17 November 2010

నువ్వు

పూవుల్లో నువ్వు
ముళ్ళలో నువ్వు
పలుకలేని పదాలలో నువ్వు
పలుకే లేని పదాలలో
నువ్వు: నువ్వు

హింసలలో నువ్వు
నిస్సహాయ
దుర్మార్గపు వాస్తవాలలో
నువ్వు: నువ్వు

ప్రేమతో
నువ్వు
ద్వేషంతో
నువ్వు
సహనంతో
నువ్వు
అసహనంతో
నువ్వు
హత్యలతో
నువ్వు
ఆత్మహత్యలతో
నువ్వు
ఎవరూ లేక
రాలిపడే నువ్వు
అందరూ ఉండి
పిగిలిపోయే నువ్వు
నువ్వు:

((ఒక రోజు. భార్యలు ప్రియురాళ్ళలాగా, ప్రియురాళ్ళు భార్యలుగా ఉండలేని రోజు
అతడు ధ్రవ్యమై సర్వత్రా అలుముకుంటున్న రోజు
అతడు, అతడు అందరిలా ఒక్కటై, ఎవరికీ లేని అందరివాడై ఇలా ఊరికే మిగిలి
పిగిలి, పోయీ ఉన్నాడు. అతడు: ఆమె.))

=ఆ తరువాత ఏమౌతుంది?=

(( స్త్రీ లేని, స్త్రీని కనలేని ఒక పురుషుడు రాత్రంతా పూవులను పిల్లలుగా,పిల్లలను
పిల్లలు లేని తల్లిగా ఒక దయాపూరితమైన మధుపాత్రగా రూపాంతరం చెందుతాడు.))

= వాళ్లకి నీడలు లేవు
వాళ్ళ పద ముద్రల జాడలు లేవు
కరిగీ, కరగనంతగా
సాగీ, ఎవరికీ
ఆఖరి అంతక్రియలు లేవు
ఎవరికీ, ఆదిమ
పుష్పపు విలాపనలు లేవు=

(( వాక్యాంతపు చిహ్నం చివర ఎదురు చూసేది ఎవరు? వాక్యపు ఆరంభంలో
మొదటి అక్షరమై అద్రుశ్యమయ్యేది ఎవరు?))

= ఇది కవిత కాదు. మీ ప్రతిధ్వనిని ప్రతిబింబించే హృదయం కాదు: ఇది. ఇది=

)) ఆ తరువాత((

పూవుల ముళ్ళలో
నువ్వు
ముళ్ళ నవుల్లో నువ్వు
దిసాంతపు
వ్యాకరణంలో నువ్వు
నిన్ను చేరలేని
కరుణలో నేను:

((నేను అంటాను:
మనం ఈ పూట పూర్తిగా
మరణిద్దాం))

= ఇప్పటికీ నువ్వు ఇక్కడ
ఉన్నటయితే
వెడలిపో, ఇప్పుడే ఇక్కడే=

((ప్రేమ అంత తేలిక కాదు
జీవించడమూ
అంత తేలిక కాదు))

= వెన్నెల దాగి ఉంది
అగ్నీ ఆగి ఉంది
నేను ఇక్కడ ఆగి, దాగి ఉంటాను
నేను ఇక్కడ
ఆగుని, దాగుని ఉంటాను=

)) మళ్ళా రేపు ఉంది((

=కలుద్దామా మనం?=

1 comment: