18 May 2014

abrupt,చీకటి

చుట్టూ చీకటి: తన అరచేతుల్లోని చెమ్మ వలే. తన కళ్ళలోని తడి వలే. మరి కొంత తన కనురెప్పల వలే-

"మరి నువ్వు ఎప్పటికి మారతావు?" అని తను అడిగినప్పుడు, నీ హృదయంలో మ్రోగే ఒక ప్రతిధ్వని వలే. నీ శరీరంలో పేరుకొనే ఒక నిశ్శబ్ధం వలే-

అవే గోడలు. నీడలు. కుర్చీలు. మంచాలు. పిల్లలు అడ్డుకునే బొమ్మలూ, పెన్సిళ్ళూ. కాగితాలూ, వాటన్నిటిలోనూ దాగి ఉన్న రంగుల సవ్వడులు.  కలవరింతలు. మేము వేసుకునే దుస్తులూ. టవళ్ళూ. దుప్పట్లూ. వండుకునే గిన్నెలూ. కన్నీళ్ళని కుక్కుకుని వెలిగే పొయ్యిలూ. దిగులుగా ఒక మూలగా మసిగుడ్డలు. ఒలికిన నీటి రంగుల పాద ముద్రికలలో చేరే కాంతి కదలికలు. ఒంటరి బాల్కనీల ఇనుప జాలీలలోంచి చొచ్చుకు వచ్చి నేలపై పారాడే ధూళీ, నీడా గాలీనూ- 

అవే గదులు. నువ్వో నేనో తిరిగే గదులు. మనం పడుకునే గదులు. మనం రమించుకునే గదులు. మనం ప్రేమించుకునే మనం అరచుకునే గదులు. భీతిల్లిన పిల్లల ముఖాలయ్యిన గదులు. వెక్కిళ్ళయి, అర్థరాత్రుళ్ళలో నిదురలోకి జారుకునే గదులు. పుస్తకాలు. రక్తస్రావం అయ్యే గదులు. అవే గదులు. ఏ మూలనో కూడా దాక్కోలేని, "మరి ఎప్పటికి మారతావు నువ్వు?" అని నువ్వు అడిగినప్పుడు, నా నుంచి నేనే నాకు నేనే పరాయిగా మారి నక్కి నక్కి అపరాధ భావనతో చిట్లిపోయే, బైపోలార్ గదులు- 

చుట్టూ చీకటి: చుట్టూ కటిక చీకటి. నా నయనాలలోని పొడితనం వలే, కొంత నా హృదయం వలే మరికొంత, చదువుతున్న నీ సమయం వలే - 

ఇక ఎలా గడపటం ఈ దినం:? చుట్టూ చీకటితో, నెమ్మదిగా కుంచించుకుపోయే పూవు వంటి  తన శరీరంతో, నా మనస్సుతో, నీతో నాతో

ఒక

ఎవరినీ ఏమీ అనలేవు
లోపల ఏదో
పగిలి, విరిగిపోయినప్పుడు

చీకటి దారి మధ్యలో
చేయి జారి
లాంతరు చిట్లిపోయినప్పుడు

నిన్ను అంటిపెట్టుకుని వేలాడే
అరచేతులేవో
నిను వీడి
వెళ్లిపోయినప్పుడు

గూళ్ళను వొదిలి
పక్షులు ఎగిరిపోయినప్పుడు
కరకు దంతాల మధ్య
ఒక పిల్లి కూన
విలవిలలాడుతున్నప్పుడు

ఓ భుజం లేక
నీ శిరస్సు, అనంతమైన అగాధంలోకి
జారిపోతూన్నప్పుడు

కిటికీలూ
తలుపులూ, గోడలూ లతలూ
ఊగిసలాడే
ఆఖరి శ్వాసగా మారుతూనప్పుడు

అన్నీ
ఒక ప్రతిధ్వనిగా మారి ప్రతిబింబిస్తూన్నప్పుడు
అన్నీ
నీడలుగా మారి
కనుమరుగౌతోన్నప్పుడూ

అన్నీ
ఒక అశ్రులోయలోకి
నిస్సహాయంగా
దుముకి, దూరమౌతూన్నప్పుడు
ప్రాణం పోతూన్నప్పుడు

లోపల ఏదో పగిలి
చిట్లి చిట్లి
రెక్కలు తెగి రాలిపోతూన్నప్పుడు

ఎవరినీ
ఏమీ అనలేవు
ఎవ్వరినీ ఏమీ అనలేవు
ఎవరినీ
ఏమీ అనలేవు... 

11 May 2014

ఎవరు?


ఎవరు? ఈ ఆదిమ ఆకాశాంతాన

నిన్ను తన అరచేతుల మధ్య పొదివి పుచ్చుకున్నది ఎవరు?

రాత్రి చుట్టుకుంటున్నప్పుడు, పగలు మిగిలిన కాంతి కిరణాలు సర్పాలై నీ నుదుటిని కాటేస్తున్నప్పుడు, నువ్వు కంపిస్తూ తల దించుకుని నేలని పరికిస్తూ, నేలపై వాలే మసక నీడల మట్టి జాడలని చెరిపేస్తూ, నువ్వు నీ గదికి పారిపోయి వచ్చినప్పుడు నిన్ను తన అరచేతుల మధ్య పొదివి పుచ్చుకున్నది ఎవరు?

వానల్లో, కరడు కట్టిన చీకట్లలో, కడుపుని నీళ్ళతో కుట్టుకుంటున్న రోజులలో నిన్ను తనలో దాచుకుని పదిలంగా కాపాడుకున్నది ఎవరు?

నీ పెదాలు పగిలి, నీ కుత్తుక తెగి నీ స్వరం పిగిలి ఇక సాగలేక నీ పాదాలు విరిగి నువ్వు దారి పొడుగూతా నెత్తురు ముద్రికలై పారాడుతున్నప్పుడు, నిన్ను ఎత్తుకుని ఆ నిర్ధయ కాలాన్ని దాటించి నిన్ను ఆదుకున్నది ఎవరు?

నూనుగు చంద్రకాంతిలో, కనులు చిట్లే మధ్య రాత్రిలో, అగ్నిలో, ఇతరుల మంచు మృత్యువులో మధువులో ఊయలలూగుతున్న నిన్ను దగ్గరగా లాక్కుని హత్తుకుని నిద్ర పుచ్చినది ఎవరు?

నీ హింసకీ నీ విధ్వంసానికీ నీ నిర్లక్ష్యానికీ నీ దిగులు పారిజాతాలకీ తన లోకాన్ని వొదిలివేసినది ఎవరు? నీ సంతోషానికీ నీ మృగమార్మిక వ్యసనానికీ నీ అవధులు లేని ఉన్మాదానికీ  నీ అంతంకాని అంతంలేని నైరాశ్యానికీ తన కాలాన్ని బలి చేసినది ఎవరు?

నిన్ను వొదలలేకా, నీతో ఉండాలేకా నిన్ను ద్వేషించాలేకా నిన్ను మరచిపోయేంతగా ప్రేమించాలేకా రెండు శిక్షల మధ్య మరణించినది ఎవరు? మరణిస్తూ, నిన్ను శిలువ వేసి వెడలిపోయినది ఎవరు?

10 May 2014

ఆ రాత్రి

అర్థరాత్రిలో మెరిసే సీతాకోకచిలుకలు. లేదా తెల్లటి పావురాళ్ళు . ఈ అర్థరాత్రి ఒకింత దిగులుతో మనం పంచుకుని, మన పాత్రలలోకి వంపుకునే ఒక పదం 'మనం' . సూర్యకాంతితో, పారదర్శకమైన చంద్రకాంతితో తళతళలాడే పాత్రలు: 'మనం'. ఎవరు వస్తారు ఈ కాంతితోటి? ఎవరు వస్తారు ఏ ఏ సంజ్ఞల తోటి, ఏ ఏ గాయాల తోటి? శతాబ్దాల తపనతో, లిప్త క్షణాల ప్రేమతో వ్రాయబడిన ఈ గాయాలను మాన్పేందుకు ఎవరు వస్తారు? అక్కడ, ఇక్కడే ఉన్నాం మనం


