04 February 2016

ఇద్దరు

ఎక్కడైనా ఒక నది ఒడ్డుకు వెళ్లి, ఈ రాత్రంతా అట్లా
కూర్చోవాలని ఉంది: తను అంది -
***
అలసట నేల రాలిన ఒక పూవు. కట్టుకున్న గూట్లో లేని 
రెక్కల సవ్వడి ఒక స్మృతై, బుజ్జాయికి 
కట్టిన చిరుగంటల్లా చిన్నగా మ్రోగుతూ -

తెరచాప వలే గాలి. కోసుకుపోయే చెమ్మలాంటి మెత్తటి 
చీకటి. మిణుకుమనే నక్షత్రాలు. కళ్ళాపి 
జల్లిన మట్టి వాసన. గుమ్మం పక్కగా ఓ 

దీపం రెపరెపలాడుతూ - తీరం తెలియక, గాలి వాలుకి 
హృదయపు నావ ఎటు కొట్టుకుపోయిందో 
తనకి తెలియదు. అతనికీ తెలియదు - 
***
ఇక రాత్రంతా, ఆ ఇద్దరిలోనూ 
ఎక్కడో సుదూరంగా చీకట్లో రాళ్ళను ఒరుసుకుంటూ
ఆగకుండా సాగే నీళ్ళ  సవ్వడి - 

No comments:

Post a Comment