పిల్లలే కదా అలా
ఎదురుచూసేది
ఎంత రాత్రైనా
ఎంత బాధైనా
పిల్లలే కదా అలా
అలలై
నువ్వు మరచిపోయిన
కలలై, నీకై
ఎదురుచూసేది==
పిల్లలే కదా అలా
ఎంత రాత్రైనా
ఎంత బాధైనా
నీకు తోడు ఉండేది
పిల్లలే కదా అలా
పిచ్చుకలై
నువ్వు మరచిపోయిన
కలల చుట్టూ
నీకై గిరికీలు కొట్టేది==
((ఇక్కడే రెండు పూలు పూసాయి. ఇక్కడే రెండు పావురాళ్ళు తిరుగాడాయి.
పూలల్లో, పావురాల కళ్ళ చెమ్మలో, నెమ్మదిగా పదాలను కూర్చుకుంటున్న
రెండు పెదవులు, పురాజన్మ నుంచి తెచ్చుకున్న కరుణతో కదులాడాయి.
అవి నీకై ఎదురుచూసే పిల్లల్లా మారాయి.))
((నువ్వు ఇక్కడ లేవు. ఎక్కడా లేవు. ఎదురుచూపుల కన్నీళ్ళలో లేవు,
ఎదురు రాని బెదురు చూపుల బేల కళ్ళలోనూ లేవు.
లేకపోవడమే నీ ఉండటంగా మారిన ప్రదేశాలలో, భాష లేదు, భావం లేదు
కరుణతో కూడిన వ్యాకరణం లేదు.))
తనే కదా అలా
పిల్లల్లా ఎదురుచూసేది
ఎంత రాత్రైనా
ఎంత హింసయినా
తనే కదా అలా
నీకై, ఒక దీపమై
ఆపై ఒక ద్వీపమై అలా
పిల్లలతో కలిసి
రాత్రిలో దహనమై పోయేది=
((ఎప్పటికైనా తనే కదా అలా))
పిల్లలే కదా అలా
నీతో జీవితం గడిపేది
పిల్లలే కదా అలా
నీకు మృత్యువుని
బహుకరించేది=
ఈ రోజే... మీ బ్లాగ్ చూసాను...ఇన్ని కవితల్ని చూసిన సంబరంతో...ఏదీ పూర్తిగా
ReplyDeleteచదవనివ్వని ఆత్రంతో...ఒక్కో కవితనీ కొంచెంగా పలకరిస్తూ వస్తుంటే...ఈ కవిత
ఆపేసింది.బావుంది.