29 February 2012

నైరాశ్యం 1

నలుపుని అద్దుకుని తిరగాలి ఇక్కడ
గాలి వెళ్ళిపోయే కళ్ళతో దూరంలోకి

యిక నవ్వుతూ నువ్విచ్చే ఒక మాట
వలయామృత విషం

తెరలలో దాగి తెరలలోనే ఎదిగి
తెరలలోనే వెనుదిరిగే నీ పసిడి ముఖం

నలుపు
తెలుపు
తెలుపు
నలుపు

నన్ను బ్రతికించే నీ తెల్లని వాక్యమేదీ
నా కన్నీళ్ళలో బ్రతికి లేదు యిక్కడ

ఒక చిన్న మొక్క ఊగుతోంది గాలితో
పొటమరించే చిగురాకు పరవశంతో
ఒక చిన్ని చుబుకం ఎదురు చూస్తోంది
నీడలు తెచ్చే చినుకుల మొహంతో

పెదవుల వంటి రెండు అరచేతులు
హిమసుమాల వంటి బాహువులు
ఆప్తంగా అతి ప్రియంగా అనేకంగా
నిశ్శబ్దాన్ని మీటే మిగులు నిశ్శబ్దాలు

అంతా అదంతా ఒక స్మృతి విస్మృతీ
అంతా అదంతా ఒక గానం గాయం

అంతా తెలుపు నలుపు
అంతా నలుపు తెలుపు

సంధ్యవేళల్లో నారింజ ఎండలో
ఎవరో తమ శ్వాస మునివేళ్ళతో
నిన్ను నిర్ధయగా తవ్వే
మైమరపు
గగుర్పాటు-

ఏం చేయగలవ్ యిక నువ్వు
ఏం పొందగలవ్ యిక నువ్వు

నలుపు తెలుపు
తెలుపు నలుపు
నల్లని తెలుపు
తెల్లని నలుపు

నీచే తెంపబడి, వడలిన పూలను
హత్తుకుని తిరిగే దేహద్రిమ్మరివై

యిక ఎంత శోకించీ ఏం లాభం?
యిక ఎంత స్థుతించీ ఏం........?

కళ్ళు వెళ్ళిపోయే దూరంలో
గాలి వెళ్ళిపోయే ఆ కాలంలో
యిక నీ ఒంటికి పూచిన నిద్ర మాత్రలన్నీ తనవే!

28 February 2012

ఏమని అందును

నీ కటినాత్మకమైన చూపు కింద ఒక
పదాన్నీ, అర్థాన్నీ ఉంచడం అంత తెలికేమీకాదు

నీ
చుట్టూ అలా ఎగరాలనే నీపై ఎక్కడైనా వాలాలనే
చూస్తుంది గుప్పెడెంత సమయం
నీ పిచ్చుక
పిల్ల అయిన పదం
నువ్వొక ఖడ్గం అనీ
నువ్వొక చీకటి అనీ
నువ్వొక
రాతి చెరశాలవనీ నువ్వొక నువ్వనే విషపాత్రవనీ
నీటిలో మునిగిన అద్దంలోని నీటిని మోహించే సర్పకన్యవనీ

తొలిపొద్దులో విచ్చుకున్న ఆ చిగురాకుకి తెలియదు
ఆకుని ఆనుకుని కదిలే ఆ లేత పూవుకీ తెలియదు
పూవులో మెత్తగా దాగుంటున్న ఆ గాలికీ తెలియదు:

అంటాను నేను వాటన్నిటినీ పదాలు అనే
నేను నీకు చెప్పాలనుకున్న మాటలు అనే
నువ్వుఅర్థాంతరంగా, నీతెల్లటిచేతులతోనులిమివేసిన
అనేక గొంతులనే, అనేక మాటలనే, నాకున్నశరీరమనే-

ఇంతకాలం నీతో ఎలా జీవించానో
నాకు యిక ఎప్పటికీ తెలియదు
నీ స్పందనరహిత వదనంలో ఎలా
నా మరణాన్ని రచించుకోవాలో యిక ఎప్పటికీ తెలియరాదు!

(మరోవైపు లేని ఈ జాబిలికి
ఇటువైపు ఈ ధరిత్రి లేదు
అటువైపు ఆ సూర్యకాంతి కానరాదు:

నీ ముందు ప్రార్ధనకై మోకరిల్లిన
ఆ రెండు ముకుళిత హస్తాలే
ఖండితమయ్యాయి నీ నిర్లక్ష్యంతో, నీ లజ్జారహితంతో-

చూడకు ఇటు: నువ్వు చూడని వాన
అప్రతిహతంగా కురుస్తోంది ఇక్కడ-)

నైరాశ్యం

ఒక రాత్రి అయ్యింది. యిక అల్లుకుంటాయి

తన కళ్ళల్లో సాలెగూళ్ళు. వాటిలో చిక్కుకుని
పోలేక విడివడలేక చివరికి చూడలేక

ఆ చూపోక్కటే కన్నీళ్ళై ఆ బెదురు గూళ్ళల్లో
నిన్ను దాటలేక, నువ్వు దాన్ని ఓపలేక వలయాలుగా తిరుగుతోంది-

ఇద్దరికీ మనందరికీ ఎంత శిక్ష ఇది?

ఇంతకాలం ఇద్దరమూ ఏకంగా ఉండి
ఇద్దరు ఇద్దరిలోకీ వెళ్ళలేక! ఒక్కరిగా ఒక క్షణమైనా భ్రాంతిగానైనా కాలేక-

పోనీ మీరు చెప్పండి, ఎవరికీ ఉన్నాయి ఇళ్ళు ఇక్కడ?

మరొక పగలూ అయ్యింది. యిక మరొక
చీకటి విషపు చింతా మొదలయ్యింది.

పాత్ర నిండా విషంతో, సాలెపురుగులతో

భవంతి గోడ అంచున కూర్చుని
రాత్రితో తనతో మృత్యు లయతో
జనన మరణ ఊయల ఊగేందుకు యిదే సరైన సమయం-

27 February 2012

పొరపాటు

వెచ్చటి వెన్నెల వీధిలో సీతాకోకచిలుకల గూడు

పూలు ఎగిరే గదిలో రాత్రంతా నిరుడు వీచిన గాలిలో
నిన్నే తాకుతాయి కొన్ని చినుకులు

వెలుతురుకై తడుముకునే నీ వేళ్ళకే
అంటుకుంటాయి నెత్తురు చుక్కలు

ఆ కన్నీళ్ళే అవి. మీకు కనపడని వాళ్ళవే అవి
మీకు కనిపించనివే, మీకు వినిపించనివే అవి

ఏమి జన్మ ఇది?!
ఎన్నాళ్ళని ఇలా

మళ్ళా మళ్ళా పిగిలిపోవడం
మళ్ళా మళ్ళా కోల్పోవడం?

బ్రతికి ఉండే ఒక కల
ఒక కలగానే మిగిలి రాలిపోయింది. యిక

హత్తుకునే వాళ్ళెవ్వరూ లేరు ఇక్కడ
దరి చేరే వారు ఎవరూ లేరు యిక్కడ
నిన్నైనా నన్నైనా ఒక కలనైనా-

వెన్నెల గూటిలో పూల రాత్రిలో
తనని తాను ఓపలేక, తనని తాను ఆపలేక
ఒక పచ్చటి సీతాకోకచిలుక
ఆత్మహత్య చేసుకున్నది ఇక్కడే, ఇప్పుడే -

యిక ఎప్పటికీ ఎవరినీ
నేను ఎక్కడ అని కానీ
శ్రీకాంత్ ఎక్కడని కానీ పొరపాటున కూడా అడగకండి~

25 February 2012

ఎప్పటికీ/అసంపూర్ణం (నా దేశం)

ఆకులని కదిపి
కొమ్మలలోకి జారుకుంది ఒక పిట్ట

వొంటరిగా ఎండ
వొంటరిగా తను. యిక ఏడవలేక జోలెలో స్పృహ తప్పిన శిశువు

దప్పికగొని అరచేయంత నీళ్ళకై లోహ రహదారులలో నేను
ఆకలిగొని అదే దారులలో అరచేయంత అన్నం ముద్దకై తను

ఇది అంగవస్త్రం లేని ఒక మాతృదేశం. రూకల కపాలాలని గుట్టలుగా దాచుకునే నూత్న మానవుల ప్రదేశం
ఇది దేహం లేని ఒక తండ్రి శకం. అనవతమైన జెండా కింద
ఒక మృత కళేబరం ఒక మృత స్వప్నం. ఇది రాజకీయ కంకాళాల ప్రపంచ కుగ్రామం, ఒక తీరని రక్త దాహం- యిక

సాయంత్రానికి ఆ ఇద్దరిలో
ఇంటికెవరు చేరుకున్నారో
అసలు ఇల్లు అంటూ ఒకటి ఉందో లేదో ఇద్దరికీ తెలియలేదు

బాహువుల్లో శాపమై విచ్చుకున్న రాత్రికీ
మృత్యు పుష్పాలై రాలిన అనేక అనాధ పిల్లలకీ తెలియరాలేదు-

24 February 2012

విజ్ఞప్తి

ముడివడిన ఆకులను
వేళ్ళ చివర్లతో మెత్తగా పక్కకి జరిపి ఆ ఇంద్రజాల పుష్పాన్ని చూసాను

రంగులతో కూడి రంగు లేనిదీ
వెన్నెల ధూపంతో వ్యాపించేదీ
తడిచిన వేర్ల వాసనతో పెరిగేదీ

నిన్ను విస్మయానికీ, విస్మ్రుతికీ గురిచేసేదీ

అదిగో ఆ తెల్లటి కళ్ళ ఆ పసిడి తనువే
ఆ మాయా మహిమాన్విత వదనమే-

ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి!

బీటలు వారిన చూపులకూ, అలసి వొణికే చేతులకూ
చూపించూ అందించు

ప్రాణావాయువు అందించే నీ ముఖాన్నీ
నేను ప్రార్ధించే నీ స్వరాన్నీ, నుదిటిపై చల్లగా నీడలతో వాలే నీ హిమవనాల అరచేతినీ-

22 February 2012

పిల్లల నిద్ర

పచ్చి ఆకుల తుంపర వాన చినుకులని తాకే కాలంలో
ఒక లతని పెనవేసుకుని నిదురపోతోంది మరొక లత-

గదంతా తేలే చిట్టి నీటిబుడగలు. చుట్టూతా
ఎగురుతూ మరోలోకపు మిణుగురులు
ఊగుతున్న ఊపిరి ఊయలలో పూసే కమ్మటి పూల కలలు

దిగంతాలలోంచి జారి శరీరంలోకి దూసుకుపోతోంది
ఒక మహిమాన్విత ధూపం. అది మెత్తటి నిశ్శబ్ధం. అది మెత్తటి లోకం.
అక్కడ నుంచే ఎవరో రహస్యంగా నిన్ను గడ్డిపరకలతో మీటుతున్న ఆనందం

ఎవరైనా దేవతలు తిరుగాడుతున్నారేమో యిక్కడ
ఎవరైనా గంధర్వులు తమ గానంతో సమస్థానీ
మంత్రిస్తున్నారేమో యిక్కడ. ఎవరైనా శిశువులు ఆప్తంగా
తల్లి చూచుకం నుంచి పాలు తాగుతున్నారేమో యిక్కడ

పూర్వజన్మలో నిన్ను కన్నవారెవరో, పెంచినవారెవరో
చిరుశబ్దాలతో తిరుగాడుతున్నారేమో యిక్కడ
ఈ జన్మలో నువ్వు వొదిలివేసినవారెవరో, నిన్ను విసిరివేసినవారెవరో
నీ ముఖాన్ని అరచేతులలో అతి ప్రియంగా పుచ్చుకుని
ముద్దాడేందుకు రహస్యంగా దాగి ఉన్నారేమో యిక్కడ

ఏం జరుగుతోంది యిక్కడ
మాటలు లేని ఒక మహాశూన్యం నిన్ను నివ్వెరపోయేటట్టు చేసిన యిప్పటి వేళ?
నిండుగా పారే ఆ పిల్లల నిదురలో నువ్వు నీ ఆత్మనీ, శరీరాన్నీ కోల్పోయిన వేళ?

ఏమైనా జరగనీ ఏమైనా కానీ, కానీ
ఒకరినొకరు గాట్టిగా పెనవేసుకుని
నిదురించే పిల్లలని, వాళ్ళ కాలాన్నీ

కలలోనైనా కదలించకు! ఊహామాత్రంగానైనా పిలవకు
ఎందుకంటే

నీ పునర్జన్మ నీ ముందే రూపుదిద్దుకునే
సరైన ఇంద్రజాల సమయం జననిస్తోంది

ఇప్పుడే, ఇక్కడే, అందుకే-

21 February 2012

వీళ్ళు

అద్దంలో మంచినీళ్ళు, వీళ్ళు-

ముఖాన్ని ముంచుకోలేవు
పెదిమలని తడుపుకోలేవు

ఒక పూవులా ఒక శిశువులా
అద్దాన్ని అందుకున్న ఆ అరచేతులలో
కనుమరుగౌతున్న

మనుషులను ఉంచినది ఎవరు?
చేతివేళ్లను చిదిమివేసినది ఎవరు?

