28 December 2013

గదులు

ఆగీ ఆగీ ఒక గాలి వీచి వెళ్ళిపోతుంది ఇక్కడ, నీలో నువ్వు నిమగ్నమయ్యి ఉన్నప్పుడు, ఎవరో భుజం తట్టి పలుకరించినట్టు, నీకు ప్రియమైన వాళ్ళెవరో ఎదురుపడి ఎలా ఉన్నావు అని ఆత్మీయంగా కౌగలించుకున్నట్టూ-

చూడు ఇటు.

కాంతి పచ్చిక పరకల్లా పరచుకున్న గదులు. వర్షానంతర నిశ్శబ్ధం పరచుకున్న గదులు. వర్షానంతర నిశ్శబ్ధంలోకి, ఆకుల అంచుల నుంచి చినుకులు రాలి సవ్వడి చేసే గదులు. పసి పాదాలు తిరుగాడిన గదులు. ఎంతో ఒరిమిగా ఎంతో ఇష్టంగా తను సర్దుకున్న గదులు. కాంతితో కడిగిన గదులు. తను ఇప్పటికీ కడగలేని, సర్దుకోలేని నేను నిండిన గదులు. గాలితో ఊపిరి పీల్చుకునే గదులు-

నువ్వు పడుకునే గదులు. నువ్వు రాసుకునే గదులు, నువ్వు ప్రేమించే గదులు. సన్నగా ఎవరో నవ్వినట్టు కూడా ఉండే గదులు. ఆగీ ఆగీ ఒక గాలి వీచి వెళ్లిపోయే, నిన్ను నీలోపల నుంచి వెలుపలకి తెచ్చే గదులు, చిన్న గదులు. నీ చిన్ని తల్లి వంటి, తన శరీరం వంటి గదులు.ముడతలు పడి, అప్పుడప్పుడూ సన్నగా కూడా కంపించే గదులు-

మనం పెంచుకున్న గదులు, మనం తెంపుకోలేని గదులు, మన వెంటే పిచ్చుక పిల్లలై ఇన్ని బియ్యం గింజలకై తిరుగాడే గదులు.అన్నం వాసన వేసే గదులు, తలారా స్నానం పోసుకుని, సాంభ్రాణి పొగలతో నీ చుట్టూ తిరిగే గదులు. నువ్వు బ్రతికి ఉండే గదులు.ఒక గాలి వీచి, నక్షత్రాలని లోపలకి తెచ్చి నీ ముందు కళ్ళాపి చల్లే గదులు. నువ్వు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపని గదులు, ఇంతకు మునుపు నువ్వు ఎన్నడూ గమనించని గదులు -

మరి, అటువంటి గదులని చూసావా నువ్వు ఎన్నడైనా? 

నా చీకటి

తల నిండుగా చీకటి - శిరోజాల మీద నుంచి
చినుకుల వలే 
ఒళ్లంతా రాలే
చిక్కటి చీకటి-

తల ఎత్తి చూస్తే 
ఏ కనులలోనూ కాంతి కనిపించని 
చీకటి- 

నిన్ను నువ్వే హత్తుకుని
భయంతో
ముడుచుకుని పడుకునే చీకటి

లేని బాహువుల 
బావురుమనే చీకటి 
నీ అంత ఎత్తూ 
పొడవూ ఉండే 
చీకటి 

నీ వాసన వేసే చీకటి 
నీ ఒంటరితనపు  
మేలి ముసుగు కప్పుకుని
నీ ముందు 
కూర్చున్న చీకటి
చిన్న చీకటి 

కడుపంతా తరుక్కుపోయే చీకటి
సమాధి వంటి చీకటి 

ఒక మనిషి లేని చీకటి 

ఒక చేయి లేని చీకటి 

కళ్ళు పోయి తడుముకునే చీకటి 

చిక్కటి 
చిన్నటి 
కంపించే చీకటి - 
కరగని చీకటి 
మూలిగలోకి చొచ్చుకుపోయి రోదించే చీకటి

దయ లేని 
దాహం తీర్చని చీకటి 
మరచి పోనివ్వని చీకటి
మరపు రానివ్వని చీకటి   

మరి ఇంతకూ 

నువ్వు ఎక్కడ?     

18 December 2013

వి/స్మృతి

1
ఏమీ రాయలేక, ఇక్కడ కూర్చున్నాను -

లోకంపై ఒక నులి వెచ్చని పొర కమ్మినట్టు, చుట్టూతా కాంతి
చలికి వణికిన శరీరాన్ని
ఎవరో పొదుపుకున్నట్టు-
2
ఆ పొదుపుకునే చేతులేవో
అక్షరాల్లోనే కానీ, నిజానికి
ఇక్కడంతా ఖాళీ - స్థబ్దత-

ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక మిగిలే ఒక
నిశ్శబ్దం. గోడలను చుట్టే
గాలీ నేలపై పారాడే ధూళీ

వొదిలి వేసిన పిల్లల బొమ్మలూ, విరిగిన పలకలూ
ఉండ చుట్టిన కాగితాలూ
లీలగా ఇంకా వినిపించే
మాటల ప్రతిధ్వనులేవో...
3
ఏమీ రాయలేక, ఇక్కడ ఇలా -
పదాలు ఉగ్గపట్టినట్టయ్యి...
తలుపులు తెరిచి చూస్తే

కిటికీలకు రెపరెపలాడే తెల్లని పరదాలు -

సగం అల్లుకున్న గూళ్ళు
చితికిన పావురపు గుడ్లు
అతి పల్చగా నీ ముఖంపై
వ్యాపించే ఒక సాలెగూడు...
4
ఇక, ఇక్కడ ఎడారిగా మారిన స్నానాల గదిలో
గోడకి మిగిలిన ఒక ఎర్రని
బిందువు. అంతిమంగా
ఒకే ఒక్క ప్రతీక - ఇలా...
5
'దుస్తులు విప్పి, శిరోజాలు ముడుచుకుని, నుదుటిపై బొట్టుని
గోడకి అతికించి, నీ వైపు
సాగిన ఆ అరచేయి ఇక

ఇంకా ఇక్కడ వ్యాపిస్తోన్నట్టూ, నీ మెడ వెనుకగా చేరి, తాకి
నిన్ను ఒక జలదరింపుకు
గురి చేస్తున్నట్టూ...'- మరి

నిన్నేమీ రాయనివ్వనట్టూ
నిన్నేమీ చేయనివ్వనట్టూ
చలికి వణుకుతూ నీలో ఒదిగిన ఒక  శరీరాన్ని, నిర్ధయగా

ఎవరో పెకల్చివేసినట్టూ
విదిల్చి విసిరివేసినట్టూ...
7
కాలంపై ఒక నల్లని బెరడు కమ్మినట్టు, ఇక్కడో ఖాళీ-

ఇక - ఇక్కడ
ఈ శరీర రాహిత్యంలో, ఈ ప్రాచీన వి/స్మృతిలో, మనంని    
వ్రాయడం ఎలా? 

16 December 2013

bricolage

1
చుట్టూతా ఝుంకారం వంటి ఒక చీకటి - తూనీగ పాదాల కింద
వలయాలుగా విస్తరిస్తున్న
నయన తరంగాల వలే---
2
ఇక ఎవరు ఏ మాట మాట్లాడినా
కొంత కాటుక వాసన. తడచిన కనురెప్పల వాసన-
వొణికే పెదాల వాసన. అర్థరాత్రిలో

కాగితాలు తగలబడి వెలిగే, నలుపూ
ఎరుపూ కలగలసిన వాసన-
మనం రాసుకున్న మాటలు
చుట్టూతా చిట్లి,నుసియై ఆపై

రాత్రి చెమ్మతో నలిగిన, నల్లని
వాసన. సవ్వడీ: అంతిమంగా
చెంపలపై కన్నీరు ఆవిరయ్యిన

ఒక ఖాళీతనం, ఒక నిశ్శబ్ధం, ఒక శాంతీ-
2
మోకాళ్ళ చుట్టూ చేతులు కట్టుకుని
ముఖాన్ని దించుకుని
రాత్రంతా వెలిగిన, ఒక

తెల్లటి దీపం, ఆనక ఎప్పటికో ఆరింది-

ఎర్రని పూవుల వలే విచ్చుకున్న
ఆ రెండు కళ్ళూ తిరిగి
రెండు నిండు మొగ్గలై
క్షణకాలం, మంచం అంచున అతని చేతి వద్ద ముడుచుకు పోయాయి-

అప్పుడు అక్కడ, వానలో
నానిన ఒక తోట వాసన-
తోటని కమ్మిన పొగమంచులో తిరిగే ఒక మనిషి వాసనా-

అతనిలోని పొగమంచులోకి
తప్పిపోయిన, రెండు కనుల
రెండు కలల పూల వాసనా- 
3
ఇద్దరినీ కమ్మిన చీకటి చుట్టూ, మాటలానంతర నిశ్శబ్ధం లాంతరు చుట్టూ
ఝుంకారం వంటి
ఒక కాంతి తరంగం-
4
అప్పుడు, అక్కడ, చితి వలే మండుతున్న అతని నుదిటిపై
సీతాకోకచిలుక వలే
వాలిన ఒక అరచేయి-

ఆ అరచేయి కిందుగా నిండుగా ప్రవహించే నదులు.
నిదురోతున్న పిల్లలు-
వీచే ప్రాణవాయువులు

మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, కదలి పోతున్న మేఘాలూ
ఋతువులూ, జనన మరణ
రహస్య ఉద్యాన వనాల
కాలాలూ,తల్లి పాలిండ్లని

లేత పిడికిట బిగించి, పాలు త్రాగే
పసి పెదాల లోకాలూ, వాటిపై
నర్తించే ఆదిమ శబ్దాలూ-
5
మరిక నువ్వది చూసి ఉండవు.

