24 December 2011

నీ ముఖం

శపిస్తున్నాను నీ ముఖాన్ని మొదటిసారిగా చూసిన ఆ క్షణాన్ని. శపిస్తున్నాను
నిన్ను చూసాక హృదయంపై ముద్రలా, జ్వలిస్తూ దిగపడిన ఆ వదనాన్ని
ఇప్పటికీ తడిపివేసే ఆ చూపుల వానజల్లునీ:

ఎందుకు చూసాను నిన్ను? చూసిన వాళ్ళని గాయపరిచే, స్మృతికి గురిచేసే నిన్ను
ఎందుకు చూసాను నిన్ను?

నిద్రిస్తున్నవాడిలోంచి ఆత్మని లాగి సర్వ ప్రపంచాలలోకి తీసుకువెళ్ళే
సర్వసుందర స్వప్నమూ నీ ముందు కొరగాదు. మెలకువలో
అలజడితో సంచరించేవాడిని దయగా పిలిచి అక్కున చేర్చుకునే మధుజాలమూ
పనికి రాదు నీ ముందు. విచ్చుకునే పూవూ, వీచే గాలీ కమ్ముకునే కరిమబ్బూ
దూసుకువచ్చే రాత్రుళ్ళూ పూలని తాకే వేళ్ళని కొరికే ముళ్ళూ, ఇవేమీ
ఇవి ఏమీ సరి కాదు సరిపోవు నీ ముందు

నయనాల జాలరివి నీవు. హృదయాల వేటగత్తెవి నీవు
నయనాలలోంచి శరీరాలలోకి జారి నిలువెల్లా కమ్ముకుని సర్వ చర్యలని స్థంబింపజేసే
మహా మంత్రగత్తెవి నీవు. పరిమళాల వశీకరణం తెలిసిన
మహాఅందగత్తెవు నీవు. ఎవరిచ్చారు నీకు ఈ అ/విద్యను
నిన్ను చూసిన వాళ్ళను అంధులను చేసే, వాళ్లకు మృత్యువును పరిచయం చేసే
మహా తాంత్రిక, ఇంద్రజాల విద్యను?

చూస్తున్నాను ఇన్నాళ్ళకు మళ్ళా, మరచిపోని మరచిపోలేని నీ ముఖాన్ని
ఈ నీరెండ గాలిలో, మత్తు కలిగించే సూర్యరశ్మిలో
నిశ్శబ్ధమయ్యి, ఆకస్మికంగా మూగవాడినయ్యి, నీ వదన చేతబడికి
వివశత్వానికి లోనయ్యి చూస్తున్నాను ఇన్నాళ్ళకు మళ్ళా మరువరాని
మరుపేలేని నీ మాయా మహిమాన్విత వదన దర్పణాన్ని

శీతాకాలపు గాలి. శీతాకాలపు రాత్రి.
సమాధుల వద్ద నీడలు వొణికి వొణికి
ప్రమిదె కాంతిని చీకటి అరచేతులతో

వేడుకుంటున్నాయి. ప్రార్ధిస్తున్నాయి.
ధూళిని రేపుకుంటూ తిరిగే గాలి, మృతుల కోరికలని తీరని ఆశలని
గుసగుసలని వినిపిస్తుంది ఈ వేళ:
రాలే రావి ఆకులు, తేలిపోతున్న మబ్బులు. తీతువులా అవి?
కీచురాళ్ళా అవి? హృదయంలో ధ్వనిస్తున్న
హృదయాన్ని మంచుముక్కగా మారుస్తున్న
కొమ్మల్లో కదులాడుతున్న నిశి ఆత్మలా అవి?

శపిస్తున్నాను నీ ముఖాన్ని మొదటిసారిగా చూసిన వరం అయిన ఆ క్షణాన్ని:
శపించుకుంటున్నాను నీ ముఖాన్ని మొదటిసారిగా చూసిన ఈ నయనాలని.

నిన్ను చూసాకా నిన్ను తాకాక మరణం వినా మరో మార్గం ఏముంది?

3 comments:

  1. ఎంతగా నొప్పి ఉంటే అంతగా అలా రియాక్సన్ కదా!
    ఎంతగా ప్రేమ వుంతే అంత వెంటాడుతుందో కదా
    అక్షరాలను అలుముకున్న తడి అమోఘం

    ReplyDelete
  2. శపిస్తున్నాను అంటూనే ప్రేమను కురిపిస్తున్నారుగా:)

    ReplyDelete