31 May 2016

స్వేచ్ఛ

మబ్బు పట్టింది. ఆగి, ఆగి ఉరుముల చప్పుడు -
ఆగకుండా ఆడుకుంటూ పిల్లలు

నిద్రలాంటి కాంతి. తూగుతూ పూవులు. ఊగే
ఆకులు. ఇక మరి, నిన్ను ఎవరో

తమలోకి పొదుపుకున్నట్టు, గాలి: నీటి కళ్ళతో
ఎరుకతో, నీలాంటి వర్షపు ప్రేమతో -
***
తలుపులు తెరచి చూడు ఓసారి!
నీ హృదయ మైదానాలలో గుంపుగా ఎగురుతూ
ఎన్నెన్ని తూనీగలో!

ఇక

పావురంలాంటి వెలుతురు. గాలిలో
రెక్కల చప్పుడు -
పసిబిడ్డను రొమ్ముకు హత్తుకున్నట్టు
నా పక్కన నువ్వు -
***
భయం లేదిక: నవ్వే పూవుని చూస్తూ
ఇంకో రోజు బ్రతకొచ్చు!

30 May 2016

జాగ్రత్త

"జాగ్రత్త", అంది అమ్మాయి
వెళ్ళిపోతూ -
***
రాత్రి జాబిలి. మసక వెన్నెల -
పూలు -
గాలి. చలించే లతలు. ఖాళీ
గూడు -
సగం పొదిగిన గుడ్డై, ఇకతని
శరీరం -
***
"జాగ్రత్త", అంది అమ్మాయి
వెళ్ళిపోతూ -
కానీ,
***
మరి
ఈ హృదయానికి లేనిదే అదని
ఎవరు చెబుతారు
తనకు?

రహస్యం

ఒక వేసవి రాత్రి -
చీకటి పాదాల కింద నలిగే
ఆకులు సవ్వడి: ఎవరో నీ లోపల, నిన్ను తొక్కుతూ
నడుస్తున్నట్టు -

ఒక నిండు జాబిలి -
ఒంటరిదే పాపం, నీ వెనుక
ఎంత దూరం నడిచిందో మరి, అలసి, ఇక సాగలేక
రాలిపోయింది -

ఇక ఒక మట్టి దారి -
దిగ్గున లేచిన గాలిలో, రాలే
పూలతో, నీడలతో, కూలే చెట్లతో, తెగే చుక్కలతో
ఎటు పోతుందో

అడవికి తెలియదు -
నీ అశ్రువులకీ తెలియదు. నీలో, శరనార్ధిగా మారిన
అతనికి, అసలే
తెలియదు: సృజనా
***
తెంపడానికేముంది: ఒక్క
క్షణం చాలు. యుగాలుగా దొరకని, హృదయప్రవేశ
రహస్యం, నీకు
ఏమైనా తెలిస్తే చెప్పు!

28 May 2016

నిశ్శబ్ధం

ఒక వేసవి మధ్యాహ్నం -
తల్లి చేసి ఇచ్చిన రొట్టెను, ఎంతో ఇష్టంగా తింటూ
ఓ పిల్లవాడు -

రొట్టెరంగు మల్లే కాంతి -
గోధుమల వాసన గాలిలో: పెరట్లో దుస్తులు విదిల్చి
ఆరవేస్తూ తల్లి -

ఇంకా కొద్దిసేపే: తను
తల తిప్పి చిన్నగా నవ్వితే, ఆరేసిన దుస్తులు అన్నీ
పలుకుతాయి -

నిన్ను బిగించి పట్టుకున్న
ఈ నిశ్శబ్ధం తొలిగి పోతుంది. కొంచెం ఓపిక పట్టు -
ఎదురుచూడు -

ఏదైనా, ప్రేమతో చేయడం
మాత్రమే, ఇక నువ్వు ఈ జీవితంలో నేర్చుకోవలసి
ఉన్నది!

క్షణం

నిద్రొస్తుంది నీకు -
చెదిరిన జుత్తు. పొగమంచు వ్యాపించే సరస్సుల మల్లే
నీ కళ్ళు -

నా మెడ చుట్టూ
నీ చేతులు: ఏవో మాటలు. ఇక నేనో ఊయలనై నిన్ను
జోకొడితే

నీ శరీరమంతా
నిదుర పూల వాసన: చీకట్లో అలలు, తీరాన్ని తాకే ఒక
సవ్వడీ, శాంతి -
***
నిద్రపోయావు నువ్వు -
ఇక హృదయంలో, మంచుపొగల సరస్సులో సాగే ఒక
పడవలో

వెలిగిన జీవన దీపపు కాంతిలో
నిద్రపోలేక నేను!

ఓలమ్మీ...

ఓలో ఓలో
రాత్రే వర్షమూ పడలేదు. ఇక్కడ
ఇంత గాలీ లేదు -
ఇక ఓ పక్క ఎండ చిర్రున ఇట్లా కాలుస్తా
ఉంటే, ఓలో ఓలో

ఓలమ్మీ, ముఖం
చిటచిటలాడిస్తూ నువ్వు అట్లా మండుతా
ఉంటే, ఇక మేము
బ్రతికి బట్ట కట్టేది ఎట్లా? కొంచెం కొంచెంగా
నవ్వొచ్చులే నువ్వు -

ఇక, కొంచెం కొంచెంగా నువ్వు నవ్వితే

మబ్బు పట్టి
జల్లు కురిసి, చల్లటి గాలిలో ఓ చెట్టు కింద
మా చుట్టూ మేము
చేతులు కట్టుకుని, పళ్ళికిలించుకుంటూ
కూర్చుంటాము

నీతో ఈ దినమంతా, ఈ జీవితమంతా -

24 May 2016

దీవెన

ఇప్పుడే చూసాను నిన్ను నేను, పని నుంచి వస్తూ -
***
నీ ఒళ్ళంతా మట్టి -
చింపిరి జుత్తు. ఈకలు నిక్కబొడిచి పరిగెత్తే కోడిలాగా
నువ్వు -

గుండీలు ఊడిన
షర్టు. మాటిమాటికీ జారిపోతూ నిక్కరు. ఓ పిన్నీసు
పెట్టిన

ఖాళీలోంచి అట్లా
బయట పడి ఊగే బోల్కాయ. ఇక మరి కొనుక్కున్న
పుల్లయిస్ను

నువ్వు కారే ముక్కుతో
ఎగబీల్చుకుంటూ నాకుతుంటే, నీ నోట్లోకి పోయేది
ఐస్క్రీమో

లేక చీమిడో ఇక
ఎవరికి తెలుసు? ఫిర్ భీ, పర్వా నహీ హై ఓ పిలగా
ఎందుకంటే

యెహీ హై జిందగీ
యహా హీ హై జిందగీ, చేత్తో ముక్కు తుడుచుకుని
కిందపడిన

ఐస్ను, చటుక్కున
నోట్లో వేసుకునే క్షణాలలో, మట్టిని గుప్పిళ్ళతో తీసి
వాళ్ళ నెత్తిన

వెదజల్లే కాలంలో
పిర్రల కింద చినిగిన లాగుని లాక్కుంటూ, క్కిక్కిక్కీ
మని ఎటో

పరిగెత్తే లోకంలో -
***
ఇప్పుడే చూసాను నిన్ను, పని నుంచి వస్తూ -
***
మరి చిన్నా, ఎదగక ఎప్పటికీ ఇట్లాగే ఉండు నువ్వు -
ఎన్నటికీ వదలకు నన్ను!

23 May 2016

కలబంద

కుండీలో ఓ కలబంద మొక్క: దేనికీ చలించదు అది -
***
మసి అంటిన ఆకాశం. ఎండు గాలి. సాయంత్రం -
ఎదురుచూస్తోంది నీ తల్లి, వొంగిపోయి
అక్కడ, పాపం మరి ఎవరికోసమో -

ఆకులు రాలిన కొమ్మలు: వొణికే తన చేతులు -
ఊరికే ఆరే పెదాలని తడుపుకుంటూ, కళ్ళు
చికిలించి గేటు వద్ద అట్లా, నీ తల్లి -

ఇంటిపై వడలిన మొక్కలు: చామంతీ, దవనం -
(తన కళ్ళు) ఇక ఒక మల్లెతీగేమో, పూర్తిగా
వాలి సోలిపోతే, మోకాళ్ళ నొప్పులతో

మెట్లెక్కలేకా, వాటికి నీళ్ళు పోయలేకా, వాటిని
అట్లా చూడలేకా, హృదయం ఒక ఆరిన
దీపమైతే, ఆ పొగలో ఇక ఊపిరాడక

సుడులు తిరిగి, అలసిపోయి: నీ చిట్టి తల్లి -
***
కుండీలో ఓ కలబంద మొక్క: చలించదు దేనికీ అది -

చివరికి, ఎదురుచూసీ ఎదురుచూసీ కుంగిపోయి
పాపై ఏడ్చే ఒక అశృవుకి కూడా!

21 May 2016

lonliness

"ఎన్నో విరామ చిహ్నాలను దాటి, ఎన్నో వాక్యంత
బిందువులను తుడిపి వేసి
ఎవరో ఒకరు

ఎప్పుడో ఒకప్పుడు, నిను తప్పక చేరుకుంటారు:"
అని తను, తన కోసమే
చెప్పుకున్నది -
***
పాపం పిచ్చి వాన -

ఎందుకో మరి బెంగటిల్లిన కళ్ళతో, రాత్రంతా
చీకట్లో, ఎవరికోసమో
శివమెత్తినట్లు

హోరున, అట్లా కురుస్తూనే ఉన్నది!

20 May 2016

వాళ్ళు

ఇల్లంతా కిచకిచలాడుకుంటూ తిరుగుతూ
పిచ్చుకలు -
***
బయట మబ్బు పట్టి ఉంది. చల్లటి గాలి:
నీడల్లోనూ పచ్చని ప్రాణం -
అలల్లా చలించే ఆకులు. ఎన్నో నదులు
పంపిన, నీటి ప్రేమలేఖల్లాగా -
ఇక, ఒక చిన్న పూవై వేచి చూసే గూడు
ఈ పూటకి వారి చిరునామా -
***
ఇల్లంతా ఉడతల్లా ఆడుకున్న స్కూల్లేని
పిచ్చుకలు, సాయంత్రానికి
తుర్రున ఎగిరి పోయాయి -
***
ఇక రాత్రంతా, తనలో, అతనిలో మిగిలిన

ఒంటరి గడ్డి పరకపై మసక వెన్నెల
ఓ అశృబిందువై అట్లా
ఊగుతూనే ఉండింది!

19 May 2016

కాలం

మట్టిముంతలో ఇన్ని నీళ్ళూ, నేలపై కాసిన్ని
గింజలూ ఉంచింది ఆవిడ -
***
పగలు గడచిపోయింది. సాయంత్రానికి
తన శరీరం ముడతలు పడింది
ఎక్కడో ఒక చుక్క పొడిచింది -

అయినా, ఒక్క పిచ్చుకా రాలేదు: తనలో
గూడు కట్టుకోలేదు. పొదగలేదు
కనులలోని, ఒక ఆశ్రవునైనా -
***
అతనిలో ఇన్ని నీళ్ళూ, కాసిన్ని గింజలూ
ఉంచి వెళ్లిపోయింది ఆవిడ -
***
ఇక రాత్రంతా అడవిలో, నిండు వెన్నెలను
ఎత్తుకుపోయిన వర్షపు గాలి
మూలుగు, ఆగకుండా అట్లా!

