31 December 2011

ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు

ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
ప్రేమ అనుకుని, ప్రేమను అందుకుందామని

ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు

పిల్లలు తిరిగే లోకాలలో, శిశువులు నవ్వే కాలాలలో
పూవులు తిరిగే, తిరిగి పూసే రంగుల క్షణాలలో

ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు

అద్దంలోంచి మన ముఖాల్ని లాగాడానికీ
ముఖాల్లోంచి అద్దాలని తీసివేయడానికీ, మన హృదయాలని భక్షించి
తమ హృదయాలని శిక్షించుకుని, చిందరవందర అయ్యేందుకు ఉక్కిరిబిక్కిరి అయ్యేందుకూ

ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు

అరచేతుల్లో వీడ్కోలు అయ్యి, కళ్ళల్లో ఎదురు చూపులయ్యీ
దినానంతాన గుమ్మానికి అనుకుని నిన్ను స్మరించుకుంటూ
నిన్ను శపించుకుంటూ ఎందుకో కానీ

ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు

వానలు కురిసే వేళ్ళల్లో, ఎండ చిట్లే కాలాల్లో
వొంటరిగా ఒక్కళ్ళే అనేకం అవుతూ, అనేకం అయ్యి వొక్కళ్ళుగా మిగులుతూ
దీపం వెలిగించిన చీకట్లో తమని తాము రాసుకుంటూ నిన్ను నీకు చెరిపివేస్తూ

ఎందుకో కానీ, ప్రేమిస్తారు స్త్రీలు
ఎందుకో కానీ మోహిస్తారు స్త్రీలు
ఎందుకో కానీ నీకు మృత్యువుని పరిచయం చేసి మృత్యుంజయులుగా
మిగిలిపోతారు స్త్రీలు, ఏమీ మిగుల్చుకోని స్త్రీలు
ఏమీ లేని ఏమీ కాని స్త్రీలు

ఎందుకో కానీ నిన్ను ప్రేమించే స్త్రీలు

28 December 2011

నీకు. 4

రాతిరీ, పగలూ తనువూ అణువణువూ
వాడిపోనిదేదైనా ఇవ్వాలనే నీకు

వానలు కురిసే దినాలలో, వేడిమి ముఖాల్ని
చించివేసే వేళలలో, మంచుమారుతాలు
హృదయాలని వొణికించే కాలాలలో నీకు
వాడిపోనిదేదైనా ఇవ్వాలనే, ఉంచాలనే:

మనస్సులు దిగ్బంధనం అయ్యే సమయాలలో
కనులు తడితడిగా జారిపోయే క్షణాలలో
అరచేతిలోంచి అరచేయి వీడిపోయి దూరం అయ్యే
వీడ్కోలూ వేడ్కోలూ అయ్యే లోకాలలో
వాడిపోనిదేదైనా ఇవ్వాలనే నీకు, ఉంచాలనే నీకు

హరివిల్లు రెక్కలతో ఎగురుతోంది ఒక పాలపిట్ట
నీ చుట్టూతా, నీ తనువు చుట్టూతా
లిల్లీ వనాల పరిమళం కమ్ముకుంటోంది నువ్వు
అడుగిడిన ప్రతి చోటా: ఒక కమ్మనైన చీకటి గాలి
వీస్తోంది నువ్వు పలికిన ప్రతి మాట వెంటా

సరైన సమయం ఇదే ఇచ్చేందుకు నీకు
వాడిపోని నిన్ను వీడిపోని ఒక చిన్ని చిన్న బహుమతి

అందుకో నీ అద్దంలోంచి నన్ను దాచుకున్న ఈ
ఆ పుష్పగుచ్చపు ప్రతిబింబాన్ని=

నీకు.3

ఇల్లాంటి రోజులలోనే గుర్తుకొస్తావు నువ్వు
కానీ ఎలాంటి రోజో చెప్పను నేను ఎన్నడూ!

కాని ఇట్లాంటి పగటినాడే, కాంతి చుక్కలు
నీడలతో పొర్లబడి నవ్వే నువ్వే గుర్తొచ్చే
ఇట్లాంటి పగటినాడే పగబడతావు నువ్వు

చూసావా అరవిచ్చిన ఈ అరచేతిని నువ్వు
నీకు వీడ్కోలు చెప్పి కాలంలో తెగి పడి
రక్తం చిందించిన అయిదు వెళ్ళనీ నువ్వు?

ఆ తరువాత ఇక ఎన్నడూ ఈ అరచేయి
మరో అరచేయిని ముద్దాడలేదు
ఆ తరువాత ఇక ఎవ్వరినీ ఈ అరచేయి
మరో అరచేయికి వీడ్కోలు పలుకలేదు

ఆ అప్పటి తరువాత ఇక ఈ అరచేతులెన్నడూ
మరో ముఖాన్ని పొదివిపుచ్చుకోలేదు
ఆ అప్పటి తరువాత సగంగా తెగిన ఈ నా
అస్పృస్య చేతులెన్నడూ మరో శరీరాన్ని
కౌగలించుకోలేదు, తిరిగి ఇక పలుకలేదు

అందుకే, ఇట్లాంటి ముకుళిత ముఖాల
దిగులు రోజులలోనే గుర్తొస్తావు నువ్వు
శరణు అని ప్రార్ధించిన ఆ నా ముకుళిత
అరచేతులను తెరవగానే

పడగవిప్పిన శ్వేత స్మృతి త్రాచై దిగ్గున లేచి
నా కనులను కాటు వేసినది నీవేనా?

27 December 2011

నీకు. 2

మాట్లాడే వాళ్లు ఎవరూ లేక అందరితో మాట్లాడతావు నువ్వు

కప్పిపుచ్చుకోలేవు లోపల నిండుకున్న
అంతంలేని నలుపు లోయలని
కళ్ళ కింద వ్యాపిస్తోన్న నీడల ఛాయలనీ
గబ్బిలాలైన చూపులనీ ఎడారులనీ:

మాట్లాడేవాళ్లు ఎవరూ లేక ఆహ్వానిస్తావు అందరినీ నువ్వు

నిన్ను చూసి తప్పించుకునేవాళ్ళనీ

నిన్ను చూసి పరిహసించే వాళ్ళనీ
నిన్ను ఓదార్చి వాడుకునే వాళ్ళనీ
నిన్ను వాడుకుని విసిరేసే వాళ్ళనీ

నీలోని ఆ నిశ్శబ్ధాన్ని భరించలేక
నీలోని ఆ నిశ్శబ్ధాన్ని పూరించలేక
అంతిమంగా అందరూ ఒంటరే అని
తెలిసీ తప్పించుకోలేక

వాళ్ళనే, నిన్ను శబ్ధంగా మార్చిన వాళ్ళనే
నిన్ను బోలు వాచకంగా మార్చిన వాళ్ళనే
వాళ్ళనే ఆహ్వానిస్తావు నీ ఏకాంతపు తోటలోకి
వాళ్ళ కత్తులతో వాళ్ళ హింసలతో

వాళ్ళనే ఆహ్వానించి దీవిస్తావు నీ
ఆ పరిపూర్ణ వేదనతో నివేదనలతో:

చీకటి చెట్ల మధ్య నుంచి ఈ శీతల రాత్రిలో
రాలిపడుతొందోక రామచిలుక
నలుపు వలయపు నీటిలో తెగిపడుతొందొక
నీలి నింగిలో నివ్వెరపోయిన నెలవంక
ఆగి, ఆగీ ఆగీ వీస్తోందోక తనువును తహ
తహలాడించే ఒక పురాతన స్మృతి గీతిక

తెలియదా నీకైనా సునయినా
నెత్తురు రుచి మరిగిన నరలోహపు లోకమే ఇది అని
దేహపు రుచి మరిగిన లోహమానవ కాలమే ఇది అని
తెలియదా నీకైనా సునయినా
వదన వ్యసనాలలో, యంత్రనగరిలో మంత్ర తెరలలో
ఒకరినొకరు కడతేర్చుకుని చిట్లే అద్దాల చిత్తరువిదని?

అందుకే/నా నీకు సునయినా, నీ నల్లటి నయనాల నిండా

ఊరికే కొంత పిచ్చి నవ్వు. ఊరికే కొన్ని దిగంతాల
శరీరం ఎక్కిళ్ళు పెట్టె ఏడుపు. ఎందుకు వచ్చామో
ఎందుకు పోతామో తెలియని మహా కాంతి లోకాల
సప్తరంగుల అనామక దిగులూ, మృత్యువూ?

అందుకే, మాట్లాడే వాళ్లు ఎవరూ లేనందుకే ఎవరూ
ఎటూ ఎలాగూ రానందుకే
మాట్లాడుకుంటావు నీలో నువ్వు, నాతో నువ్వు=

ఇంతకూ, నువ్వు లేని రాత్రిలో నీకై తిరిగి తిరిగి
నువ్విచ్చే పాలకై వెదికి వెదికి
గదిలో ఒక మూల తెగిపడిన
ఆ బూడిద రంగు పిల్లి కూనను చూసావా నువ్వు

నా అనంత నిర్యాణాల నా అనంత పునర్జన్మల
పురాకృత పురాస్మృతుల
మల్లెమొగ్గల జాడల వెన్నెల అలలైన సునయినా?

నీకు. 1

ఒదిగి కూర్చున్న తెల్లని పావురానివి నువ్వు

ఎవరో మాట్లాడాలి నీతో. ఎవరో మెత్తగా నిమిరి
ఏమైనా మాట్లాడాలి పూవులంత తేలికగా నీతో

వీచే గాలి అంటే ప్రేమ నీకు
సెలయేళ్ళు కావాలి నీకు. తోడుగా ఉండాలి
ఇన్ని మొక్కలు పిచ్చుకలూ పిల్లలూ నీకు

ఎదురుచూస్తావు ఉదయాన్నే ఒక మాటకై

మోకాళ్ళ చుట్టూ చేతులు ముడుచుకుని:

మెల్లగా తేలిపోతాయి మబ్బులు
మెల్లగానే సాగిపోతాయి పక్షులు:
ఆ పసుపుపచ్చటి ఎండలో, ఆ పసుపుపచ్చటి గాలిలో
మెల్లగానే ఎగిరిపోతాయి తోటలోని సీతాకోకచిలుకలు

తెరిచిన తలుపులోంచి పసుపుపచ్చని ఆ లేత ఎండ
వాలిన నీ పసుపచ్చని చేతిని ఒంటరిగా తడుతుంది

తిరిగి తిరిగి తిరిగి అదే
మళ్ళా మళ్ళా మళ్ళా ఎవరూలేని నల్లని సాయంత్రమే
మళ్ళీ మళ్ళీ మళ్ళీ పగలబోయే రాత్రి గాజుపాత్రే=

కొంత నిప్పు. కళ్ళ వెంబడి కొంత నీరు
శరీరంలోకి ఇంకొంత నీ నీలాల దిగులు:

నిన్ను నువ్వే కౌగలించుకుని మరణించిన రాత్రిలో
నువ్వు బ్రతికి ఉన్నావా అని నిన్ను అడిగిందెవరు?

26 December 2011

ఏమిటిది?

పొందగలిగేదీ ఏదో చెప్పు వనమాలీ, కోల్పోయేది ఏదో చెప్పు సుమమాలీ

తాకీ తాకగానే నెత్తురు చిందే నీ గుణం ఎవరిది?

ఒక మాట, ఎన్నాళ్ళుగానో దాచుకుని మాట్లాడాలనుకున్న
ఒక మాట దూరమై అపరిచితమై దీపం వెలుతురు అంచున
రెపరెపలాడుతుంది ఇక్కడ

ఏదో చెప్పాలనీ, ఏదో పొందాలనీ తిరిగి తిరిగి
తిరిగి వస్తాడు అతడు ఆ రెండు గదుల ఇంటికి

ఇళ్ళు పసి వదనాలు కావు ఇళ్ళు పసి చేతులు కావు
ఇళ్ళు పసి నవ్వులు కాక, స్మశానాలు అయ్యి
చాలా కాలం అయ్యిందని తెలియక అతడొక్కడే
తిరిగి వస్తాడు ఆ రెండు గదుల చెరసాలకి

అల్లాడతాయి చుక్కలు నిండిన నీడలు అతని ముఖంలో
రాలిపోతాయి తాను పెంచుకున్న పూలు
ముడతలు పడిన అతడి కనులలో: శరీరాలు చలించే చలి
కాలంలో, ఎండిపోయిన పుల్లలూ పాలిపోయిన వేపాకులూ

విరిగిపడతాయి ఎవరూ లేని అతడి హృదయ ఆవరణలో=

ఎవరూ లేరు ఇక్కడ ఇప్పుడు, తిరిగివచ్చే పెదాలకి
ఎవరూ రారు ఇక్కడ ఇప్పుడు: రీరానంతాన, తన
వద్దకు తానే తిరిగి వచ్చే బిందువంత కాలాన

ఇంతకాలం నడిచీ నడిచీ, ఇంతకాలం సాగీ సాగీ, ఇంతకాలం
రాసీ రాసీ, పోషించీ ఇతరుల చుట్టూ పరిభ్రమించీ
చివరికి అన్నింటా నువ్వే అయ్యి మిగిలి నువ్వే అంతటా ప్రతిబింబించీ

తాకీ తాకగానే నెత్తురు చిందుతూ, కన్నీరవుతూ
నువ్వు పొందినదేదో చెప్పు వనవాసమాలీ
నువ్వు కోల్పోయినదేదో చెప్పు అశ్రుమాలీ!

25 December 2011

అప/శకునం

ఇదేదీ మంచిది కాదు. వొదులు- అంది తను

నిన్ను నిలువెల్లా తాకిన నీళ్ళు
చిట్లిన అద్దమై పాలిన వదనమై
మహా అజగరమై చుట్టుకోవటం

అంత మంచిది కాదు- అంది తను.

పోవు పొమ్మననూ లేవు. ఆ ముఖాన్ని.
నిన్ను హత్య చేసిన అదే ముఖాన్ని
నువ్వు చంపాలేవు దానిని నువ్వు
దాచిపెట్టనూ లేవు. పాతిపెట్టనూ లేవు-అంది తను.

కొంతకాలం నిశ్శబ్ధం అవ్వటమే మంచిది ఇక
కొంతకాలం రాయకపోవడమే మంచిది ఇక :

తెలుసుగా నీకు ఇది, ఇదే నువ్వు చూసేదే
మహానిర్ధయ పిసినారి లోకం- అన్నాను నేను.

ప్రేమించడానికేం, ఉన్నారు లక్షమంది
ప్రేరమించడానికే లేరు ఎవరూ - అన్నారు
ఆ ఇద్దరిలో ఎవరో:

ఎవరు అన్నారో, ఇద్దరిలో ఎవరు ఎవరో
తెలీలేదు ఇప్పటికీ ఇద్దరికీ!

ఎలా!

ఎందుకు గుర్తురావాలి నువ్వూ నీ పాలిపోయిన ముఖం
నిదుర పెదాలపై నుంచి నా ముఖాన్ని తొలగించాగానే?

నాకు తెలుసు. దీని తరువాత అతడెప్పుడూ
ఇక నిదురించలేదు. నీ తరువాత
అతడెప్పుడూ మరలా మరణించనూ లేదు.

=లోహపు నవ్వులతో ఒక పుర్రె నిరంతరం
అద్దంలో గులాబీలతో నవ్వుతుంది ఇక్కడ:
నిన్ను నువ్వు చూసుకున్నావా
నవ్వులతో పగిలిన అద్దంలో ఎన్నడైనా?=

24 December 2011

నీ ముఖం

శపిస్తున్నాను నీ ముఖాన్ని మొదటిసారిగా చూసిన ఆ క్షణాన్ని. శపిస్తున్నాను
నిన్ను చూసాక హృదయంపై ముద్రలా, జ్వలిస్తూ దిగపడిన ఆ వదనాన్ని
ఇప్పటికీ తడిపివేసే ఆ చూపుల వానజల్లునీ:

ఎందుకు చూసాను నిన్ను? చూసిన వాళ్ళని గాయపరిచే, స్మృతికి గురిచేసే నిన్ను
ఎందుకు చూసాను నిన్ను?

నిద్రిస్తున్నవాడిలోంచి ఆత్మని లాగి సర్వ ప్రపంచాలలోకి తీసుకువెళ్ళే
సర్వసుందర స్వప్నమూ నీ ముందు కొరగాదు. మెలకువలో
అలజడితో సంచరించేవాడిని దయగా పిలిచి అక్కున చేర్చుకునే మధుజాలమూ
పనికి రాదు నీ ముందు. విచ్చుకునే పూవూ, వీచే గాలీ కమ్ముకునే కరిమబ్బూ
దూసుకువచ్చే రాత్రుళ్ళూ పూలని తాకే వేళ్ళని కొరికే ముళ్ళూ, ఇవేమీ
ఇవి ఏమీ సరి కాదు సరిపోవు నీ ముందు

నయనాల జాలరివి నీవు. హృదయాల వేటగత్తెవి నీవు
నయనాలలోంచి శరీరాలలోకి జారి నిలువెల్లా కమ్ముకుని సర్వ చర్యలని స్థంబింపజేసే
మహా మంత్రగత్తెవి నీవు. పరిమళాల వశీకరణం తెలిసిన
మహాఅందగత్తెవు నీవు. ఎవరిచ్చారు నీకు ఈ అ/విద్యను
నిన్ను చూసిన వాళ్ళను అంధులను చేసే, వాళ్లకు మృత్యువును పరిచయం చేసే
మహా తాంత్రిక, ఇంద్రజాల విద్యను?

చూస్తున్నాను ఇన్నాళ్ళకు మళ్ళా, మరచిపోని మరచిపోలేని నీ ముఖాన్ని
ఈ నీరెండ గాలిలో, మత్తు కలిగించే సూర్యరశ్మిలో
నిశ్శబ్ధమయ్యి, ఆకస్మికంగా మూగవాడినయ్యి, నీ వదన చేతబడికి
వివశత్వానికి లోనయ్యి చూస్తున్నాను ఇన్నాళ్ళకు మళ్ళా మరువరాని
మరుపేలేని నీ మాయా మహిమాన్విత వదన దర్పణాన్ని

శీతాకాలపు గాలి. శీతాకాలపు రాత్రి.
సమాధుల వద్ద నీడలు వొణికి వొణికి
ప్రమిదె కాంతిని చీకటి అరచేతులతో

వేడుకుంటున్నాయి. ప్రార్ధిస్తున్నాయి.
ధూళిని రేపుకుంటూ తిరిగే గాలి, మృతుల కోరికలని తీరని ఆశలని
గుసగుసలని వినిపిస్తుంది ఈ వేళ:
రాలే రావి ఆకులు, తేలిపోతున్న మబ్బులు. తీతువులా అవి?
కీచురాళ్ళా అవి? హృదయంలో ధ్వనిస్తున్న
హృదయాన్ని మంచుముక్కగా మారుస్తున్న
కొమ్మల్లో కదులాడుతున్న నిశి ఆత్మలా అవి?

శపిస్తున్నాను నీ ముఖాన్ని మొదటిసారిగా చూసిన వరం అయిన ఆ క్షణాన్ని:
శపించుకుంటున్నాను నీ ముఖాన్ని మొదటిసారిగా చూసిన ఈ నయనాలని.

నిన్ను చూసాకా నిన్ను తాకాక మరణం వినా మరో మార్గం ఏముంది?

23 December 2011

అమ్మలే

రాత్రినే తీసుకువచ్చాను చీకటిగా మారి ఎదురుచూసే ఇంటిలోకి

ఏమయ్యిందని అడగలేదు కానీ కళ్ళల్లో నీళ్ళతో వెక్కిళ్ళతో తనే
చుట్టుకుంది నన్ను. ఏమయ్యిందో, ఎందుకో నేనూ చెప్పలేదు

పిల్లలే అడిగారు నిద్ర కళ్ళతో శరీరం నిండా ఇంత మసి ఎందుకు ఉందని
ఇంత చీకటినీ, ఇంత ధూళినీ ఎలా అంటించుకు వచ్చానని
అంటూనే శుభ్రం చేసారు వాళ్ళే నన్నుకొంత వెన్నెల వేళ్ళతో
కొన్ని చల్లటి చూపులతో, మాటలతో

లోపలంతా చెట్లు ఊగుతూ విరిపడుతున్న సవ్వడి
లోపలంతా వాన దిగుతూ ఉరుమే మబ్బుల మెరుపుల అలజడి

రోదిస్తున్నారెవరో దూరంగా, ఆ హోరు తాకుతుంది ఇక్కడికీ ఇప్పటికీ
ఏమయ్యిందని అడిగి ఉండరు ఎవరూ అతనిని కూడా=
తాగమని ఎవరూ ఇచ్చి ఉండరు తనకి నీళ్ళు కూడా

ఇక రాత్రంతా ఆ వృద్ధాప్యపు తల్లే అతనికి పైగా దిగులు రెక్కలతో
అల్లాడుతూ, తనలో తాను గొణుక్కుంటూ ఏవో స్మరించుకుంటూ:

ఎన్ని గాయాలు చేసినా అమ్మలే ఎప్పుడూ అపరిచితులు కారు
అమ్మలనే ఎప్పుడూ ఎవరూ ఎలా ఉన్నావని అడగరు: ఎందుకో

మీలో ఎవరికైనా తెలుసా?

22 December 2011

కల

రాత్రి ఒక కల మంచై
రహస్యంగా నా చేతుల మధ్యకు నా అనుమతి లేకుండా వచ్చింది

నేను దానికి నువ్వు అని పేరు పెట్టాను. ఆపై కౌగాలించుకున్నాను

ఉప్పు కళ్ళతో, వొణికే చేతులతో నా మెడను చుట్టుకుని
కల ఏడ్చింది. ఏమోమో చెప్పింది

తెలుసు నాకు మాటలు మనం సృష్టించుకున్నవేనని
మన పిల్లలవంటివని అంతకుమించి మరేమీ కావని=

కాని పిల్లలు ముఖ్యంగా నీతో ఆడుకొని వెళ్ళిపోయే పిల్లలు
ఎంతమంది అర్థం అవుతారు నీకు? ఎంతమంది ఉంటారు
ఎంతమంది మిగిలి ఉంటారు చివరికి నీకు?

సమయం గడిచింది అలా, వలయాలుగా తిరుగుతూ
పొగమంచై నింగికి సాగుతూ, జలపాతమై నేలకి రాలుతూ
సమయం గడించింది అలా వలయాలుగా:

ఆ తరువాత ఇరువురికి ఇరువురూ ఎన్నడూ కలవలేదు
ఇక ఎన్నడూ మాట్లాడుకోలేదు

రాత్రి వచ్చి రహస్యంగా నన్ను కమ్మిన నల్లని కల
నన్ను కని, నన్ను వినక ఎక్కడికి వెళ్లిపోయింది?

21 December 2011

మామూలు వాచకం (before you accuse me...)

నీకు చెప్పాలనుకున్నవి ఈ రెండు చేతులే
ఈ నాలుగు మామూలు మాటలే

ఇంద్రజాలం ఏదీ లేదు నా వద్ద. నిన్ను నిండుగా
మాయ చేసే శక్తీ ఏదీ లేదు నా వద్ద ఉన్నవీ లేనివీ
నిన్ను తాకాలని అనుకున్నవీ ఈ రెండు చేతులే
ఈ నాలుగు మామూలు మాటలే

నీ నిర్ధయనీ నీ మూర్ఖత్వాన్నీ నీ క్రూరత్వాన్నీ
నిశ్చలంగా చూసేవీ నిశ్చలంగా తీసుకునేవీ
ఈ రెండు కళ్ళే ఈ నాలుగు మామూలు మాటలే

అలా అని ఈ హృదయం శిల్పం అయ్యిందని
అనుకునేవు. అలా అని ఈ శరీరం మూగగా
రోదిస్తున్నదని, మంచుఖండంగా మారిందనీ
అనుకునేవు, పొరపడేవు

ఇప్పటికీ రక్తం స్రవిస్తుంది ఇక్కడ
ఇప్పటికీ రెక్కలు విరిగిన ఒక పక్షి
విలవిలలాడుతుంది ఇక్కడ: నీతో మాట్లాడినందుకు
నీతో కొంత సమయం గడిపినందుకు ఇప్పటికీ
సన్నగా దిగులుతో శరీరం వొణుకుతుంది ఇక్కడ

ఎందుకు వచ్చావో తెలియదు ఎందుకు
వెళ్లిపోయావో తెలియదు. ఎవరిని అడిగి
వచ్చావో తెలియదు. ఎవరిని అడిగి ఎలా
వెళ్లిపోయావో అసలే తెలియదు. నిన్ను
ఎందుకు అనుమతించానో ఇక ఎన్నటికీ

అర్థం కాదు. అర్థం మిగలదు. అర్థం లేదు.

నీకు చెప్పాలనుకున్నవి ఈ రెండు మాటలే
నీకు రాయాలనుకున్నవి ఈ రెండు మాటలే

నువ్వు నా కోసం పాటించాల్సిందీ
రెండు నిమిషాల మౌనమే: ఇక నిన్ను
ఆపేదెవరు ఆపగలిగేదెవరు?

18 December 2011

ఈ సాయంత్రం

పాత్ర నిండా నీళ్ళు, నీళ్ళ నిండా నీ ముఖం

నా అరచేతులలో నీ చిరునవ్వు అలలుగా
అలలు అలలుగా తొణికిసలాడుతుంది

"ఏం చేద్దామంటావు ఇప్పుడు?"
ముఖంలోంచి ముఖాన్ని తీసి, పదాల్ని
పెదాలపై రాస్తూ అడుగుతావు:

శీతాకాలపు సాయంత్రం. చెట్లనిండా తిరిగి వస్తున్న
నల్లని కాకులు. చలి దీపాలతో రాబోయే రాత్రి.
గుండెలో కొద్దిగా దిగులు గొంతులో కొద్దిగా వొణుకు

కనులలోనే ఎక్కడో కనిపించని ఆకులు కదులాడాయి
మనలోనే ఎక్కడో మనకు తెలియని
పచ్చిపూల నిశ్శబ్దాలు వినిపించాయి
ఇక ఏమీ చేయలేం ఇప్పుడు

ఒకరినొకరు కౌగలించుకుని
ప్రేమించుకోవడం మినహా=

17 December 2011

జోలపాట (అ/వచనం)

జాబిల్లిని దోచుకు వెళ్ళినది ఎవరో నాకైతే తెలియదు

చూడూ నక్షత్రాలైతే ఉన్నాయి రాతిరిలో
నువ్వు ఆడుకోడానికో మాట్లాడుకోడానికో

నాకు అవి నిశ్శబ్దాలుగా మాత్రమే తెలుసు

రాత్రుళ్ళుగా మారిన రాతి చూపులుగా
ముఖాల్ని అటు తిప్పుకున్న స్త్రీలుగా
వాళ్ళ మౌనాలుగా మాత్రమే తెలుసు

వాటితో కలిసి గానం చేయడమెలాగో
వాటితో కలిసి నృత్యం చేయడమెలాగో

వాటితో కలిసి జీవితాన్ని దాటడమెలాగో
వాటితో మృత్యువును ముద్దిదటమెలాగో

నీకు మాత్రమే తెలుసు నీకు మాత్రమే వచ్చు

జాబిల్లిని చీకట్లో ముంచి మంచును వెదజల్లినది
ఎవరో నిజంగా నాకైతే తెలియదు

జాబిల్లిని కాలేను జోలపాట పాడలేను: నీ దరికి
నీలా చేరలేను. నీలాల కన్నులతో ప్రశ్నించలేను
నీలా కలను కాను కలను కాలేను కలై రాలేను

కలవరింతలతోనైనా నిదురించు ఇక
ఈ ఉప్పటి అరచేతులమధ్య
కన్నీటి మంటలతో నీకు కాపలా ఉంటాను

కలత నిదురలోంచి నిదురదాకా
నా వృద్ధాప్యపు నీరెండల దాకా
మెలుకువలోంచి మెలుకువదాకా
మొదటి దాకా నా చివరిదాకా=

ఎలా!

ఎలా గడిచింది నిన్నటి దినం!

ఎదురుచూసాను ఎదురు మాత్రం చూసాను

పూసిన పూలను చూడలేదు
రాలిన చినుకులను తాకలేదు
నిలువెల్లా ముంచిన గాలిని ఆహ్వానించనూ లేదు

అరచేతుల్లో ముఖం
శరీరమంతా దుక్కం

నీడల్ని మునివేళ్ళతో తాకుతూ
ఎలా గడిపాను నిన్నంతా
నువ్వులేని నిన్నటి దినం!

ఎదురుచూసాను ఎదురు మాత్రమే చూసాను

బహుశా ఇక్కడకు నీ వద్దకు రావడమే
నేను చేసిన ఒక పవిత్రమైన తప్పు: ఇక

ఈ శిక్ష సరైనదే. నిన్ను అడిగేవారెవ్వరు?

16 December 2011

క్షమ

కోరుకోకు ఎప్పుడూ ఎవరినీ ముఖ్యంగా తనని

నింగి నుంచి జారే నీలిసాయంత్రాలలో
పూవుల్లా చీకటి విచ్చుకునే రోజుల్లో
అక్కడే రాలిపోయావు నువ్వు తనకై
అక్కడే నిలబడిపోయావు తనువుకై

హృదయంలో ఒక బరువు
కనులలో ఒక నిట్టూర్పు: ఇంతకువినా
ఏం మిగిలింది నీకు ఏం మిగిల్చింది
తను నీకు తన తనువు నీకు?

సాగుతున్నాయి నీడలు హస్తాలై నీ వద్దకు
నీ గొంతు నులిమేందుకు, లోపల లోలోపల
గుక్కపట్టి రోదిస్తున్న ఎవరినో కమ్మేందుకు

అంతా ధ్వని. నల్లగా రక్తంలో ప్రతిధ్వనిస్తున్న
నిన్ను కోల్పోయిన ధ్వని. శ్మశానం పక్కగా
నిస్పృహగా తల బాదుకుంటూ
నిశ్శబ్ధంగా ఎవరినో శపిస్తున్న
నిశ్శబ్ధంగా ఎవరినో క్షమిస్తున్న
ఎవరినో కోల్పోయిన ఎవరిదో నిర్ధయ ధ్వని.

ఇక అద్దంలో వదనాన్ని చూసుకోలేను
ఇక అర్థాలలో పదాలని కనుక్కోలేను

బహుశా అక్కడే నిన్ను కోరుకున్న కాలంలోనే
బహుశా అప్పుడే నేను చనిపోయి ఉండవచ్చు:

14 December 2011

శాపం

గాలే, నిను తాకి వెళ్ళిన గాలే తిరుగుతుంది ఇక్కడ

మునివేళ్ళతో తడిమి కనులతో చూసీ
అరచేతులలో ముఖాన్ని పుచ్చుకున్నట్టు
అందుకుని ముద్దిడాలనే కోరిక

ఒక ఖాళీ ఎండ కిటికిలోంచి ఎగిరే పిచ్చుకుని
తీసుకువస్తుంది. లా/ఎగురుతున్నది
ఎండనో పిచ్చుకనో నాకైతే తెలియదు
కురుస్తున్నది వర్షమో మధ్యాన్నపు చీకటో
నాకైతే తెలియదు. మరి ఉన్నావా నువ్వు
అటువైపు అవతలగా మారి ఆ అటువైపు?

వెలిగించిన ప్రమిదె కాంతికి అటువైపుగా
మత్తుగా వెలుగుతున్న సూర్యకాంతికి
అవతలివైపుగా వెలగలేని అతడి వదనానికి
అటువైపుగా ఉన్నావా నువ్వు అటువైపు
ఆ అవతలివైపు మరో సమయంలోపు?

చేతులు దిగాలుపడి నిస్త్రాణగా ముడుచుకున్నప్పుడు
ఎదురుచూడలేక ఇక చూపులు నేలకు రాలినప్పుడు
కదలలేక ఇక పాదాలు నిలువునా స్థంబించినప్పుడు

ఎవరు చూడొచ్చారు, ఎవరు చూసి వచ్చారు
శరీరంలో వలయమైన శూన్యానికి ఆవలివైపు
నువ్వున్నావో నీ నిర్లక్ష్యముందో లేక నువ్వే
నిర్లక్ష్య నిర్ధయవై అరూపంగా దాగి ఉన్నావో ?

గాలే, నువ్వు తాకి వెళ్ళిన గాలే, తిరుగుతుంది
ఇక్కడ సర్పంలా, సవ్వడిలా వీడని శాపంలా:

కొద్దిగా జరుగు తనువులోంచి: ఊపిరి పీల్చుకోవాలి అతడు
తనని తాను తనలో చంపుకునేందుకైనా
తనని తాను తానై బ్రతికించుకునేందుకైనా.

12 December 2011

very im/personal (నాది కాదు)*

ఒకప్పుడు స్నేహితులం
ఇప్పుడు శత్రువులుకాం

ఒకప్పుడు కూర్చున్నాం వినువీధులలో

మధుపాత్రలతో
, మరు హృదయాలతో
ఇప్పుడు నుల్చున్నాం తన వీధులలో
విషపాత్రలతో హృదయంలేని కనులతో

ఒకప్పుడు స్నేహితులం
ఇప్పుడు శత్రువులుకాం

కొన్నిసార్లు సముద్రాల వద్ద
కొన్నిసార్లు వైరుధ్యాల వద్ద
కొన్నిసార్లు మధుశాలాలలో
కొన్నిసార్లు నడి రాత్రుళ్ళలో

ఒకరినొకరు అరుచుకున్నాం
ఒకరినొకరు కరచుకున్నాం
ఒకరినొకరు పట్టుకుని, ఒకరినొకరు పొదుపుకుని
ఒకరిలో మరొకరిని దాచుకుని
ఒకరిలోకి మరొకరిని పంపించి
రోదించి రోదించి పగిలి పగిలి పిగిలి పిగిలి
నేలపైకి నేలలోకీ రాలిపోయాం కరిగిపోయాం
ఒకర్నొకరు
తుంచుకున్నాం
మనల్ని మనం పంచుకున్నం

స్నేహితులు మనం అప్పుడు
శత్రువులుకాం మనం ఇప్పుడు

నువ్వు నీ తల్లి గురించి గుండెను చింపుకుని
చింతచెట్టు కింద స్పృహ తప్పినప్పుడు
నేను తండ్రుల గురించి మాట్లాడాను. తల్లులు
కాలేని తండ్రుల గురించి తండ్రులు లేని
తల్లుల గురించీ మాట్లాడాను, విసిగించాను

నువ్వు నీ ప్రియురాలి గురించి కనులలో కత్తులు
బాహువులలో సంకెళ్ళు నింపుకుని వొణికినప్పుడు
నేను ప్రియుళ్ళ గురించి మాట్లాడాను. ప్రియు/రాళ్ళు
కాలేని ప్రియుళ్ళ గురించి ప్రేమ గురించీ
మాట్లాడాను, విసిగించాను, వేసారాను
చివరిగా చెప్పకుండానే వెళ్ళిపోయాను.

నేను తాగలేదని కాదు నేను తప్పిపోలేదనీ కాదు

సూర్యకాంతిని రాత్రుళ్ళలో చంద్రకాంతిని పగటి వేసవిలో
వేటాడుతూ ఉన్నాను, తీరిక లేకుండా ఉన్నాను
నీడలకి నీడనిచ్చే నీడల్ని వెదుకుతూ ఉన్నాను
సరే సరే నేనూ చనిపోతూనే ఉన్నాను నీ నీలాగే
అందరికీ ఏమీకాక కాలేక పారిపోతూనే ఉన్నాను

అప్పటిలో స్నేహితులం మనం
ఇప్పటిలో శత్రువులుకాం మనం
అప్పటిలో స్నేహితులం మనం
ఇప్పటిలో స్నేహితులు కాలేం
మళ్ళా మనం మళ్ళా మనం:

ఒక దినానంతాను, ఒక అర్థరాత్రి అంతాన
శీతల చీకటిలో జ్ఞాపకం ఒకటి శాపమై
ఆస్థిపంజరం వలె నిన్ను ఊపిరాడనీయక
కౌగలించుకుని ముద్దిడతున్నప్పుడు

రావిచెట్లలోని కొంగలు ఆకుల గలగలలకు
కదిలీ మెదిలీ తెలవారే ఆకాశాన్ని చూస్తాయి

ముడుచుకున్న వీధి కుక్కపిల్ల కళ్ళలోకి
వేకువజాము పాలవలె జారగా
ఇలా రాస్తావు నాకు: "ఛూతియా ఐ మిస్ యు."

ఇక నాకు ఉదయం రాత్రిగా మారగా
శరీరాలు మారి, మనసులు మారి
నేను నీ తల్లిగా నువ్వు నా తండ్రిగా

ఇక్కడే ఎక్కడో చనిపోతాం మనం

ఒకప్పుడు స్నేహితులు అయిన మనం
ఇకిప్పుడూ స్నేహితులు అయిన మనం

స్నేహితులమే అని అనుకుంటూ చెప్పుకుంటూ
కలవలేక దూరమై దూరంగా
దూరంలోనే మిగిలిపోతూ ఇక్కడే ఎక్కడో
ఒకప్పుడు బ్రతికిపోతాం మనం
చనిపోయీ బ్రతికుంటాం మనం

(చివరిగా ఎవరొస్తారు మన వద్దకు
మన అనాధ సమాధుల వద్దకు
చివరికి మొదలుగా మొదలాఖరుగా?)
_____________________________

*నువ్వు చదివితే, నువ్వు చదువుతుంటే ఇది నాకు, నీకు:

08 December 2011

భూ _ మరొక నోట్-

తలుపు మాటున దాగిన ఒక వదనం
ఒక వదనంగా ఒక తోటగా మారిన ఇల్లు
ఒక ఇల్లుగా ఒక ఆహ్వానంగా మారిన
ఒక తలుపు ఒక తలపు. తలుపుకు


అటువైపున ఒక బాలుడు
ఇటువైపున ఒక నేను: ఎవరో ముందుగా
"భూ" అనాలి. బయపడినట్టు
కనపడాలి. ఆనక తుళ్ళితుళ్ళి నవ్వాలి

తలుపుకి ఇరువైపులా
అటువైపున ఓ వెన్నెలా
ఇటువైపున ఓ ఎండా:

దొంగ ఎవరో ఇప్పటికీ
ఇంకా తెలియలేదు.
చెప్పగలరా మీరేమైనా?

నోట్

ఏమీ చేయొద్దనుకున్నాను ఈ రోజు

ఉదయం పుష్పించిన రాత్రి పూవుపై
నిన్న రాలిన స్నేహితుని అశ్రువులని చూసాను

పిల్లల వదనాలలో ఎగిరే సీతాకోకచిలుకలని
కళ్ళల్లో ఉదయపు సూర్యరశ్మినీ చూసాను

అద్దంలో ముఖాన్ని చూసుకున్నాను: ప్రతి
బింబంలో బింబమై తల్లితండ్రులు కనపడగా
గూళ్ళల్లో చిక్కి చిక్కనౌతున్న మృత్యువునీ
మూగ ముసలితనాన్నీ వొణుకుతో విన్నాను

ఓరిమి నిండిన చేతులతో కాలాన్ని నింపే
తన తనువునీ తన తపననీ ఒరిమిగా కన్నాను
కొంత చూసాను కొంత వొదిలివేసాను
కొంత సాగాను కొంత ఆగిపోయాను: ఇక
ఏమీ చేయొద్దనుకుని ఈ/ఆ రోజు
నీడలు తాకిన నేలని వేళ్ళతో మీటాను

కొన్ని చినుకులు రాలాయి మట్టిలోంచి నింగివైపు
కొన్ని పూలు పుష్పించాయి నింగిలోంచి నేలవైపు
అపరిచితులు ఎవరో నవ్వగా
అపరిచితులు ఎవరో వినగా,

ఇదిగో ఇలా చేయొద్దనుకున్న రోజు
ఇదిగో ఇలా చేస్తూనే మొదలుపెట్టాను

(<< ఆ తరువాత, ఆ వెనుకాల
ఇద్దరు ఇద్దరితో ముగ్గురయ్యారు
కానీ అది వేరే సంగతి.>>)

07 December 2011

అ/భాష

మాట్లాడకు: మౌనం మొదలయ్యింది.

