30 April 2011

అ/జ్ఞానం 12.

ఒక చిన్న మాట

అందరికీ, కలసిన
వారందరికీ
నిన్ను కలిగిన
వారందరికీ చెప్పు


తిరగని పదాలు
తిరుగబడిన పదాలు
వెనుదిరిగిన పదాలు
తిరిగిన పదాలు

ఈ క్రింది వారివి:

(...........................
............................)

((ఎవరివి?))

=సరస్సు అంచును
తాకి వెళ్ళే
అలలను తాకని
కొంగ

నీ నిద్దురలోకి వొంగి
తొంగి చూసే కాకి

పరిహసించే
నిలువ నీడలేని
వానరం

ఆ పై వారివి:


(( పదాలు, అద్దాలతో
హెచ్చువేయబడ్డ
పదాలు

వాళ్ళవే))

29 April 2011

అజ్ఞానం 11.

అసాధ్యమిది

అద్దమేదో, నీ వదనమేదో
కనుగోనలేను

చూపేదో, చూసే
ప్రతిబింబమేదో

పరివర్తనమేదో

తెలుసు
కొనలేకున్నాను
అలసి/పోయి
ఉన్నాను:

మృత్యుపాత్రతో
నీళ్ళు వొంపు

నిలకడలేని
ఈ బాటసారికి=

అ/జ్ఞానం 10.

సరళమైన ఒక సత్యం

ఎవరితో చెప్పకు
ఎవరితో విప్పకు

బాటసారికి
ఎడారిలో దాహార్తికీ

జలాశయం
జీవన్మరణ వలయం:

ఇతరులకీ, స్త్రీలకీ
అది మరచిపోదగ్గ మోహ
పూరితమైన ఆహ్వానం:

సత్యపు సరళత్వంలో
అతడు మోహితుడై
మోసపూరితుడై

ఇక్కడే, ఈ పదాల మధ్యే
యుగాలుగా
చనిపోయాడు.

ఏమిటిది? అ/జ్ఞానం 9.

మరణించడమెలాగో
తెలుసునా?

వెళ్ళిపోతున్నాను.
వీటన్నిటినీ
వదిలి

నాతో రా.

27 April 2011

అ/జ్ఞానం 8.

పెదాలపై ఎడారులు
వ్యాపించినాయి

గొంతులో బాకులు
దిగబడినాయి

కదలలేకున్నాను
పలుకలేకున్నాను

జ్వరపీడిత దేహాన్ని
ఒకప్పుడు నువ్వు
పొదివిపుచ్చుకున్న

సమయాన్ని
మరువలేకున్నాను
:
నా నుదిటిపై
రాత్రుళ్ళలో నీవు
తడిగుడ్డగా
మారిన

నీ స్పర్శను
ఇంకా వీడలేకున్నాను
ఇప్పుడు
నిలువ నీడలేకున్నాను:

కొద్దిగా వొంచు
మరెక్కడినుంచోనైనా

ఈ నేరస్థుడి పెదాలపై

కొంత రక్తాన్నైనా, లేక
నీ కన్నీళ్ళనైనా=

అ/జ్ఞానం 7.

ఏదీ నీ అరచేయి?

కళ్ళు
రాళ్ళుగా మారినాయి

నుదిటి లోపల
ఒక అగ్నిగుండం
జ్వలిస్తోన్నది

ఈ శరీరం
ఒక విషవలయమై
రాలిపోతున్నది

చల్లటి చినుకులకై
తపించిపోతున్నది

చెప్పలేదా నేను
నీకు

నీ అరచేతులలో
జలపాతాల గాలి
దాగి ఉన్నదని
అరణ్యాల శాంతి
నిండి ఉన్నదని?

చనిపోతున్నాను.

దయచేసి
కరుణతో నా నుదిటిపై
నీ అరచేతిని ఆన్చి
బ్రతకించుకో
నన్ను కొంతకాలం

26 April 2011

అ/జ్ఞానం 6.

ఒక కవితను
ఎలా అంతం చేయాలో
నీకు తెలుసా?

ఇలా.

అ/జ్ఞానం 5.

ఒక చిన్న మాట
ఎవరితో
చెప్పకు

ఎవరైతే లేరో
ఎవరైతే అద్దాల్లోంచి
మృత వదనమై

నిన్ను చూసి
నవ్వుతారో

ఎవరైతే
నీ కలలలోంచి
చేతిని చాపి
నిన్ను

ఉలికిపాటుతో
లేపుతారో

ఎవరికోసమై
నువ్వు

ఎవరూ లేక
తపిస్తావో

ఆ ఒక్కరిని
నేనే చంపాను:

ఎవరితో
చెప్పకు

ఇవి
మృతులకు
మాత్రమే
చెప్పే
పదాలు

అ/జ్ఞానం 4.

ఒకప్పుడు ప్రేమింపబడ్డాను
ఆమె చేత:

తను నా శరీరంలో నాటుకుని
ఏపుగా ఎదిగింది

తను నన్ను ఒక చక్కటి తోటగా
ఊహించింది

తోటమాలి లేక, నన్ను అల్లుకున్న
లతలకు నీరు వంపలేక

ఆ ప్రదేశం, ఆ దేహం
శ్మశాన వాటికగానూ, సమాధుల
తోటగానూ మారింది-

అవును, ఒకప్పుడు
ప్రేమింపబడ్డాను ఆమె చేత

నాలో వేళ్ళూనుకుని
దిగంతాలకు వ్యాపించిన లతలకు

పూసిన పుష్పాలు ఎక్కడ?

అ/జ్ఞానం 3.

ఎలా విసుగించాలో ఆమెకు బాగా తెలుసు

ఆ కళను నా వద్దే నేర్చుకున్నానని
నా వద్దే పదును పెట్టుకున్నాననీ తను వివరించింది

ఒకసారి మోహించానని అనుకున్నందుకు
ఇప్పుడు నేను మూగవాళ్ళ రాజ్యానికి

ఎదురులేని అధిపతిని=

అ/జ్ఞానం 2.

ముద్దుపెట్టుకోవాలి
ఆమెను

ముద్దుపెట్టుకోమని
ఆమెతో గడపమనీ

చెప్పారు అందరు
ఆమె కళ్ళు చెదిరే

సౌందర్యవతి అనీ:

ఎవరూ చెప్పలేదు
ఆమె నాతో కొంత సమయం
గడిపి వెళ్ళాక

నా తలలో, దిండుపై
తిరుగాడే
పేనుల గురించి:

ఎటువంటి ప్రేమని
పిలుద్దాం దీనిని?

అ/జ్ఞానం 1.

ఒక చిన్న మాట
ఎవరితో చెప్పకు

కుదురుగా కూర్చున్న కప్పలు
కదురుగా లేని మిత్రులూ

రాత్రిళ్ళలో, అరుపులై
ఆపై వర్షం చినుకులై

నీపై రాలుతున్నప్పుడు
నువ్వైతే ఏం చేస్తావ్?

25 April 2011

ఎవరూ రారు

ఎవరూ రారు

వెన్నెల్లో, పూలల్లో
వెన్నెల పూలతో
ఎవరూ రారు

ఎదురు చూడకు

ఇక నీకు
చక్కగా నిదురించే కళను
అభ్యసించే తరుణం
వచ్చింది

లోపలికి వెళ్ళు

పచ్చటి ముల్లుతో
రక్తపు దారంతో
కనురెప్పలను
కుట్టుకో

ఎందుకంటే మరో పగలు
త్వరితంగా నీపైకి దూసుకు వచ్చే
సమయం ఆసన్నమయ్యింది

నా వద్దకు రాకు

నా వద్దకు రాకు

ఉన్నాయి నా వద్ద రెండు పదునైన బాకులు:
అవి నీ హృదయం, నా పదాలు=

ఏమైనా చేయవచ్చును నేను

నిన్ను ఒక అద్దంగా మార్చి నన్ను
నేను చూసుకోవచ్చును
నిన్ను ఒక సరస్సుగా మార్చి నేను
ఒక నల్ల చేపపిల్లనై
అందులో తిరుగాడవచ్చును
నిన్నొక బంగారు రంగు చేపపిల్లని చేసి
నేనొక వలతో సిద్ధంగా
ఉంది ఉండవచ్చును

ఏమైనా చేయవచ్చును నేను

నిన్నొక ఉద్యానవనంగా మార్చి
నేనొక తోటమాలినై తిరుగాడతుండవచ్చు
నిన్నొక సీతాకోకచిలుకగా మార్చి
నేనొక బాలుడినై
నీ రెక్కలని విరిచి పట్టుకునేందుకు
ఎదురుచూస్తుండవచ్చు
నిన్నొక తెల్లటి కాగితం చేసి
వంకర టింకర గీతాలతో, రంగులతో
నిన్ను చిత్రిస్తుండవచ్చు
ఆపై నిన్ను ముక్కలు ముక్కలుగా
చించివేస్తుండవచ్చు
నిన్నొక కాగితపు పడవని
చేస్తుండవచ్చు
నీది కాని వర్షపు నీటిలో నిన్ను
వదిలివేస్తుండవచ్చు
కుదుపులతో
కురిసే వర్షపు చినుకులతో
ఎలాగోలాగ సాగుతున్న నిన్ను
పాదాలతో తొక్కివేస్తుండవచ్చు

నీపై పూలు రాలుస్తుండవచ్చు
నీ ఒడిలో పుడమి
పున్నమై మెరుస్తుండవచ్చు
వెన్నలని చుట్టుకున్న నిన్ను
చీకటితో నింపి
నీ రక్తాన్ని చిందిస్తుండవచ్చు

ఏమైనా చేయవచ్చు నేను

నా వద్ద రెండు పదునైన
బాకులు ఉన్నాయి కనుక
అవి నీ హృదయం
నీ ప్రేమా అయ్యాయి కనుక

ఏమైనా చేస్తుండవచ్చు నేను


రాకు నా వద్దకు=

23 April 2011

నల్లటి హృదయం

ఒక నల్లటి హృదయం గురించి మీకు చెబుతాను

నల్లటి నలుపు నలుపై తెల్లగా మారిన హృదయం:
మృత శిశువువంటి, వేకువ మంచువంటి
ఆగిపోయిన ఆ తల్లి కన్నీటివంటి తెల్లటి హృదయం:

అతనెప్పుడూ ఇలా లేడు:

వర్షం కురిసే రోజులలో గడ్డిలోనూ, గెంతే పిల్లలతోనూ
వర్షం కురియని రోజులలో దాహార్తులతోనూ
వెన్నెల విరిసిన రాత్రుళ్ళలో రక్తం చిందించే స్త్రీలతోనూ
గర్భస్రావాల అశ్రువులతోనూ
చీకటి ముసిరిన రాత్రుళ్ళలో
వెన్నెలను రాజేస్తున్న స్నేహితులతోనూ శత్రువులతోనూ

ఎవరూ లేని కాలాలలో తనతో తానుగా
ఇన్ని పదాలను పుచ్చుకుని
బావిలోని చందమామను తోడుతూ
అతడు ఆనందంగానే ఉన్నాడు

అతడి హృదయం పచ్చగా, బలమైన గాలికి జలజలా పొర్లే
రావి ఆకుల సవ్వడిలా, సాయం సమయాన
మిమ్మల్ని చిరునవ్వుతో తాకిన మీకు నచ్చిన వదనంలా
అతడి హృదయం మిలమిలలాడుతూనే ఉండింది

అతడు ఉన్నాడు ఆ కాలాలలో: అతడు అతడికీ
అందరికీ బ్రతికే ఉన్నాడు ఆ కాలాలలో: అన్నీ మిశ్రమమై
కలిసే వసంత సమయాలలో
అతడు ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు.
అతడు ఖచ్చితంగా ప్రేమించే ఉన్నాడు.

కలలు నలుపు కాక మునుపు, ఆ వదనం అస్థిత్వపు
దీపపు కాంతిలో దాగిన నల్లటి చారిక కాక మునుపు
పదాలకు మునుపూ,పదాలకు తరువాతా కదులాడే నల్లటి
విశ్వవలయంలోకి జారక మునుపు
శరీరం స్వయంప్రకాశితమై, జ్వలనమై దిగంతాలలోంచి జారే
ఒక నలుపు జలపాతం కాక మునుపు

అతడు ఖచ్చితంగా హృదయం కలిగే ఉన్నాడు
అతడు ఖచ్చితంగా కదులుతూనే ఉన్నాడు. అటువంటి అతడు

ఒక నల్లటి హృదయమై, నల్లనవ్వడంలో హృదయం లేనివాడై
నలుపు నలుపై, మృతనయన మంచు తెమ్మరుల తెలుపై
శిధిలాలపై గడ్డ కట్టిన నీటి చుక్కై, సమాధుల మధ్య
సమాధులలో తిరిగే నల్లటి రాత్రై, మృతులతో
మృత్యువాహక క్షణాలతో

గూడు లేక, దేశం లేక, దేహం లేక పదం లేక
ఇతర పద్మం లేక, నలుపు రెక్కలతో తెల్లటి కళ్ళతో
ఎక్కడికి ఎగిరిపోయాడో మీకు ఏమైనా తెలుసా?

