15 February 2020

ఖాళీ ...

పుట మరల్చినట్లు అయిపోతుంది నీ రోజు -
నీ ఎదురుగా ముదురు చెట్టు కొమ్మలు,
మసక బారిన
వెలుతురూ, ఎండి రాలే ఆకులూ -
వెళ్లిపోయారు ఎవరో రాలిన ఆ ఆకుల
మీదుగా, విసురుగా!
నలిగినా చిట్లిన చప్పుడు: అప్పుడు
నీలో! శరీరాన్నిఒక ముద్రణాలయం చేసి
వొంటరి దిగులు రాత్రుళ్ళని, వరసగా
నీలో ముద్రించే,
కనిపించని గులాబీ రంగు చేతులు
పలికే నీటి చప్పుడు, అప్పుడు, నీలో!
***
పుటలే లేనట్లు అయిపోతుంది ఈ రాత్రి –
ఇక తల తిప్పి చూస్తే, మౌనానికి పగిలిన
ఒక పూలకుండీ,
రాలిన మట్టీ, మృతవస్త్రం వలే
ఎంతో తెలుపుగా కోసే మరో పగలు!