13 February 2012

ఈ రోజు

నీళ్ళు వంపే చేతులు లేక
వడలింది కుండీలో నిన్నటి మొక్క-

అలసిపోయింది నీ ముఖం
రేపటిని తాకనంతగా రాత్రిలోకి రాత్రిగా మారిపోయాయి నీ కళ్ళు
ఆగీ ఆగీ వీస్తోంది వేడిగా నీ శరీరంపైనుంచి
ఏ ఎడారుల నుంచో దూసుకువచ్చే కర్కశ గాలి

వాలిపోయాయి నిస్సత్తువుగా నీ చేతులు
ఆగిపోయాయి నడవలేక నీ పాదాలు
పలుకలేక పగిలిపోయాయి నీ పెదాలు

యిక ఎవరూ నీటి పాత్రను కదిలించలేదు. పావురాళ్ళకు
యిక ఎవరూ గింజలు చల్లలేదు. ఊడవలేదు
యిక ఎవరూ దుమ్ము నిండిన గదులను, గదులు నిండిన మమ్ములనూ

తను ఒక్కటే అలా తనతో, తన లోకంలో
నిస్త్రాణగా మంచం మీద
రాలుతున్న పూలతో కాలుతున్న తనువతో-

ఇంతా చూస్తూ, ఇంతా రాస్తూ
ఎలా ఉన్నావని ఎలా అడగగలను నిన్ను?

2 comments:

  1. ఇక ఎవరూ దుమ్ము నిండిన గదులను, గదులు నిండిన మమ్ములనూ

    బాగుంది

    ReplyDelete