16 May 2021

 నిన్ను నువ్వు స్వప్నిస్తూ

_________________________________

నిన్ను నువ్వు స్వప్నిస్తూ నన్ను కలగంటావు

మృత్యువుకై సాగిపోతూ
నా అరచేతుల మధ్య క్షణకాలం ఆగి విశ్రమించే 
నీ చేతికి శతాబ్దాల అలసట తెలుసు 

ఆ క్షణిక సమయంలోనే, 
నువ్వు కూడా స్వప్నిస్తావు: నీరెండలో, నీటిలో 
రెక్కలు విదిల్చే ఒక కాంతి పక్షిని -

నువ్వు కూడా ఒక బుజ్జి నెత్తురు పిట్ఠవి! 

రాత్రి తర్వాత రాత్రి 
ఒక ప్రమిదెకై తపిస్తూ, నిన్ను నువ్వు స్వప్నిస్తూ 
నన్ను కలగంటావు!

రహదారి

 రహదారి

____________

సాయంత్రం పూట, వర్షపు తూనీగలు నల్లటి మేఘాల రెక్కలతో 
కొమ్మలలోకి జోరబడుతున్నవేళ
ఆమె రహదారిని దాటేందుకు ప్రయత్నిస్తుంది. నుదిటిన 

గాలికి చిందరవందర అవుతున్న కురులతో, మూడేళ్ళ పాప కనులతో
విస్తృతంగా రాక్షసంగా కదులాడుతున్న 
వాహనాలను దాటి ఆవలివైపుకు చేరేందుకు ఆమె 
తడబడుతుంది -

సహచరుడు లేని దిగులు సాయంత్రం. అరచేతిలో మరో అరచేయి లేని,
గోరువెచ్చనిదనం లేని, దు:ఖాన్ని 
మునిపంటితో నొక్కి పెట్టిన సాయంత్రం. భుజాన బాగ్ తో

అలసిన దేహంతో, పని నుంచి నిస్సతువుగా ఇంటికి వెళ్ళాల్సిన 
సాయంత్రం. ఆమె రెండు అడుగులు 
ముందుకు వేసి, నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది ...

"ఇది అడవికన్నా చిక్కనైన ప్రదేశం. క్రూరమృగాల కన్నా వేగంగా 
వాహనాలు సంచరించే విరామం లేని ప్రదేశం.
ఇటువంటి రహదారిని దాటటం ఎలా?" అని  తనలో తాను 

సంబాషించుకుంటూ, చాలా కాలం క్రితం, అతడూ ఆమె చేతులు 
పుచ్చుకుని, అంత వేగపు వాహనాల వరదను 
అత్యంత సునాయాసంగా దాటిన క్షణాలను జ్ఞాపకం 
చేసుకుంటుంది -

ప్రేమలేని దయరహిత సాయంత్రం. పెదాలు ఇతర పెదాలను తాకలేని
నిశ్చేష్టమైన నిశ్శబ్దపు సాయంత్రం.
ఒంటరిగా బయలుదేరి ఒంటరిగానే ఇక ఇంటికి చేరుకోవాల్సిన

ఒంటరి బాహువుల సాయంత్రం. ఆమె ముందుకు కధలలేకా
వెనక్కు వెళ్ళలేకా, ఉన్నచోటనే 
నిలబడి ఎదురుగా నిర్దయగా మారుతున్న రోజును 
స్తబ్దుగా గమనిస్తూ అనుకుంటుంది:

"రహదారిని దాటడం ప్రేమను ఈది ఒక దరికి శాంతితో చేరటం వంటిది. 
సమయం లేదిక: కదిలే తెమ్మరని 
ఆసరాగా పుచ్చుకుని, మసకబారుతున్న ఆకాశంలో మెరుస్తున్న 

నక్షత్రాలు, మేఘాల మధ్య ముడుచుకుంటుండగా, చప్పున రహదారిని 
దాటాలి. సమయం లేదిక. చీకటి మంచు 
గాడమయ్యే వేళకి ఇంటికి చేరుకొని, సహచరుడు లేని పడకపై

నిర్లిప్త కరుణతో విశ్రమించాలి ఇక. సమయం లేదిక. ఎలాగోలాగా జీవితాన్ని 
త్వరితంగా దాటాలిక:"

ఆ తరువాత, కనిపించని ముళ్ళు రాలుతున్న కంపించే శీతలగాలితో పాటు
పెదాల అంచున వికసిస్తున్న చిర్నవ్వుతో
ఆమె ఒక నిర్లక్ష్యపు విసురుతో, సాయంకాలమూ రాత్రీ కాని 
కర్కశ సమయంలోకి

ఈ పదాలతో పాటు రహదారిని దాటుతుంది.

మధ్యాహ్నపు అమ్మ

 మధ్యాహ్నపు అమ్మ

__________________________

నల్లటి నీడలు తెల్లటి నీటి పాయల్లా తన వేళ్ళ చివర కదులుతుండగా
నేను అమ్మ మధ్యాహ్నం దుస్తులు ఉతకడాన్ని చూస్తాను
ఇంటి వెనుక జామ చెట్టు వృద్ధాప్యంతో వొంగి , జ్ఞాపకాలలో కోల్పోయిన తనని చూస్తుండగా
నేను అమ్మ మధ్యాహ్నం దుస్తులు ఉతకడాన్ని చూస్తాను

మరెక్కడో మరొక వృద్ధుడు, అలల్ని అరచేతిలో పట్టుకుని వాటిని పిట్టల్లా మార్చే
తన మనవరాల్ని చూసేందుకు సముద్రంలోకి వెడుతుండగా
మరెక్కడికో వెళ్ళలేని ఇక్కడి అమ్మ ఇక్కడే మౌనంగా దుస్తుల్ని నీటిలో ముంచుతుంది
తన ప్రియుడికి ఎన్నటికీ తిరిగి ఇవ్వలేని పుస్తకంలో రంగు మారిన రావి ఆకులా
అమ్మ దుస్తుల్ని తన ముందు పరుచుకుని, తన రెండు హస్తాలతో

అప్పుడే జన్మించిన శిశువుని తుడిచినట్టు, మరణించిన తన తల్లితండ్రుల శరీరాల్ని
శ్మశానానికి తీసుకువెళ్ళే ముందు, ప్రేమతో బాధతో నిశ్శబ్దంగా కడిగినట్టు
అమ్మ దుస్తుల్ని తన ముందు పరచుకుని, తన రెండు హస్తాలతో వాటిని శుభ్రం చేస్తుంది

అమ్మ మధ్యాహ్నం ఒంటరిగా దుస్తుల్ని ఉతుకుతుంది
తనని వొంటరిగా వదిలివేసిన వాళ్ళ దుస్తుల్నీ, తనని ఇక్కడ ఒంటరిగా వదిలివేసి
మరెక్కడో తన అస్తిత్వపు ఊసైనా లేక కదులాడుతున్న వాళ్ళ దుస్తుల్నీ
అమ్మ మధ్యాహ్నం ఒంటరిగా శుభ్రం చేస్తుంది
మరుపైనా లేని సమయంలో, ప్రేమించినవాళ్ళకీ కోల్పోయినవాళ్ళకీ 
తేడా లేని సమయంలో, అమ్మ
ప్రేమించిన వాళ్ళ దుస్తులనీ, ప్రేమించలేని వాళ్ళ దుస్తులనీ నీటిలో 

ముంచుతుంది. వాళ్ళ చొక్కల్నీ, పాంట్లనీ, లోదుస్తులనీ ఒకదాని తరువాత మరొకటి 
శుభ్రం చేస్తూ, నుదిటిపై చిట్లిన 
చెమటను తుడుచుకునేందుకు క్షణకాలం ఆగుతుంది

సరిగ్గా ఆ క్షణాన వొంటరి మధ్యాన్నం స్రవించే నెత్తురు గులాబీగా మారుతుంది
సరిగా ఆ క్షణాన ఆకాశపు తీగపై ఆరవేసిన మేఘాలు పచ్చి గాయాలుగా మారతాయి
సరిగ్గా ఆ క్షణాన అమ్మ గర్భంలో ఈ కవిత ఊపిరి పోసుకుంటుంది

సరిగా ఆ క్షణాన అమ్మ శరీరంలో ఒక దిగులు గీతం కదులాడుతుంది. ఆ తరువాత
అప్పుడే ఆర్పివేయబడ్డ ప్రమిదెలు 
వెలుతురు వాసనను గాలిలో వదిలినట్టు, అమ్మ దుస్తుల్ని ఉతకడం పూర్తిచేసి, 

వర్షానికీ బాధకీ వాటిని వోదిలివేసి ఇంటిలోకి వెళ్ళిపోతుంది.

ఇక ఈ రాత్రి

 

ఇక ఈ రాత్రి ఇక్కడ విశ్రమిస్తాను. ఎంటువంటి ఆరోపణలూ లేకుండా ఇక ఈ రాత్రి అస్తిత్వాన్ని అంగీకరించి శిరస్సుని ధూళి నిండిన పాదాల వద్ద ఆన్చి నిలిచిపోతాను

కనిపించని ఉనికి ఏదో నిర్దేశించిన దారి ఇది. క్షణక్షణం రహస్య స్వరం ఏదో రమ్మని పిలిచిన కరుణ లేని దారి ఇది. సమయపు సంకేతాల్ని అనువదించుకునేందుకు గులాబీలను వొదిలి ముళ్ళను హృదయంలో దింపుకున్న అంతులేని తపన ఇది

ఇక ఈ రాత్రి ఏది ఏమిటని అడగను. ఇక ఈ రాత్రి ఎవరు ఎవరనీ అడగను 

జీవితాన్ని వెదుకుతూ జీవితాన్ని కోల్పోయాను. అర్థాన్ని వెదుకుతూ అర్థాన్నీ కోల్పోయాను. ఉండేందుకు, ఏమీ కోరని ఈ భూమిపై అలా ఉండేందుకు అనేక పర్యాయాలు మరణించాను. తిరిగి చేరుకునేందుకు, ఎప్పటికీ చేరుకోలేనంత దూరమూ వెళ్ళిపోయాను. తుంపులు తుంపులుగా నలుదిశలూ వీడిపోయాను 

ఇక ఈ ఒక్క రాత్రి, మట్టిని రక్తపు పెదాలతో ముద్దాడే పాదాలు నావి, అవి చేసే అలికిడి ఎవరిది అని అడగను. శూన్యపు కాంతిని వలలై చుట్టుకునే కనులు నావి, అవి చూసే చూపు ఎవరిది అని అడగను. ఇక్కడ ఈ గాలిలో వికసించిన అస్తిత్వపు పూవు నాది, దాని ఎరుక ఎవరిది అని అడగను. విరిగిపోయాను. పూర్వీకుల ధూళిలో కలసిపోయాను. అలసిపోయాను. ఇక ఎటువంటి ఆరోపణలూ లేకుండా ఈ రాత్రి జీవితాన్ని అంగీకరించి శిరస్సుని వడలిపోయిన పాదాల వద్ద ఆన్చుకుని ఇక్కడే ఆగిపోతాను.  ఇక ఇక్కడే

 అలలపై వొదిలిన ప్రమిదెలా ఆగి, సాగిపోతాను.

25 February 2021

చివరిగా

కిటికీ అంచున ఒదిగి కూర్చున్న తెల్లని పావురానివి నువ్వు -

మాట్లాడాలి ఎవరైనా నీతో.  మెత్తగా నిమిరి, పూవులంత తేలికగా ఏమైనా మాట్లాడాలి నీతో -

వీచే గాలి అంటే ప్రేమ నీకు. సెలయేళ్ళు కావాలి నీకు. తోడుగా ఉండాలి ఇన్ని మొక్కలు పిచ్చుకలూ పిల్లలూ నీకు, అందుకే ఎదురుచూస్తావు ఉదయాన్నే ఒక మాటకై మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని, నీలో నువ్వు ముడుచుకునీ -

తేలిపోతాయి మెల్లగానే మబ్బులు. సాగిపోతాయి మెల్లగానే పక్షులు. ఆ పసుపుపచ్చటి ఎండలో, ఆ పసుపు పచ్చటి గాలిలో ఎగిరిపోతాయి మెల్లగానే తోటలోని సీతాకోకచిలుకలు. తెరిచిన తలుపులోంచి వాలే పసుపు పచ్చని లేత ఎండ, తాకుతుంది నీ పసుపచ్చని చేతిని రంగులేని ఒంటరితనంతో  -

తిరిగి తిరిగి, తిరిగి - మళ్ళా మళ్ళా ఎవరూలేని ఒక నల్లని సాయంత్రమే చివరిగా,  భళ్ళున పగిలే గాజుపాత్రగా మిగిలిపోయే ఒక రాత్రే చివరిగా! కొంత నిప్పూ, కళ్ళ వెంబడి కొంత నీరూ, శరీరంలోకి మరి కొంచెం కొంచెంగా పేరుకునే ఖాళీ గదుల దిగులు: నీలో. చివరిగా!

నిన్ను నువ్వే కౌగలించుకుని మరణించిన రాత్రిలో, బ్రతికి ఉన్నావా? ఎలా ఉన్నావు అని నిన్ను అడిగిందెవరు?