18 May 2016

మననం

నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండానే, మరి
***
చేజారి, ఒక దీపం పగలిపోయి ఉండవచ్చు. ఎవరిదో ఒక
హృదయం ఆరిపోయి ఉండవచ్చు -
వాన చినుకై ఒక ముఖం, రాత్రిలోకి అశ్రువై, రాలిపోయీ
ఉండవచ్చు. చివరికి బాహువులు

అనాధాలై, నీకు ఏమీ విప్పి చెప్పుకోలేక, తమలోకి తామే
బెంగతో ముడుచుకుపోయి ఉండవచ్చు
దిక్కు తోచక విలవిలలాడీ ఉండవచ్చు -
***
చూడూ, మరి అందుకే, కొన్నిసార్లు
ఊరికే వాళ్ళకై అట్లా ఉండు: కనులపైని నీటిపొరలాంటి
దయతో, ఇంకొంచెం ఓరిమితో-!

17 May 2016

మెట్రో

"ఎక్కడున్నావు నువ్వు? వర్షం వచ్చేటట్టు ఉంది. ఇంటికి
వస్తున్నావా?" She asks -
***
రోడ్లపై ఉండే చిన్ని నీటి గుంతలు నీ కళ్ళు: అలసిపోయి
నీ చేతులు. మరి నీ శరీరమేమో, ఎవరో
రాళ్ళేసి పగులకొట్టిన ఒక దీపస్తంభం -

ఇక, నీ హృదయమేమో, చింపిరి జుత్తుతో, చిన్నబోయిన
ముఖంతో,  గుమ్మం వద్ద ఎవరో వస్తారని
ఎదురుచూసే ఓ అనాధ: ఒక దుఃఖం -

మరి అతనా? అతను ఈ నగరం: ఈ రాత్రీ, ఈ చీకటీ -
***
"ఎక్కడున్నావు నువ్వు? వర్షం వచ్చేటట్టు ఉంది. త్వొరగా
ఇంటికి రా" She pleads -
***
అతను ఇంటికి వచ్చే దారిలో, అతని చేతిలోంచి చేజారి
దొర్లిపోయిన, తనకు ఎంతో ఇష్టంగా ఇద్దామని

దాచుకున్న, చీకటి ఆకుల తెల్లని వాన గులాబి!

13 May 2016

ఎగిరొచ్చి...

ఎక్కడి నుంచో ఎగిరొచ్చి వాలిందో బంగారు పిచ్చిక
బిత్తర చూపులతో -

పాపం, ఎందుకొచ్చిందో ఎవరికి తెలుసు? గూడు
కట్టుకుందామనుకుందో, గింజలు
ఏరుకుందామనుకుందో, మరి

మట్టి ముంతలోని నీళ్ళ కోసమో, పుల్లల కోసమో
నీ కోసమో, ఎందుకొచ్చిందో లోపలికి
తత్తరుపాటుతో, కిచకిచమంటో

ఎక్కడి నుంచో ఎగిరొచ్చి వాలింది, వాలు చూపుల
బంగారు పిచ్చిక -

వాలి, ఎంతో భద్రంగా ఆకుల మాటున దాచుకున్న
నీ హృదయాన్ని నోట కరుచుకుని

కిలకిలా నవ్వుతూ వెళ్ళిపోయింది, అల్లరి కనుల
తుంటరి రాకాసి పిల్ల !

కృతజ్ఞత

చీకటి గుహలోంచి ఎవరో నిన్ను లాక్కు వెళ్లి, ఓ పూల
పందిరినీ, లేత కాంతినీ 'చూడూ' అని
చూయించినట్టు తను: నిదుర నెలవంక

అలసటగా రాలిన, మెరిసే పెదాలతో -
***
రాత్రి -
చెట్ల కింద గుమికూడిన నీడలు. చిన్నగా, పూలల్లో
చేరుతున్న పొగమంచు. గూళ్ళలో, పక్షుల
రెక్కల్లో, ఊగే లతల్లో, ఒదిగిన శాంతి -

ఎవరిదో
శ్వాస తాకుతోంది అతి లీలగా వేణుగానమై. చుట్టూ
చినుకులు. స్వప్న పరిమళం. మొలకెత్తబోయే
విత్తనంలోని అలజడి. కొంచెం ఇష్టం -

తడిచిన
మట్టి. తేలిపోతున్న మబ్బులు. వెన్నెల్లో మెరిసిపోయే
సరస్సు. నిన్నెవరో పాదు చేసి ఉంచినట్టు, ఇక
తన చేతివేళ్ళు నీలో నాటుకుంటే, ఎక్కడో

ఏ ఏ లోకాలలోనో నువ్వు మొలకెత్తి, నిటారుగా ఎదిగి
గుండె నిండుగా గాలి పీల్చుకున్నట్టూ, ముఖాన
సూర్యరశ్మితో వెలిగినట్టూ, నవ్వినట్టూ
***
ఎవరో, నీలోంచి నిన్ను బయటకు లాగి పొదుగుతున్న
కాలం. తల్లి పాలిండ్ల లోకం. నీ బాల్యం -
బాహువుల భద్రతా, మృత్యు కారుణ్యం!
***
మరి, నిదుర నెలవంక వాలిన ఓ పూలతోట, నీకు ఒక
గొప్ప బహుమతి ఆనీ, ఒక వరం అనీ
ఎప్పటికి తెలుసుకుంటావు నువ్వు?

12 May 2016

ఎలా

మాట్లాడవు నువ్వు. పరధ్యానంగా నీ కళ్ళు: రాత్రి సముద్రంలో
దారి తప్పిన ఓడల్లాగా -
***
అలల లేని చీకటి. తీరం లేని గాలి -
మరి మెల్లిగా ఊగే లతలకీ, తలలు వంచుకున్న పూలకీ
ఒరిగిన గూళ్ళకీ, నీ చుట్టూ గిరికీలు
కొట్టే పురుగుకీ, నీ నిశ్శబ్ధం, నీ మంచుతనం అర్థం కావు -

ఇక పిల్లలే నీ ముందు, వెలిగించని
దీపాలై, హృదయంలో మిణుకు మిణుకుమనే బెంగతో
అట్లా, నీ ముఖంలోకి చూస్తో, ఒక
సందిగ్ధంతో, కొట్టుకుపోయిన కాగితం పడవల్ని కంటో -
***
మాట్లాడవు నువ్వు. పరధ్యానంగా నీ కళ్ళు: రాత్రి సముద్రంలో
తేలియాడే పడవల్లాగా, ఎవరో రాసి
మరచిపోయిన ప్రేమలేఖల్లాగా -

మరి, ఇక
***
నీ హృదయపేటికను తెరచి, నీ స్వప్న వాచకాల, రహస్య పూల
భాషను వినడం, చదవడం - ఎలా?

11 May 2016

ఆ సాయంత్రం

నువ్వు రాలేదు. తలుపులు మూసే ఉన్నాయి
ఆవరణ అంతా దుమ్ము -
***
వ్రూమ్మని గాలి. శివమెత్తినట్లు ఊగే కొమ్మలు
జలజలా రాలే ఆకులు: నీడలు -
ఇంటి వెనుక, గాలికెగిరి కొట్టుకుపోయి, నిమ్మ
చెట్టులో చిక్కుకున్న, నువ్వు

ఆరేసిన దుస్తులు: అక్కడక్కడా చిన్నగా చిరిగి -
***
నువ్వు రాలేదు. తలుపులు మూసే ఉన్నాయి -
ఇక ఎక్కడెక్కడో తిరిగి, లోపలంతా
దుమ్ము కొట్టుకుపోయి

ఏ తీగలకో చిక్కి, చినిగిపోయి నేను!

10 May 2016

ఊయల

పూలపూల పాత చీరలతో ఒక ఊయల చేసి, తాడుతో
వేలాడదీసి, కూర్చున్నారు ఇద్దరూ
వెలిగించిన ఒక దీపం ముందు -
***
రాత్రి. సన్నగా వీచే గాలి. ఆరుబయట, ఆకాశంలో
మిణుకు మిణుకు మనే చుక్కలు
ఊగుతూ మొక్కలు: నెమ్మదిగా -

ఇంటి ముందు చల్లిన నీళ్ళు. వేసిన ముగ్గు, చీకట్లో
ఒక కాంతి కిరణంమైతే, ఇక ఏవో
మాటలు, చిట్లే చినుకులలాగా -

చెట్లల్లో నిశ్శబ్ధం. ఇక, గూళ్ళల్లో ముడుచుకుపోయిన
పక్షులూ, రెపరెపలాడే ఆకులూ
తుంపరా: తన కళ్ళల్లో, కలల్లో -

చిన్నగా కళ్ళు తుడుచుకుని, తను ఏదో చెప్పేలోపల
అతను అంటాడు: "తిందామా ఇక?
మళ్ళా ఉదయాన్నే వెళ్ళాలి మనం"
***
పాత చీరలతో చేసిన ఊయల ముందు, వడలిపోయి
అట్లా పడుకుండిపోయారు ఇద్దరూ
నేలపై, ఆరిపోయిన ఒక దీపంతో -
***
ఇక హోరెత్తించే ఓ ఖాళీ గాలి, పూలు లేని ఊయలను
అట్లా ఊపుతూనే ఉంది ఆ రాత్రంతా
చినుకులతో, కళ్ళ కింది చుక్కలతో!

ప్రకటన

ముప్పై గాట్లు. తెగ నరకబడిన వక్షోజాలు -
నీ చితికిన యోని లోంచి
లాగివేయబడిన పేవులు -

కొరికివేయబడిన పెదాలు. విరిగిపోయిన
దంతాలు. ఎముకలూ -
నీ రంధ్రాలన్నింటిలోనూ

నీ నెత్తురూ, అశ్రువులూ: వాళ్ళ ఉమ్మీ, వీర్యం -
***
ఇప్పుడొక దేశభక్తి ప్రకటన: వర్తక పరిభాషలో 
టీ20 ప్రసారం మధ్యలో -

భారత్ మాతాకి జై and
Happy Mothers day -
Thank you.

07 May 2016

శిక్షణ

వెన్నెల్లో, తెల్లటి మొగ్గలు అతి నెమ్మదిగా విచ్చుకొనే పూల
రాత్రుళ్ళు: నీ కళ్ళు -
***
మంచుపొగలు వ్యాపించే సరస్సులూ, వాటిపై ప్రసరించే 
లేత సూర్యకాంతీ, రిఫ్ఫున నింగికెగసే 
పావురాళ్ళూ, మరి రెపరెపలాడే గాలీ

చిన్నగా ఊగే చెట్లూ, ఆకుల్లో దాగే చినుకులూ, గూళ్ళూ
సీతాకోకల రెక్కల సవ్వడీ, ఒక శాంతీ
అలలలోని నిశ్శబ్ధం, రంగూ, వాటిలో -
***
చీకటిలో, రెండు ప్రమిదలై అతి నెమ్మదిగా వెలిగే ఊపిరి
గీతాలు: నీ కళ్ళు -
***
చిన్నా: ఇక చింత లేదు నాకు -

నీ నయనాల ఆనంతాలలోకి ఇంకిపోయి, హృదయం 
నిర్మానుష్యమైన ఒక మనిషి, బ్రతకడం 
ఎలాగో నేర్చుకుంటున్నాడు: ఇప్పుడే!
 

...

నిన్నంతా ఏకధాటిగా వర్షం కురిసింది. ఆపై
వెళ్లిపోయింది -

ఇక రాత్రంతా, నీలో బేలగా తల దాచుకున్న
ఒక గడ్డిపోచ వొణుకులో
పూల అశ్రువుల బెంగ -

ఎక్కడో చీకటి వెక్కిళ్ళలో, వెన్నెల తెగిన
నెత్తుటి వాసన!

04 May 2016

wish

గాలికి తాళలేక, రాత్రి ముందు మోకరిల్లి, మౌనంగా
ప్రార్ధిస్తోంది ఓ దీపం:

"ప్రభూ: చీకటి పాలిండ్ల దయనూ, చినుకు శ్వాసనూ

పూల బాహువుల మృత్యువునూ
ప్రసాదించు నాకు"!

