28 November 2014

పెద్దపులి ఆ అమ్మాయి

పెద్దపులి ఆ అమ్మాయి.

తెల్లని చామంతుల కళ్ళే తనవి. నొప్పించినప్పుడు ఎవరైనా, బేలగా నీపై కురిసే మంచు రేకులే అవి. 

పెద్దపులి  ఆ అమ్మాయి.

తల్లివైపు పరిగెత్తే పసిపాపల వంటి చేతులే తనవి. ఓ ప్రేమ కోసమో, ఒక తోడు కోసమో, లోకంవైపూ ఇతరులవైపూ సాగి, నలిగిపోయి లుప్తమై వెనుదిరిగితే, వడలిపోయిన సాయంత్రాలై నీ ఛాతిపైకి జారే -తల్లి లేని - పిల్లి కూనలే అవి- వడలిన కాడలై నిర్లిప్తంగా వేలాడే పసి పిల్లలే ఆవి. తెల్లని చేతులే తనవి. 

పెద్దపులి ఆ అమ్మాయి.

పూల తోటలాంటి ముఖమే తనది. నువ్వు ఏం చెప్పినా నమ్మే, నువ్వు ఏం చెప్పినా నమ్మి సముద్రాలనూ ఎడారులనూ దాటి, నీకై ఎదురు చూసిన పచ్చటి ముఖమే తనది. ఒకప్పుడు నీకు పాదుగా మారి, నీవు ఏపుగా ఎదిగేందుకు తోడ్పడిన మహాఇష్టమే తనది. నీకై రాత్రుళ్లుగా, మట్టికుండగా, నక్షత్రాలు మెరిసే ఆకాశంగా, చివరికి నువ్వు భక్షించే ఆహారంగా కూడా మారిన శరీరమే తనది. ఇక ఇప్పుడు, వొణికే హృదయంతో, ఒక నీటి చెలమగా మారిన కాలమే తనది. ఎవరికీ చెందని లోకమే తనది. 

పెద్దపులి ఆ అమ్మాయి.  

అన్నిచోట్లా, ఎల్లప్పుడూ 

నిన్ను ప్రేమించి, ప్రేమించడంతోనే ఒక శిల్పంగా మారి, ఇక ఇప్పుడు తనలో తాను, తనతో తాను ఒంటరిగా సంభాషించే, ఒంటరిగా సంచరించే, తనను తాను కౌగలించుకుని, తనలో తాను దిగులుతో ముడుచుకుపోయే, అంతంలేని శీతాకాలపు రాత్రుళ్ళ, ఎవరూ లేని దారుల, ఆరిన చితుకుల మంట చుట్టూ నెమ్మదిగా ఇంకే వాన చినుకుల సవ్వళ్ళుల  

పసి పసిడి పెద్దపులే ఆయిన ఆ అమ్మాయి

ఎన్నడైనా, ఎక్కడైనా- ఒక్కసారైనా
ఎందుకైనా గుర్తుకు వచ్చిందా నీకు?

26 November 2014

అన్నా, నమస్తే అను ఒక మిడిల్ ఏజ్ వచ్చిన పద్యం

-అన్నా, నమస్తే-

......

-ఏమే, ఈ మధ్యన కనిపిస్తల్లేవ్?-

......

-సాయంత్రమేంజేస్తున్నావ్? కలుద్దామా?-

-ఈ మధ్యన త్రాగడం లేదు-

-ఏ... ఊరుకో అన్నా. మజాక్ జేస్తున్నావా ఏంది? ఏమైయ్యిందే?-

-ఏం లేదు. కొంతకాలం మానేద్దాం అనుకున్నా-

-అవునా? మరి మానేసి ఏం చేద్దామనే?-

-ఏం లేదు. ఈ మధ్య యోగాలో చేరాను...

-అవ్నా? ఇంకేం జేస్తున్నవే? ఎక్కడ కనిపిస్తల్లేవ్? ఏం రాస్తల్లేవ్?-

-రాయడం మానేసాను -

-ఎందుకే? ఏం చదవడం కూడా లేదా?-

-చదువుతున్నా. మళ్ళా రజనీష్నీ, ఇంకా...

-నువ్వు సైకోగాడని పిల్సుతుండే... గాడ్నా?!

-ఆ... రజనీష్నీ, జిడ్డు కృష్ణమూర్తినీ, రమణ మహర్షినీ, నిసర్గదత్తనీ
ఇంకా టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్ లాంటివి మళ్ళా చదూతున్నా-
రేపెప్పుడన్నా  ఏదన్నా మెడిటేషన్ సెంటర్లో చేరుదామని కూడా
అనుకుంటున్నా-

-గిదేందే?-

-ఏమో?-

-ఎన్ని రోజోలసంది తాగడంలే? ఊర్కో అన్నా. దా... కాసేపు గూర్చుందాం...

-నిన్నటి నుంచే మానేసాను.
నాన్ వెజ్ కూడా. యోగా చేరి పది రోజులవుతుంది. వాకింగ్కీ, జిమ్కీ వెళ్తున్నా
డైట్ మార్చాను. మొలకలు లాంటివీ, ఇంకా
బాయిల్డ్ వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటున్నా-

-నీకేదో అయ్యిందన్నా. ఇప్పుడేడకి?-

-అమ్మను చూసి రెండు వారాలయ్యింది. ఒకసారి చూసొద్దాం అని వెళ్తున్నా-

-అవ్నా ...

-నా సంగతి సరే కానీ, నువ్వేం చేస్తున్నావ్?-

-ఇగో ఏమనుకోకు కానీ
నీలాంటోల్లకి దూరంగా ఉండాలని ఇప్పుడే అనుకుంటున్నా-

.......

- సరే అన్నా - ఉంటా. మల్ల కలుస్తా.
అన్నా... నమస్తే -

25 November 2014

గుర్తుపెట్టుకో ఆ అరచేతులను

ఆ రెండు అరచేతులలోకి, నీ అరచేతులని వొదిలివేసి
అలా కూర్చుంటావు నువ్వు-

శీతాకాలపు సాయంత్రం.
శరీరంలో గుబులు చెట్లేవో వీచి, కలకలంతో పక్షులు
ఒక్కసారిగా గుంపుగా లేచి, తిరిగి సర్ధుకునే
ఒక జ్ఞాపకం. ఇక నెమ్మదిగా తల ఎత్తి తను

నీవైపు చూసిందో లేక ఆ కళ్ళలో కనిపించే నీటి తెరలను
నువ్వే సాయంత్రంగా భ్రమించావో, లేక
ఆ నీటి తెరలపై, అలసిన నీ అరచేతులను

కాగితపు పడవల వలే వొదిలివేసావో, లేక
తనకు చెప్పాలనుకుని రాసుకున్న ప్రేమ
లేఖలన్నిటినీ చెప్పలేక చించివేసావో, ఒక
నిట్టూర్పుతో వొదిలి వేసావో, మూగవాడివి

ఎందుకు అయ్యావో, నీకూ తెలియదు. తనకూ తెలియదు.

ఇక - తల ఎత్తి ముఖం వైపు చూసేలోపు, చప్పున
ముఖం తిప్పుకున్నదీ, గుండెను ఉగ్గపట్టుకున్నదీ
ఎవరో కూడా తెలియదు-
ఇక చివరకు మిగిలేదల్లా

ఒక శీతాకాలపు సాయంత్రం: ఖాళీ గూళ్ళు. నీడలు -
సన్నగా వొణికే చలి రాత్రీ, ఒంటరి చీకటీ
అరచేతుల్లోంచి అరచేతులు తొలిగిపోయి

నెమ్మదిగా దీపాలను ఆర్పి, తమలోకి తాము
ముడుచుకుపోయే మన చేతివేళ్లూ
ఈ కాలం, లోకం, చీకటిని చీలుస్తూ

గదిలోంచి వెళ్ళిపోయే - నీదో, నాదో -
మరి ఒక దేహ దీప ధూపం! 

19 November 2014

a little conversation of sorts

"ఎలా ఉన్నావు?"

"తెలియదు."

" ఏం రాస్తున్నావు ఈ మధ్య?"

"Nothing."

"No thing or nothing?"

"రాయడం మానివేసాను.
Or rather
It is the other way around."

"అంటే?"

" రాయడం
నేను మానివేయడం కాదు
బహుశా ఆ లిఖితమేదో
నన్ను లిఖించడం
మానివేసింది."

"అవునా?"

"కాబోలు."

"ఇంకా?"

"........."

"మరి
If you are not writing
Or rather
If writing has left you

What are you
Left with

Right now?"

"Only this: You.
నువ్వూ, ఇంకా
ఒకే ఒక వాక్యం-

Elahi, Elahi, lmana shwaqthani?"

PS:
And then
She said:
"I think
You are eligible
For a kiss.
Now-" 

10 November 2014

ప్రేమ ఉందనీ, లేదనీ

ప్రేమ ఉందనీ అనుకుంటావు, లేదనీ అనుకుంటావు-

ఎవరివైనా చేతివేళ్లు మెత్తగా పెదాల్ని తాకితే, సర్వం మరచి
తిరిగి అన్నిటినీ నమ్ముదామనీ అనుకుంటావు-
అప్పుడు

ఇక ఆ చేతివేళ్ళని పదాలుగా ఊహిస్తావు. నిన్ను చూడగానే
పూవులు విచ్చుకునే కనులగానూ
పచ్చిక బయళ్ళపై  అలవోకగా వీచే
చిరుగాలి వంటి ఒక చిర్నవ్వుగానూ

స్వప్నిస్తావు. నీలోపలే, రహస్యంగా
ఒక దీపం వెలిగించుకుని, ఒక తోటని సృష్టించుకుని
స్వప్న సువాసన చలించే, 'నువ్వు'
అనే కొన్ని పదాలని రాసుకుంటావు

"ఇదేమిటి?" అని అడిగిన వాళ్లకి

"ఇదంతా ఒట్టిది. ఈ దీపపు కాంతి నిన్నటిది.
ఈ కవిత కూడా నిన్నటిదే. ఒక
వడలిన పూవుదే. వెలసిన ఒక
వానదే. వీడిన వానని వదలలేక

ఆకుల చివరన ఊగిసలాడే ఒక చినుకుదే

నువ్వు ఇంకిపోలేని కాంతిలోని
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సుదే.
మరి ఇది ఇప్పుడు నీ ఎదురుగా
గూడు కట్టుకుంటున్న ఒక పిచ్చుకదే: దాని ముక్కులోని ఒక పుల్లదే"

అని చెబితే, అంతా విని "మరి ఇంతకూ
ప్రేమ ఉందని అంటావా లేదని అంటావా?
సరే ఇది చెప్పు:నిన్ను నమ్మడం ఎలా?"
అని తనో - వాళ్ళో అడిగితే, అతి మెత్తగా

వాళ్ళ పెదాలపై నీ చేతివేళ్ళని ఉంచి ఇలా అంటావు:
"ష్. ఇక మాట్లాడకు. అంతా నిశ్శబ్ధం -
వేళ దాటింది. హృదయం వెలిగింది
మౌనం మాట్లాడింది. ఇక ఈ కవితను
ఇలా ముగిద్దాం, మనిద్దరమూ:"

'ప్రేమ ఉందనీ అనుకోకు, ప్రేమ లేదనీ అనుకోకు. ఎవరి పెదాలపైనో
చేతివేళ్ళయ్యో, చిరునవ్వయ్యో, ఒక
దీపపు కాంతి అయ్యో వెలిగాక, ఒక
లేత పిలుపై తేలిపోయాక, ఇక నీకు

పదాలతో కానీ, శబ్ధాలతో కాని, ప్రేమతో కానీ
ప్రేమారాహిత్యంతో కానీ పని ఏమిటి?"

06 November 2014

నీడలు

చీకటి ఒక దీపంలా వెలుగుతున్న క్షణాన
ఒక్కడివే నువ్వు-
అప్పుడు ఆ రాత్రిలో

తడిచి ముద్దయిన గోడలు. గోడలపై
లోపలేవో ఊగిసలాడుతున్నట్టు
విలవిలా కొట్టుకులాడుతున్నట్టు
అటూ ఇటూ ఊగే లతలలాంటి నీడలు. వణికే నీడలు-

ఏ దారీ చేరని, నిను వీడని ఊడలు. చేతులైనా కాని
ఒక ముఖమైనా కాని, ఒక పలుకైనా
కాని కాలేని, నిన్ను వణికించే నీడలు.

రాత్రి రెక్కల కింద, వెచ్చగా పొదగనివ్వని
పడుకోనివ్వని, తల్లి లేని నీడలు
నిన్ను తండ్లాటకు గురి చేసి
నిన్ను ఆనాధను చేసే నీడలు

'నువ్వు' అనే చీకటి దీపం చుట్టూ
వలయాలుగా పరచుకునే నీడలు
వాన సవ్వడి చేసే, కన్నీళ్ళ వాసన వేసే నీడలు
నల్లని, తెల్లని లేతేరుపు నీడలు

పాలిచ్చే నీడలు. పాలు తాగే నీడలు.
ప్రేమించే, ద్వేషించే, నవ్వే, ఏడ్చే
కావలించుకునే నీడలు. స్ఖలించే
నీడలు. బెంగ పెట్టుకునే నీడలు
నీ చేతివేళ్ళని తాకుదామని వచ్చి

తాకకుండానే ఆఖరి క్షణాన క్షణాన వెనుదిరిగే నీడలు
నిన్ను చూడక వెళ్ళిపోయే నీడలు
నిన్ను పరిహసించే నీడలు. నిన్ను
నిందించే నీడలు. నిందించడంతోనే

ఉత్సవాన్ని జరుపుకునే నీడలు. మట్టి నీడలు.
నవరంధ్రాల నీడలు. బళ్ళున నీపై
కురిసే నీడలు. చల్లగా మృత్యువు
వలే వ్యాపించే స్మృతి నీడలు

ఏమీ కానీ ఏమీ లేని నీడలు. నిలువ నీడ లేని నీడలు
గోడలు. గోడలపై నీడలు, నీడల్లో
గోడలు. మరి గోడలేవో, నీడలేవో

తెలియని చీకటి, ఒక దీపంలా వెలిగే క్షణాన
నీడలతో ఒక నీడగా మారి
మిగిలిపోయే నువ్వు. ఇక...

ఇంకానా?
ప్రస్థుతానికి
నీడలతో ఏమైనా చెప్పడానికి
ఈ నీడకి ఇక్కడ ఇంకేమీ మిగిలి లేదు-!