20 March 2014

స్వీయ/కాలం

ఎక్కడికి వెడతావు నీవు, ఈ దిగులు సంధ్యవేళ ఎక్కడికని పారిపోతావు నీవు

పచ్చిక బయళ్ళలోంచి ఇళ్ళకు మరలే గొర్రెల మీదుగా వృక్షాలను అల్లుకునే గాలి తిరుగాడే వేళ ఇది. రహదారులలో కనులను కోల్పోయిన స్త్రీలు మరుపు లేని సమయంలోకి, అలసటతో దేహాల్ని, నదిలోకి దీపాల్లా వొదిలివేసే వేళ ఇది. కరకు రాత్రిలో నీవు ఒక్కడివే దారి తప్పి తడబడుతూ తిరుగాడే, గూడే లేని దయారహిత దారి ఇది. మరి ఎక్కడకు వెడతావు నీవు, ఈ లోకాన్ని వదిలి ఎక్కడికని పారిపోతావు నీవుఇక్కడ నుంచి ఎవరి కలల తెరల పొగమంచులలోకి కనుమరుగవుతావు నీవు?

తిరిగి వెళ్ళే బాటసారివి. ఎవరి అరచేతిలోనో రెపరెపలాడే ప్రమిదె కాంతివి. ఈ భూమిని వొదిలి, నీ పాదాల వద్ద వర్షపు నీటిలో ఒరిగిపోయిన నక్షత్రాల కాంతులను వొదిలిఈ మట్టిని వొదిలి, ఈ నీ శరీరాన్ని కావలించుకున్న ఇప్పటిని  వొదిలిఏయే మృత్యు నీడలలోకి, ఏయే జాడలలోకి వొదిగిపోతావు నీవు -?

తిరిగి వెళ్ళే యాత్రికుడివి నీవు. తప్పకుండా ఒక పాటతో, ఒక గాయంతో, ఒక సంజ్ఞతో, తప్పక తిరిగి వెళ్ళే తీరం లేని నావికుడవి నీవు -

ఎక్కడకని వెడతావు నీవు, ఈ భయ సంధ్యవేళ, నీకు కాని మనుషులలోంచి, ఎవరో వొదిలి వేసిన ఈ అస్థిత్వ బిక్షపాత్రలోంచీ, ఎక్కడికని వెడతావు నీవు?ఎక్కడకని పారిపోతావు నీవు? ఈ దు:ఖ సంధ్యవేళనీవు కాని, నీది కాని ఈ లోకం నుంచీఎవరో మరచిపోయిన నీ ఉనికిలోంచీ ఎక్కడకని వెళ్లిపోగలవు నీవు?

పోనీలే - ఇక్కడే ఉండిపో. పిచ్చివాడిలా, పర్వతాగ్రహపు అంచున పారాడే శిశువులా, తాగుబోతులా, అందరూ మరచిపోయిన మనిషిలా, ఇక్కడే ఉండిపో. పూవులను మోదే రాళ్ళ మధ్య, గూళ్ళు లేని హింసల మధ్య, మృత్యువుకై ఎదురుచూసే మొహావేశాల మధ్య ఇక్కడే ఉండిపో. ఎగిరిపోతున్న పక్షులపై అనంతంగా కమ్ముకుంటున్న చీకటిలో, అర్థరాత్రి పూట సముద్రపు ఒడ్డున సారా పదాలు పాడుకునే జాలరివైఅందరూ ఉండి ఎవరూ లేని ఒంటరి ప్రేమవై, ఇక్కడే ఉండిపో. అందరూ ఉండి ఎవరూ లేక ఇక్కడే చచ్చిపో- 

1 comment: