29 December 2016

పరామర్శ

/ "ఏవయింది?" / "జలుబు" /
/ "అవునా! హ్మ్...
మరేమైనా వేసుకున్నావా?"
/ "ఊహు. లేదు" /
/ "ఓ! ... మరి
నీకు ఇబ్బందిగా లేదూ?" /
/ "లేదు ... " /
/ "ఉండదులే... డోంట్ వర్రీ ...
ఎందుకంటే ...

/ ... ముక్కు చీదడానికీ
స్ఖలించడానికీ
పెద్దగా తేడా తెలీదుగా మీకు ...
మరేం పర్లేదు
అదే ఎప్పటికో ఒకప్పటికి
సర్దుకుంటుందిలే
పోయి పడుకో" /

"..." 

23 December 2016

రహస్యం

పిల్లలు లేని పక్క: ఇంకా పోని
పసివాసన: దిండుపై -
ఓ చిన్న అరచేయి చెవిని 
నిమిరినట్టూ, గట్టిగా
అతనిని వాటేసుకున్నట్టూ ... 
***
గాలి అతని చుట్టూ వేణువైతే 
ఒక సువాసనలోకి 
ఇక అతను పునర్యానమై... 

ముద్దు

గాలిలో తేలే ఆకులు, నీ పెదిమలు -

రెండు నెలవంకలు అవి. సూర్యరశ్మిని 
నింపుకున్న రెండు వెచ్చని 
సరస్సులు అవి. తీరం లేని ప్రయాణం 
అవి. రెండు  పడవలూ అవి -
ప్రియమైన రెండు కృష్ణబిలాలూ కూడా 
అవి. అవే: నీ పెదిమలలలు... 

వాటితో నువ్విక అట్లా, అతని పెదాలని 
కొరికి లాగి వొదిలితే, చూడు 

సముద్రాలకుపైగా చీకట్లో చుక్కలవైపు 
గాలిలో తేలే ఒక ఆకై, ఆవిరై 

ఒక పిట్టై ఎట్లా ఎగిరిపోతున్నడో అతను!

21 December 2016

దినాంతం

"నొప్పి" నడవలేక గొణిగింది తను -
"తగ్గిపోతుంది. కొంచెం
ఓపిక పట్టు" అన్నాడు అతను -

వాళ్లకెదురుగా రహదారిపై చీకట్లో
విసురుగా వాహనాలు -
ఒకటే కరకు శబ్ధం: రంపపు పొట్టు ...
***
ఇక వాళ్ళు రోడ్డు దాటుతూ ఉంటే
ఫ్లైఓవర్ కింద ఎవరో
"అమ్మా" అంటో మూల్గిన శబ్ధం!

17 December 2016

ఎందుకు

అమ్మ ఇంటికి వచ్చింది. వస్తూ
ఏవేవో తెచ్చింది. తన
చుట్టూ మూగిన పిల్లలు ఒకటే
హడావిడి: తేనె పిట్టలై -

ఎప్పటికో రాత్రి అయ్యింది. తన
హృదయం ఇక, ఒక
మైదానమయ్యింది. చెట్ల కింద
వెన్నెల్లో, చినుకుల్లో

ఏవేవో చప్పుళ్ళు. పాల వాసన - 
చొంగతో నిదురలో ఊగే
పూలు: మంచులో సెలయేళ్ళు.
ఏవేవో కలవరింతలు -
***
అమ్మ ఇంటికి వచ్చింది. వచ్చి
అందరినీ బజ్జో పెట్టింది -
ఆ గూటిలో నువ్వూ నిదురోక

ఇట్లా, వ్రాసుకోవడమెందుకు?  

drilling

శీతాకాలపు ఎండ: చల్లని గాలీ -
పాకుడు రాళ్ళపై
నిరంతరంగా నీళ్లు పొర్లే చప్పుడు
లోపలి నగరంలో -
***
ఎవరూ లేక ఇట్లా మిగిలిపోవడం
ఒకోసారి ఎంత కష్టం!

14 December 2016

తటిల్లత

వెలసిపోయి ఉన్నాయి గోడలు, కాంతి లేక -
వాటిపై పసుపు ఛారలని తాకుతూ
కొమ్మలు. ఊగీ ఊగక, సంధిగ్ధంగా ఆకులు -
దాదాపుగా, వాన పడేట్టుగా ఆకాశం -

రెండు చేతులనూ బల్లపై ముడిచి, ఓరగా 
వాటిపై తలను వాల్చి, కిటికీలోంచి
బయటకు చూస్తూ పడుకుని ఉంది తను
అటూ ఇటూ ఊగే గాలై, కనులై. ఇక

సరిగ్గా అప్పుడే,  సరిగ్గా ఆ క్షణానే, అక్కడే
జీవించడం అంటే ఏమిటో మరి 
ఆకస్మికంగా తెలిసి వస్తుంది నీకు: వానై!

to be

పూలు జలదరించినట్టు
వెలుతురు
చుట్టూ రెండు చేతులు
సువాసనై ...
***
ఓహ్ -
బ్రతికే ఉన్నాను నేను!

దిగ్బంధనం

దీపం ఆర్పివేసినట్టు, మసక చీకటి -
నయనాలు స్థంబించినట్టు
ఆకులు. చెట్లు. శ్వాసలేని గాలి. లోన
ఒదిగి ఒదిగి ఈ దినం: నువ్వూ
నేనూ ఏమాత్రం తాకలేని ఈ లోకం

దీపం ఆరి సన్నటి పొగ ఎగసినట్టూ
ఆ పొగలో స్మృతి ఏదో
మెరిసినట్టూ, అంతలోనే తటాలున
ఎవరో వెళ్ళిపోయినట్టూ...
***
అవును లీలా, నువ్వన్నది నిజమే
ఇది, ముసురు పట్టి
నిన్ను ఒలిచి వేసే లోహకాలం!  

13 December 2016

చూడగలిగితే

నిద్రలో పక్కకి ఒత్తిగిల్లి, అతనిని దగ్గరికి
లాక్కుంటావు నువ్వు -
సరిగ్గా అక్కడే, నువ్వు చేయి వేసిన చోట
ఎవరో చీకట్లో, వెన్నెలని
ఛాతిపై రుద్దినట్టు కొంత కాంతి: లోపల -
ఎవరో నేల పరిమళాన్ని
వెదజల్లినట్టు, వేలపూల తోట: లోపల -
ఇక మంచులో, సరస్సులో
పడవై అతని ప్రాణం మెల్లిగా తేలిపోతే
***
స్వర్గలోకాలు ఇక్కడే: నేను నిన్ను
చూడగలిగితే, వినగలిగితే! 

10 December 2016

ఒకసారి

నిద్రపోయి ఉంది తను: బయట
ఆడుకుంటూ పిల్లలు -

శీతాకాలపు గాలి. ఎక్కడినుంచో 
పావురాళ్లు రెక్కలు 
విదుల్చుకునే చప్పుడు. ఎండా -
రెపరెపలాడే దుస్తులు 
బాల్కనీలో: కుండీలపై నీడలు -
వెరసి ఒక మధ్యాహ్నం
నిద్రపోయి ఉంది తాను, అలసి -
ఇక, తన కలల తోటలో
మునివేళ్ళ మీద తిరుగాడుతూ 
ఇద్దరు పిల్లలూ, ఓ కవీ 

మరి అతనీదే అయిన ఓ చిన్ని 
చిన్ని పొయెమ్! 

09 December 2016

దేశభక్తి

బారులు తీరి, దారి పొడుగూతా మనుషులు -
మధ్యలో ఎక్కడో  ఓ పక్కగా ఒరిగి
మెట్లపై కూర్చుని, తెల్లని వెండ్రుకలని వెనక్కి
తోసుకుంటూ, నొప్పెట్టే  మోకాళ్లని
రుద్దుకుంటూ ఎండలో ఒకావిడ: ఒక అమ్మ -
ప్రతిఫలిస్తూ ఎండ: కోస్తూ గాలి. మరి
వెరసి మొత్తంగా జీవితం, ఒక బాంక్ ముందో
ఒక ATM ముందో నిస్సత్తువైతే
***
ఇంతకాలం దేశభక్తి ఒక ఆవు. పరద్వేషం -
ఇప్పుడు మాత్రం, నడిరోడ్డుపై
2000 వేలకై సొమ్ముసిల్లిన ఓ తల్లి. గుండాగిన
ఓ తండ్రి: చెమ్మగిల్లిన కళ్ళల్లో

మిగిలిపోయిన, ఓ 500 రూపాయల కాగితం!   

అంతిమ ప్రశ్న

నేల అంతా కాంతి. ఆకులు
కదులాడే నీడలు. రాత్రి
కురిసిన మంచు. పూవులూ -
చివరిగా అంది తను:

"పూరేకులు రాలే శబ్ధాన్ని
ఏనాడైనా నాలో
వినగలిగావా నువ్వు ?"

జవాబు

వేలి చివర నుంచి, ఒక నీటి చుక్కను
అతని నుదిటిపై రాల్చి "నేనొక
వనకన్యనూ, వానచినుకునూ. తెలుసా
నీకు ?" అని అడిగింది తను -
కానీ అప్పటికే, తనని గట్టిగా పట్టుకుని
నిద్రపోయి ఉన్నాడు అతను!

08 December 2016

దృష్టి

అతి జాగ్రత్తగా ముక్కలని ఏరి, ఇంటిని
సర్ది పెట్టింది తను. ఈలోగా
సాయంత్రం అయ్యింది. చీకటీ పడింది -
కొంచెం గాలీ వీచింది. అయితే

ఇంటికి తిరిగి వచ్చి, దుస్తుల్ని విప్పుతూ
అతను, పగిలిన పాత్రని కానీ
తనలో లేని పూలని కానీ, వేర్లు తెగిన ఒక  
మొక్కని కానీ తనని కానీ, మరి

ఎందుకనో, అస్సలు గమనించనే లేదు!

ఇద్దరు

చీకటి ఒడ్దున ఇద్దరు: వాళ్ళ లోపల
చుక్కలతో మెరిసే నీళ్ల శబ్ధం -
వెన్నెల ఇసిక. గవ్వలూ, పీతలూనూ:
ఎక్కడో  మిణుకుమంటో దీపం -
***
తెప్పకింద చేరి రాత్రి, ఇక వాళ్ళతో 
అక్కడే ఆగిపోయింది!


కారణం

కర్టెన్లు వేసి ఉన్నాయి. చీకట్లో వెలుతురు
వలయం ఒకటి పావురమై
అతని భుజంపై వాలితే, తన ముఖాన్ని
ఛాతిపైకి జరుపుకుంటూ

తనలో తాను గొణుక్కుంటాడు అతను -
"నువ్వు కాదా? మరొక రోజు
మరొక సారీ, బ్రతికి ఉండేందుకు నాకు
మిగిలిన, ఒకే ఒక్క కారణం!"

తెరపి...

రెండు శీతాకాలపు రాత్రుళ్ళ మధ్య పెద్దగా
ఏమీ జరగలేదు -

అన్నం వండి, ఆరేసిన దుస్తులను తెచ్చి
నెమ్మదిగా మడత పెట్టుకుంటూ
కూర్చుంది తను. ఎదురుగా అతను: ఒక
పుస్తకంతో, పేజీల చీకట్లలో, ఏవో

చుక్కలతో, గాలితో, గూళ్ళలోని పక్షులతో -
***
రెండు శీతాకాలపు రాత్రుళ్ల మధ్య, పెద్దగా
ఏమీ జరగలేదు కానీ
ఇద్దరి మధ్యా, ఆరిన దుస్తులలోంచి ఎగిరే
లేత ఎండ వాసన! 

07 December 2016

ఆ పిల్ల...

నిమ్మకాయ రంగు ఎండ పిల్ల, అక్కడే
ముఖమంతా కోపంతో -

"అలా ఉండకు: వేసవి తెలుసు నాకు"
అని కూడా చెప్పాను నేను -
కానీ, వేసవి రంగు పిల్ల ముఖం తిప్పదు
నాపై ఇంత నీడ ప్రసరించదు!

"పోనీ, నేనేమైనా చేసానా చెప్పు?" అని
కూడా ప్రార్ధిస్తానా మరి నేను
నీడలు దోబూచులాడే నీలి కళ్ళ పిల్లతో
"హె పో: నాతో మాట్లాడకు -"

అని అరుస్తోంది, అంతలోనే నాపై పడి
రక్కుతోంది, గండుపిల్లిలా
ముఖం పెట్టుకొని, మిడి గుడ్లేసుకుని
చూస్తోంది, గుర్మంటోంది

ఛాతిపై కుంకుమై చెదిరి, రాత్రి అంతా
ఆగక ఒకటే కురుస్తోంది

ఎండలో చిట్లిపోయిన, నా వానాకాలపు
బేల కళ్ళ  పిల్ల! 

పోలేక...

పొరలుగా చీకటి: రాత్రి -
త్రవ్వుతున్న శబ్ధం
ఎవరో వెళ్లిపోయినట్టు -
లోతుగా దిగబడి
క్షణకాలమాగిన పలుగు
ప్రేమా దయా నీవు -
***
ఇక, రాత్రంతా బయట
వెన్నెల్లో రాలిన
పూలు, గాలికి మోకరిల్లే
ఆశ్రు దృశ్యం!

స్పృహ

రాత్రి ఎప్పుడో, మ్రాగన్ను నిద్రలో నువ్వు
నా గుండెల మీద తల ఆన్చితే
ముసురు చీకట్లలో అవిసె చెట్లు వొణికిన
జ్ఞాపకం: హోరున వీచిన గాలికి

ఆకులు రాలి, వెన్నెల చెదిరి, అలలపై
మరోవైపుకు తేలిపోతే, నీ చిక్కటి
కురుల కింది కళ్ళల్లో, పండిన గోరింట
వాసన. ఛాతిపై ఒక గాటు: చెమ్మ -

రాత్రుల కలవరింత. బ్రతికి ఉన్నాననే
స్పృహ. కానా తరువాతే ఎందుకో
నీ తల అనిన చోట, వలయాలు ఏర్పడి
హృదయం పునర్యానమయ్యే వేళ

రాత్రే ఎక్కడో, దారి తప్పిపోయింది!

17 November 2016

దిక్సూచి

అదే రాత్రి, అదే గాలి. అదే చీకటి
అతని అరచేతుల మధ్య
తన శరీరపు మసక దీపకాంతి -
బలికోరే లోకాలలో, తన
కాలపు జనన మరణాల శాంతి -
***
ఇక ఓ గులాబీ ముందు మోకరిల్లి
తన చూపుడు వేలిని
గుప్పిట బిగించి అన్నాడతను:

"ఓ నెత్తుటి పూవా, నన్ను ఇక
నీ గూటికి తీసుకువెళ్ళు-"

16 November 2016

పొదుగు

చీకటి పడింది -
చెట్ల కింద ఎగిసిన మట్టీ. ఆకుల్లో
రాత్రీ, గూళ్ళల్లో రెక్కలూ
కొంచెం స్థిమిత పడ్డాయి -

కట్టెల పొయ్యిలోంచి మెలికలుగా
పొగ పైకి చుట్టుకుంటుంటే
తాను అన్నది: "ఇప్పటికే

ఆలస్యమయ్యింది చాలా. చాలిక -
తిరిగిరా ఇకనైనా ఇంటికి -"
***
రాత్రి మరిగింది -
చీకటి చెట్ల కింద దారి తప్పి, ఒక  
కుక్కపిల్ల, ఎందుకో మరి
ఒకటే ఏడుస్తున్నది!

14 November 2016

కమిలి

తెప్పలా ఊగుతోంది ఒక ఆకు, వెన్నెలలో -
***
దాని కళ్ళల్లో దిగులు నీడలు: రాత్రి జీరలు -
నిలేసిన తాడుని తెంపుకోలేక
ఊగిసలాటలోంచి సాగలేక

అక్కడక్కడే, తనలో తాను చిట్లి, ఊగుతూ
విలవిలలాడుతుంది ఒక ఆకు -
ఇక ఆ తరువాత, చెట్ల కింది

చీకట్లలో, అలల వెక్కిళ్ళలో, నీటిశ్వాసలో
తన హృదయంలో, చిట్లిపోయి
చిన్నగా రాలి  కొట్టుకుపోయే
***
కాటుక అంటిన, ఆతని కరుకైన చేతివేళ్ళు -  

12 November 2016

ఎండ

ఏటవాలుగా ఎండ -
చివుక్ చివుక్ మని ఎక్కడినుంచో
ఒక పిట్ట -
రాత్రి పెనవేసుకున్న
లతలు, కోసుకున్న వాటి ముళ్ళూ
లోపల -
***
ఏటవాలుగా ఎండ -
బాల్కనీలో ఒక ఖాళీ గూడు. రాలే
ఆకులు -
చెదిరిన మట్టి -
పగిలి కుండీలు. ఆ పగుళ్ళ నీడల్లో
నీటి కేకలు -  
***
ఏటవాలుగా ఎండ -
చివుక్ చివుక్ మని ఎక్కడి నుంచో
ఒక పిట్ట -
నువ్వు వస్తావని
మరచి, నీకై ఇన్ని గింజలూ నీళ్ళూ
ఉంచడం

మరిచి, వెళ్ళిపోయారు ఎవరో - 

10 November 2016

ముసురు

రాత్రి. చలి -
మసకగా ఓ ఇల్లు. అరుగుపై
చీకటీ, ఒక పిల్లి -
బొమికలు చిట్లినట్టు, రాలే
ఆకుల సవ్వడి -
ఎక్కడో దూరంగా చుక్కలు -
తోడివేసే గాలి -
***
T yrocare 125, Septa D 3
Triazolamలతో
ఇంట్లో ఒంటరిగా ఒక్కత్తే
ఒక అమ్మ -

07 November 2016

అసమర్ధత

ఆ రాత్రే, చెబుదామనుకున్నావు నువ్వు  -

బల్లపై దీపం ఉంచి, పాత్రలను సర్ది
చేతులు రుద్దుకుంటూ తను
అలసటతో నీకై ఎదురుచూసిననాడే
ఆ రాత్రే, ఆ చీకట్లోనే, ఎంతో

చెబుదామనునుకున్నావు నువ్వు. సరిగ్గా
ఎన్నో ఏళ్ళ క్రితం ఇలాంటి
రాత్రిలాగే, చేజారి, గాజుగళాసు భళ్ళున
తన కళ్ళవలే పగిలి, నీరంతా

గదంతా చిట్లి, చీకటి వలే చిందిననాడే!

06 November 2016

లోపల

వర్షపు ధార: సాయంత్రపు చెట్లు -
గుబురు ఆకుల కింద
రాత్రి: పగిలిన కుండీలు, చెదిరిన
మట్టి. రాలిన పూలు -
***
చిట్లిన గుడ్ల చుట్టూ అక్కడక్కడే
తిరుగుతోందో పావురం
నానిన రెక్కలతో, వెక్కిళ్ళతో - 

పరిపూర్ణత

పరిపూర్ణం కాలేదు ఏదీ: ప్రతిదీ
సగంలో తెగిన నీడై -
***
రాత్రిలో, చీకట్లో ఊగే కొమ్మలు
కళ్ళల్లో పూల నీడలు
గోడవారగా ధారగా చినుకులు
ముక్కలైన మబ్బులు -
అలసి, వడలి విరిగిన కాడలు
అన్నం పెట్టే నీ చేతులు -
ఒక కథా, చరిత్రా, భాషాస్మృతి
నన్ను కనే నీ మాటలు -
***
పరిపూర్ణం కాలేదు ఏదీ: సర్వం
కలవరిస్తుంది నిన్నే
రాత్రంతా నా ఛాతిపై మూల్గె
ఒక పసివాడి కాలమై!

05 November 2016

గ్రహింపు

నీ కళ్ళ నిండా నీళ్ళు, వానలో
తడిచిన ఆకుల్లా -
***
మబ్బులు కమ్ముకున్నదెప్పుడో
తెలియలేదు
నీడలు వ్యాపించినది ఎప్పుడో
గుర్తించనేలేదు

గాలికి ధూళి రేగి, చెట్లు వొణికి
రాత్రిలోకి నీవై
చినుకులై రాలి ఇంకిందెప్పుడో
గ్రహించనే లేదు -
***
వానలో నీ కళ్ళు. కళ్ళల్లో నేను -
నేనులో చీకటి -
***
ఇక రాత్రంతా మనిద్దరి మధ్య
వెలసినదేదో బొట్టు
బొట్టుగా రాలే మహానిశ్శబ్ధం!

04 November 2016

మొదలు

నా చుట్టూతా ఒక తెమ్మర, ముఖమల్
వస్త్రమేదో చుట్టుకున్నట్టు -
సాయం సంధ్య. పల్చటి కాంతి -

తిరిగి వచ్చే సవ్వడి ఆకాశమంతటా -
వాటి రెక్కల్లోనెమో అలసట
గొంతుల్లో, పిల్లనగ్రోవులై ఇళ్ళు -

ఇక చీకటి పడుతుంది. ఎక్కడో ఏదో
స్థిమిత పడుతుంది. దీపం
ఒకటి వెలుగుతుంది, చిన్నగానే -
***
లోపలెక్కడో, గూడు చేసుకుని ఎవరో
చిన్నగా పొదిగే చోట, ఒక
కదలిక. తల తిప్పి చూస్తానా, మరి

అక్కడే, తలెత్తి చూస్తూ నువ్వు! 

02 November 2016

...

అది ఎలా ఉంటుందీ అంటే
తల్లి స్థన్యం నుంచి
శిశువుని లాగి విసిరివేసినట్టూ

కంటి పొరపై ఒక మంచుతెర
కమ్ముకుంటున్నట్టూ
రాత్రై ఒంటరిగా మిగిలినట్టూ

చీకట్లో ఆకులేవో రాలినట్టూ
గూడేదో చితికినట్టూ
ఓ నిర్జీవ ముఖం అయినట్టూ

అది ఎలా ఉంటుందీ అంటే
నిన్నే తలుచుకుని
అమ్మ వెక్కివెక్కి ఏడ్చినట్టు! 

01 November 2016

ష్

నువ్వు తాకినట్టు చీకటి 
సద్దుమణిగి ఆకాశం -
ష్! మాట్లాడకు. తోటంతా
నిదురలో ఉన్నది 
రాలిన ఆకులో, రాత్రిలో 
రావిచెట్లపై వొణికే 
పసిమి వెన్నెల ఛాయలో!