20 April 2011

ఉన్మాదం/అందం

ఎప్పటికీ, ఎప్పటికీ ఊహించకు నువ్వు
విరామం గురించి, నిన్ను పొదివిపుచ్చుకునే
ఒక శాంతి గురించి, నువ్వు
నిశ్చింతగా నిదురించగలిగే రాత్రి గురించి=

((విసుగు విసుగై, విభ్రమం లేని కాలమై
అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు:
విగ్రహాలకూ, విశ్వాసాలకూ
తల ఒగ్గలేక అతడు
తనను తాను ధ్వంసం చేసుకునేందుకు
ప్రయత్నించాడు. బానిస భాష కాలేక
ఇతరులను అనుకరించలేక
అతడు నిష్క్రమించేందుకు ప్రయత్నించాడు.))

= అతడిని అలా ఎలా వదిలివేయగలం
మనం: మనం. అతడి
ఆదీ అంతం అయిన మనం. అతడి
ఆదీ అంతం చూడాలనుకున్న మనం?=))

మృత్యుదయా
హృదయ
వలయా విషం:

కల ౧.


కనులు కొడగంటి, పదాలు అడుగంటి
పిగిలి పోయిన దారులలో
దాహార్తులతో చీకట్లలో పదాలనే
అడుక్కునే బిక్షువు అతను. అతడు
స్వప్నించాడు:

కొమ్మలపై పక్షులను, పక్షులపై
మేఘాలను
మేఘాలపై పరుచుకున్న శూన్యంలో

కంపించే ఒక విశ్వతరంగాన్ని.
విశ్వతరంగంలో వికసించిన ఒక గులాబీ
రంగురంగుల అంతరంగాన్ని.

అతడు స్వప్నించాడు.
అతడికి తెలియదు
తాను కలలో పక్షిగా మారాడో లేక
ఒక పక్షి కలలో తానుగా వెళ్ళాడో
ఇదంతా ఒక వలయమో:

కల ౨.

ఓటమి లేని ఓటమి లేదు. ఓటమిని
మించిన మృత్యువు లేదు.
అందరూ ఆశిస్తున్న కృతజ్ఞత లేక
అందరి కోసమో, కొందరి కోసమో
జీవించలేక అతడు

తాను వలచిన పదాలలో
తాను మలచిన పదాలలో
తనను వంచించిన
పదాల పద్మవ్యూహాలలో
తనని తాను దాచుకున్నాడు.

(( ఎలా మరచిపోగలం మనం?
ఎలా వదిలివేయగలం మనం?
అతడి జననాన్ని మరణంగానూ
అతడి మరణాన్ని జననంగానూ
ప్రచారం చేద్దామనుకున్న మనం
ఎలా వదిలివేయగలం మనం?))

కల ౩.

ప్రతిదీ ఒక చిహ్నం.

నీడలు నీ నిరీక్షణకు మార్గాలు
ఎవరూ లేని
ప్రదేశాలు నీ ఉదాహరణలు.
అతడు అంటాడు:


చదువరీ, చదవకు
దాపరికం లేని కాటికాపరి
అల్లిన అగ్నిశతకాలు
చదువరీ ఈ, వాచకాలు.
వెడలిపో ఈ పురాతన
సమాధులలోంచి:

కానీ, కానీ, కానీ

((ఎలా వదిలివేయగలం మనం?
అతడిని, ఆమెనూ
జీవిస్తుండగా శిలువ వేసిన మనం
అతడినీ, ఆమెనూ
నిరంతరం దోచుకున్న మనం
వారికి దేహాలు లేకుండా
చేసిన మనం
ఎలా వదిలివేయగలం మనం?))

ఎప్పటికీ, ఎప్పటికీ ఊహించకు నువ్వు
విరామం గురించి, నిన్ను పొదివిపుచ్చుకునే
ఒక శాంతి గురించి, నువ్వు
నిశ్చింతగా నిదురించగలిగే రాత్రి గురించి=

((మృత్యువును ప్రేమించే మృతువుతో
మృదు మృత్యువుగా
నువ్వు మరణించు: ఎందుకంటే

అంతం కాదిది: అంతం లేనిదిది
ఏదీ కానిదీ, ఏదీ అవ్వలేనిదీ.))

19 April 2011

తిరిగి తిరిగి

వెళ్ళకు
వస్తుంది తిరిగి అ గులాబి
తిరిగి తిరిగి

ఉండిపో అక్కడే
నల్లటి మబ్బులను నోట
కరుచుకుని పిట్టలు
పిట్టల కాళ్ళను పుచ్చుకుని
తెల్లటి వెలుతురూ

ఏదో ఒక సంధ్యాసమయాన
తిరిగి రావాలి
తిరిగి తిరిగి రావాలి
తిరిగే రావాలి

నల్లటి కలలలో
కలవరపడే కనులలో
కన్నీళ్ళలో

ఎవరో ఒకరు రావాలి

వెళ్ళకు
వస్తుంది అ లేత
నీలి ఎరుపు గులాబి
తిరిగి తిరిగి
నీ మరణానంతర
జననంలోకి=

16 April 2011

ఏమీ ఇవ్వలేను

ఏమీ ఇవ్వలేను
నిస్సహాయంగా నువ్వు
అలా అక్కడ
నాకై కూర్చున్నప్పుడు
నేను నీకై ఏమీ చేయలేను

నిన్ను తాకకుండా
నీ చుట్టూతా తిరిగి వెళ్ళిపోయే
తెమ్మరుల సమయమిది

నీ సమక్షంలో
నీ బాహువుల వలయంలో
కదులాడుతూ
నిన్ను కాదని వెళ్ళిపోయే
శ్వేతసర్పాల వంటి
శ్వేత శీతాకొకచిలుకల
సమయం ఇది

నువ్వు ఒక్కడివే
వేసవిపై సన్నగా తెగుతూ
అరచేతులలో
ఇతరుల మంత్రదర్పణంలో
నీ మరణాన్ని
నువ్వు కాంచుకునే
మహత్తర సమయమిది=

ఏమీ చెయ్యలేను
ఏమీ ఇవ్వలేను
నాకోసం నువ్వు అక్కడ
ఎదురుచూస్తూ
కూర్చున్నప్పుడు
ఎదురుచూస్తూ
మరణిస్తున్నప్పుడు=

నేను నీకు ఇవ్వగలిగినవి

కాటుక కష్టంగా
నీ పదాలు=

ఏదైతే నువ్వు నాతో వచ్చినందుకు
కోల్పోయావో
దానిని తిరిగి నా పదాలు
నీకు ఇవ్వలేవు. నేనూ ఇవ్వలేను

నేను ఇవ్వగలిగినదల్లా ఇవి:

నిదురలేని వెన్నెల కానరాని
మిణుకు మిణుకుమనే
రాత్రుళ్ళు

ఒంటరిగా ఓ వైపుకు తిరిగి
ముడుచుకుని పడుకునే
తెల్లటి దినాలు

తాకితే గులాబి ముల్లులా దిగబడే
ఒక మొరటు మనిషి
మొరటు కాలం

నయనాల కింద నలుపు గీతలుగా
మారే నలుపు నిరీక్షణా ప్రదేశం

అంతిమంగా నీ హృదయంలో
నిరంతరంగా జనినించే
అంతంలేని ఎడారులూ.

తీసుకోడానికి నువ్వు సిద్ధంగా
ఉన్నావా?
సిద్ధంగా లేనప్పుడే ఇవన్నీ నేను
నీకు బలవంతంగా
బహుకరించానా?

15 April 2011

ఒక పరిమళపు ప్రయాణం

రాత్రిళ్ళు నువ్వు
నిదురించలేవు
పగళ్ళు నీవు
పరిగెత్తలేవు
నీ చుట్టూ ఉన్న సమస్థం
నిశ్శబ్దమవ్వగా
ఇంకా ఎంతమాత్రం
తొలి లేత కాంతిలో
నీకై వాలే పిట్టలకు
గుప్పెడు బియ్యం గింజలు
వేయలేవు
రక్తం చర్మంపై
ప్రవహిస్తుండగా
కళ్ళలో నిప్పులతో నీవు
నీ తమ్ముడిని
కౌగలించుకోలేవు
వాడి ఆటలలో
బొమ్మవు కాలేవు
అమ్మ చేతుల్లో వడలి
రాలిపోయిన
ఓ మల్లెమొగ్గలా తప్పితే
ఇల్లంతా వర్షంలా
కురియలేవు

నీడలతో నడవలేవు
నీళ్ళతో కలవలేవు
రాత్రి చందమామలో
వెన్నెలవై
ఆరుబయట కురియలేవు
గాలిలో తేలలేవు
కాగితపు పడవలతో
సాగలేవు
పచ్చిగడ్డిలో పొర్లాడే
కుక్కపిల్లతో
చిందులేయలేవు
కదలలేవు
మాట్లాడలేవు
అరిపాదాలలో నెగళ్లు రగిలి
నిదురించలేవు

నీ చిన్ని గుండెలో
గుబులు
నీ చిన్ని దేహంలో
కమ్ముకు వస్తున్న
వొణుకు
ఏం జరుగుతుందో
తెలియక
ఏం చెప్పాలో
అర్థం కాక
ముడుచుకుని
బెంగగా ఒకే ఒక
మహాప్రశ్నగా
మారి అడుగుతావు
అలా:

"అమ్మా అందరూ
నిదురోతున్నారు
నాకెందుకిలా?"

ఇక కాలం
అర్థం అవుతుంది నీకు
కొత్తగా
ఇక జీవించే ప్రక్రియ
అర్థం అవుతుంది నీకు
కొత్తగా
తెలుస్తుంది నీకు
ఒక కొత్త కాంతి
లీలగా
అర్థం అవుతుంది నీకు
మృత్యువు
ప్రప్రధమంగా
నిను వీడని
ఒక ప్రమిదెపు
వెచ్చదనంలా
నువు తాగిన
నీ తల్లి
తొలి పాల
చల్లదనంలా=

జీవించు:
పూర్తిగా ఈ భాదను
అనుభవించు.

ఒక పరిమళపు ప్రయాణం
మొదలయ్యింది నీకు

ఇవాళే, ఈ వేళే=

10 April 2011

పోలిక

ఈ వేళ నీ లేత ఎరుపు చేతి వేళ్ళను లేత ఎరుపు
మల్లెమొగ్గలతో పోలుస్తాను
లేత ఎరుపుగా మారిన నీ కళ్ళతో పోలుస్తాను=

నీ ఆగ్రహాన్ని అగ్నితోనూ, నీ అసహనాన్ని వాయువుతోనూ
నీ నిర్లక్ష్యం కలగలసిన నిరాదరణని
సర్వాన్నీ తుడిపివేసే ఒక మహా వర్షంతోనూ పోలుస్తాను

పోలికలను ద్వేషించేవాడికి ఒక మహా పోలికగా మారిన నిన్ను
దేనితో పోలుస్తాను?

ఈ వేళ నిన్ను ఒక నలుపు పారిజాతంగానూ, ఒక తెల్లటి
రాత్రిగానూ, అంతం కాని
అలవాటు లేని, వ్యసనంగా మారుతున్న ఒక స్వీయ
చరిత్రతో పోలుస్తాను

పోలికలతో ముడిపడి, పోలికలతో పోరాడి, పోలికలు లేని
ఒక పోలికగా మారుతున్న
ఒక మనిషితో (అది నేను) నిన్ను పోలుస్తాను:
అది వినా మరో మార్గం లేదు: మరో దారి లేదు.

ఇంతకూ నేను మరణించానా లేక నువ్వు ఒక
గొప్ప ప్రతీకారంతో ఇలా తిరిగి జన్మించావా?

దినానంతాన

నీ శరీరంలో ఒక అగ్నినది ప్రవహిస్తోంది ఈ వేళ. నీ కనులలో
నీ స్వరంలో ఒక ఎర్రని పుష్పం వికసిస్తోంది ఈ వేళ.

కొంత సంధ్యా సమయం కావాలి నీకు
కొంత సమయపు కాంతీ కావాలి నీకు. మరికొంత విరామపు
చల్లటి గాలీ తాకాలి నిన్ను.

అలసిపొయావు. వడలిపోయావు. అవిశ్రాంత దినానంతాన
అలా రాలిపోయావు నువ్వు. రా

లేచి కూర్చో కిటికీ పక్కగా: ఇక ఇప్పటికి, నువ్వు తపించిన
వర్షం కురియనీ, నిను తన బాహువులలో
కరిగించివేయనీ=

09 April 2011

ఏమని పిలువను నిన్ను?

చంద్రోదయ కాంతికి వికసించే పుష్పానివి నీవు
రాత్రిలో జ్వలించే మంచు మంటవి నీవు

వెన్నెల పద్మం అని పిలువనా నిన్ను?

అరచేతిలోని వెన్నపూసవి నీవు
అరమోడ్పు కనులలో మెరిసే కాంతి వర్షం నీవు
వసంతాన విరిసే తొలి ఆకుపచ్చని పిలుపు నీవు
వెనుకగా వచ్చి అరచేతులతో కనులను మూసి
సన్నటి నవ్వుతో అడిగే ప్రశ్నవి నీవు

నన్ను తడిపివేసే మెత్తటి జల్లువి నీవు.
అలా అని పిలువనా నిన్ను?

నా జీవితానికి స్వర్గలోకం ఇచ్చిన అనుమతి నీవు
నాకున్న అమూల్యమైన బహుమతి నీవు
నా బాహువులలో చిక్కుకున్న పూలపొదవి నీవు
నా చుట్టూ తిరుగాడే రంగురంగుల
లేత ఎరుపు గులాబీ సీతాకోకచిలుకవి నీవు
అనుకోకుండా నా దారిలో ఎదురుపడ్డ
ఒక స్వప్నచిహ్నం నీవు

నాకు ఉన్న ఒకే ఒక సత్యం
అని పిలువనా నిన్ను?

నా దాహం నువ్వు, నా గాయం నువ్వు
నా పురాకృత క్షణాల పురివిప్పి ఆటలాడే నెమలివి నీవు
నా ప్రారంభం నీవు, నా అంతం నీవు
నా అస్థవ్యస్థ గమనాల మధ్య కదులాడే శ్వాసవి నీవు
అలసిన వదనం పై వీచే
సాయంకాలపు చల్లటి గాలివి కూడా నీవు

నాకు మిగిలిన ఒకే ఒక మృత్యువు
అని పిలువనా నిన్ను?

నన్ను చుట్టుకుని ఓదార్చే బాహువులు నువ్వు
నన్ను క్షమించి శపించే చూపువి నువ్వు
రహస్య రూపివై నను వెంటాడే
ఒక పరిమళపు ఛాయవి నీవు
నలుదిశలా నను విస్మయపరిచే గాధవి నీవు
ఆ ప్రధమ నల్లటి అక్షరానివి నీవు
శిశువు నోటిలో తొలి పాల సంతకం నీవు

నన్ను నిర్వచించే, నన్ను రచించే
నాకు మిగిలిన ఒక ఒక జననం
అని పిలువనా నిన్ను?

ఏమని పిలువను నిన్ను?
ఏమని కాంచను నిన్ను?

08 April 2011

ఏం చేద్దాం మనం

ఉన్నావా లేక
నిన్ను నువ్వు మరచిపోయావా?

నే వచ్చేటప్పుడు
నా శరీరం నిండా నీ శరీరానికి
సరిపడేంత మత్తుని తేనా?

ఏం చేద్దాం మనం మనతో
మన తనువులతో?

ఈ వేళకి మనం
ఒక నెగడుని తయారు చేద్దాం
ఈ రాత్రిని దానిలో వేసి
వెన్నెలతో దహించి వేద్దాం
అగ్నిపూలు ధరించి
ఒకరినొకరు భక్షించుదాం. ఆపై
చితాభస్మం పూసుకుని
విశ్వలయతో తాండవం చేద్దాం
చీకటిలోంచి చీకటిలోకి మళ్ళా
మళ్ళా దుముకుదాం

ఉన్నావా లేక నీతో పాటు
నన్నూ మరచిపోయావా?

