29 February 2016

బీన్ బ్యాగ్

అతనికి దూరంగా, గోడకు ఆన్చబడిన ఒక బీన్ బ్యాగ్:
పాతది, అతుకులతో - ఎవరూ
విశ్రమించలేదు దానిలో. ఖాళీ -

సరిగ్గా అతని హృదయంలానే. దూరంగా, ఎవరూ తాకక:
ఖాళీగా, పాతగా, అతుకులతో
అట్లా గోడలో కలగలసిపోయి -  

26 February 2016

నిస్సహాయాత

ఎంతో ఖాళీగా లోపల: రాలిపోయాయి పూవులు.
ఊగుతూ నీడలు. సాయంత్రం -

నువ్వు రావని తెలుసు. అయినా ఒక పిచ్చి నమ్మకం:
ఎవరో వచ్చినట్టూ, నుదిటిపై అరచేయి
ఉంచినట్టూ, దగ్గరగా హత్తుకున్నట్టూ ఏవేవో మాటలు
మెత్తగా చెప్పి, పక్కన అట్లా ఉండినట్టూ -
***
ఎంతో దిగాలుగా లోపల: దారి తప్పిన పిల్లాడికి మల్లే -
నీవు లేక

ఎంత నిస్సహాయుడను నేను
ఈ పూట!

25 February 2016

నివేదిక

అలజడి. చినుకు రాలి, వలయాలు వలయాలుగా
సరస్సు -

తొలిరోజు, ఏడ్చే పిల్లవాడిని బడిలో దింపి వచ్చిన
తల్లి మనస్సు. గుబులు. పల్చటి
చీకటి. సన్నటి గాలి. కరకు రాత్రి -

చిన్నగా ఊగుతూ లతలు. వాటి నీడలు. ఎక్కడో
లీలగా, నువ్వు కలవరించే గొంతు
పొగమంచులా నీలోకి వ్యాపించి -
***
కంగారు పడకు. పర్వాలేదు.
నేను బాగానే ఉన్నాను: చినుకు రాలి వణికిపొతోన్న
ఒక సరస్సు స్మృతితో -  

24 February 2016

అలజడి

అలసిపోయి,  గోడకు ఆనుకుని, అట్లా ఒక గ్లాసు చల్లటి
మంచినీళ్ళకై -
***
కుంగిపోతూ సాయంత్రం. పల్చటి గాలి. తేమ. ఇళ్ళకు
తిరిగొచ్చిన పక్షులు. స్థంబించిన హృదయంలో
రెక్కల అలజడి. తపన. కొంత నొప్పి. బెంగ.  తిరిగి వెళ్ళే
గూడు కానరాక, అక్కడక్కడే, ఈకలు రాలేదాకా

కొట్టుకులాడి, విలవిలలాడి, రాలి, పిగిలి, అలసిపోయి -
***
నువ్వు రాలేదు. సరిగ్గా అప్పుడే చీకటి వెలిగింది:
ఒక దీపంలా!

23 February 2016

ఇట్లా

కాంతివంతమైన ఉదయం:
రాత్రి కురిసిన మంచుకీ, గాలికీ చిన్నగా ఊగే ఒక
తెల్లని గులాబి -
***
చల్లని దారులు. లేత ఆకులు:
వానజల్లులో రెక్కలు విదుల్చుకుని ఎగిరిపోయే
పక్షులు -

లోపల మట్టి, చిన్నగా నాని:
హృదయం ఒక విత్తనమై చిట్లి మొలకెత్తినట్టు ఒక
సువాసన -

అవును.
నువ్వన్నది నిజమే. అనుకోని వానజల్లు
ఇది -
***
తిరిగి రా నువ్వు. చూడు, ఎంత
అందంగా ఉందో ఇక్కడ. కిటికీ అద్దం వెనుక
ఒద్దికగా

నీ స్మృతి సమీరానికి
చిన్నగా ఊగే ఒక ఎర్రని గులాబీ పువ్వు, ఐదు
ఆకులు -  

22 February 2016

క్రితం రాత్రి

అలలు అలలుగా చీకటి
నీపై నుంచి తీరం లేని దూరాలకు తరలిపోయే
ఆమ్ల రాత్రి -

తెరచిన కిటికీలు. చిన్నగా
గాలి. తలలు వంచిన చెట్లలోంచి రాలే చెమ్మ:
కనుపాప ఒక నెలవంక -

లోపల పసరు వాసన
దీపం ఆర్పినంక, శ్వేత సర్పాలై అల్లుకునే పొగ:
నీ హృదయం,

జ్వలించే ఒక మంచుముక్క - ఇక
***
తెరువు నీ అరచేతులను -
బయట హోరున వీస్తూ, నీ శిరస్సును పూవులా
ఎగరేసుకుపోయే

రాత్రి వర్షపు వేసవి గాలి! 

07 February 2016

లిప్తకాలం

కూర్చుని ఉంది అమ్మ ఒక్కత్తే, ఆవరణలో
మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని, మోకాలిపై తన
చుబుకం ఆన్చుకుని -
***
గోధూళి వేళ. ఇంటి ముందు మసక చీకటి.
మల్లెతీగలో మొగ్గలు చిన్నగా చలించి, అంతలోనే అట్లా
కుదురుగా సర్దుకుని -

(అవి తన కళ్ళా? నాకు తెలియదు)

ఎక్కడో పక్షి కూత. నీటిబొట్టు నేలను తాకిన
సవ్వడి. చిన్నగా పిల్లల మాటలు. తనని రుద్దుకుంటూ
గుర్ మని చిన్నగా అరుస్తో

తిరిగే పిల్లి తిరిగి సర్దుకుని, తన చెంతే
పడుకుని: (అది నేనా? నాకు తెలియదు) లోపలెక్కడో
మరి ఒక దీపం చిన్నగా

మిణుకుమంటూ, రెపరెపలాడుతూ:
(అది తన హృదయమా? నాకు తెలియదు). ఇక తన
శిరస్సుపై వాలిన ఆకాశం

బూడిద రంగు మబ్బుల్ని లెతెరుపు
ఛాయతో క్షణకాలం అల్లుకుని, అంతలోనే రాత్రిలోకి అట్లా
తటాలున కరిగిపోయి

"అమ్మా, ఇక నేను వెళ్తా" అంటే
***
కూర్చుంది ముసలి అమ్మ ఒంటరిగా
మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని, మోకాలిపై తన
చుబుకం ఆన్చుకుని

కదలని మల్లెతీగ వైపు అట్లా చూస్తో -

04 February 2016

ఇద్దరు

ఎక్కడైనా ఒక నది ఒడ్డుకు వెళ్లి, ఈ రాత్రంతా అట్లా
కూర్చోవాలని ఉంది: తను అంది -
***
అలసట నేల రాలిన ఒక పూవు. కట్టుకున్న గూట్లో లేని 
రెక్కల సవ్వడి ఒక స్మృతై, బుజ్జాయికి 
కట్టిన చిరుగంటల్లా చిన్నగా మ్రోగుతూ -

తెరచాప వలే గాలి. కోసుకుపోయే చెమ్మలాంటి మెత్తటి 
చీకటి. మిణుకుమనే నక్షత్రాలు. కళ్ళాపి 
జల్లిన మట్టి వాసన. గుమ్మం పక్కగా ఓ 

దీపం రెపరెపలాడుతూ - తీరం తెలియక, గాలి వాలుకి 
హృదయపు నావ ఎటు కొట్టుకుపోయిందో 
తనకి తెలియదు. అతనికీ తెలియదు - 
***
ఇక రాత్రంతా, ఆ ఇద్దరిలోనూ 
ఎక్కడో సుదూరంగా చీకట్లో రాళ్ళను ఒరుసుకుంటూ
ఆగకుండా సాగే నీళ్ళ  సవ్వడి - 

03 February 2016

why so serious

అనగనగా ఒక రోజు
"How is my poetry?" అని అడిగింది
తను -

'సోమవారం ఉదయాన్నే పరిగెత్తుకుని చర్చికి వెళ్లి
ఏడు కొబ్బరికాయలు కొట్టి

నమాజ్కీ గురుద్వారాకీ పోయి సిన్సన్నీ సోలోగా
కన్ఫెస్ చేసుకుని వచ్చాను" అని
నిస్సహాయంగా చెప్పెను అతను -

"All you male buggers are like
this: Except cuntversations, you don't know
conversations -"

అని, she left
with a miff -

ఇక చక్కా ఇంటికి వచ్చి - చేతికీ కవిత చిక్కగా -
ఎంచక్కా ఒకే ఒక్క పెగ్గు పోసి
నిదుర పోయెను డ్రీమీగాతను -

And, after that? అని అంటారా -
Nothing.

And t hey happily lived ever after
with the poems
that she wrote

And
with the poems that
he never heard
or read
anymore -

Amen. 

సిటీ లైట్స్

ఒక పక్కగా నిలబడ్డాడు అతను. 
ఎదురుగా, రొదతో అంతం లేకుండా సాగిపోతున్న రహదారులు: మసక 
సాయంత్రం -

***

"విల్ యు బీ హోం ఎర్లీ టు నైట్? విల్ మేక్ ది కిడ్స్ గో టు బెడ్ ఎర్లీ" 
అడిగింది తను -

***

గుండెలోంచి రహదారులు పరచి 
త్రవ్వుకుపోతున్నట్టు: టీవీలలోంచి, హార్డింగ్లలోంచీ, షాపింగ్ మాల్స్లోంచీ 
ఎవరో త్రవ్వీ, త్రవ్వీ

సారాన్ని అంతా పెకలించుకుని
చక్కగా పాకేజ్ చేసి అమ్ముకోడానికి తీసుకు పోతున్నట్టు: "చూథియా 
హై తు. ఇవన్నీ

ఆలోచిస్తే బ్రతకడం కష్టం. 
ఏమీ మార్చలేవు. ఎ పెగ్?". మాట్లాడడు అతను. కదిలే శిలావిగ్రహాల్లా
వచ్చి పోయే

మనుషులని అట్లా చూస్తూ -

(హావ్ బార్స్ బికం ది లాస్ట్ రిసార్ట్?)

***

"ఎక్కడున్నావ్? యాం వెయిటింగ్. కం సూన్. నీకు ఇష్టమైన చీర 
కట్టుకున్నా. తెలుసా?": పొరలు 
పొరలుగా తెల్లటి 
నవ్వు -

***

శరీరం ఒక MNCగా మారి, ఒక 
అడ్వర్టైస్మెంట్లా మారి, ప్రతి ఒక్కరూ ఒక నడిచే,మాట్లాడే విపణి వీధిగా 
మారి: గంధా హై పర్ దందా 
హై యే - 

***

నీకొక ప్రేమలేఖ రాస్తాను. 
కాల్గేట్తో, ఫెయిర్ అండ్ లవ్లీతో, ఆలో వేరా లోషన్తో, తేలికైన ఓట్స్తో నువ్వు
తిరిగే లైంరోడ్లలలో -

తల్లీ, చెల్లీ, సఖీ, దినాం జీవితం
షాపింగ్ అయినాది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, హెల్తకార్ట్, స్నాప్డీల్ బిగ్ బాస్కేట్లో 
నిండా మునిగినాది -

మరి ఈ రోజు సోమవారం
నీ ఆఫర్ ఏమిటి?

***

"ఆర్ యు అంగ్రీ విత్ మీ? గోల్డ్ లోన్ 
తీసేసి నా బంగారం నాకు ఇమ్మన్నాననీ? ఐ నో. ఐ డోంట్ నో హౌ యు 
ఎరెంజేడ్ ది మనీ.

ఏదో ఆవేశంలో గొడవపడ్డాను -
డోంట్ యు నో యు ఆర్ మోర్ ప్రేషెస్ దేన్ గోల్డ్ టు మీ. కం హోం సూన్.
లోవ్ యు -"

***

శరీరమంతా ఒక దాహం అయ్యి
చాచిన అరచేయై, ఎదురుచూపై, ఎప్పటికీ లేని ఇంటి మెట్ల ముందు, తోటి
మనుషుల ముందు -

లోపలంతా ఖాళీ అయ్యి, దేహమొక
దిక్కూ, ఆత్మొక దిక్కూ కొట్టుకుపోయి, జననం ఒక శాపమయ్యీ, ఒక
మహావొంటరితనమయ్యీ -

***

నేను ఈ రాత్రి చాలా ఒంటరిగా ఉన్నాను.
నీ మాటలు కూడా చాలా మిస్ అవుతున్నా. మీరు నాతో మాట్లాడాలీ అని
అనుకుంటే
దయచేసి కాల్ చేయండి 5567866. 

***

"హే బ్రో. ఎక్కడ. ఎలెక్షన్ టైం-
ఎక్కడా మందు లేదు. ఏమైనా పాసిబుల్?" "అన్నా, ఒకసారి కాల్ చేయనా?"
"ఇంటికి వస్తున్నారా?"

"హై. దిస్ ఇస్ NVS. కేన్ యు
అడ్జస్ట్ ఎ థౌసండ్ద్? విల్ గివ్ యు బాక్ సూన్." "మళ్ళా తాగావా నువ్వు?"
ఛీ. నువ్వు మారవు -

"విప్లవం వర్ధిల్లాలి." "డు యు నో 
రోహిత్. దట్ పూర్ రోహిత్. లేగదూడలాంటి, ఎర్రిమాలోకపు రోహిత్?"
"ఇంటికే వస్తున్నా -"

"trs గెలుస్తుంది." ఏం గెలుస్తుంది రా?
అంతా...". "బ్రో, డు యు హావ్ వన్ మోర్ పెగ్? అనీతింగ్ విల్ డూ."
"పోరా తుక్కునా కొడకా"

***

రొద. గాలి: విసురు గాలి. చీకటి 
గాలి. వ్రూమ్మని రొదతో, అంతటినీ ఊడ్చుకుపోతున్నట్టు. ఎక్కడెక్కడివో
కదులుతున్నట్టు -

కాగితాలు కొట్టుకువచ్చి ఆకులు 
రాలి, దారి పొడుగూతా రాత్రి చీకట్లలో దాగిన కళ్ళల్లో ధూళి, మరచిన
కన్నీళ్ళుని నింపుతూ -

(విల్ ఇట్ రెయిన్ టునైట్?)

***

ఇంకా ఒక పక్కగా నిలబడి ఉన్నాడు
అతను. ఎదురుగా, రొదతో అంతం లేకుండా గమ్యం లేకుండా సాగిపోతున్న 
హృదయం లాంటి

రహదారులతో 
రాత్రితో 
చీకటితో -

01 February 2016

కొన్నిసార్లు

ఇలా ఎలా బ్రతకగలవు నువ్వు? ఎంతకాలం: ఇలా?
అడిగింది తను -
***
లోపల లేని కాంతి పూలపై: గాలి. 
నీడల వెంట చలించే వెన్నల. ఎక్కడో మట్టి వాసన -
వాన వెలసిన నిశ్శబ్ధం. ఆకులపై తడి. 
ఒక సన్నటి వణుకు ఎవరో రెండు అరచేతులు జోడించి

శరీరాన్ని ఒక భిక్షపాత్రగా మార్చుకుని, రాత్రి వీధిలోంచి 
చిన్నగా దేవులాడుకునే సందర్భం -
మానవ జీవితమంత ఒంటరితనం. ఖాళీతనం: ఎవ్వరూ
ఇవ్వలేని దానికై, కాలేని దానికై తండ్లాట -
***
ఎలా బ్రతకగలవు నువ్వు ఇలా? ఇంకా ఎంతకాలమని?
అసహనంతో తను -
***
మరెక్కడో, సున్నితంగా ఉండటానికి వెనుదీయని ఒక 
పూలకాడ, ఒక లత, ఒక లేచివురు
రాత్రంతా పసి శ్వాసలా అట్లా అట్లా

అతనిలో, తనలో ఊరికే ఊగతూ -