నీకు చెప్పాలనుకున్నవి ఈ రెండు చేతులే
ఈ నాలుగు మామూలు మాటలే
ఇంద్రజాలం ఏదీ లేదు నా వద్ద. నిన్ను నిండుగా
మాయ చేసే శక్తీ ఏదీ లేదు నా వద్ద ఉన్నవీ లేనివీ
నిన్ను తాకాలని అనుకున్నవీ ఈ రెండు చేతులే
ఈ నాలుగు మామూలు మాటలే
నీ నిర్ధయనీ నీ మూర్ఖత్వాన్నీ నీ క్రూరత్వాన్నీ
నిశ్చలంగా చూసేవీ నిశ్చలంగా తీసుకునేవీ
ఈ రెండు కళ్ళే ఈ నాలుగు మామూలు మాటలే
అలా అని ఈ హృదయం శిల్పం అయ్యిందని
అనుకునేవు. అలా అని ఈ శరీరం మూగగా
రోదిస్తున్నదని, మంచుఖండంగా మారిందనీ
అనుకునేవు, పొరపడేవు
ఇప్పటికీ రక్తం స్రవిస్తుంది ఇక్కడ
ఇప్పటికీ రెక్కలు విరిగిన ఒక పక్షి
విలవిలలాడుతుంది ఇక్కడ: నీతో మాట్లాడినందుకు
నీతో కొంత సమయం గడిపినందుకు ఇప్పటికీ
సన్నగా దిగులుతో శరీరం వొణుకుతుంది ఇక్కడ
ఎందుకు వచ్చావో తెలియదు ఎందుకు
వెళ్లిపోయావో తెలియదు. ఎవరిని అడిగి
వచ్చావో తెలియదు. ఎవరిని అడిగి ఎలా
వెళ్లిపోయావో అసలే తెలియదు. నిన్ను
ఎందుకు అనుమతించానో ఇక ఎన్నటికీ
అర్థం కాదు. అర్థం మిగలదు. అర్థం లేదు.
నీకు చెప్పాలనుకున్నవి ఈ రెండు మాటలే
నీకు రాయాలనుకున్నవి ఈ రెండు మాటలే
నువ్వు నా కోసం పాటించాల్సిందీ
రెండు నిమిషాల మౌనమే: ఇక నిన్ను
ఆపేదెవరు ఆపగలిగేదెవరు?
No comments:
Post a Comment