12 December 2011

very im/personal (నాది కాదు)*

ఒకప్పుడు స్నేహితులం
ఇప్పుడు శత్రువులుకాం

ఒకప్పుడు కూర్చున్నాం వినువీధులలో

మధుపాత్రలతో
, మరు హృదయాలతో
ఇప్పుడు నుల్చున్నాం తన వీధులలో
విషపాత్రలతో హృదయంలేని కనులతో

ఒకప్పుడు స్నేహితులం
ఇప్పుడు శత్రువులుకాం

కొన్నిసార్లు సముద్రాల వద్ద
కొన్నిసార్లు వైరుధ్యాల వద్ద
కొన్నిసార్లు మధుశాలాలలో
కొన్నిసార్లు నడి రాత్రుళ్ళలో

ఒకరినొకరు అరుచుకున్నాం
ఒకరినొకరు కరచుకున్నాం
ఒకరినొకరు పట్టుకుని, ఒకరినొకరు పొదుపుకుని
ఒకరిలో మరొకరిని దాచుకుని
ఒకరిలోకి మరొకరిని పంపించి
రోదించి రోదించి పగిలి పగిలి పిగిలి పిగిలి
నేలపైకి నేలలోకీ రాలిపోయాం కరిగిపోయాం
ఒకర్నొకరు
తుంచుకున్నాం
మనల్ని మనం పంచుకున్నం

స్నేహితులు మనం అప్పుడు
శత్రువులుకాం మనం ఇప్పుడు

నువ్వు నీ తల్లి గురించి గుండెను చింపుకుని
చింతచెట్టు కింద స్పృహ తప్పినప్పుడు
నేను తండ్రుల గురించి మాట్లాడాను. తల్లులు
కాలేని తండ్రుల గురించి తండ్రులు లేని
తల్లుల గురించీ మాట్లాడాను, విసిగించాను

నువ్వు నీ ప్రియురాలి గురించి కనులలో కత్తులు
బాహువులలో సంకెళ్ళు నింపుకుని వొణికినప్పుడు
నేను ప్రియుళ్ళ గురించి మాట్లాడాను. ప్రియు/రాళ్ళు
కాలేని ప్రియుళ్ళ గురించి ప్రేమ గురించీ
మాట్లాడాను, విసిగించాను, వేసారాను
చివరిగా చెప్పకుండానే వెళ్ళిపోయాను.

నేను తాగలేదని కాదు నేను తప్పిపోలేదనీ కాదు

సూర్యకాంతిని రాత్రుళ్ళలో చంద్రకాంతిని పగటి వేసవిలో
వేటాడుతూ ఉన్నాను, తీరిక లేకుండా ఉన్నాను
నీడలకి నీడనిచ్చే నీడల్ని వెదుకుతూ ఉన్నాను
సరే సరే నేనూ చనిపోతూనే ఉన్నాను నీ నీలాగే
అందరికీ ఏమీకాక కాలేక పారిపోతూనే ఉన్నాను

అప్పటిలో స్నేహితులం మనం
ఇప్పటిలో శత్రువులుకాం మనం
అప్పటిలో స్నేహితులం మనం
ఇప్పటిలో స్నేహితులు కాలేం
మళ్ళా మనం మళ్ళా మనం:

ఒక దినానంతాను, ఒక అర్థరాత్రి అంతాన
శీతల చీకటిలో జ్ఞాపకం ఒకటి శాపమై
ఆస్థిపంజరం వలె నిన్ను ఊపిరాడనీయక
కౌగలించుకుని ముద్దిడతున్నప్పుడు

రావిచెట్లలోని కొంగలు ఆకుల గలగలలకు
కదిలీ మెదిలీ తెలవారే ఆకాశాన్ని చూస్తాయి

ముడుచుకున్న వీధి కుక్కపిల్ల కళ్ళలోకి
వేకువజాము పాలవలె జారగా
ఇలా రాస్తావు నాకు: "ఛూతియా ఐ మిస్ యు."

ఇక నాకు ఉదయం రాత్రిగా మారగా
శరీరాలు మారి, మనసులు మారి
నేను నీ తల్లిగా నువ్వు నా తండ్రిగా

ఇక్కడే ఎక్కడో చనిపోతాం మనం

ఒకప్పుడు స్నేహితులు అయిన మనం
ఇకిప్పుడూ స్నేహితులు అయిన మనం

స్నేహితులమే అని అనుకుంటూ చెప్పుకుంటూ
కలవలేక దూరమై దూరంగా
దూరంలోనే మిగిలిపోతూ ఇక్కడే ఎక్కడో
ఒకప్పుడు బ్రతికిపోతాం మనం
చనిపోయీ బ్రతికుంటాం మనం

(చివరిగా ఎవరొస్తారు మన వద్దకు
మన అనాధ సమాధుల వద్దకు
చివరికి మొదలుగా మొదలాఖరుగా?)
_____________________________

*నువ్వు చదివితే, నువ్వు చదువుతుంటే ఇది నాకు, నీకు:

7 comments: