28 October 2015

grace

నువ్వు వచ్చి వెళ్లిపోయావని 
తెలిసిపోతూనే ఉంటుంది: నేను భద్రతతో మూసిన కిటికీలు 
తెరచి ఉండటంలో - 

అప్పుడిక గదుల్లో 

నేలపై తార్లాటలాడే గాలిలో చెట్లు తడచిన నీ కురుల వాసన: 
పెరట్లో ఆరేసిన తువ్వాలుపై నీ దేహ దీపకాంతీ 
పొగ: ఇంకా సుదూర శబ్ధాలేవో -

ఆ కాంతిలో, ఆ పొగలో 

నువ్వు వొంపిన నీళ్ళతో తిరిగి బ్రతికిన మొక్కలూ, పూలూ 
పిట్టలూ, కీటకాలూ, చివరిగా, మన నాలుగు 
గోడలూ, నీడలూ, నేనూ -

నువ్వు వచ్చి వెళ్లిపోయావని 

తెలిసిపోతూనే ఉంటుంది: నువ్వసలు నాకేమీ చెప్పకపోయినా - 
సరిగ్గా ఎలా అంటే 

వాన వెలిసిన దారిలో  

పురాస్మృతుల్లో నడుస్తూ ఒక మనిషి, చీకట్లో చెట్లు వణికి
రాల్చిన జల్లుకి జలదరించి, సుషుప్తిలోంచి 
ఇప్పటిలోకి మేలుకున్నట్టు -        

25 October 2015

విశ్రాంతి

నా నుదుటిన 
నీ అరచేయిలా కురిసిన రాత్రి: పూరేకుల వంటి 
చల్లటి గాలి -

గూటిలో కపోతాలు  
సవ్వడి లేకుండా విశ్రమించిన రాత్రి: మెత్తని 
చీకటి శాంతి - 

ఇక 
నాకు తెలుసు 
ఇక్కడే ఎక్కడో నువ్వు, నాకు చాలా దగ్గరిగా 
దాగి ఉన్నావని. 

ఇంద్రజాలం

ఏదో వివరణ ఇచ్చుకోబోతాను నీకు
ఒక సంజాయిషీలా -

"ష్" అని పెదాలు మూసి "ఇక పడుకో"
అని నువ్వన్నప్పుడు
నాకు తెలుసు: ఇక రాత్రికి నేను తప్పక
మొగలిపూల వాసన వేసే
లేతెరుపు సీతాకోకచిలుకలని
కలగంటానని -

మరి ఇంతకూ
రాత్రిని వెదురు వనాలలోని గాలిలా మార్చి
ఇతరుల కలలోకి పంపించే
ఆ ఇంద్రజాలాన్ని

ఎవరు నేర్పారు నీకు?

24 October 2015

మొగ్గ

అంటావు ఒక మాటను నువ్వు
ఎంతో తేలికగా, నిర్లక్ష్యంగా: ఒక మొగ్గను యధాలాపంగా తుంపి పక్కకి
పడవేసి కాలితో నలిపినట్టుగా, ఏమీ తెలియనట్టుగా -

తెలియదు నీకు బహుశా ఎప్పటికీ
ఒక మొగ్గ ఎన్ని లోకాలును పూయించగలదో, ఎన్నెన్ని రంగులని అది
కనులలోకి స్వప్నసువాసనలతో వెదజల్లగలదో -

అంటావు ఒక మాటను నువ్వు
ఎంతో తేలికగా, కరకుగా: పూతొడిమలోకి నెమ్మదిగా సూది గుచ్చినట్టుగా
మహా చవకబారుగా, "ఏం చేయగలవు నువ్వు?"

అని అన్నట్టుగా, వెకిలిగా ఊసినట్టుగా
లజ్జారహితంగా, నీలోని మానసిక వైకల్యాన్ని కప్పిపెట్టుకుంటున్నట్టుగా
భయంగా, మొండిగా, మరింత అసహ్యంగా -

నువ్వన్నట్టే నిజానికి ఏం చేయగలను నేను?
వెళ్ళేపోతాను నాతో నేను, ఒక మొగ్గను గుండెకు హత్తుకుని, దాని పసి
భాషని శోకతప్త హృదయంతో వింటో, వ్రాస్తో

బదులిస్తో - నీకు దూరంగా - నాకు మరింత దగ్గరిగా నేను!

22 October 2015

వ్యక్తీకరణ

"ప్రేమ అని 
ఒక్క మాట, ఆ ఒక్క మాట ఎందుకు పలకవు నువ్వు?" అని అతనిని  
అడిగింది తను

తల ఎత్తలేదు అతను
తన చంచల నయనాలనూ తన చేతులనూ తన పాదాల వద్ద నడయాడే 
నీడల్లో చూస్తో: మరి నీడల్లో

అతను చూడని వాటిల్లో
చెమ్మ: చీకట్లో ఆకులు కొద్దిగా కదిలి, రుద్దుకుని, అతని భుజంపై వాలిన 
ఒక ముఖంపై మంచై రాలినట్టు -

"ప్రేమ: ఆ ఒక్క మాట
ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఎందుకు చెప్పవు నువ్వు?" అని అతనిని 
పట్టుకుని ఏడ్చింది తను - 

ఇక ఆ తరువాత 
మిగిలిన చీకట్లలో, వాన వెలసిన నిశ్శబ్ధంలో, సన్నగిల్లే వెక్కిళ్ళయ్యి
రాత్రంతా గోడవారగా జారే 

ఒంటరి వాన నీళ్ళు. 

ఆర్ద్రత

నువ్వేమీ మాట్లాడవు. కానీ
చీకట్లో గాలికి మల్లెపందిరి జలదరించినట్టు నా చుట్టూ ఒక సువాసన. 
ఒక భరోసా -

నేను కూడా ఏమీ మాట్లాడను
చీకట్లో మల్లెపందిరి కింద తచ్చాట్లాడీ తచ్చాట్లాడీ, ఇకక్కడే కుదురుకునే 
ఓ పిల్లిలాగా - 

మరి ఇక పదాలు ఎవరికి కావాలి
చీకట్లో - రాత్రి వంటి నా నుదుటిపై నీ చేతివేళ్ళు మల్లెపూలై, నెమ్మదిగా 
రాలి విశ్రమించాక? 

21 October 2015

అర్హత

ఇక గది అంతా 
అప్పుడే ఊడ్చిన శుభ్రతతో, ఉదయపు కాంతితో దయతో 

సర్దిన 
వాటన్నిటిలోనూ 
ఆకుపచ్చనిదనం. అలలుగా ఆకులు కదిలే సన్నటి అలికిడి. గాలి. నేలపై 
నీరు నవ్విన మెరుపు. సుగంధం. ఇష్టం ~ 

ఇక ఇల్లేమో 

ఒక గూడుగా మారి, మెడల కింద ముక్కులతో పొడుచుకుంటూ పిట్టలు
ఆ గూటిలోంచి గూడు గురించి నీకేదో విడమర్చి 
చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు ~ 

సరే. గది అంతా 

అప్పుడే ఊడ్చిన ఆనందంతో, జీవన ఉత్సాహంతో, క్షమతో 

ఇక 
మంచం దిగుతూ అతను 
ఇలా తలపోస్తాడు: "నన్ను శుభ్రపరచే రెండు చేతుల అర్హతను మరి నేను 
ఎన్నటికని సంపాదించుకోగలను?"

19 October 2015

హక్కు

ఒక చినుకంత నిద్ర
అది మాత్రమే నువ్వు అడిగినది, నీ ముఖాన్ని అలసటగా
నా ఛాతిలో కూరుకుంటూ -

రాత్రి:
ఆకులపై మెరిసే చీకటి.
ఉండుండీ వీచి నిన్నూ నన్నూ దిగ్బంధనం చేసే చల్లటి గాలి:
చెమ్మ. మట్టిపై పల్చటి కాంతి -

గుబురు కుండీల మధ్య

ఒక సన్నటి అలజడి: మన మాటల్లా, మన నిస్సహాయాతల్లా
మన కోరికల్లా. మన మూర్ఖత్వాల్లా -

ఒక చినుకంత నిద్ర
మరి అది మాత్రమేనా నువ్వు అడిగినది, నిన్ను నువ్వు నాలో 
కూరుకుంటూ?

18 October 2015

కిణ్వనం

ఎవరికీ తెలియకుండానే గడచిపోయింది 
మరొక పగలు. 

తన దరికి చేరగానే

గుబురు పూల మధ్య నుంచి ఎగిరిపోయిన 
ఒక సీతాకోకచిలుకలా. 

ఇక

దాని పాదాలు తాకిన  ఒక లేత ఆకై 
సన్నగా కంపిస్తుంది 
నీ హృదయం. 

ఎవ్వరికీ  

తెలియకుండానే గడచిపోయింది ఈవేళ 
మరొక పగలు. 

ఇక రాత్రంతా 

నువ్వు తనకి దగ్గరికి జరిగినప్పుడల్లా, నీకు 
దూరంగా మరలిపోతూ 
ఒక వర్షం. 

16 October 2015

అలాగే

అలాగే వచ్చావు నువ్వు

గది లోపలకి  
బడ బడా కొట్టుకునే కిటికీ శబ్ధాలలోంచీ, లోపలికి పడే జల్లులోంచీ
జిగురువంటి చీకటిలోకి    
మసి పట్టిన ఓ  
దీపం వద్దకు  

ఒక 
అగ్గిపుల్లను వెలిగించుకుని 
హోరున వీచే గాలికి ఆరిపోకుండా రెండు అరచేతుల మధ్య 
దానిని పదిలంగా దాచుకుని  
వెలిగించడానికి దానిని
చిన్నగా 
ఓపికగా 
ఇష్టంగా - 

మరి వెళ్ళిపోయావు అలాగే నువ్వు
గది బయటకి 

దీపపు 
అంచు దాకా వచ్చి, వెలిగించకుండా ఆగి, ఏదో తలంచి, 
అన్యమనస్కంగా ఆఖరి నిమిషంలో   
వెలిగే దానినేదో 
ఆరిపి వేసి

ఒక్క క్షణం 

అక్కడే నుల్చుని, కళ్ళు తుడుచుకుని, ఆపై వెనుదిరిగి నెమ్మదిగా
చాలా మాములుగా యధాలాపంగా  
అక్కడ నుంచి 
చీకట్లోంచి 
చీకట్లోకి - 

15 October 2015

నోట్

ఎక్కడో చూసాను నిన్ను. అది ఏ దారి?

యిక ఇప్పుడు నిన్ను గుర్తుపట్టలేను~
ఇసుకను పొద్దుతిరుగుడు పూవు సవరించే వేళల్లో
కలిసి ఉంటాను నిన్ను. అందుకే ఇప్పటికీ
నువ్వు నన్ను దాటుకుని వెళ్ళినప్పుడల్లా
నా చుట్టూతా ఒక సరస్సు విరిసిన వాసన

అందుకే ఇప్పటికీ రహదారుల్లో నిన్ను పోలిన వేనవేల మనుషులు
తాకుతుంటారు నన్ను, ఒక్కోసారి నవ్వుతుంటారు

ఎర్రటి మట్టిలో పాదు చేసి, మొక్కని నాటి నీళ్ళు పోసి
ముంజేతితో నుదిటిని తుడుచుకుంటూ, చేతివేళ్ళు
మెత్తగా దిగిన నేలను తృప్తిగా చూసుకున్నట్టు
అటువంటి రకరాకాల మనుషులలో తారసపడతావు నువ్వు
ముచ్చటగా చూసుకుంటాను నేను-

పనికట్టుకుని ద్వేషించే వాళ్ళెవరూ లేరిక్కడ
బ్రతకాలి, కిందా మీదా పడి మీదా కిందా పడి, లోహపు కాలంలో లోతు తెలియకుండా బ్రతకాలి
కాస్త ఓపిక చేసుకుని చూడు వాళ్ళ కళ్ళని ఒక్కసారి, గాజుపాత్రలవి
నువ్వు ఆర్ద్రంగా వొంపితే అనంతంగా రాలే కన్నీళ్ళూ, కథలూ అవి

అందుకే తాకి చూడు ఒక్కసారి వాళ్ళని-

ఎక్కడో చూసాను, ఎప్పుడో చూసాను నన్ను నీలో, నిన్ను నాలో-

వెళ్ళిపోకు, ఎరుకతో బ్రతికి ఉందామనే ఈ ప్రయత్నమంతా

11 October 2015

పంజరం

ఎగిరిపోదామనే అనుకున్నాను, స్వేఛ్చగా  
దూరంగా - 

మరి తెలీలేదు నాకు ఇన్నాళ్ళూ 

నా రెక్కలు 
నీ హృదయానికి కట్టివేయబడి ఉన్నాయనీ 
నన్నే పొదుపుకుని
అవే శ్వాసగా, నువ్వు జీవిస్తున్నావనీ -

తెలుస్తూ ఉంది మరి నాకు  

ఇప్పుడిప్పుడే 
నేను ఇంకా నీకు కట్టుబడి ఉన్నాననీ
అప్పుడే నిన్ను విడిచి 
నేను వెళ్ళలేననీ

ఈ గూడు ఏదో 

నీ నుంచి నాకూ నా నుంచి నీకూ
అనుసంధానమౌతూ   
అల్లబడుతుందనీ
అలా మాత్రమే అది నిలబడగలదనీ 
లోకాన్ని పొదగగలదనీ 
సాకగలదనీ -

ఎగిరిపోదామనే అనుకున్నాను

తెలియక ఇన్నాళ్ళూ 
స్వేచ్ఛ అంటే 
నా వద్దకు నేను తిరిగి రావడమనీ 
నన్ను నేను
పూర్తిగా నీలో కోల్పోవడమేననీ-

ధన్యవాదాలు. 

08 October 2015

పొంతన లేని

1
రాత్రిలో ఒక చెట్టు ఏదో మంచులో కూరుకుపోయినట్టు
భుజాలు వేలాడేసి, అడుగుతాడు అతను:
"ఇద్దరి మధ్యా ఇలా ఎన్నడూ లేదు. మరి ఇది నా ఒక్కడి తప్పేనా?"

తను తల తిప్పి చూసిన చోట - చెమ్మని రాల్చుతూ ఆకులు-

ఎండిపోయిన పుల్లలూ
విరుగుతున్న కొమ్మలు.
2
'తన జూకాల వలే
కదులుతాయి నీ పగళ్ళూ, రాత్రుళ్ళూ
తన కనురెప్పల వలే కొట్టుకులాడతాయి నీ అనిశ్చిత క్షణాలు-

నిరంతరం నిను వెంటాడే తన నయనాలలో

ఒకటేమో జ్వలించే సూర్యబింబం, మరొకటేమో కొలనులో చలించే
చంద్రబింబం. ఇక  తన చేతులేమో

సంధ్యారుణిమలో

నీ జీవితాన్ని తమ పరిమళపు అలలపై తీసుకువెళ్ళే
రెండు అమృతపు నావలు.'

ఇలా రాసి అతను ఆగిపోతాడు -

3

నేలపై చలించే నీడల్లో, ఒక్కత్తే తను -


చెట్టు కింద చెమ్మతో పాటు రాలిన

ఆకులనూ, ఎండిపోయిన పుల్లలనూ వంగి ఊడుస్తూ ఉంటే
ఏడో నెల కడుపు ఒత్తుకుపోయి నొప్పెడుతోంది -

కింది పెదవిని పంటితో నొక్కి పెట్టి

దుమ్మునీ ధూళినీ, అతను ఏడ్చిన పదాలనీ ఎత్తిపోస్తుంది -
'కవులు ఎన్నడూ స్త్రీలు కాలేరు' అని తను అనుకున్న క్షణాన

"అమ్మా, ఆకలేస్తుంది

ఏమైనా పెట్టావా" అని, తన వెనుకగా ఒక నాలుగేళ్ల పిల్లవాడు -
సరిగ్గా అప్పుడే
4
'కాలం కంపించే క్షణాలలో
మూగవాని చేతిలోని పిల్లన గ్రోవివి నువ్వు. రాత్రుళ్ళలో, నా నిదురలో
నేను వినే ఒక నదీ ప్రవాహం నువ్వు - నీళ్ళ ఒరవడికి
దొర్లే సన్నటి పాలరాళ్ళ సవ్వడివి నీవు.

నీ మేలుకువలోని నిదురను నేను

నా నిదురలోని మెలుకువ నువ్వు -
నువ్వు జన్మించినప్పుడు, నేను మరణిస్తాను. నా మరణంతో, నాలో
కొనసాగుతావు నువ్వు -' ఇలా వ్రాసి

ఈ కాగితపు అంచున, నిండు గర్భంతో తను

ఒక పిల్లవానికి అన్నం తినిపించి వేచి చూస్తుండగా
అతను ఆగక, వెళ్ళిపోతాడు.
5.
ఒక దీపం రాత్రంతా, చీకటి ప్రశాంతతతో -

కడుపుపై ఒక చేయీ, పక్కన పిల్లవాడిపై ఒక చేయీ

తో తను - ఆయాసంతో శ్వాస ఎగబీల్చినట్టు కిటికీలోంచి గాలి.
కనుల కింది ఖాళీ లోయల్లో చేరి ఊరే చెమ్మ వలే
గోడలపై వంటరి నీడలు. పగిలిన బొమ్మలు -

ఊగుతూ, ఊగుతూ, ఊయలవలే ఊగుతూ ఊగుతూ

ఆకస్మికంగా తెగిన తాడు వలే జీవితం. ఇక
ఒక అరచేయి మాత్రం వడలి, వడలి, భుజంపై
తల వంచిన పిల్లవాని శిరస్సు కింద కమిలి -

అమ్మా, ఒక కథ చెప్పవా  అని అడిగితే, ఆ పిల్లవానికీ

కడుపులో కదిలే శిశువుకీ
ఏమని చెప్పగలదు తను-?
6
రాత్రిలో, ఒక చెట్టు కింది మంచులో, చీకటిలో, చీకటితో ఒక కవి -
అటు పిల్లవానిలా కాలేక, తనలా మారలేక
రాసిన కాగితాన్ని చించి ముక్కలు ముక్కలు చేసి
ఆకాశంలోకి విసిరేస్తాడు అతను -

" పదాలు అర్థారాహిత్యాలు -

తనకీ, తన శరీరానికీ, శరీరంలోని ఒక శిశువు కలకీ
ప్రత్యామ్నాయంగా ఏవి నిలవగలవు?
ఇవన్నీ బూడిదలో మెరిసే నిప్పు కణికెలు" ఆని
అతను వెనుదిరిగి వస్తూ ఉండగా 
7
రాత్రిలో, చీకటింట ఒంటరి దీపంతో
ఆ ఖండిత వలయ కాంతిలో సాంధ్యచ్చాయతో తను - మంచంపై
నిదురోతూ ఒక కవిత, ఒడిలో పాలు తాగుతూ
జోలపాటతో  ఊగుతూ మరొక కవిత -

ఇక ఒక పూల కొమ్మ ఏదో మంచులో కూరుకుపోయినట్టు

అతనిని గట్టిగా పట్టుకుని , భుజాలు వేలాడేసి
గుమ్మం వద్దే వొణుకుతూ, బెక్కుతూ అడుగుతుంది తను ఇలా -

"ఇద్దరి మధ్యా ఇలా ఎన్నడూ జరగలేదు.

మరి ఇది నా ఒక్కదాని తప్పేనా?"

06 October 2015

a very sentimental poem

1
చీకటిలో 
నువ్వు దీపం వెలిగించినప్పుడు నేను లేను కానీ 
కొద్దిగా రెక్కలు విప్పిన 
తెల్లని పావురంలా మారిన మన గూటిని నేను 
ఊహించగలను 
2  
నేను 
వచ్చేటప్పటికి నువ్వు ఉండవని నాకు తెలుసు 
నీకూ తెలుసు -
అయినా 
వెలిగించి వెళ్ళడంలోనే నాపై నీ ఇష్టం దాగి ఉందనీ  
అదే జీవన సూత్రమనీ 
అదే నీ ఇంద్రజాలమనీ 
ఎందరికి 
తెలుసు?
3
నేను 
వచ్చేటప్పటికి నువ్వు లేవు: నువ్వు వెలిగించి ఉంచిన
కాంతి వలయంలో  
నీ
శరీర సుగంధం. సన్నగా చలిస్తూ కదిలే సెగలో నీ 
పసుపు పచ్చని ముఖం - 
వండి ఉంచిన 
పాత్రలో 
మెతుకుల్లాంటి నీ మాటలు. బల్లపై ఉంచిన 
మంచి నీళ్ళ గాజు పాత్రలో 
నీ మౌనం -   
తెరచిన 
కిటికీలలోంచి చల్లటి రాత్రి గాలి. ఇక ఎప్పటిదో మరి 
నీ సన్నటి నవ్వు 
ఇప్పుడు 
ఇక్కడ 
చీకటిలో మిణుగురై మెరుస్తోంది - 
4
చీకటిలో 
నువ్వు దీపం వెలిగించినప్పుడు నేను లేను కానీ 
కొద్దిగా 
బెంగటిల్లి 
రెక్కలు నిక్కబొడుచుకుని ఉర్ర్ ఉర్ర్ మంటూ 
గూట్లో 
అక్కడక్కడే 
మెసిలే ఊదా రంగు పావురంలా నేను: తోడుగా 
ఈ అక్షరాలూ -
అది సరే కానీ 
5
మరి 
నువ్వు తిరిగి వచ్చేదాకా, వచ్చి తాకి శ్వాస అందించేదాకా  
మేమంతా 
ఏం చేయాలో
ఎలా ఎదురు చూడాలో చెప్పడం 
ఎలా మరచిపోయావు 
నువ్వు?