31 October 2016

ప్రార్ధన

ఇదేనా నువ్వు అడిగినది?
ఆకంత రాత్రిలో
బిందువంత నిద్రనేనా?
పుష్పించే కలలో
ఒక చినుకు పిలుపునేనా?
పిట్ట గొంతు కింది
నునుపైన ఓ స్పర్శనేనా?
ఆ చల్లటి గాలినేనా?
***
ప్రార్ధనై వేలాడుతున్నది
ఒక గూడు: మాటై
మంత్రమై, వెన్నెలై, ఒక
శరీరమై. మరి ఇక
ఇదే సరియైన సమయం -

నువ్వు  తిరిగి రావొచ్చు! 

26 October 2016

ఊహించనిది

ఎంతో రాత్రిలో తన ఇంటికి వచ్చి
తలుపు తట్టాడు అతను -
(తను తెరుస్తుందని, అస్సలు
ఊహించలేదు అతను)
 
బయట చల్లటి గాలి. శరీరంలోపల
మంచు. ఎంతో ఆకలి . మరి
ఎక్కడో చిన్నగా మిణుకుమనే
రెండు గవ్వలాతని కళ్ళు -

ఎంతో రాత్రై వచ్చి తన తలుపులు
తట్టాడు అతను సందిగ్ధంగా
(తన పాదాల సవ్వడినీ, తన
శరీర సువాసననీ ఊహిస్తూ)
***
ఇకా తరువాత, ఎక్కడో దూరంగా
చెట్లల్లో, ఆ మసక వెన్నెల్లో
తడిచి ఊగే నీడలు: గూళ్ళు -

నిద్రలో చిన్నగా పక్కకు ఒత్తిగిల్లి
స్థిమితపడే  రావి ఆకులు!

పదం

రాత్రి, తేలిపోయే ఒక మబ్బు. గాలీ -
అందుకే, తనని తాకితే

చెట్ల కింద, మసక వెన్నెల నీడల్లో
ఆ కనుల చీకట్లలో చెమ్మ -

నీ కోసం ఎదురుచూస్తూ మరెక్కడో
పసిపిల్లయి ఒక అమ్మ!

22 October 2016

అక్టోబర్ రాత్రి

అక్టోబర్ రాత్రి -
తెరలు తెరలుగా గాలి. ఎంతో రద్దీగా
రహదారి -
ఇటు నుంచి
అటు దాటలేక, మనిషిలోని మనిషి
ఆగిపోతే
అక్టోబర్ రాత్రి -
దాటడమెలాగో తెలీదు తాకటమెలాగో
అర్థం కాదు -
***
సగంలో ఆగిన
ఫ్లైవోవర్ కింద, ఎటు పోవాలో తెలీక
చక్రాలకింద

నుజ్జయింది
ఓ కుక్కపిల్ల. పేగులు బయల్పడిన
నీ హృదయమేనా
అది?

20 October 2016

ప్రతిధ్వని

రాత్రి -
ఏ ముళ్ల తీగల్లోనో చిక్కుకుని
చీరుకుపోయి
రెక్కలు కొట్టుకుంటూ
నువ్వు -

నింగిలో
నెత్తురు చుక్కలు. నేలపై
వాన చినుకులు -
అవే, నీ కళ్ళు: గాలై, ఒక
గాయమై -
***
ఎవరో
మంచినీళ్ళై గొంతు దాకా
వచ్చి, ఆంతలోనే
వొలికిపోయిన, ఒక మహా
శబ్ధం!   

19 October 2016

ఇక్కడ

చీకట్లో
జ్వలించే నిప్పుల అంచుల్లో
ఆ ఎరుపూ నలుపూ
రంగుల్లో
నువ్వూ, నేనూ -

ఓ మాగ్ధలీనా, తాకు -

ఇక నెమ్మదిగా, భస్మిపటలం
అవుతుందీ రాత్రి
ఓ హృదయం
ఈ దినం!

16 October 2016

నిస్సహాయత

సెగ సోకిన గులాబీ వలే, వడలి
తన ముఖం -
***
వేడిమి గాలి: తన చేతివేళ్ళల్లో -
పెదాలపై దాహం -
చేజారిన పింగాణీ పాత్రా, ఆగిన
రాత్రీ తన దేహం -
ఇక నలిగిన గుడారం వలే తను
అక్కడే మంచంపై
ముడుచుకుని వొణుకుతుంటే
***
ఎదురుగా అతను, నిరత్తురడై
ఒక వస్త్రం కాలేక -
ఏమీ చేయలేక, వేలి అంచుతో
కమిలి చెమ్మగిల్లిన

ఓ లిల్లీపూవును అట్లా తుడుస్తో!

13 October 2016

అలజడి

మునిమాపు వేళలోకి రాలిన నీ శిరస్సు
ఒక పొద్దుతిరుగుడు పూవు -
చిట్లిన సవ్వడి  చేసే సన్నటి రాత్రి
కొమ్మలు నీ చేతులైతే మరి

నీడలతో వొణికే నీటి చెలమలేమో
నీ కళ్ళు: (అనాధల మల్లే) -
ఇక, ఏదో చెప్పాలని కష్టంగా నువ్వు
నాలికతో నీ పగిలిన పెదాలని

తడుపుకుంటే, ఇష్టంగా రాసుకున్న
పలకని ఎవరో తుడిపివేసినట్టు
నీలో ఒక నిశ్శబ్ధం: ఎంతో నొప్పి -
లోపల ఎక్కడో, స్మశానంలో

నేలను తాకి ఆకు చేసే అలజడి!  

12 October 2016

అస్పష్టత

ఈ రాత్రి నుంచి మరొక రాత్రికి
ఒక చందమామ -
అలసిపోయినదే, కళ్ళల్లో కొంచెం
ధూళితో, నీళ్ళతో -
ఇక వాటితో, ఆ కనురెప్పల నీడల్లో
ముఖం కడుక్కుంటూ
ఇట్లా, గొణుక్కుంటాడు అతను
తనలో తాను -
***
" నీతోనే ఇక, కుంకుమ రెక్కలు
ఎగిరే కాంతిలోకి
మరణ జననాల మధ్య చలించే
ఒక విస్మృతిలోకి!"

09 October 2016

ఏమీ లేనిది

రాత్రి. నేలంతా తడిచి, గాలంతా
తడిచి, ఒక పరిమళం -
గాలి నీ చుట్టూ ఓ సీతాకోకచిలుకై
ఎంతో తేలికగా ఎగిరే శబ్ధం -
ఆకులూ, పల్చటి కాంతిలో ఊగే
లతలూ,  నీడలూ, గూళ్ళల్లో 
ఒదిగిన పిట్టలూ ఇక నీ లోపల -
***
అన్నం ఉడుకుతోంది, ఈ రాత్రై
ఒక పాత్రై, తాను వేలితో
చిదిమి చూసే ఒక మెతుకై!       

స్థితి

చీకట్లో మెరిసే పూలను చూపిద్దామనీ
వాటిలో కమ్ముకున్న మబ్బులనీ
కురిసే తుంపరనీ, వీచే గాలినీ, ఖాళీనీ

నీకు ఇద్దామనీ వచ్చాను నేను. కానీ
అప్పటికే నిద్రపోయి ఉన్నావు నువ్వు -

పగిలిన పలకవై, బలపమై, చీకట్లోని
ఖాళీవై, నేల వాలిన గాలివై ఒక
మబ్బువై, ఎంతో అలసిన అమ్మవై!

06 October 2016

ఒడ్డు

ఎంతో అలసి పోయి ఉన్నాయి నీ కళ్ళు
నీట మునిగిన పాలరాళ్లల్లా -
***
నీటిపై కొట్టుకుపోతూ, దేనికో తట్టుకుని
ఆగిన ఎండు కొమ్మల్లా నీ చేతులు -
నానిన ఒక కాగితమై నీ శరీరం, నువ్వూ -
(వాటిపై అలుక్కుపోయిన పదాలూ
వాటి శబ్దాలూ, ఇక నేను) మరి అందుకే

ఇంకో దినం గడిచింది. రాత్రి అయ్యింది -
ఎంతో అలసటగా ఒక చేయి నీలో
ఒక పక్షై ముడుచుకుంది. అలసిన దాని
హృదయం చిన్నగా విశ్రమించింది -
(అలుక్కుపోయిన వాటిని అది దిద్దింది)
***
ఎంతో రాళ్ళయిన అతని కనులు - ఇక
తడిచాయి: నీటిలో, తేటగా!

05 October 2016

స్ఫటికం

పూవు మీద వెన్నెల వాలినట్టు, ఎంతో
తేలికగా తను నీతో, నీ పక్కగా -
***
ఎంతో తేలికగా ఒక పూవు: చీకటి కమ్మిన
ఆకాశాన్ని నింపుకుని, వర్షాన్ని
తన కళ్ళల్లో దాచుకుని -
ఎంతో బరువుగా ఒక నువ్వు: ఊగే తెరలై
లోపలి రాలేని గాలై, ఇకెప్పటికీ
తెలవారని ఒక రాత్రివై -
***
పూవు ఎవరు? రాత్రి ఎవరు? మౌనమైన
పూలల్లో చేరిన కన్నీరు ఎవరని
నువ్వు అసలే అడగకు -
***
వెన్నెల నీడల్లో ఆకు ఒకటి కదిలినట్టు
ఎంతో తేలికగా నీ పక్కగా తను -
***
నీ రాత్రై, గాలై, గాలిలో తడబడే నీలో
ఓదార్పుగా నిలబడ్డ గూడై!

27 September 2016

గురుతు

ఇంటికి వచ్చావు నువ్వు
ఎన్నో ఏళ్ళకి -
***
ఎండిపోయి ఉంది నేల -
సున్నం వెలసిపోయి
పగుళ్లిచ్చిన గోడ: లీలగా
ఊగే కర్టెన్లు, నీడలు -
పాతదే మంచం: నలిగిన
దుప్పటి: తల నూనె
మరకలతో దిండు. రాలి
తన తెల్లని శిరోజాలూ -
***
ఇంటికి వచ్చావు నువ్వు
ఎంతో కాలానికి -
***
మరి ఇక ఎందుకో కానీ

నిన్ను కావలించుకుని
బావురుమంది
ఒక తల్లి అప్పుడు!

26 September 2016

విను

వెళ్ళిపోకు, అని అన్నాడు అతను, ఆమెతో
చాలా చిన్నగా, నెమ్మదిగా -
***
వెళ్ళడానికి తను లేచినప్పుడు, ఒక్కసారిగా
ఆకులు జలదరించాయి -
కొమ్మల్లోంచి పక్షులు లేచాయి. ధూళి ఎగిసి
అంతా అస్పష్టం అయ్యింది -
***
వెళ్ళిపోకు, అని అన్నాడు అతను, తనతోనే
చాలా చిన్నగా, నెమ్మదిగా -
***
ఇక ఆ తరువాత, అతని ఎదురుగా రాలిన
ఆకులు. హృదయంలో
వాటి ఖాళీ సవ్వడి. పక్కగా, అట్లా వాలిన
(మరి అతనిదే అయిన)

రాత్రిలాంటి, బిక్షపాత్రలాంటి, నీడలాంటి
ఒక ఒంటరి అరచేయి!

