31 December 2010

ఈ రాత్రికి

ఇంటికి వెడతానో లేదో
ఈ రాత్రికి
ఇంకా ఇక తెలీదు

ఆమె అరచేతుల మధ్య
ఒదిగిపోతానో

మధుపాత్రల
సూర్యరశ్మి చెలమలపై
గులాబీ రేకులతో
సాగిపోతానో

ఇక ఎప్పటికీ తెలీదు.

స్నేహితులు, శత్రువులూ
పిల్లలూ
గులాబీ రేకుల వంటి వారు:
అలా అని
అతడు ఇప్పుడే చెప్పాడు.

నువ్వు విన్నావా?

౨.
ఆమె వద్దకు వెడతానో లేదో
ఈ రాత్రికి
ఇంకా ఇక తెలీలేదు

ఎవరి వద్ద రోదిస్తానో, ఎవరి
ఒంటరి
హృదయంలో మరణిస్తానో
ఇప్పటికీ
ఇంకా తెలీలేదు.

ఎవరి మరణంలో జన్మనవుతానో
ఎవరి జీవితంలో
మరణం అవుతానో, ఎప్పటికీ
ఎవరికీ
ఏమీ కాకుండా పోతానో
ఇప్పటికీ
ఇంకా తెలిసేటట్టు లేదు.

ఆమె వద్దకు వెడతానో లేదో
ఆమె ఒంటరి
హృదయంలో దీపం అవుతానో లేదో

ఇప్పటికి ఇంకా
తెలియలేదు.

౩.
ఈ రాత్రికి
ఇంటికి వెడతానో లేదో
ఇంకా తెలీదు

పిల్లల కళ్ళు నడయాడే
పదాలలో
కొన్నిటినైనా ఎప్పటికైనా
దాచుకుంటానో

రాలిపోతున్న తల్లి తండ్రులను
ఎప్పటికైనా
ఓదార్చుకుంటానో

తెలీదు.

నిజంగా తెలీదు

ఈ రాత్రికి
ఇంటికి వెడతానో లేదో
ఇంకా తెలీదు .

30 December 2010

ఈ రాత్రికి

సీతాకోక చిలుక రెక్కలకు పైగా ఈ రాత్రికి ఒక తుఫాను నా అతిధిగా వస్తుంది.
ఇక నేను దేవతగా మారిన ఒక పిల్లవాడి
ఆదిమ శబ్దపు నిశ్శబ్దపు భాషలో మాట్లాడాలి. నేను ఒక వర్షానికి ప్రార్ధిస్తాను.
ఆ జాబిలిని అలవోకగా పైకెత్తి ఆమె కలకు ఆవలి వైపు మెరిసే
ఒక నక్షత్రాన్ని కాంచెందుకు నేను ఒక గాలినీ, నీటినీ నిప్పునీ ప్రార్ధిస్తాను.
భయపూరితమైన రెండు కనులు
దిగులుపూరితమైన రెండు వక్షోజాలు ప్రార్థనలో ముకుళితమైన రెండు అరచేతులు
కదా ఆమె: అందుకని నేను ఒక వర్షానికై ప్రార్ధిస్తాను.
క్షమించమని వేడుకుంటాను. ఒక వేదనలా,
ఒక అపవిత్ర జ్ఞాపకంలా ఇవ్వబడిన రాత్రిలో నేను నా అస్తిత్వంలోకి
ఒక సముద్రపు వేణుగానంలా జొరబడే నీ స్వరపు గుసగుసలకై వెదుకుతాను.

నువ్వు ఇవ్వగలవా?

నువ్వు వెళ్ళిపోయినప్పుడు

నువ్వు వెళ్ళిపోయినప్పుడు
ఎలా వెళ్ళిపోయావు?

ఈ లోకానికి మరో వైపు
ఎదురు చూస్తూనే
ఉండి ఉంటారు నీకోసం కొందరు
మంచు కప్పిన
వెన్నెలలో, ఆ పచ్చిక మైదానాలలో
లాంతరుతో
మరో వైపు మాత్రమే జీవించిన
నీ లోకంలో
ఎదురు చూస్తూనే
ఉండి ఉంటారు నీకోసం కొందరు

నువ్వు జీవితాంతం
వెదుకులాడుకున్న ఆ కొందరు
ఆ అందరూ =

నువ్వు వెళ్ళిపోయినప్పుడు
నీ వెంట
కొంత నీలి నింగి ఆకాశాన్నీ
కొంత నీలి కళ్ళతో
తడిచిన పదాలనీ
కొంత మరుపునీ
కొంత మత్తునీ
పదిలంగా దాచుకునే
వెళ్లి ఉంటావు=

కొందరితో విసిగి
అందరికై వెళ్ళిన వాడివి
అక్కడ
ఆ అక్కడ
అందరూ కొందరయ్యే చోట
కొందరు ఒక్కరయ్యే చోట
అక్కడ నుంచి
ఇక్కడికి
నువ్వు చెప్పలేకపోయిన
పదాలని పంపివ్వు
కొంత మత్తుతో
కొంత పరవశంతో

మేము వెళ్లిపోతున్నప్పుడు
ఎలా వెళ్లిపోతామో
నీ స్వరాలతో చెప్పుకుంటూ వస్తాము=

25 December 2010

సగం అద్దం by m.s naidu (Remix version by Srikanth)

సగం అద్దం by m.s naidu (original version)

నా అద్దంలో
కొన్ని భూకంపాలు ఉన్నాయి.
ఏదీ విరిగిపడదు.
పగలదు.
ఒరగదు.

నా అద్దంలోంచి నీ అద్దంలోకి
చూస్తాను.
పగిలిపోతాను.

ఈ అద్దాల దూరం ఎంత.
దూరమైన అద్దాలతో ఎవరు చూస్తారు.

నీటి సాలీడొకటి అద్దం లోపల
లోపల కూర్చుని నా వంక చూడక
నీ అద్దం లోపలున్న పదాల కలలకై నిద్రిస్తోంది నిలబడి.

నేనొక అద్దమైతే
నాలుకతో ఎవర్ని వెక్కిరించాలి
కన్నీటి సూర్యుడినా?

(by permission by the writer)

సగం అద్దం by m.s naidu (Remix version by Srikanth

నా ఇంటిలో
కొన్ని భూకంపాలు ఉన్నాయి.
ఏదీ విరిగిపడదు.
పగలదు.
ఒరగదు.

నా ఇంటిలోంచి నీ ఇంటిలోకి
చూస్తాను.
పగిలిపోతాను.

ఈ ఇళ్ళ దూరం ఎంత.
దూరమైన ఇళ్ళతో ఎవరు చూస్తారు.

ఆమెలాంటి
నీటి సాలీడొకటి ఇంటి లోపల
కూర్చుని నా వంక చూడక
నీ ఇంటి లోపలున్న పదాల కలలకై నిద్రిస్తోంది నిలబడి.

నేనొక ఇంటినైతే
నాలుకతో ఎవర్ని వెక్కిరించాలి
సూర్యుడి కన్నీళ్ళనా ?

ఉన్నాను.(Dido remix version)

వచ్చాను ఇంటికి
వాళ్ళు ఇల్లు అని పిలిచే ప్రదేశానికి
వచ్చాను
వచ్చాను నా వద్దకి
వచ్చాను నా వంటి ఇతరుల వద్దకి

ఏమీలేదు

ఖాళీ తెలుపు కాగితాల కింద
కప్పబడే
గాయం గేయం
దేహం దాహం

ఏమీలేదు

దాహమైన దేహం
దేహమైన దాహం
గాయంగా మారిన గేయం
గేయంగా మారిన గాయం
ఏమీలేదు

వచ్చాను
ఇతరుల వంటి నీ వద్దకి
గూడు కానీ
దీపం కానీ లేని
ద్వీపంలా మారిన ఇంటికి
ఇల్లు అని పిలిచే
ప్రదేశానికి
నిషిద్ధమైన ప్రవేశమై
వచ్చాను
నావంటి ఇతరుల వద్దకి

అందుకని


అతడికి భయం వేసినప్పుడల్లా
ఆమె చిరునవ్వుని అనుభూతి చెందుతాడు
అది అతడికి
ఆమె వెడలిపోక ముందు ఉన్న జీవితాన్ని
జ్ఞాపకం చేస్తుంది
అతడు ముక్కలు కావొచ్చు కానీ రాలిపడడు
అతడికి ఉన్న ఒకే ఒక్క ప్రేమ యొక్క జ్ఞాపకం
అలా ఉండ గలిగినట్టైతే
అతడి స్వప్నాలు అతడికి ఉంటాయి
అతడి జీవితం ఓటమి కంటే మిన్నదైనదని తెలిసేవరకు
అవి అతడిని బ్రతికిస్తాయి
ఎందుకంటే అతడు ఇప్పటికీ యోచిస్తూ ఉంటాడు
ఆమె ఇంటికి ఎప్పుడు వస్తుందా అని
1.

అందుకని

ఒక ఆత్మలా నీకు ఒక తాళం అవసరం లేదు
నేను నీ ఆత్మీయ స్నేహితురాలిలా మారి ఉన్నాను
నా కోసం నీవు కదలనవసరం లేదు
నీను ఇక్కడ ఒక్క రోజుకై నీకై ఉన్నప్పుడు
నీవు కనీసం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు
నేను వెడలిపోతే
నువ్వు నన్ను తప్పక కోల్పోతావు: కాబట్టి
నీ తెరలన్నీ తీసివేసి, తలుపులన్నీ మూసివేసీ
నా వద్దకు రా
ఇక నీకు ఏ స్నేహితులూ అవసరం లేదు
ఇక ఎప్పుడూ ఇంటిని వదిలి వెళ్ళకు
2.

అందుకని

పరుగిడీ పరుగిడీ
పారిపోయీ పారిపోయీ
విరిగిపోయీ
ఒరిగిపోయీ
శరనార్ధినై, వివశితుడనై
వచ్చాను
వచ్చాను
వస్తూనే ఉన్నాను
నన్ను నేను
నగ్నంగా
అద్దాన్ని ప్రతిబింబించే
అద్దంలో
చూసుకునేందుకు
వచ్చాను
వచ్చాను
వస్తూనే ఉన్నాను
నేను
ఎక్కడా లేనని
తెలుసుకునేందుకు
మరణిస్తూనే ఉన్నాను
ఉన్నాను.

ధన్యవాదాలు.

1.from Dido 'Coming Home' Lyrics
2.from Dido 'Dont Leave Home' Lyrics.

22 December 2010

ఉన్నాను.(remix version)

వచ్చాను ఇంటికి
వాళ్ళు ఇల్లు అని పిలిచే ప్రదేశానికి
వచ్చాను
వచ్చాను నా వద్దకి
వచ్చాను నా వంటి ఇతరుల వద్దకి

ఏమీలేదు

((ఇది ఒక దీపం లేని సమాధి
ఇది ఒక
దేహం లేని సమాధి.
ఇంటిలో
అపరిచితుడని
అపరిచితుల మధ్య
పరచితుడని
ఈ ఇల్లు ఇక ఎప్పటికీ
దీపం పెట్టలేని సమాధి))

ఏమీలేదు


ఖాళీ తెలుపు కాగితాల కింద
కప్పబడే
గాయం పై గాయం
గేయం పై గేయం
దేహం పై దేహం
దాహం పై దాహం

ఏమీలేదు

దాహమైన దేహం
దేహమైన దాహం
గాయంగా మారిన గేయం
గేయంగా మారిన గాయం
ఏమీలేదు

వచ్చాను
ఇతరుల వంటి నీ వద్దకి
గూడు కానీ
దీపం కానీ లేని
ద్వీపంలా మారిన ఇంటికి
ఇల్లు అని పిలిచే
ప్రదేశానికి
నిషిద్ధమైన ప్రవేశమై
వచ్చాను
నావంటి ఇతరుల వద్దకి

((భార్యగా ఉండలేని భార్య
భర్తగా ఉండలేని
అతడు_ అతడిగా మారిన
నేను:
రహదారులన్నీ రాత్రిపూట
తలదాచుకునే
శరణాలయాలు అవుతాయి
నిన్ను దోచుకునే
హంతక హస్తాలు అవుతాయి
ఎవరూ
ఎవరుగా ఉండని చీకట్లో
నువ్వు
ఎక్కడికి వెడతావు?))

ఏమీ లేదు

పరుగిడీ పరుగిడీ
పారిపోయీ పారిపోయీ
విరిగిపోయీ
ఒరిగిపోయీ
శరనార్ధినై, వివశితుడనై
వచ్చాను
వచ్చాను
వస్తూనే ఉన్నాను
నన్ను నేను
నగ్నంగా
అద్దాన్ని ప్రతిబింబించే
అద్దంలో
చూసుకునేందుకు
వచ్చాను
వచ్చాను
వస్తూనే ఉన్నాను
నేను
ఎక్కడా లేనని
తెలుసుకునేందుకు
మరణిస్తూనే ఉన్నాను
ఉన్నాను.

ధన్యవాదాలు

((ధన్యవాదాలు, ఎప్పుడూ
ఎవరికీ చెప్పకు.
ధన్యవాదాలు))

18 December 2010

ఉన్నాను.

వచ్చాను ఇంటికి
వాళ్ళు ఇల్లు అని పిలిచే ప్రదేశానికి
వచ్చాను
వచ్చాను నా వద్దకి
వచ్చాను నా వంటి ఇతరుల వద్దకి

ఏమీలేదు

ఖాళీ తెలుపు కాగితాల కింద
కప్పబడే
గాయం పై గాయం
గేయం పై గేయం
దేహం పై దేహం
దాహం పై దాహం

ఏమీలేదు

దాహమైన దేహం
దేహమైన దాహం
గాయంగా మారిన గేయం
గేయంగా మారిన గాయం
ఏమీలేదు

వచ్చాను
ఇతరుల వంటి నీ వద్దకి
గూడు కానీ
దీపం కానీ లేని
ద్వీపంలా మారిన ఇంటికి
ఇల్లు అని పిలిచే
ప్రదేశానికి
నిషిద్ధమైన ప్రవేశమై
వచ్చాను
నావంటి ఇతరుల వద్దకి

పరుగిడీ పరుగిడీ
పారిపోయీ పారిపోయీ
విరిగిపోయీ
ఒరిగిపోయీ
శరనార్ధినై, వివశితుడనై
వచ్చాను
వచ్చాను
వస్తూనే ఉన్నాను
నన్ను నేను
నగ్నంగా
అద్దాన్ని ప్రతిబింబించే
అద్దంలో
చూసుకునేందుకు
వచ్చాను
వచ్చాను
వస్తూనే ఉన్నాను
నేను
ఎక్కడా లేనని
తెలుసుకునేందుకు
మరణిస్తూనే ఉన్నాను
ఉన్నాను.

ధన్యవాదాలు.

22 November 2010

పాయల్

మళ్ళీ
మొదటికి రావొద్దు
మళ్ళీ
వలయం కావొద్దు

వలయంలో
వివశితుడై
తిరుగాడుతున్నవాడికి
ఒక బిందువుపై
శిరస్సుని ఆన్చి, నీ పద
దయచే
నీ వదనపు ఖడ్గంచే
ఖండింపబడే
కరుణ లేని వ్యాకరణం
వొద్దు=

రూపాంతరం చెందే
వాక్యాంతపు
విరామ చిహ్నాలు వొద్దు=

అపవిత్ర పాత్రలూ
పవిత్ర మధువులూ
వారసత్వపు
పౌరసత్వపు ఎదురు
చూపులూ
వొద్దు=

తెగుతున్న రాత్రుళ్ళూ
తెగని అందరి
అంతిమ వ్యక్తీకరణలూ
వొద్దు=

మనం వొద్దే
వొద్దు=

((వొంటరితనపు చెట్టు కింద దిగులు పూలు అమ్ముకుంటున్న పాయల్
వికసించే నల్ల పూల తోటలో
తెల్లని కళ్ళ, తెల్ల తెల్లాని విషాదాన్ని పదాల నల్ల నల్లాని చూపులతో
అమ్ముకుంటున్న, నమ్ముకుంటున్న పాయల్
రాత్రి దయామైయపు పెదవిపై
ఎర్రటి జాబిలై వెలిగే, జ్వలించే పాయల్, నీ వెంట రెండు నిస్సహాయమైన
మూగ చేతులై సాగే పాయల్, పాయల్
ఆమె నీకు తెలుసునా?))

((ఎప్పటిలాగే ఈ అంచు నుంచి, ఈ మంచు నుంచి, ఈ మహా మంచు
మనిషి నుంచి, కొంత
కారుణ్యం లేని ఋణం ఉండనివ్వండి. ఎప్పటిలాగే ఈ అంచునుంచి
పొంచి ఉన్న కంచు ప్రతిబింబాలనుంచి
కొనసాగుతున్న నిర్దిష్టతలనుంచి కొంత కాంతి ఉన్న కదలికలను
మిగలనివ్వండి.))

((నీకు కాని, ఇద్దరితో మెదిలే ఆమెకు కానీ ఆమె అతడికి కానీ,
ఆ రాత్రికి రాత్రి లేదు.
నిశ్శబ్దాల నుదుట సింధూరాలు లేవు. పదాల గజ్జెలు లేవు. ఇక
ఎవరూ లేని కాటుక కన్నీళ్లు మాత్రం
సాయంత్రంలోకి ఇంకిపోతాయి: ఆ పాదాల ముందు
పాయల్ నయనాల ముందు
నయనాల పాదాల పాయల్ పాలిపోయిన పదాల ముందు కరిగి
విరిగిపోతాయి.))

))ఇంతకూ నీకు పాయల్ తెలుసునా?((

వొద్దు
మళ్ళీ
మొదటివి కావొద్దు
మళ్ళీ
వలయం రావొద్దు

అనలంలో
ఆదిమ
వివశితుడై
తిరుగాడుతున్నవాడికి
ఒక బిందువుపై
శిరస్సుని ఆన్చి,
నీ పద
వదనపు ఖడ్గంచే
ఖండింపబడే
వ్యా/క"రుణం"
వొద్దు=

రూపాంతరం చెందే
వాక్యాంతపు
విరామ చిహ్నాలు వొద్దు=
పవిత్ర పాత్రలూ
అపవిత్ర మధువులూ
వారి
పౌరసత్వపు ఎదురు
చూపులూ
వొద్దు=

తెగని రాత్రుళ్ళూ
తెగుతున్న
అందరి
అంతిమ
వ్యక్తీకరణలూ
వొద్దు=

మనం వొద్దే
వొద్దు=

వొద్దా

=మనం
ఇప్పటికీ
ఎప్పటికీ?=

((మనం))

17 November 2010

ఉట్టినే అలా

((ఒక నైర్యాసపు అచ్చులూ, హల్లులూ))

=చదవటం
మరణించడం వంటి ప్రక్రియ
కలలతో
కదలకండి ఇక్కడ=

))మేఘాలు వస్తాయట నువ్వు అడిగినప్పుడు
పూవులు పూస్తాయట
నువ్వు నవ్వినప్పుడు:
ఇక ఏమీ అవసరం లేని ఒక కాంతి వర్షం
కురుస్తుందట
నువ్వు నన్ను తలుచుకున్నప్పుడు:))

((వస్తుందట
ఒక వసంతం నిన్ను కావలించుకునేందుకు
వికసిస్తుందట
ఒక చిన్న పదం, నిన్ను
తన చెంత చేర్చుకునేందుకు:
గూడులో
ఒక చిన్న చింతతో
నువ్వు దిగులుతో, చిరు చిరు
నగవుతో
నిదురిస్తునప్పుడు
వస్తుందట ఒక వాక్యం
నిన్ను
తన దరికి చేర్చుకుని
విసిరివేసేందుకు((

=చదివిందంతా చదివి
బ్రతికినదంతా
బ్రతికి, ఎందుకు ఇదంతా
ఎందుకు
ఈ తపన అంతా=

((ఉంటాయి నువ్వు ఇప్పటిదాకా కాంచని శరీరాలు. ఉంటాయి
అప్పటిదాకా నువ్వు ఎప్పటికీ
కాంచలేని ఇతర అర్థరహిత ప్రమాణాలు:
నీ చిన్న చిన్న
నిస్సహాయతనంతా కూడపెట్టి ఒక ఆలింగనంగా చేయి: వస్తాను
నేను లేదా అతడు
నీలో ఒక అంతిమ ఆరంబాన్ని కనుగొనేందుకు:
వస్తాను నేను
ఆమెలో,అందరిలో ఒక ఆదిమ అంతాన్ని కనుగునేందుకు:))

వస్తారట నువ్వూ నేనూ
నువ్వు అడిగినప్పుడు
వస్తారట నువ్వూ నేనూ
నువ్వు అలిగినప్పుడు

=రాత్రి లేదు
అలా అని
పగలూ లేదు
ఉందామా, నువ్వూ నేనూ
అప్పటిదాకా

))నువ్వూ ఎక్కడా ఉండవు
నేను ఎక్కడా ఉండను((

=ఊరికే అలా
ఇలా
ఇక్కడ, ఉట్టినే అలా
ఉందామా?=

నువ్వు

పూవుల్లో నువ్వు
ముళ్ళలో నువ్వు
పలుకలేని పదాలలో నువ్వు
పలుకే లేని పదాలలో
నువ్వు: నువ్వు

హింసలలో నువ్వు
నిస్సహాయ
దుర్మార్గపు వాస్తవాలలో
నువ్వు: నువ్వు

ప్రేమతో
నువ్వు
ద్వేషంతో
నువ్వు
సహనంతో
నువ్వు
అసహనంతో
నువ్వు
హత్యలతో
నువ్వు
ఆత్మహత్యలతో
నువ్వు
ఎవరూ లేక
రాలిపడే నువ్వు
అందరూ ఉండి
పిగిలిపోయే నువ్వు
నువ్వు:

((ఒక రోజు. భార్యలు ప్రియురాళ్ళలాగా, ప్రియురాళ్ళు భార్యలుగా ఉండలేని రోజు
అతడు ధ్రవ్యమై సర్వత్రా అలుముకుంటున్న రోజు
అతడు, అతడు అందరిలా ఒక్కటై, ఎవరికీ లేని అందరివాడై ఇలా ఊరికే మిగిలి
పిగిలి, పోయీ ఉన్నాడు. అతడు: ఆమె.))

=ఆ తరువాత ఏమౌతుంది?=

(( స్త్రీ లేని, స్త్రీని కనలేని ఒక పురుషుడు రాత్రంతా పూవులను పిల్లలుగా,పిల్లలను
పిల్లలు లేని తల్లిగా ఒక దయాపూరితమైన మధుపాత్రగా రూపాంతరం చెందుతాడు.))

= వాళ్లకి నీడలు లేవు
వాళ్ళ పద ముద్రల జాడలు లేవు
కరిగీ, కరగనంతగా
సాగీ, ఎవరికీ
ఆఖరి అంతక్రియలు లేవు
ఎవరికీ, ఆదిమ
పుష్పపు విలాపనలు లేవు=

(( వాక్యాంతపు చిహ్నం చివర ఎదురు చూసేది ఎవరు? వాక్యపు ఆరంభంలో
మొదటి అక్షరమై అద్రుశ్యమయ్యేది ఎవరు?))

= ఇది కవిత కాదు. మీ ప్రతిధ్వనిని ప్రతిబింబించే హృదయం కాదు: ఇది. ఇది=

)) ఆ తరువాత((

పూవుల ముళ్ళలో
నువ్వు
ముళ్ళ నవుల్లో నువ్వు
దిసాంతపు
వ్యాకరణంలో నువ్వు
నిన్ను చేరలేని
కరుణలో నేను:

((నేను అంటాను:
మనం ఈ పూట పూర్తిగా
మరణిద్దాం))

= ఇప్పటికీ నువ్వు ఇక్కడ
ఉన్నటయితే
వెడలిపో, ఇప్పుడే ఇక్కడే=

((ప్రేమ అంత తేలిక కాదు
జీవించడమూ
అంత తేలిక కాదు))

= వెన్నెల దాగి ఉంది
అగ్నీ ఆగి ఉంది
నేను ఇక్కడ ఆగి, దాగి ఉంటాను
నేను ఇక్కడ
ఆగుని, దాగుని ఉంటాను=

)) మళ్ళా రేపు ఉంది((

=కలుద్దామా మనం?=

09 November 2010

నీ రోజు ఇది

నీ రోజు ఇది
నీతో
నీ నీతో, నీవైన
నాతో
నీ ముంగిట్లో
కరగాల్సిన సమయమిది
లోకమిది=

నీదైన
నా రోజు కూడా ఇది
నా నాతో, నీవైన
అందరితో
నీ పదాల ముందు
మోకరిల్ల వలసిన
ప్రవాసపు
మహా దూరమే ఇది=

దూరం గురించే
ఇదంతా
దగ్గరితనం గురించే
ఇదంతా
ఇదంతా
దూరం అవుతున్న
దగ్గరతనం గురించీ
దగ్గరవుతున్న
దూరం గురించే
ఇదంతా= ఇదంతా
దగ్గరా
దూరం కాలేని
కన్నీళ్ళ రాళ్ళ కలల
గురించే ఇది అంతా
ఆది అంతా
అనంతం అంతా=

((చూస్తుండవచ్చు నువ్వు. ఒక పుష్ప గుచ్చాన్ని కళ్ళలో పదాలతో పుచ్చుకుని
ఎదురు చూస్తుండవచ్చు నువ్వు
ఊరికే అలా, ఈ రాత్రిలో, ఎప్పటికీ రాని తిరిగి వచ్చే ఆ రాత్రిలో, ఒక నిశ్శబ్దంలో
నిశ్శబ్దం కాని ఒక పదమై, రణరంగంలో కోల్పోయిన
ఒక ఇనుప ప్రతిబింబమై, నువ్వు అలా, ఊరికే అలా, ఎవరికీ చెందని కలలా,
నువ్వు ఎదురు చూస్తుండవచ్చు.))

((నేను వస్తానా? వస్తే, ఎప్పటికైనా నీ వదనాన్ని తిరిగి తెస్తే, వచ్చేదీ తిరిగి తెచ్చేదీ
ఎవరూ లేని ఒక ఒంటరి పదాన్నా? లేక
ఎవరూ చెప్పలేని ఒక సమూహపు, కళకళలాడే కన్నీటితో తళతళలాడే హత్యనా?))

నీ రోజు ఇది
నీతో నువ్వు కూడా
గడపలేని
నీవైన నాతో కూడా
పంచుకోలేని
పరమ కాళ రాత్రి ఇది
వైవాహిక
జీవితమిది=

మహా దూరమే ఇది
మహా దుర్మార్గమే ఇది
కాంచి
ఎవరూ పలుకలేని
మహా నైరాస్యమే ఇది
ఎప్పటికీ వివరించలేని
ఇద్దరి
విధ్వంసమే ఇది=

కాబట్టి
అంతం ఒకటి ఉండాలి
కాబట్టి
ఇలా, ఈ ఇలలో, నీదీ
నాదైన కలలో
ఇలా అంతం చేస్తాను

((నేను ఎక్కడా లేను
నేను ఎక్కడా ఉండను.))

08 November 2010

పిల్లలే కదా అలా

పిల్లలే కదా అలా
ఎదురుచూసేది
ఎంత రాత్రైనా
ఎంత బాధైనా
పిల్లలే కదా అలా
అలలై
నువ్వు మరచిపోయిన
కలలై, నీకై
ఎదురుచూసేది==

పిల్లలే కదా అలా
ఎంత రాత్రైనా
ఎంత బాధైనా
నీకు తోడు ఉండేది
పిల్లలే కదా అలా
పిచ్చుకలై
నువ్వు మరచిపోయిన
కలల చుట్టూ
నీకై గిరికీలు కొట్టేది==

((ఇక్కడే రెండు పూలు పూసాయి. ఇక్కడే రెండు పావురాళ్ళు తిరుగాడాయి.
పూలల్లో, పావురాల కళ్ళ చెమ్మలో, నెమ్మదిగా పదాలను కూర్చుకుంటున్న
రెండు పెదవులు, పురాజన్మ నుంచి తెచ్చుకున్న కరుణతో కదులాడాయి.
అవి నీకై ఎదురుచూసే పిల్లల్లా మారాయి.))

((నువ్వు ఇక్కడ లేవు. ఎక్కడా లేవు. ఎదురుచూపుల కన్నీళ్ళలో లేవు,
ఎదురు రాని బెదురు చూపుల బేల కళ్ళలోనూ లేవు.
లేకపోవడమే నీ ఉండటంగా మారిన ప్రదేశాలలో, భాష లేదు, భావం లేదు
కరుణతో కూడిన వ్యాకరణం లేదు.))

తనే కదా అలా
పిల్లల్లా ఎదురుచూసేది
ఎంత రాత్రైనా
ఎంత హింసయినా
తనే కదా అలా
నీకై, ఒక దీపమై
ఆపై ఒక ద్వీపమై అలా
పిల్లలతో కలిసి
రాత్రిలో దహనమై పోయేది=

((ఎప్పటికైనా తనే కదా అలా))

పిల్లలే కదా అలా
నీతో జీవితం గడిపేది
పిల్లలే కదా అలా
నీకు మృత్యువుని
బహుకరించేది=

06 November 2010

ఊరికే అలా

వస్తావు నువ్వు

ఎందుకని నేను అడగను
(అడిగేందుకు కాదు కదా
జీవితం ఉన్నది)
అందుకని

వస్తాను నేను

ఎందుకనీ నువ్వూ అడగవు
(అడగటం
ఒక అబద్ధమని నీకు తెలుసు
కనుక)

కారణాల గురించి ఇద్దరమూ
కరుణతో అడగము
కరుణ ఉన్నది కాబట్టి అడగము

-వ్యాకులత నిండిన ఒక నయనం
దాహం నిండిన ఒక దేహం
దేహం నిండిన ఒక దాహం
అంతే కదా మనం,
అటువంటి గాధే కదా మనం -

వ్యాకరణం లేని కరుణ కదా
మనం
రణం కూడా కదా మనం==

నువ్వు వచ్చినప్పుడు
నేనూ వచ్చినప్పుడు
ఇద్దరితో కలిసి
ఇద్దరివీ అయ్యి, ఇద్దరివీ కాని
చరిత్రలన్నీ
చంచల పదాలతో వచ్చినప్పుడు

ఉంటాము నువ్వూ నేనూ
ఊరికే అలా
కా/రణాలు లేకుండా
కన్నీళ్ళం కాకుండా
ఊరికే అలా
ఊరికే అలా-

రాత్రి ఇద్దరం కలిసినప్పుడు

రాత్రి ఇద్దరం కలిసినప్పుడు
కొంత పవిత్రత
కొంత పాపం

రాత్రి ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు
కొంత మౌనం
కొంత గానం

రాత్రి ఇద్దరం మైమరచినప్పుడు
కొంత హింస
కొంత మీమాంస

రాత్రి ఇద్దరం గొడవపడినప్పుడు
కొంత ప్రేమ
కొంత ద్వేషం
ఇంకొంత అసహనం

ఇళ్ల గురించి కదా ఇదంతా
తల్లుల గురించి
ఎప్పటికీ లేని తండ్రుల గురించీ
కదా ఇదంతా
మన కధ అంతా
మన కదలికల కలల అలజడి
అంతా, అనంతం దాకా-

ఇక రాత్రి పాక ముందు మిగిలిన
నీలాంటి
నాలాంటి
మత్తుతో, జీవన మృతువుతో
ఊగుతున్న పూలలోంచి
ఒక వేకువ జాములోకి కదా మనం
కదిలిపోతాం

కొంత స్మృతితో
కొంత విస్మృతితో

మళ్ళా
మరో రాత్రిలోకి
మరో స్నేహంలోకి-

((నువ్వు చూస్తుంటే, ఇది నీకు))

29 September 2010

మరొకసారి

మరొకసారి నేను తాగి ఉన్నాను, మరొకసారి నేను రాయిగా మారి ఉన్నాను,
మరొకసారి నేను దేవతగానూ రాక్షసుడిగానూ
స్వాప్నికుడిగానూ, స్వప్నించబడేవాడిగానూ,నేసేవాడిగానూ నేయబడేదానిగానూ
ఆదిమ శబ్దంతోతో ఒక పురాతన గీతాన్ని ఆలపించే
ఒక పురాతన శిల్పంగానూ మారి ఉన్నాను.

మరొకసారి,ఈ రోజు వర్షిస్తుందని నాకు తెలుసు,
మరొకసారి ఈ రాత్రి పగటి తడితో మెత్తనయ్యి మెరుస్తుందనీ తెలుసు.
మరొకసారి ఈ రాత్రి నెమ్మదిగా, అనామకమైన సమ్మోహిత స్వరంతో
నన్ను పూర్తిగా తుడిపివేసి ఇంటికి తీసుకు వెడుతుందనీ తెలుసు.
ఇక నన్ను ఒక ఆదిమ స్వరంతో ఒక పురాతన శిల్పంలో
కలగన్న ఆ ముఖరహిత స్వరం, నేను పదాలు లేక, పదాలను వీడలేక
పదాలను పోల్చుకోలేక పదాలలో సుడులు తిరుగుతూ
వీధులలో రాలిపడి ధూళిలో కనుమరుగై పోవడాన్ని చూస్తుందనీ తెలుసు.

విధి. మునుపే ఎన్నుకోబడిన అవకాశాల మధ్య ఎన్నుకోవడం ఎలా?
మరెప్పుడో కోల్పోయి తిరిగి ఎప్పటికీ కనుగోలేని ఈ అస్థిత్వపు పవిత్ర పాత్రని
నీకు, నీలి రక్తపుబొట్టు వంటి, పదునైన ఖడ్గం వంటి నీ కదలికలికి
బహుమతిగా ఇస్తున్నాను. అందుకని,నీకై నేను

మరొకసారి నేను తాగి ఉన్నాను, మరొకసారి నేను రాయిగా మారి ఉన్నాను
మరొకసారి నేను మధువుగానూ మధుసేవకుడిగానూ
స్వాప్నికుడిగానూ, స్వప్నించబడేవాడిగానూ, శాపంగానూ శాపగ్రస్తుడిగానూ
ఆదిమ శబ్దపు ప్రతిధ్వనిని తనలో నింపుకున్న
ఒక పురాతన శిధిలంగానూ మారి ఉన్నాను

నీడ

పక్షి లేని ఒక అద్దపు కల

తరచూ పదం తనని తాను ప్రతిబింబిస్తూ
చిహ్నాల వలయాకారపు ప్రదేశాలలో
ఒక ప్రతీకను వొదిలి వెడుతుంది: అది బహుశా
మరణం లేని ఈ భాష కావొచ్చు.

ఆ తరువాత, ఒక రంగురహిత పూవు
ఆమె అస్థిత్వపు
కనురెప్పలపై రాలిపడుతుంది. నాకు తెలుసు

నేను నీ కలకు
మరో అంచున కదులాడే నీడని అని.

08 September 2010

ఈ గులాబీలు

నేను కూడా విరిగిపోయాను
నేను కూడా
రాళ్ళ నీటిని రుచి చూసాను

సమాధుల గులాబీలను
నా అరచేతుల మధ్య
పొదివి పుచ్చుకున్నాను
మొద్దుబారిన
మాటలులేని ఈ గులాబీలు, నీ రాజసపు
నిశ్శబ్దంతో స్థాణువైన
నల్లటి రాళ్ళు.

నా మటుకూ అది
మరణించిన వాళ్ళు మళ్ళా
తిరిగి రావడాన్ని
గమనించడం
నా మటుకూ అది
మరచిపోయిన ముఖం ఏదో తిరిగి
అద్దంలోంచి పొడుచుకురావడాన్ని
విబ్రాంతితో చూడడం

అది ఇప్పటికీ
క్షణక్షణానికీ
నిమిష నిమిషానికీ
నా భుజంపై వాలిన ఆ అస్థిపంజరపు
చేతి స్పర్శనూ
ముఖంపై దాని శ్వాసనూ
ఒక భీతితో అనుభూతి చెందడం

అస్తిత్వపు ప్రార్ధనకై
బలి ఇవ్వబడిన రక్తపు గులాబీని
నువ్వు చూసావా?

ఈ జీవితం

నీ కళ్ళతో చలిస్తున్న ఒక పుర్రెను
నేను కలగన్నాను
ఉన్మాదపు చిహ్నాలతో చలిస్తున్న రాత్రిలో
నేను నీ కళ్ళతో నిండిన
ఒక పుర్రెను కలగన్నాను

ఒక నలుపు జీవికీ
ఒక నలుపు ఆకాశానికీ మధ్య
ఒక అస్పష్టపు కాంతి ఖడ్గం
నీకై వేలాడుతుంది

ఒక నీడ కానీ, ఒక పూవు కానీ లేకుండా
పరివ్యాప్తమవుతున్న ఈ క్షణం
ఒక అస్థిరతతో కొనసాగుతున్న
ఈ దయరహిత అసంపూర్ణ జీవితం

రెక్కలు లేని సీతాకోకచిలుకలు
రాలిపోయే రాత్రిలో
నీ కళ్ళతో నవ్వే ఒక నల్లని పుర్రె

05 September 2010

ఇదే. ఇదే.

ఎక్కడ ఉండగలను నేను? ఎక్కడ ఉండగలను నేను?
ఒక రహస్య పక్షి నా మెడను తాకగా
నేను దాని రెక్కల కిందుగా కదులాడే గాలిని
అనువదించుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.
నేను మరణిస్తూ ఈ చీకటి అస్తిత్వంలో
నిరంతరంగా స్వప్నిస్తున్నాను.
నేను మునిగిపోతూ ఈ నా ఆత్మలో
పూర్తిగా స్వప్నిస్తున్నాను.
చెట్లతో నిండిన ఒక గదిని కలగంటున్నాను.
చెట్లతో, నీడలతో, ఒక వర్షపు చినుకు మనం మరో
జీవితంలో మరచివచ్చిన మరో స్త్రీ స్పర్శగా మారే
ఒక గదిని, మదిని కలగంటున్నాను. ఆ నీడల కిందే
నేను తాకేందుకూ, ఆఘ్రానించెందుకూ
మరణించేoదుకూ తపించే మరో లోకం దాగి ఉంది.
ఇదే జీవితం ఇక, ఇదే మరణం ఇక.
ఈ విశ్వాన్ని మొత్తం సంధ్యాకాంతిలో కదులాడే
ఒక రావిఆకులో పొదివి పుచ్చుకోగలడం,
ఈ ప్రేమ పట్ల ఈ మృత్యువు పట్ల ఎరుకతో ఉండగలగడం
ఇక ఇదే జీవితం, ఇదే మరణం.
ఇదే. ఇదే.

ఇప్పుడు

నేను ఇంకా నిదురించలేదు. ఇంకా ఈ క్షణం నేను జీవంతో చలిస్తూ ఉండేందుకు కారణమొకటి ఉంది.

మరెక్కడో చందమామ వేపచెట్ల కొమ్మల మధ్య దాగుడు మూతలాడుతుంది. ఆకాశం ఒక సంద్రంలా
వెన్నెల పుప్పొడితో నిండిన ఒక సముద్ర తీరంలా ఎంతగా విచ్చుకుని ఉందంటే
ఇక ఈ పూటకి నిదురించటం సాధ్యం కానే కాదు. వీటన్నిటికీ తోడుగా రాత్రి అత్తరు చిరు పరిమళానికి
తోడుగా, నా రక్తం ఈ వేల ఒక ఆదిమ సంగీతంలా ప్రవహిస్తుంది. ఈ పూట నేను ఒంటరిగా ఉన్నాను
ఇంకా ఈ క్షణం ఎంత నిండుగా ఉందంటే, ఇక జననం మరణం పెద్ద విషయాలు కానే కావు.
ఈ క్షణం ఎంత సంపూర్ణంగా ఉందంటే, ఇక ఎవరికీ తెలీదు
ఇది స్వప్నమో లేక మరణాంతరం కంచె ఒక కాంతి ప్రపంచమో. నా పక్కగా
ఈ విశ్వపు శ్వాస లయ, మరో పక్కగా నా కొడుకు స్వప్నాల దయ
ఇద్దరినీ గోరువెచ్చగా ఆలింగనం చేసుకుంటున్న నా స్త్రీ పురాతన సముద్రపు అలల ప్రేమ లయ.

రెండు రెక్కల మధ్యగా, రెండు సముద్రాల మధ్యగా, రెండు పరిమళాల మధ్యగా ఇరుక్కుని ఊయలలూగుతూ
ఎక్కడనుంచీ మొదలు కాని, ఎక్కడా అంతం కాని ఒక జోలపాటను వింటున్న ఒక మనిషి ఉన్నాడు ఇక్కడ.
భూమి గుసగుసలను వింటూ, మన స్వప్నాలలో మనల్ని వెంటాడే
ఒక దేవత వొదిలివేసిన చిహ్నాలని అనువదించుకుంటూ, మళ్ళా మళ్ళా తిరిగి వచ్చే ఒక తపన యొక్క
ఆధారాలని వెదుకుతూ ఒక మనిషి ఉంటాడు ఇక్కడ.

నిజానికి ఒక పదం అవసరమా? నిజానికి ఒక చిహ్నం అవసరమా? ఆ ముఖం వైపు చూడు.
ఇతరులని ప్రతిబింబించే తన ముఖం. ఇంకా
నేను ఇక్కడ ఉన్నాను. నువ్వూ ఇక్కడ ఉన్నావు. ఇతరులు, ఇతరేతరులూ ఇక్కడ ఉన్నారు.
మనం ఉన్నాం ఇక్కడ. మనం ఉన్నాం. మనం ఉంటాం. ఇప్పటికీ. ఎప్పటికీ. ధన్యవాదాలు.

నేను ఇంకా నిదురించలేదు. ఇంకా ఈ క్షణం నేను జీవంతో చలిస్తూ ఉండేందుకు కారణమొకటి ఉంది.

ఎవరు

ఎంతగా అలసిపోయిన సమయాలివి
ఆఖరకు ఉచ్చరించే ఒక పదం కూడా
రోదించే ఒక పాపలా మారిపోయే
ఎంతగా అలసిపోయిన సమయాలివి?

నేను నీ వద్దకు వచ్చాను, అరచేతులనిండా
పూలతో, రాత్రి కాంతితో చెమ్మగిల్లిన
నక్షత్రాలతో నేను నీ వద్దకు వచ్చాను.

నేను నీ వద్దకు వచ్చాను, ఎడారులనుండీ
శిధిలాల మధ్య నుండీ
విరిగిన శిలా విగ్రహాలు తమ పాదాల చెంత
విలపించే తమ నీడల్ని
నిస్సహాయంగా చూసే ప్రదేశాలనుండీ
ఒక సుదీర్ఘమైన ప్రయాణం తరువాత, నేను
నీ వద్దకూ, ఈ జీవితం వద్దకూ
జీవించి ఉన్న
మృతువు వద్దకూ వచ్చినప్పుడు
నువ్వు అడుగుతావు:

"అలసిపోయినది సమయమూ, పదమా
లేక మనమా?"

సరిగ్గా అప్పుడే, ఖాళీ చేతులు
అలసిన సమయాలను
పరామర్సిస్తున్నప్పుడే
నేను గ్రహిస్తాను: నీ అరచేతులు
ముళ్ళ పక్షులతోనూ
శిధిలాలతోనూ
ఒక విరిగిన అద్దంలో వెదజల్లబడిన
రాత్రితోనూ
నిండి ఉన్నాయని. ఇక ఆ తరువాత

ఒక నీడ మోకాళ్ళపై ఒరిగిపోయి
ఈ పదాలను ఒక
ప్రతీకకూ, ఒక రక్తపు బిందువులో
చెక్కబడిన వెన్నెలవంటి
వదనానికీ అంకితం ఇస్తుంది.
ఇక ఆ తరువాత

జీవించేది ఎవరు? మరణించేది ఎవరు?
అస్తిత్వపు అంచున దాగుని
తనని తాను ఎవరికీ చెందని
ఒక గులాబీకి సమర్పించుకునేది ఎవరు?

03 September 2010

విస్మృతి

ఒక మేకుని దిగగొట్టడంతో సరిపోదు. నువ్వు మరింత కటినంగా ఉండాలి. ఆమె హృదయంలోకి మరింత లోతుగా దింపు. ఎందుకంటే ఒకప్పుడు నిన్ను పోషించిన ఆ హృదయపు ధ్వనులు ఇక ఎప్పటికీ తిరిగి నీకు వినిపించకూడదు.

హృదయంలోకి ఒక మేకా? అది సరిపోదు. నువ్వు మరింత క్రూరంగా ఉండాలి. ఆమె చేతుల్నీ కాళ్ళనూ తెగిపడిపోయేంత వరకూ చాచు. సుత్తిని నుదిటిపైకి గురిపెట్టు. మరింత లోతుగా మరింత గట్టిగా మోదు, ఎందుకంటే నువ్వు భాధతో విలవిల లాడుతున్నప్పుడు నీ వదనాన్ని పొదివిపుచ్చుకున్న జీవితాన్ని ఇచ్చే ఆ అరచేతులు ఇక ఎప్పటికీ మరలా జీవం నిండిన సంజ్ఞలతో తిరిగి రాకూడదు. ఆమె పెదాలను పెరికివేయి దంతాలను విరిచివేయి ఆమె వక్షోజాలను నుజ్జు నుజ్జు చేయి, ఎందుకంటే ఇక ఎప్పటికీ మరణించే వాళ్ళకూ, మృతులకూ (అది నువ్వు) జీవితాన్ని ఇచ్చిన ఆమె స్పర్శా శబ్దమూ నిశబ్దమూ పదాలూ నీకు మళ్ళా ఎప్పుడూ గూడు కానీ నీడ కానీ పాట కానీ కాకూడదు. బహుశా, అప్పుడు పూర్తవ్వుతుంది. బహుశా అప్పుడు సాధ్యం అవుతుంది.

పవిత్రపాత్రలాంటి ఆమె దేహం పిగిలి రాలిపోయి విస్మృతి భూమిలోకి కుంగిపోతుంది. కాకపోతే, ఇక ఈ సారి పునరుజ్జీవనం లేదు కాకపోతే, నువ్వు ఉరి వేసుకుని చనిపోవడం మరచావు .

రంగులు

ఒక శబ్దపు తునక విస్తృతమైన రంగుల వలయాలుగా
నలుమూలలా అక్కడ వెదజల్లబడినప్పుడు
నువ్వు అడుగుతావు విస్మయంగా: "రంగులా?" ఆమె
బదులిస్తుంది, "అవును. హింసయొక్క
ప్రేమయొక్క ఎదురుచూపుల రంగులు. అవి వలయాలు."

ఇక ఇద్దరి మధ్యకూ, తన అరచేతులలో ఒక సముద్రాన్నీ
తన కనులలో ఒక విశ్వాన్నీ పొదుపుకున్న
పిల్లవాడొకడు తడబడే రంగులతో వస్తాడు.

"ఈ చిన్ని నీటిగుంటను నువ్వు ఎలా దాటుతావు?
ఈ చిన్ని మట్టి దారిని నువ్వు ఎలా దాటుతావు?"

అతడు నవ్వుతాడు. ఆమె నవ్వుతుంది. ఇక
ఇద్దరి వదనాలకు పైగా ఒక ఇంద్రధనుస్సు వికసిస్తుంది.
అతడి ముఖం ఒక ఎడారి.
ఆమె ముఖం ఒక వర్షపు పూల రంగుల ఉద్యానవనం.

"ఎడారి సూర్యుడు ఆలపించే వేదన గీతం" ఆమె అంటుంది.
"వర్షం, పూలు ఆలపించే జీవిత గీతం" అతడు అంటాడు.ఇక

జీవితానికీ జీవించడానికీ మధ్య ఒక అస్తిత్వం, స్మృతితో
మధువుతో తడిబారిన పెదాలతో ఆగిపోతుంది.
ఆ తరువాత ఆమె అతడి బాహువులలో వొదిగిపోతుంది:
అది ఒక జోలపాట.
ఆ తరువాత అతడు ఆమె వక్షోజాలలో వోదిగిపోతాడు:
అది ఒక విస్మృతి ఊయల. ఇక ఆ తరువాత

నక్షత్రాలతో నిండిన రాత్రి మనుషులపైకి చొచ్చుకు వచ్చినప్పుడు
అతడు భాష లేని పదాలతో శబ్ధిస్తాడు .
ఇక ఆ తరువాత నక్షత్రాలు లేని నల్లని రాత్రి
పూల రంగులను పొదివి పుచ్చుకున్న పిల్లలలపై రాలిపడినప్పుడు
ఆమె జీవితం రక్తం ఓడుతున్న సంజ్ఞలతో మాట్లాడుతుంది.

అద్దం ప్రతిబింబించే అద్దంలో ఇరువురూ నయనాలు
ప్రతిబింబించే నయనాలతో అడుగుతారు:
"అంతేనా? జీవితమింతేనా? అంతే అయితే, ఇక ఏమీ వద్దు.
ధన్యవాదాలు." ధన్యవాదాలు.

జాబిలీ పై జాబిలీ, పదాలపై పదాలూ, గాలిలో పూలూ, పూలలో
ముళ్ళూ, ముళ్ళపై పెదాలూ, పెదాలపై
ఒక్కటయ్యేందుకు ముగ్గురిగా మారిన ఇద్దరూ కరిగిపోయే రాత్రిలో
ఒక శబ్దపు తునక విస్తృతమైన రంగుల వలయాలుగా
నలుమూలలా అక్కడ వెదజల్లబడినప్పుడు
అందరూ ఒక నిశ్సబ్ధపు ఆలయంలో
తెల్లటి పూల ముందు మోకరిల్లుతారు.

01 September 2010

ఒకే ఒక్క పూవు

మనల్ని దయగా పొదివిపుచ్చుకునే ఆ సమూహమే
తిరిగి మనల్ని నిర్దయగా వేటాడుతుంది

నీ ఇంటి వెనుక పెరట్లో నువ్వొక చిన్ని మొక్కను నాటి
నీ వేదనని తుడిపివేసే, నీ అస్తిత్వపు వేదనని
తేలిక తేలికగా తుడిపివేసే ఆ మొక్కకు పూచే
ఒకే ఒక్క పూవుకై ఎదురు చూస్తావు

నువ్వు దానికై ప్రతిరోజూ వర్షాన్నీ, గాలినీ ఎండనీ
కొన్ని పదాలనీ తీసుకువెళ్లావు.
నువ్వు దాని వద్దకు, నీ వద్దకూ ఒక అరణ్యాన్నీ
నీడనీ కాంతినీ తీసుకువెళ్ళావు:
శీతాకాలపు రాత్రుళ్ళలో, అది ఒంటరిగా
అనుభూతి చెందినప్పుడు, నువ్వు ఒంటరిగా అనుభూతి
చెందినప్పుడూ,నువ్వు దానివద్దకు
నీ వద్దకూ ఆమె చేతుల గోరువెచ్చదనాన్నీ
ఆమె కళ్ళలోని కరుణనీ, ఆమె వక్షోజాల తల్లితనాన్నీ
తీసుకువెళ్లావు. ఎందుకంటే, నువ్వు
మరి కొంతకాలం జీవించి ఉండి,సంధ్యా
కాంతిలో కానీ చంద్రకాంతిలో కానీ పుష్పించే ఆ ఒకే
ఒక్క రహస్యపుష్పానికై నువ్వు
ఎదురుచూస్తూ ఉండగలవని.

నువ్వు దాని వద్దకు నీ పిల్లలను తీసుకువెళ్లావు. వాళ్ళు
దానితో ఆడుకునేందుకు
ఏమీ ఆశించకుండా ఎదురుచూడటాన్ని నేర్చుకునేందుకు
జీవించడంలోని వేదనని తెలుసుకునేందుకూ
నువ్వు దాని వద్దకు నీ పిల్లలను తీసుకువెళ్లావు. నెమ్మది
నెమ్మదిగా, నువ్వు
దాని సాన్నిహిత్యంలోకి నీ తల్లితండ్రులను తీసుకువెళ్ళావు.
ఎందుకంటే వాళ్ళు దానిని మరొకసారి
తమ అలసిన వృద్ధాప్యపు అరచేతులలో పొదివిపుచ్చుకుని
ప్రేమ ఉందనీ, తాము ఒకప్పుడు
సముద్రాలపై తాత్కాలికంగా ఎదురుపడి మరణించేంత గాడతతో
ప్రేమించీ రమించే ప్రయాణికుల్లా ఉండేవారమనీ
జ్ఞాపకం చేసుకునేందుకు, నెమ్మది నెమ్మదిగా నువ్వు దాని
సాన్నిహిత్యంలోకి నీ తల్లితండ్రులను తీసుకువెళ్ళావు.
మరణం ప్రేమంత శక్తివంతమైనదని తెలిపేందుకు నువ్వు
దాని వద్దకు సమస్థ మానవాళిని తీసుకువెళ్లావు

మొహసింతో, నీ రక్తంతో వాళ్ళ రక్తంతో, యుగాల ఆమె
ఎదురుచూపులతో ఆమె త్యాగంతో
నువ్వు దానిని పోషించావు. ప్రతి దినం ప్రతి క్షణం నువ్వొక ప్రార్ధనతో
దానిని పోషించావు. నీ వేదనతో
గాలిలో సంతకం చేసి నువ్వు దానికై నువ్వు నీకై ఎదురుచూసావు.

మొహసింతో, మన కోసం ప్రేమగా ఎదురుచూసే ఆ సమూహమే
మనకోసం తపించే ఆ సమూహమే
మనల్ని నిర్దాక్షిణ్యంగా వేటాడుతుంది

నీ జీవితాన్ని త్రుణపాయంగా ధారపోసిన ఆ ఒక్క పూవు, ఆ ఒకే ఒక్క
నీ రహస్య అస్తిత్వపు పూవు
మొహసింతో, ఆ ఒకే ఒక్క పూవు ఎక్కడకు వెళ్ళింది?

నెమ్మది నెమ్మదిగా

నెమ్మది నెమ్మదిగా
ఇంత దూరం వచ్చాం మనం
నెమ్మది నెమ్మదిగా
ఇంత దూరం జరిగిపోయం మనం
నెమ్మది నెమ్మదిగా
ఈ ఎడబాటు కళను
నేర్చుకున్నాం మనం

ఎవరికీ తెలీదు
ఎవరికీ ఇంతకాలం తెలీదు
ఎవరికీ ఇంతవరకూ తెలీదు
ఎలా బ్రతికి ఉన్నామో మనం
ఎలా జీవించామో మనం

విరిగిన సమయాలలోంచీ
ఇపటికీ స్మృతితో పచ్చిగా ఉన్న
గాయాలలోంచీ,
మనం తరువాత మన పిల్లలకి
చెప్పుకునే
అవమానానలోంచి

ఎవరికీ తెలీదు
ఎవరికీ ఇంతకాలం తెలీదు
ఎవరికీ ఇంతవరకూ తెలీదు
ఎలా మనం
ఒక గూటిని నిర్మించుకునేందుకు
సంవత్సరాల తరబడి
రక్తంతో మట్టిని తరలించామో
ఎలా మనం
ఒక వంతెనని నిర్మించుకునేందుకు
శరీరాల్ని శిలువ వేసుకున్నామో
ఎలా మనం
ఒకర్నొకరు చూసుకునేందుకూ
ఒకర్నొకరు పొదివిపుచ్చుకునేందుకూ
తరచూ
మనల్ని కలిపి ఉంచే ఒక పదాన్ని
సృష్టించకునేందుకు తపించిపోయామో

ఎవరికీ ఇంతకాలం తెలీదు
ఎవరికీ ఇంతవరకూ తెలీదు

నువ్వు అక్కడే ఉన్నావు
ఆమే అక్కడే ఉంది, అరచేతిని అరచేతితో
పెనవేసుకుని
మనవైపూ, మనల్ని నింపివేసే
రాత్రుళ్ళవైపూ, చీకటి వైపూ
సూర్యరశ్మివైపూ, మంచువైపూ వర్షంవైపూ
చూసే పిల్లలూ అక్కడే ఉన్నారు

ఎవరికీ తెలీదు
ఎవరికీ ఇంతకాలం తెలీదు
ఎవరికీ ఇంతవరకూ తెలీదు
ఎలా మనం
దినం తరువాత దినం
రాత్రి తరువాత రాత్రి
క్షణం తరువాత క్షణం
చనిపోతూ జీవించామో.

ఇక ఇప్పుడు, ఒక ఇప్పుడు మాత్రమే
మళ్ళా మనం తిరిగి మొదలు పెట్టి
అందరికీ చెప్పవచ్చు

ఎలా మనం
నెమ్మది నెమ్మదిగా
ఇంత దగ్గరకు వచ్చామో
ఎలా మనం
నెమ్మది నెమ్మదిగా
ఇంత దగ్గరిగా జరిగామో
ఎలా మనం
నెమ్మది నెమ్మదిగా
ఈ ఒకటిగా ఉండే కళను
నేర్చుకున్నమో.

ఇక మనం
ఇక, ఇప్పటికి
నిశబ్దాన్ని తనని తాను మాట్లాడనిద్దాం.

ఎందుకంటే

వేకువజాము నాలుగు గంటలకు పెద్దగా చెప్పటానికేమీ ఉండదు, కాకపోతే
ఒక గీతం ప్రాణం పోసుకుని నెమ్మదిగా
కలలో కాంచిన ఒక పసుపుపచ్చ పిట్టై కాసేపలా ఎగిరి ఆపై నెమ్మదిగా ఒక
ఒంటరి తెమ్మరెలా మారి
ఒంటిరిగా కూర్చున్న ఒక ఒంటరి ఒంటరి మనిషిని జాలిగా తాకుతుంది. ఇక

బయట ఆకుపచ్చని చెట్లపై నారింజ రంగు కాంతి జల్లై కురుస్తుంది, ఎందుకంటే

ఒక గంట తరువాత ఈ దారి వెంట తన మనవరాలు లేకుండా ఒంటరిగా నడిచే
మనిషి, కొమ్మల మధ్య దాగున్న మార్మిక పక్షుల కలలనూ
ఒంటరి సాలీళ్ళ గూళ్ళ నాదాలనూ వినవచ్చు, ఎందుకంటే అతడు గూళ్ళలోంచి
రాలిపడిన పసుపుపచ్చ పిచ్చుక పిల్లలను
అరచేతులలోకి తీసుకొని ముద్దాడి, అవి ఆకాశపు పూవు చుట్టూ తిరుగాడే
సీతాకోకచిలుకలలుగా మారడాన్ని విబ్ర్రమం నిండిన నయనాలతో చూడవచ్చు.

ఎందుకంటే అతడు సంవత్సరాలుగా తను తన పిల్లలకై, ప్రియురాళ్ళకై చిందించిన
రక్తపు బొట్లను లెక్కపెట్టుకుంటూ మనస్సులో మరోసారి
ఇలా మననం చేసుకోవచ్చు: నిజానికి వేకువజాము నాలుగు గంటలకు
చనిపోడానికి సిద్ధంగా ఉన్న మనిషికి చెప్పటానికి పెద్దగా ఏమీ ఉండదు

అస్థిత్వపు అంచున

అస్థిత్వపు అంచున
కొన ఊపిరితో, ఆఖరి చూపులతో
ఎల్లప్పుడూ
నిన్ను అంటిపెట్టుకునే ఒక స్త్రీ ఉంటుంది
అస్థిత్వపు అంచున
మరణానికి ముందు, జననానికి ముందు
ఎల్లప్పుడూ తుడిచివేయబడే
నిన్ను అంటిపెట్టుకునే
అతడి ప్రస్థుత వర్తమానం ఉంటుంది
అస్థిత్వపు అంచున
భూమి మొదటి స్పర్శలో
మెరుస్తోన్న మొదటి మంచు బిందువులు
కనిపించని చిగురాకులను
చీల్చక మునుపునుంచీ
ఎల్లప్పుడూ
నిన్ను అంటిపెట్టుకునే ఒక తపనా,
దిగులూ మొదలయ్యాయి

అస్తిత్వపు అంచున
మరో పరిమళ సమయపు శకలంలోకి
వీడుకోలు చెబుతూ వెడలిపోతున్న
పురుషుడి విషాద సముద్రపు తీరాలను
తాకాలని తపించే
మరొక పురుషుడి నయనమూ ఉంటుంది

అస్థిత్వపు అంచునే
ఒక పిల్లవాడి కళ్ళ నుంచి
రక్తం అనాదిగా స్రవిస్తోంది
అస్థిత్వపు అంచునే
ఉగ్గపట్టుకున్న పెదాల మధ్యనుంచి
ఒక ఆక్రందన
అనంత విశ్వంలోకి ఎగిసిపోతుంది
అస్థిత్వపు అంచునే
ఒక ప్రార్ధన ఒక ఉనికి ముందు
మోకాళ్ళపై ఒరిగిపోయి
ఇక ఎప్పటికీ ప్రేమింపబడలేని
ఇక ఎప్పటికీ తాకలేని
అతడి జీవితపు, ఆమె జీవితపు
జ్ఞాపకపు సమాధి ముందు
ఒక దీపమై వెలుగుతుంది
అస్థిత్వపు అంచునే
రేపటి కనిపించని
వినిపించని వెక్కిళ్ళు
రేపటి ఉన్మాదపు
నిదురరహిత రాత్రుళ్ళూ
రేపటి ఇప్పటిదాకా వినని
కోరికల ఖగోళాలూ, ఒక ఉనికిని
అసంక్యాఖంగా తుంపులు చేసే
ఖడ్గాలూ, నువ్వూ నేనూ అన్నీ
ఒక అస్థిత్వపు అంచునే.

31 August 2010

మరొక అసహనం

నీ అసహనానికి కారణం లేదు
నువ్వు కావాలనుకున్నప్పుడు మేఘాలు వర్షించవు
నువ్వు కావాలనుకున్నప్పుడు
జాబిలి తన బంగారు చిరునవ్వుతో, సముద్రాలనీ
అరణ్యాలనీ ముంచివేసేందుకు బయటకు రాదు

నీ నిశ్శబ్దానికి ఒక కారణం ఉన్నట్టయితే
నీ పిలుపుకై ఇంటి చుట్టూతా తిరుగాడే పిల్లులు అలా
ఒక మూలకు ముడుచుకుని పడుకుని ఉండవు
నీ కారణానికి కనుక కారణాలు ఉన్నట్టయితే
చిన్ని వర్షంలాంటి చిన్ని చిరునవ్వునుతో తిరుగాడే
ఆ స్త్రీ అలా మరణించకపోయి ఉండును
నీ నిర్లక్ష్యానికి కనుక కారణం ఉన్నట్టయితే
ఇంటి వెనుక లిల్లీ పూలతో
కప్పలతో చలించే తోట అలా మరొక రుతువులోకి
మరొక అవిటి వేసవిలోకి వెళ్ళిపోకపోయి ఉండును

ఎందుకంటే
నీ జుత్తుతో దంతాలతో నిండిన చీకటి గదిలోకి
నీ నఖాలూ వక్షోజాలూ నిండిన చీకటి సాయంత్రంలోకి
నీ శ్వాసా పరిమళం నిండిన చీకటి చందమామలోకి
రాలిపడుతూ నేను

నా నాలిక శిలువ వేయబడి రక్తంతో స్రవిస్తుండగా, నేను
నా ఎముకలను లెక్కపెట్టుకుంటూ ఉండి ఉండను
కన్ను పై కన్నుతో
దూరం పై దూరంతో
నేను నీ ఆత్మహత్యకీ
నా హత్యకీ సిద్ధం అవుతూ ఉండి ఉండను.

అసహనం

నలుపు గులాబీగా మారే ఒక నక్షత్రం ఉన్నటయితే
నలుపు ఆశ్వoగా మారే ఒక జాబిలి ఉన్నటయితే
నలుపు దేవతగా మారే ఒక మేఘం ఉన్నటయితే
నలుపు కన్నీటి చుక్కగా మారే ఒక వేదన ఉన్నటయితే
ఇక దినం నెమ్మదిగా
పాలిపోయిన రాత్రిలోకి ఇంకిపోతున్నప్పుడు, నేను లేచి
ఇంటిలోంచి బయటికి నడుస్తాను

ఒక సిగేరేట్ తాగేందుకు, ఒక వృద్ధుడి పాదాల బరువుకు
వలయాలుగా లేచి
వలయాలుగానే స్థిరపడుతున్న ధూళిని చూసేందుకు
నలుదిశలా ప్రతిధ్వనించి
నలుదిశలా వ్యాపిస్తున్న పిల్లల నవ్వులను వినేందుకు
దాచుకున్న వర్షపు ముద్దులను
వొదిలివేసిన ఆకాశం కింద
మళ్ళా ఒకసారి తడిచి ముద్దుఅయ్యేందుకు
నీతి కథల కళ్ళవంటి స్త్రీ ఎదురుచూపుల కత్తులకింద
మళ్ళా మరొకసారి తలను వాల్చేందుకు
ఒక సముద్రపు సీతాకోకచిలుకను అయ్యేందుకు

మళ్ళా మరొకసారి నా చేతుల మధ్య నేనే నిదురించేందుకు
మళ్ళా మరొకసారి నా చేతుల మధ్య నేనే మరణించేందుకు.

ప్రతి రోజూ మనం

ప్రతిరోజూ మనం ఎవరినో ఒకరిని మనవెంట తీసుకువెళ్ళాలి
కొన్నిసార్లు అది అలసిన ఒక స్త్రీ కావొచ్చు, మరి
కొన్నిసార్లు అది అలసటలేని వర్షం కావొచ్చు

కొన్నిసార్లు మనం ఒక పిల్లవాడి చేయి పుచ్చుకుని అతడిని
రహదారిని దాటించాలి, మరి
కొన్నిసార్లు మనం రాత్రి అతడి పక్కగా పడుకుని కథలు చెప్పాలి,ఇంకా
కొన్నిసార్లు జ్వలించే అరణ్యంలా మారిన అతడి నుదిటిపై
ఒక తడిరుమాలు తుంపరను కప్పుతూ, జ్వరానికి ఒక చెంచాడు
మందు తాగమని బుజ్జగించాలి

కొన్నిసార్లు మనం వృద్దులగా మారుతున్న వాళ్ళను దగ్గరికి తీసుకుని
వాళ్ళు ఇంతకు మునుపు చూసినవన్నీ
మళ్ళా మరొకసారి ఒక కొత్త చంద్రకాంతిలో చూపించాలి. మరి
కొన్నిసార్లు మనం మనల్ని పొదివి పుచ్చుకుని, ఆకాశంనుంచి
భూమికి ఒక ఊయలను కట్టి నిర్భయంగా ఊగుతూ, తూగుతూ
వెలుగూ నీడల సమ్మేళనంలో రంగులు మారుతున్న, పదాలు లేని
పూల భాషనీ, పదాలు ఉన్న నత్తి భాషనీ మరొకసారి వినాలి.

ప్రతిరోజూ మనం కుంటుతున్న సమయాన్నీ, స్పృహ తప్పేంత ఉద్విగ్నతతో
మనల్ని ముంచివేసే మనవి కాని తపనలనీ
శిశువుని భుజాన ఉన్న ఒక జోలెలో మోసుకువెళ్ళే స్త్రీవలే తీసుకువెళ్ళాలి
ప్రతిరోజూ మనం. ప్రతి రోజూ మనం.

ఊరికినే అలా

తరచూ ఏం జరుగుతుందంటే

నువ్వు మనుషుల్ని రాళ్లగా మార్చే విద్యలో
రాటుదేలావు

తరచూ ఏం జరుగుతుందంటే
తరచూ నువ్వు గ్రహించనిదేమిటంటే
ఆ రాళ్ళు నిన్ను ప్రేమించిన మనుషులు, వాళ్ళు
నువ్వు ఒకప్పుడు శ్వాసించిన పూవులు
రాత్రిలో నీ చుట్టూ
వెచ్చగా తిరుగాడిన మిణుగురులు. అన్నిటికంటే
తరచూ ఏం జరుగుతుందంటే
ఆ రాళ్ళకు హృదయాలున్నాయి
అచ్చు నీ హస్తాలలాంటి చేతులతోనే
నిన్ను కౌగాలించుకుంటాయి
అచ్చు నీ పెదాలలాంటి కనులతోనే
నిన్ను ముద్దాడతాయి
నీ పాదాలలాంటి నడకతోనే
నీ భారాన్ని తమపై తీసుకుని
నిన్ను నువ్వు వెళ్ళాల్సిన దూరాలకి చేరుస్తాయి
అదేమిటంటే
తరచూ ఏం జరుగుతుందంటే
నువ్వు మనుషులను రాళ్లగా మార్చి, రాళ్ళను
తిరిగి దూళిగా మార్చే కళలో
సమగ్రమైన నైపుణ్యాన్ని సాధించావు

ఊరికినే అలా.

30 August 2010

తను

మరణించడం అంటే, జన్మించడం అంటే 

వర్షం ఒక పాపై
నవ్వుల సవ్వడితో తన వెంటబడుతుండగా, హడావిడిగా 
చెట్ల కిందుగా నడిచే వెళ్ళే 
ఆమెను గమనించడం. 

ఇక్కడ ఉంటూ మరెక్కడో జీవించడం అంటే

వర్షంలాంటి 
తన పాపను చూసుకునేందుకు జాబిలేని ఆకాశం కింద 
హడావిడిగా ఇంటికి వెళ్ళే 
ఆమెను గమనించడం

ఏమీ లేకుండా పూర్తి నిండుగా ఉండటం అంటే

చీకటి దుస్తులు 
ధరించిన దారిపై ఆమె హడావిడిగా ఇంటికి వెళ్లి, పాపకూ 
పాపగా మారిన వర్షానికీ,  వర్షంగా 
మారిన పాపకూ 

ఇంటి ఆవరణలో 
పాప మాటలతో, వర్షపు గాలులతో తడిచి తిరుగుతున్న 
పిల్లులకూ, పైనుంచి కొమ్మల మధ్యగా 
తొంగి చూస్తున్న 

చుక్కలకూ 
పాలు కాగబెట్టే ఆమెను ఊరక అలా చూస్తూ ఉండటం, 
పొయ్యి వద్ద వేడెక్కిన 
ఆమె అరచేతుల మధ్య ఊరిక అలా
పిల్లిలా ముడుచుకుని ఉండటం!

ఈ వేళ

దయచేసి ఇక్కడి రా, దాచుకునేందుకు ఏమీ లేదిక్కడ

ఆఖరకు నేను ఈ వేళ
నా రహస్య అస్తిత్వపు దిగులు దీపాలనూ బహిర్గతం చేసాను
ఆఖరకు నేను ఈ వేళ
ఒక పసిపాపను నా కనుల ఇసుక మైదానాలపై ఆడనిచ్చాను
ఇంకా ఏమిటంటే ఈ వేళ, ఈ రాత్రి
నా తల్లి మరోమారు తన పెదాలపై తార్లాటలాడుతున్న తెల్లటి
పిచ్చుకల్తో కలగలసి నవ్వుతుంది
ఆమె నుదిటిపై ఒక పచ్చటి అరణ్యం వికసించటం మొదలయ్యింది

దయచేసి ఇక్కడి రా, దాచుకునేందుకు ఏమీ లేదిక్కడ

కొంత వర్షం ఎప్పటికైనా ఎప్పుడైనా ఆహ్వానితమే, ఇక నేను ఈ వేళ
పూర్తిగా తడచిపోయేoదుకైనా సిద్ధమే
రానివ్వు, కొంత నొప్పినైనా మరికొంత వేదనైనా, భరించలేనంత దు:ఖానైనా
ఇక నేను ఈ వేళ నగ్నంగా
పూర్తిగా పిగిలిపోయెందుకైనా సిద్ధంగా ఉన్నాను. నేను ఈ వేళ
కనులను కోల్పోయి ఉన్నాను
నీ రక్తానికై, నీ వక్షోజాలకై, కూరగాయలతో పచ్చిచేపలతో పరిమళించే,
కడగని నీ జుత్తుకై నేను దాహార్తినై ఉన్నాను

దయచేసి ఇక్కడి రా, పొదుపు చేసుకునేందుకు ఏమీ లేదిక్కడ, అందుకని

ఇక ఈ వేళ, ఇక్కడ కొంత హింస ఉండనీ, కొంత మత్తు ఉండనీ
కొంత క్రమశిక్షణారాహిత్యం
కొంత అక్రమం కొంత నువ్వు కలగలసిన ద్వేషపు దయా ఉండనీ. నీ స్వరం
కనిపించని ప్రేమ ఆస్థిపంజరాలను పిలుస్తుండగా
ఇక ఈ వేళ, ఇక్కడ కొంత ఉన్మాదం ఉండనీ, కొంత దిగులు ఉండనీ
కొంత మొద్దుబారుతున్న నిదురలేనితనం
నా పాదాల కింద మట్టిని అనుక్షణం అనుభూతి చెందే కొంత మృత్యువూ ఉండనీ
కొంత వర్షంతో, మొండి చేతులతో
తలస్నానం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయి పదాలతో, ఉచ్చరించలేని
దైవ భాషతో, ఈ వేళ ఇక్కడ నన్ను ఉండనీ.

మంచిదే

తెల్లటి నాలికతో ఊసరవెల్లి కోరికలతో
వికసించే
స్రవించే ఈ నల్లగులాబీ మంచిదే

గాలి పిల్లి నీ గదిలోకేమైనా
అడుగు పెట్టిందా?
ఒక భయం ఏదైనా నెమ్మదిగా
నీ రక్తంలో ఇంకిపోయిందా?
ఒక స్నేహితుడు ఎవరైనా
వీధులు ప్రకంపించే నవ్వుతో
రాత్రిలోకి కదలిపోయాడా?

తెల్లటి నఖాలతో, ఉన్మాధపు తపనతో
వికసించే ఈ
సంతాపపు నల్లగులాబీ మంచిదే

స్వయంకృతాపరాధం

నిన్ను వొంటరిగా వోదిలివేసే విషయాలుంటాయి

చీకటితో అల్లుకున్న రహదారుల వెంట తిరుగాడుతూ
ఏకాంతపు చందమామనూ, అక్కడక్కడా ఆకాశంలో దిగబడి
అలా ఉన్న నక్షత్రాలనూ నువ్వు పరికిస్తున్నప్పుడు

నిన్ను మాత్రమే అర్థరాత్రిలో గాయపరిచే విషయాలుంటాయి

నీ అస్తిత్వపు పూవు నుంచి మొలకెత్తే రక్తాన్ని గమనించే ఆనందం కోసం
నిన్ను లోతుగా పొడిచే స్నేహితులను
నువ్వు మూగ కళ్ళతో చూస్తున్నప్పుడు, నీ కన్నీళ్ళని తాకే,
నిన్ను ప్రేమించీ, నిన్ను వొదిలి
మరో రుతువులోకి, మరొక కారణంతో వెడలిపోయిన ఆ స్త్రీ ఒంటరి
చేయి నీ పరిసరాల్లో రహస్యంగా కదలాడుతూ ఉంటుంది

వర్షమూ ఉంటుంది, కొంత గాలీ ఉంటుంది
నిన్ను అబ్బురపరిచే కొంత నొప్పీ ఉంటుంది. నీ మంచిని కోరే వాళ్ళ
పెదాలపై వికసించే నల్లటి నవ్వులలో
కొంత నువ్వు చేసుకున్న స్వయంకృతాపరాధం కూడా ఉంటుంది

నిన్ను ఒంటరిగా వోదిలివేసే క్షణాలలో
నిన్ను ఒంటరిగా గొంతు నులిమివేసే క్షణాలలో...

22 August 2010

సముద్రాలనుంచి వచ్చాం మనం

సముద్రాల నుంచి వచ్చాం మనం. మనం ఉన్నంతసేపూ అది మన వైపు
చేతులు చాచిన పాపలా పరిగెత్తుకు వచ్చింది.

నువ్వు అలసిపోయావు. పగలంతా పావురాల్లా రెక్కలు విప్పార్చుకుని తిరుగాడిన
నీ కళ్ళు, ఇప్పుడిక నెమ్మదిగా గూటిలో ముడుచుకుంటాయి.
ఇక ఈ ఒక్క రాత్రికే నిన్ను నేను

గూడు అంటే ఏమిటి? ఇల్లు అంటే ఏమిటి? గూడు ఎక్కడా, ఇల్లు ఎక్కడా
అని అడగను. నీకు తెలుసు

సముద్రాల నుంచి వచ్చాం మనం. మనం ఉన్నంతసేపూ అది మన వైపు
మనమొకసారి చూచాయగా చూసి,
మన దేహాలలో దాచుకోలేని ఒక స్త్రీ కోరిక వలె మనవైపు దూసుకు వచ్చింది.

నువ్వు అలసిపొయావు. నీ కళ్ళు బరువెక్కుతాయి. అవి, నువ్వు కోల్పోవటం ద్వారా
నిలుపుకున్న వాటన్నిటినీ ఒక చిహ్నంలో దాచుకుంటాయి.

అందరికీ సర్వమూ, సర్వత్రా ఒక పంజరమే ముఖ్యమౌతున్నప్పుడు ఎవరు
పొదివి పుచ్చుకోగలరు ఒక స్త్రీని,
ఎవరు పొదివి పుచ్చుకోగలరు ఒక స్వప్నాన్ని?
పంజరంలోని ఒక సముద్రాన్ని, ఒక తల్లి వక్షోజాలనీ ఆ పాలబిందువులనీ
శిరస్సు ఖండింపబడ్డ పూల సమయాలనీ?

సముద్రాలనుంచి వచ్చాం మనం. ఒడ్డుల నుంచీ, వొడుల నుంచీ వచ్చాం
మనం. వచ్చాం మనం. వచ్చామా మనం? ఇక

నీ పాదాల అంచున అలుముకున్న ఇసుక రేణువులు నెమ్మదిగా ప్రాణం పోసుకుని
నీ వలె నీ అంతగా అలసిన నీ స్త్రీ కనురెప్పలపై వాలతాయి.
నువ్వు అలసిపొయావు. ఇక నువ్వు నిదురిస్తావు.

నువ్వు నీ నిదురలో ప్రవహిస్తావా? నువ్వు నీ నిదురలో ఒక పక్షిలా విహరిస్తావా?
ఇప్పుడు చూడలేని జాబిలిచే దీవింపబడి,
ఇప్పుడు చూడగల నక్షత్రాలచే శాసించబడి, నువ్వు నువ్వు నీ కలలో మాత్రమే
తిరిగివచ్చే ఆ చేతినీ ఆ స్పర్సనీ నీ కన్నీళ్ళ చేతుల వెచ్చదనంతో
ఆలింగనం చేసుకుంటావా?

నువ్వు అలసిపొయావు. బహుశా నేను అలసిపోయాను. నేను నిన్ను గమనిస్తుండగా
నువ్వు నిదురిస్తావు. కల్మషంలేని ఒక తెల్లటి కాంతి
విరిగిపోయిన జోలపాటలను వినేందుకు నీ ముఖంపై నెమ్మదిగా పరచుకుంటుంది.
నీకు తెలుసు

మనం సముద్రాల నుంచి వచ్చాం. మనం ఉన్నంతసేపూ అది మన వైపు
గర్భంలో తల్లి నామాన్ని ఉచ్చరిస్తునా మన స్వరంలా తేలివచ్చింది.
సముద్రాలనుంచి వచ్చాం మనం. సముద్రాల తీరాల నుంచి వచ్చాం మనం.
వచ్చాం. మనం.

తోటమాలి

మీరు ఇంత కాలం తిరుగాడిన ఈ ఉద్యానవనాన్ని మీరు వోదిలివేసి వెళ్ళినప్పుడు
ఒక తోటమాలి మీరు అతడి అస్తిత్వంలో వొదిలివేసిన ఊపిరి పరిమళాల మధ్య,
తన అస్తిత్వపు రహస్య ఉద్యానవనంలో సంచరించేందుకు వస్తాడు.



లేకుండా ఉండి, తెమ్మెరలా, ప్రేమమయపు గుసగుసలా ఇంకా కదులాడేది ఎవరు?
అతడి పేరుని ఇప్పటికీ సంధ్యాసమయంలో పిలిచి
అతడిని రాత్రిపూట మృదువుగా తాకేది ఎవరు? అతడి నిదురగానూ స్వప్నంగానూ,
అతడు శ్వాసించే గాలిగానూ, అతడు మననం చేసుకునే
ప్రార్థనగానూ, అతడిని తీసుకు వెళ్ళిన నదిగానూ, నది ఒడ్డుగానూ మారినది ఎవరు?



మీరు ఇంతకాలం, అంచుల దాకా నింపిన ఈ అంతర్గత ఉద్యానవనాన్ని వొదిలి వెళ్ళినప్పుడు
ఒక తోటమాలి నేలపై రాలిన వడలిపోయిన పూలను ఏరుకునేందుకు వస్తాడు.
తల్లి లేని పూవులూ గూళ్ళులేని రెమ్మలూ. ఒక తోటమాలి తన శిరస్సుకుపైగా గుమికూడిన
నల్లటి మేఘాలతో సంభాషిస్తూ రోదిస్తాడు. వెడలిపోయే గాలులని
తిరిగి రమ్మని బ్రతిమిలాడుకుంటాడు. మోకాళ్ళపై వేదనతో ఒరిగిపోయి ఎక్కిళ్ళు నిండిన
స్వరంతో ఒక జవాబుకి విలవిలలాడతాడు:
ఇది తీసుకో: నువ్వే అయిన దీనిని: నువ్వు. నువ్వే అయిన నేనుని.



మొహసింతో, వాళ్ళు వెడలిపోయినప్పుడు, వాళ్ళు నిన్ను వొదిలివేసి వెళ్లిపోయినప్పుడూ,
నిన్ను నువ్వు ఒక అద్దంలో చూసుకునేందుకు తిరిగి వస్తావు. మట్టిలో
ఆమె వొదిలివెళ్ళిన పాదముద్రలని వెంబడిస్తూ,జ్వలిస్తున్న మొగ్గల స్వరాలని వింటూ
నువ్వు పూవులు రాళ్ళనీ, ముళ్ళు పూవులనీ తెలుసుకునేందుకు వస్తావు.
పిల్లలు, గాలిలో వర్షంలో వికసించే పూలగీతాలనీ గ్రహించేందుకు వస్తావు .



మొహసింతో నువ్వు గాలివా? లేక ఒక జ్ఞాపకాన్ని మాత్రం వొదిలివెళ్ళిన ఒక వర్షానివా?
మొహసింతో నువ్వు వెడలిపోయినప్పుడు,
నువ్వు వృక్షాలూ గాలుల జ్ఞాపకాల గురించి మాట్లాడుతూ మిగిలిపోయే ఒంటరివా?
లేక, అస్తిత్వపు తపనని వొదిలివెళ్ళే జ్ఞాపకపు చిహ్నానివా?
మొహసింతో, మనం జీవించి ఉన్నామా మరణించి ఉన్నామా? మన జీవితాంగానూ,
మన అస్తిత్వాలగానూ మారి మనల్ని అంతంలేని
కలల వీధులలోంచి మనల్ని పిలిచేది ఎవరు?



ఒక తోటమాలి వచ్చినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు, ప్రతి ఒక్కారూ ఒక ఊరేగింపులో
వచ్చి వెళ్లిపోతున్నప్పుడూ,మొహసింతో, మనల్ని బ్రతికించేది ఎవరు?
మనల్ని బ్రతికిస్తూ చనిపోతున్నది ఎవరు? పూలదారుల గురించీ, పూలను నలిపివేసే
దారులగురించీ చెప్పగలిగేది ఎవరు? జీవించేది ఎవరు, మరణించేది ఎవరు?
వెడలిపోయేది ఎవరు, త్యాగం చేస్తూ మిగిలిపోయేది ఎవరు?



మీరందరూ ఈ లోపలి ఉద్యానవనాన్ని ఒదిలి వెళ్ళినప్పుడు, ఒక తోటమాలి
మీరు ఇంతకాలం తెంపుకున్న పూల గురించి విలపించెందుకు వస్తాడు. ప్రతి పూలరేకూ
నీ లేనితనపు ఒక పద చిహ్నం. ప్రతి పదం
ఎప్పటికీ ఉండే నువ్వు లేనితనపు వెంటాడే సంజ్ఞా. ప్రభూ,ఒక తల్లి ఖాళీ గర్భంవంటి
అరచేతులతో, ఒక తండ్రి నిండైన నిశ్శబ్దంలాంటి బాధతో, వేదనతో, ఇతరుని దు:ఖంతో,
ఒక తోటమాలి ఇక ఎప్పటికీ, ఒక తల్లి యొక్క తండ్రి లేనితనాన్నీ
ఒక తండ్రి యొక్క తల్లితనాన్నీ, తల్లిలేనితనాన్నీ వెదుకుతాడు.


Amen.

ఏది?

నువ్వు వెలిగించిన ప్రమిదె వెలుతురేనా ఇది?

నిర్మలంగా వ్యాపిస్తూ
మహా శాంతితో రాత్రిపూట సర్వత్రా కమ్ముకుంటూ
మరచివచ్చిన మరోలోకపు
మరో బ్రతుకు గీతాన్ని, మృత్యు సుగంధంతో

ఇక్కడికి లాక్కువస్తున్న ప్రేమ కాంతేనా ఇది?

ఎవరివి, ఎవరివి తండ్రీ ఆ అద్రుశ్య హస్తాలు?
ఎవరివి, ఎవరివి తండ్రీ ఆ రహస్య ముకుళిత నేత్రాలు?
ఎవరివి, ఎవరివి తండ్రీ నిన్ను
పాలిండ్ల నీడల్లో పొదివి పుచ్చుకున్న అక్షరాలూ?

ఎవరివి, ఎవరివి తల్లీ ఎవరివి, నిన్ను బాహువుల్లో
కలుపుకుని సముద్రాలై పొంగిన అశ్రువులు?
ఎవరివి మిత్రుడా ఎవరివి, నీవే అయ్యి
శిలువ వేయబడి మరణించి, పునర్జన్మించి
నిన్ను వేటాడే ప్రార్థనా గీతాలు?

నువ్వు వెలిగించీ, సర్వశక్తులూ ఒడ్డి, అర్థాంతరంగా
ఆర్పివేద్దామనుకున్న కాంతి ఏ అస్తిత్వానిది?
నువ్వు వెలిగించి వెడలిపోయిన, ముడుచుకుపోయి
రాలిపోతున్న దీపపుష్పపు కాంతి
ఏ అవ్యక్త మట్టి దు:ఖపు స్వరానిది?

నీ ముఖం ఆమె అరచేతుల మధ్య పసిపాప ముఖమై
వికసించినప్పుడూ
నీ పాదాల, శబ్దాల సంగర్షణ అంతా
ఆమె కళ్ళల్లో నీటి తామరల లతల్లా అల్లుకుపోయి
అందరి శరీరాల్ని పెనవేసుకున్నప్పుడూ
ఒక నక్షత్రం, ఒకే ఒక్క నక్షత్రం, ఎవరూ లేక
తడి ఆరిన భూమిపై
శిధిలాలలోంచి పొడుచుకు వచ్చిన నీ నాలికపై
మంచు బిందువై రాలినప్పుడూ
భాష ఏది? సత్యమేది? స్థాన్యమేది? నువ్వు జన్మించిన
పురాకాంతి మృత్యుస్కలన రక్త మందిరమేది?

21 August 2010

మళ్ళా

మళ్ళా కాంతి, ఈ రాత్రి, మళ్ళా శాంతి

గాలిలో నీటి తుంపరలై తేలిపోతున్న కొంగల అరుపుల అలసటలోంచి
నిన్నిక ఎప్పటికీ చూడలేని దిగులు తడబాటు కలిగించిన
దారి తప్పిన పక్షిపిల్ల భేదురు భయపు కనుల వెక్కిళ్ళలోంచీ

మళ్ళా కాంతి, ఈ రాత్రి, మళ్ళా శాంతి?

ఇప్పుడీ రాత్రి

ఇప్పుడీ రాత్రి గడిస్తే చాలని నీకు నువ్వు చెప్పుకుంటావు. అయితే
చుక్కలు కూడా లేని చీకట్లో
కత్తులై ఊగుతున్న గడ్డి పరకాలపై కుత్తుకలని కోసుకుంటున్న
మంచు బిందువులు చల్లటి రక్తంతో
నీ అరిపాదాల్ని తాకాక, అక్కడ అలాగే
తటాలున పొలాల చివర తాడి చెట్టు కింద కూలబడి
నువ్వు వెళ్ళలేనంత దగ్గరలో ఉన్న
పాక లోంచి ప్రాణమై మెరుస్తున్న లాంతరు కాంతివైపు చూస్తూ
ఇప్పుడీ క్షణం గడిస్తే చాలని నీకు నువ్వు చెప్పుకుంటావు-

నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశాలు

నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశాలు ఇక ఏమీ లేవు

ప్రేమా కరుణా హింసా దయా దు:ఖమూ
నువ్వు నిదురించలేని ఒక రాత్రిలోనే తేలిపోతాయి
నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశాలన్నీ
నీ నిదురలోకి రాలేని పూల జోల పాటలపై
మెరిసే సూర్యరస్మితోనే తగలబడి పోతాయి
ఇక నీకు ఏమన్నా ఉంటె
అది దుప్పటి కూడా లేని ధూళీ, నేలా
పూర్వ జన్మలో మమకారంతో తాకిన ఆ స్త్రీ వక్షోజం
అలల నురుగ ఘోష లాంటి నీ బిడ్డ
చివరి నవ్వూ, నువ్వూ నీలోపల
కోన ఊపిరితో తచ్చట్లాడుతున్న మంచు మరణమూనూ-

జాడ

నీ ఊపిరికి నీ వద్దకు వస్తాను నేను-

నీవు లేనితనంలో నీ ఉనికిని వింటాను నేను. ఎవరో వొదిలి వెళ్ళిన
గులాబి నీడ గులాబీని వింటున్నట్టు
నీవు లేనితనంలో నీ ఉనికి నిశ్శబ్దాన్ని వింటాను నేను

నీ ఊపిరికి నా వద్దకు వస్తాను నేను

పదాల నీడలలో, ఎవరూ తాకని, నీ శాశ్వతమైన తాత్కాలికపు
మరణపు పెదాలను రుచి చూస్తాను నేను
విరిగిన శిలావిగ్రహాలు ప్రాణం పోసుకుని, చీకటిపూట
ఈదురుగాలుల వంటి ఊపిరులతో
ఒంటరి నక్షత్రం వైపు తపనగా చేతులు చాచినట్టు, నీలోని
తడిని తదేకంగా చూస్తాను నేను

నీ ఊపిరికి ఈ ప్రపంచం నుంచి వెడలిపోతాను నేను

ఖాళీ గూళ్ళలో ఒదిగిఉన్న అంతిమమైన అసంపూర్ణ అర్థంలాంటి
నీ సారాంశాన్నీ, సత్యాన్నీ
నీవు లేని చోట మాత్రమే కనుక్కుంటాను నేను. గాలిపై గాలి
నీడపై నీడ
జాడపై జాడ
సర్వత్రా వ్యాపించి మరణంతో జన్మిస్తున్న భాష. చూడు

నీ ఊపిరికి నీ వద్దకు వస్తాను నేను.

ఇక్కడికి

ఎవరూ రాలేదు ఇంకా ఇక్కడికి, ఈ ఎండిన

మట్టి వీస్తున్న సాయంత్రాన
ఎవరూ తాకని నీ సమాధి వద్దకు వస్తావు నువ్వు-

రాలిన పూవులు పలుకరిస్తాయి నిన్ను. తలలులేని
శిలావిగ్రహాలు పిలుస్తాయి నిన్ను
అమావాస్య సంధ్యా సమయాన, రహస్యమైన చేతులు
తాకుతాయి నిన్ను

ఎవరూ రాలేని ఇక్కడికి, ఈ ఎండిపోయిన

ఊపిరి వీస్తున్న సాయంత్రాన
ఎవరూ తాకని నీ సమాధి వద్దకు వస్తావు నువ్వు-

నువ్వు తపించే ప్రదేశాలు

ఇతర క్షణాలలో నీకు కనిపించి, నీవు నివసించిన
ఇక లేను, రాని
నువ్వు తపించే ప్రదేశాలలోకి ఎలా వెళ్ళగలవు నీవు-

నీ ఉనికి
వికసిస్తున్న పూవులా ఉండిన గాలిలోకి
నక్షత్రంలా మెరుస్తున్న నీటి చినుకులోకి
నిశ్శబ్దంగా
నిన్ను ఒదార్చుతున్న స్త్రీ తెగిన చేతులలోకి
పాలిపోయిన నీడలలాంటి
నీ స్నేహితుల ఊపిరి తెగిన జాడలలోకీ

ఇతర క్షణాలలో నీ కనిపించి, నీవు నివసించిన
ఇక లేని, రాని
నువ్వు తపించే ప్రదేశాలలోకి ఎలా వెళ్ళగలవు నీవు

నీ దిగులు

దూరం చేయబడ్డ దిగులు ఇది-

దూరం చేయబడి, దారి తప్పి, తీరం లేక
ఎప్పటికీ గూడును చేరుకోలేక
గోడకు తల మోదుకుని మరణించిన
దూరం చేయబడ్డ పక్షి దిగులు ఇది

కాంతిలేని నీడ కమ్ముకున్న మధ్యాహ్నం
నీ హృదయంలో ఎవరో
నీరులేని నల్లని చెపి విలవిలలాడతారు
నీ అస్తిత్వాన్ని ఎవరో
కరుణ లేక కత్తితో రెండుగా చీలుస్తారు
ఎవరో నిన్ను
దూలిలా గాలిలోకి వెదజల్లి, నిన్నుగా
మిగులుస్తారు నిన్ను- ఇదంతా

దూరం చేయబడి, దారి తప్పి, తీరం లేక
ఎప్పటికీ గూడుని చేరుకోలేక
నీటిలో దేహాన్ని ముంచుకుని మరణించిన

దూరం కాబడిన నీ దిగులు ఇది-

అంతిమ ప్రయాణం

ఆకాశపు అంచుపై రాలిపోక మిగిలి ఉన్న
ఆఖరి నక్షత్రం పిలుస్తుంది నిన్ను-

గాలి తాకక, గూడు పిలవక
దారీ తెన్నూ లేక రాత్రిలో కనుమరుగైన పూవువి నీవు
అందరూ వోదిలివేసిన
తపించే కీచురాయి సంగీతానివి నీవు
విను
సన్నగిల్లుతున్న
సుదూరపు దీపపు ఊపిరి కాంతిని
అనంతంగా సాగి ఉన్న
నీ అంతిమ ప్రయాణపు, నీవే అయిన
అద్రుశ్యపు మట్టిదారిని
అది
రంగుల శబ్దం, పదాల నిశ్శబ్దం
నీవు వేయని నీ అస్తిత్వపు కంపించే మంచు చిత్రం

ఇంతకుమునుపే

ఈ పాటను ఇంతకుమునుపే విన్నావు నీవు-

భూమి పొరలలో ప్రవహించే నీటి రక్తపు చలనాన్ని
ఆకస్మికంగా నీ ఉనికితో విన్నట్టు
ఈ పాటను ఇంతకు మునుపే విన్నావు నీవు
విశ్వాలకు మునుపు, లోయలోకి జారుతున్న ఆకులా
నీ అస్తిత్వం నిర్భయంగా
వినీలాకాశంలో స్వేచ్చగా కదులాడే పక్షి రెక్కలపైన
ఊయలలూగుతున్నప్పుడు
నీ లోపలి పాతను విభ్రమంతో విన్నావు నీవు-
వర్షం కురిసే రోజులలో, నీడ కమ్మిన మధ్యాహ్నాలలో
మొహంతో నిన్ను పిలిచినా నక్ష్తాలను
నవ్వుతూ తాకిన వేళలలో, ఎవరూ లేని రాత్రుళ్ళలో

నీ లోపలి పాటని వింటూ పాటగా మారావు నీవు
నీ లోపలి పాటని వింటూ నీవుగా మారావు నీవు
అది
నిశ్శబ్దాలకి నిశ్శబ్దం
పాటలకి పాట మాటలకి మాట
నా వైపు చూడు
ఈ శబ్దరహితపు పాటను ఇంతకు మునుపు విన్నావు నీవు.

దేహసారి

దేహసారీ
నువ్వొక నదిలేని పాతవి. ఎవరూ కనుగొనని
ప్రాచీన లిపివి
తొలి వర్షానికి సంచరించే రక్తగాయపు గాలివి.
నిన్ను
నుఉవు కోల్పోయినపుడు మాత్రమే
నిన్ను నువ్వు కనుగొంటావు
అన్ని దారులను వొదిలివేసినప్పుడు మాత్రమే
నీ దారిని నీవు చూస్తావు-

బాటసారీ

నీరు లేక దుమ్ము పట్టి రంగు మారుతున్న ముదురు ఆకుల మధ్య
తలి వర్షానికి వెదుక్కుంటావు నీవు
యుగాల నుంచి పిల్లల కాళ్లలాంటి కాంతి కదలికలు లేక
సిలల్లా మారిన ఆకుల నిశ్శబ్దం మధ్య
నీకై వెదుక్కుంటావు నీవు

పిల్లల తుళ్ళిపడే నవ్వుల జాడ లేని వృక్ష ప్రాంతం ఇది
పదాల పొత్తిళ్ళలో ఒధగాలేని
నల్లటి మంచు కురుస్తున్న, పెదాలు తెగిన మరణం ఇది
బాటసారీ
నువ్వు వెదుకుతున్న స్వప్నాంతపు దారిని కనుగోన్నావా
చెదిరిన నీ ఎదురుచూపుల కళ్ళను
ఏ రెండు అరచేతుల సెలఎరులోనైనా కడుక్కున్నావా
ఏ దేహపు ఒడ్డునైనా చేరగిలబడి
నక్షత్రాలు నెమ్మదిగా సంధ్యా ఆకాశాన్ని చీకటి దారంతో
అల్లటం గమనించావా
బాటసారీ
నీరు లేక, దుమ్ము పట్టి రంగు మారుతున్న లేత ఆకుల మధ్య
తొలి వర్షానికి వెదుక్కుంటావు నీవు
యుగాలనుంచి పిల్లల బాహువులలాంటి కాంతి స్థిరత్వం లేక
శిలల్లా మారిన ఆకుల గుంపుల శబ్దాల మధ్య
నీ నిశ్శబ్దంకై వెదుక్కుంటావు నీవు

ఈ దిగులు నీకే తెలుస్తుంది

ఈ దిగులు నీకే తెలుసు

సముద్రపు సారాంశం అంతా మట్టిని తాకి చిట్లుతున్న
వర్షపు చినుకులో ఇమిడిపోతుంది
నిరంతరంగా, కనిపించీ కనిపించకుండా వీస్తున్న
గాలి గాజుల చేతుల అభద్రతా అంతా
వెన్నెల రాత్రిలో ఎగురుతున్న పక్షి రెక్కల కింద ఒదిగిపోతుంది
అనంతపు నక్షత్రాల నిశ్శబ్దం అంతా
ఒక పిల్లవాడి అసంకల్పిత నవ్వు చివర పిగిలిపోతుంది
విస్వాలలో కదులాడుతున్న రహస్య కాంతి అంతా
నిశ్శబ్దంగా సమస్తాన్ని ఎరుకతో గమనిస్తున్న నీ కళ్ళ అంచులలో
ప్రయత్నరహితంగా వాలిపోతుంది
స్పర్శలకు స్పర్శా
పూలకి వేకువా
ఊపిరులకి ఊపిరి
నువ్వు ఇక్కడికి రా
ఈ దిగులు నీకే తెలుస్తుంది.

ఇది

ఎవరూ తాకక నిశ్చలంగా నిలబడి ఉన్న ఈ ముళ్ళు
నీ ఆప్త మిత్రురాలు
సంధ్యాస్తమైన వింత సమయాన
పసిపాప కన్నుకంటే సున్నితమైన లేత ముళ్ళు ముందు
మోకరిల్లి ప్రార్దిస్తావు:
"రాత్రిపూట మసక వెన్నెల్లో చలించే
దేవతవి నీవు
నీ సరళమైన ఉనికి వల్లనే
విచ్చుకునే పూవుల వివిధ రంగులు సాధ్యమయినాయి
నీవున్నావు కనుకనే
నా పాదాల వెంట సాగే నా తల్లితండ్రుల నీడలు
ఊపిరి పీలుస్తాయి
నాకు ఇది చెప్పు
నేను నీలా మారటం ఎలాగో?

జవాబు:

"నీవు పూర్తిగా ఖాళీ అయినప్పుడు మాత్రమే
నిండుగా ఉంటావు-
ఈ శూన్యపు పుష్పాన్ని, నిండైన నీ స్త్రీకి
బహుమతిగా ఇవ్వు. ఆ తరువాత
నీకే దయగా తెలుస్తుంది
స్త్రీలూ పుష్పాలూ ఒకటేనని. పుష్పాలూ
ముళ్ళూ ఒకటేనని. శూన్యం
శూన్యారాహిత్యమూ మృత్యుపక్షి విదిల్చే
రెండు అనంతపు రెక్కలని.
నిశ్చింతగా గాలిలో తెలు, గిరికీలు కొడుతూ
నేలపై వాలి నాట్యమాడు
నీటిని స్పృశించు, గాలిని పరామార్సించు
నీలోపల నీవు విశ్రమించు-
ఇది జీవితం, ఇది జీవించడం
ముళ్ళులా ఉండటమంటే ఇది:
నీవు పూర్తిగా ఖాళీ అయినప్పుడు మాత్రమే
నిండుగా ఉంటావు-"

19 August 2010

సాధ్యం

కూర్చో, కొద్దిసేపు అలా విరామంగా
ప్రేమమయపు అలసటతో ఆగిన వర్షాకాలపు తెమ్మెరలా
కొద్దిసేపు అలా, ఊపిరిపోసుకుంటున్న కలలా
ప్రశాంతతతో, నీతో నువ్వు కూర్చో: ఏమీ ఆలోచించకు
పక్షిలా, అన్నిటినీ వోదిలివేసి
నీ రెక్కల్ని విదుల్చు. నీ చుట్టూ ఉన్న కాంతినీ, చీకటినీ
ఆ ప్రమిదెపు ఆఖరి చూపునీ
నీ అస్తిత్వపు నాలికతో చప్పరించు. నీకు తెలుసు
ఈ జీవితంలో జీవించేందుకు, నువ్వు
మరణించేముందు మరణించాలి. ఆ తరువాత
అన్నీ సాధ్యం అవుతాయి. నక్షత్రాలూ
పాలపొదుగులాంటి వెన్నెలా, దయగా నవ్వే సూర్యుడూ
వర్షం, హర్షం, ప్రతిధ్వనిస్తున్న
శిశువు నవ్వులాంటి నువ్వూ, నీ ఆఖరి మొదటి అస్థిత్వమూ
అన్నీ సాధ్యం అవుతాయి.

ఎప్పటికీ మరచిపోకు

ఎదురుగా నిశ్చలంగా ఉన్న ఎండిన ఆకు ఒక పాటా, ఒక నది.
పాత వెంటా, నది వెంటా, ఆకుపచ్చని
సూర్యరశ్మి కిందుగా సర్వాన్నీ మరచి వెడతావు నీవు. దారి మధ్యలో
ఏ ఒడ్డునో సగం తడిసిన
గావ్వలాని పధం దొరుకుతుంది నీకు. విశ్వం అంతా నిక్షిప్తమైన
శంఖంలాంటి రహస్య సారాంశం దొరుకుతుంది నీకు
అలకూ అలకూ మధ్యగా ఉండే ఘాడమైన నిశ్శబ్దంలాంటి, నువ్వు
దోరుకుతావు నీక్కు. ఎండిన ఆకు గీతాల మధ్యగా
కూర్చుని, సానటి నీటి పాయపై ప్రయాణించడం ఒక పాటా, ఒక ఆటా.

నిన్ను నువ్వు వోదులుకోకు
ఆ లేత చేతిని ఎప్పటికీ మరచిపోకు.

నీ పూల అస్థిపంజరం

-ఈ సమాధి నీ పూల అస్థిపంజరం-

నువ్వు ఇక్కడ జీవిన్చావు. నువ్వు ఇక్కడ ప్రమించావు.
నీ స్త్రీకి నీ రక్తపు బొట్లతో
ఒక హారాన్ని తయారు చేసావు. నీ పిల్లలకి నీ హృదయాన్ని
వాళ్ళ పాదాలలో తురిమావు.

-ఈ సమాధి నీ పూల అస్థిపంజరం-

నువ్వు ఇక్కడ విశ్రమించావు. నువ్వు ఇక్కడ ప్రయానిన్చావు.
నువ్వు ఇక్కడ నీ మూగ తల్లితండ్రులలాగే
ముసలివాడివయ్యావు. నీ అలసిన ఎముకలతో, ఈ ప్రదేశంలో
ముక్కలు ముక్కలుగా మరణించావు.

నీకు జ్ఞాపకం లేదా
ఈ సమాధి నీ పూల అస్థిపంజరం.

నాకు ఇది చెప్పు

నువ్వు నీడల మధ్య జీవిస్తావు. అందుకని నీకు
నీడలా కరుణా, కాంతీ
హింసా అర్థమవుతాయి. అందుకని నువ్వు
నీడలకు
చీకటిపూట కథలు చెప్పి నిదురపుచ్చుతావు. అవి
నిదురిస్తాయి. నిదురలో కంపిస్తాయి.
కలలలో తమ నీడలు కనపడగా
ఉలిక్కిపడి లేచి కూర్చుంటాయి. రాత్రంతా నిన్ను
చూస్తూ కూర్చుంటాయి.

నాకు ఇది చెప్పు
నేను నీడనా కాదా?

అది ఎవరు?

జాగ్రత్తగా విను
రక్కలు తెగి గిరికీలు కొడుతూ రాలిపోతున్న
అనాధ సీతాకోకచిలుక వినిపించని అరుపు.
అది ఎవరు?

ఏం చేస్తానంటే

వృక్షాల నీడలు కమ్ముకున్న నక్షత్రాలు కూడా లేని రాక్షస రాత్రిలో
ఊపిరికి రెక్కలు కూడా లేని ఒక పక్షి
గదంతా నిస్సహాయంగా గిరికీలు కొడుతుంది. నీ అరచేతులలో
సన్నటి నిప్పుని బ్రతికించుకుంటూ వచ్చి
మూలగా మరెక్కడో నీ హృదయపు తాకిడికి తహతహలాడే
పాత ప్రమిదేను వెలిగించు. ఈ రాత్రికి
ఆ సంజకెంజాయ వెలుతురులో నా శ్వాసను అందుకుంటాను.
మరొక్కసారి నీ దయగల పావురపు కళ్ళను
చూస్తాను. మరొక్కసారి నీ చేతులను నా అరచేతుల మధ్య
పదిలంగా దాచుకుని, అలా
నా ప్రాణాన్ని రేపటిదాకా నీ స్పర్స మధ్య బ్రతికించుకుంటాను.

బ్రతికి ఉండేందుకు

గాలిలేని ఇటువంటి నల్లటి చీకటిలో
నలువైపులా చాలిస్తున్న వేయి బాహువుల వృక్షాల కిందుగా
ఒరిగిపోతున్న మట్టి రేణువుని
మమకారంతో కౌగలించుకుని అలా నిలబడి ఉన్న
నాలుగు రేకుల
నక్షత్రం లాంటి ఆ చిన్ని తెల్లపూవు చాలు
నువ్వు ఈ రాత్రికి జీవించి, రేపటి దాకా
ఎలాగోలాగ బ్రతికి ఉంటావు

18 August 2010

ప్రశ్న

అమ్మా, గోడలు లేనప్పుడు, నేలా లేనప్పుడూ
మొక్కల నీడలు ఎక్కడ పడతాయి
వెలుతురు ఎలా బ్రతుకుతుంది? నేను ఎవరితో
ఆడుకుంటాను?

శూన్యం

వెళ్ళిపోకు. నువ్వు వెళ్ళిపోతే
ఈ కాగితం కూలిపోయి శూన్యం మొదలవుతుంది
నాకు శూన్యం అంటే భయం లేదు
కాకపోతే, నువ్వు వెళ్ళిపోతే శూన్యానికీ అర్థం ఉండదు.

దూరం

ఇంత దూరమని ఇప్పటికీ తెలీలేదు
పార్ధనకై ముకుళిత మైన అరచేతుల్లా, ఎదురుగా
నువ్వు నాదైన నీడకాంతివై మౌనంగా
సంచరిస్తూ ఉంటె, ఎదుతుగా ఉండటమంటే
దగ్గరిగా ఉండటం కాదని ఇప్పటికీ తెలీలేదు.

అంత తెలికేమీ కాదు

నిరంతరం నిన్ను నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం
అంత తెలికేమీ కాదు
ప్రతి క్షణం ఏదో ఒకటి దు:ఖంతో నీ లోపల
నిర్దయగా మరణిస్తూన్నప్పుదు
నిరంతరం నిన్ను నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం
అంత తెలికేమీ కాదు

జీవిస్తూ జీవితాన్ని కోల్పోకుండా ఉండటం
పిల్లలకూ తాగుబోతులకూ మాత్రమే సాధ్యం
ఇక్కడ ఈ సమయంలో ఉంటూ
దిగులు పూల పరిమళాన్ని పీల్చకుండా ఉంటాం
పిచ్చివాళ్ళకూ మరణించిన స్త్రీలకు మాత్రమే సాధ్యం

ఎప్పటికీ ఉండే అవ్యక్త తపన మరకను వోదిలివేస్తూ
ప్రతి పగలూ ఏదో ఒకటి ఆకాశం నుంచి రాలుతుంది
ప్రతి రాత్రీ ఏదో ఒకటి కూలిపోయే నవ్వు అంచున
స్రవించే నక్స్తత్రం గా మారుస్తుంది

ఇక్కడ ఉంటూ ఈ సమయాన్ని దాటుకుంటూ వెళ్ళడం
మరొక సమయంలోకి నిన్ను పిలిచే
ఆత్మ హత్యా చేసుకున్న స్నేహితుల అద్రుశ్య హస్తాలను
గమనిస్తూ బ్రతికి ఉండటం
క్షణకాలం అలా అక్కడే నిలిచిపోయి
మనల్ని ప్రేమించి, మనల్ని వొదిలివెళ్ళిన వాళ్ళతో
అద్రుశ్య సంభాషణను కొనసాగించడం
క్షణకాలం అలా అక్కడే నిలిచిపోయి
ఊరికినే ఆడుకుంటున్న పాపను గమనిస్తుండటం
అంత తెలికేమీ కాదు

జీవిస్తూ ప్రతి క్షణం మరణించకుండా ఉండటం
ప్రేమిస్తూ గులాబీల ఆఖరి అంత్యక్రియలను
చూడకుండా ఉండటం, ఒక ముళ్ళు
పూవు కన్నా ఎక్కువకాలం కొనసాగుతుందనీ తెలిసి
జీవిస్తూ ఉండటం అంత తెలికేమీ కాదు

అ తరువాత

ఈ చెక్క మండుతుంది. ఈ మంట గుమికూడిన నక్షత్రాల వైపు నింపాదిగా చూస్తూ
రాత్రిని నెమ్మదిగా కాలుస్తుంది.

ఎవరు తీసుకు వచ్చారు ఈ గాలిని, చీకటివేళ గాలితోపాటు దారితప్పిన పురుగునీ?
పాదాలు పరచిన దారిలో, ఎందుతాకులతో గుసగుసలాడే రహస్య నీడలా సమయంలో
ఎవరు వెలిగించారు ఈ దుంగ దీపాన్ని? మరికొద్దిసేపట్లో పొడుగ్గా సాగిన నల్లటి చేతులతో
మనుషులు వెళ్ళిపోతారు ఇక్కడనుంచి. వారి వెంటే మరి కొద్దిసేపట్లో, వారి వేఉకగా
నెత్తిపై తట్టలతో స్త్రీలూ వెళ్ళిపోతారు. అద్రుశ్య బాహువులకి, పాలిండ్ల ప్రేమమయపు గూళ్ళకై
వెదికి వేసారిన బాటసారులూ మరికొద్దిసేపట్లో ఈ చెక్క చుక్క పక్కగా ఒరిగిపోతారు.

అ తరువాత
ఒక్క నల్లటి ఆకాశమే రాత్రంతా, ఒక్క నల్లటి మనిషే రాత్రంతా, ఒక్క నల్లటి మంటే
రాత్రంతా.

ఇక ఈ రాత్రి

ఇక ఈ రాత్రి ఇక్కడ విశ్రమిస్తాను. ఎంటువంటి ఆరోపణలూ లేకుండా ఇక ఈ రాత్రి
అస్తిత్వాన్ని అంగీకరించి శిరస్సుని ధూళి నిండిన పాదాల వద్ద ఆన్చి నిలిచిపోతాను.

కనిపించని ఉనికి ఏదో నిర్దేశించిన దారి ఇది. క్షణక్షణం రహస్య స్వరం ఏదో రమ్మని
పిలిచిన కరుణ లేని దారి ఇది. సమయపు సంకేతాల్ని అనువదించుకునేందుకు
గులాబీలను వొదిలి ముళ్ళను హృదయంలో దిమ్పుకున్న అంతులేని తపన ఇది.

ఇక ఈ రాత్రి ఏది ఏమిటని అడగను. ఇక ఈ రాత్రి ఎవరు ఎవర్నీ అడగను.

జీవితాన్ని వెదుకుతూ జీవితాన్ని కోల్పోయాను. అర్థాన్ని వెదుకుతూ అర్థాన్నీ కోల్పోయాను.
ఉండేందుకు, ఏమీ కోరని ఈ భూమిపై అలా ఉండేందుకు అనేక పర్యాయాలు మరణించాను.
తిరిగి చేరుకునేందుకు, ఎప్పటికీ చేరుకోలేనంత దూరమూ వెళ్ళిపోయాను.
తుంపులు తుంపులుగా నలుదిశలూ వీడిపోయాను.

ఇక ఈ ఒక్క రాత్రి, మట్టిని రక్తపు పెదాలతో ముద్దాడే పాదాలు నావి, అవి చేసే అలికిడి
ఎవరిది అని అడగను. శూన్యపు కాంతిని వలలై చుట్టుకునే కనులు నావి, అవి చూసే
చూపు ఎవరిది అని అడగను. ఇక్కడ ఈ గాలిలో వికసించిన అస్తిత్వపు పూవు నాది, దాని
ఎరుక ఎవరిది అని అడగను.

విరిగిపోయాను. పూర్వీకుల ధూళిలో కలసిపోయాను. అలసిపోయాను. ఇక ఎటువంటి
ఆరోపణలూ లేకుండా ఈ రాత్రి జీవితాన్ని అంగీకరించి శిరస్సుని వడలిపోయిన పాదాల వద్ద
ఆన్చుకుని ఇక్కడే ఆగిపోతాను. ఇక్కడే, అలలపై వోదిలిన ప్రమిదేలా ఆగి సాగిపోతాను.

వలయం

ఒక వలయంలో వలయాలుగా తిరుగాడుతూ: నువ్వు. రాత్రి నుంచి రాత్రికి పారిపోతూ
నువ్వు భీతావాహకమైన కనులతో కంపిస్తూ వచ్చినప్పుడు
ఆ చేతులు నిన్ను పొదివి పుచ్చుకున్నాయి. నిన్ను పోషించాయి. ఇక నీ దేహం
నునువెచ్చగా మారింది. ఇక నీ హృదయం వేగంగా ప్రవహించింది.

ఒక వలయంలో వలయాలుగా తిరుగాడుతూ నువ్వు అక్కడే స్థిరపడ్డావు. ఒక చిన్ని
ప్రదేశాన్ని, ఒక చిన్ని చిన్ని ప్రదేశాని
నీ ఊదారంగు సంజ్ఞలతోనూ నీ బంగారు స్పర్శా కాంతులతోనూ నింపివేసావు. ఒక
చిన్ని ప్రదేశం. చాల చిన్ని ప్రదేశం.
ఎంత చిన్న ప్రదేశం అంటే ఈ భూమి మొత్తం పోదుపుకోలేని, మా అందరి పరిపూర్ణ
జీవితాలేవీ నింపుకోలేని, ఒక చిన్ని చిన్ని ప్రదేశాన్ని నువ్వు నింపివేసావు.

ఇక రాత్రిలో మెరిసే నక్షత్రాలను నువ్వు నీ దంతాలతో ఒడిసిపట్టుకున్నప్పుడూ
పరిసరాల్లో కదులాడే చల్లటి తేమ్మరని
నువ్వు నీ బాహువుల మధ్యకు లాక్కుని ముడుచుకుని పడుకున్నప్పుడూ, వాళ్ళ
దేహాలు నును వెచ్చగా మారాయి. వాళ్ళ హృదయాలు వేగంగా ప్రవహించాయి.
చేతులు చేతులతో కలగాలసినాయి
సూర్యరస్మితో కంపించే సరస్సులలాంటి నవ్వులు వాళ్ళను పూర్తిగా నింపివేసాయి.

ఒక వలయంలో వలయాలుగా తిరుగాడుతూ: మేము. మా చేతులతోనే, శతాబ్దాల
ఊచాకోతల్ను పరచిన మా ఈ చేతులతోనే మేము
నీవు లేనితనానికి దారిని ఏర్పరిచాము. ఇక ఇప్పుడు రెండు అదృశ్య నయనాలు
నీ స్వరరహిత కన్నీటి ఉప్పదనంతో నీవు లేని ప్రదేశంలో వలయాలుగా తిరుగాడతాయి.

నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు?

మా ఖాళీతనంలో ఖాళీ అయ్యి, ఇక మేము జీవించనూ లేము, మరణించనూ లేము.

మధ్యాన్నపు అమ్మ

నల్లటి నీడలు తెల్లటి నీటి పాయల్లా తన వేళ్ళ చివర కదులుతుండగా
నేను అమ్మ మధ్యాన్నం దుస్తులు ఉతకడాన్ని చూస్తాను
ఇంటి వెనుక జామ చెట్టు వృద్ధాప్యంతో వొంగి , జ్ఞాపకాలలో కోల్పోయిన తనను చూస్తుండగా
నేను అమ్మ మధ్యాన్నం దుస్తులు ఉతకడాన్ని చూస్తాను

మరెక్కడో మరొక వృద్ధుడు, అలల్ని అరచేతిలో పట్టుకుని వాటిని పిట్టల్లా మార్చే
తన మనవరాల్ని చూసేందుకు సముద్రంలోకి వెడుతుండగా
మరెక్కడికో వెళ్ళలేని ఇక్కడి అమ్మ ఇక్కడే మౌనంగా దుస్తుల్ని నీటిలో ముంచుతుంది
తన ప్రియుడికి ఎన్నటికీ తిరిగి ఇవ్వలేని పుస్తకంలో రంగు మారిన రావి ఆకులా
అమ్మ దుస్తుల్ని తన ముందు పరచుకుని, తన రెండు హస్తాలతో
అప్పుడే జన్మించిన శిశువుని తుడిచినట్టు, మరణించిన తన తల్లితండ్రుల శరీరాల్ని
శ్మశానానికి తీసుకువెళ్ళే ముందు, ప్రేమతో బాధతో నిశ్శబ్దంగా కడిగినట్టు
అమ్మ దుస్తుల్ని తన ముందు పరచుకుని, తన రెండు హస్తాలతో వాటిని శుబ్రం చేస్తుంది

అమ్మ మధ్యాన్నం ఒంటరిగా దుస్తుల్ని ఉతుకుతుంది
తనని వొంటరిగా వోదిలివేసిన వాళ్ళ దుస్తుల్నీ, తనని ఇక్కడ ఒంటరిగా ఒదిలివేసి
మరెక్కడో తన అస్తిత్వపు ఊసైనా లేక కదులాడుతున్న వాళ్ళ దుస్తుల్నీ
అమ్మ మధ్యాన్నం ఒంటరిగా శుబ్రం చేస్తుంది
మరుపైనా లేని సమయంలో, ప్రేమించినవాళ్ళకీ కోల్పోయినవాళ్ళకీ తేడా లేని సమయంలో
అమ్మ ప్రేమించిన వాళ్ళ దుస్తులనీ, ప్రేమించలేని వాళ్ళ దుస్తులనీ నీటిలో ముంచుతుంది
వాళ్ళ చొక్కల్నీ, పాంట్లనీ, లోదుస్తులనీ ఒకదాని తరువాత మరొకటి శుబ్రం చేస్తూ
నుదిటిపై చిట్లిన చెమటను తుడుచుకునేందుకు క్షణకాలం ఆగుతుంది

సరిగ్గా ఆ క్షణాన వొంటరి మధ్యాన్నం స్రవించే రక్తపు గులాబీగా మారుతుంది
సరిగా ఆ క్షణాన ఆకాశపు తీగపై ఆరవేసిన మేఘాలు పచ్చి గాయాలుగా మారతాయి
సరిగ్గా ఆ క్షణాన అమ్మ ఘర్భంలో ఈ కవిత ఊపిరి పోసుకుంటుంది
సరిగా ఆ క్షణాన అమ్మ శరీరంలో ఒక దిగులు గీతం కదులాడుతుంది. ఆ తరువాత
అప్పుడే ఆర్పివేయబడ్డ ప్రమిదెలు వెలుతురు వాసనను గాలిలో వదిలినట్టు
అమ్మ దుస్తుల్ని ఉతకడం పూర్తిచేసి, వర్షానికీ బాధకీ వాటిని వోదిలివేసి ఇంటిలోకి వెళ్ళిపోతుంది.

16 August 2010

రహదారి

సాయంత్రం పూట, వర్షపు తూనీగలు నల్లటి మేఘాల రెక్కలతో కొమ్మలలోకి
జోరబడుతున్నవేళ
ఆమె రహదారిని దాటేందుకు ప్రయత్నిస్తుంది. నుదిటిన గాలికి చిందరవందర
అవుతున్న కురులతో, మూడేళ్ళ పాప కనులతో
విస్తృతంగా రాక్షసంగా కదులాడుతున్న వాహనాలను దాటి
ఆవలివైపుకు చేరేందుకు ఆమె తడబడుతుంది.

సహచరుడు లేని దిగులు సాయంత్రం. అరచేతిలో మరో అరచేయి లేని,
గోరువెచ్చనిదనం లేని, దు:ఖాన్ని మునిపంటితో నొక్కి పెట్టిన సాయంత్రం
భుజాన బాగ్ తో, అలసిన దేహంతో
పని నుంచి నిస్సతువుగా ఇంటికి వెళ్ళాల్సిన సాయంత్రం. ఆమె
రెండు అడుగులు ముందుకు వేసి, నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది

"ఇది అడవికన్నా చిక్కనైన ప్రదేశం. క్రూరమృగాల కన్నా వేగంగా వాహనాలు
సంచరించే విరామం లేని ప్రదేశం.
ఇటువంటి రహదారిని దాటటం ఎలా?"
ఆమె మనస్సులో తనలో తాను సంబాషించుకుంటూ, చాలా కాలం క్రితం
అతడూ ఆమె చేతులు పుచ్చుకుని
అంత వేగపు వాహనాల వరదను అత్యంత సునాయాసంగా దాటిన
క్షణాలను జ్ఞాపకం చేసుకుంటుంది.

ప్రేమలేని దయరహిత సాయంత్రం. పెదాలు ఇతర పెదాలను తాకలేని
నిశ్చేష్టమైన నిశ్శబ్దపు సాయంత్రం.
ఒంటరిగా బయలుదేరి ఒంటరిగానే ఇక ఇంటికి చేరుకోవాల్సిన
ఒంటరి బాహువుల సాయంత్రం. ఆమె ముందుకు కధలలేకా
వెనక్కు వెళ్ళ లేకా, ఉన్నచోటనే నిలబడి
ఎదురుగా నిర్దయగా మారుతున్న రోజును స్తబ్దుగా గమనిస్తూ అనుకుంటుంది:

"రహదారిని దాటం ప్రేమను ఈది ఒక దరికి శాంతితో చేరటం వంటిది. సమయం లేదిక
కదిలే తేమ్మరని ఆసరాగా పుచ్చుకుని
మసకబారుతున్న ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు,
మేఘాల మధ్య ముడుచుకుంటుండగా, చప్పున రహదారిని దాటాలి. సమయం లేదిక.
చీకటి మంచు గాడమయ్యే వేళకి ఇంటికి చేరుకొని, సహచరుడు లేని పడకపై
నిర్లిప్త కరుణతో విశ్రమించాలి ఇక. సమయం లేదిక
ఎలాగోలాగా జీవితాన్ని త్వరితంగా దాటాలిక:"

ఆ తరువాత, కనిపించని ముళ్ళు రాలుతున్న కంపించే శీతలగాలితో పాటు
పెదాల అంచున వికసిస్తున్న చిర్నవ్వుతో
ఆమె ఒక నిర్లక్ష్యపు విసురుతో, సాయంకాలమూ రాత్రీ కాని కర్కశ సమయంలోకి
ఈ పదాలతో పాటు రహదారిని దాటుతుంది.

15 August 2010

నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు

నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు ప్రపంచాన్ని శుభ్రం చేస్తావు
నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు
ఇంతకు మునుపే కాంచిన సమయాల్నీ, అద్దాలు లేని అద్దపు ప్రపంచాల్నీ శుభ్రం చేస్తావు

నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు ఆకాశాన్ని శుభ్రం చేస్తావు
నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ
నయనాలు లేని చూపుల్నీ ఈ నైరాశ్యపు ఉన్మాదాన్నీ శుభ్రం చేస్తావు
నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు చెల్లా చెదురైన అర్తాల్నీ శబ్దాలనీ ఒక దరికి చేర్చి
శూన్యాల్ని నీ ఊపిరి స్పర్శతో నింపుతావు.

నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు నదులని శుభ్రం చేస్తావు
నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు
అనాధల కన్నీళ్ళనీ భయాలనూ ఇతరుల నిశబ్దపు ఊచకోతలనూ మాన్పుతావు

నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు ప్రపంచాన్ని శుభ్రం చేస్తావు
నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు
ఇంతకు మునుపే కాంచిన రహితాలనీ, నీ పాదాల నయనాలపై ప్రతిబింబించే
హింసా సమయాల్నీ శుభ్రం చేస్తావు
నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు, నీ పాదాల్ని శుభ్రం చేసుకుంటూ నువ్వు.

సూజన్ నువ్వు నిదురిస్తావు

సూజన్, నువ్వు నిదురిస్తావు, ఒక అనాధ పదంలా
ఏదో చూశానన్న స్పృహ తప్ప
ఎం చూసానో తెలియని, కలలో కాంచి
నిదుర లేచిన తరువాత మరచిపోయి, చివరకు
హృదయంలో మిగిలినపోయిన ఒక పదునైన నొప్పిలా
సూజన్ నువ్వు నిదురిస్తావు.

సూజన్ నువ్వు నిదురిస్తావు, నేను ఎన్నటికీ చేరుకోలేని
సముద్రానికి ఆవలివైపుకి నీ తలను మరల్చి
సూజన్ నువ్వు నిదురిస్తావు. నువ్వు అక్కడ విశ్రమిస్తావు
అద్దాల గదిలో చిక్కుకున్న ప్రతీకలా, అవ్యక్త భయంలా
నువ్వు అక్కడ విశ్రమిస్తావు.

నిశ్సబ్ధపు పదాలతో నేను నిన్ను తాకేందుకు ప్రయత్నిస్తాను.
నా దేహపు ఎముకల పడవతో
నేను నీతో ప్రయానించేందుకు ప్రయత్నిస్తాను.

సూజన్ నువ్వు నిదురిస్తావు, నేను ఎన్నటికీ కొలవలేని
శూన్యానికి ఆవలివైపుకి తలను మరల్చి
సూజన్ నువ్వు నిదురిస్తావు. నువ్వు అక్కడ విశ్రమిస్తావు
భాషాగృహం లో కోల్పోయిన ప్రతీకలా, అవ్యక్త జలదరింపులా
నువ్వు అక్కడ విశ్రమిస్తావు.

పదాల ఖాళీ ప్రతిధ్వనులతోటి నేను నిన్ను చంపేందుకు
ప్రయత్నిస్తాను. ఇక ఇక్కడ ఏమాత్రంలేని
ఎవరికీ చెందని ఒక జ్ఞాపకపు కాంతిలో నేను నిన్ను
పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నిస్తాను.

సూజన్ నువ్వు నిదురిస్తావు, నేను ఎన్నటికీ అందుకోలేని
కలకు ఆవలివైపుకి ముఖాన్ని మరల్చి
సూజన్, నువ్వు నిదురిస్తావు. నువ్వు అక్కడ విశ్రమిస్తావు
తపన గృహంలో కోల్పోయిన శబ్దంలా, స్వరం లేని అద్బుతంలా
నువ్వు అక్కడ విశ్రమిస్తావు.

సూజన్, నువ్వు నిదురిస్తావు, ఊపిరి పోసుకుంటున్న ఒక పదంలా
ఏదో చూశానన్న స్పృహ తప్ప
ఎం చూసానో తెలియని, కలలో కాంచి మరచిపోయి
నిదుర లేచిన తరువాత
హృదయంలో మిగిలినపోయిన ఒక పదునైన కాంతి తరంగంలా
సూజన్ నువ్వు నిదురిస్తావు.

మధువుతో వివశితమైన

మధువుతో వివశితమైన రాత్రి. మధువుతో వివశితమైన మనుషులు. మనమిద్దరం నీ గదిలో నగ్నంగా మారడాన్ని చూసే పుష్పాలూ మధువుతో వివశితమై ఉన్నాయి

ఆకలితో వివశితమైన రాత్రి. ఆకలితో వివశితమైన మనుషులు. మనం ఇద్దరం నీ గదిలో ఒకరినొకరు కొరుకుతూ ఉండగా చూసే పుస్తకాలూ ఆకలితో వివశితమై ఉన్నాయి.

దప్పికగొన్న వివశితమైన రాత్రి. దప్పికగొన్న వివశితమైన మనుషులు. మనం ఇద్దరమూ నీ గదిలో ఇతరునికై రమిస్తుండగా, ఒకరినొకరు నములుకుంటుండగా, ఒకరినొకరు వాంతి చేసుకుంటుండగా చూసే పిల్లులూ దప్పికతో వివశితమై ఉన్నాయి.

ఇక ఈ ఒక్క రాత్రికి మనకు అవసరం లేని ఒక పదం: ప్రేమ. విరిగిపోయి, పూర్తిగా వివశితమై ఇక ఈ ఒక్క రాత్రికి మళ్ళా మనం మరొకసారి మనంగా మారిపోతాం: పూలగానూ, పుస్తకాలగానూ పిల్లులుగానూ, వీర్యంతోటీ చమటతోటీ రక్తంతోటీ ధూళితోటీ, వీచే రాత్రి గాలిగానూ మనం మనం ఇద్దరం ప్రేమించుకుంటుండగా చూసే మధువుతో వివశితమైన మనుషులముందు మనం మధువుతో వివశితమైన రాత్రిగా మారిపోతాం 
***
తిరిగి మళ్ళా మనం ఈ ప్రపంచంలోకి , ఈ జీవితంలోకీ ఎలా వచ్చాం?

మిణుగురులు

పరిపూర్ణంగా మధువుతో వివశితమయ్యి, ముఖంలేని ఒక స్వరంచే స్వప్నింపబడి, మనం
ఆ రాత్రి ఇంటికి ఎలా చేరుకున్నాం?

***

బయట ప్రపంచం అర్థం కాని ఒక అంతం వైపుకు హడావిడిగా దూసుకు వెడుతుండగా, మనం
అక్కడ కూర్చున్నాం, చేతులలో మధుపాత్రలతో, హృదయాలలోని తపనతో
తాగుతూ స్వప్నిస్తూ, స్వప్నిస్తూ తాగుతూ మనం అక్కడ కూర్చున్నాం. మనకు ఎదురుగా
కూర్చున్న స్త్రీ (ఒంటరి, ఆమె ముఖం రూపం ధరించిన ఒంటరితనమని నువ్వు అన్నావు)
తదేకంగా తన మధుపాత్ర వైపు చూస్తుంది: (ఎలా అంటే ఆ మధువు నక్షత్రాలతో నిండిన విశ్వం అయినట్టూ,
అటువంటి విశ్వాన్ని ఆమెకోసమే మధువుగా మార్చినట్టు: అలా అని నువ్వన్నావు).
ఆ తరువాత ఆమె, మత్తు ప్రపంచపు వింతలోకంలో మనుషులకి మధువు అందించే దేవదూతను
తన వైపు రమ్మని సంజ్ఞ చేసి, అతడు చిరునవ్వుతో దగ్గరికి రాగానే ఏదో చెప్పబోయి, ఆగి
తల అడ్డంగా ఊపుతూ అంటుంది: "ఏమీ లేదు. నాకు ఎం కావాలో నేను మరచాను."

బయట, బహుశా ప్రపంచమూ పదాలూ అర్థం కాని ఒక అంతం వైపు ఇంకా దూసుకు వెడుతుండగా
ఆకస్మికంగా నువ్వు అడుగుతావు: నేను తాగుతున్ననా లేక స్వప్నిస్తున్నానా?

అవి రెండూ వేరు వేరని నాకు తెలీదు. అందుకే నేనేమీ చెప్పలేదు.

౨.

మధువుతో వివశితమయ్యి మనం ఇంకా అక్కడే స్వప్నిస్తూ తాగుతూ, తాగుతూ స్వప్నిస్తూ
కూర్చుని ఉన్నాం. బయట ప్రపంచం అర్థం ఉన్న లేదా అర్థం లేని
ఒక అంతం వైపుకి హడావిడిగా దూసుకు వెళ్లిందో లేదో పట్టించుకోవడం మానివేసాం మనం.
మనకు ఎదురుగా ఇంకా అక్కడే కూర్చున్న స్త్రీ ఇంకా తదేకంగా
తన గాజు పాత్రలోని మధువు వైపే చూస్తుంది. (ఎలా అంటే, ఆమె తాగుతున్నది
ఆ దైవపు రక్తం అయినట్టు: అలా అని నువ్వన్నావు). సంవత్సరాల బడలికతో వడలిపోయి వంగిన
ఆమె ముఖం ఆకస్మికంగా జ్ఞాపకపు కాంతితో మెరుస్తుంది. ఆ తరువాత ఆమె
వింత ప్రపంచపు మత్తులోకంలో మధువు అందించే
కరుణామయుడైన దూతను తన వైపు రమ్మని పిలిచి అంటుంది:
"నీకు తెలుసా నేను ఎం మరచిపోయానో? మూత్ర విసర్జనం చేయడం."

బయట మూత్రం చేయటం మరచిన ప్రపంచమూ పదాలూ ఇక ఇప్పుడు, ఒక లక్ష్యంతో
అర్థం ఉన్న అంతం వైపు దూసుకు వెడుతుండగా
ఆకస్మికంగా నువ్వు అంటావు: అవును అర్థమూ మూత్రమూ ఒకటే, వోదిలివేయాలి. చెప్పు:
నేను స్వప్నిస్తున్నానా లేక తాగుతున్నానా?

అవి అన్నీ వేరు వేరని నాకు తెలీదు. అందుకే నేను ఏమీ చెప్పలేదు.



మధువుతో మనం మధువుగా మారి మనం ఇంకా అక్కడే తాగుతూ స్వప్నిస్తూ, స్వప్నిస్తూ తాగుతూ
కూర్చున్ని ఉన్నాం. మన ఇద్దరిలోనూ ఇక ఎవ్వరికీ
ప్రపంచం కానీ పదాలు కానీ జ్ఞాపకం లేవు. ఇంతలోగా మన ఎదురుగా ఇంకా అక్కడే కూర్చుని ఉన్న
ఆ స్త్రీ క్రమంక్రమంగా దైవత్వాన్ని సంతరించుకుంటుంది. ఆ సంజ్ఞలు కూడా, క్రమంక్రమంగా
ప్రయత్నారహితమైన సీతాకోకచిలుక రెక్కల కధలికల్లా మారతాయి.
(ఎలా అంటే, జీవితాన్ని, మృత్యువునీ ఆలపిస్తున్న ఒక అనామక పక్షిలా మారిన ఆమెలా: అలా అని
నువ్వు అన్నావు.) నువ్వు అలా అంటుండగా
ఎదురుగా రక్తంగా మారిన మధువు వైపు చూస్తూ, మనమిద్దరం మాత్రమే అర్థం చేసుకోగల స్వరంతో
ఆమె అంటుంది: (ఎలా అంటే, అవి స్రవించే అస్తిత్వపు శబ్దాలు అయినట్టూ,
స్త్రీలు మాత్రమే చెప్పగా పదాల మృత్యు జాడలు అయినట్టూ: అలా అని నువ్వు అన్నావు): ఆమె అంది:

"ఒకప్పుడు వేయి మర్మావయాలను ఉసిగొల్పిన ఆ ముఖం ఇప్పుడు ఏమయ్యింది?"



పరిపూర్ణంగా మధువుతో వివశితమయ్యి, ముఖంలేని ఒక స్వరంచే స్వప్నింపబడి, మనం
ఆ రాత్రి ఇంటికి ఎలా చేరుకున్నాం?

14 August 2010

పరిచయం

నేనంతా చెవులేనా? అతడు అడిగాడు చాలా కాలం క్రితం.

ఆమె పరిచయం అయినప్పటినుంచి
నేను చెవిని వినే చెవిగా మారాను. అయితే ఇప్పుడు నేను
ఆ చిత్రకారుడిని కూడా:
అదేమిటంటే ఇప్పుడు ఆమెకు
నా చెవితో పాటు నాలికను కూడా కోసి బహుమతిగా ఇచ్చాను.

నల్ల మల్లెమొగ్గ

సూర్యరస్మిలా
నీటి చెలమలో ప్రతిబింబిస్తున్న సూర్యరస్మిలా
అద్దాల తునకలుగా చిట్లుతున్న
నీటి చేలమలా
నువ్వు నా వద్దకి వస్తావు
నువ్వు నా వద్దకి మరలా మరలా వస్తావు
ఒక మరణించని విచారపు ప్రతీకలో
ఇద్దర్ని కలిపే
ఒక సుదూర దూరం నుంచి
నువ్వు వస్తావు

పాపాలన్నిటిలోకీ
పవిత్ర విషయాలన్నిటిలోకీ
బలిపీటం వద్దకు
చేతిలోనూ హృదయంలోనూ
ఒక నీలి పూవుతో వెళ్ళే
అతడి వద్దకి
నా తపన రంగు అంటని
నీ చేయి
మహోన్నతంగా నిలిచిపోతుంది.

ఆ తరువాతా
అంతకు మునుపూ
ఇద్దరు స్నేహితులు తెల్లటి రాత్రిని
తమ నలుపు గీతాలతో
రాత్రంత నలుపుగా ఉన్న
ఒక తెల్ల మల్లెమొగ్గతో
రంగులు వేస్తారు.

అప్పటిదాకా

నన్ను నీ ప్రవాహంతో తీసుకు వెళ్ళు
ప్రశాంతమైన నీ రక్తపు చెలమలో
అతడిని విశ్రామించనివ్వు
నీ అస్తిత్వపు వర్షాసంధ్యాసమయంలో
గిరికీలు కొడుతున్న
పిచ్చుకల రెక్కల శబ్దాన్ని అందరూ విననివ్వు:
నన్ను కూడా కొన్నిసార్లు
మరి కొన్నిసార్లు
నిన్ను
నీ కలల మరో వైపుకి
నా కలల మరో వైపుకి
తీసుకువెళ్ళనివ్వు.

అప్పటిదాకా
ఆ క్షణందాకా
ఇద్దరు ముగ్గురయ్యి
ఒక్కటయ్యేదాక
నిన్ను
కల నుంచి కలకు పారాడే
ఒక ప్రేతాత్మలా చూసేందుకు
నన్ను రాత్రికి శిలువ వేసి ఉంచు.
దయచేసి
అప్పటిదాకా
అతడు
ఆమె ఆఖరి పదాల్ని లెక్కపెట్టే చోట

రాత్రుళ్లన్నిటికీ రాత్రయిన
నా రాతిరి మల్లెమొగ్గ

నన్ను శిలువ వేసి ఉంచు.
అప్పటిదాకా
ఇప్పటిదాకా.

ఈ రాత్రి ఒక మల్లెపూవు

ఈ రాత్రి ఒక మల్లెపూవు: దానిపై
నీ చివరి మూగ పదం ఒక రక్తపు బిందువులా రాలిపడి
ఈ రాత్రినంతా నీ వక్షోజాల ఊపిరితో నింపివేస్తుంది.
నీ వక్షోజాలు లేదా నీ నయనాలు.
ఈ రాత్రి ఇక నీ రక్తపు గీతం: దానిపై
అతడు వడలిపోయిన మల్లెపూవులా రాలిపదతాడు.

ఆగు. వేచి చూడు.
నిన్ను తెంపి
అనంతంలో నాటేందుకు ఒక తల్లి వస్తుంది.

ధన్యవాదాలు

పాపుల పవిత్ర రాత్రి ఇది
గులాబీ రాత్రి ఇది. నీ కనుల అంచున
ఎర్రగా మారుతున్న
ఒక తెల్లగులాబీ రాత్రి ఇది

ప్రేమనా? వద్దు. ధన్యవాదాలు.
దయనా? వద్దు. ధన్యవాదాలు.
ఇది చెప్పు నాకు
పగటి చీకటిలో కానీ
రాత్రి వెలుతురులో కానీ
నీ వేళ్ళ చివర్లు
పరిమళపు పుష్పాలుగా కానీ
పచ్చిముళ్ళుగా కానీ
ఎలా మారగాలవో నాకు చెప్పు.
చెప్పు, ఇది చెప్పు నాకు
పగలు కానీ రాత్రి కానీ నీ స్వరం
కొనసాగుతున్న హింసా చిహ్నమై
ఇంధ్రధనుస్సై
పగటిని రాత్రినీ కలుపుతున్న
జీవితపు ఊయలకు పైగా ఎలా
వికసించగలదో నాకు చెప్పు.

చెప్పు, ఇది నాకు చెప్పు, వొద్దు
నాకు చెప్పవద్దు
ఒక పక్షి తన గూడును వొదిలి వెళ్ళినప్పుడు
ఒక పావురం రాలిపడిపోయిన
తన గుడ్డు వైపు చూస్తున్నప్పుడు
చెప్పు, ఇది నాకు చెప్పు, వొద్దు
నాకు చెప్పవద్దు
ప్రపంచం ఎలా ఉండేదో
ప్రపంచం ఎలా ఉందో
ప్రపంచం ఎలా ఉండబోతుందో: నీకు తెలుసు
వాళ్ళకూ తెలుసు

రాలిపడిపోయి, పిగిలిపోయి
జన్మించక మిగిలిపోయిన
ఆ పక్షీ గుడ్డూ గూడూ మనమేనని.

ధన్యవాదాలు.

మరొక చిన్ని చిన్ని కవిత

నేనొక పూలపాత్రని
నీ అస్తిత్వపు అంచున ఉంచుతాను
దానికి నీరువి నువ్వే
సూర్యరస్మివీ నీవే
ఆ పూలపై కురిసే వర్షానివీ నువ్వే
ఆ పూలను పదిలంగా చూసుకుని
నేను ఎక్కడికి వెళ్ళినా
నేనేం చేసినా
ఒక పసినవ్వులా నను వెంటాడే
పరిమళాన్ని
ఆ పూలకు అందించేదీ నువ్వే -

మరణించడం తేలిక;
జీవించడమే, మృత్యువు అంత
కటినమైనది. నేను
ఇంతకు మునుపే చెప్పాను
ఇదొక చిన్ని చిన్ని కవిత అని -
చూస్తూ ఉండు,

నీకు ధన్యవాదాలు తెలిపేందుకు
నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేందుకూ
ఈ వాక్యం చివర
నీ కలల మరో వైపును కాంచించే
ఉనికి ఒకటి ఉంది.

చిన్ని చిన్ని కవిత

నేను నీకొక చిన్న కవితని రాస్తాను
ఒక చిన్ని చిన్ని కవిత
పిచ్చుకలాంటి
చిన్ని చిన్ని గడ్డిపూవులాంటి
నీ చుట్టూ
పిచ్చుక పిల్లలా గిరికీలు కొట్టే
నీ చుట్టూ
తనతో పాటు వర్షపు ప్రేమను
మోసుకు వచ్చే
పచ్చిగడ్డి పరిమళం లాంటి
ఒక చిన్ని చిన్ని కవితను
నేను నీకు
బహుకరిస్తాను.

దాహార్తులం మనం
మనది కాని ప్రదేశాలలో అలమటించే
కరవు ప్రదేశాలం మనం -

మనం: నక్షత్రాలమి మనం
సూర్యుడి తునకలమి మనం
ఒక మహత్తరమైన వానలో
కరిగిపోయే మనం: మనం.

మనం: ఇంతకు మునుపూ ఉన్నాం
ఇప్పుడూ ఉన్నాం
ఇక ముందూ ఉంటాం: మనం
మంచులా
నిన్ను చీకట్లో కప్పివేసి
పురాజన్మల శాంతిని తెచ్చే
మృత్యువుని ఇచ్చే
ఆమె అరచేతుల్లా

మనం ఉన్నాం
మనం ఉంటాం.
ఇప్పటికీ. ఎప్పటికీ.

Amen.

క్షమించండి

మధువుకీ మగువకీ మధ్య ఏమైనా పోలిక ఉన్నట్టయితే
ఉన్మాదానికీ మగవాడికీ మధ్య
ఏమైనా పోలిక ఉన్నట్టయితే
పురుషుడూ స్త్రీ ఒకరినొకరు
తన తోకను తానే వెంటాడే కుక్కలా తరుముతునట్టయితే

అర్థరాత్రిలో, ఆకాశంలో మిగిలి ఉన్న నక్షత్రాలను
వేటాడుతున్న జాబిలి పులిని
స్వప్నిస్తూ నడిరోడ్డులో తూలి పడిపోయిన ఆ తాగుబోతుని
క్షమించండి.

గీతం

కొంత మధువు ఏమైనా ఉందా ఈ రాత్రికి

జీసస్ నన్ను కలిసేందుకు వచ్చాడు
నేను అతడికి
సర్వ శ్రేష్టమైన కల్లుతోటీ సారాతోటీ
విందు ఇవ్వదలిచాను

కొంత మధువు ఉందా ఏమైనా ఈ రాత్రికి

నా స్నేహితుడు నన్ను కలిసేందుకు వచ్చాడు
నేను అతడికి
సర్వశ్రేష్టమైన అన్నంతోటీ పచ్చళ్ళతోటీ
విందు ఇవ్వదలిచాను

కొంత మధువు ఉందా ఏమైనా ఈ రాత్రికి

నేను నన్ను కలిసేందుకు వచ్చాను
నేను అతడికి
సర్వశ్రేష్టమైన పాటలతో అరుపులతో
విందు ఇవ్వదలిచాను

కొంత మధువు ఉందా ఏమైనా ఈ రాత్రికి
ఎందుకంటే ఈ రాత్రికి
నేను మరణించదలిచాను.

వివశితుడు

నేను నిన్ను కలిసేందుకు ఎందుకు వస్తానో నీకు తెలుసా?

నాకు తెలియదు, కానీ నేను నీకు ఈ విషయాన్ని చెబుతాను.
నేను ఎలా ఉండేవాడినో ఎలా ఉన్నానో
ఎలా ఉండబోతున్నానో చెబుతాను.

రాత్రి ఒక పిచ్చివాడి చేతులోంచి విసిరివేయబడ్డ రాయిలా
నా వైపు దూసుకు వస్తున్నప్పుడు
నేను బ్రతికి ఉండగానే పాతిపెట్టబడ్డ ఒక మనిషి సమాధిని
మోసుకు తిరుగుతున్నాను.
నా బిడ్డ ఆ సమాధిలో ఒక విత్తనాన్ని నాటి, ఒక మొక్క
మొలకెత్తటంకై ఎదురు చూస్తున్నాడు.
అంతాడు ఒక మొగ్గ వికసించేందుకై ఎదురు చూస్తున్నాడు.
ఈలోగా పైన ఆకాశంలో ముదురు మబ్బులు కమ్ముకుంటాయి.
అవి, నిరంతరంగా ఎదురుచూసే వర్షించబోయే ఆ స్త్రీ నయనాలు.
ఈలోగా సుదూరంలో ఒక తల్లి ప్రార్ధిస్తూ ఉండగా
ఒక శిశువు అప్పుడే మొలకెత్తిన మొక్కవైపు, పాలలో మూత్రంలో
మునిగిన భాషతో అంబాడతాడు .

జీవించి ఉండగానే సమాధి చేయబడ్డ వారెవరో నాకు తెలియదు
స్నేహితులు లేక తిరుగాడే వారెవరో నాకు తెలియదు
కానీ నేను నీకు ఇది చెబుతాను,
నేను వివశితుడనై ఉన్నాను, వివశితుడనై ఉంటాను వివశితుడనై
ఈ లోకం నుంచి వెడలిపోతాను.

కోల్పోయిన ఒక జీవితపు శేష ప్రభావాన్ని మోసుకు తిరుగుతున్నాను
ఒక రాత్రి మరొక రాత్రిని పుచ్చుకుని
ఇంకొక రాత్రిలోకి తోడుకుని వెడుతుండగా, రహదారులన్నీ
తాగుబోతులతో, వేశ్యలతో, పిల్లలతో, పూవులతో, స్త్రీలతో
గాలిలో గీతాలు ఆలపించే పక్షులతో, భూమి సువాసనతో, పూర్వీకుల
రక్తంతో నిండి ఉన్న ఒక అతిధి గృహానికి దారి చూపుతాయి.

mea culpa

ఇది నా తప్పిదమే: నేను ఇంకా స్నేహితుల కోసం సోదరులలలోనో, వేశ్యా గృహాలలలోనో కాంతి వేగంతో వెడలిపోయే ప్రతీకలలోనో, హృదయంలో ఓ మంచం, చేతుల్లో ఓ అమృత పాత్ర - అల కదులాడే ఓ స్త్రీలోనో ఒక దయాపూరితమైన పదాన్ని దగ్గరుంచుకుని తిరుగాడే మనిషిలోనో, నేను ఇంకా స్నేహితుల కోసం వెదకడం ... ఇది నా తప్పిదమే!

ఓ సుదీర్ఘమైన మధ్యాహ్నం తరువాత తల్లి లేని ఇళ్ళకు తిరిగి వెళ్ళే పిల్లల సాయంత్రాల తరువాత, నాకు నేనే ఓ మిత్రుడిగానూ ఓ శత్రువుగానూ మారిపోతాను. పిగిలిపోయి నలుదిశలా కొట్టుకు వెళ్లిపోతాను ....

గాయపడి, ప్రేమించిన వాళ్ళచే నరకబడి, పేగుల్ని అరచేతిలో పొదివి పుచ్చుకుని, నీ చూపు దిగబడి కోల్పోయిన కన్నులతోటి ఇక నేను ఒక ధనుస్సుని అందుకుని నా నుదిటి మధ్యగా ఒక బాణాన్ని సంధించుకుంటాను

నిన్ను ప్రేమించినందుకు నన్ను ప్రేమించుకున్నందుకూ నా చుట్టూ ఉన్న సర్వాన్నీ ప్రేమించినందుకూ: mea culpa.

అర్ధాంతరంగా

ప్రతి రాత్రీ ఏదో ఒకటి వెన్నంటే వస్తుంది. ప్రతి క్షణాన్నీ ఏదో ఒకటి వేటాడుతూనే ఉంటుంది: కానీ నిన్ను నిలువునా చీల్చివేసేదీ నీ అంతరాలలో, నీకు మాత్రమే తెలిసిన నీవైన కాంతికిరణాల వేర్లనీ తడిపివేసేదీ, మృతుల కలలలో పునరావృతమవుతూ ఆకాశాలలో 

నిర్భీతిగా ఎగురుతూ, నువ్వు మరచి వచ్చిన నీ రహస్య కలల నువ్వు ఒకప్పుడు జీవించిన ప్రదేశాల్ని ఒక కేకతో గుర్తుకుతెచ్చే డేగల్ని మైమరుపు విరామంలో గతమూ భవిష్యత్తూ లేని ఒక ఇప్పటి సమయంలో నింపి వేసేది ఏమిటి?

ఏమిటది? నిన్ను కృష్ణ బిలాలలోకి సుదూర నక్షత్రాలలోకీ, తడబడిన ఇతరుల కనులలోకీ ప్రతిసారీ నీలో అస్తవ్యస్తంగా అల్లుకుంటున్న పదాలలోకీ, ఒక సంజ్ఞగా ఒక శిక్షగా పరావర్తనం చెందుతున్న స్త్రీలలోకీ నిన్ను నిర్ధయగా నెట్టివేసి నీలోనే ఉంటూ నిన్ను నిర్లిప్తంగా గమనించే

సర్వవ్యాప్తమైన ఆ ఉనికి ఏమిటి? ఇక ఇదంతా అయిన తరువాత, ఇక ఇదంతా పలికిన తరువాత ఇక వ్రాయటానికే ఏమైనా మిగిలి ఉంటే, అది నీ శరీరపు చీకటి గుహలో ఇంకా మిగిలి ఉన్న, నిన్ను ముంచివేసిన నీ కలల గర్భస్రావపు శిశువు!

11 August 2010

పదాలు ఉంటాయి

పగలంతా రోదించే పదాలు ఉంటాయి. తనని దాటుకుంటూ చూడకుండా తప్పుకుంటూ వెళ్ళే మనుషుల్ని మలం వేలాడుతున్న దుస్తులతో చందమామవలె, సముద్రంపై కదులాడే చీకటి అలలవలె, ఇకిలింతలతో, కళ్ళ నిండా నీళ్ళతో, తిండికి బ్రతిమిలాడుకునే భిక్షగత్తెతో పగలంతా

ప్రయాణించే పదాలు ఉంటాయి

పదాలుంటాయి. అస్తిత్వపు అంచున ఆగిపోయే విరామ చిహ్నాలుంటాయి. పగలు పాలిపోయిన మధ్యాన్నంవైపు కదులుతున్నప్పుడు ప్రజలు ప్రార్ధనా గీతాలవలె అలసి ఇళ్ళకు చేరుతున్నప్పుడు ముఖంపై జారే నీటి బిందువుల్లాంటి పదాలు ఉంటాయి -

పదాలుంటాయి. ఎప్పటికీ సరిపోని పదాలు ఉంటాయి. ఎప్పటికీ అంతం కాని పదాలు ఉంటాయి

ఈ రాత్రి

నువ్వు నన్ను ప్రేమిస్తావా ఈ రాత్రికి
ఆమె అడుగుతుంది
నిర్లక్ష్య లక్ష్యంతో సిగరెట్ వెలిగించుకుంటున్న
తన ప్రియుడిని
నువ్వు నన్ను ప్రేమిస్తావా ఈ రాత్రికి

నేను ప్రేమింపబడి చాలా కాలం అయ్యింది
నేను నీకు ఎం కావాలంటే అదిస్తాను
would you like a blowjob?
నీకు మధువు తెచ్చి, ఆహారం వండి
మంచం సిద్ధం చేసేదా? కావాలంటే ఈ రాత్రికి
నీకు నచ్చినట్టుగానే
గదిలో కొంత కాంతి ఉండనీ కావాలంటే ఈ రాత్రికి
నీకు నచ్చినట్టుగానే గదిలో, రతిలో
కొంత హింస ఉండనీ
నువ్వేమి చేసినా నేను అడ్డుపడను
కావాలంటే ఈ సారికి sodomy కూడా సరే
కానీ నన్ను ప్రేమించు
అని ఆమె అతడిని ప్రార్ధిస్తుంది.

అందుకని అతడు పెదాల మధ్యనుంచి సిగరెట్ని
విసిరివేసి నవ్వుతాడు.
ఇక అక్కడ ఆకస్మికంగా ఆ రాత్రిలో ఆ చీకట్లో
అరిచే నక్షత్రాల వర్షం మొదలవుతుంది.
ఒక అపరిచితుడు
మరొక అపరచితుడ్ని గొంతు నులిమే వేళ్ళరాపిడిలో
స్వప్నాలతో మూత్రాలతో ప్రేమలతో
తూలిపడిన తాగుబోతులతో

మధువుకీ మంచానికీ అన్నానికీ ప్రేమకీ శాంతికీ
కాంతికీ దూరంగా
స్పృహ తప్పి పడి ఉన్న ఒక స్త్రీ కన్నీళ్ళతో
అక్కడ ఆకస్మికంగా ఒక రాత్రి అంతమవుతుంది.

ఎవరు అర్థం చేసుకుంటారు

ఎవరు
అర్థం చేసుకుంటారు

గులాబీలోని
ఖడ్ఘాన్ని

వర్షం లేనప్పుడు
కాగితపు పడవలోని
చేరిన నీటిని

తపనగా
ఖాళీ ఆకాశంవైపు
సాగిన
చేతుల్నీ

నేను
చెప్పినట్టుగా

ఎవరు
అర్థం చేసుకుంటారు

వదిలివచ్చిన
దూర తీరాల వైపు
దిగులుగా
చూస్తున్న జంతువుని

ఎన్నటికీ
రాలని నీటి చినుకుల్ని

ద్రోహం
చేయబడ్డ
స్వప్నాలను
ఒడిసిపట్టుకున్న
ఆ ఒక్క
రెండు
కనులు తప్ప?

మరొక్కసారి

నేను నిన్ను మరొక్కసారి
ఆమె వక్షోజాలతో అతడి ఊసరివెల్లి కోరికలతో స్పృశించగలిగితే
నేను నిన్ను మరొక్కసారి
తెగిన నా నాలికతో కోల్పోయిన వాళ్ళ కనులతో తాకగలిగితే
నేను నిన్ను మరొక్కసారి
నీ చమటతో వాళ్ళ శరీరాలతో శ్వాసించగలిగితే
నేను నిన్ను మరొక్కసారి
తలలు తెంపబడ్డ పూవులా నిస్సభ్దాలతో చూసి వినగలిగితే

అప్పటికి, అప్పటికి కూడా

ఈ సంధ్యాసమయం తన అద్దపు దంతాలతో
నా మణికట్టుని కొరికి
నీ హృదయపు రక్తాన్ని
నా నాభి నుంచి తాగడాన్ని ఆపలేదు.

అంటే

గాయపడటం అంటే ఏమిటి? స్వదేహంలో మునిగి
తిరుగాడటం అంటే ఏమిటి?

నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అస్తిత్వపు వేదనని
నీలో నువ్వు ఇంకించుకుంటున్నప్పుడు
నీతో నువ్వు మాత్రమే మాట్లాడుకుంటున్నప్పుడు
మత్తుభరితమైన కత్తితో
నిన్ను వెంటాడే విషయాలతో, నిన్ను వెంటాడబోయే
నియమాలతో
నిన్ను నువ్వు నింపాదిగా కోసుకుంటున్నప్పుడు
నిన్ను నువ్వు నింపాదిగా
ఖాళీ కాంతితో నింపుకుంటునప్పుడూ

ఎవరైనా ఎం చేస్తారు
నీతో నువ్వు వొదిలివేయబడినప్పుడు, విసిరి
వేయబడినప్పుడూ?

కృతజ్ఞతలు

అప్పుడే నీళ్ళు చిలకరింపబడిన మొక్కల ఊపిరికి రాత్రి పరదా కదులుతుండగా,
అప్పుడే వెలిగించబడిన వీధి దీపాల చేతులు
రాబోయే జాబిలికి నీడల శాలువా అల్లుతుండగా, అర మూసిన కళ్ళతో నక్షత్రాలు
సముద్రపు ఒడ్డున వోదిలివేసిన సూర్యుడి పాదముద్రల్ని
ఇంటి వెనుక అలసట నిండిన ఎదురుచూపుల కళ్ళతో పాత్రలని
తోముతున్న స్త్రీ తుడిపివేయడాన్ని గమనిస్తుండగా

అతడు ఇంట్లోకి అడుగు పెడతాడు. ఉదయమంతా తనతో మోసుకు తిరిగిన ఆకలితో
ఇప్పుడు గదిని నింపుతున్న
తన శరీరపు చమట వాసనతో సాక్సుల దుర్గంధంతో
తన వైపు నెమ్మదిగా కదులుతూ వస్తున్న సర్పాన్ని గమనించి, తన గూటిలోనే
ఇరుక్కుపోయి విలవిలలాడుతున్న పక్షిలాంటి కోరికతో అతడు ఇంట్లోకి అడుగుపెడతాడు.

నత్తలా మంచంవైపు సాగి, మంచంలో సమాధి అయ్యి మరణించిన వాళ్ళందరిని
వాళ్ళు తిరిగి రానందుకు ప్రార్ధిస్తూ కృతజ్ఞతలు
తెలియ చేస్తాడు. తన తల్లి ఇంట్లో ఉన్న బల్లులకూ కోళ్ళకూ కుక్కలకూ ఆహారం
వండుతుండగా, తన వృద్ధాప్యంలో కుత్తుక తెగిన బర్రెలా
మూడు కాళ్ల గార్ధబంలా తిరుగాడిన తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడు.
జిరాఫీలా ఉన్న గుడ్లగూబలాంటి మనిషితో పెళ్ళయిన తన చెల్లెలనీ,
ఇప్పటికీ ఇంటి వెనుక ఇంట్లో మరెక్కడో ఉన్న బల్లులకూ
కోళ్ళకూ కుక్కలకూ ఆహారం వండేందుకు అంట్లు తోముతున్న తన భార్యనీ
గుర్తుచేసుకుంటాడు. అలా గుర్తుచేసుకుంటుండగా, రెండు తలుపుల మధ్య,
రెండు గులాబి ముళ్ళపొదల మధ్య ఇరుక్కుపోయి, ఇంకా జీవంతో చలిస్తున్నఅతడి కోరిక
అతడికి ఒక మూలకు కూర్చుని స్కూలు పుస్తకాల ఖాళీ గోడలని చూస్తున్న
తన పిల్లల స్కూలు ఫీజుల్ని గుర్తుచేస్తాయి. పిల్లలు మాత్రం,
ఖాళీ గోడల వెనుకాల ప్రత్యక్షమవుతున్న రూపాల్ని చూస్తూ, తమ తండ్రి
మరణిస్తే బావుండుననీ, ఎందుకంటే వాళ్ళు కూడా మరణించిన వాళ్ళకి ప్రార్ధనలు చేసి,
మరణించిన వాళ్ళు తిరిగి వచ్చి, ఇంటికి వెనుక
అంట్లు తోముకుంటున్న తమ తల్లిని మరో రాత్రిలోకి ఈడ్చుకు వెళ్లనందుకు
కృతజ్ఞతలు తెలుపవచ్చుననీ ఆశిస్తారు.

10 August 2010

మృత్యుపుష్పపు రాత్రి

వేకువజూము మంచు, రాత్రి అద్దంపై మిగిలిన రక్తపు మరకలని తుడుస్తున్నప్పుడు
నేను నా నాభిని తింటున్న నీ మృత్యుపుష్పపు రేకుల్ని లెక్కపెడతాను.

ఇక తగలబడుతున్న ఈ శీతాకాలపు సమయాన్ని వెచ్చబరుచుకునేందుకు, మూడు
మేఘాల రాళ్ళ మధ్య సూర్యుడ్ని పోగేసి చితుకుల మంట పెడుతున్నప్పుడు
ఒక స్త్రీ అతడి చంకల వాసన రుచి చూసేందుకు మొదటి రాత్రి మంచం పైనుంచి లేస్తుంది.
ఆమె చుబుకమూ, వక్షోజాలూ ఆమె మోకాళ్ళ వెన్నెలపై వాలుతుండగా
ఆమె చూపులు అతడి మర్మావయపు కృష్ణపక్షపు పక్షిని అబ్బురంగా చూస్తాయి.
ఇక ఆమె తన దంతాలతో, సమయపు నత్తై, మైమరపు నిద్దురయ్యీ
అతడి నాభివద్ద నుంచి మూసిన తలుపుల కిందుగా వెలుపలికి
ప్రవహిస్తున్న ఇద్దరి వీర్యపు కలలతో, బయటకి తెరిచిన ప్రపంచంలోకి,
అనంతంలోకీ ఎగిరిపోతుంది. ఇక నేను

వేకువజాము నలుపు మంచు, అర తెరిచిన ఆమె పాలిపోయిన పెదాలపై ఒలికిన
రక్తపు మరకలని నాలికతో తుడిపివేస్తుండగా,
పుక్కిళించబడ్డ నా నిద్రలో వలయాలుగా తిరుగుతున్న నీ మృత్యుపుష్పపు
ఊపిరాడని రేకుల్ని లెక్కపెడతాను.

తపన

రాత్రిలో
పూవులుగా మారే ముళ్ళు ఉంటాయి
దేద్వీపమాన గాయాలుగా మారిన రూపాలుంటాయి
ఒక అస్పష్టపు పొగమంచు
మరొక సమయంలో వోదిలివేసినదాన్నేదో గుర్తుచేస్తూ
నెమ్మదిగా హృదయాని కమ్మివేస్తుంది.

నీ నీడ

నీ నీడని నువ్వు చేధించలేవు

నువ్వు చేయగలిగినదల్లా దానిని
కాంతి ద్వారా
ఆకలిగొన్న నక్షత్రాల చిక్కటి రాత్రి ద్వారా
విలపించే పూల ద్వారా
ఘర్జించే వర్షపు ధార ద్వారా
మెరుస్తున్న ఆకాశంపై చిట్లిన
రక్తపు జాడ ద్వారా

ఒక్క క్షణానికై, అనంతంవరకై
తుడిపివేయగలగటమే

ఎవరేనా

బాధ మధ్యలో చీకటి మధ్యలో ఎవరేనా ఒక కవిత వ్రాయగలరా

ఆహ్వానించని అతిధులు ఈ వర్షం ఈ బాధా: కలుపుతాయి తమ చేతుల్ని ఇక
ఒక మరణాన్ని ఉత్సవంలా జరుపుకునేందుకు
మరొక జీవితపు మట్టిదారిలో కోల్పోయిన జీవితాల్ని తిరిగి తెచ్చెందుకూ:

(ఎవరి మరణమో నీకు తెలుసా? నీకు తెలిసినా చెప్పకు, ఎందుకంటే
జీవించడమంటే వెడలిపోవటమే)

సూర్య కిరణాల దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆకులు
స్వేచ్చగా ఉండేందుకు విలవిలలాడుతాయి. తన కాళ్ళ మధ్య సర్పాల్లా చుట్ట
చుట్టుకుంటున్న నీడలవైపు అసహనంగా చూసే వీధి కుక్క
పిచ్చుకల గూళ్ళవంటి వేలిముద్రలను మాత్రం వొదిలి, తనను వొదిలి వెళ్ళిన
తన పాప మళ్ళా కురిసే వర్షంతోనూ, రాలే బాధతోనూ తిరిగి వస్తుందని
తన గర్భం ఒక సముద్రంలా మారేందుకు ఎదురుచూస్తున్న స్త్రీవైపు
ఓపికగా తోకూపుతూ చూస్తుంది.

(ఆ స్త్రీ ఎవరో నీకు తెలుసా? నీకు తెలిసినా చెప్పకు, ఎందుకంటే
జీవించడమంటే మళ్ళా తిరిగి రావడమే)

ఇక నీరు నీరులా ఉండటం నిలిచిపోతుంది. ఆమె ఆకుపచ్చని చిరునవ్వుని
ఒక ధార తుంపివేస్తుంది. ఒక చెట్టు తెల్లని నీడలో
ప్రజలు ఒక నిశ్శబ్దపు ఊచకూతలో గుమికూడి వాయిదా వేయబడ్డ శిక్షల్లా
జీవించే మరో రోజుకి ఎదురుచూస్తారు.
ఇక, నీరు పక్షుల కళ్ళల్లో బురదగా మారడాన్ని గమనిస్తూ ఇంటికి వెళుతున్న
పాప పారేసుకున్న పెన్సిల్ నెమ్మదిగా
విరిగిన మధుపాత్రలో వికసిస్తున్న రంగులవైపు తేలుతుంది, ఇలా అడుగుతూ:

(తిరిగి రావడమంటే జీవించడమని తెలిసిన ఎవరేనా)

బాధ మధ్యలో చీకటి మధ్యలో ఒక కవిత వ్రాయగలరా

ఈ దినం

ఈ దినం
నీటి పాదాల వెంట సాగిపోయే
దిశారహితంగా తేలిపోయే
ఎండిపోయిన ఆకు కింద కదులాడే నీడలా
అరణ్యాల నిశ్శబ్దాలలోకి రాలిపడుతుంది

ఈ దినం
అనామకమైన ఆకాశం కింద
భూమిని తన వెంట
మానవుల బలిశాల వద్దకూ
పవిత్ర మందిరాల వద్దకూ
మోసుకువెళ్ళే
గొంగళిపురుగు పాదాల మధ్య
ఇరుక్కుపోయిన
సూర్యరశ్మిని కాంచి, ఆకస్మికంగా
కనిపించని కొమ్మల
మధ్యనుంచి అరిచే
ఒక పక్షి నిస్సహాయతతో
రాలిపడుతుంది

ఈ దినం
ఒక్క దినం మాత్రమే
పిగిలి పోగలిగినట్టు
పిగిలిపోతుంది కూడా: ఉన్మాదమైన
కొయ్య గర్బాల్లా మారిన
నా కళ్ళలో
ఈ దినం ధూళిలా మారి
దేహం మైనంలా మారి
పుస్తకాల అరల మధ్య దాగున్న
శిధిలాల్లా మారి
నెమ్మదిగా సర్వమూ
రెక్కలులేని
పురుగుల్లా మారి

ఈ దినం
నక్షత్రాల నిశ్శబ్దాలలోకి రాలిపడుతుంది.

అంతిమ క్షణం

తనను తాను చంపుకుని, "చూడూ
అతడు చాలా కాలంగా సాధించలేనిది నేను సాధించాను"
అని అనటం తేలిక. కాని

ఆమె ఇంకా తలుపు వద్ద నిలబడి ఎదురుచూస్తున్నప్పుడు
"చూడూ, అతడు
ఏమీ సాధించలేదు, అతడు చేయగలిగినదల్లా
తనను తాను చంపుకోవటమే"
అని అనటం అంత తేలిక కాదు. నీకు ఇంకా ఏం తెలుసంటే

పగలు ఒక రాత్రి కణికగా మారి
ఊళ పెడుతున్న వృక్షాలకూ అరుస్తున్న నక్షత్రాలకూ మధ్య
ఊగిసలాడుతున్నప్పుడు

సమాధి పక్కగా, ఎక్కడైతే ఆ మృతశరీరం
మరచిపోబడటానికి ఎదురుచూస్తుందో, ఎక్కడైతే శరీరం ఇంకా
పచ్చిగా మృత్యువాసనతో పిగిలి అలా పడి ఉందో
అక్కడ, వాళ్లిదరూ
కురిసే వర్షంలో, ముంచి వేసే నొప్పిలో
హాయిగా, అంతిమంగా రమిస్తారు.

09 August 2010

వెడలిపోవటం

నేను విన్నాను: గాలికి ఎదురీదుతూ ఎగిరేందుకు ప్రయత్నిస్తున్న ఆ రెండు రెక్కలూ
మనకు పాలు తాపించి మనల్ని బ్రతికించి ఉంచే వక్షోజాలని
ప్రేమ అనేది కలలో వ్యాపించే ఒక పరిమళపు పదం అనీ, నేను విన్నాను. ఇంతకూ

ఆమె వచ్చిందా లేక వెడలిపోయిందా?

నువ్వు సీతాకోకచిలుకల్నీ, గొంగళిపురుగులనీ స్వప్నిస్తున్నప్పుడూ, గొంగళిపురుగుల
సీతాకోకచిలుకల స్వప్నంగా నువ్వు మారిపోయినప్పుడూ
ఒక గీతం నిన్ను తన వెంట వ్యాహాళికి తీసుకువెళ్ళినప్పుడు, నువ్వు ఎవరు? నువ్వొక
గీతంగా మారిన వర్తమానానివా లేక
వర్తమానంగా మారిన గీతానివా? వాళ్ళు ఏమంటారు? జీవించు: ఇక మనం

ఆమె కలకు ఆవలివైపున, తల్లి కలకూ ఇతరుల కలకూ ఆవలి వైపున, అనంతత్వపు కాంతిని
కొద్దిగా రుచి చూస్తాము. ఇక నేనంటావా?
ఊరికే అలా, నీలా, మృత్యువులా ఉత్తినే అలా వెడలిపోతాను.

ఉన్నది ఉన్నట్టుగా

నేను అదే మంచంపై పడుకుని ఉండగా, నువ్వు మరొక స్త్రీతో
రమిస్తావు అదే మంచంపై:

గదంతా మసక వెలుతురు. గదంతా వర్షంతో తడిసిన వాసన.
గదంతా చెట్ల మొదట్లో రాలిన
ఎండిన ఆకులు విదుల్చుతున్న పచ్చి దేహపు వాసన.

కొద్దిసేపు క్రితం, వర్షించేందుకు రెండు మేఘాలు ఒకదాన్ని
మరొకటి ఒరుసుకున్నాయి. ఇప్పుడు
ఏ మేఘం బయట లక్ష కౌగిళ్ళతో రాలిపడుతుందో
నాకు తెలీదు.
కొద్దిసేపు క్రితం, నీ నగ్న దేహంపై ఇద్దరు స్త్రీలు రెండు నల్లటి
అశ్వాలయి దౌడు తీసారు
ఇప్పుడు, ఒక స్త్రీ, కళ్ళలో మెరుస్తున్న లక్ష మెరుపుల
ఉద్యానవనాలతో నీ కింద కదులాడుతుంది.
మరొక స్త్రీ నీ పక్కగా కదలకుండా కూర్చుని, రెండు శరీరాల
వాసన కలగలిసిన నీ దేహం వైపు చూస్తుంది.

నీ దేహం ఎవరిది? నగ్నంగా కంపిస్తున్న నా దేహం
ఎవరిది?
వర్షం వెలిసి, కిటికీ పక్కగా గదిపై నుంచి పడుతున్న ధార.
ఇక నీ రెండు చేతుల్నీ చాచి
ఆమె దేహం నుంచి పక్కకు జరిగి, నన్ను నీ దేహంలోకి
లాక్కుంటావు.

ఇది ఏమిటి? నేను అడుగుతాను.
ఇది ప్రేమ. నువ్వు అంటావు. మళ్ళా వర్షం మొదలవుతుంది.
నేను నాది కాని దేహాన్ని నా దేహంలోకి తీసుకుంటుండగా
అదే మంచంపై పడుకుని ఉన్న స్త్రీ
అదే మంచంపై నువ్వు మరొకరితో రమిస్తుండగా కలలో
మాట్లాడుతుంది: "నువ్వు
ఇదే మంచంపై పడుకుని ఉండగా నేను
ఇదే మంచంపై మరొక పురుషుడితో రమిస్తాను స్వేచ్చగా,
అది కూడా ప్రేమ. "

అప్పుడప్పుడూ

అప్పుడప్పుడూ పదాలు దిగంతాలకి వెళ్ళిపోతాయి
విశ్వాలకు అవతలగా
చిహ్నాలుగా, జాడలగా మారిపోతాయి. ఇక అప్పుడు
అవేమిటో నీకు తెలీదు
భూమిపై నిలబడి, వాటిపై మళ్ళా పదాలను, నీడలను
సృష్టించడం తప్పితే
వాటి వద్దకు ఎలా వేళ్ళలో ఇక నీకేమాత్రం తీలీదు.
ఇక అప్పుడు, నువ్వు
అప్పటి దాక నిర్మించుకున్న ప్రపంచం కరిగిపోతుంది
ఇక అప్పుడు, నువ్వు
అప్పటిదాకా నిర్మించుకున్న ప్రకృతి బూడిదై
నలుదిశలా వెదజల్లబడుతుంది
నువ్వ్వు తాకబోతున్న చేయి అక్కడికక్కడే తెగి
రాలిపడుతుండగా, నువ్వు స్థాణువై
నీ పాదాల చుట్టూ, నీ పదాల చుట్టూ అలుముకుని
మట్టిలోకి ఇంకుతున్న
రక్తాన్ని చూస్తావు. ఇక నువ్వు మూగావాడివీ
చెవిటివాడివీ అవుతావు.
అవిటివాడివీ అయ్యి
తెగిపడిన నీ చేతివైపు చూసుకుంటూ, నీ వద్దే ఉండి
దిగంతాలకు వెళ్ళిపోయిన
పదాలవైపు మూగాగానూ, పాదాలు లేని కళ్లతోనూ
చూస్తావు
అప్పుడప్పుడూ, అప్పుడప్పుడూ.

తండ్రులూ, కొడుకులూ

మరణానికి ముందు
రెండు చేతుల్నీ ముఖంపై కప్పుకుని అతడు రోదించాడు.

అంతిమ ఘడియలలో
మరణం, మనం అమితంగా ప్రేమించేవాళ్ళ రూపంలో దర్శనమిస్తుందట: నీవు లేవు కానీ
నీ తండ్రి తన జీవితంలో ఎప్పుడూ రోదించలేదు, ఒక్క మరణానికి ముందు తప్ప:
అలా అని వాళ్ళు అన్నారు.
అతడి మరణానికీ
అతడి ఖననానికీ, అతడి మొదటాఖరి రోదనకీ నేను లేను. రెండు మేఘాల మధ్య
సంచరిస్తున్న సూర్యరశ్మిలా
అరచేతుల మధ్య పొదుగుతున్న కళ్ళతో, కన్నీటి అద్దంలో
ప్రతిబింబించిన, అమితంగా ప్రేమించిన, చివరి రూపం ఎవరిది?

తల్లులు తనయుల వద్ద రోదిస్తారు. మరి తనయులు ఎవరి వద్ద రోదిస్తారు?)

***

నాలుగు గోడల మధ్య నేను
నా భార్యతో గొడవ పడ్డాను. పగిలిన అద్దం
విరిగిన గాజులు, అరచేతులపై
పెదాలు ఆన్చబోయి ఆగిపోయిన పాప
చేతి వెళ్ళు ఆమె కళ్ళు.
మొండి గోడలు ఇక శిలువ వేయబడిన ఆమె
నాలిక రక్తంతో తడుస్తాయి.

***

సమాధిపై
నెమ్మదిగా పరుచుకుంటున్న చీకటిలో
మొలకెత్తిన చిరుమొక్కని
ఎవరి కనులు పలుకరిస్తాయి?
ప్రేమ అమితంగా ప్రేమించేవాళ్ళతోనే
మరణిస్తుందట: నువ్వు లేవు కానీ

జీవితంలో నేను ఎప్పుడూ రోదించలేదు ఒక్క నిన్ను ప్రేమించిన తరువాత తప్ప:
అలా అని ఆమె అంది.

***

చెప్పని నిశ్శబ్దం ఒకటి ఉంటుంది
తాకని సముద్రం ఒకటి ఉంటుంది
కురవని నయనం ఒకటి ఉంటుంది

భర్తను స్పర్సించని భార్య చేయి ఎప్పుడూ ఒకటి ఉంటూనే ఉంటుంది. తండ్రిని తాకలేని
తనయుడి నిస్సహాయత ఎప్పుడూ ఒకటి ఉంటూనే ఉంటుంది. కానీ
వృక్షాలకు ఆవలగా మేఘాలు లేకుండా నిరంతరం కురిసే వర్షాన్ని ఎవరి కనులు చూస్తాయి?

(భార్యలు భర్తల వద్ద రోదిస్తారు, మరి భర్తలు ఎవరి వద్ద రోదిస్తారు?)

***

తెల్లవారుజామున, ఇంటి బయట
అతడు తన మొదటి ప్రియురాలు అయిన మాజీ భార్యతో గొడవ పడ్డాదు.

ఉచితంగా వచ్చే ప్రదర్సన అని
చూసేందుకు పదిమందీ ఎగబడ్డారు:
అతడు మౌనంగా నిలబడి చూస్తుండగా, ఆమె వెక్కిళ్ళు పెడుతుంది
అతడు మౌనంగా కదిలి గదిలోకి వెల్లిపోతుండగా, ఆమె అక్కడే
కూర్చుని రోదిస్తుంది: తెల్లవారుజామున పదిమందీ
పాలుపంచుకునే ఉచిత జాతర కనుక, ఆమె రోదిస్తూనే ఉంటుంది
ఇక రాబోయే సమయమంతా కళ్ళపై ముళ్ళ కిరీటాలతో
చెవులలో శిలువలని మోసుకుంటూ గడపాలి.

***

ప్రతి ఒక్కడి దు:ఖం
మరొకడు పగలంతా ఎదురుచూసే
వినోదాత్మక కార్యక్రమం.
సమాధిలో
చీకటిలో మొలకెత్తి పుష్పించి చీకటిలోనే
రాలిపోయిన మొక్కను అమావాస్యనాడు
ఏ చేతులు తాకుతాయి?

మరణం అమితంగా ప్రేమించే వాళ్ళతోనే మొదలవుతుందట.
నువ్వు లేవు కానీ

నేను ఎప్పుడూ మరణించలేదు, ఒక్క ప్రేమించిన తరువాత తప్ప: అలా అని
అతడు చెప్పలేదు
చివరి చూపు దక్కిందా అని ఆమే అడగలేదు.

***

చూడని సత్యం ఎప్పుడూ ఒకటి ఉంటూనే ఉంటుంది
వినని గీతం ఎప్పుడూ ఒకటి ఉంటూనే ఉంటుంది
పీల్చని గాలి ఎప్పుడూ ఒకటి ఉంటూనే ఉంటుంది

అతడిలోని మరో ప్రపంచం చూడని ఆమే, తనయుడిని ప్రేమించలేని తండ్రి ప్రేమా
ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ
భూమికి అవతలగా మేఘాలకు అవతలగా పగటి పూట నిరతరం ప్రకాశించే
జాబిలిని ఎవరి ఓదార్పులు అందుకుంటాయి?

(ప్రియురాళ్ళు ప్రియుల వద్ద రోదిస్తారు, మరి ప్రియుళ్ళు ఎవరి వద్ద రోదిస్తారు?)

***

మరణానికి ముందు
రెండు చేతుల్నీ ముఖంపై కప్పుకుని అతడు రోదించాడు.
అంతిమ ఘడియలలో
మరణం, అమితంగా కోల్పోయిన వాళ్ళ రూపంలోనే దర్శనమిస్తుందట. నువ్వు లేవు కానీ
నీ తండ్రి తన జీవితంలో ఎప్పుడూ రోదించలేదు, ఒక్క మరణానికి ముందు తప్ప:
అలా అని వాళ్ళు అన్నారు.
రెండు వృక్షాల మధ్య సంచరిస్తున్న
సీతాకోకచిలుకల్లా, అరచేతుల మధ్య పిగులుతున్న కళ్ళలో, కన్నీటి తటాకంలో
కన్నీటి బొట్టులా, వీడ్కోలు చిరునవ్వులా కదులాడిన, అమితంగా కోల్పోయిన రూపం ఎవరిది>

(తల్లులు తండ్రుల వద్ద రోదిస్తారు, మరి తండ్రులు ఎవరివద్ద రోదిస్తారు?)
*