వేకువజాము నాలుగు గంటలకు పెద్దగా చెప్పటానికేమీ ఉండదు, కాకపోతే
ఒక గీతం ప్రాణం పోసుకుని నెమ్మదిగా
కలలో కాంచిన ఒక పసుపుపచ్చ పిట్టై కాసేపలా ఎగిరి ఆపై నెమ్మదిగా ఒక
ఒంటరి తెమ్మరెలా మారి
ఒంటిరిగా కూర్చున్న ఒక ఒంటరి ఒంటరి మనిషిని జాలిగా తాకుతుంది. ఇక
బయట ఆకుపచ్చని చెట్లపై నారింజ రంగు కాంతి జల్లై కురుస్తుంది, ఎందుకంటే
ఒక గంట తరువాత ఈ దారి వెంట తన మనవరాలు లేకుండా ఒంటరిగా నడిచే
మనిషి, కొమ్మల మధ్య దాగున్న మార్మిక పక్షుల కలలనూ
ఒంటరి సాలీళ్ళ గూళ్ళ నాదాలనూ వినవచ్చు, ఎందుకంటే అతడు గూళ్ళలోంచి
రాలిపడిన పసుపుపచ్చ పిచ్చుక పిల్లలను
అరచేతులలోకి తీసుకొని ముద్దాడి, అవి ఆకాశపు పూవు చుట్టూ తిరుగాడే
సీతాకోకచిలుకలలుగా మారడాన్ని విబ్ర్రమం నిండిన నయనాలతో చూడవచ్చు.
ఎందుకంటే అతడు సంవత్సరాలుగా తను తన పిల్లలకై, ప్రియురాళ్ళకై చిందించిన
రక్తపు బొట్లను లెక్కపెట్టుకుంటూ మనస్సులో మరోసారి
ఇలా మననం చేసుకోవచ్చు: నిజానికి వేకువజాము నాలుగు గంటలకు
చనిపోడానికి సిద్ధంగా ఉన్న మనిషికి చెప్పటానికి పెద్దగా ఏమీ ఉండదు
No comments:
Post a Comment