02 May 2016

కృతజ్ఞత

నీ శరీరం అప్పుడు చక్కగా గోధుమల వాసన వేసేది
నీళ్ళు ఒంపిన పొలంలా -
***
నీ ఎదురుగా నేను: మంత్రముగ్ధుడనై, వెలిగించిన
దీపపు వెలుతురులో ఊగే నీడల చివర్లని
వేళ్ళతో తాకుతూ, నవ్వుతూ -

ఎందుకు నవ్వానో, ఏం మాట్లాడానో నీతో ఆ రాత్రి -
బయట మాత్రం, గాలీ వానా రాలే చినుకుల
సవ్వడి, నీలోపల ఒదిగినప్పుడు -

చితుకుల మంటలా నీ పెదాలు. ఒక తోట నీలో -
పూలని ముద్దాడాను. సీతాకోకల రెక్కలని
విన్నాను. రహస్యమై పోయాను

నిన్ను తొలిసారిగా కనుగొన్నట్టు, ఒక ఇంద్రజాల
లిపిని చదివినట్టు, నీ వక్షోజాల ఛాయలో
శిశువునై, నిద్రలోకి జారిపోతే
***
నీ శరీరం అప్పుడు ఆలయంలోని ఒక దీపమై
ధూపమై, గంటై
వెలిగింది, పరిమళించింది, ధ్వనించింది - అందుకే
***
మరి వినపడుతుందా నీకు, వెదురు వనాల్లోంచి
వెన్నెల లేక, అట్లా ప్రతిధ్వనించి
స్థాణువై మిగిలిపోయే

ఒక ఖాళీ గాలీ, ఈ రాత్రీ, ఓ ఒంటరి పాటా?

01 May 2016

దారి

నీకు మాత్రమే తెలుసు, దీపాన్ని తీసి తుడిచి
వెలిగించడం -
***
తడి లేని చీకటి. పల్చటి గాలి. చిన్ని పూవులు
నువ్వు తాకక వడలిపోయి -
ఊగే నీడలు. ఎక్కడి నుంచో చిన్నగా మాటలు
మల్లెపూలలాంటివి, లోపల -
నీళ్ళు చల్లుతున్న చప్పుడు. మట్టి వాసన మరి
నువ్వు చిన్నగా తాకినట్టు -
ఇక, ఎక్కడో దూరంగా ఒక నెలవంక, ఇక్కడ
నదిలో రాలి తేలిపోతే
***
నీకు మాత్రమే తెలుసు, నన్ను తీసి తుడిచి
వెలిగించి, నీ శ్వాసతో

ఇంకో రోజుకి అట్లా బ్రతికించి ఉంచడం!

ఇక్కడ

కిటికీలు తెరిచాను. నాలుగు చినుకులు రాలిన
గుర్తులు, తడితడిగా -
***
నీ లాంటి గాలి. హృదయంలో ఒక చిన్న అలజడి -
లోపలి సరస్సులో తిరుగుతున్నారు
ఎవరో, బంగారు చేపపిల్లై -

నవ్వకు. చీకటి చిన్నబుచ్చుకుంటుంది. ఈ దీపం
రెపరెపలాడుతుంది, పూలల్లోని
రాత్రి మంచు వొణికిపోతోంది -

నిస్సహాయుడని. నీ చేతుల్లోంచి చేజారిపోయిన
బాలుడిని. కోపగించుకోకు, ఎదగలేదని:
అలగకు, నీ మాట వినలేదనీ -
***
తలుపులు తెరిచాను. నాలుగు చినుకులు రాలిన
గుర్తులు, నీ అశృవుల్లా -
***
అమ్మాయీ, ఎవరో ఎక్కడో ఎందుకో రోదిస్తున్నారు -
నువ్వు కానీ చూసావా
తెగిన వాళ్ళ కళ్ళని?