25 September 2016

చీకటి

అలవాటయిన చీకటి -
దాదాపుగా, తాకినంత దగ్గరలోనే నువ్వు:
ఈ వర్షపు గాలీ -
ఎక్కడి నుంచో మరి
గులక రాళ్ళపై నుంచి దొర్లిపోయే సన్నని
నీళ్ళ సవ్వడి -
(మరి, అది నీలోనా
నీ కళ్ళల్లోనా, నాలోనా అని అడగను నేను
కానీ) తేలిపోయే
ఆకులూ, నెమ్మదిగా పిగిలే
గూళ్ళూ, నదిలోకి జారిపోయే ఇసుకా ఇక
మన మాటల్లో -
***
అలవాటయిన చీకటి -
దాదాపుగా, తాకేంత దగ్గరలోనే, ఉండీ
తాకలేక ఇక
ఆ చీకట్లోనే నువ్వూ
ఆ చీకట్లోనే నేనూ, ఆ స్వీయచీకట్లోనే
బహుశా అందరూ!

24 September 2016

జొనాథన్

జొనాథన్! ఓ జోనాథన్. చింతించకు -
గడిచిపోయాయి ఎన్నెన్నో వర్షపు రాత్రుళ్ళు ఇలాగే, ఆరుబయట గాలుల్లో చినుకుల్లో, మన లోపల వణికే ఆకులతో, తడిచిన మట్టి దారులతో, మూసివేసిన షట్టర్ల ముందు ముడుచుకుని తాగే బీడీలతో, హృదయంలో మెరిసే చుక్కలైన వాటి నిప్పుకణికెలతో, తూగే మత్తైన మన మసక మసక మాటలతో -

జోనాథన్, ఓ జోనాథన్ చింతించకు - 
గడచిపోయాయి యుగాలు ఎన్నెన్నో ఇల్లాగే, చీకట్లో గూటిలో మెసిలే తెల్లని పావురంలాంటి తన ముఖంకై వేచి చూసే ఫిరోజ్ లాగే, నీ లాగే, నాలాగే: బయటకి చెప్పుకోలేని మరెంతో మంది అనాధల్లాగే -

జోనాథన్! ఓ జోనాథన్. దా -
చింతించకు. ఉంది ఇన్నాళ్లూ నేను దాచిపెట్టుకున్న ఒక మధుదీపం. ఒక రహస్య పద్యం: తన చేతులతో, తన సువాసనతో, తానే అయిన వెచ్చదనంతో, మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని ఒక వలయపు కాంతిలో సృష్టినంతా అదుముకుని -

జోనాథన్, ఓ జోనాథన్. దా -
మరి, మన పూలలోగిళ్లలోకీ, గుహల్లోకీ, చీకటితో, స్మృతితో, మసక వెన్నెలతో, లతలు ఊగే బాల్కనీలలో కుండీలైన పిల్లలతో! మరి ఇక ఇంకేం కావాలి మనకి, జోనాథన్ ఓ జోనాథన్, వెన్నెల మంచుపొగై రాలే ఈ అర్థరాత్రికీ, ఈ చరణాలకీ, అర్థరాత్రిలో పుష్పించే ఈ మూగ సుమాలకీ?

23 September 2016

C Am F G

babe
డౌన్ అండ్ అవుట్ -
ఇక ఓపిక లేక ఇక్కడ, నీ పక్కన, అలసి
విరిగిన ఒక వాయిద్య
పరికరంలా పడి -

ఎండి రాలిందో, రాలి
ఎండిందో మరి ఒక ఆకు: అది కూడా మరి
నీ పక్కనే, ఒక పక్షి
ఈకలా ఊగుతూ
మూల్గుతూ -

(యు నో -
there is hardly any difference
between the two:
I mean
నేల రాలిన ఒక పక్షిపిల్లకీ
చిగురుటాకుకీ
చినుకుకీ!
And they all owe
this to you
this rain
to you)

సరే, మరే
babe, I'm డౌన్ అండ్ అవుట్ -
stoned and drowned
ఇంకీ రాత్రిలోకీ
నీ గుంతల కనులలోకీ
వాటి నీళ్ళల్లోకీ
నీళ్ళల్లోని చుక్కల్లోకీ
నీ చేతుల్లోని
గాలిలోకీ, గాలిలో ఊగే
ఓ గూటిలోకీ
నువ్వివ్వగలిగే ఒక గుప్పెడు
నిద్రలోకీ
మరి

babe, ఫర్ ది ఓల్డ్ times' సేక్
why don't you
play me like a sitar
strum me like
a guitar
and put me to sleep
in the scale
of C Am
F and G?

20 September 2016

అంతే!

చల్లని అల ఒకటి, పాదాన్ని తాకి వెళ్ళిన గగుర్పాటు. చిన్ని ఆనందం: చినుకు ఒకటి ముఖాన రాలినట్టు, రాత్రి గాలి నీ కురులను చెరిపి నక్షత్రాలనీ, పూలనీ చూడమనట్టు, వెనుక నుంచి ఎవరో నిను తాకినట్టూ, ఒక పరిమళం, మేఘమై నిన్ను చుట్టినట్టూ, లోపలేదో వికసించినట్టూ రెక్కలు వచ్చి ఎగిరినట్టూ, అట్లా పాడినట్టూ, లోకాన్ని చూసి పగలబడి నవ్వినట్టూ -
***
అదే: అదే అదే అడుగుతూ ఉన్నాను మళ్ళా మళ్ళా: నిండుగా ఎవరిలోకో మునిగిపోయావా లేదా అనే: దారీ తెన్నూ లేక పూర్తిగా కొట్టుకుపోయావా లేదా అని మాత్రమే. అదే: అదే, అదే -
***
ఇంకానా? అయ్యో! ఇంకేం లేదు -

రాత్రిని తన గూటిలో పొదుగుతూ, వెన్నెల్లో ఓ చందమామ: నా చేతుల్లో నవ్వుతూ, మెరుస్తూ ఒక చిన్ని కుందేలు పిల్ల! అంతే!

19 September 2016

ఎందుకో

చెట్లనూ, పూల కొమ్మలనూ కొట్టి వేసారు
నేలనంతా చదును చేసారు -
ఇక ఒక విగ్రహాన్ని ప్రతిష్టించి, వాళ్ళు
తిరిగి పూల కోసం ప్రార్ధించారు -
సాగిల పడి మొక్కారు, పోర్లారు, ఒట్లెన్నో
పెట్టుకున్నారు, పోయారు -

ఇక ఆ తరువాత, ఆ రాత్రంతా ఒక తల్లి
జుత్తు విరబోసుకుని, గుండెలు
బాదుకుంటూ ఒకటే ఏడ్చింది ఎందుకో -
తన తొడల మధ్య నెత్తురుతో
కళ్ళల్లో విగ్రహాలైన అశ్రువులతో, పూల
వెక్కిళ్లతో మాటిమాటికీ మూలిగే

గాలితో, తెగిన చెట్ల చేతుల కంపనతో!

18 September 2016

ఎక్కడో, ఎప్పుడో

"నొప్పి/ఏం?/ఏమో తెలియదు. కానీ, నువ్వు ఉండు/ నేనెట్లా ఉండగలను ఎప్పటికీ?/ ప్లీజ్. చాలా ఒంటరిగా అనిపిస్తుంది/ ఇంకా?/ లోపల తవ్వుకుపోయినట్టు కూడా ఉంది/ "హ్మ్. అవునా?/ రాత్రులు, గొంతుని ఏవరో పిసుకుతున్నట్టూ ఉంది/ ... / ఏడుపొస్తుంది / పక్కన ఎవరూ లేరా? అమ్మని రమ్మనక పోయావా? / నువ్వు ఉంటావా? భయంగా ఉంది/ ... / తలుపులు వేసినా ఇంట్లోకి ఎవరో వచ్చి తచ్చాట్లాడుతున్నట్టు ఉంటుంది/ ... / యు నో దోజ్ సౌండ్స్. నీళ్ళు ఒలికి పడుతున్నట్టూ, గిన్నెలు కదిలినట్టూ.../ హ్మ్... / అద్దంలోంచి ఎవరిదో ముఖం బయటకి చొచ్చుకు వస్తున్నట్టు... / ఎంతయింది టైం అక్కడ?/ ఇ డోంట్ నో. మే బి ఒకటిన్నర / తిన్నావా? / లేదు / ఏమైనా తిను / మంచం మీద నుంచి కిందకి దిగలేను. కిచెన్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది / మరి ఎట్లా? / నా సంగతి వదిలేయి. నువ్వు చెప్పు, ఏమైనా- / ఐ గాట్ట గో / /అప్పుడేనా? ఏం? / నొప్పి / నీకెందుకు? / ఏమో తెలియదు, కానీ గాట్ట గో / /చెప్పు, ఏమయ్యింది? / గ్లాసులోకి ఓ పోయెంని ఒంపి ఊపాను. అది కిందకి ఒలికిపోయి గట్టిగా అరిచింది / అయ్యో... / కానీ, లకీ. పగల్లేదు అది / మరి? / /నెమ్మదిగా లేచి, పగిలిన గాజుముక్కల్ని ఏరుకుంది.../ వాటిని కానీ, తిన్నదా ఏమి? డిడ్ ఇట్ ఈట్ దెమ్? / ఎస్. దాని గొంతంతా రక్తం. కన్నీళ్ళూ . అండ్ యు నో, ఇట్ స్మెల్డ్ ఆఫ్ యు / ఓ. ఆ తరువాత?/ రెండు పూవులు, రెండే రెండు పూవులు గాలికీ వానకీ ఊగాయి. ఊగీ, ఊగీ రాలిపోయాయి. ఇంకెక్కడో పాలింకి పోయాయని ఓ అమ్మ ఏడ్చింది. / "ప్చ్. మరి తను ఏమంది? / / ఒక తెల్లని రాత్రిని తాడులా మెడకు చుట్టుకుంది. అద్దంలోని చేతులను వేడుకుంది./ అవునా? ఇక నేను వెళ్ళనా? / ఒద్దు. వెళ్ళకు. కాసేపు ఉండు. ప్లీజ్. కొద్దిసేపే/ ఏం? ఎందుకు? / నొప్పి / ఎందుకు? / ఎందుకో తెలియదు. కానీ, ఎవరో లోపల త్రవ్వుతున్నట్టూ, గొంతుని ఎవరో పిసుకుతున్నట్టూ, అద్దంలోంచి ఎవరిదో ముఖం పుర్రై వెలుపలికి వస్తున్నట్టూ, నవ్వుతున్నట్టూ, నువ్వైనట్టూ ... /

16 September 2016

పిట్ట కథలు

వెడుతున్నాను/ ఎక్కడికి? / నిద్ర దగ్గరికి / అప్పుడే? / ఊ / ఎట్లా? / నవ్వుతో / అవునా? / అవును. నిద్ర నవ్వింది / నిద్రా నువ్వూ ఎప్పుడు ఒకటి అయ్యారు?/ నిద్రలో ఎవరో నవ్వినప్పుడు / అప్పుడు ఏమయ్యింది?/ ఒక దీపం వెలిగింది, ఆ వెలుతురు పూల వాసన వేసింది /ఆహా, ఇంకా ఏం జరిగింది?/ పూల పరిమళంలోకి ఒక పిట్ట వచ్చి వాలింది/ ఊ, ఆ తరువాత?/ పిట్ట హృదయం మబ్బు వలే మసకేసింది, గాలి వోలె ఊగింది, ఆడింది, పాడింది /ఇంకా?/ ఓ ఊయలలోకి అది చినుకువలే, కునుకు వలే జారింది/ ఊ, ఆ తరువాత? అప్పుడు ఇంకా ఏవైంది?/  చుక్కలతో చినుకులతో, వెన్నెలంత దయతో ఒక సీతాకోకచిలుక నా అరచేతుల్లో నిదుర పోయింది/ మరి నిదురలో ఏం జరిగింది?/ నిదురలో, కలలలో, కలల రంగుల్లో, రంగుల నీడల్లో ఒక జీవితం గడచిపోయింది/ ఆ తరువాత?/ వాన కురిసింది, గూడు తడచింది, అరచేతుల మధ్య చీకటిని ఓపలేక ఒక పూవు ఎగిరిపోయింది/ ఉఫ్ఫ్ ... మరి పిట్ట ఏమయ్యింది?/ రాత్రిలో, పూలు లేని చీకట్లలో, తన రెక్కలతో ఎవరికీ ఏమీ వ్రాయలేక, గొంతు పెగలక, తనలో తాను కూరుకుపోయింది/ ఇక ఎగురలేక, కింద పడి, రాలిన ఆకుల మధ్య చనిపోయింది/అయ్యో! ఆ తరువాత? ఆ తరువాత ఏమయ్యింది?/ వెడుతున్నాను/ ఎక్కడికి?/ నిద్రలోకి/ అప్పుడే?/ ఊ/ ఎట్లా?/ మట్టిలోకి ఇంకిన ముదురు వర్ణపు ఆకుల అలజడితో/ పీలికలైన గూటితో/ చుట్టూ రాలిన ఈకలతో/ మబ్బుల్లోకీ, నేలలోకీ/ నీతో, నాతో, తనతో, తిరిగి రాలేని ఒక చోటులోకి, నిద్రలోంచి నిద్రలోకి/ కలలోంచి కలలోకి/ ఇట్లా/ఇట్లిట్లా/ఎప్పటిలా ...

13 September 2016

పాఠం

తెరువు కిటికీలను -
రానివ్వు లోపలికి, గాలినీ వాననీ పూర్తిగా -
తడచిపో, మొత్తంగా -
దాచుకోకు ఏమీ -

ఆరుబయట
చెట్లకింద, ఎగిసెగసి పడి పాడుతోంది
ఎండిన ఓ ఆకు
గాలికీ, చినుకులకీ, తాను వెళ్ళిపోయే
సంరంభానికీ -

భయం దేనికి? దా -
నువ్వూ ఇక్కడికి: నీలోని కిటికీలనూ
తలుపులనూ పూర్తిగా తెరచి
మొత్తంగా తడచి
రాలిపోయి

ఎవరిలోకో నిండుగా కొట్టుకుపోయి!

బహుశా...

వానాకాలం చీకటి -
అప్పుడే ఆర్పిన కట్టెల పొయ్యిలోంచి
చిన్నగా పైకి ఎగిసి
తేలిపోయే పొగ -
దూరం నుంచి, చిన్నగా మెరుస్తూ
సద్దుమణిగే, నిప్పుల
చిటపట సవ్వడి -
వలయాలుగా గాలి: వొణికే ఆకులు -
మాటలు -
బహుశా, నీ హృదయపు అంతిమ
సంజ్ఞలు -
***
వానాకాలపు రాత్రి -
చుక్కలు లేని చీకటి. ఇక, నీలో
ఓ మూలగా
తడిచి నానిపోయి ఊగిసలాడే
ఒక ఒంటరి
గూడు!

04 September 2016

అనువాదం

నిద్రపోయి ఉన్నావు నువ్వు -

పూల తీగలేవో చిన్నగా ఊగినట్టు, నీ ముఖంపై
పల్చటి నీడలు: శ్వాస వలే గాలి. సందిగ్ధంగా
ఊగిసలాడే రాత్రి కాంతి (నిన్ను లేపలేని
నా హృదయం వలే) -

ఇక నిన్ను లేపలేక, ఆ నీడల్లోనే, వాటి లోతుల్లోనే
లిపిలేని వాటి శబ్ధాలలోనే చిక్కుకుపోయాను
నేను. అక్కడే (అనువాదం లేని పదాన్నై)
మిగిలిపోయాను నేను -
***
మృత్యువు అంటే ఏమిటి? అనేనా నువ్వు ఆ రోజు
నన్ను అడిగినది? నిద్రించే నీ కనులకింద
కదిలే పూరేకుల శబ్ధాల్ని వినడమనీ
శ్వాసించడమనీ చెప్పానా

నేను నీకు ఇంతకు మునుపు ఎన్నడైనా? 

30 August 2016

అమ్మాయీ

అమ్మాయీ
ఎంతో కాంతి నీ ముఖంలో -
కొంగలు ఎగిరే సరస్సులు నీ కళ్ళల్లో -
ఊగే చెట్లూ, గాలీ
నీ మాటల్లో!

అమ్మాయీ
దిక్కూ మొక్కూ లేని పక్షులు
చేరే గూళ్ళా అవి, నీ పల్చటి చేతుల్లో?
రాత్రి నవ్వులా అవి
చుక్కలు

చినుకులై
మెరిసే నీ తనువులో? అంతిమ
మృత్యువేనా అది, లాలనగా పిలిచే
నీ ఒడిలో? జీవన జోల
పాటేనా అది
నీలో?

నాలో?
***
అమ్మాయీ
ఎంత కాంతి, నీ ముఖంలో!
ఎంత శాంతి , నీలో!

ఎంత కాంతీ, శాంతీ
నిన్ను చూసిన ఆ క్షణంలో!
ఆ కృతజ్ఞతలో!

29 August 2016

నీ నవ్వు

ఉన్నటుండి, పకాల్మని ఎందుకో నవ్వుతావు నువ్వు -
గుత్తులు గుత్తులుగా పూవులు
రంగురంగుల చినుకులై
మెత్తగా రాలిపడినట్టు -


(అదే పరిమళం, అదే సవ్వడి: మరి అదే గాలీ నీరూ
అప్పుడు: నీ ఎదురుగా, దిగులు
దిగులుగా, బేలగా నేను
నీతో కూర్చున్నప్పుడు)
***
ఉన్నటుండి, ఎందుకో పకాల్మని నవ్వుతావు నువ్వు -
ఎందుకూ అని నేనూ అడగను
కానీ, "ఒక కుందేలు పిల్ల
నవ్వీ, నవ్వీ, నవ్వీ

ఒక్క క్షణంలో నన్ను నాకే చూయించి మాయ చేసి
ఏటో మాయం అయ్యింది" అని
నేను అంటే, రేపు ఇక నన్ను

ఎవరైనా ఎట్లా నమ్ముతారు చెప్పు? 

27 August 2016

బహుమతి

సాయంకాలపు నీడలూ, కాంతీ తన ముఖంలో -
కళ్ళేమో నానిన మొగ్గలు. ఒళ్లో
వొదిలేసిన చేతులేమో వడలిన కాడలు -
(నరాలు తేలి, పసుపుపచ్చగా
అవి) ఇక

తను చిన్నగా నడుం వాల్చి నుదిటిపై అరచేతిని
చిన్నగా వాల్చుకుని "నానీ, కాస్త
లైటు ఆర్పివేయి" అని లీలగా అంటే, బయట
ఉగ్గపట్టుకున్న రాత్రి కరిగింది -
అతి నెమ్మదిగా

గాలి వీచి, ధూళి రేగి, నేలపై ఆకులు దొర్లి, చీకటి
సవ్వడి చేసింది. తన శరీరంపైనుంచి
అలలా ఒక తెర ఏదో, తాకి వెళ్ళిపోయింది -
అలసట వదులవ్వుతూ, ఇక
మ్రాగన్నుగా తను

ఒక కలవరింత అయ్యింది. కంపించింది. ఆనక
ఆకులపై జారే మంచువోలె, తను
నిదుర ఒడ్డున ఒక గవ్వై ముడుచుకుపోయింది.
తెల్లని పావురమైపోయింది -
నిశ్శబ్ధమయ్యింది -

మరి అందుకే, నువ్వసలు మాట్లాడకు శ్రీకాంత్!
ఊహలోనైనా తనని కదపక, అలా
తనని తనతో ఉండనివ్వగలగడమే, నువ్వు
తనకి ఇవ్వగలిగిన, ఒక విలువైన
బహుమతి!

25 August 2016

వాన

వాన పడుతున్నది. నడి దినం మసక చీకట్లలో చిక్కుకుని ఉన్నది. గూడు చెదిరి ఒక పావురం నిలిచిన నీళ్ళల్లో అలజడిగా కదులుతున్నది. జలజలా ఆకులు రాలి, నేల వొణుకుతున్నది. గాలికీ, చినుకులకీ భీతిల్లి ఒక పాప చెట్టు కింద ఆగి ఉన్నది. నీటి ధారకి పాదాల కింది మట్టి జారి పోవుచున్నది. ఏమీ తోచకున్నది. హృదయమొక పావురమై, ఆకులు రాలిన నేలై, పాపై, తడిచిన కాగితమై బెంగటిల్లి దిక్కు తోచక అటూ ఇటూ తల్లడిల్లుచున్నది. నలు దిక్కులలోకీ ఏదో లాగుచున్నది. తిరిగి మరల లేనంతగా, ఏదో పిలుచు చున్నది. ఎటుల బయటపడుటనో తెలియకున్నది -

బయట వాన పడుతున్నది. గూడు లేకున్నది. రెక్కలు తడిచి ఉన్నవి. చీకట్లు ముసురుకుని ఉన్నవి. దారి తెలియకున్నది. దీపం వెలుగక, ఎవరూ కాన రాక, లోన దిగులుతో, పావురమింకా తచ్చాట్లాడూతూనే ఉన్నది. తల్లి లేక, రాక, చెట్టు కింద, కాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని పావురం కళ్ళతో, ముడుచుకుని పాప వాలిపోయి ఉన్నది. దారులన్నీ సోలి ఉన్నవి. పూవులన్నీ రాలి ఉన్నవి. ఊపిరిని ముడి వేసి బిగించినట్టూ, హృదయాన్ని నులిమినట్టూ

ఇంకా లోన వాన పడుతూనే ఉన్నది. గూటికి దారి ఏటో, గూడు ఉన్నదో లేదో కూడా తెలియకున్నది. ఆగక ఇంకా, ఇంకా, ఇంకా - వాన పడుతూనే ఉన్నది. నువ్వై వాన కుండపోతగా కురుస్తూనే ఉన్నది!

పోషణ

తెరచే ఉన్నాయి కిటికీలు. మంచులా
వ్యాపించే చీకటి. చిన్నగా గాలి -
ఆరిన పొయ్యి. పల్చటి పొగ -

నీకు ఆనుకుని కూర్చుని ఉంది తను -
రొట్టెల వాసన తనలో. గ్లాసులో
నీళ్లు ధారగా పడి ఎగిసి, తిరిగి

స్థిమిత పడే ఒక మెత్తని సవ్వడి నీలో -
***
ఇక బయట రాత్రిలో, తనలో అతనిలో

మసక వెన్నెల తాకిడికి
నెమ్మదిగా ఊగే రెండు ఎర్రెర్రని
దానిమ్మ పూలు!

22 August 2016

పిచ్చుక, గింజ

ఎవరు నేను, అని అడిగింది ఒక
అమ్మాయి  -
చిన్న పిచ్చుకవు, చేపాను నేను -
మరి నువ్వు? అని అడిగింది
అదే అమ్మాయి  -
ఒక గింజను, చెప్పాను నేను -
***
ఇక మారు మాట్లాడక, గింజను
నోట కరచుకుని
తుర్రున ఏటో ఎగిరిపోయింది

ఆ తుంటరి పిచ్చుక!

