29 March 2014

ఇక ఇప్పటికి

ఎవరో చాలా చాలా కాలం క్రితం ఒక ప్రమిదెను వెలిగించారు: ఇక - అప్పుడు 

ఈ విశ్వం మొదలయ్యింది.

నేను తన అరచేతిని అంది పుచ్చుకుని, తన వక్షోజాల నీడలో
తల దాచుకుని ఇలా అన్నాను: 

"ఇక చాలు. ఇక నన్ను ఇంటికి తీసుకువెళ్ళు."

మరికొద్ది సమయం తరువాత అక్కడ మిగిలినదల్లా
ఒక ఒంటరి ఒంటరి విశ్వంలో 
ఒక వంటరి వంటరి మనిషి - 

అప్పుడు తను అన్నది: "ఇక మిగిలినదీ, మిగలబోయేదీ ఇదే:
తన నీడలో తానే వడలిపోయి 
జాడను మిగిల్చే ఒక గులాబీ

సంకేతంగా మారిన, నువ్వు అనే 
రెక్కలు లేని పక్షి గీతం మాత్రమే." 

నీ ముఖం

అలసిపోయిన నీ అరచేతుల మధ్య ఇమిడిపోయిన నీ ముఖం 

ఈ రాత్రికి నేను చూడలేని ఒక చందమామ.
అలసిపోయి, పగుళ్ళిచ్చిన ఆ గోడల వెనుక ఏమి జరుగుతుందో
అలసిపోయిన ఆ మేఘాల వెనుక
ఇన్ని సంవత్సరాలుగా నీ ముఖం 

ఏ ఏ యుద్ధాలని వీక్షించిందో - ఒక్క నీకు మాత్రమే తెలుసు: ఇక
ఎడబాటు ద్వారా మనల్నికలిపే దూరంలో
ఈ పదాలు, నీ నిశ్శబ్ధాన్ని తెలిపేందుకు 

ఎవరో వదిలివేసిన చిహ్నాలు.

రా . పిడచ కట్టుకుపోయిన నీ అరచేతుల్ని
నా అరచేతుల్లో కాసేపు వొదిలివేసి
మనతో ఈ వర్షాన్ని మాట్లాడనివ్వు కాసేపు.

ఉంటాను

వొంటరిగా, వొంటరి వొంటరిగా, ఈ వొంటరి వొంటరితనంలో నేను.


నువ్వు కలిసి వుండటం గురించి మాట్లాడతావు. నువ్వు
ఒకటయ్యేందుకు
ముగ్గురిగా మారిన ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చటం గురించి
మాట్లాడతావు. ఏమీ లేదు. అంతా చదివి

చదివినదంతా చదివి 
ఇక్కడ ఏమీ లేదు -  

నీ అరచేతిని ఈ 

వర్షంలోకి చాపు. ఈ రాత్రి ఆఖరి వొంటరి వొంటరితనానికి
ఒక  నీటి చుక్కనై వేలాడుతూ
నేను 

ఇక్కడే, అక్కడే ఉంటాను.

28 March 2014

అతడు 2

అతడు ఏకాకిగా అతడిపై అతడికున్న పగతో సర్వాన్నీ వదులుకునేందుకు తాగుతున్నప్పుడు
ఆకస్మికంగా
దు:ఖించే పగలు నక్షత్రాలతో మెరిసిపోయే దయాపూరితమైన రాత్రిగా మారుతుంది.
ఆకస్మికంగా
దయాపూరితమైన రాత్రి మళ్ళా ఉదయాన్నే
చినుకుల గులాబీలతో ఆటలాడే
మెత్తటి సూర్యరశ్మిగా మారుతుంది.

అప్పటికే అతడి పక్కగా సుదూర ద్వీపాల్లా మారిన స్త్రీలు, మళ్ళా తిరిగిరాని సమయాలలోకి
సారించిన చూపులతో కూర్చుని ఉంటారు-
అప్పటికే అతడి పక్కగా ప్రియురాళ్ళ కంటే
సన్నిహితమైన స్నేహితులు, ఇక తిరిగి రాని సమయాలలోకి కోల్పోయిన
తమ అమ్మలనీ నాన్నలనీ చూస్తూ ఉంటారు.