పాలు తాగిన మాటని- నిదురోతున్న ఒక మాటని. తన కురులను
తనే వృత్తాలుగా చుట్టుకుంటూ
ఒత్తిగిల్లిన మాటనీ, ఆ గాలినీ నీ
గడప ముందు ఆగి,తన రెక్కల్ని

విదుల్చుతూ, నిన్ను చూసే
ఒక చిన్ని పక్షినీ, దాని
గొంతుకనీ, ఆ కళ్ళనీ...

అందుకే
6
ఇక, ఇప్పుడు నీ చుట్టూతా
శిశువు గొంతుకలో ఊరుతున్న తొలి మాట వంటి ఒక కాంతి-
వేణువులోకి
సంశయంగా

అడుగిడిన ఒక ఊపిరి, ఊదేవానికి ప్రాణం పోసినట్టు, ఇక ఇక్కడ

నిదురించే ఒక మనిషీ (అతనే), వానలో వెలిగిన ఒక దీపమూ
దీపంలో ఒదిగిన గాలీ
మబ్బులూ నక్షత్రాలూ
ఇక ఒక మాటానూ -
7
మరి, ఇంతకూ తెలుసా నీకు?

ఉవ్వెత్తున ఎగిసే వరి పైరులపై, చుట్టూతా ఝుంకారం వంటి ఒక చీకటిలో
అలలు అలలుగా తేలిపోయే
తూనీగ పాదాల తాకిడికి
వలయాలుగా విస్తరిస్తున్న

ఆ లేత పసిడి వన్నెల - ఆ మన, ఆ అనామక, ఆ మన, మనం అనే -
ఆ మాటా, ఆమని ప్రదేశం?  

28 November 2013

అప్పుడు, అక్కడ

అప్పుడు, అక్కడ, తల వంచుకుని కూర్చుని ఉంటుంది

నీ ముసలి తల్లి: ఆ చిన్ని వరండాలో, తన
జుత్తు విరబోసుకుని తల దువ్వుకుంటూ-

చెట్టుపైకి వొంగి, చెమ్మగిల్లిన నింగి.
రాలిపోతున్న పసుపు వేపాకులు.
పాలిపోయిన ఆ కాంతిలో,ఆ చెట్టు

బెరడుని గీకుతూ, గుర్రుమనే పిల్లులు. కంపించే నీడలు.
అక్కడక్కడా పిల్లలు వొదిలి వేసిన
పగిలిన బొమ్మలు.అద్దం పెంకులూ-

వెనుకగా పక్షి పిల్లలు లేని ఒక ఒంటరి గూడు. అక్కడక్కడా
కొమ్మల మధ్యలో ఊగే సాలె గూళ్ళు.
అలసిన తన, ఎండిన పెదాలను
కోసుకుని ఉబికే నెత్తుటి తడీనూ-

ఇక ఉన్నట్టుండి వీచిన చల్లని గాలికి, తను తల ఎత్తి చూస్తే
ఎప్పట్లా నిన్ను చూసి నవ్వితే
ఎదురుగా నువ్వు. అదే: దారి
తప్పో, దారి మరచో, ఇంటికి

వచ్చిన నువ్వు - ఇక అక్కడ

ఉండాలేకా, వెళ్లిపోనూ లేకా, మాట్లాడలేకా, ఏమీ కాలేక...

21 November 2013

మాట

1
ఎంతో నిశ్శబ్ధం తరువాత, నలిగిన ఆ చీకటిలోంచి
ఒక మాట మాట్లాడతావు నువ్వు
గాలిలోంచి తేలుతూ వచ్చి  రాలే

ఒక తెల్లని పక్షి ఈకలా: తల ఎత్తి చూస్తాను నేను - కానీ
రెక్క తెగిన ఆ పక్షి ఎక్కడో కనిపించదు.
చిట్లించిన కనురెప్పలపై మాత్రం, రాలే

నీ శరీరం అంతటి ఒక నెత్తురు చుక్క-
2
ఆ నిశ్శబ్ధంలో, నేను పుచ్చుకున్న నీ రెండు చేతులూ

ఎంతో సేపటి నుంచి నువ్వు
మధన పడీ, మధన పడీ  మననం చేసుకున్న పదాలు.
తల ఎత్తి చూస్తే రెపరెపలాడే
నీ కళ్ళు, నేను ఎప్పటికీ చేరుకోలేని అర్థాలు-

ఇక ఈ పదాలకీ, అర్థాలకీ వెనుక, అశృవులతో చీరుకుపోయిన...
నీ కనుల అంచులను తుడిచిన
నా చేతి వేళ్ళ చివర్లు: అవే. అవే
కాలతాయీ రాత్రికి నిరంతరంగా

అనాధ శవాలు ఏవో చిట్లుతూ, తగలబడుతున్నట్టు -

నాకు తెలుసు, నాకు తెలుసు-

గోడలపై వ్యాపించే నీడల చుట్టూ అల్లుకుపోయే నిశ్శబ్ధం లతలు-
గూడు రాలిపోయిన తరువాత
పిల్లలు కనిపించక ఇక అక్కడే
రెక్కలల్లర్చుతూ ఎగిరే పక్షుల
దిగులూ, వాటి అరుపులూ -

మరి తెలుసు నీకు కూడా- మరి అర్థం అవుతుంది నీకు కూడా

తప్పకుండా - కట్టిన దారానికి తెగిన తూనీగ రోదనా
వెక్కిళ్ళు పెట్టి రాలిపోయే
సాంధ్య పూల భాషా-
తలుపు చాటున ఇరికి

నుజ్జు నుజ్జయ్యిన వేలి వెంటే, నీ వెంటే వచ్చే ఆ బేల కనుల ఘోషా -
4
ఎంతో నిశ్శబ్ధం తరువాత, నలిగిన ఆ చీకటిలోంచి, ఇటు వచ్చిన...
నువ్వు మాట్లాడిన ఒక తేలికైన
మాట:  ధాన్యం వాసన వేసే
వాన వాసన వేసే ఒక మాట-

పొలమారిన తలపై తట్టి, నోటికి
మంచి నీళ్ళ గ్లాసు అందించిన
తల్లి చేయి వంటి ఒక మాట
పీడకలలలో భీతిల్లి ఒత్తిగిల్లి

నువ్వు గట్టిగా కరచుకుపోయి
పడుకునే ఒడి వంటి ఓ మాట
వెలుగుతోంది ఇక్కడ, ఒక మట్టి ప్రమిదెయై, వలయమై -
5
వస్తారు పిల్లలు, వెళ్ళిపోతారు పిల్లలు
నీ నుంచి నాకూ నా నుంచి నీకూ
ఒక మాటని మంత్రించి, పెనవేసి-

చీకటి గాలి వీస్తుంది అప్పుడు- ఆరుబయట ఆరవేసిన
తెల్లని వస్త్రాలు ఊయలల వలే
ఊగుతాయి అప్పుడు.ఆకులు
కదిలి, నేలపై కాగితాలు దొరలి

నా నుదిటిని తాకిన గాలే, నీ ముంగురలనీ తాకి

నీ శ్వాసలో చేరి, కరిగి ఒక మాటై
పోతుంది అప్పుడు. ఇక నిదురలో
అస్పష్టంగానే అంటారు ఏదో పిల్లలు
అప్పుడు. అది కూడా... ఒక మాటే

పెదాలపై ఇంకా తడి ఆరని తల్లి పాల వంటి ఒక మాటే -
6
అక్కడ, నువ్వు లేచి, ఎంతో నలిగిన ఆ చీకటిని సాఫీగా చేస్తూ

మాటలోంచి మాయమయిన దానినేదో తిరిగి నింపి
వాటిని ఇటువైపు రంగుల
నీటి బుడగల మల్లే చేసి
వొదులుతూ ఉన్న చోట
7
చిన్నగా నవ్వుతూ, మాట నుంచి మాటకి సాగుతూ, దాదాపుగా చేరుకుంటూ
చిన్నగా కాలం గడుపుతూ
వీటన్నిటి తరువాత కూడా
బ్రతుకుతాం మనం -ఇలా

ఎంతో నిశ్శబ్ధం తరువాత, ఎంతో చీకటి తరువాత, ఎంతో మౌనం తరువాత , ఎంతో 
ఎంతో నువ్వు తరువాత 
ఎంతో నేను తరువాత... 

ఒక చిన్న మాటలో ఒదిగిన 
మనంతో, మనతో,
మన తనంతో... 