21 August 2016

వినతి

ఎంతో ఎదురుచూస్తారు పిల్లలు, అమ్మ కోసం -
***
ఈ లోగా చుక్కలు మెరుస్తాయి. ఆవరణలో
వేపాకులు రాలుతాయి. ఒక పిల్లి
మెల్లిగా, చెట్టుకు రుద్దుకుంటే

తెల్లని లిల్లీ పూవులు ఊగుతాయి. నల్లని
రాత్రుళ్ళాంటి కనులలో వనాలూ
గాలీ, ధూళీ, ఎగిసి పడతాయి -

ఇక చెట్లల్లోని చెమ్మా, తడి ఆరని పాదులూ
గూళ్ళల్లో మెసిలే పక్షులూ, వణికే
నీడలూ, కోసే బెంగా, వాళ్ళల్లో -
***
ఎంతో ఎదురు చూస్తారు పిల్లలు, నీ కోసం -
***
తల్లి ఎవరైతే ఏం? ఇంటికి వెళ్ళు నువ్విక
తొందరగా, హృదయాన్ని బొమ్మల
బుట్టగా మార్చుకుని: బహుశా

ఇకనైనా నువ్వు, ఒకసారి బ్రతికిపోవచ్చు!

హంతకుడు

మసి పట్టిన ఒక దీపం: మసకగా
దాని చివరి వెలుతురు -
రాత్రి గాలి. ఖాళీ గూడు. ఎక్కడో
ఆకులు కదిలి, మరి
అవి రాలే చప్పుడు: నీ లోపల -
దీపం పగిలి, చీకటి
నీలో దిగినంత లోతుగా, జిగటగా -
***
ప్రేమను అడుక్కోగలవా నువ్వు
నెత్తురంటిన చేతులతో?
***
ఇక నీ చుట్టూ నీ పదాల నీడలు
ఉరికొయ్యలై, తాడులై!

18 August 2016

అపరాధి

ఎంతో రాత్రి అయ్యింది. ఇక ఇంటికి వెళ్ళాలి
నువ్వు -
***
దారేమో, వొంపులు తిరిగిన ఒక నల్లని పాము
శరీరమేమో క్షతగాత్రుల క్షేత్రం -
గాత్రమేమో, పగిలిన ఒక వేణువు. మరి చూపేమో
రాయికి మోదుకుని చిట్లిన గోరు -
ఇక హృదయం అంటావా? అది తల్లిని వీడిన
ఒక ఒక పసివాని మోము: ఎడతెగని
రాత్రుళ్ళ దప్పికా, ఉలికిపాటూ, కలవరింతా -
***
ఎంతో రాత్రి అయ్యింది. ఇక ఇంటికి వెళ్ళాలి
నువ్వు -
***
ఇంటికి వెళ్లి, నెత్తురంటిన నీ అరచేతులని

మరి కడుక్కోవాలి నువ్వు!

15 August 2016

నిదుర నిండిన పూవులు

నిదురను ఇచ్చే పూవులు -
నిదురను తూలే పూవులూ, నిండైన మబ్బుల
రాత్రుళ్లూ నీ కళ్ళు -
***
మసక వెన్నెల మెల్లిగా నిమిరే కనురెప్పలు -
చినుకులు సోలే చేతివేళ్ళు -
చీకటి చిన్నగా నవ్వితే

మిణుకుమనే పెదిమలు: లతలు లతలుగా
గాలి సోకే బుగ్గలు. కథలైన
చెవులూ, వాలిపోయే

చేతులు. ఆడీ ఆడీ అలసిపొయిన పాదాలు -
తల్లి అరచేతిలో మిగిలిపోయిన
అన్నం ముద్దలూ, తన

బ్రతిమలాడుకోవడాలూ, ఎవరి మాటా వినక
చివరికి నిదుర చెరువులోకి
బుడుంగున మునిగే

తుంటరి కప్పపిల్లలు, నీ కళ్ళు !
***
ఎంత రాత్రి ఇది! ఆకాశంలోంచి
రాలి, నిను నిద్రలో ముంచే ఎంతెంత కలల
పూల రాత్రి ఇది!
***
సరే! ఇక బజ్జుకో నువ్వు -
ఏనుగులంత మబ్బుల్లోంచి తప్పించుకుని
నెమ్మదిగా

ఎటో జారుకుంటోంది
నువ్వు లేని, నీ అంత, కుందేలు అంత
ఓ చందమామ!

13 August 2016

పరిశీలన

వెళ్ళిపో, నువ్వు నాకేం
అక్కరలేదు
అని అంది కవి ప్రియురాలు
అతనితో -
***
మబ్బు పట్టింది. రాత్రి
అయ్యింది -
ఎవర్నైనా అంత తేలికగా
వదిలి ఎలా
పోవటం?
***
ఎక్కడ ఉన్నావు? ఇక
ఇంటికి రా
అని అన్నది కవి ప్రియురాలు
అతనితో -
***
ప్చ్ప్. ఏమీ మారలేదు -

ఒక కవీ
అతని కవితా, ఊగే ఆకుల్లో
వణికే, రాత్రి
చినుకుల

హృదయ సవ్వడి!

12 August 2016

కాదా

ఊదా రంగుల పూవులు
నీ నవ్వులు -
మెరిసే గలగలలతో ఊగే
ఒక షాండ్లియార్

కాదా నువ్వు?!
నాలో ఆకస్మికంగా వెలిగిన
వేల దీపాల
రాత్రి కదా నువ్వు?
నవ్వు

నువ్వు: ఎప్పటిలానే -
అన్నీ మైమరచి
ఏటో కొట్టుకుపోవాలి
ఈ చిన్ని

పద్యం, నా జీవితం!

09 August 2016

పిల్లి

రాత్రి ఒక పిల్లి పిల్ల వచ్చింది, ఎక్కడినుంచో. కిటికీలోంచి లోపలికి చూస్తూ మ్యావ్మంటో - పాలు పోసినా త్రాగక, నావైపే చూస్తో: నీకు పిల్లి భాష ఏమైనా తెలుసా? అని అడిగింది ఓ అమ్మాయి ఒక మూల ముడుచుకుని కూర్చున్న నాతో

పిల్లులు ఎందుకు వస్తాయో, వాటికేం కావాలో అవి మాటిమాటికీ ఎందుకు మ్యావ్మంటాయో పాదాల చుట్టూతా ఎందుకు తిరుగుతాయో, అట్లా మిడి గుడ్లేసుకుని నిన్నే ఎందుకు చూస్తాయో నువ్వు విదిల్చి వేసినా, కసిరి కొట్టినా అన్నీ మరచి, మళ్ళీ నీ వెనుకెనుకే అట్లా ఎందుకు రుద్దుకుంటూ తిరుగుతాయో

అమ్మాయీ, ఎవరికి తెలుసు? వెళ్లి మరెవర్నైనా అడుగు. కిటికీలోంచి లోపలికి వచ్చి, పాలు త్రాగి ఒక మూల ముడుచుకుని పడుకుని, అర్ధనిమిలిత నేత్రాలతో నిన్నే చూసే, నన్ను మాత్రం నువ్వసలే అడగకు!

నీ నిశ్శబ్ధానికి

ఎంతో ఆలస్యం, ఈ సాయంత్రానికి -
ఎంతో ఓపిక, ఈ సాయంత్రాన్ని అదిమి పట్టుకున్న
నల్లని మబ్బులకి. మరి

ఎంతో కరుణ, మబ్బులని దాచుకుని
నన్ను చూసే నీ కళ్ళకి. రాత్రిని రెక్కల్లో పొదుపుకుని
నన్ను హత్తుకునే నీ

చేతులకి: నీ మాటలకీ, నీ శరీరానీకీ -
***
ఎంతో జీవితం, ఎంతో ధైర్యం -
నీ సాయంత్రానికి. ఆరిపోనివ్వక, అరచేతుల మధ్య
అతనిని దాచి, చీకట్లోకి

ధీమాగా నడిచే నీ నిశ్శబ్ధానికి!

08 August 2016

కొంచెం నిద్ర

ఆమ్మీ, రాత్రి అయ్యింది. నీ కళ్లలో
మండే కట్టెలు, మసి పట్టిన
పాత్రలు, మెతుకులలాంటి నీళ్ళు -
ముఖం ముడతలలో నీడలు -

పగిలిన నీ పాదాలలో మట్టీ, నేలా
వానా, ఆకాశం, చుక్కలూ -
హోరెత్తిoచే గాలి. నీలో, ఒంటరిగా
వణికే, ఓ పసి హృదయం -
***
ఆమ్మీ, రాత్రి అయ్యింది, నీ కళ్లలో -
అందుకే, ఇక కొంచెం నిద్రపో -
తడిచి, గూటిలో ముడుచుకున్న
ఒక తెల్లని పావురంలా -

07 August 2016

ముద్రికలు

వాన ఆగింది. చీకటి గాలి, తన జుత్తు నిండా -
చిన్నగా ఆకులు కదిలిన సవ్వడై
తిరిగి నిశ్శబ్దం అయితే
***
ఏడవకు, అని అంటాడతను నిస్సహాయంగా -
***
ఇక, తను లేచి పొయ్యిపై బియ్యం ఉంచేందుకు
వెడితే, ఆతని ఛాతిపై తన కనుల
వలయాలు. ముద్రికలు -
***
రాత్రిని దాచుకుని, గోడ వారగా జారే, పల్చటి
వాన చినుకుల్లా!

03 August 2016

నెమ్మది

రాత్రి ఆగి ఉంది, నిదానమైన తన
శిరోజాల ప్రవాహంలో -
మెరిసే మసక వెన్నెల, హంసలల్లే
తేలే తన చేతివేళ్ళపై -

నెరసిపోయినది కొంచెంకొంచెంగా
తన శరీరం మాత్రమే -
***
పరవాలేదు: నేర్చుకోవచ్చు చిన్నగా
ఇకిప్పటికైనా మనం

ప్రేమించుకోవడం అంటే ఏమిటో!

19 July 2016

బాతులు

ఎంత పెద్ద కళ్ళో ఆ అమ్మాయివి:
బాతుల్లాగా -

ఒక దగ్గర నిలవవు అవి: గునగునా
అటూ ఇటూ, ఇటూ అటూ -
గాలి చల్లగా వీస్తూ ఉంటే, తెరలుగా
వాన రాలుతూ ఉంటే

క్వాక్ క్వాక్ మంటూ బాతు పిల్లలు
నీ చుట్టూ

నిన్ను ఉన్న చోట నిలువనీయక
నిన్నొదలక -
***
ఎంత పెద్ద కళ్ళో ఆ అమ్మాయివి -
శీతాకాలంలో

నిన్నో వెచ్చని దక్షిణ ప్రదేశానికి
లేపుకుపోయి

దాచుకునే
తెల్లతెల్లని క్వాక్క్వాక్ బాతుల్లాగా!

10 July 2016

ఇక

మంటపై రొట్టెలు కాలుస్తుంది ఆవిడ -
ఎంతో ధ్యాసతో, తీక్షణతతో 
తన కనులు అప్పుడు -

బయట, పల్చటి కాంతితో ఆకాశం -
గాలి. రాత్రిలోకి సాగిపోతూ
చివరి వరసలో కొంగలు -
***
కిటికీలోంచి పొగా, పాత్రల అలికిడీ -
ప్లేటులో ఉంచిన రొట్టెలూ
ఓ మంచినీళ్ల గళాసూ -

ఇక, నీ మరొక దినం ముగుస్తుంది! 

09 July 2016

క్రితం రాత్రి

బాదుతోంది తలుపుల్ని గాలి
దబదబామని -
***
తడచిన రాత్రి: ఊగే ఎర్రని దానిమ్మ పూలు -
మెత్తని చీకటి కాంతి -
బుగ్గలు సొట్టపడేలా ఎవరో నవ్వుతున్నట్టు
ఎవరివో మాటలు మరి

దూరం నుంచి: గాలిలోంచీ, వానలోంచీ -

(ఎవరు వాళ్ళు? అట్లా మాటలతో నవ్వైన
వాళ్ళు?)
***
బాదుతోంది తలుపుల్ని గాలి
దబదబామని

నీలోంచి నిన్ను, బయటకు రమ్మని -
***
నా మాట సరే: వినకు -

లేతెరుపు గోళ్ళతో నిను ఛాతిపై రక్కిన
ఓ తెల్లని పావురపు మాటనైనా
ఒకసారి వినవా నువ్వు?

నిర్వాసితులు

రాత్రంతా వర్షం: హోరున కురిసిన
చీకటి -
***
ధారగా కారే నీళ్ళల్లో, ఊగే లతలు -
గోడకు రాసుకుంటూ, ఆకులు
కొట్టుకులాడే సవ్వడి: నీలో -

తడిచిపోయాయి సమస్థం: లోపల
ఒక ప్రకంపన. నీ చుట్టూ నువ్వే
చుట్టుకున్న చేతులు రెండూ

ఖాళీ విశ్వాలై, వెక్కిళ్ళ రాత్రుళ్ళై  -
***
ఏమీ లేదు -
రాత్రంతా కురిసిన వర్షంలో, వీచిన
చీకటిలో
***
మసకబారిన ఒక దీపం -
నీకై చూసీ చూసీ, ఇక ఒంటరిగానే
మిగిలిపోయిన

ఒక ఖాళీ దోసిలి -

05 July 2016

నిస్సహాయత

మాట్లాడవు నువ్వు: ఒక తలారి మౌనం
నీ కళ్ళల్లో -
***
పొగమంచు అలుముకునే వెన్నెల
రాత్రుళ్ళూ, ఘనీభవించిన
సరస్సులూ, నీడల్లో వేలాడే ఖాళీ
గూళ్ళూ, మరి ఎక్కడినుంచో

తేలివచ్చే ఒక ఆర్తనాదం అతనిలో -
***
మాట్లాడవు నువ్వు: ఒక హంతకుని
నైపుణ్యం నీ మౌనంలో -
***
ఇక రాత్రంతా కురిసిన వాననీటిలో

డగ్గుత్తిక స్వరంతో అతని దేహం
ఏటో కొట్టుకుపోయింది -

04 July 2016

దిగ్బంధనం

ఎన్నో మబ్బులు - 
వాన నీడలూ, నీటి పూలూ
నీలో -

ఎన్నో ఆకులు -
వణికే గాలిలో, లేచే మట్టిలో
కాంతిలో -

ఇక, నెమ్మదిగా
రాత్రిలోకి, తేమలాంటి తన 
శరీరం

చుక్కలతో, నిద్రతో
రాలే పూలరేకులతో, చీకటి
నివాళితో

జారి, ఒదిగి, సాగిపోతే
***
రాత్రంతా 
వానలో తడిచిన పావురం
గూట్లో

మెసిలే శబ్ధం 
నీలో!

01 July 2016

ముసురు

"చివరికొచ్చేసాను" అని అంటుంది
తను -
***
కిటికీ అద్దాలపై వాన గీసిన గీతలు
రాత్రి కాంతిలో తానై -
తడిచిన ఆకులు. కుండీల చుట్టూ
చెదిరిన నీళ్ళు: రాలిన
పూల రేకులతో, కొంచెం బురదతో
ముడుతలు పడ్డ తన 
కనులతో, చేతులతో, నుదురుతో
గాలికి ఊగే నీడలతో -
***
"
చివరికొచ్చేసాను" అని అంటుంది
అమ్మ -
***
ఇక 
బయట చీకట్లో, ఆగకుండా వాన -
సగం తెగిన రెక్కలు
కొట్టుకులాడే నల్లని శబ్ధంతో! 

25 June 2016

ఇక రాత్రంతా

"అమ్మా, నాకు ఏమౌతుందమ్మా?"
అని అడుగుతాడు పిల్లవాడు:
పాపం, వాడికి  జ్వరం -

ఎన్నో పొరలతో ఆకాశం, మబ్బుపట్టి -
రాత్రి గాలి లోపల: గూళ్ళల్లో
పక్షుల సవ్వడేమీ లేదు -

కంపించే పల్చటి కాంతి: ఏవో నీడలు -
ఎక్కడినుంచో తేలివచ్చే ఒక
సన్నని మూలుగు: కోస్తూ -

"అమ్మా, నాకు ఏమౌతుందమ్మా?"
అని అడుగుతాడు పిల్లవాడు
తల్లిని గట్టిగా పుచ్చుకుని -

"కన్నా, నీకేమీ కాలేద"ని చెబుతుంది
తల్లి బిడ్దని హత్తుకుని, కానీ

ఇకా తరువాత, రాత్రంతా ఇద్దరే, గట్టిగా
ఒకరినొకరు పట్టుకుని, తడారే
పెదాలై,  రాత్రి కలవరింతలై -

24 June 2016

నిష్కృతి

చీకట్లో వాన: రహదారంతా చినుకుల
మువ్వలు -
***

నేలంతా తల్లి రొమ్మైతే, తెరవని కళ్ళతో
చేతివేళ్ళతో, లేతెరుపు
పెదిమలతో, చూచుకం వంటి గూటికై
వెదుకులాడుకునే రాత్రి

శిశువులు, ఈ శోకతప్త జనులు: వాళ్ళు -
కూడా నువ్వూ, నేనూ -
***
నాకు తెలుసు: నీ అంతిమ ప్రార్ధన
ఒక సుషుప్తికై అని -
***
దా: చీకట్లో, వాన ఆగిన గాలి వీచే ఈ
హృదయంలో

రాలే చుక్కలను లెక్కించుకుంటూ
నాలో నిద్దురపో!

22 June 2016

కృతజ్ఞత

ఎంతో సన్నటి చేయి తనది: అలా వాలి ఉంది బల్లపై
తన ముఖం పక్కగా -
***
ముసురుకునే చీకటి: తెరచిన కిటికీలలోంచి వీచే
పల్చటి గాలి. గూటిలో పక్షులు
రెక్కలు సర్దుకునే సవ్వడి -

కళ్లపై పెరిగే బరువు, మంచు ఏదో వ్యాపిస్తున్నట్టు -
ఒక్క క్షణమే, భుజాన ఉన్న బ్యాగ్ని
పక్కనుంచి, శిరస్సును వాల్చితే

లిల్లీ పూవుల్లాంటి చేతివేళ్ళు నెమ్మద్దిగా దగ్గరయ్యి
ముఖం నిదుర నావలోకి చేరుకొని
అట్లా, ఎక్కడికో తేలిపోతే 
***
ఎంతో సన్నటి చేయి తనది: అలా వాలి ఉంది, నీ 
ముఖానికి చాలా దగ్గరగా -
***
ఇక, తన చేతి నీడను కూడా పొరపాటున తాకక
ఒక పక్కగా నిలబడి అనుకుంటాడు
అతను - కృతజ్ఞతగా - ఇట్లా

"ఎంతో తేలికగా, ఎంతో బలహీనంగా అగుపించే
ఆ ధృడమైన చేయే లేకపోయి ఉంటే
ఏమై పోయుందును నేనీ పాటికి?"

20 June 2016

చివరకు

రాత్రి. మిగిలిన చిటికెడు
వెన్నెల -
***
మసక నీడలు. పల్చటి గాలి -
చెట్ల కింద
రాలిన ఆకులు పొర్లే, ఒంటరి
శబ్ధం నీలో -
***
తప్పేం లేదు: నీ చేతిని
అందివ్వు
***
ఒకరినొకరు హత్తుకుని
కూర్చోవడమే

ఒక్కొక్కప్పుడు మనకు
మిగిలే శాంతి - 

19 June 2016

మరో ముఖం

నీ అరిపాదాలు పగిలిపోయి ఉన్నాయి: ఆ పగుళ్ళల్లో మట్టి, నల్లటి గీతలయ్యి అరచేతి రేఖలయ్యీ -
***
ఒకప్పుడు, నా శిరస్సును వాటిపై వాల్చితే, అవి తెల్లని మబ్బులు. నడిచే గులాబీ మొగ్గలు. సీతాకోకచిలుకలు ఎగిరే సరస్సులు. ఒకప్పుడు అవి నవ్వే పసిపాపలు. వెన్నెల కురిసే మైదానాలు. తాకితే కందే మెత్తని స్వప్నాలు. వడివడిగా పారే మాటలు - 

నేలపై వలయాలు గీసే మౌనాలు. ఎంతో ప్రేమగా ఎదురొచ్చే సాయంత్రాలు. చీకటిలో వెలిగే దీపాలు. గోరింటాకు పండిన రాత్రుళ్ళూ హత్తుకున్న రొమ్ములూ, అన్నం పెట్టిన చేతులూ నుదిటిన భవిష్యత్తుని లిఖించిన తడి వస్త్రాలూ అవి ఒకప్పుడు -
***
ఇకిప్పుడు, ఈ నగరంలో, ఈ రహదారిలో, ఆగిన వాహన రద్ధీలో, సిగ్నల్ వద్ద, తిండికి ఇన్ని రియల్ ఎస్టేట్ కరపత్రాలు పంచుకుంటూ పగిలిన పాదాలతో, కమిలిన కళ్ళతో, ముఖంతో నువ్వు -
***
పగుళ్ల మధ్య మట్టితో, ఆకాశం మబ్బు పట్టింది: లోపలేదో మసకగా మారింది. హోరున గాలి వీచి చెట్లు ఊగి , ధూళి ఎగిసి, ఏదో కురిసేందుకూ, పూర్తిగా తడిచి, విరిగి, వొణికిపోయేందుకూ, ఇంకా కొద్దిసేపే -
***
అందుకే, వర్షం పడక మునుపే, నా వాహనం వైపు నువ్వు రాక మునుపే, నువ్వు చూడక మునుపే చప్పున గేరు మార్చి, కారును తటాలున ముందుకు దూకిచ్చి, చెట్లు విదిల్చిన ఓ నిట్టూర్పుతో పారిపోయి, ఇకా రాత్రికి ఎక్కడో వొణికొణికి కురిస్తే...
***
ఏమీ లేదు: నగరం ఇది. ఏదీ తాకదు. కలవదు. హృదయమొక ఫ్లైఓవర్! అంతే -

16 June 2016

పాపం

ఎంతో కాలం తరువాత ఇలా, హఠాత్తుగా
నా ఎదురుగా నువ్వు -
**
ముఖంపై ముడతలు -
కనుల కింద చారలు. సన్నటి చేతులు. ఎండిన
పెదవులు -

డోక్కుపోయిన పొట్ట -
పగిలిన పెదాలు. నిండైన పూలకొమ్మను దూసి
వొదిలినట్టు

ఈ ఆకాశం కింద, ఎటో
చూస్తూ, ఎక్కడో కోల్పోయి, పుల్లలలాంటిద్దరు
పిల్లలతో నువ్వు -
****
ఏం జరిగిందని నేను అడగను -

ఏం జరిగిందో నువ్వూ చెప్పవు -
ఓ చీకటి నదిలో పూలతెప్పను వొదిలి వేసిన
పాపం ఎవరిదో

ఈ లోకంలో ఎవరికి
తెలియదు?

15 June 2016

ఒక సాయంత్రం

ఏడుస్తోంది అమ్మ, ఏం చెప్పాలో తెలియక -
***
ఎర్రటి ఎండ కాచే కళ్ళతో పిల్లలు, అట్లా
అమ్మ ముందు నిలబడి
అసలు ఏమీ అర్థం కాక -

తన శ్వాసలాంటి గాలి: ఆగీ, ఆగీ మెల్లిగా
ఉగ్గబట్టి వీస్తో: ఇల్లంతా
దుమ్మూ, చీకటీ, నొప్పీ -

ఇక, తల ఒగ్గిన చెట్ల కింద ఓ నీడ మాత్రం
దాహంతో చిట్లిన పెదాలపై
సాగీ, సాగీ, చీకటి అయితే
***
మూడు రోజుల నుంచి కబురు లేదు. ఇంట్లో
గుప్పెడు బియ్యం లేవు -
బిడ్డలు తినేది ఎట్లరాని

ఏడుస్తోంది అమ్మ, పిల్లల చేతులుచ్చుకుని
ఏం చేయాలో తెలియక! 

09 June 2016

రిపోర్ట్

ఏం చేసావు ఇవాళంతా? ఇంతాలస్యమా?
తను అడిగింది -
***
రాత్రి పూలకొమ్మను వంచి, ఇన్ని చుక్కల్ని
తెంపుకుని, తన అరచేతి వెన్నెలను
నుదిటిపైకి ప్రసరింపజేసుకుని, నెమ్మదిగా
అన్నాడు అతను: "నిద్రొస్తుంది. బాగా -

అలసిపోయాను. పడుకుంటాను కాసేపు"
***
ఇక రాత్రంతా, బయట వాన: కురిసీ, ఆగీ
ఆగీ, కురిసీ

తన ఒడిలో ఒదిగి, ఆకలితో నిదురోయిన
చీకటై, ఆకులంచులకు వేలాడే

చినుకులై, వొణికి, ఆగిపోయి!

06 June 2016

మిగిలినది

అరవిచ్చిన మొగ్గల్లాంటి చిన్ని అరచేతులు, ఇక
నీ ముందు: 'ఏమిస్తావు?' అన్నట్లు -
***
ముఖమంతా వెన్నెల -
కళ్ళల్లో మిణుకుమనే చుక్కలు. పెదాలపై నవ్వు
రాత్రి వీచే గాలై -

విశ్వాన్ని దాచుకున్న
చిన్ని హృదయం. పలకా, బలపం అంతటి కాలం -
"ఎందుకు నాన్నా?"

అని, నిన్ను చుట్టుకుని
నీ అశ్రువులని, వేళ్ళ చివర్లతో తుడిపివేసే లోకం:
ఒక ఇంద్రజాలం -
***
వేలాడే గూళ్ళలాంటి చిన్ని చిన్ని అరచేతులు:
నిన్ను తమలోకి పొదుపుకుంటూ -
***
ద్వేషానిదేముంది?
ఎంతయినా వెదజల్లవచ్చు: ఈ లోకాన్ని తిరిగి ఓ
పాపాయిలా

నీ హృదయానికి హత్తుకోవడమే, నీకు ఇప్పుడు
తెలియాల్సి ఉందిక!

05 June 2016

గ్రహింపు

"దా, నాన్నా" అంది బెంగతో పాపాయి చిన్నగా
ఆతనిని తనవైపు లాగుతూ -
***
చూడలేదు అతను అటు
కిటికీలోంచి బయటకు చూస్తూ: ఈదురు గాలీ
మబ్బులూ, వానా -

అరల నిండా చెట్లు, తడచి -
పుస్తకాలలో ఆకులు: నలిగి, మగ్గీ, చితికీ. ప్రజలు
తేమై, రాత్రై, వెలిస్తే
***
"దా, నాన్నా", అంది పాపాయి, నీటి రంగుల్ని
కళ్ళల్లో ఒంపుకుని, తనని
చూడమని-
***
మ్రాగన్ను నిద్రలోంచి అతను దిగ్గున లేచి చూస్తే
ఒక ప్రతిధ్వని: హృదయంలో
కంపిస్తూ, ఖాళీగా ఓ ఊయల!

04 June 2016

నేర్పు

లొంగిపో పూర్తిగా: అడగకు ఏమీ. విను
నింపాదిగా -
***
ఈ రాత్రిని: తడచిన రెక్కల బెంగని -
కొస ప్రాణంతో నిలబడిన గూటిని. గాలికి ఒరిగిన
కొమ్మలని

వాననీటి దారుల్ని, తననీ, ఇంటికి
తిరిగిరాని ఓ పసివాడి తల్లి హృదయాన్నీ: తనలో
తన శరీరంలో

ఏ నీడల మాటునో దాగిన నీలోనో!
***
అడగకు ఏమీ: లొంగిపో పూర్తిగా. విను
నింపాదిగా -
***
రాత్రి గూటిలో జాబిలిని దాచి, మెత్తగా
భూమిని పొదిగే ఈ

వాన పావురాన్ని!

03 June 2016

హృదయం

రాత్రి: చీకటి బల్లపై పూలపాత్ర -
తెరచిన కిటికీలు, కోసే గాలి. వొణికే నీ సన్నటి
చేతివేళ్ళు: ఆకులు -

ఉప్పు: రాలి, దొర్లిపోయే పూలు
కళ్ళు. కురిసే చినుకులు. నీ హృదయ నిశ్శబ్ధం
ఖాళీ గూడంతటి శబ్దం!
***
గమనించు! ఏదైతే నిను
ఇంతకాలం బంధించిందో, అదే నీకు విముక్తినీ
ప్రసాదించవచ్చు!

textuality

my lady
i am sorry
i am not srikanth
he is just a fiction
a text of
a text of
a text
and

a figment
of your imagination
or lack of it.

01 June 2016

తపన

రాత్రి. ఆగిన వాన. చీకట్లో
అప్పుడొకటీ, అప్పుడొకటీ ఒక చినుకు
రాలే చప్పుడు -

మట్టి దారి. రాలిన ఆకులు -
పచ్చి వాసన. మిగిలిన నీటి చారికల్లో
తేలే వెన్నెల -

ఇక మసకగానే హృదయం, ఈ దారీ -
మరి
***
సమయం మించిపోతుంది. ఇంటికి
వెళ్ళిపోవాలి -
దారి ఎటు?

31 May 2016

స్వేచ్ఛ

మబ్బు పట్టింది. ఆగి, ఆగి ఉరుముల చప్పుడు -
ఆగకుండా ఆడుకుంటూ పిల్లలు

నిద్రలాంటి కాంతి. తూగుతూ పూవులు. ఊగే
ఆకులు. ఇక మరి, నిన్ను ఎవరో

తమలోకి పొదుపుకున్నట్టు, గాలి: నీటి కళ్ళతో
ఎరుకతో, నీలాంటి వర్షపు ప్రేమతో -
***
తలుపులు తెరచి చూడు ఓసారి!
నీ హృదయ మైదానాలలో గుంపుగా ఎగురుతూ
ఎన్నెన్ని తూనీగలో!

ఇక

పావురంలాంటి వెలుతురు. గాలిలో
రెక్కల చప్పుడు -
పసిబిడ్డను రొమ్ముకు హత్తుకున్నట్టు
నా పక్కన నువ్వు -
***
భయం లేదిక: నవ్వే పూవుని చూస్తూ
ఇంకో రోజు బ్రతకొచ్చు!

30 May 2016

జాగ్రత్త

"జాగ్రత్త", అంది అమ్మాయి
వెళ్ళిపోతూ -
***
రాత్రి జాబిలి. మసక వెన్నెల -
పూలు -
గాలి. చలించే లతలు. ఖాళీ
గూడు -
సగం పొదిగిన గుడ్డై, ఇకతని
శరీరం -
***
"జాగ్రత్త", అంది అమ్మాయి
వెళ్ళిపోతూ -
కానీ,
***
మరి
ఈ హృదయానికి లేనిదే అదని
ఎవరు చెబుతారు
తనకు?

రహస్యం

ఒక వేసవి రాత్రి -
చీకటి పాదాల కింద నలిగే
ఆకులు సవ్వడి: ఎవరో నీ లోపల, నిన్ను తొక్కుతూ
నడుస్తున్నట్టు -

ఒక నిండు జాబిలి -
ఒంటరిదే పాపం, నీ వెనుక
ఎంత దూరం నడిచిందో మరి, అలసి, ఇక సాగలేక
రాలిపోయింది -

ఇక ఒక మట్టి దారి -
దిగ్గున లేచిన గాలిలో, రాలే
పూలతో, నీడలతో, కూలే చెట్లతో, తెగే చుక్కలతో
ఎటు పోతుందో

అడవికి తెలియదు -
నీ అశ్రువులకీ తెలియదు. నీలో, శరనార్ధిగా మారిన
అతనికి, అసలే
తెలియదు: సృజనా
***
తెంపడానికేముంది: ఒక్క
క్షణం చాలు. యుగాలుగా దొరకని, హృదయప్రవేశ
రహస్యం, నీకు
ఏమైనా తెలిస్తే చెప్పు!

28 May 2016

నిశ్శబ్ధం

ఒక వేసవి మధ్యాహ్నం -
తల్లి చేసి ఇచ్చిన రొట్టెను, ఎంతో ఇష్టంగా తింటూ
ఓ పిల్లవాడు -

రొట్టెరంగు మల్లే కాంతి -
గోధుమల వాసన గాలిలో: పెరట్లో దుస్తులు విదిల్చి
ఆరవేస్తూ తల్లి -

ఇంకా కొద్దిసేపే: తను
తల తిప్పి చిన్నగా నవ్వితే, ఆరేసిన దుస్తులు అన్నీ
పలుకుతాయి -

నిన్ను బిగించి పట్టుకున్న
ఈ నిశ్శబ్ధం తొలిగి పోతుంది. కొంచెం ఓపిక పట్టు -
ఎదురుచూడు -

ఏదైనా, ప్రేమతో చేయడం
మాత్రమే, ఇక నువ్వు ఈ జీవితంలో నేర్చుకోవలసి
ఉన్నది!

క్షణం

నిద్రొస్తుంది నీకు -
చెదిరిన జుత్తు. పొగమంచు వ్యాపించే సరస్సుల మల్లే
నీ కళ్ళు -

నా మెడ చుట్టూ
నీ చేతులు: ఏవో మాటలు. ఇక నేనో ఊయలనై నిన్ను
జోకొడితే

నీ శరీరమంతా
నిదుర పూల వాసన: చీకట్లో అలలు, తీరాన్ని తాకే ఒక
సవ్వడీ, శాంతి -
***
నిద్రపోయావు నువ్వు -
ఇక హృదయంలో, మంచుపొగల సరస్సులో సాగే ఒక
పడవలో

వెలిగిన జీవన దీపపు కాంతిలో
నిద్రపోలేక నేను!