గుర్తుకురానిదేదో లాగుతోంది లోపలికి
లోలోపలికి కరకు కాంతితో
నిన్ను చూసి నివ్వెరపోయిన ముఖం
నిన్ను చూసి ఆగిపోయిన పద పాదం
నిన్ను చూసి తెగిపోయిన సునయనం
నిన్ను చూసే విరిగిపోయిన దరహాసం
నిన్ను చూసే ఉలికిపాటుతో
ఆగి కొట్టుకున్న హృదయం
ఎవరిది ఏ సుమానిది?
వెనుదిరిగి వెళ్తూ వెనుదిరిగి చూస్తూ
ఊపిన చేయి ఆగిన ఊపిరి ఎవరిది?
గుర్తుకురానిదేదో వెళ్లిపోతోంది లోపలనుంచి
లోలోపలనుంచి కరకు శాంతితో
ఇక ఈ పూట మామూలుగా బ్రతకలేను
ఇకా ఈ పూట మామూలుగా రాయలేను
ఎవరక్కడ: నవ్వే నీడల నగరిలో
శిలల వలయాలలో
ఎక్కడ నా మధుపాత్ర, ఎక్కడ నా
అమృత విష యాత్ర?
No comments:
Post a Comment