22 April 2017

ఇక్కడే

ఈ మసక చీకట్లో, ఎదురుగా
నీ కళ్ళు  
మెరిసే మల్లెమొగ్గలు  

చుట్టూ మెత్తగా అల్లుకున్న 
నీ చేతులు 
వెన్నెల వలయాలు 

నా పెదాలపై నీ పెదాలు  
గూటిలో 
గునగునలాడే పిట్టలు 

శ్వాసలు సీతాకోకచిలుకలై 
రిఫ్ఫునెగిరే 
పచ్చిక మైదానాలు  

వాన కురిసే సాయంత్రాలు
ఊగే చెట్లూ 
ఎంతో నవ్వే రాత్రుళ్ళూ ... 
***
విను -
ఇక ఇక్కడే, నీతోనే మరి 
ఓసారి మరణం 
అనేకమార్లు జననం!

09 April 2017

ఏవో

నిద్ర లేదు. ఎవరూ లేరు -
కాటుక రాత్రి
ఉగ్గపట్టుకుని గాలి: ఏవో 
చేతులు గుడ్డిగా 
ఎవరినో వెదుక్కుంటూ 
తడుముకుంటూ 
తడి ఆరిన పెదాలై, ఒక 
మహా ప్రకంపనై 
చెల్లాచెదురైన గూళ్ళయి 
బెక్కే పక్షి పిల్లలై ... 
***
నిద్ర లేదు. ఎవరూ లేరు -

చుట్టూతా చీకట్లో, రాలిన
పూల నిశ్శబ్ధం -
దగ్ధమౌతోన్న రాత్రి వనం!