గాలే, నిను తాకి వెళ్ళిన గాలే తిరుగుతుంది ఇక్కడ
మునివేళ్ళతో తడిమి కనులతో చూసీ
అరచేతులలో ముఖాన్ని పుచ్చుకున్నట్టు
అందుకుని ముద్దిడాలనే కోరిక
ఒక ఖాళీ ఎండ కిటికిలోంచి ఎగిరే పిచ్చుకుని
తీసుకువస్తుంది. లా/ఎగురుతున్నది
ఎండనో పిచ్చుకనో నాకైతే తెలియదు
కురుస్తున్నది వర్షమో మధ్యాన్నపు చీకటో
నాకైతే తెలియదు. మరి ఉన్నావా నువ్వు
అటువైపు అవతలగా మారి ఆ అటువైపు?
వెలిగించిన ప్రమిదె కాంతికి అటువైపుగా
మత్తుగా వెలుగుతున్న సూర్యకాంతికి
అవతలివైపుగా వెలగలేని అతడి వదనానికి
అటువైపుగా ఉన్నావా నువ్వు అటువైపు
ఆ అవతలివైపు మరో సమయంలోపు?
చేతులు దిగాలుపడి నిస్త్రాణగా ముడుచుకున్నప్పుడు
ఎదురుచూడలేక ఇక చూపులు నేలకు రాలినప్పుడు
కదలలేక ఇక పాదాలు నిలువునా స్థంబించినప్పుడు
ఎవరు చూడొచ్చారు, ఎవరు చూసి వచ్చారు
శరీరంలో వలయమైన శూన్యానికి ఆవలివైపు
నువ్వున్నావో నీ నిర్లక్ష్యముందో లేక నువ్వే
నిర్లక్ష్య నిర్ధయవై అరూపంగా దాగి ఉన్నావో ?
గాలే, నువ్వు తాకి వెళ్ళిన గాలే, తిరుగుతుంది
ఇక్కడ సర్పంలా, సవ్వడిలా వీడని శాపంలా:
కొద్దిగా జరుగు తనువులోంచి: ఊపిరి పీల్చుకోవాలి అతడు
తనని తాను తనలో చంపుకునేందుకైనా
తనని తాను తానై బ్రతికించుకునేందుకైనా.
Bahut Accha hai
ReplyDelete?!