20 February 2012

కృతజ్ఞతలు

నుదిటిపై ఒక ముద్ర
అది నీ పెదవిదా లేక యుగాల జ్వలనానిదా తెలియదు

చాతిపై ఒక చేయి
అది హిమవనాల సుమానిదా లేక పూర్వజన్మ సుకృతో తెలియదు

చెవులో సన్నగా ఒక మాట
మెడలో వెచ్చగా ఒక ఊపిరి
అవి శైశవ స్వప్నమో లేక మరుజన్మల అమృత హారమో తెలియదు

కనురెప్పలపై నెమ్మదిగా వాలే పావురాళ్ళు, తేలే మెత్తటి ఆకులు
అవి నే తపించిన ఆదిమ నిద్రనా లేక నా మరణమో తెలియదు

వెళ్ళిపోతోంది శరీరంలోంచి ఒక శరీరం
వలయాలు వలయాలుగా ఆకాశంలోకి
సుగంధ ధూపమై, పొగమంచై-

కాసింత కరుణ కూసింత ప్రేమ
పొదుపుకునే నీ బాహువులు, తల్లి వంటి నీ వక్షోజాలు
మంచినీటి వంటి నాలుగు మాటలు

చాలివి నాకు, బ్రతికి ఉంటాను నీకై నాకై
ఎటువంటి రేపటివరకు-

No comments:

Post a Comment