18 November 2013

నిశ్శబ్ధం నీవైనప్పుడు

1
నిన్న రాత్రి నువ్విచ్చిన పూలగుచ్చం ఇక్కడ
ఒక ప్లాస్టిక్ బాటిల్లో, నీళ్ళల్లో -

అవే, వాడిపోని ఈ పూవులు 

కొన్నిసార్లు అవి నీ కళ్ళు. కొన్నిసార్లు అవి నీ మాటలు.
కొన్నిసార్లు, అవి నీ చుట్టూ తిరిగే
పిల్లలు. వాళ్ళ ఆటలూ. నిదురలో 

తెరుచుకున్న వాళ్ళ పెదవులు. ఇంకా మరి   
వాళ్ళ నుంచి వచ్చే వాసనా
అర తెరచిన వాళ్ళ చేతుల్లో 
చిక్కుకున్న, నీ చేతివేళ్ళూ -
2
గంజి పెట్టి ఉతికిన దుప్పటిలోంచి ఎప్పటిదో 

బాల్యంలో అమ్మ బొజ్జను  
చుట్టుకున్న ఒక స్మృతి 
నేలపై, చాపపై ఆ ఇంట్లో-

నువ్వు కూడా ఇప్పుడు 
దవనం వాసన వేస్తావు-
అదే, కనకాంబరం పూలను అల్లుకున్న, మెరిసే దవనం-  

ఇక, నవ్వే నీ ముఖంలో, నన్ను 
చుట్టుకునే నీ చేతుల్లో 
ఒక పసిపిల్లతనం, ఇష్టం-
3
బహుశా జన్మదినాలూ, జన్మించడమూ ఇంతేనేమో -

పూల నీడల్లో కాంతి రేఖలు. గూళ్ళల్లో 
ముడుచుకున్న పిట్టలూ - 
వీచే గాలికి చలించే ఆకులూ
చీకటిలో మెరిసే నక్షత్రాలూ 

ఛాతిపై సీతాకోకచిలుకలు ఏవో వాలినట్టు ఉన్న  
పిల్లల చేతులని ఆప్తంగా తాకి  
ఎప్పటికీ ఇక్కడ ఉండబోమనే 
ఒక స్పృహ జ్ఞప్తికి రావడమూ 
కావొచ్చును. కొంత దయతో 
మేల్కొవడమూ అవ్వొచ్చును- 
4
వెళ్ళిపోతాం నువ్వూ, నేను- ఎప్పటికైనా - చివరికి -

మరో పక్కకి ఒత్తిగిల్లిన తరువాత 
పక్కపై నలిగిన ఖాళీలో మిగిలిన 
నీ శరీర స్పర్శ ఏదో నునువెచ్చగా 
తగిలినట్టూ, ఒక లాంతరై రాత్రంతా 
మనకు కలలలోకి దారి చూపినట్టూ

వనాలలో కురిసే తుంపర వంటి నిశ్శబ్ధం: ఇప్పుడు ఇక్కడ- 
ఇక, నిశ్శబ్ధం నీవైన ఆ క్షణంలో 
ఈ కవితను ముగించడం ఎలా?         

17 November 2013

కృతజ్ఞతలు

అప్పుడో మాట వస్తుంది నీ వద్ద నుంచి.   

తెల్లటి పావురం అది. రెక్కలు విదుల్చుకుంటూ 
నా ముందు వాలితే
కొంత తెరపి నాకు-
పూవై విచ్చుకుని 

రాత్రి పరిమళం వలే వ్యాపిస్తే కొంత శాంతి నాకు. 

అరచేతుల్లోకి ముఖాన్ని తీసుకున్నట్టు, శ్వాసతో  
కనురెప్పలని తాకినట్టు 
గుండెల్లోకి హత్తుకుని
ముద్దు పెట్టుకున్నట్టూ

రెక్కల కింద వెచ్చగా దాచుకున్నట్టూ, జోలపాట 
పాడుతూ బుజ్జగించినట్టూ
పచ్చని కలల లోకాలలోకి
తోడ్కొని పోయినట్టూ - నీ 

వద్ద నుంచి వచ్చే వాన వాసన వంటి ఒక మాట. 

ఇంక బెంగ లేదు. ఇంక భయం లేదు. నవ్వుతూ 
నీ చిటికెన వేలు పట్టుకుని 
రేపటిలోకి నడుస్తాను నేను. 

16 November 2013

renege/r

1
కూర్చుని ఉన్నాడు అతను - చీకట్లో -

పదునైన శీతాకాలపు అంచులను తాకిన పూవులు
ఇక రగలలేక, చెమ్మతో
చిట్లి, రాలిపోయే వేళల్లో-
2
ఎదురుగా రాత్రి -
తన నిలువెత్తు
చిగురాకు శరీరం, అతను తాకలేని పుప్పొడిగా మారి
చేజారే క్షణాల్లో.
3
ఇక
అతని చుట్టూతా
ప్రమిదెలు వెలిగించిన తన అరచేతులలోంచి వ్యాపించే
మట్టీ, మంటా

పెనవేసుకున్న
గాలీ, వాసనా-
ఒక కుబుసం.
4

తరువాత
కిటికీ రెక్కలు తెరచి ఉన్నా
వెళ్ళిపోలేక

నిప్పు కౌగిలికీ, మృత్యు చుంబనానికీ దగ్గరై
కొట్టుకులాడే
ఒక పురుగు -
5
ఇక
రాత్రంతా అతని ముంగిట రాలే నక్షత్రాలు.

మెరిసే
వాటి లేతెరుపు కాంతీ-
అది ఇప్పటిది కాదని అతనికి ఖచ్చితంగా తెలుసు -
కానీ

తన
ముఖాన్ని మరవడం ఎలా?
6
డెజావూ
డెజావూ
డెజావూ
7
ఇక
అందుకే

ఉరికంబమైన వెన్నెల వలయంలో
తలను వాల్చి
నిదురోతున్న
8
ఒక మనిషీ

ఒక
మృగమూ
ఒక పంచ వన్నెల సీతాకోకచిలుకా, నవరంధ్రాల
నీస్మృతి వేణు
గానమూనూ-
9
ఇక
రేపు
ఏమవుతుందో, ఎవరికి తెలుసు?

12 November 2013

హే రాజన్

అరే
హేమిరా రాజన్
తాగితిని పో
అందులో బీర్లు త్రాగనేల?
బార్లో బీర్లే పో
అందులో అట్లా పడి మునుగనేల?
మునిగితి పో
పురాజన్మల పాపములు, కర్మములు తీరునట్టు
నన్ను నేను మరచుటేల?
మరచితిని పో
నన్ను మరచి నిన్ను తలచుటేల?
తలచితినిపో, ఇంకన్నూ
ఈ జన్మ దుక్క దాహము తీరనట్టు
తిరిగి, చంద్రుని  ముక్కలున్ జేసి
ఆ గాజుపాత్రలో వేసి
నింగినెక్కి, నక్షత్రాలతో విస్కీ త్రాగనేల?
అలా ఇకిలించనేల?
ఇకలించితినిపో, వేకువఝాము  వెన్నెల చలిలో
నీ  మోముని కాంచి
ఆనందముతో సకిలించనేల?
సకిలించితిని పో
చంకల కింద చేతులు జొనిపి
ఆ మంచులో పవళించనేల?
పవళించితిని పో
ఊగే ఆకులతో, రేగే గాలితో, పెదాలపై ధూమముతో
అలా పరవశించనేల?
అనంతమును చూడనేల?
అంతా చేసీ చూసీ
ఇప్పుడిలా
ఒరే
రాజన్
హే హే  రాజన్
ముక్కులు నదులయ్యీ
గుండెలు అగ్నయ్యీ
తుమ్ముకుంటో
దగ్గుకుంటో
చీటికిమాటికీ
చీటికీ మాటకీ
మాటి మాటికీ
కడవల నిండగా చీదుకుంటో
చీమిడి వంటి
ఈ పదాములను
వ్రాయనేల?
ఆపై తిరిగి వెర్రివాడివలే
నవ్వనేల?
రాజన్
హే  హే  రాజన్
ఇప్పటికి ఇంకన్నూ ఇక్కడ
ఎరిత్రోమైసిన్
టోటల్ కాని డీ కోల్డ్
రెండు సిట్రజిన్, నాలుగు డోలో - 650 తో
శోక నివారణం లేని
ఒకే ఒక్క క్రోసిన్ నొప్పి నివారణతో
కోతి మదితో
శునకం తోకతో
తల కిందులుగా
తపస్సు చేయనేల? మరి
ఇక
వేద్ధునా
ఒక పెగ్గు బ్రాందీ
సర్వం దిగేటట్టూ, నీ ఈ
వాచకం తాట తీసేటట్టూ
కొద్ది సిగ్గుగా
కొద్ది నిర్లజ్జగా
కొద్దికొద్దిగా
ఇంకొద్దిగా, జుత్తును గోక్కునే నా వానర తత్వంతో
హే రాజన్
మరిక
ఇప్పటికి ఆమెతో
కారుతున్న
ముక్కులతో? 

11 November 2013

మన/తల్లులు

ఎలా రాయటం ఈ నొప్పిని? మహా తీవ్రత ఏమీ కాదు కానీ,గుండెలో ఒక గాజు దీపం పగిలింది-

ఏరుకో  ఇక ఆ పెంకుల్ని కళ్ళలోంచి, కాంతి కణాలని తీసేవేసి.పూడ్చుకో ఇక ఆ ముఖాన్ని అరచేతుల్లోకి,ఉరితాళ్ళ వలే ఊరిన,తల ఎత్తలేని ఒంటరి కాలాలలోకి. రాత్రయితే త్రవ్వుకో ఒక సమాధిని -కడుపు చీలిపోయినట్టు, పేగులు రాలిపోయినట్టూ,వాటిని చేతిలో పట్టుకుని.తెగిపోయి,నీకు నువ్వే చెప్పుకోలేక, విరిగిపో. ఊగే నీడల,అంతు లేని వలయాల అంగాంగ లోకాలలోకి-


ఎన్నడూ అడగకు ఒక చేతినీ, మాటనీ, సహపద్మపు సువాసననీ. 