20 February 2012

కృతజ్ఞతలు

నుదిటిపై ఒక ముద్ర
అది నీ పెదవిదా లేక యుగాల జ్వలనానిదా తెలియదు

చాతిపై ఒక చేయి
అది హిమవనాల సుమానిదా లేక పూర్వజన్మ సుకృతో తెలియదు

చెవులో సన్నగా ఒక మాట
మెడలో వెచ్చగా ఒక ఊపిరి
అవి శైశవ స్వప్నమో లేక మరుజన్మల అమృత హారమో తెలియదు

కనురెప్పలపై నెమ్మదిగా వాలే పావురాళ్ళు, తేలే మెత్తటి ఆకులు
అవి నే తపించిన ఆదిమ నిద్రనా లేక నా మరణమో తెలియదు

వెళ్ళిపోతోంది శరీరంలోంచి ఒక శరీరం
వలయాలు వలయాలుగా ఆకాశంలోకి
సుగంధ ధూపమై, పొగమంచై-

కాసింత కరుణ కూసింత ప్రేమ
పొదుపుకునే నీ బాహువులు, తల్లి వంటి నీ వక్షోజాలు
మంచినీటి వంటి నాలుగు మాటలు

చాలివి నాకు, బ్రతికి ఉంటాను నీకై నాకై
ఎటువంటి రేపటివరకు-

19 February 2012

భయం

రెండు కళ్ళలో రెండు నిలువెత్తు నీళ్ళల్లో
రెండు కళ్ళ భయం

ఏం మన్నగలదు యిక్కడ
రెండు నీళ్ళల్లో రెండు కళ్ళలో వీచే
రెండు నిలువెత్తు అగ్ని వాయువుల్లో?

రెండు కళ్ళ భయం
రెండు బాహువుల పరాజయం

ఆనక రెండు నీడల
రెండు కాని ఒక మహాచీకటి వలయం

యిక నువ్వు నిర్భయంగా
ఏడవవచ్చు ఈ రాత్రుళ్ళలో
నీ రెండు కనుగుడ్లను ఎవరిలోనో నిస్సిగ్గుగా పొదుపుకుని-

17 February 2012

బహుమతి

నువ్వొక చూపువైతే
నీకొక పూవుని ఇచ్చి ఉందును
నువ్వొక సరస్సువైతే
నీకొక జాబిలిని ఇచ్చి ఉందును
నువ్వొక గాలివైతే
నీకోక తేనెపిట్టను ఇచ్చి ఉందును
నువ్వొక చినుకువైతే
నీకొక మబ్బుని ఇచ్చి ఉందును
నువ్వొక ఆకువైతే
నీకొక నీడని ఇచ్చి ఉందును
నువ్వొక తారకవైతే
నీకొక చీకటిని ఇచ్చి ఉందును
నువ్వొక మాటవైతే
నీకొక మనిషిని ఇచ్చి ఉందును
నువ్వొక గీతవైతే
నీకొక కాగితం ఇచ్చి ఉందును
నువ్వొక బొమ్మవైతే
నీకొక గూడు ఇచ్చి ఉందును
నువ్వొక పలకవైతే
నీకొక బలపం ఇచ్చి ఉందును
నువ్వొక ఆటవైతే
నీకొక మైదానం ఇచ్చి ఉందును
నువ్వొక పాపవైతే
నీకొక ధరిత్రిని ఇచ్చి ఉందును
నువ్వొక ప్రేమవైతే
నీకొక కాలాన్ని ఇచ్చి ఉందును

నువ్వొక లోకం అయితే
నువ్వొక పుణ్యం అయితే
నువ్వొక కరుణ అయితే

నువ్వొక, తపన అయితే నువ్వొక, మోహమయితే
నువ్వొక దాహం అయితే నువ్వొక మరణం అయితే
నువ్వొక జననం అయితే నువ్వొక రహస్యం అయితే
నువ్వొక నిర్యాణమయితే నువ్వొక సమాధి అయితే
నువ్వొక సముద్రం అయితే

నువ్వొక తల్లి అయితే నువ్వొక తండ్రి అయితే
నువ్వొక నీవు అయితే అన్నీ ఇచ్చి ఉందును
నీకు అన్నీ తెచ్చి ఉందును-

అన్నీ అయిన నీకు, అన్నీ ఉన్న నీకు
ఏమి ఇచ్చుకుందును
ఈ నీ జన్మదినాన? ఈ నా అనామక
హృదయ విలాప ఉదయాన?

అనామకం

అంటుకున్న తెల్లటి కాగితంలోంచి
ఎరుపుగా నలుపుగా
సంధ్యాకాంతిలో గాలికి అటూ ఇటూ రెపరెపలాడుతో

పిగులుతోంది
ఎవరో వెలిగించిన ఈ జననపు మంట-

ఎవరు నువ్వు? ఎక్కడ దానివి నువ్వు?
నా రాత్రిని దాచి నా చూపులను పొడిచే

ఆ అనుమతిని ఎవరు ఇచ్చారు నీకు?

16 February 2012

యింతకంటే

కొన్నిసార్లు ఏమీ చేయలేను

ఇల్లంతా కిచకిచలాడుతూ చిట్టి పాదాలతో పరుగిడే
పిచ్చుకలను చూస్తూ ఉండటం తప్ప

అందుకుందామంటే రివ్వున ఎగిరిపోయి
తలతిప్పి చూసి కవ్వించే
పిల్లలని చూస్తూ నవ్వడం తప్ప-

యింతకంటే చేయాల్సిన
పరమ పవిత్రమైన పని
ఏమైనా ఉందా అని నేను

ఎన్నడూ ఎవరినీ మాట వరసకైనా అడగలేదు
అన్నిసార్లూ ఏమీ చేయలేదు-

నిలకడ

నిలకడగా లేని ఒక అద్దం ఊగుతోంది యిద్దరి మధ్యగా

నా ముఖంలోంచి నీ చూపూ
నీ చూపులలోంచి నా చూపూ

దాటుతున్నాయా అంచుల హద్దులని?

నిలకడగా ఉన్న కళ్ళకీ
నీరింకిన మన పదాలకీ
నిలకడగా లేని ఈ నీళ్ళకే తెలియదు

ఆ అద్దం ఎటువైపు ఉందో
అవి కన్నీళ్ళో కావో, అవునో:

యిక ఆ రాత్రి ఇద్దరికీ మిగిలాయి
అత్యంత ఆప్తంగా, అతి ప్రియంగా

ఒక అద్దపు ఆవులింత
ఒక మహా అద్దపు నిద్రా
ఒక మహా అద్దపు కల (మరణంగా)
తదానుగుణంగా-

విన్నపం

అలసిపోయిన చేతులని
హత్తుకోమని అడగలేను

వడలిపోయిన కనులని
ఎదురుచూడమని చెప్పలేను

అక్కడో, ఇక్కడో, ఎక్కడో

తప్పిపోయిన హృదయాన్ని
దారి చూపించమని
ప్రార్ధించలేను, మోకరిల్లలేను

ఉన్నావా అని అడగలేను
ఉంటావా అని అర్ధించలేను

ఈ రాయీ, ఈ శిల్పం
ఈ కాగితం ఈ పదం

మసకబారి మత్తిల్లిన
ఆ రాత్రుళ్ళలో తప్ప

ఎన్నడూ నిన్నది ప్రేమగా
పిలవడం నేర్వలేదు.
ఎన్నడూ నీకది బ్రతికిలేదు

ఎన్నడూ నిన్ను అది
కనీసం బ్రతికించలేదు

వెన్నెల కురిసే కళ్ళలో రక్తం
పెదాలపై నిరంతర మౌనం
ప్రతిష్టించాడమే దాని ధర్మం-

చర్మం నిండిన మర గదులలో
ఈ లోహపు రహదారుల్లో
నువ్వు దాచుకున్నదేమీ లేదు
నేను పొందినదేమీ లేదు. యిక

రాలిపోయిన జాజి పూలనూ
స్వర్గలోకవనాలనూ, పాపం
రెక్కలు తెగిన పిచ్చుకలనూ
చూసిందెవరూ, అడిగిందెరూ

అమాంతం గాట్టిగా కావలించుకుని
మరణం భయపడేటట్టు
ముద్దు పెట్టుకునేదెవరూ?

13 February 2012

ఈ రోజు

నీళ్ళు వంపే చేతులు లేక
వడలింది కుండీలో నిన్నటి మొక్క-

అలసిపోయింది నీ ముఖం
రేపటిని తాకనంతగా రాత్రిలోకి రాత్రిగా మారిపోయాయి నీ కళ్ళు
ఆగీ ఆగీ వీస్తోంది వేడిగా నీ శరీరంపైనుంచి
ఏ ఎడారుల నుంచో దూసుకువచ్చే కర్కశ గాలి

వాలిపోయాయి నిస్సత్తువుగా నీ చేతులు
ఆగిపోయాయి నడవలేక నీ పాదాలు
పలుకలేక పగిలిపోయాయి నీ పెదాలు

యిక ఎవరూ నీటి పాత్రను కదిలించలేదు. పావురాళ్ళకు
యిక ఎవరూ గింజలు చల్లలేదు. ఊడవలేదు
యిక ఎవరూ దుమ్ము నిండిన గదులను, గదులు నిండిన మమ్ములనూ

తను ఒక్కటే అలా తనతో, తన లోకంలో
నిస్త్రాణగా మంచం మీద
రాలుతున్న పూలతో కాలుతున్న తనువతో-

ఇంతా చూస్తూ, ఇంతా రాస్తూ
ఎలా ఉన్నావని ఎలా అడగగలను నిన్ను?

11 February 2012

నీకు

రాత్రి నీటిలోకి చాచిన నా చేతిని
నీ ముఖం ఒక తెల్లటి చేపపిల్లై మెత్తగా తాకింది

యిక గదంతా తెరలు తెరలుగా
నీ పెదాల పరిమళం, వీచే మాటల నీలి గాలి
ఛాతిపై ఒక వెచ్చటి కుంపటి-

బ్రతకవచ్చు కదా ఎలాగోలాగా
అన్న ఒక చిన్న ఆశ
నీ చేయి ఉంది కదా అన్న చిన్ని ధైర్యం

అలసిన నా ముఖాన్ని
నీ భుజంపై వాల్చుకోవచ్చు కదా
అన్న చిన్ని నమ్మకం
ప్రార్ధన వలె నిన్ను స్మరించుకోవచ్చు కదా
అన్న ఒక మహా విశ్వాసం-

యిక ఆ రాత్రి నా ఎదురుగా
దీపంలా నిన్ను ఉంచుకుని
నేను ఎలా నిదురించగలను ?

10 February 2012

నా గదిలో

ఇక్కడేమీ లేదు నీకై నా గదిలో

రెండు రాళ్ళు, రెండు కళ్ళు
ఆ నీడలలో దాగిన
రెండు పావురాళ్ళు

రెండు చేతులు రెండు కాళ్ళు
అలా ఎగిరే పచ్చని
సీతాకోకచిలుకలు

నీ కోసం తపనగా వెదుకుతూ
నీ వరకూ సాగే రెండు పెదాలు

గోడపై పగిలిన ఎండ రెండుగా
పూసిన పూలు నిండుగా
రెండుగా, రెండు పదాలుగా-

ఇక్కడేమీ ఉంచలేదు నీకోసం
నేను నా గదిలో-

ఒక కూజాలో రెండైన ఆ ముఖం తప్ప
ఒక అద్దంలో రెండైన చూపులు తప్ప
రెండు చూపులలో నాలుగు విధాలుగా
పగిలిన, మిగిలిన నువ్వు తప్ప

రెండుగా మిగిలిన నేను తప్ప
రెండుగా చిట్లిన మరణం తప్ప

ఇక్కడ ఏమీ దాచుకోలేదు నాకై
నేను నా గదిలో-

ఇంతకూ ఎటువంటి హస్తాలతో
హత్తుకున్నావు నువ్వు నన్ను

వ్యామోహంతో ప్రేమతో ద్వేషంతో

నీ నవ్వు మెరిసే బాకుతో
నువ్వు నన్ను దయగా పొడిచిననాడు?

08 February 2012

ఆ ప్రదేశం

ఒకోసారి ఆ పిలుపు నిన్ను పిలుస్తుంది

అద్దంలోంచి ఒక చేయి
నిన్ను అంధుడిని చేసినట్టు
కలలో ఒక మెత్తటి ముఖం
నిన్ను నమిలి తిన్నట్టు

నోటి వద్ద నీటి పాత్రలోంచి
నీలి సర్పాలు ఎగిసినట్టు
రాత్రిలో ఏవో అ/ శరీరాలు
నీ గొంతు నులిమినట్టు

నీ కళ్ళను పెకిలించి ఎవరో
నీకే నీకై ఆప్తంగా ఇచ్చినట్టు
నీ పక్కగా కూర్చుని ఎవరో
నిన్ను తాపిగా కొస్తున్నట్టు

దాహంతో ఉలిక్కిపడి లేచిన
పెదాలకు ఎవరో ప్రేమగా
కాలకూట విషం తాపిస్తున్నట్టు

ఎవరో ప్రేమగా నిన్ను
చెరిపివేస్తున్నట్టు
చిదిమివేస్తున్నట్టు
చంపివేస్తున్నట్టూ

ఒక్కోసారి ఆ సమ్మోహనమైన పిలుపే నిన్ను
నవ్వుతో లాక్కువెడుతుంది
ఆ తలారుల తోటల్లోకి, రంగుల్లోకి-

యిక ఎవరొచ్చారు తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి
కొట్టుకునే గుండెతో, హత్తుకునే బాహువులతో?

ధూపం

పల్చటి చీకటిలో వెలిగించిన
సంపెంగల సాంభ్రానీ కడ్డీ పొగ: నీ దేహం-

నిశ్చలమైన ఆ రాత్రి గదిలో
హటాత్తుగా శ్వేతకపోతాల
వేయి లక్ష రెక్కల అలజడి

సన్నటి వాన, ఊగే గాలీ
ఎక్కడినుంచో వచ్చే అవిసె తోటల వాసన

సన్నటి వొణుకు
ఈ నిన్నటి నాలో:
సన్నటి బెరుకు
ఆ నా రేపటి నీలో-

వెన్నెలని బాతుని తనలో దాచుకుని
తెరచిన కిటికీలలోంచి యిక

లేత నవ్వుతో రివ్వున పారిపోయింది
పొగమంచో, పావురమో
నీ తనువో నవ్వే నువ్వో

యిక నాకెప్పటికీ తెలియదు!

07 February 2012

ఎలా?

ఎలా ఉండింది
నిరుడు కురిసిన ఆ వర్షం?

పచ్చగానా? ఎర్రగానా?
వెచ్చగానా? చల్లగానా?

నలుపుగానా?
తెలుపుగానా?
మాయ చేసే మోహంగానా?

కామంగానా?
ప్రేమగా నా?
ఏమీ తెలియని మహా దాహంగానా?

నిండైన కోరికగానా?
మహా ద్వేషంగానా?
అన్నీ తెలిసిన రెండు శరీరాల్లానా?

ఎలా ఉండింది
ఇద్దరినీ ముంచివేసిన
నిరుడు కురిసిన వర్షం?

దయగా నా?
దుక్కంగానా?
ఇప్పటికీ ఉలిక్కిపడి లేచే
చెమట పట్టిన రాత్రుళ్ళలానా?

వొణుకులానా?
విరహంలానా?
ఏడ్చి ఉబికిన కనీళ్ళలానా?

రక్తం లానా?
శోకం లానా?
తెగిన మణికట్టుతో మింగిన
నిద్రమాత్రలలానా?

పిల్లల లానా?
పిట్టల లానా?
రాకుండా వెళ్ళిపోయిన
గర్భస్రావపు పూవులానా?

ఎలా ఉండింది ఆ వర్షం
నినూ నన్నూ
ముంచి వేసిన, నిరుడు
కురిసిన ఆ వర్షం?-

యవ్వనం లానా?
వృద్ధాప్యం లానా?
మత్తులోకీ, చావులోకీ ముంచే
తియ్యటి విషంలానా?

పదంలానా? ఆ
కల కలలానా?

కలైన పదంలానా
పదమైన కలలానా
నిదురులోని గుసగుసలలానా?

వీడ్కోలులానా
దూరాం లానా
ఎన్నటికీ తాకలేని చేయిలానా?

బ్రతకలేని నీ జీవితంలానా
జీవించలేని మరణంలానా

ఖాళీ బాహువులలానా
ఖాళీ చూపులలానా
ఒంటరి దీపంలానా చీకటి గదిలానా మదిలానా

ఎండిన పూలపాత్రలానా
వడలిన రోజాలానా మార్చని దుప్పట్లలానా
వేయని వెల్తురులానా కదలని తెరల లానా

వెలసిపోతున్న దినంలానా
ఆ దిగులు సాయంత్రంలానా
నువ్వు చెప్పలేక కోల్పోయిన
ఒక మహా ఇష్టంలానా, ప్రియమైన మనిషిలానా

ఎలా ఉండింది
నిరుడు కురిసి వెళ్ళిపోయిన

యిక ఎప్పటికీ రాని ఆ వర్షం?

లేదు దారి

అరచేతులతో దాచుకున్న ముఖం కాదిది
కాగితాలతో కప్పుకున్న సమాధి

తెరలతో లోకం ఏమీ మారలేదు, నువ్వేమీ తెరిపి పడలేదు

తెంపుకున్న పూలు, రాసుకున్న పదాలూ
హత్తుకున్న చేతులూ, కమ్ముకున్న చీకట్లూ
కన్నీళ్ళతో ఉడికే కళ్ళూ, ఆ మెత్తటి తనువూ

దాచుకోడానికి ఏమున్నాయి యిక్కడ
ఇంతకు మించీ? ఇంతకు మినహా?

చూడెలా ఇకిలింతలతో మెరుస్తుందో నీ పాప
నీ అనుమతి హద్దులను దాటి
ఎందుకో దాచుకున్న నీ ముఖాన్ని తాకి!

నీలోని నువ్వే నీకు ఒక పెద్ద అడ్డు
నీకు నువ్వే ఒక మహా కనికట్టు- ఎన్ని నాలికలు నీ శరీరంనిండా!

ఇపుడే అరిచింది హృదయంలోని నల్ల కాకి
అతిధులు వచ్చేందుకూ నువ్వు అద్దంలోంచి అడుగిడేందుకూ
యిదే సరైన మహామాయా సమయం: వెళ్ళు. వెళ్లి తెంపుకురా

వెన్నెలలో రహస్యంగా విచ్చుకునే
పాపాల పూలను పరమ పవిత్రంగా
ఎందుకంటే

ఒక ఖడ్గంతో, క్షమతో కూడిన ఒక విషపు చిర్నవ్వుతో
తను అనంతంగా నీకై ఆ గడప వద్ద
గులక పదాలతో ఎదురుచూస్తోంది-

06 February 2012

ఎవరైనా అడిగితే

ఎవరు అని ఎవరైనా అడిగితే ముమ్మాటికీ ఇద్దరమనే చెప్పు

నిప్పు పూలతో జలదరించే శరీరాలమనే చెప్పు
ప్రేమతో నిండిన మహా పాపాత్ములమనే చెప్పు
కరుణ నిండిన మహా కటినాత్ములమనే చెప్పు

ఎరుకతో తూలుతున్న మహామధుపాన
మృత్యు ప్రియులమనే చెప్పు - ఈ విగ్రహ
లోకాలనూ నిగ్రహ జనాలనూ వెక్కిరించే
పిచ్చివాళ్ళమనే చెప్పు. నేరం చేయని నేరస్థులమనీ

అకారణంగా నవ్వే పిల్లలమనీ నీ స్మృతలమనీ
దేహాల ద్రిమ్మరులమనీ, దేశం లేని వాళ్ళమనీ
దేహాలు లేని వాళ్ళమనీ
సౌందర్య బిక్షుకులమనీ
బాహువులు చాచి తిరిగే నేల బాటసారులమనీ

ఆదిమ జంతువులమనీ యిద్దరుగా కనిపించే
ఆ ఒక్కరమనే చెప్పు: మరేం లేదు ఇంతకంటే

వీచే నీడలో వాలే ఆ గడ్డిరెమ్మ కంటే
పూచే పూవు కంటే రాలే వాన కంటే
నిండైన రాత్రి కంటే ఆ కళ్ళలో నిలిచిన మెత్తటి నీళ్ళ కంటే
కొమ్మల్లోని గూళ్ళ కంటే ప్రమిదె వెలుతురు చుట్టూ తిరిగే

క్షణకాలంలో ధగ్ధమయ్యే ఆ పురుగు కంటే
ఈ నీ నా జీవితం గొప్పదేమీ కాదు.సరే సరే

నువ్వంటే నాకిష్టం అని చెప్పడానికి
ఇంతకంటే మరేం కావాలి? నాకూ నీకూ?

05 February 2012

విషవాక్యం

ఇష్టం నువ్వంటే చాలా
అందుకే ఏమీ చెప్పలేను

ఎదురుగా చిట్లే ఎండ
నీళ్ళతో కళ్ళని కొస్తుంది పదునుగా, ఉప్పగా

మనం మాట్లాడుకోనిది ఆ నీళ్ళ గురించే
కన్నీళ్ళ గురించే, ఇష్టం గురించే

గుంపులుగా ఆకులు రాలే
అలలుగా ఎడారులు తేలే
ఈ తెల్లటి తేళ్ళ మధ్యాన్నంలో, వాటి తియ్యటి విషంలో

నువ్వంటే చాలా చాలా ఇష్టం
అందుకే ఏమీ చెప్పలేను యిక
అందుకే ఏమీ రాయలేను ఇక. ఇకందుకే

మూసివేయి నా కాంతిద్వారాలను
నీ చీకటి హృదయమందిరంలోకి
ఒక మధుపాన నిద్రగా విస్మృతిగా ఆత్మరహితంగా-

యిక ఈ నాటి తరువాత నా ఇష్టాన్నీ
నిన్నూ తిరిగి నేనెప్పుడూ ఇష్టపడను-

04 February 2012

ఏం చేస్తావు?

ఇదొక పచ్చిక మైదానం కాదు
అలా అని వెన్నెల గూళ్ళు కట్టుకునే పూలవనమూ కాదు

రెండు బుజ్జి కుక్కపిల్లలు
లోహపు దారులపై, యంత్రపు హృదయాలపై

ఒకదాని వెనుక మరొకటి, గిరగిరా గిరగిరా గిరగిరా గిరగిరా
నీ చుట్టూతా నీ వెనుకా పరిగెడతాయి

పాల పొదుగుల కళ్ళు, లేతగా నవ్వే చెక్కిళ్ళు

లేత ఎరుపు నాలికలతో రాత్రి గాలిని తాగుతో
అవి తల్లి లేని ఆ బుజ్జి కుక్కపిల్లలు

ఒకదానితో మరొకటి, నీతోనే ఒకటి నీతోనే ఆ మరొకటి
నీ వెనుకే నీ చుట్టూతా గిరగిరా గిరగిరా గిరగిరా గిరగిరా
చెంగున ఎగురుతో అపై, తటాలున నిన్ను నాకుతో
రివ్వున తోకల్ని ఊపుతో మహదానందంతో గెంతుతో

తెల్లని నల్లని తెలనల్లని నలతెల్లని నల్ల తెల్ల ఊదాతనంతో
నీలోకీ నువ్వు వెళ్ళలేని నింగి లోకాలలోకీ కాలాలోకీ అవే

నీ భాష వొదిలివేసిన ప్రేమతో, జీవంతో కదులుతో
ఈ విశ్వపు సజీవ శ్వాస కాంతితో సాగుతో
కాంతి చైతన్యంతో మెదులుతో అవే మరి నీతో నాతో మరి అవే-

మరి ఏం చేస్తావు నువ్వు, మరి ఏం చేయగలవు నువ్వు
రాత్రి నీతో కదిలి, నిన్ను నీ చదరపు గదుల
శీతల నిర్ధయ కాంతి భవంతుల వద్ద వొదిలి

నీచే కసురుకోబడి, నీచే విసిరివేయబడి, నీచే చరచబడి

ఉదయానికల్లా దారిపై చెల్లాచెదురై, పేగులు చిట్లి రక్తం ఓడిన
నీ వెనుకాలే, నీ చుట్టూతా గిరగిరా గిరగిరా పూవుల్లా ఎగిరిన

తల్లి లేని ఆ బుజ్జి కుక్కపిల్లల్ని
తండ్రి లేని ఆ బుజ్జి వీధి పిల్లల్ని

ఇప్పటికీ నీ వెనుకాలే వచ్చే, నువ్వే సర్వం అనుకున్న
నీ పిల్లనీ నీ పాపల్నీ అనాధల్నీ

ఈ మహా రాక్షస అనాధ దేశాన్నీ
ఈ అత్యాధునిక మహారాక్షస ఇనుప తెరల మనుషులని?

ఏమని అందాం దీనిని?

