30 September 2013

నా చిన్న లోకం

- ఇవే చెట్లు. వాటి ముందు కూర్చుంటాను, పెద్దగా చేసేది ఏమీ లేక -

ఇదొక చిన్న లోకం. నా చిన్న లోకం -

అప్పుడప్పుడూ నేను బ్రతికి ఉండటానికి కారణం ఇవే: చల్లటి నీడలు
పూవులై ఊగుతూ తూగుతూ గాలితో

ఊయలలూగే లోకం. ఏమీ ఉండదు

ఇక్కడ.ఇటు చూడు - కనురెప్పల
వలే చలించే ఆకులు. పరదాల వలే
వీచే కాంతి. మట్టిలో ఆడుకునే పిల్లలూ, మట్టి అంటని, పడి లేచే వాళ్ళ అరుపులూ -

ఎవరో వస్తుంటారు. ఎవరో నిన్ను

తాకి, నవ్వుతో వెడుతుంటారు -
నుదిటిపై ఉంచిన ఒక అరచేతి పసుపు వాసనేదో కూడా అప్పుడు నీలో - ఒకరి
ముఖంలో ముఖం ముంచి

పరిశుభ్రం చేసుకున్నప్పటి 

విరామమూ, శాంతీ: మరి
నమ్ముతావా ఇప్పుడయినా
మనుషుల్లో తోటలూ, తోటల్లో మనుషులూ ఉంటారంటే? ఆహ్ ఏమీ లేదు

ఒక మధ్యాహ్నం. ఒక గూడు -

ముడుచుకున్న రెక్కల్లోని
గోరువెచ్చని నిద్ర. కొమ్మల్లో
మిలమిలా మెరిసే ఆకాశం-
మెల్లిగా మబ్బులు కమ్ముకుని, చిన్నగా చెట్లు వీచి, గడ్డి ఊగిపోతే, తెరుచుకోబోయే

వాన తలుపుల ముందు

నువ్వూ, నేనూ, తనూ -
ఉఫ్ఫ్. ఇక అడగకండి నన్ను ఇప్పుడైనా,దివ్యాత్మ సత్యాల గురించీ వాస్తవాల గురించీ-

చూడండి: ఒక చిన్ని చినుకు


మట్టిని తాకి, వేల పూవులై చిట్లి 
ఎలా వొళ్ళు విరుచుకుంటుందో! 

29 September 2013

ఇది

- రాత్రిలోకి తొంగి చూస్తే, నక్షత్రాలకు పూసిన 
ఓ చందమామ కనిపిస్తుందని 
వచ్చావా, ఇక్కడికి-?  

మరి,చూడు ఇక్కడ 

వొంగిన తల తెగి, ఎవరి కన్నీళ్ళలోనో రాలిపడితే
చివరికి 

నెత్తురంటిన, నువ్వు అంటిన,నువ్వు అంటుకున్న  

ఆ చేతులేవరివో తెలియదు,లోతు అందని  
బావులయ్యింది ఎవరో తెలియదు
చివరికి 

మిగిలింది, వెళ్లిపోయింది కూడా ఎవరో తెలియదు -

ఇక మళ్ళా వస్తావా,ఎపుడైనా ఇటువైపు 

ఆత్మహత్యించుకుని
తిరిగి జన్మించే ఈ 

శ్వేత నలుపు రాత్రుళ్ళ కనుల వైపు? 
నేరాపరాధన లేని, మోపని 
ఈ ప్రేమల వైపూ? 

