30 November 2017

అసంగతులు

this is what i wrote for you last night:

"your hands are cold, as if
మంచు కురిసిన లిల్లీలను, వేకువన
తాకినట్టూ, వణికినట్టూ!"

... it is true that, your hands are cold;

నీ ముఖాన్ని కప్పుకుని, విప్పిన
చోట, అరచేతుల్లో తడి; బహుశా కళ్ళు
చితికిన చప్పుడు; నీళ్ళు!

and, this is what i didn't write to you

last night; పగిలిన కుండీలలోకి
మట్టినీ, మాటనీ, రాత్రినీ సర్ది, నీలోకి
నేను చేరువౌతోన్నప్పుడు!

"your hands are cold and your eyes

are wet; yet your heart shone,
ఓ దీపం వెలిగిన వెచ్చదనంతోటీ, మరి
నీ ఉనికితోటీ, ఈ లోకం

అర్థాన్నీ, శబ్దం సంగీతాన్నీ, ఇక
కాలం  లయనూ సంతరించుకుంటోంది;
సీతాకోకలు ఎగిరే నేలై

రాత్రి, వెన్నెలనూ, చుక్కలనూ
పొందుతోంది; అశ్రువులై తాకిన చోట, ఓ
పూలవనమే వికసిస్తోంది,

శరీరం గాలై, ఊగే చెట్టై, మరి
పిట్టలు అరిచే రోజై చిందులు వేస్తోంది;
మళ్ళా బ్రతికినట్లవుతోంది"

పిల్లా, what else more can i ask for?

being grateful for this and
మంచు రాలిన నిన్ను పదిలంగా నాలో
దాచుకోవడం తప్ప?

29 November 2017

అసంగతమై

పక్కనే ఉన్నావు నువ్వు; కానీ, ఎంతో దూరం, బహుశా, నేల నుంచి నింగికీ, మెరిసే చుక్కలకు ఆవలగా, ఇంకా దూరంగా మరెక్కడో, నే చూడలేని చోట ... (నువ్వు ) శీతాకాలం; రాలే ఆకులు పాదాల కింద నలిగి చిట్లే సవ్వడి. నీడల్లో ఒరిగిన కాంతి; ఇక తలుపులు తెరిస్తే, అప్పటిదాకా అక్కడెవరో ఎదురు చూసి వెళ్ళిపోయిన తడి; గాలిలో! ఒక శరీరం అట్లా మెరిసి, అంతలోనే కనుమరుగు అయ్యినట్టూ, కన్నీటి చారికలతో, తల్లికై ఒక పాప చేతులు చాచి నిలబడినట్టూ, (నేను ) *** పక్కనే ఉన్నావు నువ్వు; కానీ, ఎంతో దూరం, ఎంతో ఒంటరితనం; శూన్యం -
ఎంతో నొప్పి; ఎట్లా అంటే, చర్మాన్ని చీల్చి,
ఎవరో మరి, నెత్తురు గింజల

దానిమ్మను ఎంతో మెల్లిగా వొలుస్తున్నట్టు!

21 November 2017

snapshot

"there is no moon outside" అతను ఆన్నాడు ఆమెతో, తనకి ఆనుకుని బయటకి చూస్తో - తిని వెళ్లిపోగా, సింక్ నిండా అంట్లు; శీతాకాలం మాత్రమే కనిపించే, సన్నని పురుగులేవో - రాత్రంతా కాలిన నెగళ్ళు, రెక్కలు తెగి, కొంచెం మెరుస్తో, చుక్కలై, చలికి మిణుకుమంటో - కుర్చీలో, shawl లో మునిగి ఆవిడ; కళ్ళేమో, రాత్రిని తాగి తూలే, ఎర్రెర్రని కాంతి మొగ్గలు! *** "there isn't sunshine either" said Esther, తనలో వొరిగి తన్లోనే భస్మమయిన అతనితో!

06 November 2017

చూడు

కిటికీలోంచి, బయటకి చూసావా నువ్వు?
నిన్నానుకుని ఉంటాయి చెట్లు,
మరి, పొడుగాటి వాటి కొమ్మలు నీడలై,
మీ అమ్మ చేతుల్ని జ్ఞప్తికి తేవడం లేదూ?
చలికాలం ఇది; ఒకోసారి మరి,
పొగమంచై మెల్లిగా కదులుతుంది కాలం,
ఎన్నో తడిచిపోతాయి ఆ మంచుకీ, చలి
రాత్రుళ్ళకీ; ఆకులూ, పొదలూ
రాళ్ళూ, ముడుచుకున్న కుక్కపిల్లలూ,
ఎన్నో, మరెనెన్నో అట్లా; పొరలై, నీ కళ్ళై
మసక వెన్నెలై, వణికే స్వప్నమై
చినుకులుగా జారే తేమై, వాటి ఛారికలై ...
***
కిటికీలోంచి, బయటకి చూసావా నువ్వు?
చూడు; నిన్నానుకుని, నీలో చేరేందుకు
కొంచెం ఎండా, కొంచెం నీడా,
నీ కళ్ళను తుడిచేందుకు ఇంకొంచెమై
ఇంకెవరో! మరి పిల్లా, చాలవూ ఇవి నీకు?
నీ చుట్టూ బిగిసిన కంచెను
చీల్చుకుని, వెచ్చగా బ్రతికేందుకు?! 

03 November 2017

అతిధి

కొంత ఆలస్యం అయ్యింది; మరి అది నేను రావడమో, నువ్వు రావడమో; అయినా ఊహించాను; కిటికీలు తెరచి ఉండవచ్చునని, రాత్రి ఒక పూలతోటై లోపలికి వీస్తుండవచ్చుననీ, అది నీ శ్వాసై ఉండవచ్చుననీ! *** ఎవరు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలుసు, సిద్ధంగా ఉండటానికి? ఎవరికైనా ఎలా తెలుసు, ఎవరు నీ హృదయ ద్వారాన్ని మునివేళ్ళతో నెమ్మదిగా తడతారో, ఇక చలించి తలుపులు తెరుచుకోగా, ఆ గాలి ఉధృతమై, వానతో నీ లోనికి జొరబడి నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి వొదిలివేస్తుందనీ? పూలు రాలి చెదిరిన నేలవై నువ్వు, స్థాణువై మిగిలి పోతావనీ? కొమ్మలు అన్నీ తడిచి, చినుకు చినుకై రాలే ఒకానొక శబ్దంగా నువ్వు ఆగిపోతావనీ? ఏ చీకట్లోనో, వొణికే ఒక పద్యమై ఇంకిపోతావనీ? ఎదురుచూసే ఒక తల్లై నీ హృదయం తల్లడిల్లుతుందనీ? *** రావడం కొంత ఆలస్యమయ్యింది; మరి అది నేనో, లేక నువ్వో; తారస పడటం కూడా ఆలస్యం అయ్యింది; నాకు నువ్వో, నీకు నేనో! ఎంత నొప్పి ఇది? ఎదురెదురుగా ఉండి, తాకాలనీ తాకలేక, ఉండాలనీ ఉండలేక ... *** సిద్ధంగా లేనప్పుడే లోపలికి వచ్చి, నిన్ను కుదిపివేసేదే మరి జీవితమనీ, అదే నువ్వనీ, ఒక పూలకత్తితో లోలోపలికి చెక్కుకుపోయి, గాయమూ, శాంతినీ ఇచ్చే ఓ బహుమతి నీవనీ, కాల స్పృహవనీ, జనన రహస్యానివీ మృత్యు పరిమళానివీ నీవని - మరి ఎందుకు తెలిసి రాలేదు నాకు ఇన్నాళ్ళూ?

01 November 2017

తర్జుమా

కిటికీ ఆవలగా పిచ్చుకలు; కనిపించవు, కానీ
చివ్చివ్ చివ్చివ్మంటో ఎందుకో
ఒకటే అరుపులు; మసక మధ్యాహ్నపు వేళ, 
వృక్షఛాయలో, ఒక నీటి పాయ
రాళ్ళని ఒరుసుకుంటో అట్లా పారుతోన్నట్లు,
ఎందుకు? ఆ ధ్వనులు? ఏం చెప్తోన్నాయవి?
వొట్టి శబ్దాలేనా అవి? ఆకులు
రాలి, గాలికి నేలపై కొట్టుకుపోతోన్నట్టు, వాన
సన్నగా కురుస్తోన్నట్టు, మరి,
అంతేనా? ఇంకే అర్థమూ లేదా, ఆ శబ్దాల్లో?
బయట వెలుతురు; నీ చర్మమై మెరుస్తోంది!
కిటికీ ఆవలగా నిశ్శబ్దం, కాంతి
కూడా కొలవలేని చీకటియై, జోలపాటలేని
ఖాళీ ఊయలయై, ఊచల మధ్య
అరచేతుల్లో పాతుకుపోయిన శిరస్సయ్యితే,
***
కిటికీ ఆవలగా, ఏవో ఎగిరిపోయి, మిగిల్చిన
ఖాళీ గూళ్ళు. మట్టి దీపాలు -
శ్వాస లేని పూలు. ఎన్నెన్నో అలిఖితాలు!
మరి తెలుసునా నాకు? ఇప్పటికైనా? నువ్వు
చేరాకనే, శబ్దం అర్థంగా, ఒక
హృదయంగా మారి, ఈ లోకం చలిస్తోందనీ?