30 May 2012

అలసి వచ్చిన

అలసి వచ్చి
ముఖాన చెమటని తుడుచుకుని
----గూటిలో దీపం వెలిగించుకుని

రాత్రిలో ఒక్కడే
బియ్యంలో వేపాకులు ఏరుకుని
--ఇంత అన్నం వొండుకుంటాడు

అతను: ఏదో ఆలోచనలో
-స్నానానికై తెచ్చుకున్న
తువ్వాలుని తలకు చుట్టుకుని

మట్టి కుండలోని నీళ్ళు
-కడుపు నిండుగా తాగి
మంచంపై ఒరిగిపోతాడు

అలాగే అతను: యిక నేను
ప్రత్యేకంగా చెప్పాలా మీకు

-----శరీరాన్ని తుడుచుకున్న
గరుకైన ఆ ఎండిన తువ్వాలూ

ఏరుకుని వొండుకున్న అన్నమూ
హృదయం నిండుగా తాగిన నీళ్ళూ

మెత్త లేని మంచమూ
అలసి ఆరిన దీపమూ

దయ లేని నిదురా
ముళ్ళ మెలుకువా

అంతా అన్నిటా
-----ఆమే అని?

29 May 2012

కోత

...నిన్నటి ఈ రాత్రిలో

ఆ వాగు మలుపులో
పచ్చిగడ్డి నీళ్ళ అంచులలో వంకీలు తిరిగిన చందమామ

-పగటి కాటులో
చతురస్రంగా తెగి
ఆకాశపు ఇనుప చువ్వలకు పైగా వడలి
మెలికలుగా రాలిపోయిన ఒక తనూ లత

- రెండు గంటల
రెండు బాకులు

శిరస్సున దిగబడి
నలుచదరపు అంతస్తుల ముందుగా
కాలంతో స్పృహ తప్పిన
అంతిమ చరణాల ఒక ఆదిమ అమ్మ

గుండెలో కోత
గర్భంలో కోత
ప్రేమ ఊచకోత
ఎదురుచూపు
నిండిన కళ్ళలో ఎంతకూ ఎదురు రాని
రెండు కనుల
రంపపు కోత -

-చేయగలిగినది
ఏమీ లేదు యిక

నీ శరీరపు పాత్ర నిండా
--నీళ్ళు ముంచుకుని
నలుగురికీ పంచేందుకు

మొండి నవ్వుతో
నువ్వు వెళ్ళడం
-------------తప్ప

చీమతో చిన్నవాడు

తన రెండు చేతి వేళ్ళని
రెండు చక్రాల్లా కదుపుతో

ఆ నేలపై పాకే
చీమ వెనుకగా
పరిగెడతాడు పసివాడు తన లేత చేతివేళ్ళతో-

తన కళ్ళంతా రంగులు
తన వొళ్ళంతా
ఆ మెరుపులు

తెరుచుకున్న తన
సున్నా నోటి నుంచి
నేలపై రాలే లాలాజలపు జల్లులూ విశ్వ గీతాలూ -

చీమ వెనుకగా కాసేపు
చీమ పక్కగా కాసేపు
చీమ ముందుగా ఆగి
నేలపై పడుకుని చుబుకాన్ని తన ముంజేతులపై ఆన్చుకుని
దాని ప్రపంచాల్ని విప్పారిన కనులతో చూసుకుంటూ కాసేపు-

-ఏం చెప్పను యిక

-తమ లోకాలని చంపుకోక

ఇష్టంగా కాలాన్ని గడపటం
అలా ఆడుకోవడం
--పిల్లలకే తెలుసు!

కవీ

పాపం ఎంతో ప్రయత్నం
ఏదో రాద్దామనీ, ఎవరినో తలదన్నుదామనీ ఎవరినో ఓడిద్దామనీ -

పొద్దున్నే స్నానం చేయించి
దుస్తులు వేసి, పాపిడి తీసి
చక్కగా తల దువ్వి శింగారించి బయటకి పంపిద్దామనుకుంటావే నీ పదాల్ని పిల్లల్లా

మరచిపోయావా నువ్వు
నెత్తి నిండా దుమ్ము పోసుకుని దుస్తుల్ని చించుకుని ఎండల్లో వానల్లో నీడల్లో దారుల్లో
-జుత్తు చెరుపుకుని
నిండా ఇకిలింతలతో
తోటి పిల్లలని నాలికలతో వెక్కిరించడమే పిల్లలకీ పదాలకీ ఇష్టమని?

కవీ ఇంతా చేసి నువ్
ఉదయాన్నే వేప పుల్లతో నోరు శుభ్రం చేసుకోవడం మరచిపోయావ్ కానీ

-యిక నీకూ నాకూ, తనకూ
రాస్తూ ఎండిన నీ ముఖానికీ

అద్దంలో అలసిన
--నా ముఖానికీ
ఏదీ జగతి? ఏదీ గతి?

వానా కాలం

ఆకాశం మబ్బు పట్టి

ఆ పిల్లల ముఖాల్లో
చల్లటి గాలీ తుంపర

కళ్ళ నిండుగా
మెరూస్తూన్న
స్కూలు లేని
ఇకిలింతా, దోబూచులాటా -

యిక నీకు తెలుసు
ఈ వానా కాలం
ఎలా ఉండబోతుందో!

28 May 2012

గూడు

పావురం పిల్లలు
బయటకి వచ్చాయా నాన్నా? అని అడుగుతారు

రోజంతా ఎదురుచూసే పిల్లలు
చిట్టి పావురాళ్ళని చూద్దామని-

అయితే

అప్పుడే బయటకి వస్తుంటావు నువ్వు
నేలపై గూటి కింద రాలిపడిన
ఆ పావురాళ్ళ చితికిన గుడ్లని
ఒక బట్టతో శుభ్రం చేసీ నీళ్ళతో తుడిచీ-

యిక దూరంగా
ఆ రాతి రాత్రంతా
ఆకాశమంతా గదంతా పావురాళ్ళు చేసే బ్లుర్ బ్లురుర్ మనే ఎక్కిళ్ల శబ్దాలు

యిక ఎలా నిదుర పోతారు
యిక ఎలా నిదురపోగలరు

రెక్కలు ఆ విరిగిన పిల్లలు?

తను అడిగినది

తల్పమొక
నిన్ను చుట్టుకునే ఒక వంకీల త్రాచు అయిన నాడు

శరీరమొక
నిన్ను తలచుకునే ఒక పచ్చి పుండు అయిన నాడు

పగలూ
రాత్రీ, నిన్ను వేటాడే క్రూర మృగాలు అయిన నాడు

అద్దంలో
నీ ముఖం ఒక పుర్రెలా ప్రతిబింబించిన నాడు

మనుషులు
కదిలే సమాధుల వలె నీకు తోచిన నాడు, ఆనాడు

నువ్వేం చేస్తావు? నువ్వెలా నిదురోతావు?