27 February 2012

పొరపాటు

వెచ్చటి వెన్నెల వీధిలో సీతాకోకచిలుకల గూడు

పూలు ఎగిరే గదిలో రాత్రంతా నిరుడు వీచిన గాలిలో
నిన్నే తాకుతాయి కొన్ని చినుకులు

వెలుతురుకై తడుముకునే నీ వేళ్ళకే
అంటుకుంటాయి నెత్తురు చుక్కలు

ఆ కన్నీళ్ళే అవి. మీకు కనపడని వాళ్ళవే అవి
మీకు కనిపించనివే, మీకు వినిపించనివే అవి

ఏమి జన్మ ఇది?!
ఎన్నాళ్ళని ఇలా

మళ్ళా మళ్ళా పిగిలిపోవడం
మళ్ళా మళ్ళా కోల్పోవడం?

బ్రతికి ఉండే ఒక కల
ఒక కలగానే మిగిలి రాలిపోయింది. యిక

హత్తుకునే వాళ్ళెవ్వరూ లేరు ఇక్కడ
దరి చేరే వారు ఎవరూ లేరు యిక్కడ
నిన్నైనా నన్నైనా ఒక కలనైనా-

వెన్నెల గూటిలో పూల రాత్రిలో
తనని తాను ఓపలేక, తనని తాను ఆపలేక
ఒక పచ్చటి సీతాకోకచిలుక
ఆత్మహత్య చేసుకున్నది ఇక్కడే, ఇప్పుడే -

యిక ఎప్పటికీ ఎవరినీ
నేను ఎక్కడ అని కానీ
శ్రీకాంత్ ఎక్కడని కానీ పొరపాటున కూడా అడగకండి~

1 comment: