వెనుదిరిగినప్పుడు నువ్వు
వెంటాడతాయి కళ్ళు రెండు నిన్ను, crecheలో వొదిలి వెళ్ళిన తల్లిని
దీనంగా వెంబడించే
పిల్లల హృదయాల్లా -అప్పటి నొప్పికీ, ఆ మూగ భాషకీ
లిపి లేదు. కళ్ళు ఒలికి, శరీరమే నీరై నేలపాలై నీ పాదాల వెంట
దొర్లిపోయే ఒక నిస్సహాయత తప్ప
చాచిన రెండు చేతుల
ప్రార్ధన తప్ప -అవును. ప్రార్ధన.
తలలు వంచిన
చెట్ల కిందా, తడిచిన పచ్చికపైనా, ఆగీ ఆగీ అంతలోనే ఎగిరిపోయే
పురుగులపైనా, సాలీళ్ళ గూళ్ళపైనా
వొణికిపోయే పల్చటి నీడల
పిల్లలప్రార్ధన.
ఎవరన్నారు ఇది ప్రేమని?
ఎవరన్నారు ఇది ఒక జీవితమని? ఎవరన్నారు ఇది ఒక సజీవ నగరమనీ?
ఇది నిన్ను తాకి, నీ వేలి చుట్టూ ఇష్టంగా అల్లుకుపోయే
చిన్ని చిన్ని చేతివేళ్ళ
నులివెచ్చని కల అనీ
నవ్వు అనీ
నువ్వు అనీ
నేను అనీ?
వెనుదిరిగినప్పుడు నువ్వు
వెంటాడతాయి కళ్ళు రెండు నిన్ను: కర్కశంగా తల్లినెవరో ఈడ్చుక పోతే
చూచుకం దూరమై ఆకలికి తాళలేక
గుక్కపట్టిన ఒక శిశువు
చీకట్లో చెట్ల కింద
ఒంటరిగా
ఏడ్చినట్టు -
ఇక నువ్వే ఆక్కడ
దూరమైన పిల్లల స్మృతి స్పర్శని బాహువులలోకి లాక్కుని, పమిటె చెంగుతో
కళ్ళు అద్దుకునే తల్లి పక్కనా, వ్యాఘ్ర దంతాల
ఈ రాత్రి నగరం పక్కనా, బావురుమంటో
గుండెలు బాదుకుని
ఒక్కడివే
ఏడుస్తో -
No comments:
Post a Comment