28 September 2013

నిస్సహాయత

చెట్టు మొదట్లో వాలిపోయిన పసి ఆకు ఉన్నటుండీ చలించి,వొణికిపోతుంది-

ఎగరలేదు. కొమ్మల్లో రెక్కలు విదిల్చే 
పక్షిని చూడలేదు. ఎగరాలేదు -

చీకటి వంటి దట్టమైన నీడల్ని కప్పుకుని 
దాని కింద మూలిగే ఈ లేత ఆకు 
మా మాటల్ని వినలేదు, తన తల్లి 
కళ్ళలోని నీటిని తాకనూ లేదు - 

వడలిపోయిన, పిగిలిపోయిన, కమిలిపోయిన 
ఒక చిన్న శరీరం ఈ ఆకుది 
ఆ అమ్మదీ, ఆ నాన్నదీ 
ఈ చిన్ని అద్దె ఇంటిదీనూ - 

ఏం లేదు: అరచేతుల మధ్య దీపం ఆరకుండా 
రెండు అరచేతులై కూర్చున్న 
ఆ ఇద్దరి పరీక్షా దినమే ఇది- 

చూడూ,ఇది నిజం:
పూలతో ఖండింపబడ్డ, ఖడ్గక్షణాలు ఇవి-
ఇక ఏం చేయగలం 
నువ్వూ, నేనూ-?   

23 September 2013

- అప్పుడు -

"-You don't know- and you will never know-

There is a wound here -
A wound - as large as a shadow
A wound - as large as this earth, that 
No one can ever dig
A wound - as large as this 
Fucking, sucking, breathing 
Universe 

Do you know that? Do you know that?
A wound. The wound. A wound
That never heals?-" 

తన యోని వైపు చూయిస్తూ తను అడిగింది నన్ను- 

అది రాత్రి. అందుకని నేను తనకి 
ఇలా పెద్దగా చదివి వినిపించాను-:

Your hand full of hours, you came to me - and I said:
Your hair is not brown.
So you lifted it lightly on to the scales of grief;
     it weighed more than I...*

అప్పుడు తను చిన్నగా రోదించింది. అప్పుడు చీకట్లలోకి  
నెమ్మదిగా ఒక ప్రమిదె కనుమరుగయ్యింది
ఆ నిద్రిత ఛాయల్లో ఒక గూడు చెదిరింది-

"Can't nymphomaniacs love? Can't nymphomaniacs have
Lives? Why is that I have not been 
Written in your his/stories-?"

అని రాత్రి నన్ను అడిగింది. ఇకప్పుడు నేను 
ఒక తెల్లని శాంతి కిరణం వంటి తువ్వాలుని 
బ్లేడు కోతతో ఎర్రనయ్యిన తన గూటిపై ఉంచగా 

అక్కడ,అప్పుడు,ఆ చోట 

రెండు వక్షోజాలూ రెండు నిలువెత్తు అశ్రువులై
వడలిన పూవులై నేల రాలిన చోట,ఒక పాప
నను హత్తుకుని వెక్కిళ్ళతో నిదురోయింది-తన 

శిరోజాలలోంచి యుగాల నెత్తురు వాసన నన్ను 
పొగ చూరిన చేతుల వలే అల్లుకుంది - And
then  

It rained and 
Rained and 
Rained

All night long. 

మరి విన్నావా నువ్వు 

నీ నిద్దురలో నీ పక్కగా ప్రవహించిన, ఆ నీటి చప్పుడు? 

అ ప్పు డు?
-----------------------
* lines by Paul Celan-

21 September 2013

ఎలా?

నాకేమో తలుపులో, కిటీకీలూ బార్ల తెరిచి కూర్చోవాలని ఉంటుంది -

నిలువునా చీల్చే ఎండనైనా కానీ, రెపరెపలాడే ఊబి వంటి
చీకటినైనా కానీ లోపలి రానివ్వాలనే ఉంటుంది
మరి మీరేమో ఎప్పుడూ వెన్నెలనో వాననో కోరుకుంటారు
తలుపులు తెరిచి కూర్చోవాలంటే, మరి మీరేమో
సాంధ్య సమీరాలో, గాలికి లలితంగా ఊగే లతలో

ఒద్దికగా, అలా మీ ఎదురుగా కుదురుగా ఉండాలని ఆశిస్తారు.

మరి ఇక నేనంటారా:ఒట్టి అనాకారినీ, ఆటవికుడనీ -
ఎవరూ రాకపోయినా, ఎప్పటికీ రారు అని తెలిసినా
తలుపులు తెరిచి ఎదురు చూడటమే బావుంటుందనీ
తెరచిన తలుపులకు అవతల ఉండే నిశ్శబ్దాన్నీ, రాలి
పోయిన, రెక్కలు విరిగిపోయిన పావురాళ్ళని వినడం

కూడా ఇక్కడ నివశించడంలో భాగమనీ అంటాను -

ఈ సుదీర్ఘ రాత్రుళ్ళల్లో ఎవరో మనల్ని తలచ వచ్చుననీ
వాళ్ళ పిలుపులనీ ఆక్రందనలనీ రోదనలనీ సంతోషాలనీ
ఆహ్వానించేందుకు తలుపులు తెరిచి వేచి చూడటం
మన ధర్మమనీ అంటాను. మరి మీరేమో ఎప్పుడూ
ఎవరో ఒకరు పుష్పగుచ్చాలతో రావాలనీ,ఎప్పుడూ
ప్రేమ గురించే మాట్లాడాలనీ అంటారు:ఇకేం చెప్పను-

తలుపులు ఒక వైపు. మీరు ఒకవైపు. నేను మరోవైపు-

పోనీ ఈ ఒక్క విషయం చెప్పండి. తలుపులు అయితే తెరవగలను
అన్నింటినీ నిర్భంధం లేకుండా రమ్మనీ పిలవగలను.
మరి మిమ్మల్నీ,ఈ మనుషులనీ బార్లా తెరవడమెలా?

తెరిచి, తలుపులకు అవతలి వైపున్న వాటిని చూపించడం ఎలా?  

16 September 2013

- fake -

ప్రారంభం: ముందుగా 
1
I will fake
A few lines.
2
పూలల్లో వాన వాసన: నీటి నీడలని అల్లి 
నేలపై పరిచారు ఎవరో-
అల్లుకుపోతాయి
నీ పాదాలని
పసిపిల్లలై ఈ 

మట్టీ, చినుకులూ, ఆకులూ- 
మరి, అప్పుడే నీకు 
స్ఫురణకు వచ్చే 
ఎవరిదో ముఖం 

చల్లటి  చేతులు కూడా - 
3
తెలుసు నాకు

ఆ  సీతాకోకచిలుకలు ఏ కొమ్మపై కూడా  
క్షణకాలం ఆగలేవని -
అవి వర్షానికి నింగికి 
ఎగిసిన నీ కళ్ళనీ- 
చలించే చిగురాకులనీ 
కానీ 
4
ఒక మృగం 
గులాబీ రెమ్మల మాటున తల దాచుకోవడం ఎలా?

తెలియవు మరి దానికి 
వెన్నెలా, పూవులూ, పరిమళాల అమలిన ప్రేమలూ -
కావాలి దానికి 
నీ అంత వాన
నీతో పూర్తిగా- 

అంతం కాని ఆకలీ 
ఒక రక్తపిపాసీ అది -
5
తెలుసా నీకు అది?

నెత్తురు వాసన వేసే, నిన్ను పీల్చి పిప్పి చేసే 
కోరిక నిండిన ఈ  
ఆదిమ అజగరం?

ప్రేమించగలవా 
రమించగలవా 
దానిని, పసి పిల్లల కౌగిలి వంటి ఆ తొలి పాపాన్ని?
6
ఆహ్: Don't worry

See, how well 
have I faked-!
See, how well
have I just 
written
A poem

My
No One
Noem-
7
ఆmen - 
*
PS: 
Don't worry 
About this or
About that-

Don't you know that
(All poetry is fake)?  

10 September 2013

ఒక మధ్యాహ్నం

ఇలా రాస్తాను ముందుగా: ఈ మధ్యాహ్నం,రెపరెపలాడే ఒక తెలుపు వస్త్రం -

నువ్వు పరాకుగా ఒంటరిగా సంచరిస్తున్నప్పుడు, నీ ఇంటి పెరట్లోనో
     రద్దీ వీధులలోనో ఒక హస్తం నిన్ను తాకి వెళ్లి పోతుంది.అప్పుడే ఉతికి
ఆరవేసిన వస్త్రం గాలికి కదిలి ఇంత తడిని నీ ముఖాన చిమ్మినట్టు-
   
మరి అప్పుడు ఉలిక్కిపడి చూస్తావు, నీ లోకాల లోంచి బయటకు వచ్చి
     ఆకుపచ్చని చెట్ల కింది నీడలనీ,ఎక్కడో కూసే పక్షులనీ,ప్రవహించే గాలినీ-
ఎవరో అలికినట్టు ఉన్న ప్రపంచాన్నీ, కారణం ఏమీ లేకుండా నవ్వుతున్న
   
పసిపిల్లల వంటి మనుషులనీ,పూవుల్లా విచ్చుకునే వాళ్ళ మాటలనీ. మరి
   
ఇంతకాలమూ ఇంత కాంతీ ఇంత శాంతీ ఎందుకు కనపడలేదా అని నువ్వు 
     అబ్బురపడుతుంటే, మబ్బులు చుట్టుకుంటున్న ఆకాశం కింద
తీగలపైనుంచి దుస్తులను తొలగిస్తూ ఆ అమ్మాయి అంటుంది కదా
 
"గాలికి ఆగడం లేదు ఆ తెల్లటి దుప్పటి - కాస్త తొలగించి లోపలి తీసుకు వద్దూ-"
      అని. మరే:ఇక నువ్వు చక్కగా మధ్యాహ్నాన్ని మడత పెట్టి,బుద్ధిగా
తన వెనుకగా లోపలి వెడతావు ఇలా వ్రాసుకుంటో:

- ఈ మధ్యాహ్నం -రెపరెపలాడని ఒక తెలుపు వస్త్రం కింద ఒదిగిన-ఒకమ్మాయీ 
     ఇంకా నిండైన తన శరీర దీపమూనూ. ఇక బయట పడటం ఎలా 
ఇక్కడ నుంచి? ఈ వాన లోకాలలోంచీ, తన పరిమళ కాలాలలోంచీ? 
               ఈ ఎర్రని మబ్బులలోంచీ? 

05 September 2013

- అవ్యాకరణ ఆత్మ -

(You:Break the disc.Is it an order? Order 
Of the world?Know
I'll never know -
You)

నెలవంక అంచున, నీ మొనన ఒక నెత్తురు చుక్క - అప్పుడు 

నీ బాహువుల్లో దాగిన తోడేలు నీలి పూల వాసన వేస్తుంది. రాత్రంతా మ్రోగే ఊళలలో నీ నామం. నీ నామ స్మ/రణం. ఎడతెరిపిగా కోరుకున్న మ/రణం రెండు శరీరాల సరిహద్దుల వద్ధ దాకా వచ్చి ఆగినట్టు అదొక నీలి విన్యాసం. నిప్పు- మరి పూల గుత్తుల వల వేలాడే ఆకాశంలో, జూకాల కిందుగా జారే వెన్నెల వానలో నదిలో చ్చీకటి మొప్పల కాంతి చేపలని వేటాడే భల్లూకం: నువ్వు ఆడుకునే ఒక మొసలీ మరి నువ్వు ప్రార్ధించే దైవం కూడానూ: తెలియదు నీకు ఈ అంగాల మధ్య ఇన్నేళ్ళుగా ఎన్ని ఆలయాలో, ఈ దంతాల కింద దాగిన ఎన్ని ఆక్రందనలో: కానీ

Kill the parrot                (Open your mouth)
Break the disc                 (Write your word-)
And then, and

then, you open your legs and say - hey: 
Hallelujah,I say 
Hey, hallelujah

ఇక్కడంతా, విత్తనాన్ని చీల్చుకుని, మట్టిని దొలుచుకుని వొస్తున్న చిగురాకు సవ్వడి చిగురాకుపై మంచు చేరుకునే సవ్వడిమంచుని తాకి తొలి కిరణం కరిగిపోతున్న సవ్వడి-కిరణం వృత్తమై ఏ నీటి వాగుల్లోనో ప్రతిబింబించే సవ్వడీ: వెనువెంటనే పెదాలను వీడిన ఒక వేణువు ఆగిన ఒక నిశ్శబ్ధమూ- మరి మ్మరి మ్మరీ మ్రుమ్మారు 

Shall we kiss and Love now and not Forever? And never

(ఏమంటావ్ నువ్వు, గుహలు లేని, అరణ్యాలు లేని తోడేళ్ళతో, ఈ రాత్రి కొండ చరియలతో, చిలువులతో?) 

02 September 2013

- నయన గీతం II -

చిగురాకులు మొలచిన నీ కళ్ళు 

ఎగిరిపోతాయి సీతాకోకచిలుకలై 
నా ముందు నుంచి: ఎవరు ఆపగలరీ గాలినీ 
కురవబోయే వాననీ,మన నీడలు 
ముడుచుకునే సాయంకాలాలనీ?

చూడూ 
నల్లటి మట్టితో వేచే పాదులు ఈ అరచేతులు- 
ఇంకా, మరి కొంతసేపు ఆగితే 
మొక్కను వెదుక్కుంటూ సాగే 
ఒక వేరు మొలుస్తుంది ఇక్కడ-

మరి చూసావా నువ్వు 

ఒళ్లంతా వేర్లు మొలిచి, నేలకై వెదుక్కునే 

ఒక దారీ తెన్నూ లేని 
మనిషిని ఎన్నడైనా-?  

నయన గీతం

సముద్రం ఒడ్డున, ఒక రోజు నాకు దొరికిన
రెండు చిన్ని గవ్వలు:
నీ కళ్ళు

అదే రోజు నేను చూసిన, అప్పుడే పుట్టిన
కళ్ళు తెరవని తేనె పిట్టలు: 
నీ కళ్ళు

అప్పుడే పూసిన పూవులూ, చెట్ల బెరడులపై
బిరబిరా తిరుగాడే ఉడతలూ:
నీ కళ్ళు

మబ్బులు పట్టిన కాలంలో, లేత ఆకుపచ్చ
కాంతిలో మెరిసిపోయే తోటలు:
నీ కళ్ళు

చెబితే నమ్మవు కానీ, నువ్వు కనురెప్పలు
తెరచినప్పుడు వీచిన
వాన వాసన ఇక్కడ

ఇప్పటికీ ఒక పొగమంచుతో - ఇక 

ఈ రోజును దాటేందుకు,నాకు దొరికిన
ఒక త్రొవ్వ వలె, ఒక
చూపుడు వేలు వలే-

చెప్పు,ఇక ఎవరికి భయం-మృత్యువంటే?

01 September 2013

ఇలా ఒకసారి

పచ్చని వాన వాసన వేసే చేతులు నీవి 

చుట్టుకుంటాయి నన్ను, ఒక 
తెమ్మరలా పూల హారాల్లా-

కళ్ళల్లోకి ఎవరో వెన్నెల వొంపినట్టు 
ఎండ పొడి రాలిన ముఖంపై 
ఎవరో నీళ్ళు చిలుకరించి
అరచేతులతో తుడిచినట్టు -

ఇక కొంత శాంతి ఇక్కడ. 

పర్వాలేదు. బ్రతికి ఉండవచ్చు

మరొక రోజు. 

నువ్వూ. నేనూ-