29 September 2015

జీవించడం

నడవలేక ఇక, అతను అక్కడే కూలబడతాడు -

మరెక్కడో గాలి
సుడులు తిరిగి తిరిగి నెమ్మదిగా ఆగిపోతుంది. వడలిపోయి  
ఒక పూవు తల వాల్చేస్తుంది. ఇక 
సాయంకాలపు పల్చటి చీకటి

నెమ్మదిగా
ఆ గదిలో వలయాలుగా వలయాలుగా చుట్టుకుంటుంటే 
లోపలంతా వేర్లు వెలికి వచ్చిన వాసన: నేలపై 
పక్షి గూడు చీలికలై మిగిల్చిన ధూళి
సొన. ఆకులూ, ఈకలు -

"ఏమయ్యింది నాన్నా"
అని పిల్లలు ఆ తరువాత ఎప్పుడో హత్తుకుని అడిగితే 
అతను గొణుక్కుంటాడు ఇలా తనలో తాను 
బీతిల్లిన గొంతుతో, ఒక స్మృతితో: 

"నేర్చుకుంటారు
త్వరలో మీరు కూడా - జీవించడం ఇలాగ:
వేయి దీపాలు ఆరిన హృదయంతో 
ఆ పొగతో."

28 September 2015

గడచిన దూరం

గడచిన ఎంతో నిశ్శబ్ధం తరువాత
గడప వద్ద నుంచి
లోపలికి నువ్వు

నడచిన ఎంతో దూరం తరువాత

నీ గుమ్మం వద్ద
నిస్త్రాణగా నేను

లోపలెక్కడో గిన్నెలోకి పడే నీళ్ళు:

పిచ్చుక పిల్లల
అరుపుల్లా -

బియ్యం కడుగుతూ, సాంధ్యచ్చాయలో

అలలవలే గోడలపై
నీ చేతి గాజుల
నీడలు

సన్నటి శబ్ధాలతో, మాటలేవో చెబుతూ

పిల్లలకి అన్నం
పెడుతున్నట్టు -

గడచిన ఎంతో దూరం తరువాత
కొంత శాంతి. రాలిపోయే
పూలల్లో వర్షపు
కాంతీ: గాలీ -

ఇక ఎవరంటారు, ఈ పూట నేను

తీరం తెలియని ఒక
ఒంటరినని?

27 September 2015

నివేదన

అవాంతరాలూ  అడ్డంకులూ ఏమీ లేకుండా  అహ్మద్ ఆ రోజు త్వరగా ఇంటికి చేరుకున్నాడు.

అతను కనపడగానే, ఆ రోజు -  దారుల్లో  వీధుల్లో  ఎవరూ  మైకుల వాల్యుమ్ పెంచలేదు. అతను  వీధి మలుపు తిరగగానే  చేతులకీ, నెత్తులకీ కాషాయపు రంగు నెత్తురు గుడ్డలతో అతనిని చూసి ఎవరూ వంకరగా నవ్వలేదు.  నడుస్తూ నడుస్తూ తల ఎత్తితేఆ రోజు ఎవరూ గార పట్టిన గుట్కా పళ్ళతో, మందు వాసనతో చీత్కారంగా కాండ్రించి  ఊస్తూమూడు గుండీలు విప్పిన  అంగీని వెనక్కి తోసుకుంటూ కనుబొమ్మలను కవ్వింపుగా ఎగుర వేయలేదు. ప్రతి సందూ కబ్జా అయ్యి ఒక రామ మందిర నిర్మాణమయ్యీ, అతను వాళ్ళని దాటుకుని ఒదిగొదిగి వెడుతున్నప్పుడల్లా ఎప్పటిలా లీలగా 'ఇస్కీ బెహెన్కి చోత్', మాధర్చోత్  అనే పదాలు అతని వెన్నుని తాకలేదు. ఒక మస్జీద్ అతని హృదయంలో కూలగొట్టబడలేదు. దాటుకుంటూ వచ్చిన ప్రతి వీధిలోనూ  అతన్ని చూసీ చూడగానే ఎవరూ జై శ్రీరాం అని నినదించలేదు. ఉన్మాద నృత్యాలతో  గణగణగణమనే గంటలతో, నుదిటిన త్రిశూలాల వంటి బొట్లతో ఎవరూ అతన్ని భయభ్రాంతుడని  చేయలేదు. అతని ఒళ్లంతా ఆ రోజు కుంకుమతో అస్తమయం కాలేదు. 

సరే. నిమజ్జనం ముగిసింది. ఏదో సద్దుమణిగింది. అతని నగరం కొంత తెరపి పడింది. ఇక

ఆవాంతరాలూ అడ్డంకులూ ఏమీ లేకుండా ఆ రోజు అహ్మద్ త్వరగా ఇంటికి చేరుకునిభార్య ఇచ్చిన మంచినీళ్ళు త్రాగి, తెచ్చిన అరటి పళ్ల సంచిని ఆరేళ్ళ పిల్లల చేతికిస్తుండగా గోడకి చతికిల బడిన అతని ముసలి తల్లి అంటుంది కదా -

"వచ్చావా నాయనాత్వరగా స్నానం చేసి భోజనం చేయి. ఇక ఈ పూటైనా పిల్లలు నిశ్చింతగా, కంటి నిండుగా నిదురోతారు"

20 September 2015

రాత్రంతా

రాత్రంతా
ఏడుస్తూ ఉంది తను
ఇక, విలవిలలాడుతూ మూల్గుతూ, వర్షపు రాత్రి గాలి నా చుట్టూతా –

రాత్రంతా
ఊగిసలాడుతూ గోడలపై నీడలు. తడచిన లతలు.
ఎక్కడో వాన వెలిసిన నీళ్ళు బొట్టుబొట్టుగా రాలుతూ చేసే హృదయ విదారక శబ్ధం.
బాల్కనీలో రాలిన ఆకులకుపైగా, సగం ఒరిగిన గూటిలోంచి వెలికి వచ్చిన
లేత పక్షి రెక్క ఒకటి, తడచి ముద్దయ్యి –

(ఎవరు చెప్పగలరు మరి
అది బ్రతికి ఉందో, లేదో?)

రాత్రంతా
ఏడుస్తూ ఉంది తను
ఇక, విలవిలలాడుతూ తన కనుల అంచుల నుంచి ఒలికిన చుక్కలు
విరిగీ ఆవిరయ్యీ, తన చేతులు రెండూ, రెండు అలసిన కాడలై నాలోకి ఒరిగిపోతే
అంతటా ఒక నిశ్శబ్ధం. అంతటా ఒక నిస్సహాయత. అంతటా
ఒక హృదయ కంపన. దీపం పగిలిన వాసన. అంతటా
పదునైన చీకటి చెమ్మ ~

రాత్రంతా
ఏడుస్తూ ఉంది తను
ఇక రాత్రంతా - నాలోనూ, మూసుకున్న తన కళ్ళలోనూ, తనకు పైగా
విసురుగా తిరిగే పంకా కిందుగా, ఏ క్షణాన తెగుతుందో తెలియని సీతాకోక ఒకటి
బయట పడే దారి తెలియక విలవిలలాడుతోఅక్కడక్కడే 
ఎగురుతో కొట్టుకులాడుతోఒక్కత్తే తపిస్తో ~

18 September 2015

creche

వెనుదిరిగినప్పుడు నువ్వు
వెంటాడతాయి కళ్ళు రెండు నిన్ను, crecheలో వొదిలి వెళ్ళిన తల్లిని
దీనంగా వెంబడించే
పిల్లల హృదయాల్లా -

అప్పటి నొప్పికీ, ఆ మూగ భాషకీ
లిపి లేదు. కళ్ళు ఒలికి, శరీరమే నీరై నేలపాలై నీ పాదాల వెంట
దొర్లిపోయే ఒక నిస్సహాయత తప్ప
చాచిన రెండు చేతుల
ప్రార్ధన తప్ప -

అవును. ప్రార్ధన.

తలలు వంచిన
చెట్ల కిందా, తడిచిన పచ్చికపైనా, ఆగీ ఆగీ అంతలోనే ఎగిరిపోయే
పురుగులపైనా, సాలీళ్ళ గూళ్ళపైనా
వొణికిపోయే పల్చటి నీడల
పిల్లల
ప్రార్ధన.

ఎవరన్నారు ఇది ప్రేమని?
ఎవరన్నారు ఇది ఒక జీవితమని? ఎవరన్నారు ఇది ఒక సజీవ నగరమనీ?
ఇది నిన్ను తాకి, నీ వేలి చుట్టూ ఇష్టంగా అల్లుకుపోయే
చిన్ని చిన్ని చేతివేళ్ళ
నులివెచ్చని కల అనీ
నవ్వు అనీ
నువ్వు అనీ
నేను అనీ?

వెనుదిరిగినప్పుడు నువ్వు
వెంటాడతాయి కళ్ళు రెండు నిన్ను: కర్కశంగా తల్లినెవరో ఈడ్చుక పోతే
చూచుకం దూరమై ఆకలికి తాళలేక
గుక్కపట్టిన ఒక శిశువు
చీకట్లో చెట్ల కింద
ఒంటరిగా
ఏడ్చినట్టు -

ఇక నువ్వే ఆక్కడ
దూరమైన పిల్లల స్మృతి స్పర్శని బాహువులలోకి లాక్కుని, పమిటె చెంగుతో
కళ్ళు అద్దుకునే తల్లి పక్కనా, వ్యాఘ్ర దంతాల
ఈ రాత్రి నగరం పక్కనా, బావురుమంటో
గుండెలు బాదుకుని
ఒక్కడివే 
ఏడుస్తో -

04 September 2015

ఈ రాత్రి

రాత్రి.

నీ హృదయాన్ని చీల్చుకుని నెత్తురోడుతూ వెలికి వచ్చి
అర్దించే పిలుపుకి
ప్రతిధ్వని లేదు -

రాత్రి.

వెన్నలంత చీకటి. కాటుకంత నొప్పీ, చెమ్మగిల్లిన గాలీ.
ఇక ఆకాశంలోకి చాచిన
నీ అరచేయి అలాగే

దిగంతాలలోకి
ఒంటరితనపు బరువుతో జారిపోతే, నీ శిరస్సు  ఒక
ఖండిత పూవై మిగిలిపోతే

రాత్రి

క్షమించు.
పూలపరిమళాలతో ఎగిరే సీతాకోకచిలుకల గురించి
ఇప్పుడు వ్రాయలేను
కలగననూ లేను - ఈ

రాత్రికి
జీవితం ఒక ఒక హంతకుడి హృదయం. ఒక లీక్డ్ MMS -
ఫ్లైఓవర్లే తల్లి బాహువులైన నగరం
కాల్బుర్గి ఆఖరి శ్వాసలో

ఆగిపోయిన ఒక పదం! 

01 September 2015

అనుకోకుండా

అనుకోకుండా 
నువ్వు
ఇక్కడ  

రాత్రిలో ఒక నిప్పు కణికెను రాజేసి వదిలినప్పుడు 
తడబడి ఒక దీపం ఎక్కడో
ఒక పూవై రాలి  
ఒలికిపోతుంది ~ 

అనుకోకుండా 
అప్పుడు 

ఒక చిన్న గాలి  
గూళ్ళలో సద్దుమణిగిన చీకటి - సన్నటి ఇష్టం. 
ఇక ఎవరో ఎక్కడో 
నీలా నవ్వీ నవ్వీ
కుదురుకుని
వెళ్ళిపోతే  

ఇక్కడ  
 నేత్ర సరస్సులో చెదిరిన నీటి వలయాలు 
ఎప్పటికో తిరిగి - తమలో తాము 
సంస్థాపితమై నిద్రిస్తాయి. ఆనక
నిన్నే అవి మరి 
కలగంటాయి   
కలవరిస్తాయి ~ 

అనుకోకుండా 
నువ్వు

చీకట్లో - రాత్రి నుంచి పగటికి దారి అడిగిననాడు 
ఇంటికి చేరవలసిన, ఇల్లు లేని 
ఒక బాటసారి  

దారి మరచిపోతాడు. ఆ మరపులో   

నిన్నూ 
ఒక దారినీ దీపాన్నీ - ఒక రాత్రినీ పగటినీ - అంతిమంగా 
అనుకోకుండా    
తనని తానూ  
కనుగొంటాడు ~