వస్తుందొక ఉన్మాద స్వప్నం
నీ కోసం

అందుకై, నాకై
నగ్నంగా సిద్ధంగా ఉండు=

ఎవరు చెప్పారు నీకు

ఎవరు చెప్పారు నీకు జీవించడం తేలికని
ఎవరు చెప్పారు నీకు ప్రేమించడం తేలికని
ఎవరు చెప్పారు నీకు
అలా ఉండటం, అలా చూడటం
కాలపు నదిలో ఇంకుతున్న
సమయపు ఇసుకను గమనించడం
తేలికని ఎవరు చెప్పారు నీకు

ఎవరు చెప్పారు నీకు
వర్షపు నీటిలో కాగితపు పడవలని
వదలడం తేలికని

ఎవరు చెప్పారు నీకు
రాత్రి చీకటిలో నక్షత్రపు చినుకులని
కళ్ళతో పట్టుకోవడం తేలికని

ఎవరు చెప్పారు నీకు
అలల్ని ఎగురవేయడం,పిచ్చుకలని
పిల్లలనీ చిందులేయించడం తేలికని

ఎవరు చెప్పారు నీకు
కాటుక దిద్దిన కళ్ళల్లో మల్లెమొగ్గల్ని
అద్దడం తేలికని

ఎవరు చెప్పారు నీకు
ఓరిమితో, ముసలివాళ్ళతో
అనాధలతో శరణార్థుల లోకంతో
పవిత్రుల పాపంతో ముసలివాడవ్వడం
తెలికనీ సహజమనీ?

ఎవరు చెప్పారు నీకు మరణించడం తేలికని
ఎవరు చెప్పారు నీకు జీవించడం తేలికని
నీకు తెలీకా అని ఎవరు చెప్పారు నీకు

అద్దంలో మరచిన ముఖాల్నీ, ముఖాలలో
జనినిస్తున్న హృదయాల్ని
హృదయాలలో వెలుగుతున్న రహస్య దీపాల్నీ
అందరి చుట్టూ అల్లుకున్న పరిమళాన్నీ

నీ చుట్టూ చుట్టుకున్న అందరినీ తాకడం
అందరిలోకీ ఇంకడం, అందరినీ శ్వాసించడం
తేలిక అని

ఎవరు చెప్పారు నీకు?

07 April 2011

ఏమనుకోను

తీసుకో, ఈ హృదయాన్ని
ఏమనుకోను

దాచుకో, ఈ శరీరాన్ని
ఏమనుకోను

నాటుకో, ఈ కళ్ళను
నీ కళ్ళల్లో
తురుముకో ఈ చేతుల్ని
నీ బాహువుల్లో
కట్టుకో, ఈ పాదాల్ని
నీ పదాలతో

ఏమనుకోను, నీకు
ఏమీ ఇవ్వను, ఏమీ
ఇవ్వలేను=

మరోవైపుకి చూడు.

నేను ఇప్పటికే
ఒక కత్తిని పదునుగా
నూరి ఉంచాను.

ప్రేమించుకుందామా
మనం ఇక?

వెళ్ళిపో

ఉరుముతున్న దినాలు
ఉరిమే దినాలు

వాళ్ళు ఎవరూ నిన్ను
స్మరించరు
వాళ్ళు ఎవరూ నిన్ను
కాంచరు=
వాళ్ళు: అందరికీ చెందిన
అందరూ అయిన
వాళ్ళు. నిలువెల్లా
నింగీ నేలా
నిప్పూ అకాశాలతో
ఈ భూమిపై తిరిగే
వాళ్ళు: వాళ్ళు ఎవరూ
నిన్ను స్మరించరు.
వాళ్ళే, వాళ్ళు అందరే
నిన్ను విస్మరించారు
నీ ప్రార్ధనలలో
నీ అలాపనలలో నిండి
పోయిన వాళ్ళు
వాళ్ళే నిన్ను
విస్మరించారు=

వెళ్ళిపో ఇక్కడనుంచి
త్వరగా

ఈ ఉరిమే దినాలలోంచి
ఈ తరిమే జనాలలోంచి
త్వరగా
ఇక్కడనుంచి=

an in/decent poem 2.

అతడు ఇలా అన్నాడు:

"నా గురించి ఎదురు చూడకు
ఎందుకంటే
స్త్రీలు నిరీక్షణా ద్వేషులు
నియంత్రణా వ్యసనులు
శరీర వ్యామోహులు:"

ఆమె ఇలా అంది:

"the sun stays still
in your words:

i laughed at
the altar
of your dead cock:"

నేను ఇలా గొణుక్కున్నాను:

నాకు నేను స్వర్గం
ఇతరులు నరకం
పదాల మధ్యలో అవయవాలతో
జొరబడే ఆ ఇద్దరూ
ఎప్పటికీ మానని గాయం:"

ఎవరు చెప్పారు మీకు
ఇది కవితని?