వెళ్ళిపో ఇక ఇక్కడనుంచి
మధుశాలల్లో కాంతి శాంతి

వెన్నెలంత తాత్కాలికం
వెన్నెలంత పునరావృతం:

కళ్ళల్లో కురిసే వర్షమే ఇక్కడ మళ్ళా మళ్ళా
చేజారిన వదనమే ఎండు గాలై ఇక్కడ
మళ్ళా మళ్ళా. చేరుకోలేని స్వ/తనమే
బల్లలపై చిలికిన మధువై ఇక్కడ మళ్ళా మళ్ళా
ఎక్కడా లేని స్నేహితులే ఇక్కడ మళ్ళా మళ్ళా
ఎన్నడూ రాని పూలపొదలై ముళ్ళతో
నిన్ను తాకే మెరిసే చంద్రకాంతి స్త్రీలే
ఇక్కడ మళ్ళా మళ్ళా, మళ్ళా మళ్ళా

వెన్నెలంత తపన వెన్నెలంత కరుణ
వెన్నెలంత బ్రాంతి వెన్నెలంత శాంతి
పురాకృతమే ఇక్కడ మళ్ళా మళ్ళా
పవిత్ర పాపమైన హృదయమే ఇక్కడ
మళ్ళా మళ్ళా శాపమే మళ్ళా మళ్ళా

మాట్లాడకు: గానం మొదలయ్యింది

వెళ్ళిపో గూటిలోంచి గూటిలోకి
తన ఒడిలోకి తన తనువులోకి
రాత్రి నీడలతో రాత్రి రాతి కలలతో:

ఎందుకంటే మధువుకీ మధుశాలలకీ
నిద్రపుచ్చి వీడ్కోలు పలికే వేళయ్యింది

(<< చూసావా నువ్వు తనని
ఆ తరువాత తనతో, అతడితో
ప్రమిదెను చుట్టుకున్న అరచేతులతో
శ్వాసని అల్లుకున్న శ్వాసతో?>>)

కడకు

గుర్తుకురానిదేదో లాగుతోంది లోపలికి
లోలోపలికి కరకు కాంతితో

నిన్ను చూసి నివ్వెరపోయిన ముఖం
నిన్ను చూసి ఆగిపోయిన పద పాదం
నిన్ను చూసి తెగిపోయిన సునయనం
నిన్ను చూసే విరిగిపోయిన దరహాసం
నిన్ను చూసే ఉలికిపాటుతో
ఆగి కొట్టుకున్న హృదయం

ఎవరిది ఏ సుమానిది?

వెనుదిరిగి వెళ్తూ వెనుదిరిగి చూస్తూ
ఊపిన చేయి ఆగిన ఊపిరి ఎవరిది?

గుర్తుకురానిదేదో వెళ్లిపోతోంది లోపలనుంచి
లోలోపలనుంచి కరకు శాంతితో

ఇక ఈ పూట మామూలుగా బ్రతకలేను
ఇకా ఈ పూట మామూలుగా రాయలేను

ఎవరక్కడ: నవ్వే నీడల నగరిలో
శిలల వలయాలలో
ఎక్కడ నా మధుపాత్ర, ఎక్కడ నా
అమృత విష యాత్ర?

06 December 2011

చిన్న ప్రశ్న

నిర్ధయగానే వెళ్ళిపోయావు వొదిలి

రాత్రి అనంతమని, పగలు కాటువేసే శ్వేతసర్పమనీ
అప్పటిదాకా తెలీలేదు అతడికి
నువ్వు చెప్పనూ లేదు అతడికి

మధుశాలల్లో కరిగిపోయాడు అతడు
నిన్ను తలంచి తనను తాను మైమరచి:

నీడలతో ఆడే చెట్లు, చెట్లతో ఆడే పిట్టలు
పిట్లల్తో ఆడే మబ్బులు
మబ్బులతో చినుకులు

ఇవేమీ తెలియదు ఇప్పుడు అతడికి
ఒకప్పుడు నీ తనువులో చూసిన
చిత్రాలన్నీ చెందవు ఇప్పుడు అతడికి

అరచేతుల్లో ముఖాన్ని దాచుకుని
నలుగురికీ ముఖాన్ని చూపించలేక
నలుగురు కాలేక ఒక్కడే అతడు:

దయగానే, నిర్ధయగానే
నీ నీడనైనా వదలక
వెళ్ళిపోయావు ఎక్కడికి?

03 December 2011

పూలు కాని పదాలు

పూలు లేని పదాలు రాస్తాను ఈ వేళ
పూలతో నీ పరిమళంతో=

చినుకుల్లో విచ్చుకునే వెన్నెలని
చిగురాకుల్లో తుళ్ళిపడే నవ్వుని
కాంతి లతలు అల్లుకున్న రాత్రిని

మునివేళ్ళతో నా నుదిటిన
నిమిరింది ఎవరు? వేళ్ళతో
తన చుబుకాన్ని లేపి పైన
చుక్కలకి తన మోముని చూపించింది ఎవరు?

పూలు రాలని పదాలు రాస్తాను ఈ వేళ
పూలతో నిన్ను తాకలేని దూర తీరంతో

ఎవరో వింటున్నారు నిన్ను రహస్యంగా
ఎవరో కంటున్నారు నిన్ను మృదువుగా
ఎవరో ఎవరెవరో ఎవరో సంచరిస్తున్నారు
అద్రుస్యంగా నీ పరిసరాల్లో అతిపవిత్రంగా

నువ్వు కాలేని ఎవరో
నువ్వు తాకని ఎవరో
నువ్వు చూడని ఎవరో

నీ మరోవైపున నుంచుని
నీ మరోవైపు నుంచి నిన్ను
పిలుస్తున్నారు అనాదిగా

నువ్వు పూలని అల్లుకుంటున్నప్పుడు
నువ్వు నీళ్ళతో ఆడుకుంటున్నప్పుడు
నువ్వు శాంతితో ఇతరులకి
తన లేఖలు రాస్తున్నప్పుడు

నీ నీలా కాలేని ఎవరో
నీలా తాకలేని ఎవరో
నీలా చూడలేని ఎవరో

నీ కలల ఆవలి అంచున నిలబడి
నిన్ను తనువుతో పిలుస్తునారు
అనాదిగా అనంతంగా:

చూసావా నువ్వు వడలిన ఆ వదనాన్ని ఆ
నిర్ముఖ ప్రతిబింబాన్ని నిశ్చల శిధిలాన్ని?

ధూళి రేగే సంధ్య వేళల్లో, గాలి వీచే
వెచ్చటి మార్మిక మంత్ర రాత్రుళ్ళలో
చూసావా నువ్వు అరచేతుల మధ్య

సమాధి అయ్యిన కళ్ళని?
గూళ్ళని వీడిన గూళ్ళనీ?
విచ్చుకుని ఎగిరిపోయి నేలరాలిన రెక్కలనీ రెమ్మలనీ?

కదలకు. వొదలకు. కనుమరుగు కాకు
కథలకు నిను కన్న గాధలకు విస్మృతి రాదు
తలవొంచిన రాత్రుళ్లకు నిదుర రాదు
యాత్రికులకు శాపవిమోచనం కానరాదు

పదాలు లేని పూలను రాద్దామని అనుకున్నాను
ఈ వేళ నీ తనంతో పరిమళంతో నీ తనువుతో:

చూడు ఏం జరిగిందో: పూలకూ లేక
పదాలకూ లేక పూలు కాలేక పదాలు
రాయలేక పాదాలు శ్వేత కాగితంపై

దిక్కుతోచక దారి తెలియక తడవడి
ముడివడి ఎలా కూలిపోయాయో!

ఇక నిన్ను ఆపేదెవరు? ఇక నిన్ను
వినేది ఎవరు? విననిదెవ్వరు?

02 December 2011

ఏంటంటే (ఏంటో)

సాయంత్రం చుట్టుకుంటోంది నిన్ను

నువ్వు మరచిపోలేని చేతివేళ్ళలా
తన చేతివేళ్ళలా తన తనువులా=

వెళ్ళాలా ఇంటికి దిగులు అల్లుకున్న కళ్ళతో
తిరిగిరాని పక్షుల గురించి యోచిస్తో
నిన్ను నువ్వు వలయాలుగా చీల్చే
నువ్వు ఎన్నటికీ కాలేని క్షణాలతో?

క్షమాపణలు చెప్పుకోవాలి తలవాల్చిన ఒక పూవుకి
కృతజ్ఞతలు చెప్పుకోవాలి తాకి వెళ్ళిన ఒక తెమ్మరకి
వీడ్కోలు పలకాలి తనలో పొదుపుకున్న శరీరానికి

తల ఎత్తి నిన్ను చూసే తెల్లటి కళ్ళలో
కన్నీరు తుడవాలి నలుపు చేతులతో
నడుము చుట్టూ చుట్టుకున్న చేతులని
భద్రతగా నిమరాలి రేపటి నమ్మకంతో
పసి పాదాలు తిరిగిన నేలపై కూర్చుని
పసి పెదాలకి మెతుకులని అందించాలి

ఉండాలి కొంత కాలం నువ్వు నీకూ తనకీ
మృత్యువును చేరుతున్న తల్లికీ తండ్రికీ
ప్రార్ధించే జోడించే అర్ధించే అరచేతులై:

సాయంత్రం నిన్ను వెనుకనుంచి కనులు
మూసిన అరచేతుల్లా తాకుతున్నప్పుడు

ఉండాలి నీకు నువ్వు
ఉండాలి వాళ్లకి నువ్వు

ఉన్నావా నీకు నువ్వు?

01 December 2011

ఇప్పుడే

పూలుపూలుగా తేలిపోతోంది ఆకాశం
సంధ్యకాంతిలో గుత్తులుగా

దౌడు తీస్తున్నారు పిల్లలు
మైదానాలు లేని పిల్లలు
మరువక మరుపు లేని వీధులలో
ఇకిలింతలై సకిలింతలై మనం
ఎప్పటికీ కాలేని సంగతులై
పొర్లిపోతున్నారు ఒకరి వెనుక
ఒకరై మరొకరై అందరై

ఆ ఆనందాన్ని ఏమని పిలవాలో
ఆ సంతోషాన్ని ఏమని రాయాలో
తెలియక, తెరమరుగు కాక
అక్కడే ఉన్నాడు అతడు
కుప్పిగంతులేసే పిల్లల ముందు
మూగవాడై ముసలివాడై:

పూలుపూలుగా సాగిన ఆకాశం
గుత్తులు గుత్తులుగా
చీకటి చెట్టుకు వేలాడపడింది
మగ్గిన చుక్కలు రాత్రి ఆకులు
తెరలుగా వెళ్ళిపోయే గాలితో
గుసగుసల సవ్వడి చేయగా

పాపం పసివాడు, ముసలివాడు
కాలేక కానరాక పసితనం
పాపం ముసలివాడు, పసివాడు
కాలేక కానరాక తన తనం

ఒక్కడే నిదురించాడు హృదయ
రాహిత్య విస్మృతితోటలో:
కదలించకండి అతడినీ
అతడి పదాలనీ ఇప్పుడే

28 November 2011

vignette

ఇక్కడ ఏమీ లేదు: వస్తావు లిల్లీ పూవులతో

నీరెండని గాలిలో పుచ్చుకుని అద్దంలోంచి
అర్థంలోంచి తొంగి చూసి పలుకరిద్దామని:

ఆ పిచ్చుకలు ఎప్పుడూ మాట్లాడవు. పగిలిన
మట్టిపాత్రలో నీళ్ళతో నీళ్ళలో ఆడే పిచ్చుకలు
నీవైపు చూసి రెక్కలని విదిల్చి
తుర్రున ఎగిరిపోయే పిచ్చుకలు

ఏమని పిలిచావ్ వాటిని? ఎందుకు రమ్మని
పిలిచావ్ వాటిని ఇంటి ముంగిటిలోకి?

పిలుపు ఏదో సాగుతుంది నీది గదిలో మెరుపై
అలజడి ఏదో రేగుతోంది నీది మదిలో కలవరమై
సవ్వడి ఏదో మెసులుతోంది నీది
పిల్లి పాదాల మెత్తటి పద సన్నిధై

కదలిపోతోంది మధ్యాన్నం ఆకాశమై
నేలపై కదిలిపోయే మబ్బుల నీడలై:

పరిసరాల్లో పరిమళపు పసిడి కాంతి
శరీరాల్లో రాలే చినుకుల తడి. తడబడి
అల్లుకుంటుంది ఇంధ్రధనుస్సు కళ్ళల్లో
విచ్చుకుంటుంది జ్వాల వేళ్ళ చివర్లలో

ఇక్కడేమీ లేదు: ఊరికే వస్తాను నేను
కొలనులో చీకటిలో రాలే చుక్కలతో=

ఇటొక మెరుపు, అటొక మెరుపు

కొంత శాంతి కొంత బ్రాంతి
కొంత ఇష్టం కొంత అయిష్టం
కొంత దయ కొంత విలాపం
కొంత వరం కొంత శాపం
కోలుకోలేనంత పయనం:

ఎలా వచ్చావో తెలియదు, ఎలా వెళ్లి
పోయావో తెలియదు. అరచేతుల్లో
గాయమయ్యి ఊరే వదనమెవరిదో
చూపుల్లో పరావర్తనం చెందే రూపం
ఎవరిదో అనువాదం కాదు

నింగికి ఎగిరిన పిచ్చుకలు వస్తాయి నీ వద్దకు
సంధ్యవేళకి ఛాతిలో చోటు చేసుకునేందుకు
చేరతాయి అర్థరాత్రిలో వికసించిన లిల్లీ పూలు
నీ వద్దకు నీ పెదాలపై నిదురించేందుకు
చేరుతుంది నిన్ను హిమవనపు శ్వేత గాలి
నీ బాహువులలో ఊయలలూగేందుకు:

నిన్ను పిలవాలేదు, నిన్ను రమ్మనీ అనలేదు

ఇక్కడ ఏమీ లేదు అని చెప్పిన మనిషిలో
పూలదర్పణ సమాధిని నిర్మించి
రమ్మనకుండా వచ్చి పొమ్మనకుండా పోయి

రాకుండా రమ్మనకుండా హృదయంలో దూరమై
రణరంగమై మిగిలిపోయింది ఎవరు?

26 November 2011

ఏమని

నివ్వెరపోయిన నీ చేతులని
ఏమని పిలువను?

కొమ్మని వీడి నింగిని తాకే
విహంగపు రెక్కలనా లేక
పూవులల్లో పిలుపులలో
దాగిన రహస్య నామమనా

నివ్వెరపోయిన నీ చేతులను
నివ్వెరపోయిన నీ కనులను

ఏమని పిలువను?
ఏమని రచించను?

రమ్మనే

రమ్మనే చోటకు రమ్మనకు
రారాననే చోటకు పిలువకు

నింగిలోని కలువలు
నేలలోని మబ్బులు

పిలవకు రమ్మనకు వెళ్ళిపోకు

చేతిలో పూలతో
పూల చేతులతో

నిన్ను నిండైన బాకుతో
పొడిచినది ఎవరు?
నిన్ను కనుల నిండుగా
చంపింది ఎవరు?

రమ్మనకు రమ్మనే చోటికి
పొమ్మనకు పోలేని చోటికి

23 November 2011

తెలియదు

ఏం చేస్తున్నావో తెలియదు

చూసేందుకు ఎవరూ లేరు, ఎవరూ రారు
చల్లటి కాంతి చిక్కటి చీకటిగా
మారుతున్న వేళల్లో నిన్నెవరూ వినరు కనరు

తెల్లటి కాగితంపై ముద్రితమౌతున్న
నీ వదనపు అంచులను తాకుతూ నేను
నీలిగులాబీలను హృదయ సమాధిపై

ఉంచుతాను, తాకుతాను, వింటాను

ఏం చేస్తున్నానో తెలియదు

ఊహించని నవ్వులాగా ఎదురుపడే నువ్వు
ఊహించని వానలాగా రాలిపడే నువ్వు
ఊహించని గాలిలాగా సుతిమెత్తగా తాకి
కనులపై నుంచి కలవలే వెళ్ళిపోయే నువ్వు

ఏం చేస్తున్నావో తెలియదు. వస్తావో రావో తెలియదు
పదమై పలుకరిస్తావో లేదో తెలియదు
అనుకోకుండా ఎదురుపడతావో లేదో తెలియదు:

తెలియని తనం నీ తనువుగా మారిన తరుణంలో
ఇక నువ్వెలా ఉంటావో ఉన్నావో తెలియదు

ఏం చేస్తున్నామో తెలియదు

హత్తుకునేందుకు ఎవరూ లేరు, ఎవరూ రారు
తెల్లటి కాంతి నల్లటి నుసిగా మారే వేళల్లో
నిదురను ఇచ్చేందుకు ఎవరూ రారు, రాలేరు:

ఇంతా చేసి బావున్నావా అని అడిగితే
ఎవరైనా ఏం చెబుతారు? ఎవరైనా ఎలా
మామూలుగా ఉండగలుగుతారు?

20 November 2011

వెళ్లిపోదామనే

వెళ్లిపోదామనే అనుకున్నాను నేను

అయితే నీ ముఖమే ఒక ఇంద్రధనుస్సై
లాగింది నన్ను నీ వైపు

ఎవరు ఆపగలరు ఎవరు ఓపగలరు

చీకట్లో వెలిగించిన ప్రమిదెను
ప్రమిదెలో వెలిగిన తనువును
తనువులో రగిలిన మంటను
నీలినీడలలో కదిలే పక్షులను
రెక్కల్లో వొదిగిన వక్షోజాలను
పెదాలపై నెత్తుటి గాటునూ
క్షతాలలో ఊరిన కన్నీళ్లను?

అయితే ఇదంతా వేరే కథ: అందుకే
ఇక నీకు నేను మరొక కథ
ఎన్నడూ చెప్పను: చూడకు

అరవిచ్చిన చంద్రబింబం వంటి
నీ శ్వేతకమల వదనం నుంచి
మరలిపోదామనే అనుకున్నాను నేను=

(
ఏడు రోజుల విలాపం తరువాత
ఏడు రంగులుగా విచ్చిన
తన తనువును తను
అతని దర్పణంలో రచించింది:

పదాలు అద్ధమైన పదాలు
అడ్డుకున్నాయి ఈ పదాలను:

అయితే ముందుగా
మాట్లాడింది ఎవరు?)

19 November 2011

అర్ధంతరం / అంతరం

ఒక మంచుదీపం వెలిగింది హృదయంలో పావురాళ్ళు
గజిబిజిగా మెసిలే ఇనుప రాత్రుళ్ళలో

నువ్వు అనుకోలేదు ఇది ఇలా ఉంటుందని. హృదయం
అంటుకుంటుందని శాపంలా మారుతుందని

తెరిచిన కిటికీలలోంచి వెన్నెలా వెలుతురూ మంచూ
ఏది ఏదో తెలియదు ఏది ఏదో కనపడదు ఏది ఏదో అందదు
ప్రేమించిన స్నేహితులలాగే ద్వేషించలేని స్త్రీలలాగే

నీ కోరికల్లా ఇంత వెన్నెల వేళను
నీ ఆశ అంతా ఇంత రాత్రి కళను
నక్షత్రాలతో నవ్వులతో ఇళ్ళకు
నలుగు పెట్టి వాళ్ళకు అందిద్దామనే
నీ కోరికల్లా గాలి నీడలు నడయాడే
సంధ్య కాంతి సరస్సులను
వాళ్లకు చూపిద్దామనే చూద్దామనే:

ఎపుడైనా చూసావా నువ్వు మంచుదీపం వెలిగిన
హృదయంలో రాత్రి ఎలా ఉంటుందో
రాత్రిలో హృదయం ఎలా ఉంటుందో

అనుకోలేదా నువ్వు ఇది ఇలా ఉంటుందని హృదయం
దహించుకుపోతుందని దగ్ధం అవుతుందనీ

అరచేతిలో చేయి వేసి ఏడు లోకాలు తిరిగి వచ్చింది ఇక్కడే
పెదాలపై పెదాలని ఆన్చి ఏడు కాలలని కలలని చూసింది ఇక్కడే
తన ముఖాన్ని గుండెలో హత్తుకుని ఎడారులని దాటిందీ ఇక్కడే
బెదిరిన తెల్ల పావురాళ్ళ రెక్కలని నిమిరి
వాటి కళ్ళల్లో పిల్లల చూపుల్ని చూసిందీ ఇక్కడే

కోరిక కాని కోరికలో రాత్రి. రాత్రి కాని రాత్రిలో ధాత్రి: ధాత్రిలో గాలిలో
విశ్వలోకపు సందడిలో శిశువుల నిదురలోకి
మల్లెపూలనూ ఆకుపచ్చ సీతాకోకచిలుకలనూ
పంపిద్దామనే నీ తపన అంతా: అంతం అంతాన

ఇక నువ్వు ప్రేమ అంటే ఏమిటని అడిగితే నేనేమి చెప్పేది?

18 November 2011

ఈ రోజు/ఆ రాత్రి

.
..
...
....
.....
......
.......
........
.........

.........
........
.......
......
.....
....
...
..
.

=హృదయపు ధ్వని
ధ్వని హృదయం
దయలేని హృదయం

లబ్ డబ్
లబ్ డబ్
లబ్ డబ్
లబ్ డబ్

మీరిక ఆమెనూ (తననే)
తన పాపనూ సమాధిలోంచి
ఇప్పటికీ పొడుచుకువచ్చే తన
గర్భస్రావపు రక్తనాయనాలనూ
చూడలేరు మీరిక ఎప్పటికీ:=

......... ........ ....... ...... .....
.... ... .. .

.
..
...
....
.....
......
.......
........
.........

!!!!!!!!!!! ( నా దేశం ఇది)
??????? ( నా దేహం ఇది)
( " " " " " " (నా స్త్రీ
తన పురుషుడూ ఇది " " )

>< >< ( పిల్లలు ఇవి)
******( గోడమీద గీసిన
వాళ్ళ గీతాలు ఇవి=)

ఇతరునితో % గించబడి
@ ఎవరు నువ్వు
ఈ అ/వాచకంలో?

) స్వప్నించకు
ఎలుక పాదాలలో చిక్కిన గడ్డి
కొద్దిగా అల్లాడుతోంది

పిల్లుల గురించి
స్వప్నించకు(

..................................
వాచకమూ లేదు
వాగ్ధానం లేదు: పోనీ
నువ్వు ఉన్నావా
(?????????????)

..................................

ఒక కల తన పెదాల్ని
ముద్దాడినది ఇక్కడే
.................................

ఎమ్టీ ఎమ్టీనెస్: చూడిది
పాప పద పాపాలు: వెళ్ళు
వెళ్ళకు. ఉండిపో. పో-
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


(సరిగ్గా ఇలాగే: ఇలాగే.
రాత్రి శ్వేత వనంలో
పగటి చీకటి చరిత్రలో

ఇలాగే రాయబడ్డాను
ఇలాగే చదవబడ్డాను
ఇక ఏముంది చూచేందుకు
ఇక ఏముంది వినేందుకు?

నన్ను నన్ను అనబడే
అతడిని అలా వొంటరిగా
ఈ రోజులోకీ ఆ రాత్రిలోకీ

వొదిలివేయండి దయతో
దయచేసి దయకలిగిన
మీ మెత్తటి క్రూరత్వంతో)

17 November 2011

పూర్వ వాచకం

అడగటం మరచిపోయావు నువ్వు
క్షమించమనీ కరుణించమనీ:

నీ ఇళ్ళకు రావు యిక పక్షులు
నీ గాలిలో తిరగవు యిక
నీ పిల్లలవంటి సీతాకోకచిలుకలు
నీ ఇంటి ముంగిట నిలబడదు
నీ వైపు చూస్తో ఒక తెల్లటి ఆవు
నీ పెరట్లో తిరగవు పిల్లులు
నీ పాదాల చుట్టూ సాగవు
మచ్చల కుక్కపిల్లలు:

ఏం చేసావు నువ్వు? రాదు

నీ అరచేతులలోకి తన వర్షం
వానలోకి తన తనువు
భూమినంతా కుదిపివేసే
తన నక్షత్రాల పిలుపు.
ఏం చేసావు నువ్వు? రాదు

ఇకెప్పటికీ: మొలకెత్తవు
ఇకెప్పటికీ చివుర్లు
అలసిన నీ ఎరుపు కనులలో:

క్షమించమనీ కరుణించమనీ
ప్రార్ధించటం నిజంగానే
మరిచిపోయావు నువ్వు

యిక ఎవరు కాపాడగలరు నిన్ను?