07 February 2016

లిప్తకాలం

కూర్చుని ఉంది అమ్మ ఒక్కత్తే, ఆవరణలో
మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని, మోకాలిపై తన
చుబుకం ఆన్చుకుని -
***
గోధూళి వేళ. ఇంటి ముందు మసక చీకటి.
మల్లెతీగలో మొగ్గలు చిన్నగా చలించి, అంతలోనే అట్లా
కుదురుగా సర్దుకుని -

(అవి తన కళ్ళా? నాకు తెలియదు)

ఎక్కడో పక్షి కూత. నీటిబొట్టు నేలను తాకిన
సవ్వడి. చిన్నగా పిల్లల మాటలు. తనని రుద్దుకుంటూ
గుర్ మని చిన్నగా అరుస్తో

తిరిగే పిల్లి తిరిగి సర్దుకుని, తన చెంతే
పడుకుని: (అది నేనా? నాకు తెలియదు) లోపలెక్కడో
మరి ఒక దీపం చిన్నగా

మిణుకుమంటూ, రెపరెపలాడుతూ:
(అది తన హృదయమా? నాకు తెలియదు). ఇక తన
శిరస్సుపై వాలిన ఆకాశం

బూడిద రంగు మబ్బుల్ని లెతెరుపు
ఛాయతో క్షణకాలం అల్లుకుని, అంతలోనే రాత్రిలోకి అట్లా
తటాలున కరిగిపోయి

"అమ్మా, ఇక నేను వెళ్తా" అంటే
***
కూర్చుంది ముసలి అమ్మ ఒంటరిగా
మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని, మోకాలిపై తన
చుబుకం ఆన్చుకుని

కదలని మల్లెతీగ వైపు అట్లా చూస్తో -

No comments:

Post a Comment