పూలు లేని పదాలు రాస్తాను ఈ వేళ
పూలతో నీ పరిమళంతో=
చినుకుల్లో విచ్చుకునే వెన్నెలని
చిగురాకుల్లో తుళ్ళిపడే నవ్వుని
కాంతి లతలు అల్లుకున్న రాత్రిని
మునివేళ్ళతో నా నుదిటిన
నిమిరింది ఎవరు? వేళ్ళతో
తన చుబుకాన్ని లేపి పైన
చుక్కలకి తన మోముని చూపించింది ఎవరు?
పూలు రాలని పదాలు రాస్తాను ఈ వేళ
పూలతో నిన్ను తాకలేని దూర తీరంతో
ఎవరో వింటున్నారు నిన్ను రహస్యంగా
ఎవరో కంటున్నారు నిన్ను మృదువుగా
ఎవరో ఎవరెవరో ఎవరో సంచరిస్తున్నారు
అద్రుస్యంగా నీ పరిసరాల్లో అతిపవిత్రంగా
నువ్వు కాలేని ఎవరో
నువ్వు తాకని ఎవరో
నువ్వు చూడని ఎవరో
నీ మరోవైపున నుంచుని
నీ మరోవైపు నుంచి నిన్ను
పిలుస్తున్నారు అనాదిగా
నువ్వు పూలని అల్లుకుంటున్నప్పుడు
నువ్వు నీళ్ళతో ఆడుకుంటున్నప్పుడు
నువ్వు శాంతితో ఇతరులకి
తన లేఖలు రాస్తున్నప్పుడు
నీ నీలా కాలేని ఎవరో
నీలా తాకలేని ఎవరో
నీలా చూడలేని ఎవరో
నీ కలల ఆవలి అంచున నిలబడి
నిన్ను తనువుతో పిలుస్తునారు
అనాదిగా అనంతంగా:
చూసావా నువ్వు వడలిన ఆ వదనాన్ని ఆ
నిర్ముఖ ప్రతిబింబాన్ని నిశ్చల శిధిలాన్ని?
ధూళి రేగే సంధ్య వేళల్లో, గాలి వీచే
వెచ్చటి మార్మిక మంత్ర రాత్రుళ్ళలో
చూసావా నువ్వు అరచేతుల మధ్య
సమాధి అయ్యిన కళ్ళని?
గూళ్ళని వీడిన గూళ్ళనీ?
విచ్చుకుని ఎగిరిపోయి నేలరాలిన రెక్కలనీ రెమ్మలనీ?
కదలకు. వొదలకు. కనుమరుగు కాకు
కథలకు నిను కన్న గాధలకు విస్మృతి రాదు
తలవొంచిన రాత్రుళ్లకు నిదుర రాదు
యాత్రికులకు శాపవిమోచనం కానరాదు
పదాలు లేని పూలను రాద్దామని అనుకున్నాను
ఈ వేళ నీ తనంతో పరిమళంతో నీ తనువుతో:
చూడు ఏం జరిగిందో: పూలకూ లేక
పదాలకూ లేక పూలు కాలేక పదాలు
రాయలేక పాదాలు శ్వేత కాగితంపై
దిక్కుతోచక దారి తెలియక తడవడి
ముడివడి ఎలా కూలిపోయాయో!
ఇక నిన్ను ఆపేదెవరు? ఇక నిన్ను
వినేది ఎవరు? విననిదెవ్వరు?
sree u re great sensitive expression nee poems comment chayadaniki matalundavu anduke chadivi uukuntaa.....love j
ReplyDeleteబావుంది
ReplyDelete