22 November 2010

పాయల్

మళ్ళీ
మొదటికి రావొద్దు
మళ్ళీ
వలయం కావొద్దు

వలయంలో
వివశితుడై
తిరుగాడుతున్నవాడికి
ఒక బిందువుపై
శిరస్సుని ఆన్చి, నీ పద
దయచే
నీ వదనపు ఖడ్గంచే
ఖండింపబడే
కరుణ లేని వ్యాకరణం
వొద్దు=

రూపాంతరం చెందే
వాక్యాంతపు
విరామ చిహ్నాలు వొద్దు=

అపవిత్ర పాత్రలూ
పవిత్ర మధువులూ
వారసత్వపు
పౌరసత్వపు ఎదురు
చూపులూ
వొద్దు=

తెగుతున్న రాత్రుళ్ళూ
తెగని అందరి
అంతిమ వ్యక్తీకరణలూ
వొద్దు=

మనం వొద్దే
వొద్దు=

((వొంటరితనపు చెట్టు కింద దిగులు పూలు అమ్ముకుంటున్న పాయల్
వికసించే నల్ల పూల తోటలో
తెల్లని కళ్ళ, తెల్ల తెల్లాని విషాదాన్ని పదాల నల్ల నల్లాని చూపులతో
అమ్ముకుంటున్న, నమ్ముకుంటున్న పాయల్
రాత్రి దయామైయపు పెదవిపై
ఎర్రటి జాబిలై వెలిగే, జ్వలించే పాయల్, నీ వెంట రెండు నిస్సహాయమైన
మూగ చేతులై సాగే పాయల్, పాయల్
ఆమె నీకు తెలుసునా?))

((ఎప్పటిలాగే ఈ అంచు నుంచి, ఈ మంచు నుంచి, ఈ మహా మంచు
మనిషి నుంచి, కొంత
కారుణ్యం లేని ఋణం ఉండనివ్వండి. ఎప్పటిలాగే ఈ అంచునుంచి
పొంచి ఉన్న కంచు ప్రతిబింబాలనుంచి
కొనసాగుతున్న నిర్దిష్టతలనుంచి కొంత కాంతి ఉన్న కదలికలను
మిగలనివ్వండి.))

((నీకు కాని, ఇద్దరితో మెదిలే ఆమెకు కానీ ఆమె అతడికి కానీ,
ఆ రాత్రికి రాత్రి లేదు.
నిశ్శబ్దాల నుదుట సింధూరాలు లేవు. పదాల గజ్జెలు లేవు. ఇక
ఎవరూ లేని కాటుక కన్నీళ్లు మాత్రం
సాయంత్రంలోకి ఇంకిపోతాయి: ఆ పాదాల ముందు
పాయల్ నయనాల ముందు
నయనాల పాదాల పాయల్ పాలిపోయిన పదాల ముందు కరిగి
విరిగిపోతాయి.))

))ఇంతకూ నీకు పాయల్ తెలుసునా?((

వొద్దు
మళ్ళీ
మొదటివి కావొద్దు
మళ్ళీ
వలయం రావొద్దు

అనలంలో
ఆదిమ
వివశితుడై
తిరుగాడుతున్నవాడికి
ఒక బిందువుపై
శిరస్సుని ఆన్చి,
నీ పద
వదనపు ఖడ్గంచే
ఖండింపబడే
వ్యా/క"రుణం"
వొద్దు=

రూపాంతరం చెందే
వాక్యాంతపు
విరామ చిహ్నాలు వొద్దు=
పవిత్ర పాత్రలూ
అపవిత్ర మధువులూ
వారి
పౌరసత్వపు ఎదురు
చూపులూ
వొద్దు=

తెగని రాత్రుళ్ళూ
తెగుతున్న
అందరి
అంతిమ
వ్యక్తీకరణలూ
వొద్దు=

మనం వొద్దే
వొద్దు=

వొద్దా

=మనం
ఇప్పటికీ
ఎప్పటికీ?=

((మనం))

17 November 2010

ఉట్టినే అలా

((ఒక నైర్యాసపు అచ్చులూ, హల్లులూ))

=చదవటం
మరణించడం వంటి ప్రక్రియ
కలలతో
కదలకండి ఇక్కడ=

))మేఘాలు వస్తాయట నువ్వు అడిగినప్పుడు
పూవులు పూస్తాయట
నువ్వు నవ్వినప్పుడు:
ఇక ఏమీ అవసరం లేని ఒక కాంతి వర్షం
కురుస్తుందట
నువ్వు నన్ను తలుచుకున్నప్పుడు:))

((వస్తుందట
ఒక వసంతం నిన్ను కావలించుకునేందుకు
వికసిస్తుందట
ఒక చిన్న పదం, నిన్ను
తన చెంత చేర్చుకునేందుకు:
గూడులో
ఒక చిన్న చింతతో
నువ్వు దిగులుతో, చిరు చిరు
నగవుతో
నిదురిస్తునప్పుడు
వస్తుందట ఒక వాక్యం
నిన్ను
తన దరికి చేర్చుకుని
విసిరివేసేందుకు((

=చదివిందంతా చదివి
బ్రతికినదంతా
బ్రతికి, ఎందుకు ఇదంతా
ఎందుకు
ఈ తపన అంతా=

((ఉంటాయి నువ్వు ఇప్పటిదాకా కాంచని శరీరాలు. ఉంటాయి
అప్పటిదాకా నువ్వు ఎప్పటికీ
కాంచలేని ఇతర అర్థరహిత ప్రమాణాలు:
నీ చిన్న చిన్న
నిస్సహాయతనంతా కూడపెట్టి ఒక ఆలింగనంగా చేయి: వస్తాను
నేను లేదా అతడు
నీలో ఒక అంతిమ ఆరంబాన్ని కనుగొనేందుకు:
వస్తాను నేను
ఆమెలో,అందరిలో ఒక ఆదిమ అంతాన్ని కనుగునేందుకు:))

వస్తారట నువ్వూ నేనూ
నువ్వు అడిగినప్పుడు
వస్తారట నువ్వూ నేనూ
నువ్వు అలిగినప్పుడు

=రాత్రి లేదు
అలా అని
పగలూ లేదు
ఉందామా, నువ్వూ నేనూ
అప్పటిదాకా

))నువ్వూ ఎక్కడా ఉండవు
నేను ఎక్కడా ఉండను((

=ఊరికే అలా
ఇలా
ఇక్కడ, ఉట్టినే అలా
ఉందామా?=

నువ్వు

పూవుల్లో నువ్వు
ముళ్ళలో నువ్వు
పలుకలేని పదాలలో నువ్వు
పలుకే లేని పదాలలో
నువ్వు: నువ్వు

హింసలలో నువ్వు
నిస్సహాయ
దుర్మార్గపు వాస్తవాలలో
నువ్వు: నువ్వు

ప్రేమతో
నువ్వు
ద్వేషంతో
నువ్వు
సహనంతో
నువ్వు
అసహనంతో
నువ్వు
హత్యలతో
నువ్వు
ఆత్మహత్యలతో
నువ్వు
ఎవరూ లేక
రాలిపడే నువ్వు
అందరూ ఉండి
పిగిలిపోయే నువ్వు
నువ్వు:

((ఒక రోజు. భార్యలు ప్రియురాళ్ళలాగా, ప్రియురాళ్ళు భార్యలుగా ఉండలేని రోజు
అతడు ధ్రవ్యమై సర్వత్రా అలుముకుంటున్న రోజు
అతడు, అతడు అందరిలా ఒక్కటై, ఎవరికీ లేని అందరివాడై ఇలా ఊరికే మిగిలి
పిగిలి, పోయీ ఉన్నాడు. అతడు: ఆమె.))

=ఆ తరువాత ఏమౌతుంది?=

(( స్త్రీ లేని, స్త్రీని కనలేని ఒక పురుషుడు రాత్రంతా పూవులను పిల్లలుగా,పిల్లలను
పిల్లలు లేని తల్లిగా ఒక దయాపూరితమైన మధుపాత్రగా రూపాంతరం చెందుతాడు.))

= వాళ్లకి నీడలు లేవు
వాళ్ళ పద ముద్రల జాడలు లేవు
కరిగీ, కరగనంతగా
సాగీ, ఎవరికీ
ఆఖరి అంతక్రియలు లేవు
ఎవరికీ, ఆదిమ
పుష్పపు విలాపనలు లేవు=

(( వాక్యాంతపు చిహ్నం చివర ఎదురు చూసేది ఎవరు? వాక్యపు ఆరంభంలో
మొదటి అక్షరమై అద్రుశ్యమయ్యేది ఎవరు?))

= ఇది కవిత కాదు. మీ ప్రతిధ్వనిని ప్రతిబింబించే హృదయం కాదు: ఇది. ఇది=

)) ఆ తరువాత((

పూవుల ముళ్ళలో
నువ్వు
ముళ్ళ నవుల్లో నువ్వు
దిసాంతపు
వ్యాకరణంలో నువ్వు
నిన్ను చేరలేని
కరుణలో నేను:

((నేను అంటాను:
మనం ఈ పూట పూర్తిగా
మరణిద్దాం))

= ఇప్పటికీ నువ్వు ఇక్కడ
ఉన్నటయితే
వెడలిపో, ఇప్పుడే ఇక్కడే=

((ప్రేమ అంత తేలిక కాదు
జీవించడమూ
అంత తేలిక కాదు))

= వెన్నెల దాగి ఉంది
అగ్నీ ఆగి ఉంది
నేను ఇక్కడ ఆగి, దాగి ఉంటాను
నేను ఇక్కడ
ఆగుని, దాగుని ఉంటాను=

)) మళ్ళా రేపు ఉంది((

=కలుద్దామా మనం?=

09 November 2010

నీ రోజు ఇది

నీ రోజు ఇది
నీతో
నీ నీతో, నీవైన
నాతో
నీ ముంగిట్లో
కరగాల్సిన సమయమిది
లోకమిది=

నీదైన
నా రోజు కూడా ఇది
నా నాతో, నీవైన
అందరితో
నీ పదాల ముందు
మోకరిల్ల వలసిన
ప్రవాసపు
మహా దూరమే ఇది=

దూరం గురించే
ఇదంతా
దగ్గరితనం గురించే
ఇదంతా
ఇదంతా
దూరం అవుతున్న
దగ్గరతనం గురించీ
దగ్గరవుతున్న
దూరం గురించే
ఇదంతా= ఇదంతా
దగ్గరా
దూరం కాలేని
కన్నీళ్ళ రాళ్ళ కలల
గురించే ఇది అంతా
ఆది అంతా
అనంతం అంతా=

((చూస్తుండవచ్చు నువ్వు. ఒక పుష్ప గుచ్చాన్ని కళ్ళలో పదాలతో పుచ్చుకుని
ఎదురు చూస్తుండవచ్చు నువ్వు
ఊరికే అలా, ఈ రాత్రిలో, ఎప్పటికీ రాని తిరిగి వచ్చే ఆ రాత్రిలో, ఒక నిశ్శబ్దంలో
నిశ్శబ్దం కాని ఒక పదమై, రణరంగంలో కోల్పోయిన
ఒక ఇనుప ప్రతిబింబమై, నువ్వు అలా, ఊరికే అలా, ఎవరికీ చెందని కలలా,
నువ్వు ఎదురు చూస్తుండవచ్చు.))

((నేను వస్తానా? వస్తే, ఎప్పటికైనా నీ వదనాన్ని తిరిగి తెస్తే, వచ్చేదీ తిరిగి తెచ్చేదీ
ఎవరూ లేని ఒక ఒంటరి పదాన్నా? లేక
ఎవరూ చెప్పలేని ఒక సమూహపు, కళకళలాడే కన్నీటితో తళతళలాడే హత్యనా?))

నీ రోజు ఇది
నీతో నువ్వు కూడా
గడపలేని
నీవైన నాతో కూడా
పంచుకోలేని
పరమ కాళ రాత్రి ఇది
వైవాహిక
జీవితమిది=

మహా దూరమే ఇది
మహా దుర్మార్గమే ఇది
కాంచి
ఎవరూ పలుకలేని
మహా నైరాస్యమే ఇది
ఎప్పటికీ వివరించలేని
ఇద్దరి
విధ్వంసమే ఇది=

కాబట్టి
అంతం ఒకటి ఉండాలి
కాబట్టి
ఇలా, ఈ ఇలలో, నీదీ
నాదైన కలలో
ఇలా అంతం చేస్తాను

((నేను ఎక్కడా లేను
నేను ఎక్కడా ఉండను.))

08 November 2010

పిల్లలే కదా అలా

పిల్లలే కదా అలా
ఎదురుచూసేది
ఎంత రాత్రైనా
ఎంత బాధైనా
పిల్లలే కదా అలా
అలలై
నువ్వు మరచిపోయిన
కలలై, నీకై
ఎదురుచూసేది==

పిల్లలే కదా అలా
ఎంత రాత్రైనా
ఎంత బాధైనా
నీకు తోడు ఉండేది
పిల్లలే కదా అలా
పిచ్చుకలై
నువ్వు మరచిపోయిన
కలల చుట్టూ
నీకై గిరికీలు కొట్టేది==

((ఇక్కడే రెండు పూలు పూసాయి. ఇక్కడే రెండు పావురాళ్ళు తిరుగాడాయి.
పూలల్లో, పావురాల కళ్ళ చెమ్మలో, నెమ్మదిగా పదాలను కూర్చుకుంటున్న
రెండు పెదవులు, పురాజన్మ నుంచి తెచ్చుకున్న కరుణతో కదులాడాయి.
అవి నీకై ఎదురుచూసే పిల్లల్లా మారాయి.))

((నువ్వు ఇక్కడ లేవు. ఎక్కడా లేవు. ఎదురుచూపుల కన్నీళ్ళలో లేవు,
ఎదురు రాని బెదురు చూపుల బేల కళ్ళలోనూ లేవు.
లేకపోవడమే నీ ఉండటంగా మారిన ప్రదేశాలలో, భాష లేదు, భావం లేదు
కరుణతో కూడిన వ్యాకరణం లేదు.))

తనే కదా అలా
పిల్లల్లా ఎదురుచూసేది
ఎంత రాత్రైనా
ఎంత హింసయినా
తనే కదా అలా
నీకై, ఒక దీపమై
ఆపై ఒక ద్వీపమై అలా
పిల్లలతో కలిసి
రాత్రిలో దహనమై పోయేది=

((ఎప్పటికైనా తనే కదా అలా))

పిల్లలే కదా అలా
నీతో జీవితం గడిపేది
పిల్లలే కదా అలా
నీకు మృత్యువుని
బహుకరించేది=

06 November 2010

ఊరికే అలా

వస్తావు నువ్వు

ఎందుకని నేను అడగను
(అడిగేందుకు కాదు కదా
జీవితం ఉన్నది)
అందుకని

వస్తాను నేను

ఎందుకనీ నువ్వూ అడగవు
(అడగటం
ఒక అబద్ధమని నీకు తెలుసు
కనుక)

కారణాల గురించి ఇద్దరమూ
కరుణతో అడగము
కరుణ ఉన్నది కాబట్టి అడగము

-వ్యాకులత నిండిన ఒక నయనం
దాహం నిండిన ఒక దేహం
దేహం నిండిన ఒక దాహం
అంతే కదా మనం,
అటువంటి గాధే కదా మనం -

వ్యాకరణం లేని కరుణ కదా
మనం
రణం కూడా కదా మనం==

నువ్వు వచ్చినప్పుడు
నేనూ వచ్చినప్పుడు
ఇద్దరితో కలిసి
ఇద్దరివీ అయ్యి, ఇద్దరివీ కాని
చరిత్రలన్నీ
చంచల పదాలతో వచ్చినప్పుడు

ఉంటాము నువ్వూ నేనూ
ఊరికే అలా
కా/రణాలు లేకుండా
కన్నీళ్ళం కాకుండా
ఊరికే అలా
ఊరికే అలా-

రాత్రి ఇద్దరం కలిసినప్పుడు

రాత్రి ఇద్దరం కలిసినప్పుడు
కొంత పవిత్రత
కొంత పాపం

రాత్రి ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు
కొంత మౌనం
కొంత గానం

రాత్రి ఇద్దరం మైమరచినప్పుడు
కొంత హింస
కొంత మీమాంస

రాత్రి ఇద్దరం గొడవపడినప్పుడు
కొంత ప్రేమ
కొంత ద్వేషం
ఇంకొంత అసహనం

ఇళ్ల గురించి కదా ఇదంతా
తల్లుల గురించి
ఎప్పటికీ లేని తండ్రుల గురించీ
కదా ఇదంతా
మన కధ అంతా
మన కదలికల కలల అలజడి
అంతా, అనంతం దాకా-

ఇక రాత్రి పాక ముందు మిగిలిన
నీలాంటి
నాలాంటి
మత్తుతో, జీవన మృతువుతో
ఊగుతున్న పూలలోంచి
ఒక వేకువ జాములోకి కదా మనం
కదిలిపోతాం

కొంత స్మృతితో
కొంత విస్మృతితో

మళ్ళా
మరో రాత్రిలోకి
మరో స్నేహంలోకి-

((నువ్వు చూస్తుంటే, ఇది నీకు))