ఒక శబ్దపు తునక విస్తృతమైన రంగుల వలయాలుగా
నలుమూలలా అక్కడ వెదజల్లబడినప్పుడు
నువ్వు అడుగుతావు విస్మయంగా: "రంగులా?" ఆమె
బదులిస్తుంది, "అవును. హింసయొక్క
ప్రేమయొక్క ఎదురుచూపుల రంగులు. అవి వలయాలు."
ఇక ఇద్దరి మధ్యకూ, తన అరచేతులలో ఒక సముద్రాన్నీ
తన కనులలో ఒక విశ్వాన్నీ పొదుపుకున్న
పిల్లవాడొకడు తడబడే రంగులతో వస్తాడు.
"ఈ చిన్ని నీటిగుంటను నువ్వు ఎలా దాటుతావు?
ఈ చిన్ని మట్టి దారిని నువ్వు ఎలా దాటుతావు?"
అతడు నవ్వుతాడు. ఆమె నవ్వుతుంది. ఇక
ఇద్దరి వదనాలకు పైగా ఒక ఇంద్రధనుస్సు వికసిస్తుంది.
అతడి ముఖం ఒక ఎడారి.
ఆమె ముఖం ఒక వర్షపు పూల రంగుల ఉద్యానవనం.
"ఎడారి సూర్యుడు ఆలపించే వేదన గీతం" ఆమె అంటుంది.
"వర్షం, పూలు ఆలపించే జీవిత గీతం" అతడు అంటాడు.ఇక
జీవితానికీ జీవించడానికీ మధ్య ఒక అస్తిత్వం, స్మృతితో
మధువుతో తడిబారిన పెదాలతో ఆగిపోతుంది.
ఆ తరువాత ఆమె అతడి బాహువులలో వొదిగిపోతుంది:
అది ఒక జోలపాట.
ఆ తరువాత అతడు ఆమె వక్షోజాలలో వోదిగిపోతాడు:
అది ఒక విస్మృతి ఊయల. ఇక ఆ తరువాత
నక్షత్రాలతో నిండిన రాత్రి మనుషులపైకి చొచ్చుకు వచ్చినప్పుడు
అతడు భాష లేని పదాలతో శబ్ధిస్తాడు .
ఇక ఆ తరువాత నక్షత్రాలు లేని నల్లని రాత్రి
పూల రంగులను పొదివి పుచ్చుకున్న పిల్లలలపై రాలిపడినప్పుడు
ఆమె జీవితం రక్తం ఓడుతున్న సంజ్ఞలతో మాట్లాడుతుంది.
అద్దం ప్రతిబింబించే అద్దంలో ఇరువురూ నయనాలు
ప్రతిబింబించే నయనాలతో అడుగుతారు:
"అంతేనా? జీవితమింతేనా? అంతే అయితే, ఇక ఏమీ వద్దు.
ధన్యవాదాలు." ధన్యవాదాలు.
జాబిలీ పై జాబిలీ, పదాలపై పదాలూ, గాలిలో పూలూ, పూలలో
ముళ్ళూ, ముళ్ళపై పెదాలూ, పెదాలపై
ఒక్కటయ్యేందుకు ముగ్గురిగా మారిన ఇద్దరూ కరిగిపోయే రాత్రిలో
ఒక శబ్దపు తునక విస్తృతమైన రంగుల వలయాలుగా
నలుమూలలా అక్కడ వెదజల్లబడినప్పుడు
అందరూ ఒక నిశ్సబ్ధపు ఆలయంలో
తెల్లటి పూల ముందు మోకరిల్లుతారు.
చాలా చాలా బాగుంది... ఒకటికి రెండుసార్లు చదవాలనిపించేలా.
ReplyDeleteమీ భావుకతకి అభినందనలు.