తినగా తినగా తినగా వాళ్ళు ,ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే  నీకో శరీరం, దాచుకో భద్రంగా నీ బాహువుల మధ్య,మిగిలిన ఆ సుమాలయాన్ని. చూపించు ఒక్కసారి, చెక్కివేయబడ్డ వక్షోజాలని. వినిపించు మళ్ళా మళ్ళా పురుషాంగం అయిన దేశాన్నీ,దేశం దేవుడూ అయిన రాజ్యంగాన్నీ,రాజ్యం పీలికలు చేసిన నీ యోనినీ. నవ్వు ఒక్కసారి గట్టిగా, పురాణాలూ పుణ్యాత్ములూ ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టూ, నివ్వెరపోయేటట్టూ.చూడనిది ఏదో ఇవ్వు.నీకు ఇవ్వనిది ఏదో పొందు. అల్లు, నరాలని పెనవేసి, నిన్ను నువ్వు రాసుకోగలిగే ఒక నెత్తురు కాగితాన్ని. స్ఖలించు ఒక్కసారిగా,ఈ విశ్వం మొత్తమూ తిరిగి ప్రారంభం అయ్యేటట్టు. ఉన్నది ఏదో విసురు. నీకు దాచినది ఏదో పెగల్చుకు పో -


అమ్మా, నా తలుపులమ్మ తల్లీ, నా గ్రామ దేవతా, దీపం కాదు, దేహాన్ని వెలిగించు. చీకటిని కాదు దేవతా దివ్య వాచకాలని తగలబెట్టు.ముట్లు లేని,విసర్జించలేని,స్త్రీత్వం లేని ఆ మహా కథనాలనేవో ముక్కలు ముక్కలు చేసి పెట్టు.నీ గర్భ సారంగ సంగీత మహా లయ విన్యాసాలనేవో నువ్వే చూపెట్టు.  


అమ్మా, తల్లీ - ఒళ్లంతా పొక్కిలయ్యి,కళ్ళంతా నెత్తురు చినుకులయ్యి కూర్చున్న ఆదిమ ఆదివాసీ,నా తండ్లాటల తల్లీ, కొడుకులను కోల్పోయిన యాదమ్మా,తాయమ్మా,నలిగిన పాదాల,అడుగంటి పోయిన కడుపుల అమీనమ్మా, ఖండిత అంగాల, తగలబడ్డ నా తెలంగాణా తల్లీ 

  
నీ చేతుల్లో గాజు దీపమేదో,కత్తై,కొడవలై,పువ్వై,సూర్యుడై పూర్ణ చంద్రబింబబై వికసించింది -ఎలుగెత్తి ఏడ్చింది. ఎలుగెత్తి నవ్వింది. బిడ్డా అని నువ్వు హత్తుకున్న నీ గరకు అరచేతుల మధ్యకు ఈ ముఖం ఈ వేళ నిశ్శబ్ధంగా నాటుకుపోయింది, నీ హృదయ ధ్వనితో కప్పబడింది-


ఇక రేపు నీ అరచేతులలోంచి మొలకెత్తే, ఒక  మాట, ఒక్క మాట, ఒకే మాట ఎవరిది? 

07 November 2013

నువ్వు

- ఎక్కడో ముడుచుకుని ఉండి ఉంటావు నువ్వు -

అంతస్థుల అంచులపై అలసటగా వాలి,విరుగుతున్న రెక్కలని మాన్పుకుంటూ
అలా తపనగా, కనిపించని అరణ్యాల వైపు చూసే
ఈ అంతస్థులలో ఇమడలేని ఒక తెల్లని పావురం 

నీవు అని తెలుసు నాకు. దారి తప్పి 

ఈ లోహ రచిత, నరమాంస భక్షక ప్రదర్శనశాలలో, మానవ విపణి కేంద్రంలో   
నీ గుండెను ఉగ్గపట్టుకుని తిరిగే బాలింత కనుల 
బాలికవూ, నెమలీకవూ నీవు అని తెలుసు నాకు-  

ప్రతి రాత్రీ,నీడలతో పోరాడీ పోరాడీ ఓడిపోయే,ఒక దీపకన్యవనీ,దిగులు కలువవనీ   
అశ్రు పవనాలలో చిక్కుకున్న ఓ లేత చిగురాకు 
నీవనీ తెలుసు నాకు. అరచేతులు, లోయలంత 

చీకట్లయితే, వాటిలోకి నిర్ధ్వంధంగా రాలిపోయే, చినుకు చిక్కుకున్న ఓ పూవువి నీవు 
అనీ తెలుసు నాకు. ఒంటరిగా మళ్ళా, రాలిపోయిన  
ఆ లోయల్లోంచి ముఖాన్ని ఎత్తి, చెమ్మను తుడిచి 

ఇక దీపంలోని చీకటినీ, చీకటిలోని దీపాన్నీ వెలిగిస్తే  

ఈ అక్షరాలకు ఇంత తల్లితనం, తల్లి వక్షోజాల తొలి 
పాల వాసనా, తన జోలపాటా, మాటా, నిదురా ... 

మరి ఇదంతా తెలిసి, 'ఎక్కడో ముడుచుకుని, గీరుకుపోయే హృదయంతో, ఎక్కడో 
కంపిస్తూ, పిగిలిపోతూ, తిరిగి ఏకం అవుతూ, మళ్ళా 
అంతలోనే, నలుదిశలా పొగమంచు తెరలై చీలిపోతూ 

ఎక్కడో ముడుచుకుని కూర్చుని ఉంటావు నువ్వు-'
అని నేను వ్రాస్తూ కూడా, "ఎలా ఉన్నావు నువ్వు?"

అని ఎలా రాయను నేను? అని ఎలా అడగను నేను? అని ఎలా చూడగలను నిన్ను?

04 November 2013

ఇవ్వాల్సి'నది'

"How was the day?" అని అడుగుదామని అనుకుంటాడు అతను
తనని -

వాన వచ్చే ముందు వీచిన ఈదురు గాలికి
ఎక్కడో తెగిపోయి, ఇక్కడికి
కొట్టుకు వచ్చి, వాలిపోయిన

ఒక మృదువైన, నిదురలోకి ముడుచుకుపోయిన
ఓ పసి పిడికిలి వంటి
ఆకునీ, తననీ కూడా-

నిస్సత్తువుగా కుర్చీలో జారగిలబడి, భుజాన బ్యాగుని పక్కకు వొదిలి
కళ్ళలోని వాననీ
శరీరంలో వడలిన

పూలనీ, రేగే ధూళినీ తుడుచుకుంటూ, సొమ్మసిల్లుతోన్న నవ్వుతో
అతి కష్టం మీద
ఇలా అంటుంది
తను అప్పుడు-
అతనితో:

"కొద్దిగా, ఓ గ్లాసు మంచినీళ్ళు అందిస్తావా?" 

01 November 2013

నీ నిదుర నయనాలలోకి

పదాలు లేని ఇష్టం ఇక్కడ
అప్పుడు
నువ్వు నెమ్మదిగా కళ్ళు మూసుకుని నిదురలోకి జారుకుంటున్నప్పుడు

మలుపులు లేని శ్వాస ఇక్కడ
అప్పుడు
నువ్వు నెమ్మదిగా కలలు లేని నదిలో నావై మృదువుగా సాగిపోతున్నప్పుడు

రెప్పలు లేని కాలం ఇక్కడ
అప్పుడు
నువ్వు ఒక తీరం చేరి, పూలల్లో చేరి, రాత్రిలో, నక్షత్రాల సువాసనలలో

నీ లోపల నువ్వు
ఉద్యానవనంలో
ఒక తెల్లని సీతాకోకచిలుకవై ఎగురుతూ ఉన్నప్పుడు- వాలుతున్నప్పుడు

తల తిప్పి ఒత్తిగిల్లి, నా చేతిని లాక్కుని నీ మెడలో దాచుకుని
నీ నిదురలోనే ఎందుకో
చిన్నగా నవ్వినప్పుడు-

అప్పుడు

నీ శిరోజాలు వీచిన గాలికి, ఇక్కడంతా పురాజన్మల పరిమళం
ఒక మార్మిక ధూపం
ఎవరూ విప్పి చెప్పలేని, ఒక జీవన మృత్యు రహస్యం -  ఇక

అప్పుడు

నీ చుట్టూ ఒక దుప్పటి కప్పి
నా రెండు చేతుల మధ్యా
నిన్ను భద్రంగా, అపురూపంగా, లోపలికి దాచుకుంటుంటానా

స్వప్న ఛాయలతో
బరువెక్కిన నీ కనురెప్పలని ఎత్తి నా వైపు అలా చూస్తావా, ఇక మరి
అంతిమంగా నేనేమో

ఒక కృతజ్ఞతతో
ఏమీ చెప్పలేని
చేయలేని, ఒక
నిస్సహాయతతో

నీ అరచేతులని అందుకుని, నా గుండెలకు అదుముకుని
ముద్దు పెట్టుకుంటాను-

ఎలా?.........ఇలా. 