తుడిపి వేయబడలేని పదాలమై, అస్థిర నాలికలమై ఎప్పటికీ చేరుకోలేని, ఎన్నటికీ  నివశించలేని ఇ ళ్ళమై అక్కడే ఉన్నాం మనం. ఈ లోగా, ఎవరో రాతి హృదయంతో పూల నవ్వుతో వచ్చి, రాత్రిలో రాత్రితో వెడలిపోతారు. ఈ లోగా, మనం, మనం ఉంటాం ఇక్కడ అర్థరాత్రి చుట్టూ గిరికీలు కొట్టి కిచకిచ లాడే పిట్టలతో, మనల్ని ఆకస్మికంగా నింపే ఆకస్మిక మృత్యు రంగులతో, ఎరుకతో కూడిన మృత్యువుతో, మైమరపించే ఆమె పరిమళంతో, మనం ఈ లోగా ఇక్కడ మిణుగురులమై మెరిసి పోతాం మనం.ఇక మృత్యువు అంటావా?

నేను ఈ పదాలను రాసే తెల్ల కాగితం మృత్యువు. జీవితంతో అర్థాల్ని పూరించే ఈ ఖాళీ వాక్యాలు మృ త్యువు. జీవితాలకి జీవితం, కలలకి కల, అందరూ వొదిలివేసిన రాత్రి సీతాకోకచిలుకలల 
అలలలో ఏం చేసాం మనం, ఇలా ఇక్కడ కూర్చుని 

మనం ఎప్పటికీ పొందలేని, మనం ఎప్పటికీ కాలేని రాత్రినీ, పిల్లలనీ స్త్రీలనీ దగ్ధం చేసేందుకు, ఏం చేసాం మనం ఇలా ఇక్కడ కూర్చుని? పిల్లలు. మనం ఎప్పటికీ రాయలేని పదాలు వాళ్ళు. స్త్రీలు:మనం ఎప్పటికీ అనువాదం చేయలేని పదాల మధ్య ఉండే స్థలాలూ, అర్థాలూ వాళ్ళు. అందుకని మనం, త్వరలో తొలి సూర్యకాంతిగా మారిపోయే 

అర్థరాత్రిలో మెరిసే సీతాకోకచిలుకలు లేదా తెల్లటి పావురాళ్ళు గురించి మాట్లాడతాం. తొలి సూర్యకాంతి. విరిగిన వాస్తవాల నగ్నమైన అద్దాల సూర్యకాంతి. స్వఅస్తిత్వాల భస్మంతో, అందరి కన్నీళ్ళతో కరిగిపోయే స్నేహితుడి దుఃఖపు కాంతి. ఒక అపరిచిత తిరుగుబోతు మూలుగుల అక్షరాల కాంతి. 

ఏం చేద్దాం మనం, ఇళ్ళకు కొన్ని సంవత్సరాలుగా వెళ్ళని, నీ పక్కగా దిగులుగా ఏమీలేని సంతోషంతో కూర్చున్న అర్థరాత్రి పావురాళ్ళనీ సీతాకోకచిలుకలనీ?

08 May 2014

అతని హృదయం

ఒక నల్లటి హృదయం గురించి మీకు చెబుతాను- 

నల్లటి నలుపు నలుపై తెల్లగా మారిన హృదయం: మృత శిశువువంటి, వేకువ మంచువంటి తల్లి కన్నీటి వంటి తెల్లటి హృదయం:

అయితే, అతనెప్పుడూ ఇలా లేడు:

వర్షం కురిసే రోజులలో గడ్డిలోనూ, గెంతే పిల్లలతోనూ వర్షం కురియని రోజులలో దాహార్తులతోనూ వెన్నెల విరిసిన రాత్రుళ్ళలో రక్తం చిందించే స్త్రీలతోనూ గర్భస్రావాల అశ్రువులతోనూ చీకటి ముసిరిన రాత్రుళ్ళలో వెన్నెలను రాజేస్తున్న స్నేహితులతోనూ శత్రువులతోనూ

ఎవరూ లేని కాలాలలో తనతో తానుగా ఇన్ని పదాలను పుచ్చుకుని బావిలోని చందమామను తోడుతూ అతడు ఆనందంగానే ఉన్నాడు 

అతడి హృదయం పచ్చగా, బలమైన గాలికి జలజలా పొర్లే రావి ఆకుల సవ్వడిలా, సాయం సమయాన మిమ్మల్ని చిరునవ్వుతో తాకిన మీకు నచ్చిన వదనంలా అతడి హృదయం మిలమిలలాడుతూనే ఉండింది 

అతడు ఉన్నాడు ఆ కాలాలలో: అతడు అతడికీ అందరికీ బ్రతికే ఉన్నాడు ఆ కాలాలలో: అన్నీ మిశ్రమమై కలిసే వసంత సమయాలలో అతడు ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు. అతడు ఖచ్చితంగా ప్రేమించే ఉన్నాడు. 

కలలు నలుపు కాక మునుపు, తన వదనం అస్థిత్వపు దీపపు కాంతిలో దాగిన నల్లటి చారిక కాక మునుపు, పదాలకు మునుపూ,పదాలకు తరువాతా కదులాడే నల్లటి విశ్వవలయంలోకి జారక మునుపు, శరీరం స్వయంప్రకాశితమై, జ్వలనమై దిగంతాలలోంచి జారే ఒక నలుపు జలపాతం కాక మునుపు 

అతడు ఖచ్చితంగా హృదయం కలిగే ఉన్నాడు. అతడు ఖచ్చితంగా కదులుతూనే ఉన్నాడు. అటువంటి అతడు 

ఒక నల్లటి హృదయమై, నల్లనవ్వడంలో హృదయం లేనివాడై నలుపు నలుపై, మృతనయన మంచు తెమ్మరుల తెలుపై, శిధిలాలపై గడ్డ కట్టిన నీటి చుక్కై, సమాధుల మధ్య సమాధులలో తిరిగే నల్లటి రాత్రై, మృతులతో, మృత్యువాహక క్షణాలతో 

గూడు లేక, దేశం లేక, దేహం లేక పదం లేక, ఇతర పద్మం లేక, నలుపు రెక్కలతో తెల్లటి కళ్ళతో ఎక్కడికి ఎగిరిపోయాడో మీకు ఏమైనా తెలుసా?

ఎక్కడ ఉన్నావు?


ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావో అడగను. ఏం చేస్తున్నావో అడగను. సూర్యుడు 

ఒక ఇనుప దిమ్మస వలె దినాన్ని మోదుతుండే ఈ కాలంలో కడుపు నిండా మంచి నీళ్ళన్నా తాగావా కాస్తంత అన్నం నిన్నటిధైనా కడుపున దాచుకున్నావా అని అడగను. కళ్ళు చికిలించుకుని రావాల్సిన స్నేహితుడికోసం ఎదురుచూస్తున్నావా, ఎవరో వొదిలివేసిన ఈ లోకంలో ఎవరి కోసమూ నువ్వు నటించలేక ఎవరూ నీ కోసం రాక ఒక్కడివే ఎప్పటిలా నీ ఒంటరి ఏకాకి గదిలో శిధిలమయ్యావా అని అడగను. చాపమీద పరుండి

దేహద్రిమ్మరులూ దేశద్రిమ్మరులూ, దేశద్రోహులూ దేహద్రోహులూ, ప్రేమికులు పాపులూ శాపగ్రస్తులూ నిరాకారులూ నిర్దయప్రాణులూ ఉన్మాదులూ స్త్రీలూపురుషులూ ఎవరికీ చెందని రాణులూ వారి రాత్రుళ్ళూ, సంధ్యా సమయాలలో ఇళ్ళు వొదిలి వెళ్ళే రాజులూ, రహదారులూ, రహదారుల రహస్య చీకట్లలో తిరిగే మరణించే భిక్షగాళ్ళూ కవులూ కిరాయి హంతకులూ,హతులూ హతుల స్వప్నాలూ నీ నయనాలూ - అన్నింటినీ వాటన్నిటినీ అలా చిరిగిపోయిన చాపమై పరుండి 

చూస్తున్నావా అని అడగను. ఏమీ అడగను. బ్రతికి ఉన్నావా, క్షణక్షణం నీ నీడల దారులలోకి పారిపోతున్నావా, ఒక అనామక స్త్రీలోకి ఏడుస్తో కుంగిపోతున్నావా, పిగిలిపోతున్నావా, నలుమూలలకి చెదిరిపోతున్నావా అని అడగను. ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క ప్రశ్న: 

నేను బ్రతికీలేను, నేను చనిపోయీ లేను. మరి 

ఇంతకూ, నువ్వు, నువ్వు ఎక్కడ ఉన్నావు?

