21 September 2013

ఎలా?

నాకేమో తలుపులో, కిటీకీలూ బార్ల తెరిచి కూర్చోవాలని ఉంటుంది -

నిలువునా చీల్చే ఎండనైనా కానీ, రెపరెపలాడే ఊబి వంటి
చీకటినైనా కానీ లోపలి రానివ్వాలనే ఉంటుంది
మరి మీరేమో ఎప్పుడూ వెన్నెలనో వాననో కోరుకుంటారు
తలుపులు తెరిచి కూర్చోవాలంటే, మరి మీరేమో
సాంధ్య సమీరాలో, గాలికి లలితంగా ఊగే లతలో

ఒద్దికగా, అలా మీ ఎదురుగా కుదురుగా ఉండాలని ఆశిస్తారు.

మరి ఇక నేనంటారా:ఒట్టి అనాకారినీ, ఆటవికుడనీ -
ఎవరూ రాకపోయినా, ఎప్పటికీ రారు అని తెలిసినా
తలుపులు తెరిచి ఎదురు చూడటమే బావుంటుందనీ
తెరచిన తలుపులకు అవతల ఉండే నిశ్శబ్దాన్నీ, రాలి
పోయిన, రెక్కలు విరిగిపోయిన పావురాళ్ళని వినడం

కూడా ఇక్కడ నివశించడంలో భాగమనీ అంటాను -

ఈ సుదీర్ఘ రాత్రుళ్ళల్లో ఎవరో మనల్ని తలచ వచ్చుననీ
వాళ్ళ పిలుపులనీ ఆక్రందనలనీ రోదనలనీ సంతోషాలనీ
ఆహ్వానించేందుకు తలుపులు తెరిచి వేచి చూడటం
మన ధర్మమనీ అంటాను. మరి మీరేమో ఎప్పుడూ
ఎవరో ఒకరు పుష్పగుచ్చాలతో రావాలనీ,ఎప్పుడూ
ప్రేమ గురించే మాట్లాడాలనీ అంటారు:ఇకేం చెప్పను-

తలుపులు ఒక వైపు. మీరు ఒకవైపు. నేను మరోవైపు-

పోనీ ఈ ఒక్క విషయం చెప్పండి. తలుపులు అయితే తెరవగలను
అన్నింటినీ నిర్భంధం లేకుండా రమ్మనీ పిలవగలను.
మరి మిమ్మల్నీ,ఈ మనుషులనీ బార్లా తెరవడమెలా?

తెరిచి, తలుపులకు అవతలి వైపున్న వాటిని చూపించడం ఎలా?  

2 comments:

  1. ఇక్కడ నివసిస్తున్నందుకు అభినందనలు

    ReplyDelete
  2. పోనీ ఈ ఒక్క విషయం చెప్పండి. తలుపులు అయితే తెరవగలను
    అన్నింటినీ నిర్భంధం లేకుండా రమ్మనీ పిలవగలను.
    మరి మిమ్మల్నీ,ఈ మనుషులనీ బార్లా తెరవడమెలా?

    ReplyDelete