నివేదిక

రాత్రంతా నువ్వు లేకుండా ఒక్కడినే కూర్చుని తాగాను -

ఏం చెప్పను? కరకు శీతాకాలం.
మనుషులు పగిలిన పెదాలై, మాటలై, కొమ్మ నుంచి తెగి
నీ చుట్టూ ఆకులై రాలే కాలం -

చుట్టూ ఎవరూ లేరు. సమాధిలోంచి తొలుచుకు వచ్చిన
కొన ఊపిరితో బ్రతికి ఉన్న
ఒక చేయి వలే ఈ రాత్రి -

బరువెక్కిన నయనాలూ
అలసిపోయిన చేతులూ-

ఎవరో ఇంతకాలమూ త్రవ్వీ త్రవ్వీ, ఎటువంటి నీటి జాడా లేక
వొదిలి వేసిన ఈ శరీరం ఇక
ఒక పాడుబడిన కుటీరమూ
ఎవరూ అడుగిడని భూమీ-

ఎవరికి చెప్పను, కన్నీళ్ళూ మంచి నీళ్ళేనని, మనిషి లేక
మరొక మనిషి మన్నలేడనీ
తానే ఇతరమనీ? ఇతరమే

తాను అనీ, ఇతరమే మనం అనీ? మనమే సర్వస్వం అనీ?

ఒరే నాయనా, కవీ, కసాయీ
వెన్నెల పూలతో ఊగిపోయే
స్నేహ పాత్రాధారీ, బాటసారీ

ఏమీలేదు. రాత్రంతా ఒక్కడినే కూర్చుని త్రాగాను. ఎదురుచూసాను -

అయిపోయింది ఈ హృదయం ఖాళీగా.
రాత్రేమో వచ్చి వెళ్లిపోయింది
సవ్వడి లేకుండా, రికామీగా-

అది సరే కానీ, మరి ఇది చెప్పు, నువ్వు నాకు-

నువ్వు వచ్చి, ఈ అరచేతుల మధ్య సప్త రంగుల వసంత వనాలై
ఒక సుగంధపు మధుపాత్రై
ఒదిగి ఒదిగి పోయి, నన్ను

నువ్వూ, నిన్ను నేనూ, బ్రతికించుకునేది ఎన్నడు?

30 October 2013

ముగింపు




.
.



చిన్నగా నిట్టూరుస్తూ, ఇలా ముగించింది తను: 

How come people don't realize
That vagina
Has a heart
Of its own?

.
.
.
.
.
.
.

యోనికీ ఒక హృదయం ఉంటుందనీ, సంతోషంతో
చలిస్తుందనీ, ఒక వెచ్చని పుష్పమై వికసిస్తుందనీ
గాయపడుతుందనీ, కన్నీళ్ళతో రాలిపడుతుందనీ

అది ఒక పసి పాప వంటిదని
ఎప్పుడు గ్రహిస్తావు నువ్వు-?  

How come you don't realize
That my vagina 
Has got 

A language 
Of its own?

29 October 2013

ఎలా?

తలుపులు తోసుకుని వస్తుంది ఒక గాలి: నువ్వలా
ఒక్కడివే కూర్చున్నప్పుడు -
దాని నిండా చీకటి సువాసన.

నిద్రలేని నీ కళ్ళపై ఎవరో మునివేళ్ళతో నిమిరినట్టు

తుంపర. ఒక నిశ్శబ్ధం. నిండుగా
సవ్వడి లేకుండా, ఒక నది ఏదో
ప్రవహించినట్టు, నీ చుట్టూతా నీ
ఒంటరితనమే, నువ్వు తాకలేని

తమ లేత ఎరుపు పెదాలు తెరుచుకుని

పూలగుచ్ఛాల వలే ఒదిగిపోయి
అలా నిదురపోయే పిల్లల నిదురే
ఇక్కడ.పూలపై తేలిపోయే చల్లని

వెన్నెలే ఇక్కడ. వాళ్ళ అమ్మేఇక్కడ - నువ్వు ఇక

ఎప్పటికీ వెళ్ళలేని వాళ్ళ కలల
కాంతి లోకాలే ఇక్కడ. కరుణే
ఇక్కడ -కల్మషం లేని,అంటని
లాలిత్యమైన కాలమే -ఇక్కడ - 

మరి, అటువంటి తుంపరలో, అటువంటి, మెత్తని చీకటిలో

చిగురాకుల సవ్వడిని కూడా
నువ్వు వినగలిగే నిశ్శబ్ధంలో   

మూసుకున్న నీ తలుపులను తోసుకుంటూ వచ్చి

నిన్ను తాకి,ఒక శైశవ నవ్వుతో
నిన్ను పలుకరించిన ఈ గాలిని
వెళ్ళిపొమ్మని అనడమూ, ఇక

ఈ కవితకు ఒక ముగింపునీ ఇవ్వడమూ. . . ఎలా?  

24 October 2013

ఈ రాత్రి, ఇక్కడ

ఈ రాత్రి, ఇక్కడ.

కనుచూపు మేరా చీకటి.


చుట్టూతా చినుకుల సవ్వడి. కిందకి జారే మబ్బుల వాసనా. 


ఈ రాత్రి, ఇక్కడ


ఈ పల్చటి దుప్పట్లో


నా రెండు రెక్కల మధ్య ఒక లేతమంటై, ముణగదీసుకున్న 

ఒక పావురమై 
వొణుకుతుంది 
ఒక హృదయం-

...లబ్ డబ్

లబ్ డబ్

లబ్ డబ్

లబ్ డబ్...

ముసురు తొలగదు

తను నన్ను వీడదు

ఇక చినుకులు నిదురపోయేది ఎన్నడో


ఎవరికీ తెలుసు? 

22 October 2013

వి/స్మృతి*

ఒక చూపుడు వేలు,ఈ విస్మృతి పదాల గులాబీలలోంచి  
నువ్వు వొదిలివెళ్ళిన ఊపిరి వెంట సాగిపోతుంది

శూన్యంలోకి విసిరివేయబడ్డ నీ దేహాన్ని కానీ 
నీ అరచేతుల మధ్య చిక్కుకు పోయిన
నా నాయనాన్ని కానీ 
నేను ఇక చేరుకోలేను-

ఇక మిగిలేదంతా చరిత్ర: నువ్విక  

ఈ శీతాకాలపు దిగులు మధ్యాహ్నాలలోంచి    
తల్లి లేని పిల్లల కళ్ళలోంచి తిరిగి వస్తావు-

నా స్మృతిలో చిక్కుకుపోయిన నీ దేహాన్ని కానీ
అనంతత్వపు సంజ్ఞతో తిరిగివచ్చే, ఒక 
ఆదిమ జాడ అయిన మృత్యువుని కానీ
నేను తిరిగి అందుకోలేను-

ఇక ఒక చూపుడు వేలు
ఈ నిదుర రహిత పదాల గులాబీలలో 
నువ్వు వొదిలివెళ్ళిన కొన  
ఊపిరి వెంట సాగిపోతుంది-

సరైన సమయం*

కిటికీ అవతలగా మరెక్కడో, కిటికీ ఇవతలగా మరెక్కడో: నువ్వు-

అలసినతనం ఒక చంద్రకిరణంగా మారి

అవతలా, ఇవతలా కాని ఒక మనిషిని స్పృశిస్తూన్నప్పుడు, చీకటిలో
అరచేతుల మధ్య ముఖం దాచుకుని
మోకాళ్ళ మీద ఒరిగిపోయిన: నువ్వు-

ఈ లోగా మంచంపై నుంచి 
తను, పెద్దగా నవ్వుతుంది. 

- ఇక, నీకు తెలుసు -

ఎగిరిపోయేందుకైనా, మరణించేందుకైనా

ఇదే సరైన సమయమని-

17 October 2013

"...నాన్నా"

- ఊయలలానో,నావలానో: ఇట్లా ఊగే చీకటి -
   
నీకు చెరోవైపున ఇద్దరు పిల్లలు నీ ఛాతీపై తలలు వాల్చితే
ఒక అంచు నుంచి మరో అంచుకి 
ఊగుతుంది లోకం - ఒక తల్లి 
తన శిశువుకి స్థన్యం అందించి 

అలా జోలపాటతో ఊపుతున్నట్టు- ఉదయం నుండి మండిన 
నీ కళ్ళు,ఒక లేత గాలిలోకీ 
ఓ కలలోకీ తేలిపోతున్నట్టు-

దీవించే అరచేతులు నీ తలను తాకేందుకు వొంగినట్టు ఆకాశం-
దయగల చూపుల లాంటి కొన్ని  
నక్షత్రాలూ.ఎక్కడి నుంచో మరి 
అన్నం ఉడుకుతున్న సువాసనా 

మరి ఆగీ ఆగీ,చెట్లలోంచి నీ పైకి రాలిపడే రాత్రి చెమ్మా,ఇంకా  
ఒక అనామక నిశ్శబ్ధమూనూ- 
ఇక అప్పుడు నువ్వు నెమ్మదిగా 

నీ పిల్లల్ని నీ ఛాతిపై నుంచి తొలగించి,అత్యంత జాగ్రత్తగా వాళ్ళని 
పక్కన పరుండబెట్టి, నీ హృదయ 
స్థానంలో ఏర్పడ్డ, ఆ పురాగానాల 
స్మృతి ముద్రికలను రుద్దుకుంటూ

అతి రహస్యంగా, అతి నిశ్శబ్దంగా,లేచి వెడదామని అనుకుంటావా 
సరిగ్గా అప్పుడే, చీకటి ఒడిలోంచి 
ఒక చిన్న గొంతు,పాల ధారవలే 
గుసగుసల వలే ఇలా అంటుంది -

"...............నాన్నా"

13 October 2013

చిన్న చీకటి

చిన్న చీకటి ఇక్కడ

ఎదురుగా రెండు అరచేతులని ఉంచుకుని, ఆ మట్టి దారులలోంచి  

వెళ్ళిపోయిన వాళ్ళని చూసుకుంటూ
చీకటిలో వెలుగుతున్న ఒక మనిషి

ఇక్కడ


తెరచి ఉంచిన కిటికీలు, ఎవరూ లేని బాల్కనీలు, నిశ్శబ్ధం నిండిన పాత్రలూ

వ్యాపించే గోడలూ, అజగరాల వలే
చుట్టుకునే నీడలూ, పంజరాలూ

ఇక్కడ


నీ కనులంత లోతైన చీకటి ఇక్కడ. నీ చేతివేళ్ళ

భాష వంటి చీకటి ఇక్కడ. నీ
బాహువులంత దీర్ఘమైన చీకటి

ఇక్కడ


నీ శరీరమంత పొడుగ్గా సాగి, నా చుట్టూతా

నీ శిరోజాల సువాసనతో తిరుగాడే
ఒక చీకటి ఇక్కడ:నీవు లేని ఒక నల్లని
ఒంటరితనం ఇక్కడ, అనామక భయం 
ఇక్కడ

తెరచి ఉంచిన ఖాళీతనంలోకి, ఒక మహాశూన్యమై పరచుకున్న

అరచేతుల అగాధుల్లోకి దూకి
ఆ చీకట్లలో తగలబడిపోతున్న
ఒక చిన్న మనిషి,శాపగ్రస్తుడూ  

ఇక్కడ

ఒక చిన్న చీకటి ఇక్కడ

ఒక చిన్న చితి   ఇక్కడ
ఒక చిన్న నొప్పి ఇక్కడ
వ్రాయలేని ఒక చిన్న కవితై ఆగిపోయిన కాలం ఇక్కడ - మరి

రాత్రిలో రాత్రిని త్రవ్వుకుంటూ

మిగిలిపోయిన ఆ మనిషితో 
నేనేం చేయను? నేనేం మాట్లాడనూ?     

11 October 2013

మా చిన్ని అమ్మ

- సాదాగా, సీదాగా నీకో నాలుగు వాక్యాలు -

ఎలా ఉన్నావు అని కదా నువ్వు అడిగినది....

మసిలే నీళ్ళు పడి, ముడతలు పడ్డ అమ్మ పొట్ట కాలిపోయి 
నల్లటి చారికలుగా చీరిపోయిన దానికంటే 
కరకు ఏమీ కావు, కరకుగా ఏమీ లేవు ఈ 

- దినాలు -

మాకు వాటర్ హీటర్ కొనిచ్చి, తాను మాత్రం 
ఒక మసిగుడ్డతో, మోకాళ్ళ నొప్పితో వొంగిన 
కాళ్ళతో, వొణికే చేతులతో, మరి ఆ గిన్నెను మోయలేకో లేక 

తటాలున ఏదో స్ఫురణకు వచ్చి, కళ్లపై నీటి పొర కమ్ముకోగా 
మమ్మల్ని కన్న బొజ్జ బొబ్బలైతే, కూర్చుని 
చేతివేళ్ళతో మందు రాసుకుంటూ "పోతుంది
లేరా, తగ్గి పోతుందిలే" అని తాను అన్నంత
అని తాను చిరునవ్వు నవ్వినంత ధైర్యంగానూ 

- సులభంగానూ లేవు ఈ దినాలు-

- అందుకే, సాదా సీదాగా నీకో నాలుగు వాక్యాలు -

ఎలా ఉన్నాను అని కదా నువ్వు అడిగినది....
మరి నీకు తెలుసా 

తనని మొత్తం కొల్ల గొట్టుకున్నవాళ్ళు, కొల్ల గొట్టుకుని వెళ్ళిపోగా
ఖాళీ అయిన కడుపుతో, పైన వేలాడుతున్న 
ఊగిసలాడే చర్మంతో, ఎవర్ని తలచుకుంటూ

ఎక్కడుందో, చాలా సాదా సీదాగా, కళ్ళల్లో నీళ్ళతో, కాలే నీళ్ళల్లో కళ్ళతో 
ఎవరూ తోడులేని కరకు కాలంలో 
ఈ కవితలాంటి మా చిన్ని అమ్మ? 

10 October 2013

- ఒక చిన్న దారి -

1
మళ్ళా చీకటి గురించే-
మన చుట్టూ, మగ్గిన ఫలం వంటి వాసనతో 
వ్యాపించే చీకటిలోంచే-
2
పసిపిల్లలు చేతివేళ్ళ చివర్లలాంటి చినుకులూ 
ఎవరో ఓదార్పుగా నీ నుదురుని నిమిరినట్టూ 
కొంత గాలి
ఈ రాత్రిలో-

మసకగా వెన్నెల- 
నీడలేవో కదులుతాయి అప్పుడు.  
మరవి నీ లోపలో,బయటో తెలియదు 

నీకూ తనకూ 
ఎన్నటికీ-
4
నేను ఎన్నడూ చెప్పలేదు ఎవరికీ 
ప్రేమించడం తెలికైనదనీ 
బ్రతకడం ఆనందమనీ-
5
మళ్ళా చీకటిలోని కాంతి గురించే ఇదంతా- 
6
ఇదిగో ఇది విను 
నీకు ఇంతకు మునుపు చెప్పనిది-

రహదారిపై పిల్లలు 
గులకరాళ్ళు ఏరుకున్నట్టు
పలుమార్లు ఇక్కడ  
మనల్ని మనం ఏరుకోవాలనీ,దాచుకోవాలనీ 

అప్పుడప్పుడూ తెరచి చూసుకోవాలనీ- 
7
ఎందుకంటే,ఊరికే అలా 
చచ్చిపోలేం కదా మనం
నిద్రమాత్రలతో లేదా,మన అనంత నిశ్శబ్దాలతో-  

అందుకని... 
8
దా-

ఈ అరచేతుల మధ్యకు 
నీ అరచేతినీ,అరచేయి వంటి నీ ముఖాన్నీ వొదిలివేయి-
9
ఆనక ఉందాం మనం
నువ్వూ నేనూ 

ఏమీ చేయక 
మన చుట్టూ మొలకెత్తే 
రేపటి కాంతిలో,మరికొంత శాంతిలో

నాలో, నీలో- 
.
.
.
.
.
.
.
Amen.  

06 October 2013

- ఒక సత్యం -

"ధన్యవాదాలు,మీకందరికీ,మీరు ఇచ్చిన గాయాలకు.
తప్పక గుర్తుకు ఉంచుకుంటాను 
ఇందుకు ప్రతిగా,మిమ్ములను-"

అంతిమంగా ఈ మాటలు అని, అతను వెళ్ళిపోయాడు.

- తను ఏమీ మాట్లాడలేదు. 

ఇక ఆ రాత్రి, ఒక తపనతో  

బాల్కనీలో మిగిలిన ఒకే ఒక్క మొక్కకి 
వేలాడబడింది - ఎల్లా అంటే 
కనులు తెరవని ఒక శిశువు

తన తల్లి వక్షోజాన్ని తడుముకుంటూ వెదుక్కుని
తన లేత పిడికిళ్లతో గట్టిగా 
కరచి పట్టుకున్నట్టుగా - 

ఇళ్ళంతా ఖాళీ

.ఇళ్ళంతా ఖాళీ.

మెడపై కాడి పెట్టినట్టు, భుజాలు కుంగిపోయి, ఇలా ఇక్కడ -

పర్వతాల వంటి కాంతి ఈ కిటికీలోంచి కనిపిస్తా ఉంటే
అప్పుడప్పుడూ నిన్ను స్మరించుకునే గాలి-
నిర్మించుకున్న గృహాలన్నీ నిశ్శబ్ధమయ్యి
ఎటువంటి ఆశా లేకుండా,చతికిలబడి అలా

ఎదురు చూస్తున్నట్టు - వెళ్ళిపోయింది లోపలనుంచి ఏదో-
నా లోపల నుంచి ఇల్లో, ఇంటి లోపల నుంచి
నేనో.మరి ఎవరో అని అడిగితే చెప్పడం కష్టమే-

కానీ, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత
ఊరకనే తచ్చాట్లాడతాయి మధ్యాహ్నం పూట
ఈ పిచ్చుకలు,ఒకప్పటి నీ చేతి మెతుకులకై

పూలు రాలి తండ్లాటలాడే లతల కింద,ఊగే
నీడలలో, వ్యాపించే ధూళిలో, ద్రిమ్మరి వలే
కకావికలమై ఎగిరే ఒక ఒంటరి సీతాకోకచిలుకలో-

- కష్టమే మరి ఇక. అరచేతిని అందుకునే అరచేయి
లేక ఇక్కడ - తలను వాల్చుకోగలిగే భుజం
లేక ఇక్కడ - మాటని పలికే మరో పెదవియై
శ్వాసయై -నువ్వు-లేక-ఇక్కడ-ఉఫ్ఫ్ ...

.ఇళ్ళంతా ఖాళీ. 

కాలం కంపనలో ఒక క్షణం, నీతో -

- వినలేదా నువ్వు, కొమ్మలు వొంగుతాయి ఫల భారంతో - 

అలా వొంగిన కొమ్మల కింద నువ్వు నిల్చున్నప్పుడు, ఎన్నో ఏళ్లుగా చెట్టు దాచుకున్న చెమ్మ నీపై బొట్లు బొట్లుగా రాలితే, నీ చెంపల్ని అరచేతితో తుడుచుకుంటావు: మరి చల్లగానో వేడిగానో

నీ అరచేతి ముద్రికల మధ్యకు చేరే కన్నీరో మరి నీ ఖండిత హృదయం నెత్తురో - అయినా తప్పదు: ఉదయం లేవాలి. నిన్ను నిర్ద్వందంగా ద్వేషించే మనుష్యుల మధ్యకు వెళ్ళాలి - కొంత నవ్వుతూనో, మరికొంత నమ్మకంతోనో - మళ్ళా వెన్నులో వాళ్ళనే దింపుకోవాలి. మరి ఒక నమ్మకంతోనో, ప్రేమతోనో: మొక్కల్ని నాటిన చేతులతోనే, వాళ్ళనే నిన్ను విరిచేసే వాళ్ళనే కౌగలించుకోవాలి,శరీరంలో పెంచుకోవాలి - 

మృత్యు భారంతో వొంగుతున్న కాలం కింద, అప్పుడప్పుడూ కొంత గాలి. లతలు వొణుకుతాయి. ఇక ఒరిమిలేక, తాళలేక,నీపై పూవులు రాలి పడతాయి. పాదాల కింద మట్టి ఒక ఆకాశం. నువ్వు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఊబిగా మారే ఆకాశం. మబ్బులు కమ్ముకున్న కాలంలో, సంధ్యా సమయంలో, నీడలు సర్పాలై నిన్ను అల్లుకుని కాటు వేసే కాలంలో, ఇక్కడొక శబ్ధం - అక్కడొక శబ్ధం. శబ్ధాల మధ్య నిశ్శబ్దంలో తొణికిసలాడే సరస్సులోంచి నిన్ను పిలిచే చేతులు - 

నిన్ను కన్నవారెవరో, నిన్ను పెంచినవారెవరో, నిన్ను వక్షోజాల మధ్య పొదివి పుచ్చుకుని నీ కన్నీళ్ళై తమకు తాము బ్రతుకు లేని వారెవరో నీ చుట్టూతా - నలు దిక్కుల నుంచి లక్ష గుసగుసలై, రహస్యాలై, నువ్వు ప్రేమించి నువ్వు ఉండలేని స్త్రీల కనులై, మసక మసకగా, అంతా ఆకస్మికంగా ఒక అంతిమ క్షణానికి చేరువైనట్టు - 

ముఖం చూసుకుందామని తల వంచితే, అక్కడ అ గులక రాళ్ళని తాకి వెళ్ళే చిన్ని అలలలో మరెవరిదో ముఖం: నీ శరీరం, నీ ఆత్మా, నీ సమస్థం పూవు నుంచి విడివడిన రేకులై, పసుప పచ్చని ఆకులై, ఆ నీళ్ళల్లో, తీరం తెలియని దూరాలకు కొట్టుకుపోతున్న అనుభవం: ఆఖరిసారిగా, నిన్ను చూసుకుని, నీ అరచేతుల్లో పిచ్చుక పిల్లలా ఒదిగిన తమ అరచేతిని - ప్రాణం పోతున్నట్టు - అతి కష్టం మీద లాక్కుని, తన కళ్ళలోని నీరు నీ కంటబడకుండా చివాలున వెనుదిరిగి, తన్నుకు వచ్చే ఏడుపుని మునిపంట నొక్కిపట్టి పరిగెత్తుకు వెళ్ళిపోయిన అనుభూతి కూడానూ - మరి అక్కడ, ఆ సరస్సు అంతాన, వొంటరి మృగ చర్మాల వంటి 

రాళ్ళపై నువ్వు కూర్చున్నప్పుడు, ఇక నీ ఎదురుగా నీ పాదాల వద్ద గత జన్మల సాక్షిగా మిగిలిపోయిన, కమిలిపోయిన, ఎండిపోయిన, తన పెదవి తెగి రాలిన నెత్తురు చుక్క, విశ్వమంత అశ్రుభారంతో - మరి నిజం చెప్పు 

- చూడలేదా నువ్వు, ఫలాలని ఇచ్చి, తనకు తాను ఏమీ మిగుల్చుకోలేక, చివరికి చివికి, ఎండిపోయి, ముక్కలు ముక్కలుగా నరకబడి, ఆఖరుగా తగలబడిపోయిన ఒక చెట్టుని ఎన్నడూ?

(ఆహ్: ఇంతకూ ఏమిటీ ఇదంతా అంటావా? ఏమీ లేదు. సర్వం వలయమయ్యి తిరిగ వచ్చే వేళల్లో,దినానంతాన, ఒక పడవ తీరం వొదిలి వెళ్ళిపోతుంది. వెళ్ళలేక, అమావాస్య రాత్రుళ్ళకు వొణుకుతూ, ఒక తీరం అక్కడే ఎదురు చూపులతో మిగిలి పోతుంది.)   

05 October 2013

ఒక చిన్న విన్నపం

- ఒక లలితమైన నిశ్శబ్ధం, లోపల -

కొత్తగా కట్టుకున్న గూటిలోకి పక్షులు చేరి ముడుచుకున్నట్టు
మబ్బులు కమ్మి, చల్లటి గాలి వీయగా
పూవులు రాలే దారుల్లో
నువ్వు తల వంచుకుని

నడుస్తున్నట్టు: నీ పక్కన ఎవరూ లేకపోయినా, ఎవరి ఊహో
ఆకస్మికంగా నీ పెదాల పైకి ఒక
చిరునవ్వుని తీసుకువచ్చినట్టూ-

- అవును నాకు తెలుసు - ఇదంతా రూపకాలపై రూపకాల
భాష అనీ, అంతకు మించి నాకు
ఇక్కడ మరేమీ లేదనీ, రాదనీ -

కానీ ఏం చేద్దును, పసి నిదుర వంటి ఒక  నిశ్శబ్ధం
లోపల, ఒక పక్కగా ఒత్తిగిల్లి
వెచ్చగా నాలోకి చేరినప్పుడు?

- ఏమీ చేయవొద్దు, ఏమీ మాట్లాడవద్దు -

నువ్వూ కూడా అకారణంగా నీలో నువ్వు, నీతో నువ్వు
నవ్వుకుంటూ కూర్చో ఇలా
ఒక మధుపాత్రతో, చీకటలో

ఒక ప్రార్ధనతో, ఈ ఆకాశంతో

నుదిటి మధ్యన నెమ్మదిగా విస్తరిస్తున్న
సరస్సులోని వెన్నెలతో
సడి చేయనని అలలతో- 

02 October 2013

కాలంలో ఒక క్షణం, నీతో -

నువ్వు నా పక్కన పడుకుంటే

నా ఎదురుగా నీ ముఖం:వానకి తడవకుండా ఆకుల మధ్య గుంభనంగా దాగిన ఒక ఒత్తైన తెల్లని పుష్పంలాగా -   

నిన్ను పూర్తిగా చూద్దామని,శిరోజాలను కప్పుకున్న ఆ ఆకులని తొలగించే నా వేలి చుట్టూ చుట్టుకుంటుంది మట్టి తడచిన అడవి వేర్ల వాసన - చెట్టు మొదట్లో, చినుకులకి ముడుచుకునే గడ్డి పరకల వాసన. మరి గాలి వీచే చల్లని సవ్వడీనూ- 

ఇక అప్పుడు, నా మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు నన్ను దగ్గరకి లాక్కుంటే, మంచు రాలి కాలం వొణికే వేళల్లో,ఎవరో చివ్వున ఒక నెగడును రగిలించిన కాంతి- 

ఇక ఆ అరుణిమ కాంతిలో ఎగురుతాయి మన చుట్టూ మరి మిణుగురులో లేక లేత ఎరుపు సీతాకోకచిలుకలో నిద్ర నిండిన నయనాలతో- 

మరి అప్పుడే ఎక్కడో గూ గూ మని పావురాళ్ళ కువకువలు 

మన శరీరాల్లోనే గూడు కట్టుకున్నట్టుగా, రెక్కలు మునగదీసుకున్నట్టుగా, రమిస్తున్నట్టుగా, గుడ్లని పొదుగుతున్నట్టుగా, రెక్కలు రాని వాటి పిల్లలు గూటిలో అలజడిగా కదులుతున్నట్టుగా-   

అందుకే అప్పుడు చల్లటి గాలీ, రాత్రీ, చీకటీ: నీలో, నాలో. 

అందుకే ఇక అప్పుడు, ఒకరినొకరు గట్టిగా కరచుకుని పడుకుంటామా మనం, ఏ తెల్లవారుఝామో వచ్చి, తలుపు తట్టీ తట్టీ వెళ్ళిపోతుంది మృత్యువు- మన ఆనవాలు ఏమాత్రం లేకుండా, ఏమాత్రం సవ్వడి చేయకుండా-  

మరి బ్రతికే ఉన్నామా మనం, అప్పుడు?     

01 October 2013

aint no poem

నువ్వోసారి తలుపులు, నీ తలుపులు తెరవగలిగితే 

పసి వాసనతో ఒక గాలి లోపలికి రావొచ్చు
లతను వొదిలి ఒక పూవు నీ పైకి వొంగి నిన్ను తాకవచ్చు
          రాత్రి చెమ్మని నీపై చిమ్మవచ్చు -

నువ్వోసారి తలుపులు, ఆ తలుపులు తెరవగలిగితే 

సన్నటి నవ్వుతో ఎవరో నిన్ను పలుకరించవచ్చు
     కన్నీళ్ళతో ఎవరో నిను చుట్టుకోవచ్చు 
     వండిన - తమకో, నీకో- అన్నాన్ని 
     నీకు ఒక ప్రార్ధన వలే ఇవ్వవొచ్చు -

నువ్వోసారి తలుపులు, నీ తలుపులు తెరవగలిగితే 

నీకొక ముఖం ఎదురు రావొచ్చు 
నీకు చెప్పాలనుకుని అప్పటిదాకా వల్లెవేసుకున్నవన్నీ 
     లోపలే నొక్కిపెట్టి, లోపలికి వెళ్ళిపోనూ వచ్చు - 
     పడక ఒక ఊబై, దిండు ఒక అంతిమ కౌగిలై
 అలా మిగిలి పోనూ వచ్చు - 

నువ్వోసారి తలుపులు, ఆ తలుపులు తెరవగలిగితే 

అక్కడొక వీధి కుక్క, గాట్లతో నిలబడి ఉండవచ్చు 
     ఎండుకుపోయిన దాని డొక్కలో, తల్లులూ తండ్రులూ 
     పిల్లలూ పాపాలూ ఏడుస్తుండవచ్చు - నిండు 
గర్భంతో ఒక మనిషి సర్వం తెగి 
విలపిస్తూ ఉండి ఉండవచ్చు -

నువ్వోసారి తలుపులు,మన తలుపులు తెరవగలిగితే, చాలాసార్లు 

అక్కడ ఏమీ ఉండకపోవచ్చు - ఎదురుచూసీ చూసీ 
     తల్లిపాలతో నిండిన వక్షోజాలు రెండు, గుమ్మానికి మోకరిల్లి, నెత్తురుతో 
     చిప్పిల్లతుండవచ్చు - నువ్వే అయ్యి 
     కరుగుతుండావచ్చు - ఆఖరి శ్వాసకై 
     తపిస్తూ ఉండవచ్చు: రోజూలాగే 

చనిపోతుండా వచ్చు, శూన్యం అయ్యి ఉండావచ్చు 
ఏమైనా కావచ్చు, కాకపోనూ వొచ్చు - 

ఒక్కసారి నువ్వు ఆ తలుపులు కాగలిగితే 
ఒక్కసారి నువ్వు ఆ తలుపులై 
తెరవబడగలిగితే -!

30 September 2013

నా చిన్న లోకం

- ఇవే చెట్లు. వాటి ముందు కూర్చుంటాను, పెద్దగా చేసేది ఏమీ లేక -

ఇదొక చిన్న లోకం. నా చిన్న లోకం -

అప్పుడప్పుడూ నేను బ్రతికి ఉండటానికి కారణం ఇవే: చల్లటి నీడలు
పూవులై ఊగుతూ తూగుతూ గాలితో

ఊయలలూగే లోకం. ఏమీ ఉండదు

ఇక్కడ.ఇటు చూడు - కనురెప్పల
వలే చలించే ఆకులు. పరదాల వలే
వీచే కాంతి. మట్టిలో ఆడుకునే పిల్లలూ, మట్టి అంటని, పడి లేచే వాళ్ళ అరుపులూ -

ఎవరో వస్తుంటారు. ఎవరో నిన్ను

తాకి, నవ్వుతో వెడుతుంటారు -
నుదిటిపై ఉంచిన ఒక అరచేతి పసుపు వాసనేదో కూడా అప్పుడు నీలో - ఒకరి
ముఖంలో ముఖం ముంచి

పరిశుభ్రం చేసుకున్నప్పటి 

విరామమూ, శాంతీ: మరి
నమ్ముతావా ఇప్పుడయినా
మనుషుల్లో తోటలూ, తోటల్లో మనుషులూ ఉంటారంటే? ఆహ్ ఏమీ లేదు

ఒక మధ్యాహ్నం. ఒక గూడు -

ముడుచుకున్న రెక్కల్లోని
గోరువెచ్చని నిద్ర. కొమ్మల్లో
మిలమిలా మెరిసే ఆకాశం-
మెల్లిగా మబ్బులు కమ్ముకుని, చిన్నగా చెట్లు వీచి, గడ్డి ఊగిపోతే, తెరుచుకోబోయే

వాన తలుపుల ముందు

నువ్వూ, నేనూ, తనూ -
ఉఫ్ఫ్. ఇక అడగకండి నన్ను ఇప్పుడైనా,దివ్యాత్మ సత్యాల గురించీ వాస్తవాల గురించీ-

చూడండి: ఒక చిన్ని చినుకు


మట్టిని తాకి, వేల పూవులై చిట్లి 
ఎలా వొళ్ళు విరుచుకుంటుందో! 

29 September 2013

ఇది

- రాత్రిలోకి తొంగి చూస్తే, నక్షత్రాలకు పూసిన 
ఓ చందమామ కనిపిస్తుందని 
వచ్చావా, ఇక్కడికి-?  

మరి,చూడు ఇక్కడ 

వొంగిన తల తెగి, ఎవరి కన్నీళ్ళలోనో రాలిపడితే
చివరికి 

నెత్తురంటిన, నువ్వు అంటిన,నువ్వు అంటుకున్న  

ఆ చేతులేవరివో తెలియదు,లోతు అందని  
బావులయ్యింది ఎవరో తెలియదు
చివరికి 

మిగిలింది, వెళ్లిపోయింది కూడా ఎవరో తెలియదు -

ఇక మళ్ళా వస్తావా,ఎపుడైనా ఇటువైపు 

ఆత్మహత్యించుకుని
తిరిగి జన్మించే ఈ 

శ్వేత నలుపు రాత్రుళ్ళ కనుల వైపు? 
నేరాపరాధన లేని, మోపని 
ఈ ప్రేమల వైపూ? 

28 September 2013

నిస్సహాయత

చెట్టు మొదట్లో వాలిపోయిన పసి ఆకు ఉన్నటుండీ చలించి,వొణికిపోతుంది-

ఎగరలేదు. కొమ్మల్లో రెక్కలు విదిల్చే 
పక్షిని చూడలేదు. ఎగరాలేదు -

చీకటి వంటి దట్టమైన నీడల్ని కప్పుకుని 
దాని కింద మూలిగే ఈ లేత ఆకు 
మా మాటల్ని వినలేదు, తన తల్లి 
కళ్ళలోని నీటిని తాకనూ లేదు - 

వడలిపోయిన, పిగిలిపోయిన, కమిలిపోయిన 
ఒక చిన్న శరీరం ఈ ఆకుది 
ఆ అమ్మదీ, ఆ నాన్నదీ 
ఈ చిన్ని అద్దె ఇంటిదీనూ - 

ఏం లేదు: అరచేతుల మధ్య దీపం ఆరకుండా 
రెండు అరచేతులై కూర్చున్న 
ఆ ఇద్దరి పరీక్షా దినమే ఇది- 

చూడూ,ఇది నిజం:
పూలతో ఖండింపబడ్డ, ఖడ్గక్షణాలు ఇవి-
ఇక ఏం చేయగలం 
నువ్వూ, నేనూ-?   

23 September 2013

- అప్పుడు -

"-You don't know- and you will never know-

There is a wound here -
A wound - as large as a shadow
A wound - as large as this earth, that 
No one can ever dig
A wound - as large as this 
Fucking, sucking, breathing 
Universe 

Do you know that? Do you know that?
A wound. The wound. A wound
That never heals?-" 

తన యోని వైపు చూయిస్తూ తను అడిగింది నన్ను- 

అది రాత్రి. అందుకని నేను తనకి 
ఇలా పెద్దగా చదివి వినిపించాను-:

Your hand full of hours, you came to me - and I said:
Your hair is not brown.
So you lifted it lightly on to the scales of grief;
     it weighed more than I...*

అప్పుడు తను చిన్నగా రోదించింది. అప్పుడు చీకట్లలోకి  
నెమ్మదిగా ఒక ప్రమిదె కనుమరుగయ్యింది
ఆ నిద్రిత ఛాయల్లో ఒక గూడు చెదిరింది-

"Can't nymphomaniacs love? Can't nymphomaniacs have
Lives? Why is that I have not been 
Written in your his/stories-?"

అని రాత్రి నన్ను అడిగింది. ఇకప్పుడు నేను 
ఒక తెల్లని శాంతి కిరణం వంటి తువ్వాలుని 
బ్లేడు కోతతో ఎర్రనయ్యిన తన గూటిపై ఉంచగా 

అక్కడ,అప్పుడు,ఆ చోట 

రెండు వక్షోజాలూ రెండు నిలువెత్తు అశ్రువులై
వడలిన పూవులై నేల రాలిన చోట,ఒక పాప
నను హత్తుకుని వెక్కిళ్ళతో నిదురోయింది-తన 

శిరోజాలలోంచి యుగాల నెత్తురు వాసన నన్ను 
పొగ చూరిన చేతుల వలే అల్లుకుంది - And
then  

It rained and 
Rained and 
Rained

All night long. 

మరి విన్నావా నువ్వు 

నీ నిద్దురలో నీ పక్కగా ప్రవహించిన, ఆ నీటి చప్పుడు? 

అ ప్పు డు?
-----------------------
* lines by Paul Celan-