04 May 2014

కథలు చెప్పే మనిషి.

అతను కథలు చెప్పే మనిషి.

మార్చి నెల పొల మారిన  కాలంలో ఆ సాయంత్రం ఆ రాత్రంతా వర్షం పడింది. తను సాయంత్రం కాక మునుపు వచ్చింది మబ్బులు కమ్ముకున్న ఆకాశాన్ని చుట్టుకుని నిమ్మకాయ రంగుల వాసనలతో: నేను కాదనలేక పోయాను. ఒక నిలువెత్తు పసిడి గులాబీని నా వెంట ఆ దినం ఈ నగర లోహ రహదారులని చూపించేందుకు తీసుకు వెళ్లాను. తెల్లటి పావురాళ్ళు ముడుచుకున్న కళ్ళతో తను నా కళ్ళలోంచి నా అరచేతుల లోంచి లోకంలోకి ఎగిరింది. తారు వాసనలనీ, ఎత్తైన నలు చదరపు శరీరాల్నీ, నాచు పట్టిన గుర్రపు డెక్కల సరస్సులనీ రహదారుల పక్కగా బూజు పట్టిన పసి కళ్ళనీ నిరంతరంగా సాగే జనుల ఆధుర్ధానీ స్థాణువై చూసి, నా హృదయంలో గూడు కట్టుకునేందుకు మసకబారిన మనస్సుతో వాటిని తిరిగి కథలలా తీసుకు వచ్చింది.

అతను అన్నాడు: ఇది జీవితం. ఊరుకో. హత్యలకు గురికాకుండా కలలతో మిగిలిన మనిషి ఎవరూ లేరిక్కడ.

యిక ఆ సాయంత్రం ఆ రాత్రంతా వర్షం పడింది. పూర్తిగా తడిచి వణుకుతూ, తన లోకి తాను ముడుచుకుపోతూ తను బేలగా ఆర్ధించింది- నన్ను ఉండనివ్వు ఈ పూట నీ గదిలో, ఇప్పుడు వెళ్ళలేను బయటకి, జిగటగా చీకటి అల్లుకున్న రాత్రిలోకి. ఈ పూట ఉంటాను నీ గదిలో నాకు నేనే తోడుగా, పడుకుంటాను నీతో నీకూ నాకూ తోడుగా. ఉండనివ్వు నన్ను - యిక ఈ పూటకి, ఇప్పటికే అలసిపోయాను రక్తపిపాసులు తిరిగే ఆ రహదారుల్లో, అని అంది తను ముకుళించిన అరచేతులతో, తొలగిన పమిటలోంచి గతపు గాయాలతో నెత్తురు ఓడుతున్న వక్షోజాలతో.

అతను నవ్వాడు. అతను తడబడ్డాడు. అతను అన్నాడు: ఊరుకో. యిదే జీవితం. యిదే పవిత్ర పాపుల కాలం. అని అతను తనని భక్షించి ఆనక రాత్రి వ్యాఘ్రం తిరుగాడే నీటి చినుకుల శిధిలాలలోకీ కాల బిలాలలోకి తనని తోసివేసాడు. తను వెళ్లిపోయింది అక్కడ నుంచి, ఎదపై నిదురించిన ఇద్దరు పసి పిల్లలని లేపుకుని ఆ చిక్కటి రాత్రిలో, ఆ కాటుక వానలో వొణికే కడుపుతో తడిచీ పూర్తిగా ఎండిపోయిన హృదయంతో-

తిరిగి రాని తను మీకు ఎక్కడైనా కనిపించిందా అని రాస్తోన్నాడు అతను ఇదంతా పుక్కిలి పట్టిన దిగులుతో ఏడుపుతో తనని నిరంతరం వేటాడే ఆ మృణ్మయ పాత్రల కనులతో ఆ రాత్రంతా ఆ సాయంత్రమంతా కురిసిన, ఎవరూ లేని, ఇళ్ళు లేని ఆ వర్షం గురించి! ఏమీ లేదు

అతను కథలు చెప్పే మనిషి.