03 February 2012

వానరం

అలిగారు ఎవరో
పాపం పదాలతో పదాలులేని పదాలతనంతో

ఉడుక్కున్నారు ఎవరో
పాపం వాక్యాలతో, కొన్ని వ్యాఖ్యలతో వాచకాలతో

పసితనం పోయి, అకారణంగా పెద్దవాడైపోయి

మొగలి పొదల్లో పూలగాలి వీచడం లేదని
చినుకుల్లో చిరుఆకులు అల్లాడటం లేదని
స్వఅక్షరాల వద్దే గులిగారు ఎవరో పాపం మళ్ళా మళ్ళా

అశాంతితో మోయలేనంత అసూయతో. అందుకే

సలహాలే చెప్పారు ఎవరో, కవిత్వం ఎలా రాయాలో
దుస్తులే విప్పారు ఎవరో ఎవరివో నడి బజార్లో
చివరిగా ఉక్రోషం పట్టలేక ఏడ్చారు ఎవరో ఎక్కిళ్ళతో:

చూడు. ఇక్కడ హృదయంలో నివాసముందొక వానరం
అది నీ మాటా వినదు, నా మాటా వినదు. అందుకని

వెళ్ళు వెళ్లిక. నీ స్వీయప్రాముఖ్యతనూ నిన్నూ

నీ మహావాచక కవితా వాక్యాలను భుజాన వేసుకుని
మోసుకు తిరిగే నీ అలకలను తీర్చే సదా శాంత
బానిస పూజారులు ఎవరూ లేరు ఇక్కడ: ఎందుకంటే

నా లోని వానరానికి మహా ఆవులింత వచ్చింది కనుక-

3 comments: