లోకపు శిశువుని మన పొత్తిళ్ళలో
మనం మళ్ళా ఒక జోలపాట పాడతాం
మలినమంటని ఈ కాలపు పాపాయినీ.

వేచి చూడు. మరణించకు. ఓడిపోకు. ఈ
ప్రమిదెలో నూనె పోసి, వొత్తిని వెలిగించి
రెండు అరచేతులూ అడ్డం పెట్టి మంచుకీ

గాలికీ, నిప్పు ఆరిపోకుండా చూసుకునే
భాధ్యతా, ప్రేమా మరి ఇక నీదే - కన్నా-.
ఉండు. ఊరికే అలా.

కొన్నిసార్లు రాయిగా ఎదురుచూడటం తప్పేమీ కాదు. 

చివరివరకూ

నూతనమైనది ఏదంటే, ఏమీ లేదు. చూడు 
     చీకటి ప్రమిదె వెలుతురులో, ఊగుతుంది

ఈ రాత్రి వృక్షం, పురాజన్మల నీడలతో, కింద
అలసి ఒరిగిన, స్త్రీలతో పురుషులతో
అర్థనారీస్వరులతో. దిగంతాల గాలి

కంబళ్ళను కప్పుకుని వాళ్ళే, ఆకాశమంతటా
నాటి, మొలకెత్తిన చిరు నక్షత్రాలతో-
మరి అవే, తెస్తాయి చినుకుల నేలని

నల్లటి, మన శరీరాలంతటి, చెమ్మగిల్లిన మట్టిని
బొందితో మనం ఈ భూమిపైకి వెళ్లేందుకు.

రా. తగినంత స్థలం ఉంది మనకి. మనకే. 
ప్రేమించుకోవడానికైనా
మరి చంపుకోటానికైనా          
చివరివరకూ-       

పాపాయి

రహస్యంగా వెలిగిన గాలి, పూల వొత్తులను చిన్నగా కదిపినట్టు
     లేత మంటల ముద్రికలు, వెచ్చగా నీ ఛాతీపై పాపాయి తన వేళ్ళతో
     తాకినప్పుడు: ఇకీ లోకంలో నువ్వు అడుగిడగలిగే ఒక స్వర్గలోకం

అంటూ ఉంటే, నువ్వు తాకగలిగే
నిండా విరబూసిన ఓ ఆత్మవనం
అంటూ ఉంటే, శరీరానికావలగా నువ్వు చూడగలిగే కాంతి ప్రకంపనలు

అంటూ ఉంటే, చిగురాకుల భాషా, జనన
మరణాల రహస్య లిపి నువ్వు
చదవగలిగితే, వినగలిగితే...-

చూడు, అది ఇదే. కన్నీళ్ళతో చిప్పిల్లి
నవ్వుతున్న పాపాయి పెదాలపై ఒక

మహా వినమ్రతతో మోకరిల్లిన, అనాధ పిల్లలనుకున్న నీ అశ్రువులు-          

ఎలా?

ఆకాశాన్నంటే నల్లటి రెక్కలు మొలుచుకు వచ్చి
     తలను వంచి, నీ రెండు చేతులతో, రెక్కలతో
     నిస్సహాయంగా మోకాళ్ళ మధ్య తలను దాచుకున్న మనిషిని

కమ్ముకుంటావు నువ్వు. అప్పుడు అతని తల కింది భూమి
     ఒక సప్తరంగుల శ్వేత వృత్త సమాధి. పరదాలు
     పరదాలుగా వీచే కాంతి రేణువులలో ఈ విశ్వం
 
అంతం లేని పూబంతుల చుట్టూ తిరిగే తుమ్మెదల
     ఝుంకారం. సర్వత్రా చీకటి వలలు మెలికెలు తిరిగే శక్తి సర్పాల
     ఆదిమ నాదం, ప్రణయం, ప్రళయం: అంతటా అంతం అయ్యి

మొదలూ చివరా అయ్యి మిగిలిపోయే, ఒక నువ్వూ
     ఒక నేనూ, ఎవరూ కానీ, ఎవరూ లేని ఒక చైతన్యం. ఇక్కడే
     ఒక ప్రాచీన జనన, మరణ నీటి బుడగల పరిమళం.

ఇంతటి రహస్య గర్భంలో, ఒడలు జలదరించే ఇంతటి
     బుద్బుధ మహా సౌందర్యంలో, సృష్టిని కలగన్నఅలసటతో
పొటమరించిన  ఒక దైవిక అశ్రువులో నన్ను

ఒక్కడినే వదిలివేసి ఇలా, ఎలా వెళ్లిపోగలవు నువ్వు?   

నా

రాత్రి అన్నం వాసన వేస్తావు నువ్వు.

అందుకే, పూలను వెలిగించి
ఆకాశం కింద, అరచేతులైన
విస్త్రరాకుతో కూర్చుంటాను నేను, ఒక వెన్నెల ప్రమిదెని వెలిగించుకుని.
చీకటినో, చుక్కలనో వొంపు

ఈ మృణ్మయ పాత్రలోకి నా
నవపారిజాతాల దేహంలోకి.
నిదురోతాను, ఆది అంతాల- అనంతాల- దిగంబరుడైన ప్రభువునై, బానిసనై- 

పునరుజ్జీవనం

"అన్నిటికంటే మిక్కిలైనదీ, అపరమితమైనదీ అమూల్యమైనదీ
     ఇదే: పరులు నిన్ను తరిమి తరిమి, తురిమి తురిమి ఆనక
     నిన్ను శిలువ వేస్తే, ఇక ఇంటికి వచ్చిన నీకూ నీ
     పగిలిన పెదాలకూ ఎవరో నీట మునిగిన వస్త్రమైతే   
  
వదలకు ఆ చేతిని, చేజార్చకు ఆ పాత్రని." అతడు ఈ వాక్యాలు
రాస్తుండగానే, మృతప్రాయమవుతున్న ఆ పెదాలనీ ఆ దేహాన్నీ

తాకబోయిన ఆ వస్త్రాన్నీ, ఆ నీటిపాత్రనీ పూలవేళ్ళతో సన్నటి
నవ్వుతో లాక్కు వెళ్ళిపోయారెవరో. ఇక
పునరుజ్జీవనం లేదు అతనికి.ఎప్పటికీ(...)   

పావురాళ్ళు

"ఎందుకో గూ గూ అని ర్రుర్ర్ర్ ర్రూర్ర్ మని గులుగుతాయి
     నలు చదరపు అంతస్తులలో కిటికీల కింది గోడలపై
          మెరిసే చల్లటి గాలిలో ఒదిగి ముడుచుకున్న పావురాళ్ళు.

శరీరమంతా తెలియని తపన నిండిపోతుంది. మరి ఇక
     శరీరం రోమాంచితమై, అంచుల చివరన అగ్గి అంటు
          కుంటోంది. ఏదో కాంతి వెలిగి పుష్పించి, శరీరంలోంచి

బయటకి తొణుకుతోంది. తెలియటం లేదా నీకూ?" అని అడిగింది
తను. నేను లేచి, ఆ మెల్లటి తెల్లటి
చల్లటి మధ్యాహ్నం నిమ్మకాయతో

చేసిన ఆవిర్లు కక్కే తేనీరుని చేసుకుని వచ్చిన కాలంలో.ఇక మేం
ఇక మేమే తాగాం, సాయంత్రాన్ని దాటి రాత్రి దాకా
రాత్రిని దాటి చీకట్లో విరిసిన ఓ ఎర్రటి చంద్ర బింబం
దాకా - నన్ను తనూ, తనని నేనూ. ఇరువురమూ
ఇరువురమై, రెండు బూడిద రంగు పావురాళ్ళమై- 

అంతసేపూ గూళ్ళలేని ఆ పావురాళ్ళే ఇక
మా వంక ఆ సమయమంతా - నిశ్శబ్ధంగా. 

జ్వలనం

చీకట్లో కూర్చుని, తదేకంగా చూస్తాడు అతను, కిటికీకి అనుకుని
     ఓ వారగా తల వాల్చి కూర్చున్న తన వైపూ
     ఒంటరి వజ్రంలా మెరిసే తన నయనం వైపు: 
     అతనికి అప్పుడు కించిత్ ఆశ్చర్యం. 'ఏమైంది 
     తన మరో నయనం' అని. ఇక అప్పడు తను లేచి 

అతని వద్దకి వచ్చి, మెత్తగా అతనిని హత్తుకున్నప్పుడు  
అతని శరీరమంతా ఓ నయనమయ్యి, ఓ మొగలి పూల
పరిమళంలో ఆ రాత్రంతా, ఆ గదిలో ఆ గాలిలో రహస్య రెక్కల సవ్వడితో

ఒక కాగడావలే అప్రతిహతంగా జ్వలిస్తో-

అంతిమ ప్రకటన

ప్రతి ఒక్కరూ, నవ్వుతూ ఇకిలింతలతో నీ   తల వద్ద దీపం పెట్టే కాలమే ఇది జహాపనా

ఓపిక ఉన్నప్పుడే అల్లుకో ఓపికగా నీ నరాలతో ఇంతకాలం పోగేసుకుని దాచుకున్న కట్టెలను ఒక పాడెగా అవి నీ ఎముకలైనా సరే:  పర్లేదు ఇతరుల అరచేతులెన్నడూ నువ్వు అనుకున్న అద్దాలూ ప్రతిబింబాలూ కాలేదు, నెత్తురు నిండిన బావులగా తప్ప. ఇక ఎప్పుడూ ఎందుకో మరి నీ ముఖమే అందులో నీ కళ్ళంత నీటిబొట్లై జారిపడి, ఇక పెదాలు ఒక ఉప్పు వనమై మిగిలిపోయి, హృదయంలో మొలిచే ముళ్ళ చెట్లల్లో ఒక చీకటి మంచు గాలీ ఆగకుండా - ఏం చేయగలవు నువ్వు అప్పుడు? అలసటగా ముంజేతిపై ఆన్చుకున్న నుదిటిపై ఓ తీతువు రెక్కలని సర్దుకుంటూ కూస్తున్నప్పుడు? మిణుగురులేవో నక్షత్రాలేవో తెలియనప్పుడు? సరే      

తన కుత్తుకని చించుకునే తీతువు కంటే కంటే గొప్పవేమీ కావు, నువ్వు రాసుకునే పదాలు. తమకు అర్ధం కావని ఒక శ్వేతవస్త్రాన్ని కప్పి, నీ స్మృతి శిలాఫలకాన్ని ప్రతిష్టించి పవిత్రంగా వెళ్ళిపోయే ఇతరుల వాక్యాలూనూ. చూడు కమ్ముకున్న చీకట్లలో, అర విరిచిన వెన్నెలలో, ఒక స్వస్మశానం ఎదరు చూస్తుంది నీకోసం. ఇక నిన్ను నువ్వు భుజానికెత్తుకుని కదులు, రాం నామ్ సత్య హై, రాం నామ్ సత్య హై అంటో అనామకంగా అసత్యంగా

ఒట్టి నామవాచకాలుగా మారి దారికి ఇరువైపులా నిలబడి నిన్ను మౌనంగా చూసే ఈ లోకపు జనాల ప్రేతాత్మల సాక్షిగా- ఇక ఎవరు ఏమనుకుంటే నీకేం పాపం? నీకేం పుణ్యం?