20 April 2011

ఉన్మాదం/అందం

ఎప్పటికీ, ఎప్పటికీ ఊహించకు నువ్వు
విరామం గురించి, నిన్ను పొదివిపుచ్చుకునే
ఒక శాంతి గురించి, నువ్వు
నిశ్చింతగా నిదురించగలిగే రాత్రి గురించి=

((విసుగు విసుగై, విభ్రమం లేని కాలమై
అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు:
విగ్రహాలకూ, విశ్వాసాలకూ
తల ఒగ్గలేక అతడు
తనను తాను ధ్వంసం చేసుకునేందుకు
ప్రయత్నించాడు. బానిస భాష కాలేక
ఇతరులను అనుకరించలేక
అతడు నిష్క్రమించేందుకు ప్రయత్నించాడు.))

= అతడిని అలా ఎలా వదిలివేయగలం
మనం: మనం. అతడి
ఆదీ అంతం అయిన మనం. అతడి
ఆదీ అంతం చూడాలనుకున్న మనం?=))

మృత్యుదయా
హృదయ
వలయా విషం:

కల ౧.


కనులు కొడగంటి, పదాలు అడుగంటి
పిగిలి పోయిన దారులలో
దాహార్తులతో చీకట్లలో పదాలనే
అడుక్కునే బిక్షువు అతను. అతడు
స్వప్నించాడు:

కొమ్మలపై పక్షులను, పక్షులపై
మేఘాలను
మేఘాలపై పరుచుకున్న శూన్యంలో

కంపించే ఒక విశ్వతరంగాన్ని.
విశ్వతరంగంలో వికసించిన ఒక గులాబీ
రంగురంగుల అంతరంగాన్ని.

అతడు స్వప్నించాడు.
అతడికి తెలియదు
తాను కలలో పక్షిగా మారాడో లేక
ఒక పక్షి కలలో తానుగా వెళ్ళాడో
ఇదంతా ఒక వలయమో:

కల ౨.

ఓటమి లేని ఓటమి లేదు. ఓటమిని
మించిన మృత్యువు లేదు.
అందరూ ఆశిస్తున్న కృతజ్ఞత లేక
అందరి కోసమో, కొందరి కోసమో
జీవించలేక అతడు

తాను వలచిన పదాలలో
తాను మలచిన పదాలలో
తనను వంచించిన
పదాల పద్మవ్యూహాలలో
తనని తాను దాచుకున్నాడు.

(( ఎలా మరచిపోగలం మనం?
ఎలా వదిలివేయగలం మనం?
అతడి జననాన్ని మరణంగానూ
అతడి మరణాన్ని జననంగానూ
ప్రచారం చేద్దామనుకున్న మనం
ఎలా వదిలివేయగలం మనం?))

కల ౩.

ప్రతిదీ ఒక చిహ్నం.

నీడలు నీ నిరీక్షణకు మార్గాలు
ఎవరూ లేని
ప్రదేశాలు నీ ఉదాహరణలు.
అతడు అంటాడు:


చదువరీ, చదవకు
దాపరికం లేని కాటికాపరి
అల్లిన అగ్నిశతకాలు
చదువరీ ఈ, వాచకాలు.
వెడలిపో ఈ పురాతన
సమాధులలోంచి:

కానీ, కానీ, కానీ

((ఎలా వదిలివేయగలం మనం?
అతడిని, ఆమెనూ
జీవిస్తుండగా శిలువ వేసిన మనం
అతడినీ, ఆమెనూ
నిరంతరం దోచుకున్న మనం
వారికి దేహాలు లేకుండా
చేసిన మనం
ఎలా వదిలివేయగలం మనం?))

ఎప్పటికీ, ఎప్పటికీ ఊహించకు నువ్వు
విరామం గురించి, నిన్ను పొదివిపుచ్చుకునే
ఒక శాంతి గురించి, నువ్వు
నిశ్చింతగా నిదురించగలిగే రాత్రి గురించి=

((మృత్యువును ప్రేమించే మృతువుతో
మృదు మృత్యువుగా
నువ్వు మరణించు: ఎందుకంటే

అంతం కాదిది: అంతం లేనిదిది
ఏదీ కానిదీ, ఏదీ అవ్వలేనిదీ.))

1 comment:

  1. ఎలా వదిలివేయగలం మనం?
    అతడిని, ఆమెనూ
    జీవిస్తుండగా శిలువ వేసిన మనం

    హృదయాన్ని కదిలించే కవిత్వం సార్..

    ReplyDelete