22 February 2012

పిల్లల నిద్ర

పచ్చి ఆకుల తుంపర వాన చినుకులని తాకే కాలంలో
ఒక లతని పెనవేసుకుని నిదురపోతోంది మరొక లత-

గదంతా తేలే చిట్టి నీటిబుడగలు. చుట్టూతా
ఎగురుతూ మరోలోకపు మిణుగురులు
ఊగుతున్న ఊపిరి ఊయలలో పూసే కమ్మటి పూల కలలు

దిగంతాలలోంచి జారి శరీరంలోకి దూసుకుపోతోంది
ఒక మహిమాన్విత ధూపం. అది మెత్తటి నిశ్శబ్ధం. అది మెత్తటి లోకం.
అక్కడ నుంచే ఎవరో రహస్యంగా నిన్ను గడ్డిపరకలతో మీటుతున్న ఆనందం

ఎవరైనా దేవతలు తిరుగాడుతున్నారేమో యిక్కడ
ఎవరైనా గంధర్వులు తమ గానంతో సమస్థానీ
మంత్రిస్తున్నారేమో యిక్కడ. ఎవరైనా శిశువులు ఆప్తంగా
తల్లి చూచుకం నుంచి పాలు తాగుతున్నారేమో యిక్కడ

పూర్వజన్మలో నిన్ను కన్నవారెవరో, పెంచినవారెవరో
చిరుశబ్దాలతో తిరుగాడుతున్నారేమో యిక్కడ
ఈ జన్మలో నువ్వు వొదిలివేసినవారెవరో, నిన్ను విసిరివేసినవారెవరో
నీ ముఖాన్ని అరచేతులలో అతి ప్రియంగా పుచ్చుకుని
ముద్దాడేందుకు రహస్యంగా దాగి ఉన్నారేమో యిక్కడ

ఏం జరుగుతోంది యిక్కడ
మాటలు లేని ఒక మహాశూన్యం నిన్ను నివ్వెరపోయేటట్టు చేసిన యిప్పటి వేళ?
నిండుగా పారే ఆ పిల్లల నిదురలో నువ్వు నీ ఆత్మనీ, శరీరాన్నీ కోల్పోయిన వేళ?

ఏమైనా జరగనీ ఏమైనా కానీ, కానీ
ఒకరినొకరు గాట్టిగా పెనవేసుకుని
నిదురించే పిల్లలని, వాళ్ళ కాలాన్నీ

కలలోనైనా కదలించకు! ఊహామాత్రంగానైనా పిలవకు
ఎందుకంటే

నీ పునర్జన్మ నీ ముందే రూపుదిద్దుకునే
సరైన ఇంద్రజాల సమయం జననిస్తోంది

ఇప్పుడే, ఇక్కడే, అందుకే-

No comments:

Post a Comment