నేను ఇంకా నిదురించలేదు. ఇంకా ఈ క్షణం నేను జీవంతో చలిస్తూ ఉండేందుకు కారణమొకటి ఉంది.
మరెక్కడో చందమామ వేపచెట్ల కొమ్మల మధ్య దాగుడు మూతలాడుతుంది. ఆకాశం ఒక సంద్రంలా
వెన్నెల పుప్పొడితో నిండిన ఒక సముద్ర తీరంలా ఎంతగా విచ్చుకుని ఉందంటే
ఇక ఈ పూటకి నిదురించటం సాధ్యం కానే కాదు. వీటన్నిటికీ తోడుగా రాత్రి అత్తరు చిరు పరిమళానికి
తోడుగా, నా రక్తం ఈ వేల ఒక ఆదిమ సంగీతంలా ప్రవహిస్తుంది. ఈ పూట నేను ఒంటరిగా ఉన్నాను
ఇంకా ఈ క్షణం ఎంత నిండుగా ఉందంటే, ఇక జననం మరణం పెద్ద విషయాలు కానే కావు.
ఈ క్షణం ఎంత సంపూర్ణంగా ఉందంటే, ఇక ఎవరికీ తెలీదు
ఇది స్వప్నమో లేక మరణాంతరం కంచె ఒక కాంతి ప్రపంచమో. నా పక్కగా
ఈ విశ్వపు శ్వాస లయ, మరో పక్కగా నా కొడుకు స్వప్నాల దయ
ఇద్దరినీ గోరువెచ్చగా ఆలింగనం చేసుకుంటున్న నా స్త్రీ పురాతన సముద్రపు అలల ప్రేమ లయ.
రెండు రెక్కల మధ్యగా, రెండు సముద్రాల మధ్యగా, రెండు పరిమళాల మధ్యగా ఇరుక్కుని ఊయలలూగుతూ
ఎక్కడనుంచీ మొదలు కాని, ఎక్కడా అంతం కాని ఒక జోలపాటను వింటున్న ఒక మనిషి ఉన్నాడు ఇక్కడ.
భూమి గుసగుసలను వింటూ, మన స్వప్నాలలో మనల్ని వెంటాడే
ఒక దేవత వొదిలివేసిన చిహ్నాలని అనువదించుకుంటూ, మళ్ళా మళ్ళా తిరిగి వచ్చే ఒక తపన యొక్క
ఆధారాలని వెదుకుతూ ఒక మనిషి ఉంటాడు ఇక్కడ.
నిజానికి ఒక పదం అవసరమా? నిజానికి ఒక చిహ్నం అవసరమా? ఆ ముఖం వైపు చూడు.
ఇతరులని ప్రతిబింబించే తన ముఖం. ఇంకా
నేను ఇక్కడ ఉన్నాను. నువ్వూ ఇక్కడ ఉన్నావు. ఇతరులు, ఇతరేతరులూ ఇక్కడ ఉన్నారు.
మనం ఉన్నాం ఇక్కడ. మనం ఉన్నాం. మనం ఉంటాం. ఇప్పటికీ. ఎప్పటికీ. ధన్యవాదాలు.
నేను ఇంకా నిదురించలేదు. ఇంకా ఈ క్షణం నేను జీవంతో చలిస్తూ ఉండేందుకు కారణమొకటి ఉంది.
No comments:
Post a Comment