04 February 2012

ఏమని అందాం దీనిని?

ఒక పదాన్ని అంటు కట్టాను
అది ఎలా ఎదుగుతుందో చూద్దామని

యిక నీవైపు చూస్తూ కూర్చున్నాను
రంగు రంగుల గులక రాళ్లయిన నీ కనుల వైపూ
ఆ పచ్చి పూల పరిమళం తెచ్చే నీ పెదాల వైపూ

ఎవరో ఒకరు మాట్లాడాలి
ఎవరో ఒకరు ఒక పదాన్ని మరొక పదంతో మార్చాలి
ఎవరో ఒకరు ఒక పదంగా, మరొక పదంగా ఇద్దరు కలసి నడిచే ఒకే పాదంలా అందంగా రంగు మారాలి
మన ముఖాల్ని తమ వైపు సుతారంగా తిప్పుకోవాలి

తొలి ఎండ తొలి సాయంత్రం తొలి తొలి పరిచయం
తొణికే నీళ్ళే ఇద్దరిలో, అటూ ఇటూ ఇటూ అటూ
అటునించి ఇటూ ఇటునుంచి అటూ

ఊగే ఆ నిశ్శబ్ధం ఊయాలే నిన్ను నన్నూ కాపాడే ఒక మహా కరుణ
ఒక మహా జీవనజ్వాల, ఈ విశ్వం ఇద్దరికీ ఇచ్చిన ఒక మహా తపన

అటునించి ఇటూ ఇటునించి అటూ
ఇటూ అటూ అటూ ఇటూ అందుకే
ఆ పాప ఊగుతుంది అలా, గాలిలా
హాయిగా నిన్నూ నన్ను కన్న జోలపాటలా ఒక మహాతల్లి పొదుగులా-

ఇక ఈ జన్మకు నువ్వు బాలికవు కాలేవు
ఒక బాలుడనై యిక నేను తిరిగి రాలేను - అందుకే

చూడు అక్కడే వృద్ధులై ఓరిమిగా నీ తల్లీ తండ్రీ
చూడు ఇక్కడే వృద్ధులై ఓరిమిగా నా తల్లీ తండ్రీ
సమాధుల వద్ద నలుపు గులాబీలతో తెలుపు ప్రేమలతో తెంపుకోలేని మమకారాలతో

వాళ్ళే ఒక పదాన్ని అంటు కట్టారు నీకోసం నాకోసం
నీ తరువాత వచ్చే పిల్లలకోసం, పిట్టలకోసం ఆకాశం కోసం ఈ మట్టి కోసం-

చూడు అది ఎన్ని రంగురంగుల పదాలని కాంతులతో
నునువెచ్చని నీ బాహువుల మృత్యువుతో నా వద్దకి తీసుకు వచ్చిందో!

ఇంతకూ ఏమని అందాం దీనిని? ఏమని పిలుద్దాం దీనిని?

1 comment:

  1. Wow. Great. Don't know if it was you/I or the parents who grafted it. The poem drifts and it is good. As a person, I won't bother to name it, Sri! Would only love it, use the axe only to clear obstacles towards it. I love the love in your words.

    ReplyDelete