ఒక పదాన్ని అంటు కట్టాను
అది ఎలా ఎదుగుతుందో చూద్దామని

యిక నీవైపు చూస్తూ కూర్చున్నాను
రంగు రంగుల గులక రాళ్లయిన నీ కనుల వైపూ
ఆ పచ్చి పూల పరిమళం తెచ్చే నీ పెదాల వైపూ

ఎవరో ఒకరు మాట్లాడాలి
ఎవరో ఒకరు ఒక పదాన్ని మరొక పదంతో మార్చాలి
ఎవరో ఒకరు ఒక పదంగా, మరొక పదంగా ఇద్దరు కలసి నడిచే ఒకే పాదంలా అందంగా రంగు మారాలి
మన ముఖాల్ని తమ వైపు సుతారంగా తిప్పుకోవాలి

తొలి ఎండ తొలి సాయంత్రం తొలి తొలి పరిచయం
తొణికే నీళ్ళే ఇద్దరిలో, అటూ ఇటూ ఇటూ అటూ
అటునించి ఇటూ ఇటునుంచి అటూ

ఊగే ఆ నిశ్శబ్ధం ఊయాలే నిన్ను నన్నూ కాపాడే ఒక మహా కరుణ
ఒక మహా జీవనజ్వాల, ఈ విశ్వం ఇద్దరికీ ఇచ్చిన ఒక మహా తపన

అటునించి ఇటూ ఇటునించి అటూ
ఇటూ అటూ అటూ ఇటూ అందుకే
ఆ పాప ఊగుతుంది అలా, గాలిలా
హాయిగా నిన్నూ నన్ను కన్న జోలపాటలా ఒక మహాతల్లి పొదుగులా-

ఇక ఈ జన్మకు నువ్వు బాలికవు కాలేవు
ఒక బాలుడనై యిక నేను తిరిగి రాలేను - అందుకే

చూడు అక్కడే వృద్ధులై ఓరిమిగా నీ తల్లీ తండ్రీ
చూడు ఇక్కడే వృద్ధులై ఓరిమిగా నా తల్లీ తండ్రీ
సమాధుల వద్ద నలుపు గులాబీలతో తెలుపు ప్రేమలతో తెంపుకోలేని మమకారాలతో

వాళ్ళే ఒక పదాన్ని అంటు కట్టారు నీకోసం నాకోసం
నీ తరువాత వచ్చే పిల్లలకోసం, పిట్టలకోసం ఆకాశం కోసం ఈ మట్టి కోసం-

చూడు అది ఎన్ని రంగురంగుల పదాలని కాంతులతో
నునువెచ్చని నీ బాహువుల మృత్యువుతో నా వద్దకి తీసుకు వచ్చిందో!

ఇంతకూ ఏమని అందాం దీనిని? ఏమని పిలుద్దాం దీనిని?

ఇక

నిద్రలోంచి నీ కన్ను
మెత్తగా నీడంత దయగా మొలకెత్తుతోంది

గదిలో పచ్చటి కాంతి
తడచిన ఆకుల పచ్చి వాసన

ఎవరో తడిచి వచ్చి, అద్దంలో చూసుకుంటూ
జుత్తు దులుపుకుంటున్న వాసన

ఒద్దికగా ఒత్తిగిల్లే ఒళ్ళు. చినుకులు చిట్లే
నువ్వు వొళ్ళు విరుచుకునే చప్పుళ్ళు -

చూడు నీ చూపులోంచి
నా భవిష్యత్తు ఎలా మెత్తగా నీఅంత దయగా
నీ అరచేతుల నీడలో మొలకెత్తుతోందో:

ఇక నిన్ను ముద్దు పెట్టుకుని, బ్రతికేందుకూ
ఈ రాక్షస పగటిలోకి నేను సాగిపోయేందుకూ
యిదే సరైన సమయం-

ఇక అందివ్వు నీ చేతిని, ఇంతకు మించి
ఇంతకు మినహా నిన్నేమీ అడగను!

03 February 2012

ప్రశ్న(అవునా?)

ప్రేమతో సాధించలేనివి
ద్వేషంతో సాధించ వచ్చును-

అవునా?

నువ్వు ఎదురొస్తావనే

నువ్వు ఎదురొస్తావనే ఇంటికి రావడం

తళతళ లాడే ముఖంతో మిలమిల మెరిసే కనులతో
చేతులు చాచి హత్తుకుంటావనే తిరిగి రావడం

ధూళి నిండిన దారులను వొదిలి, మాలిన్యం అంటిన
మనుషులను వొదిలి అదిగో ఆ యంత్రం నోటితో
లోహనాలిక పలికే పదాలనూ అర్థాలనూ వొదిలి

వదన వాచకాలని వొదిలి, కవిత్వ వ్యసనాలని వొదిలి
ఆకాశమంత పెరిగిన అహాన్ని వొదిలి
ఇనుప చేతులతో పెదాలతో అల్లుకునే స్త్రీలను వొదిలి

రూపాన్ని వొదిలి, రూపాయిని వొదిలి
జనంలేని అంతర్జాలాన్ని వొదిలి, మింగివేసే అనుసంధాల్ని వొదిలి
అంతిమంగా నువ్వు ఉన్నావనే నువ్వలా ఎదురు చూస్తుంటావనే

నువ్వు ఉంటావనే, నువ్వు హంస పాదాలతో ఎగురుతుంటావనే
ఈ ఇంటికి రావడం, ఈ చదరపు గదుల దరి చేరడం
నువ్వున్నావనే, నువ్వు ఉంటావనే ఇంకా ఇలా బ్రతికి ఉండటం:

ఒక్కసారి దగ్గరికి తీసుకుని, ఎప్పటిలా కౌగలించుకుని
గాట్టిగా ఒక ముద్దు పెట్టుకోవా, శరీరం బద్దలయ్యేటట్టు?

వానరం

అలిగారు ఎవరో
పాపం పదాలతో పదాలులేని పదాలతనంతో

ఉడుక్కున్నారు ఎవరో
పాపం వాక్యాలతో, కొన్ని వ్యాఖ్యలతో వాచకాలతో

పసితనం పోయి, అకారణంగా పెద్దవాడైపోయి

మొగలి పొదల్లో పూలగాలి వీచడం లేదని
చినుకుల్లో చిరుఆకులు అల్లాడటం లేదని
స్వఅక్షరాల వద్దే గులిగారు ఎవరో పాపం మళ్ళా మళ్ళా

అశాంతితో మోయలేనంత అసూయతో. అందుకే

సలహాలే చెప్పారు ఎవరో, కవిత్వం ఎలా రాయాలో
దుస్తులే విప్పారు ఎవరో ఎవరివో నడి బజార్లో
చివరిగా ఉక్రోషం పట్టలేక ఏడ్చారు ఎవరో ఎక్కిళ్ళతో:

చూడు. ఇక్కడ హృదయంలో నివాసముందొక వానరం
అది నీ మాటా వినదు, నా మాటా వినదు. అందుకని

వెళ్ళు వెళ్లిక. నీ స్వీయప్రాముఖ్యతనూ నిన్నూ

నీ మహావాచక కవితా వాక్యాలను భుజాన వేసుకుని
మోసుకు తిరిగే నీ అలకలను తీర్చే సదా శాంత
బానిస పూజారులు ఎవరూ లేరు ఇక్కడ: ఎందుకంటే

నా లోని వానరానికి మహా ఆవులింత వచ్చింది కనుక-

నీ ఇష్టం

ఒక చిన్న పాత్ర
తనంత, తన తనువంత చిన్న పాత్ర

పూలు ఉంచుకుంటావో నీళ్ళు జల్లుకుంటావో
నీ ముఖాన్ని ముంచుకుంటావో ఇక నీ ఇష్టం

గోడకి అభిముఖంగా అద్దంలో
ఒక చందమామ వెలుగుతోంది:

తన కురులను సర్ధుకుని దువ్వుకుని
గదిని ముంచివేసిన వాటి చీకట్లలో
తన నుదుటన ఒక కాంతి రేఖను

వలయంగా దిద్దుతోంది: తన కనులతో
అద్దం కళ్ళలో గూళ్ళను అల్లుతోంది

పెదవిని మునిపంట నొక్కిపెట్టి
అద్దంలోంచి నిన్ను చూసి నవ్వుతోంది
ఆగి ఆగి జల్లుజల్లుగా రాలిపడుతోంది

చలించే చిన్న పవిత్ర పాత్రే తను
అలలై కదిలే చిరుగాలే తను
మరపు లేని తన తనువే తను:

ఉంచుకుంటావో, దాచుకుంటావో
పగలగొట్టి చేజార్చుకుంటావో ఇక నీ ఇష్టం-

స్నేహితుడు

నువ్వు లేకుండా ఉండలేను

రాతి దారిలో దొరికిన పువ్వువి నీవు
రాత్రి సరస్సులో మెదిలే
చిరుగాలి జాబిలివి నీవు

కనులని పసివేళ్ళతో నిమిరిన
చల్లటి వానవి నీవు
మెత్తటి నీడవి నీవు

రంగుల తోటలో రెపరెపలాడే
తెల్లటి సీతాకోకచిలుకవి నీవు

నా వెనుక ఉండి, నన్ను దాచుకుని
నన్ను పొడిచే బాకులని
వెన్నులోకి తీసుకునే నా
స్నేహ ప్రేమికుడివి నీవు
నా ప్రియమిత్రుడవి నీవు

ఇదిగో యిప్పుడు చెబుతాను: ఇదిగో
ఇప్పుడే చెబుతున్నాను

నువ్వు లేకుండా ఉండలేను
నువ్వు వున్నా ఉండలేను!

01 February 2012

వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)

నన్ను పొగిడే వాళ్ళే ణా కిష్టం
పొగిడినంత పెరుగుతా మరిన్ని పుస్తకాలు పొదుగుతా

కవిత్వంలో ణా దారిలో మరో పాదం లేదు
కథలలో ణాకు ముందూ, ణాకు తరువాతా మరొకరికి స్థానం లేదు

చాలు ణాది ఇక ఒక్క కవిత, చాలు ణాది ఇక ఒక్క కథ, కాదా ఇక కదలదా ఇక ఒక
హోరుహోరు ఈ ప్రపంచ కుగ్రామమంతా, మోగదా ఇక
అనుఏక అనువాదాల ణానా వ్యాఖ్యల జోరు ముఖ తెరల నిండా?

ణా పాటకులకు ణేనే దేవుడన్, వాళ్ళే ణాకు నిరంతర దాస్యులన్
నన్ను అను నిత్యం స్థుతించే బానిసలన్, నన్ చూసి పరవశించె భక్తులన్ణ్

అహో ణా అంత మహా రచయిత లేడు ఇక రాడు కాక రాడు

దళిత చిరుతను ణేనే, అత్యాధునిక అంతరంగిక ఆ ఆవలివాడినీ ణేణే
అక్కడ నేనే ఇక్కడ ణే నేనే, సర్వజనసమ్మోహన నిమ్నకులాల నీనీ
సకల జాతుల డిస్కోర్స్ ణాదే, మార్క్ష్సిజమ్ ణాదే, అంబేద్కర్ని కనుగొన్నదీ ణేణే

ఫెమినిజం ణాదే ఇస్లాం ముస్లిం తత్వం ణాదే నిర్మాణం వినిర్మాణం
ఆధునికత అత్యాధునికాంతర సాంస్కృతిక యితరణం ణేణే
భాష ణాదే భావం ణాదే, నలు దిక్కులా మెరిసిపోయే ణామం ణాదే
ణాణీలు ణావే, నగ్న విప్లవ శ్రేణి ణాదే, స్పష్టతా అస్పష్టతా ణాదే అన్నింటా బోణీలు ణావే

ఇకన్నూ ర/చించెద, అన్ని పత్రికలందు వ్యాపించెద తంత్రీ తంత్ర ప్రసారములందు
వాద వివాదములను చర్చించెద, ఆనక కన్నూ మిన్నూ కానక
వరుసగా ణా స్వీయ కవితా జైత్రయాత్రలను ముచ్చటగా మిక్కుట మర్కటముగా
ఆత్మకథలుగా పురజనులకు వినిపించెద, రాబోవు వారికి ణా పౌరసత్వమును
సంపుట పుటలుగా, జ్ఞానముతో పీటముగా భూషణముగా వొదిలి వెళ్ళెద. దా దా

అన్నింటా నేనే, సర్వాంతర్యామీ ణేణే, అందరితోనూ ణేణే అసలు అందరూ ణేనే

అందుకే రండి. నన్ను స్థుతించు డి . నిండుగా నన్ను మురిపించు డి . ణాపై మరిన్ని
పుస్తకాలణి ప్రచురించు డి. అకాడమీలను అందించు డి
అందుకే రండి. నన్ను స్థుతించు డి. ణాన్ను ఇంకా ఇంకా ఇంకా ణే మరణించు వరకూ
ఆదరించు డి. పొగడ్తలతో పూజించు డి. ఆకాశమును తాకునంత వరకూ
ణా చిరుబొజ్జను భజనకీర్తులతో నింపు డి, అందుకే రండి రారం డి - అందుకే ఇక

ఎప్పటికిన్నున్నూ నన్ను పొగిడే వాళ్ళే నాకిష్టం
పొగిడినంత సాగు థా, ఇంకా పొడుగ్గా పెరుగు థా ఇటువంటి ఆ పదాలని పొడుగు థా

అందుకే ఇక తాగు థా ఇటువంటి పదాల ణి. ఆహ్.. ఇహ అందుకే
ఇక అంతా, అంతకు మునుపూ ఆ తరువాత అనంతం దాకా ణానా
పదాల స్ఖలనం, అవే ణా అహంకీ ణాకు బహుబలం

ఇంతకూ చూసావా నువ్వు, ఇంతకు మునుపు చూసావా ణువ్వు
ఎవరి సమాధిలో ణో, ణా శరీరమంత నాలికను నాకుతున్న ణీ నాలిక టిప్పా టప్పా ణీను?