అతడు ఏకాకిగా అతడిపై అతడికున్న ప్రేమతో, సర్వాన్నీ పొందేందుకు తాగుతున్నప్పుడు

ఆకస్మికంగా
గాయాలతో విలవిలలాడే మధ్యాహ్నం ఓదార్చే గాలిగా మారుతుంది.
ఆకస్మికంగా
రాబోయే సాయంత్రం తల్లి ఒదిలి వెళ్ళిన స్పర్సలా మారుతుంది.

అతడు ఏకాకిగా, అతడిపై అతడికి ఉన్న ఏమీలేనితనంతో, అతడిని అతడు చేరుకునేందుకు
అంతిమంగా తాగుతున్నప్పుడు

అతడి అస్తిత్వాన్ని నిశ్శబ్దంగా చుట్టుకునే, రాలిపోతున్న నక్షత్రం చుట్టూ
వలయాలు వలయాలుగా పరుచుకునే
మృత్యుకాంతి మాత్రం మిగులుతుంది-

27 March 2014

అతడు 1

దయగా గమనించే, తెగిన చందమామ అయినా లేక
చీకట్లో ఒంటరిగా ఈ నగర రహదారులలో
వెదుకులాడుకుంటూ నడవటం అన్నది

ఈ జీవన మృత్యువులో మృత్యువై, నువ్వు అతనికి ఇచ్చిన బహుమతి -

దయగా తాకే ఓ స్త్రీ తెగిన స్పర్శ అయినా లేక
రాత్రుళ్ళలో  ఒంటరిగా నిదురించడం అన్నది
ఈ జీవితపు శూన్యంలో శూన్యమై నువ్వు ప్రేమతో అతనికి ఇచ్చిన బహుమతి -

అయ్యల్లారా, అమ్మల్లారా, ఒక కవి తన కవితను రమిస్తూ ఉండటం, ఒక నర్తకిని
తన నృత్యంనుంచి వేరుగా చూడలేకపోవడం, పూవుని
దాని సౌందర్యాన్ని భద్రపరిచేందుకు తుంపడం
ఆనందానికై నిరంతరం గాయపడుతూ ఉండటం

అనేది, అయ్యల్లారా అమ్మల్లారా, ఇవన్నీ ఓ యాత్రికుడి మూర్ఖత్వపు అదృష్టం:

ఇవన్నీ అతడికి ఎంతగా అవసరమంటే

సాయంత్రపు పరిమళాన్ని తన గదిలో నింపిన మధువు నయనాలలో
తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, సుదూరపు సమయం అయిన
ఇప్పటి సమయంలో ఒక ఆత్మహత్యను ఊహించుకుంటూ, అతను

కళ్లపై అరచేతుల్ని గూళ్ళలా అమర్చుకుని
నెమ్మదిగా కనులు మూసుకుంటూ -ఇక-

ఈ దినానికి అతను ఒక శిశువు కలలో మరణించేందుకు  సిద్ధపడతాడు - 

26 March 2014

అతడు

పరచితమైన అతడి దు:ఖానికి ఎటువంటి ఉపోద్ఘాతమూ అవసరం లేదు -


సంధ్యాకాశపు స్త్రీ తన శిరోజాల్ని వొదులు చేసుకుని, జడలోని రాత్ర్రి గులాబీని
ఎదురు చూస్తున్న బిక్షగత్తె అరచేతుల మధ్యకు వొదులుతుండగా 
అతడు ఒంటరిగా రహదారులపై నడుస్తాడు -

సుపరచితమైన అతడి ఏకాకితనానికి ఎటువంటి ఉపోద్ఘాతమూ అవసరనం లేదు -

వేసే ప్రతి అడుగులో అతడు రాలిపోతున్న ఆకుల్ని లెక్కపెడతాడు. వేసే ప్రతి అడుగులో
అతడు పేరుకుంటున్న గాయాల్ని గమనిస్తాడు. వేసే ప్రతి అడుగులో అతడు
మరణించేముందు, పూలతో, జ్ఞాపకాలతో కన్నీళ్ళతో తనని అల్లుకున్న 
ఆ స్త్రీ దిగులు ముఖాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ తరువాత

సాయంవేళ, పనివాళ్ళు గోడలకు ఆనుకుని మాటలతో సేదతీరుతున్న వేళ, ఎరుకతో
కదులాడే భూమి వాసనను స్త్రీలు పీలుస్తున్న వేళ, అలసిన లోకంలో మనుషులు
సొలసిన హృదయాలతో గూళ్ళకు చేరుకుంటున్న వేళ, అతడు ఛాతిని కోసుకుని 

తన రక్తాన్ని, మధువుతోనూ హింసతోనూ స్నేహితులతోనూ తాగుతాడు -

అన్నింటినీ బూస్థాపితం చేసే, పరచితమైన అతడి ఈ పదాల సమాధులకి 
ఎటువంటి ఉపోద్ఘాతమూ అవసరనం లేదు. ఇక 
కలగాపులగమైన ప్రతీకలతో తూలుతూ తడబడుతూ 

అతడు రాత్రిలోకి కదిలినప్పుడు, ఒక కవిత తన పాదంతో 
అతడి పెదాల చివర్న చిగురిస్తున్న వాక్యాన్ని చీలుస్తుంది. 

ఈ ప్రపంచంలోని సామజిక మనుషుల్లారా, అతడు ఈ ప్రపంచానికి బయటివాడు. 
అతడు ఈ ప్రపంచంలో అనాధ. ఇక,ఈ చీకటి సమయం ఆకాశానికి ఉరివేసుకుని 
జాబిలి రక్తాన్ని కక్కక మునుపు, పరచితమైన 

అతడి ఈ మృత్యు అనుభూతికీ, ఎటువంటి ఉపోద్ఘాతమూ అవసరనం లేదు -

20 March 2014

స్వీయ/కాలం

ఎక్కడికి వెడతావు నీవు, ఈ దిగులు సంధ్యవేళ ఎక్కడికని పారిపోతావు నీవు

పచ్చిక బయళ్ళలోంచి ఇళ్ళకు మరలే గొర్రెల మీదుగా వృక్షాలను అల్లుకునే గాలి తిరుగాడే వేళ ఇది. రహదారులలో కనులను కోల్పోయిన స్త్రీలు మరుపు లేని సమయంలోకి, అలసటతో దేహాల్ని, నదిలోకి దీపాల్లా వొదిలివేసే వేళ ఇది. కరకు రాత్రిలో నీవు ఒక్కడివే దారి తప్పి తడబడుతూ తిరుగాడే, గూడే లేని దయారహిత దారి ఇది. మరి ఎక్కడకు వెడతావు నీవు, ఈ లోకాన్ని వదిలి ఎక్కడికని పారిపోతావు నీవుఇక్కడ నుంచి ఎవరి కలల తెరల పొగమంచులలోకి కనుమరుగవుతావు నీవు?

తిరిగి వెళ్ళే బాటసారివి. ఎవరి అరచేతిలోనో రెపరెపలాడే ప్రమిదె కాంతివి. ఈ భూమిని వొదిలి, నీ పాదాల వద్ద వర్షపు నీటిలో ఒరిగిపోయిన నక్షత్రాల కాంతులను వొదిలిఈ మట్టిని వొదిలి, ఈ నీ శరీరాన్ని కావలించుకున్న ఇప్పటిని  వొదిలిఏయే మృత్యు నీడలలోకి, ఏయే జాడలలోకి వొదిగిపోతావు నీవు -?

తిరిగి వెళ్ళే యాత్రికుడివి నీవు. తప్పకుండా ఒక పాటతో, ఒక గాయంతో, ఒక సంజ్ఞతో, తప్పక తిరిగి వెళ్ళే తీరం లేని నావికుడవి నీవు -

ఎక్కడకని వెడతావు నీవు, ఈ భయ సంధ్యవేళ, నీకు కాని మనుషులలోంచి, ఎవరో వొదిలి వేసిన ఈ అస్థిత్వ బిక్షపాత్రలోంచీ, ఎక్కడికని వెడతావు నీవు?ఎక్కడకని పారిపోతావు నీవు? ఈ దు:ఖ సంధ్యవేళనీవు కాని, నీది కాని ఈ లోకం నుంచీఎవరో మరచిపోయిన నీ ఉనికిలోంచీ ఎక్కడకని వెళ్లిపోగలవు నీవు?

పోనీలే - ఇక్కడే ఉండిపో. పిచ్చివాడిలా, పర్వతాగ్రహపు అంచున పారాడే శిశువులా, తాగుబోతులా, అందరూ మరచిపోయిన మనిషిలా, ఇక్కడే ఉండిపో. పూవులను మోదే రాళ్ళ మధ్య, గూళ్ళు లేని హింసల మధ్య, మృత్యువుకై ఎదురుచూసే మొహావేశాల మధ్య ఇక్కడే ఉండిపో. ఎగిరిపోతున్న పక్షులపై అనంతంగా కమ్ముకుంటున్న చీకటిలో, అర్థరాత్రి పూట సముద్రపు ఒడ్డున సారా పదాలు పాడుకునే జాలరివైఅందరూ ఉండి ఎవరూ లేని ఒంటరి ప్రేమవై, ఇక్కడే ఉండిపో. అందరూ ఉండి ఎవరూ లేక ఇక్కడే చచ్చిపో- 

01 March 2014

వలయం

ఒక వలయాకారపు చిహ్నం ఒక ఆకస్మిక సంజ్ఞతో

ఇక నువ్వు ఎప్పటికీ నీ వద్దకి తిరిగి వెళ్ళలేవని చెప్పినప్పుడు
ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలవు నువ్వు?

నువ్వు జీవించిన జీవితాలన్నీ, నువ్వు కాంచిన మరణాలన్నీ
నువ్వు సమాధి చేసిన ప్రేమలన్నీ, నువ్వు చేయగలిగీ 
చేయలేని పనులన్నీ, మంచు కమ్మిన అద్దంపై
అస్పష్టంగా కదిలిపోయే ముఖంలా మారినప్పుడు
ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలవు నువ్వు-?

ఒక ఖడ్గ ఘాతానికీ, శిలువ వేయబడటానికీ మధ్య 
ఎంపిక చేసుకునే అవకాశమా ఇది? 
మృతులకూ,జీవించేవాళ్ళకూ మధ్య 
చలించే, మహా నిశ్శబ్దమా ఇది? 

ఇదంతా ఒక వేళ, తరచూ మరచిపోయే ఒక కలలో 
-గుసగుసలాడుతున్న- మరచి వచ్చిన 
మరో జీవితపు, అసలు చిహ్నమా ఇది?

జీవించేది ఎవరు? మరణించేది ఎవరు ?  ఉండేది ఎవరు? వెడలిపోయేది ఎవరు? 
వెడలిపోతూ కూడా ఉంటూ సర్వాన్నిత్యజించేది ఎవరు? 
త్యాగం చేసేది ఎవరు? ఈ పదాల చీకట్ల చివర
పొటమర్చిన నెత్తురు చినుకై మిగిలేది ఎవరు ?

ఓ నాహీద్ 
O blue blue one of 
the none

ఇక మిగిలేది అంతా
ఒక

dejavu. dejavu. dejavu.

సమయపు పెదాల పైన నీ శీతాకాలపు వేలిముద్రలు

పగిలిన సమయపు పెదాల పై, నీ శీతాకాలపు వేలిముద్రలు, నన్ను ఈ 
అవ్యక్త తపన ద్వారాల వద్ద వొదిలి వేస్తాయి-

మరొకసారి, ఈ నల్లటి రాత్రి నా శరీరాన్ని తన నాలికతో రాపాడుతోంది. 
చూడు: ఈ నా శరీరం: అదొక గాయాల గూడు. 
అది నీ స్వప్నాల రక్తాన్ని తాగుతుంది.

మరొకసారి, ఈ నల్లటి రాత్రి నా కనుపాపలపై
మంచు బిందువులా మారుతుంది. నువ్వు 
సంవత్సరాలుగా వొదిలి వెళ్ళిన, నీవైన
నీ శరీరపు ముధ్రలనీ, ఎప్పటికీ ఉండే

నీవు లేని నీ మృత్యు జాడలనీ అది సజల పూరితంగా మారుస్తోంది. 

మరొకసారి
పగిలిన సమయపు పెదాలపై, నీ వేలి ముద్రల నల్లటి రాత్రి గడియలు
నన్ను ఈ అవ్యక్త తపన ద్వారాల వద్ద 
బాషారహితంగా వొదిలి వేస్తాయి-

ఇక నిన్ను కానీ, నన్ను కానీ వ్రాయడం ఎలా?

నిర్మాణం

Diaries wait over the bookshelf in the mirror


లేఖలు. వాచకాలు. దేన్ని కప్పి పుచ్చుకునేందుకు పుస్తకాలపై అట్టలు వేసుకుంటాం?
పుస్తకాల కింద దుమ్ము చేరేందుకు మడచి పెట్టిన పేపరు
ఇక గాలికి గదంతా ఎగురుతుంది. ఆ,నీ గాలిలో 
కొన్ని పదాలున్నై. అప్పటి దాకా నువ్వు వినని 
గుసగుసలున్నయ్. అద్దానికి మరోవైపు కనిపించే ప్రతిబింబాలున్నై.

చదవటానికి ముందు, పగిలిన అద్దం ముక్కను మట్టిలోంచి ఏరుకుని
దీపంతో మసిని పులుము. రచనాగ్రహణం చూసేందుకు రెండు నయనాలూ చాలవు:
అంధుడువి అయినా కావాలి లేక అద్దాలనైనా ముక్కలు చేయాలి.

Letters wait: over the mirror in the bookshelf.

శైలి. సత్యం.
వర్షం చినుకు చిట్లుతున్న తునకలో ఒక గొంగళిపురుగు పాదాల్ని మోపుతూ ఉంటే
నువ్వు దేహం మధ్యగా ఒక bookmark ని అమర్చుతావు.
నేను అక్కడిదాకే చదివానా, నేను అక్కడదాకే అట్ట వేసానా? 

గదికి గడపలాగా, బయటా లోపలా కాకుండా, దువ్వెన మధ్య చిక్కుకున్న శిరోజాలను విడదీస్తున్న శైలిపై మెరిసే కిటికీలోని సూర్యరశ్మిని
పుస్తకాల అరలోని పుస్తకాలు బద్ధకంగా చూస్తాయి.

పుస్తకాలలోని కొన్ని వాక్యాల పక్కగా గీసిన గీతాలూ 
మరో పుస్తకంలోంచి రాసుకున్న అర్థాలు, కనిపించని 
సత్యాల వైపు మరులుతాయి. తరలిపోయే సత్యాలలో  

పుస్తకాలమధ్య ఇరుక్కున్న గాలి, గాలిలో ఇరుక్కున్న పదాలూ, పదాలలో/తో నిర్మితమయ్యి పదాలతో,పదాలలో ఇరుకుపోయిన శరీరాలూ... 

Spaces wait: in the mirror and in the letters
over the bookshelf among the diaries.

చదివేందుకు తొందరపడకు. ప్రతీకాత్మకంగా నృత్యం చేసేందుకు వేగిరపడకు. వేచి చూడు. 
ఆరిన దీపం రాత్రికై వేచి చూసినట్టు, దుస్తులు విడిచిన
ప్రియుడు నిండు కళ్ళతో, కళ్ళలో కదులాడుతున్న 
సూర్యుడితో జాబిలికై ఎదురు చూసినట్టు, ఒక
స్త్రీ ఇక నింపాదిగా దుస్తులు కట్టుకుంటున్నట్టు

ఇంకా అమర్చని పుస్తకాలకై, ఖాళీ అర ఒక సాలీడుతో అలా నిలబడి ఎదురు చూస్తూన్నట్టూ
డైరీల్లాగా, ఉత్తరాల్లాగా, సగం పగిలీ నీ పూర్తి ముఖాన్ని 
చూపించే అద్దంలాగా , పదల కావలగా లేఖల కావలగా 
అద్దానికి ఆవలివైపు ఓపికగా వేచి చూడు: తెలీదు నీకు?

Pleasure is not so simple.